ఆసక్తి ఉంటే అసాధ్యమనేదే లేదు
'ఈనాడు' ఫోన్ ఇన్ కార్యక్రమంలో యండమూరి వీరేంద్రనాథ్‌

జ్ఞాపకశక్తి అందరికీ సమానమే

అనవసర విషయాలను వదిలేస్తే అవసరమైనవి గుర్తుంటాయి

మనసుకు కళ్లెం వేస్తే విజయం మీదే

బ్రహ్మసమయంలో చదివితే ప్రయోజనం

టీవీలు, సినిమాలు, కబుర్లు తగ్గించి చదువుపై దృష్టి పెట్టండి

చదివింది పరీక్ష హాల్లోకి వెళ్లిన తర్వాత గుర్తుండటం లేదు... అన్నీ మరిచిపోతున్నాం... పరీక్షలకు ముందు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నాం... విద్యార్థుల ఆవేదన ఇది. మా బాబు చదువుపై శ్రద్ధ పెట్టడం లేదు... దారిలో పెట్టడం ఎలా?... మా అమ్మాయి నిత్యం పుస్తకం ముందేసుకొని చదువుతూనే ఉంటుంది.. మార్కులు మాత్రం రావడం లేదు... తల్లిదండ్రుల ఆందోళన ఇది. చదివింది గుర్తుపెట్టుకోవడం, జ్ఞాపకశక్తిని పెంచుకోవడం, ఏకాగ్రతను సాధించడం, పరీక్షలంటే ఆందోళన చెందడటం తదితర ఎన్నో అంశాలపై ఉన్న సందేహాలను తీర్చింది 'ఈనాడు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌తో జనవరి 27న 'ఈనాడు ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు పాఠకుల ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.అయిదో తరగతి విద్యార్థుల నుంచి సీఏ, పోటీ పరీక్షలకు సిద్ధమైన వారు సైతం తమ సందేహాలను తీర్చుకున్నారు.

ఏం చదివినా గుర్తు ఉండటం లేదు. జ్ఞాపక శక్తికి చిట్కాలు ఏమైనా ఉంటే చెప్పండి?

- సుప్రియ, బీటెక్ విద్యార్థిని, సికింద్రాబాద్

జ్ఞాపక శక్తికి చిట్కాలు, ఆయుర్వేద మందులంటూ ఉండవు. మెదుడులో జ్ఞాపక శక్తికి సంబంధించి 5 లక్షల న్యూరాన్స్ ఉంటాయి. వాటిలో అనవసర విషయాలతో నింపితే... అవసరమైన విషయాలు గుర్తుండవు. అందుకే సినిమాలు, స్నేహితులతో గ్రాసిప్స్, చాటింగ్‌లు, కబుర్లు పూర్తిగా తగ్గించుకోవాలి. సులువుగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదవిదంతా గుర్తు ఉంటుంది.

నా చేతి రాత ఏమీ బాగుండదు. పరీక్షల్లో సరిగా రాయ లేకపోతున్నా. చేతి రాతను మెరుగు పర్చుకోవాలంటే ఏం చేయాలి?

- వేదమిత్ర, రాంనగర్

కాలియోగ్రాఫర్ సాయంతో సాధన చేయాలి. హైదరాబాద్‌లోనూ ఇటువంటి శిక్షణ ఇస్తున్నారు. కేవలం మూడు రోజుల పాటు శిక్షణతో చేతి రాతను పూర్తిగా మార్చుకోవచ్చు. శిక్షణ సంస్థల కోసం నెట్‌లో చూడొచ్చు.

కొందరు బయటకు చదవ మంటారు... మరికొందరు మనస్సులో చదువుకో మంటారు... ఈ రెండింటిలో ఏది మంచింది? పుస్తకంలో ఉన్నట్లు పరీక్షలో రాయాలా?

