Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

* వీర కొలువులకు పిలుపు

వీరత్వంతో కూడిన జీవితం.. విశేష గౌరవం.. ఈ రెండింటినీ అందుకునే అవకాశం వచ్చింది. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. డిగ్రీ పాసై ఉంటే చాలు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుల్లో చేరి దేశ రక్షణలో భాగస్వాములు కావచ్చు. రాతపరీక్షలో ప్రతిభను ప్రదర్శిస్తే ధీరోదాత్తమైన కెరియర్‌లో స్థిరపడవచ్చు.

త్రివిధ దళాల్లో ఉద్యోగం అంటే యువతలో ఒక రకమైన ఆరాధన భావం ఉంటుంది. సమాజంలోనూ సమున్నత గౌరవం అందుతుంది. సీడీఎస్‌ఈలో మెరిట్‌ సాధిస్తే కెరియర్‌లో సంపూర్ణ సంతృప్తిని పొందే హోదా దక్కుతుంది. ఈ పరీక్ష ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. 2020 సంవత్సరానికి 418 ఖాళీలతో తొలి నోటిఫికేషన్‌ వెలువడింది. ఇందులో ప్రతిభావంతులైన యువకులను ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి దేశ రక్షణ విధులు అప్పగిస్తారు. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ (షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌) ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరు అర్హులు?
ఇండియన్‌ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ), ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ (ఓటీఏ) పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉండాలి. నేవల్‌ అకాడమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ డిగ్రీ అవసరం. ఎయిర్‌ ఫోర్స్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. కానీ 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌ చదివి ఉండాలి. డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, నేవల్‌ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1997; జనవరి 1, 2002 మధ్య లేదా ఆ తేదీల్లో జన్మించిన వారు అర్హులు. ఎయిర్‌ ఫోర్సు ఉద్యోగాలకు జనవరి 2, 1997; జనవరి 1, 2001 మధ్య లేదా ఆ తేదీల్లో పుట్టిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1996; జనవరి 1, 2002 మధ్య లేదా ఆ తేదీల్లో జన్మించి ఉండాలి. అవివాహితులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులందరూ నిర్ణీత శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.

ఎంపిక ఎలా?
రెండు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో రాతపరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి ఇంటలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాల రాతపరీక్షలో ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టులు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు ఆరు గంటల వ్యవధితో పరీక్ష ఉంటుంది. వంద మార్కులకు ఉండే ప్రతి సబ్జెక్టును రెండు గంటల వ్యవధిలో పూర్తిచేయాలి. ఆఫీసర్స్‌ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కోటి వంద చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి సబ్జెక్టుకు రెండు గంటల సమయం కేటాయించారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంది.

మూడు పేపర్లు
ఇంగ్లిష్‌ పరీక్షలో సాధారణ పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. పదోతరగతి స్థాయిలో ప్రిపేర్‌ అయితే సరిపోతుంది. ఒకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్, స్పాటింగ్‌ ఎర్రర్స్, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌/కరెక్షన్స్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నిత్యజీవిత అనుభవాలు, పరిశీలనల్లో ఎదురయ్యే శాస్త్ర, సాంకేతిక అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు ఉంటాయి. వర్తమాన వ్యవహారాలకు ప్రాధాన్యం ఉంటుంది. భారతదేశ చరిత్ర, భౌగోళిక విశేషాలపైనా ప్రశ్నలు వస్తాయి. ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. ఇందులో అరిథ్‌మెటిక్, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: నవంబరు 19, 2019 సాయంత్రం 6 గంటల వరకు.
పరీక్ష ఫీజు: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.)
పరీక్ష తేది: ఫిబ్రవరి 2, 2020.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
వెబ్‌సైట్‌: www.upsc.gov.in

ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌
మొదటి దశలో జరిగే రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశలో ఇంటలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో మళ్లీ రెండు స్టేజ్‌లు ఉంటాయి. మొదటి స్టేజ్‌లో ఆఫీసర్‌ ఇంటలిజెన్స్‌ రేటింగ్‌ (ఓఐఆర్‌) పరీక్షలు జరిపి రెండో స్జేజ్‌కి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రెండో స్టేజ్‌లో ఇంటర్వ్యూ, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌ టాస్క్‌స్, సైకాలజీ టెస్ట్, కాన్ఫరెన్స్‌ ఉంటాయి. వీటి వివరాలు వెబ్‌సైట్‌ www.joinindianarmy.nic.in లో ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాల ఇంటర్వ్యూకు 300 మార్కులు, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ ఇంటర్వ్యూకి 200 మార్కులు కేటాయించారు. మొత్తం నాలుగు రోజులపాటు ఈ పరీక్షలు జరుగుతాయి. అనంతరం మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించి తుది ఎంపికలు పూర్తిచేస్తారు.

Posted on 30.10.2019