pratibha logo
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering blog


ప్రధాన కథనాలు
ఏపీ ఎంసెట్ షెడ్యూలు విడుదల

* మే 10న ప్రిలిమినరీ 'కీ'
* మే 26న ఫలితాల వెల్లడి
కాకినాడ, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2015 షెడ్యూల్‌ను మార్చి 4న కాకినాడ జేఎన్‌టీయూలో ఆ పరీక్షల కన్వీనర్ సాయిబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మార్చి 6 నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తుతోపాటు విద్యార్థి ఫొటో, సంతకాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలన్నారు. దరఖాస్తు ఫీజును రూ.250గా నిర్ణయించామన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ రెండు ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలని చెప్పారు. గత ఏడాది ఉన్న 17 ప్రాంతీయ కేంద్రాలతో పాటు అనకాపల్లి, నరసరావుపేట, నంద్యాల, ప్రొద్దుటూరులో విద్యార్థుల సౌకర్యార్థం అదనంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి 0884-2340535 ఫోన్ నెంబరులో సంప్రదించాలని సూచించారు. మార్చి 6వ తేదీ నుంచి ఏప్రిల్ 11 వరకు అపరాధ రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని కన్వీనర్ తెలిపారు.
హాల్‌టిక్కెట్లు పొందడం ఇలా..
విద్యార్థులు హాల్‌టిక్కెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎంసెట్ పరీక్ష మే 8న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఇంజినీరింగ్, మధ్యాహ్నం వ్యవసాయ, వైద్య విభాగాలలో పరీక్షలు జరుగుతాయి. ప్రిలిమినరీ 'కీ'ని మే 10న విడుదల చేస్తారు. పరీక్ష ఫలితాలను మే 26న వెల్లడిస్తామని కన్వీనర్ చెప్పారు.

http://www.apeamcet.org/

ఇక చదువంతా గ్రేడ్లలోనే!
* వచ్చేసారి నుంచే సీబీసీఎస్‌ అమలు
ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీలో ఇక మార్కులుండవు... గ్రేడ్లే! ఏడాదికోసారి కాకుండా... ప్రతి ఆరునెలలకోసారి సెమిస్టర్‌ పరీక్షలు... ఎంపీసీ తీసుకున్నవారు కేవలం ఆ మూడు ఐచ్ఛికాలతోనే కాకుండా... ఇష్టముంటే వృక్షశాస్త్రం, చరిత్రా చదువుకునే వెసులు బాటు! కోర్సు మధ్యలో మరో విశ్వవిద్యాలయానికో... లేక రాష్ట్రానికో...లేక ఏదైనా దేశానికో వెళ్ళి చదవాలనుకున్నా ఇబ్బంది లేకుండా... చదువంతా క్రెడిట్లలోనే! ఉద్యోగం సంపాదించటానికి కనీస అవసరాలైన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లాజికల్‌, రీజనింగ్‌, జీవన నైపుణ్యాలనూ చదువుతో పాటే నేర్పటం.. అంతా సవ్యంగా సాగితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు అనుభవంలోకి రాబోతున్న అంశాలివి. కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌)ను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆరంభించటానికి తెలంగాణ విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. మొదటగా ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం. పీజీలోనే కాకుండా గ్రాడ్యుయేషన్‌ స్థాయిలోనూ దీనిని అమలుచేయాలని భావిస్తున్నారు. సీబీసీఎస్‌ అమలు తీరుతెన్నులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఈ సిఫార్సులు చేసినట్లు తెలిసింది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్యలకు కమిటీ అమలు పద్ధతులు, విధివిధానాలను సమర్పించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీసీఎస్‌ పద్ధతిని మొదలెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఇప్పటికే అన్ని విశ్వవిద్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణలో సీబీసీఎస్‌ అమలుపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులు ఈ విధంగా ఉన్నట్లు సమాచారం.
* సీబీసీఎస్‌ కింద ప్రతి కోర్సును మూడు భాగాలుగా విభజిస్తారు.
1. ముఖ్య సబ్జెక్ట్‌ (60%)లు.
2. అదనపు విజ్ఞానం, జీవన నైపుణ్యాలు సాధించేలా 2 ఎంపిక చేసిన (20%) సబ్జెక్ట్‌లు.
