Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

* త్రివిధ దళాల్లో ప్రవేశానికి అద్భుత వేదిక ఎన్‌డీఏ

రక్షణ రంగంపై ఆసక్తి ఉండి అందులో రాణించాలనుకునే ఔత్సాహిక యువకులకు ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్ష ఆహ్వానం పలుకుతోంది. ఇంటర్‌ విద్యార్హత ఉన్నవారు యూపీఎస్‌సీ నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావచ్చు. ఇందులో నెగ్గితే శిక్షణ పొందుతూ బీఏ, బీఎస్సీ, బీటెక్‌ కోర్సులు చదువుకోవచ్చు. అనంతరం సంబంధిత విభాగంలో ప్రత్యేక తర్ఫీదు పొంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో ఆఫీసర్‌ హోదాతో విధుల్లోకి చేరిపోవచ్చు. దీనికి సంబంధించి తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో విశేషాలు తెలుసుకుందాం!

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)కు ఎంపికవ్వటమంటే.. మేటి భవిష్యత్తుకు బాట వేసుకోవడమే! ఎన్డీఏ ద్వారా ఉచితంగా ప్రామాణిక విద్యను పొందవచ్చు. నేరుగా ఉన్నతస్థాయి ఉద్యోగం అందుకోవచ్చు. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. మూలవేతనం రూ.56,100తోపాటు మిలటరీ సర్వీస్‌ పే రూ.15,500 ప్రతి నెలా చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం. ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఎయిర్‌ ఫోర్స్‌కు ఎంపికైనవారు అదనంగా ఫ్లయింగ్‌ అలవెన్సు రూ.25,000 ప్రతినెలా పొందుతారు. రెండేళ్ల సర్వీసుతోనే పదోన్నతి లభిస్తుంది.13 ఏళ్లు పనిచేస్తే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో వరుసగా లెఫ్టినెంట్‌ కల్నల్‌, కమాండర్‌, వింగ్‌ కమాండర్‌ స్థాయికి చేరుకుంటారు.

రెండు పేపర్లు...
ఎన్‌డీఏ పరీక్ష ప్రశ్నపత్రం మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లుంటాయి. ‌
* పేపర్‌-1లో మ్యాథ్స్‌ నుంచి 300 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.
* పేపర్‌-2లో 600 మార్కులకు జనరల్‌ ఎబిలిటీ విభాగం నుంచి ప్రశ్నలుంటాయి. వ్యవధి రెండున్నర గంటలు.ఇందులో ఇంగ్లిష్‌కు 200, జనరల్‌ నాలెడ్జికి 400 మార్కులు కేటాయించారు. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో ఫిజిక్స్‌ నుంచి 100, కెమిస్ట్రీ నుంచి 60, జనరల్‌ సైన్స్‌ నుంచి 40, చరిత్ర, స్వాతంత్యోద్య్రమాలు తదితరాల నుంచి 80, భూగోళశాస్త్రం నుంచి 80, వర్తమానాంశాల నుంచి 40 మార్కులకు ప్రశ్నలడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. రుణాత్మక మార్కులున్నాయి. వర్తమాన వ్యవహారాలు తప్ప మిగతా ప్రశ్నలు ఆయా సబ్జెక్టుల్లో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచే వస్తాయి.
రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తారు. ఈ విభాగానికి 900 మార్కులు కేటాయించారు. ఇందులో భాగంగా తొలిరోజు ఆఫీసర్స్‌ ఇంటిలిజెన్స్‌ ర్యాటింగ్‌ (ఓఐఆర్‌), పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్క్రిప్షన్‌ టెస్టు (పీపీ అండ్‌ డీటీ) నిర్వహిస్తారు. ఇందులో అర్హులకు మిగిలిన 4 రోజులు ఇంటర్వ్యూ, గ్రూప్‌ టెస్టింగ్‌, ఆఫీసర్‌ టాస్కులు, సైకాలజీ టెస్టులు ఉంటాయి.
రాత పరీక్ష, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. వైద్య పరీక్షలు, అభ్యర్థి ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిభ ఆధారంగా సంబంధిత విభాగాలకు ఎంపిక చేస్తారు.

సన్నద్ధత ఇలా...
* సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. వీటితోపాటు 8,9,10 తరగతుల పుస్తకాలనూ చదవడం మంచిది.
* ప్రాథమికాంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. వీటిపై పట్టు ఉంటే ప్రశ్న ఏ విధంగా అడిగినప్పటికీ జవాబు గుర్తించడం సాధ్యమవుతుంది.
* పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. ఆయా సబ్జెక్టులు, అందులోని చాప్టర్లకు ఉన్న ప్రాధాన్యం, ప్రశ్నలతీరుపై అవగాహనకు పాత ప్రశ్నపత్రాలు ఉపకరిస్తాయి.
* పరీక్షకు పది రోజుల ముందు రోజుకొకటి చొప్పున మాక్‌ పరీక్షలు రాయాలి. దీనిద్వారా సమయపాలన అలవడుతుంది. ఏయే విభాగాల్లో వెనుకబడ్డారో తెలుసుకోవడం ద్వారా తుది సన్నద్ధతకు మెరుగులద్దుకోవడానికి వీలవుతుంది.
* రుణాత్మక మార్కులున్నందున తెలియని ప్రశ్నలను వదిలేయడమే మంచిది.