- తేజ, అంబర్‌పేట

ఎంత ఆసక్తిగా చదవామన్నది ముఖ్యం. మనస్సులో చదవితే అలసి పోకుండా ఉంటారు. పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు కాకుండా సొంత విశ్లేషణతో రాయొచ్చు. తప్పులు రాయకూడదు. రెండురెళ్లు ఆరే... సొంతంగా దానిని 8 గా రాస్తే తప్పే.

నేను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాను. ఎస్ఐ ఉద్యోగానికి పరీక్ష రాశాను. పరీక్ష పత్రం కఠినంగా ఉండటంతో ఎంపిక కాలేదు. మళ్లీ పరీక్ష రాయమంటారా? ఉన్న ఉద్యోగం చేసుకోమంటారా?

- ప్రకాశ్, కానిస్టేబుల్, భీమవరం

మళ్లీ ఒకసారి ప్రయత్నించండి. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రోజూకు 2 నుంచి 3 గంటల కేటాయించండి. లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టమైన తప్పదు. తప్పక విజయం సాధిస్తారు.

పరీక్ష పేపర్లును అర్థం కాని విధంగా తయారు చేస్తున్నారు. ఎంత చదివినా ప్రయోజనం ఉండటం లేదు? ఏం చేయాలి?

- రాజేశ్వర్ గుప్తా, పీజీ విద్యార్థి, కాప్రా

పోలీస్ ఉద్యోగానికి పరుగు పందెం తప్పనిసరి. ఎందుకంటే రేపు ఉద్యోగంలో దొంగలను పట్టుకోవాలంటే తప్పదు కదా! ఆ విధంగానే చదివే చదువును తగినట్లు సిలబస్ తయారు చేస్తారు. పాఠాలను అర్థం చేసుకొని చదవాల్సిందే. సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి.

చదువుకోవాలని ఉన్నా... ఆసక్తి ఉండటం లేదు. మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి?

-నేహ, అంబర్‌పేట

చదువుపై ఆసక్తి ఉండాలంటే ముందు చుట్టూ వాతావరణం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవాలి. దీనినే కార్టెక్స్ ఎఫెక్ట్ అంటారు. చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉండేటట్లు చూడాలి. చదువుకునే రూంలో ఒక అగర్‌వత్తు వెలిగించాలి. ఆ సువాసల వల్ల మనస్సు చదువుపై లఘ్నం అవుతుంది. చదువుపై ఆసక్తి ఏర్పడితే మార్కులు వాటింతట అవే వస్తాయి.

ఎంసెట్ కోసం చదువుతున్నా. అయితే పరీక్షల సమయంలో మర్చిపోతాననే భయం పట్టుకుంది. ఏం చేయాలి?

-వంశీ, కూకట్‌పల్లి, దేశ్వి, మలక్‌పేట, కార్తీక్, గాంధీనగర్, జమీన్, టోలిచౌక్

ఆసక్తి ఉంటే అన్ని విషయాలు గుర్తుంటారు. అభిమాని హీరో సినిమాలో విషయాలు మర్చిపోతామా? లేదు కదా! మెదడులో అనవసర విషయాలు పెట్టుకోవద్దు. టీవీకి ఎంత దూరంగా ఉంటే... అంత మంచింది. సినిమాలు, స్నేహితులతో చిట్‌చాట్స్, గాసిప్స్ పూర్తిగా తగ్గించేయాలి. వీటినే 'డయేరియా ఆఫ్ టాకింగ్‌కు అంటారు. వాటికి దూరంగా ఉండాలి. రోజులో కొంత సమయం ఏమీ మాట్లాడుకుండా... నిశ్శబ్దంగా ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తీ పెరుగుతుంది.

చదువుతుంటే మనస్సు ఇతర విషయాలపై పరుగులు తీస్తుంది. నియంత్రించుకోలేక పోతున్నా.