3. తప్పనిసరి (20%) సబ్జెక్ట్‌లు. అదనపు విజ్ఞానం, జీవన నైపుణ్యాలు సంపాదించటం కోసం వీటిని అదనంగా చేర్చారు.
* ఎంపిక చేసిన సబ్జెక్ట్‌లంటే....తమ ముఖ్య సబ్జెక్టుల్లోనే అదనపు విజ్ఞానం అందించేవిగానీ, మరో సబ్జెక్ట్‌కు సంబంధించినవిగానీ, నైపుణ్యాన్ని పెంచేవిగానీ ఉంటాయి.
* ఇక తప్పనిసరి సబ్జెక్ట్‌లు.. వ్యక్తిత్వ నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి ప్రధానాంశాలుగా ఉంటాయి.
* వారానికి ఐదురోజులే బోధన.
* డిగ్రీస్థాయిలో మొత్తం కనీస క్రెడిట్లు 144 (ముఖ్య సబ్జెక్ట్‌లు 90 క్రెడిట్లు), పీజీస్థాయిలో కనీస క్రెడిట్లు 97 (ముఖ్య సబ్జెక్ట్‌లు-64)
బీఈడీ 4 సెమిస్టర్లు: మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇక బీఈడీని నాలుగు సెమిస్టర్లుగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఈడీ రెండేళ్ళ కోర్సుగా మారుతున్న సంగతి తెలిసిందే.
ఏపీపీఎస్సీకి కొత్త తలనొప్పి
* ఏడున్నరవేల మందికి మళ్లీ గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు
* 15 ఏళ్లకు గ్రూపు-2 ఉద్యోగాల తారుమారు
* సుప్రీంకోర్టు తీర్పుతో ఇబ్బందికర పరిస్థితి
ఈనాడు-హైదరాబాద్: ఏపీపీఎస్సీ నిర్లక్ష్యంతో గ్రూపు-1 ఉద్యోగార్థులు మళ్లీ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇదేవిధంగా 1999లో గ్రూపు-2 నియామకాల్లో అప్పటి ప్రభుత్వం నియామకాలు పూర్తయ్యే సమయంలో పోస్టుల సంఖ్యను పెంచేయడంతో దానికి అనుగుణంగా నియామకాలను 15 ఏళ్ల అనంతరం ఇప్పుడు సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపీపీఎస్సీ చేపట్టే నియామకాల్లో గ్రూపు-1 ఉద్యోగాలే కీలకమైనవి. చిన్న వయస్సులో చేరితే సీనియార్టీ ద్వారా ఐ.ఎ.ఎస్. వరకు వెళ్లే వరకు అవకాశం ఉండగా...తాజా పరిణామాలు ఉద్యోగార్థులను హతాశుల్ని చేస్తున్నాయి. 2011 గ్రూపు-1 నోటిఫికేషన్ ప్రకారం 314 ఉద్యోగాలకు 2012 మే 27న ప్రాథమిక (ప్రిలిమ్స్) పరీక్ష, అదే ఏడాది సెప్టెంబరులో ప్రధాన (మెయిన్స్) పరీక్ష నిర్వహించింది. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి మౌఖిక పరీక్షలు సైతం జరిపేసింది. ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రంలో ఆరుప్రశ్నలు తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు చేపట్టిన న్యాయ పోరాటం ట్రైబ్యునల్, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. చివరికి ప్రిలిమ్స్‌లోని 150 ప్రశ్నల్లో తప్పులున్న ఆరింటిని తొలగించి..దానికి అనుగుణంగా తయారుచేసే మెరిట్ లిస్టుతో ప్రధాన పరీక్షను జరిపి అర్హత సాధించిన వారికి మౌఖిక పరీక్షలు జరపాలని సుప్రీంకోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించింది. గత వారం ఈ తీర్పును పునఃసమీక్షించేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.
వారికి అవకాశం లేదు
ప్రశ్నల తప్పులపై న్యాయపోరాటం చేసిన ఇద్దరికి ప్రధాన పరీక్ష రాసే అవకాశం లభించడంలేదు. దొర్లిన తప్పులను సవరించినట్లయితే..అదనంగా 260 మందికి అవకాశం లభిస్తుందని వారికి మాత్రమే పరీక్ష జరుపుతామని ఏపీపీఎస్సీ పేర్కొన్నా సుప్రీంకోర్టు వినలేదు. మెయిన్స్ రాసిన సుమారు ఏడున్నర వేల మంది అభ్యర్థులు మళ్లీ ప్రధాన పరీక్షను రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరిలో మౌఖిక పరీక్షకు హాజరైన వారూ ఉన్నారు.