సబ్జెక్టుల వారీగా.....
* మ్యాథ్స్‌ ప్రశ్నలకు ఎక్కువ సమయం అవసరం. పరీక్షకు ముందు బాగా సాధన చేస్తే తక్కువ వ్యవధిలో వీటిని ముగించడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించే విధానం తెలిసినప్పటికీ అందుకు ఎక్కువ సమయం అనివార్యం కావచ్చు. ఆఖరులో సమయం ఉంటేనే వీటి సంగతి చూడాలి.గœణితంలోని ప్రాథమికాంశాలు, సూత్రాలు, అనువర్తనంపై దృష్టి సారించాలి. ఈ పేపర్లో మ్యాట్రిసెస్‌ అండ్‌ డిటెర్మినేంట్స్‌ నుంచి 30, ట్రిగనోమెట్రీ 30, కాల్‌క్యులస్‌ 20, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ 20, ప్రాబబిలిటీ 10, కాంప్లెక్స్‌ నంబర్స్‌ 10 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి ఆయా చాప్టర్ల నుంచి వస్తోన్న ప్రశ్నల ప్రకారం సన్నద్ధతలో ప్రాధాన్యం ఇచ్చుకోవాలి.
* ఫిజిక్స్‌లో ప్రశ్నలు సాధించడానికి భావనలపై మంచి పట్టుండాలి. ఆయా సూత్రాల అనువర్తనంపై అవగాహన తప్పనిసరి.
* రసాయనశాస్త్రంలో మూలకాల వర్గీకరణ, సమ్మేళనాలు, మిశ్రమాలపై దృష్టి సారించాలి.
* ఆంగ్ల వ్యాకరణం, పదసంపద కొన్ని రోజుల్లోనే నేర్చుకోవడం సాధ్యం కాదు. ప్రతి రోజూ వాటికోసం కొంత సమయం వెచ్చించాలి. కొత్త పదాలను తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంగ్లిష్‌ విభాగంలో సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌, సెలక్టింగ్‌ వర్డ్స్‌లో పదేసి చొప్పున ప్రశ్నలు రావచ్చు. అలాగే వాక్యంలోని పదాలు ఒక క్రమంలో అమర్చమనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. అర్థాలు, వ్యతిరేకపదాలు, తప్పుని గుర్తించడం, కాంప్రహెన్షన్‌ పైనా దృష్టి సారించాలి.
* కరెంట్‌ అఫైర్స్‌ విభాగంలో పరీక్ష తేదీ నుంచి 9 నెలల వెనుక వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కీలక పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు.దినపత్రికలు చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను నోట్సుగా రాసుకోవాలి. టాటా మెక్‌ గ్రాహిల్స్‌, అరిహంత్‌ పుస్తకాలను పరిశీలించవచ్చు. లూసెంట్స్‌ జనరల్‌ నాలెడ్జ్‌ జీకే ప్రశ్నలకు ఉపయోగపడుతుంది.
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలకు పాఠ్యపుస్తకాలు సరిపోతాయి. ఎంసెట్‌, జేఈఈ పాత ప్రశ్నపత్రాలు ఉపయోగపడతాయి. చరిత్ర, భూగోళశాస్త్రం, జనరల్‌ సైన్స్‌ విభాగాల్లోని ప్రశ్నలకు ఆయా సబ్జెక్టులో ఎన్‌సీఈఆర్‌టీ 8,9,10 తరగతులతోపాటు ప్లస్‌ 1, 2 పుస్తకాలు ఎంతో ప్రయోజనం.
ఇంటర్వ్యూలో ఒక అధికారికి ఉండాల్సిన లక్షణాలు అభ్యర్థిలో ఏ మేరకు ఉన్నాయో గమనిస్తారు. ఆత్మ విశ్వాసంతో జవాబులు చెప్పాలి. భారత రక్షణరంగంపై ఆవగాహన పెంచుకోవాలి.

ముఖ్య సమాచారం...
మొత్తం ఖాళీలు: 392. వీటిలో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో 342 (ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్‌ ఫోర్స్‌ 92), నేవల్‌ అకాడమీ (10+2 క్యాడెట్‌ స్కీం)లో 50 ఉన్నాయి.
అర్హత: ఆర్మీ వింగ్‌ పోస్టులకు ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ ఫోర్స్‌, నేవల్‌ వింగ్స్‌ (ఎన్డీఏ), 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ)కు దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే..
వయసు: జులై 2, 2000 - జులై 1, 2003 మధ్య జన్మించిన పురుష అభ్యర్థులు అర్హులు.
శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 157 సెం.మీ., ఎయిర్‌ ఫోర్సుకు 162.5 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగిన బరువు అవసరం.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 4 (సాయంత్రం 6 వరకు)
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 21
ఏపీ, తెలంగాణల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి
వెబ్‌సైట్‌: www.upsc.gov.in

శిక్షణ విధానం

తుది అర్హత సాధించినవారు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, పుణెలో చదువు, శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రా డూన్లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీకి; నేవల్‌ క్యాడెట్లను ఎజిమాలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీకి; ఎయిర్‌ ఫోర్స్‌ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీకి సంబంధిత ట్రేడ్‌ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టయిపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆర్మీలో లెఫ్టినెంట్‌, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌, ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ (పైలట్‌) హోదాతో కెరీర్‌ ప్రారంభిస్తారు. ఈ మూడూ సమాన స్థాయి ఉద్యోగాలు.

Posted on 10-01-2019