-శ్రీకాంత్, మెహిదీపట్నం, ఓ డిగ్రీ విద్యార్థి, మియాపూర్

కోరిక, లక్ష్యం అనేవి రెండు రకాలు. కోరిక అనేది మనస్సుకు సంబంధించిది. బుద్ధిలక్ష్యానికి సంబంధించి ఎప్పూడూ బుద్ధిపై మనస్సుపై చేయి సాధించాలనే ప్రయత్నిస్తుంది. మనస్సును నియంత్రించుకోగలిగితే లక్ష్యం చేరుకోవడం సులువు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారంతా మనస్సుకు కళ్లెం వేసిన వారే. ఒక వ్యక్తిలో బుద్ధి, కోరిక వేర్వేరు దారుల్లో ప్రయాణం చేస్తే లక్ష్యాలను సాధించడం కష్టం. చాలామంది యువత లక్ష్యాలు గొప్పగా ఉంటాయి. అయితే మనస్సు చెప్పిందల్లా చేయడంతో చాలా మంది విజయం సాధించ లేకపోతున్నారు. చదువుకునే సమయంలో కోరికలు తగ్గించుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారు.

పరీక్ష హాళ్లలో టెన్షన్‌తో అన్ని విషయాలు మర్చిపోతున్నాను. ఏం చేయాలి?

- అనూష, సికింద్రాబాద్

ఇది సర్వసాధారణం. మెదడులో కొన్ని చర్యల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పరీక్ష హాళ్లలో కొన్ని చిట్కాలు పాటిస్తే... ఈ భయం పోతుంది. పరీక్షకు మందు ఓ రెండు, మూడు నిమిషాలు కళ్లు మూసుకుని గుండెల నిండా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా వదలాలి. పిడికిలి బిగించి వదులుతూ ఉండాలి. ఇలా పలు సార్లు చేయాలి. పరీక్ష రాస్తున్నంత సేపు యాలుక్కాయ నోట్లో నములుతూ ఉండాలి. వీటివల్ల ఒత్తిడి తగ్గి భయం పోతుంది.

బాగా చదివేందుకు... చదివింది గుర్తు పెట్టుకోవాలంటే ఏవైనా కొన్ని టిప్స్ చెబుతారా?

- జ్ఞానసాయి, ఆల్వాల్, సీతల్‌రాజు, కూకట్‌పల్లి, కె.మోహనచారి, గొల్కొండ

ఉదయం నాలుగు గంటలకే లేవాలి. స్నానం చేసి చదువుకు ఉపక్రమించాలి. ప్రభాత సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చదవింది కూడా బాగా అర్థం అవుతుంది. అంతార్జాలం(నెట్)లో లాగిన్ 100 టిప్స్‌ను చూడొచ్చు.

మా పాప అయిదో తరగతి చదువుతోంది. సరిగా చదవడం లేదు. ఏం చేయాలి?

- చందన, బీహెచ్ఈఎల్

అప్పుడే వారిపై ఒత్తిడి పెంచొద్దు. బాల్యాన్ని ఎంజాయ్ చేయనీయండి. ఆడుతూ పాడుతూ వారికి చదువు నేర్పాలి. మరో రెండేళ్ల వరకు ఎలాంటి ఒత్తిడి చేయవద్దు.

కొన్ని సబ్జెక్టులంటే బోరు... కానీ చదవ పోతే పరీక్షల్లో మార్కులు రావు. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి?

- రీతు, నారాయణగూడ

ఇది అందరి సమస్య. ఇందుకు నేనే ఉదారణ. నాకు హిందీ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. లెక్కలంటే మహా ఇష్టం. ఇలాంటి సమయంలో రెండు ఆసక్తిలేని సబ్జెక్టులను ఎంచుకుని వాటి మధ్య ఒక ఆసక్తికరమైన సబ్జెక్టు పెట్టి చదువుకోవాలి. ముందు ఆసక్తి లేని వాటిని చదవి... చివరిలో మీకు ఇష్టమైన సబ్జెక్టును చదవండి. చదివే అంశం ఉన్న సబ్జెక్టులు ముందు... రాసే అంశాలు ఉన్న సబ్జెక్టులను చివరిలో పెట్టుకోవాలి. తద్వారా ఎక్కువ సమయం చదువుకునేందుకు అవకాశం ఉంటుంది.