నాన్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు...!
1999 డిసెంబరు 28న గ్రూపు-2 నోటిఫికేషన్ ద్వారా భర్తీచేసిన ఉద్యోగాల విషయంలో తాజా సుప్రీంకోర్టు తీర్పుతో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ప్రకటన జారీచేసే నాటికి 104 ఎగ్జిక్యూటివ్, 141 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. 2000 ఆగస్టు నాటికి ఖాళీ అయ్యే ఉద్యోగాలనూ భర్తీచేస్తామని ప్రకటించినప్పటికీ ఏపీపీఎస్సీ చర్యలు తీసుకోకపోవడంతో అభ్యర్థులు న్యాయపోరాటం చేశారు. చివరికి 973 ఎగ్జిక్యూటివ్...432 నాన్ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీచేసేలా చర్యలు జరిగాయి. తాజాగా సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల ప్రకారం సింగిల్ మెరిట్ లిస్టు తయారుచేస్తే.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అర్హత సాధిస్తారు. అయితే..నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారిలో కొందరు అసిస్టెంట్ సెక్రటరీ వరకూ వచ్చారు. ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఉన్న వారు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకూ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో కొందరి ఉద్యోగాలు మారనున్నాయి. పలువురు ఉద్యోగుల నుంచి ఆప్షన్లను తీసుకోవల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి..ఉద్యోగ ప్రకటన సమయంనాటి నుంచే సానుకూలంగా చర్యలు తీసుకోవల్సి వస్తే పెద్దఎత్తున మార్పులు అవసరం. ఈ పరిస్థితులకుతోడు..రాష్ట్ర విభజన కారణంగా ఏపీపీఎస్సీ రెండుగా ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ నియామకాల విషయంలో ఇరు ప్రభుత్వాలు..కమిషన్ల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. నిర్ణయాలు సమష్ఠిగా లేకుంటే పరిస్థితులు మరింత జఠిలమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఏపీ 'ఎంసెట్' నోటిఫికేషన్ విడుదల!
* మే 8న పరీక్ష
* మార్చి 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ
* ఏప్రిల్ 11 దరఖాస్తుకు చివరితేదీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్ & మెడిక‌ల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించ‌నున్న 'ఎంసెట్-2015' నోటిఫికేష‌న్‌ను జేఎన్‌టీయూ-కాకినాడ మార్చి 3న విడుద‌ల చేసింది. షెడ్యూలు ప్రకారం మే 8న ఎంసెట్ ప‌రీక్ష జ‌రగ‌నుంది. మార్చి 6 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏప్రిల్ 11 ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేదీ.
* ఇంజినీరింగ్, మెడికల్ విభాగాలకు రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.250. రెండు విభాగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.500 చెల్లించాలి. రిజిస్ట్రేష‌న్ ఫీజును ఏపీ ఆన్‌లైన్‌, మీసేవా లేదా ఈ-సేవా కేంద్రాలతోపాటు క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లించ‌వ‌చ్చు.
* రూ.500ల‌ ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 16 వ‌ర‌కు, రూ.1000ల‌ ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 22 వ‌ర‌కు, రూ.5000 ఆల‌స్య రుసుంతో మే 2 వ‌ర‌కు, రూ.10,000ల‌ ఆల‌స్య రుసుంతో మే 6 వ‌ర‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మే 2 నుంచి 6వ తేదీ మధ్య వెబ్‌సైట్ నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
* మే 8న ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు ఇంజినీరింగ్ అభ్యర్థుల‌కు, మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు అగ్రిక‌ల్చర్ & మెడిసిన్ అభ్యర్థుల‌కు ప‌రీక్ష ఉంటుంది.
* ఆంధ్రప్రదేశ్‌పాటు హైదరాబాదులోనూ పరీక్షల కేంద్రాలు ఏర్పాటుచేసే అవకాశం ఉంది. కిందటేడాది పాఠ్య ప్రణాళికను అనుసరించే పరీక్షలో ప్రశ్నలు ఇవ్వనున్నారు.