నేను పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. ఏ సమయంలో చదివితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది?

- మాధవి, ఉపాధ్యాయురాలు

తెల్లవారుజామున 4 గంటల సమయాన్ని బ్రహ్మ సమయం లేదా ప్రత్యూష సమయం అంటారు. ఆ సమయంలో చదివింది బాగా ఉంటుంది. ఆ సమయానికి నిద్ర లేవాలంటే రాత్రి 10 లేదా 10.30 గంటలకు నిద్రపోయేలా అలవాటు చేసుకోవాలి. చదివేటప్పుడు పెన్నూ పుస్తకం ఉండాలి. ముఖ్యమైన అంశాలను రాసుకోవాలి. దీనిని కీ నోటింగ్ అంటారు. పునశ్ఛరణ సమయంలో కొద్ది సమయంలో అన్నీ ఒకసారి గుర్తుచేసుకోవచ్చు. ఒక సబ్జెక్టు నుంచి మరో సబ్జెక్టుకు మారేటప్పుడు కనీసం 5 నిమిషాల వ్యవధి ఉండాలి.

పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఏం చేయాలి?

- స్వాతి, మలక్‌పేట

రెండు రకాల పిల్లలుంటారు. చదవుపై ఆసక్తి లేని వారు కొందరైతే(నాట్ ఇంటరెస్టు), చదువుపై కాకుండా ఇతర వాటిపై ఆసక్తి(అదర్ ఇంటరెస్టు)లు ఉండేవారు మరికొందరు. ఇతర ఆసక్తులంటే టీవీలు, సినిమాలు చూడటం. అందుకే వారు చదువుకునేటప్పుడు టీవీ కట్టేయాలి. మీరు ఒక గదిలో టీవీ చూస్తూ వారిని చదువుకోమంటే చదువుకోరు. పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నా ఏకాగ్రత అసలే ఉండదు. అందుకే మీరూ వారి దగ్గర కూర్చొని ఏదో ఒకటి చదువుకోవడం లేదా కుట్లు, అల్లికలు లాంటి పనులు చేసుకోవడంలో నిమగ్నం కావాలి.

మా పాప పరీక్షలంటే భయపడుతోంది. అందువల్ల చదివినా సరిగా రాయలేకపోతోంది? ఏమిటీ పరిష్కారం?

- సుమ, న్యూనల్లకుంట

పరీక్షల ముందు భయపడుతోందంటే ఫియర్ కాంప్లెక్స్ ఉందని తెలుస్తోంది. దానికి కారణం కార్టెజాల్ ప్రభావం. కార్టెజాల్ అనేది మెడడు నుంచి విడుదలవుతుంది. దానివల్ల భయం, నెగిటివ్ ధోరణి అలవడుతోంది. సైకాలజిస్టు దగ్గరకు తీసుకెళితే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు. దీనికి మూడు రోజుల కంటే ఎక్కువ పట్టదు.

మా చెల్లి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఎంబీబీఎస్ చదవాలన్నది లక్ష్యం. మొదటి ఏడాది ఇంటర్‌లో మార్కులు కొంచెం తగ్గాయి. సీటు వస్తుందా లేదా అని సందేహించి భయపడుతోంది? అధికమించే మార్గాలేంటి?

- స్పందన, సీఏ విద్యార్థి, దిల్‌సుఖ్‌నగర్

ఎంబీబీఎస్ చదవాలి ఉత్సాహమేనా? ఆసక్తి ఉందా అన్నది తేల్చుకోవాలి. సబ్జెక్టుకు సంబంధించి ప్రాథమిక విషయాలు తెలియకపోయినా భయం ఏర్పడుతుంది. గతాన్ని వదిలేసి రెండో సంవత్సరంలో మార్కులు ఎలా పెంచుకోవాలి ఆలోచించాలి. రసాయన శాస్త్రం బోర్ అంటే కుదరదు. అన్ని సబ్జెక్టులు బాగా చదివితేనే మంచి ర్యాంకు వస్తుంది. మీ చెల్లిని ఎడ్యుకేషన్ మోటివేటర్ లేదా సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లండి.

చదివిన సమాధానాలు పరీక్షల్లో గుర్తు ఉండటం లేదు. అందుకు గడిచిన పదేల్లలో వచ్చిన ప్రశ్నలు-సమాధానాలు చదువుతున్నా. నేను చేసేది తప్పా? ఒప్పా?

- రోహిత్‌రెడ్డి, రాజేంద్రనగర్

పదేళ్ల ప్రశ్నాపత్రాలను చదువుతున్నావంటే దాదాపు అంతా చదువుతున్నట్లే లెక్క. సబ్జెక్టును పెంచుకుంటే ప్రశ్నను ఏవిధంగా మార్చి ఇచ్చినా రాయగలం. అది కూడా చేయండి. టీవీ చూడటం తగ్గించండి.

ఎంత బాగా చదువుతున్నా పరీక్షల్లో గుర్తు ఉండటం లేదు. ఏకాగ్రత కుదరడం లేదు. ఏం చేయాలి?

- విక్రమ్, లాల్‌దర్వా

ఏకాగ్రత కుదరాలంటే మన చుట్టూ వాతావరణం కూడా ముఖ్యం. అందుకు స్నానం చేసి చదువు మొదలుపెట్టండి. టేబుల్ లైట్ పెట్టి చదువుకోండి. దానివల్ల దృష్టి పుస్తకంపైనే నిలుస్తుంది. లవంగమో, యాలకునో నోట్లో పెట్టుకుని చదువుకోండి. ఏదో ఒకటి తిందాం అని వంట గది వైపు వెళ్లాలనే ధ్యాస రాదు. చెవుల్లో దూది పెట్టుకోండి. ఇతర అంశాలతో ఏకాగ్రత కోల్పొకుండా ఉంటారు. గదిలో అగర్ఒత్తులు వెలిగించండి. గదిలో మంచి వాసన ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మురికి కూపం పక్కన చదువుకోమంటే చదవగలమా?... అందుకే చుట్టూ మంచి పరిమళం ఉండాలి. అది మెదడును ఉత్తేజపరుస్తుంది.

మా బాబు 8వ తరగతి వరకు బాగానే చదివాడు. ఇప్పుడు అసలు చదవడం లేదు. దారిలో పెట్టేది ఎలా?

- లలిత, కేపీహెచ్‌పీ కాలనీ

మనిషిలో రెండు ఇంటిలిజెన్స్ ఉంటాయి. ఒకటి ఫ్లూయిడ్ ఇంటిలిజెన్స్, రెండోది క్రిస్టలైజుడ్ ఇంటిలిజెన్స్. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ ఇంతకుముందే ఉంటుంది. అది 8వ తరగతి వరకే ఉంది. రిజర్వాయర్‌లో ఎప్పటికప్పుడు నీళ్లు నింపకపోతే ఎండిపోయినట్లే ఇది కూడా అంతే. రాష్ట్రంలో కాకినాడ, పెద్దాపురం, గుడివాడ తదితర ప్రాంతాల్లో మంచి వసతి గృహాలు ఉన్నాయి. ఉదయం 5 గంటలకు నిద్రలేపి చన్నీళ్లతో స్నానం చేయిస్తారు. క్రమశిక్షణ నేర్పిస్తారు. ఒక ఏడాది ఉంటే క్రమశిక్షణ అలవడటంతోపాటు తల్లిదండ్రుల విలువ కూడా తెలిసివస్తుంది.

మా అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు. పాఠాలను ఇంట్లో బాగా వివరిస్తాడు. మార్కులు రావడం లేదు? ఏం చేయాలి?

- నిర్మల, విద్యానగర్

మీరు ఉపాధ్యాయులతో మాట్లాడండి. మీ బాబు రాసిన సమాధాన పత్రాలు చూడండి. ఈ రెండు చేస్తే చాలా వరకు పరిష్కారం దొరుకుతుంది. అసలు పిల్లవాడి వద్ద సబ్జెక్టు ఉందా? లేదా? అనేది స్పష్టమవుతుంది.

పరీక్షలకు ముందు ఆందోళనకు గురై మర్చిపోతున్నా. ఏం చేయమంటారు?

- హిమశ్రీ, అంబర్‌పేట

టెన్షన్ కేవలం పరీక్షలకు ముందేనా? నిత్యం ఉంటుందా?... సబ్జెక్టు లేకపోయినా, సరిగా చదవకపోయినా ఆందోళనకు గురవుతారు. ప్రశాంతంగా ఉండండి. అలాంటప్పుడే సెరోటోనిన్ ఎక్కువగా విడుదలవుతుంది. అది న్యూరాన్లను చురుకుగా ఉంచుతుంది. అది తగ్గిపోతే మెడడు చురుకుదనాన్ని కోల్పోతుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. నోట్లో యాలుక్కాయి పెట్టుకొని నవులుతూ పరీక్ష రాయండి. రిలాక్స్‌ను ఇస్తుంది. ఆందోళన తగ్గుతుంది. క్రికెట్ క్రీడాకారులు అందుకే బబుల్‌గమ్ నములుతూ ఉంటారు.

కష్టపడి చదువుతున్నా.. నాకు గణితంలో మార్కులు తక్కువగా వస్తున్నాయి. అందోళనగా ఉంది. ఏం చేయాలి?

- సింధూజ, ఉప్పల్

పదో తరగతి వరకే లెక్కల సమస్య ఉంటుంది. అప్పటి వరకు కష్టపడి చదవాల్సిందే. ఆ తర్వాత మాత్రం గణితం బదులుగా జీవ, భౌతిక శాస్త్రాలు తీసుకుని పలు కోర్సులు ఎంపిక చేసుకోవచ్చు. అయితే ప్రతి వ్యక్తిలోనూ మెదడులో రెండు విభాగాలు ఉంటాయి. కుడి మెదడు తెలివితేటకు, ఎడమ భాగం జ్ఞాపక శక్తి, విశ్లేషణకు పనిచేస్తుంది. మెడదు రీతిని గమనించి ఆ దిశగా ప్రయత్నం చేయాలి. కష్టంగా మారిన విషయాల్లో సాధన చేయాలి కానీ బలవంతంగా నేర్చుకోవాలనే, నేర్పించాలనే ప్రయత్నాలు చేయవద్దు.

చదివింది వెంటనే మర్చిపోతున్నాను. పరీక్షలు అనగానే కంగారు పెరుగుతుంది. 90 శాతం మార్కులకు మించి పెరగడం లేదు. నేనేం చేయాలి?

- సాయి మహాలక్ష్మి, కొంపల్లి

90 శాతం మార్కులు వస్తున్నాయి కదా? ఇంకా కంగారెందుకు? ఇవి మంచి మార్కులే. ఇంటి వద్ద కంగారు పెడుతున్నారా? స్కూళ్లో టీచర్లా? బాగా చదువుకో ఇంకా అందోళనలు, కంగారు అనే మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు. పరీక్ష హాల్లోకి వెళ్లే ముందు కొన్ని నిమిషాల సేపు ప్రార్థన చేసుకో. అప్పుడు మనస్సు నిర్మలంగా మారుతుంది.

బాగా చదువుతున్నా... కానీ పరీక్షలంటే భయం. ఇటీవల కాలంలో 70 శాతం కంటే మార్కులు పెరగడం లేదు. ఏం చేయమంటారు?

- నిఖేత్, బేగంపేట

చదువుల్లో ఇటీవల పెరిగిన పోటీ నేపథ్యంలో 70 శాతం మార్కులు అంటే మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి. మీ పరిస్థితి చూస్తుంటే మొదట మీ మీద మీకు నమ్మకం లేదని చెప్పాలి. మీ అభిరుచులు, చదువుల కోసం కేటాయించే సమయం కూడా బాగానే ఉంది. కానీ నెర్వస్‌నెస్ పక్కన పెట్టి చదువులపైనే పూర్తిగా దృష్టిపెట్టండి. అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.

షెడ్యూలు ప్రకారం చదువుతున్నా. కానీ ఫలితం ఉండటం లేదు. పూర్తి స్థాయిలో మార్కులు సాధించలేక పోతున్నా... దీనికి ఏం చేయాలి?

- ఐశ్వర్య, చైతన్యపురి

మీకు 98 శాతం వస్తున్నా ఇంకా ఆవేదన ఎందుకు? రాత్రి పదిన్నర కల్లా నిద్రపోండి. ఉదయం మాత్రం 4:30 గంటలకు నిద్రలేచి వెంటనే చదువులకు ఉపక్రమించండి. ఆ సమయంలో చదివితే అంతా మనస్సులోకి చేరుతుంది.

ఇవి తెలుసుకోండి...పాటించండి

తెల్లవారుజామున 4 గంటల సమయాన్ని బ్రహ్మ సమయం అంటారు. ఆ సమయంలో స్నానం చేసి చదివితే బాగా గుర్తుంటాయి.

మనసుకు, మెదడుకు వేరు వేరు లక్ష్యాలు ఉంటాయి. మనసు చెప్పే మాట కాకుండా మెదడు చెప్పే వైపు నడవండి.

మెదడులో 10 వేల కోట్లకుపైగా న్యూరాన్లు ఉంటాయి. అందులో 5 లక్షలు క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటాయి. అంటే అయిదు లక్షల విషయాలు గుర్తుకోవచ్చు. ఒక కొత్త విషయం మెదడులో ప్రవేశిస్తే అక్కడ ఉన్న పాత దాన్ని బయటకు పంపుతుంది. దాన్నే మర్చిపోవడం అంటారు.

ఒక సబ్జెక్టు నుంచి మరో దానిలోకి ప్రవేశించే ముందు, గంట తర్వాత కనీసం 5 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. దానినే మైండ్ హాలిడే అంటారు. ఆ సమయంలో టీవీ చూడటం, కబుర్లు చెప్పుకోవడం చేయరాదు. కళ్లు మీద తడి వస్త్రం వేసుకుని తల వెనక్కి వాల్చి చదివింది గుర్తుచేసుకోవాలి.

పరీక్షల ముందు ఇచ్చే సెలవుల్లో మధ్యాహ్నం 2 గంటలపాటు నిద్రపోండి. మళ్లీ లేచి స్నానం చేసి చదవండి. అప్పుడు ఉదయం మాదిరిగా క్రియాశీలకంగా, ప్రశాంతంగా ఉంటారు. దీన్నే ఒకరోజు- రెండు ఉదయాలు టెక్నిక్ అంటారు.

ప్రతిరోజూ ఠంచనుగా ఒకే సమయానికి చదువు ప్రారంభించి ఒకే సమయానికి నిద్రపోయే విద్యార్థి సగం విజయం సాధించినట్లే. అదేవిధంగా ఏ సబ్జెక్టు ఎంత సేపు చదవాలో ముందే నిర్ణయించుకోవాలి.

© Ushodaya Enterprises Private Limited  2012