వెబ్‌సైట్‌: http://www.apeamcet.org/
మే 8నే ఏపీ ఎంసెట్
* రెండు రోజుల ముందుగానే పరీక్ష
* మార్చి 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ
*మంత్రి గంటా వెల్లడి
ఈనాడు-హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2015 నిర్వహణ తేదీ రెండు రోజుల ముందుకొచ్చింది. తొలుత ప్రకటించినట్టు మే 10న కాకుండా...మే 8వ తేదీనే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మే 10న కర్ణాటకలో ఇంజినీరింగ్- మెడికల్ పరీక్ష, డీఎస్సీ, క్లాట్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఎంసెట్‌ను ముందుకు జరపాల్సి వచ్చిందని వివరించారు. దీనిని అనుసరించి అధికారులు ఎంసెట్-2015 ప్రకటనను జారీచేశారు.
ఉన్నత స్థాయి సమావేశం
ఎంసెట్ నిర్వహణ కమిటీ సమావేశం మాసబ్‌ట్యాంక్‌లోని ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సోమవారం ఉదయం సమావేశమైంది. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించింది. అనంతరం సాయంత్రం సచివాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు... ఏపీ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సుమితా డావ్ర, ఏపీ ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి, జేఎన్‌టీయూ కాకినాడ ఇన్‌ఛార్జి ఉపకులపతి ప్రభాకరరావు, రిజిస్ట్రార్ ప్రసాదరాజు, కన్వీనర్ సాయిబాబు తదితరులతో సమావేశమై ఎంసెట్ నిర్వహణ తేదీ మార్పుపై సమీక్ష జరిపారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష 250 కేంద్రాల్లో; మెడికల్ పరీక్ష 125 కేంద్రాల్లో జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీ ఇంజినీరింగ్, వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షలు ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో జరుగుతాయని, వాటిల్లో ఎటువంటి మార్పులేదని స్పష్టం చేశారు. జేఎన్‌టీయూ-కాకినాడకు ఈసెట్ నిర్వహణలో తగిన అనుభవం ఉందని, అందువల్లే ఎంసెట్ నిర్వహణ బాధ్యతల్ని ఆ విశ్వవిద్యాలయానికి అప్పగించామని ఏపీ ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఏయూకు ఐసెట్, జేఎన్‌టీయూ-అనంతపురానికి ఈసెట్, ఎస్వీయూకు ఎడ్‌సెట్, శ్రీకృష్ణదేవరాయకు లాసెట్, నాగార్జునకు వ్యాయామవిద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించినట్లు వివరించారు.
పాత పాఠ్య ప్రణాళికే..
కిందటేడాది పాఠ్య ప్రణాళిక అనుసరించి మాత్రమే ప్రశ్నలు ఇస్తామని, ఎటువంటి మార్పులేదని కన్వీనర్ ప్రొఫెసర్ చొప్పవరపు సాయిబాబు వెల్లడించారు.
దరఖాస్తు ఇలా..
ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు పత్రికలకు విడుదలచేసిన ఎంసెట్-2015 ప్రకటన ప్రకారం...ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. అపరాధ రుసుము రూ.500, రూ.1000, రూ.5000, రూ.10,000లతో వరుసగా ఏప్రిల్ 16, 21, మే 2, ఆరో తేదీల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మే 2 నుంచి 6వ తేదీ మధ్య హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడు చేసుకోవచ్చు. కిందటేడాది మాదిరిగానే దరఖాస్తు కింద రుసుము కింద రూ.250 తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌పాటు హైదరాబాదులోనూ పరీక్షల కేంద్రాల ఏర్పాటుపై మంత్రి సానుకూలత వ్యక్తంచేశారు. త్వరలో దీనిపై అధికారిక నిర్ణయాన్ని తీసుకోనున్నారు.
ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణపై పరిశీలన
ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లో కూడా ఎంసెట్ నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో చెప్పారు. ఇది విని అక్కడే ఉన్న అధికారికవర్గాలు ఒకింత కలవరానికి గురయ్యాయి. అనంతరం మంత్రికి వాస్తవాలు వివరించడంతో పునరాలోచన చేయాలని నిర్ణయించారు. తగిన ముందస్తు ప్రణాళిక లేకుండా ఆన్‌లైన్‌లో పరీక్ష జరపడం ద్వారా ఊహించని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రశ్నల నిధి, సాఫ్ట్‌వేర్ తయారీ, విడిగా ఇంటర్ మార్కుల వెయిటేజీ ఇవ్వడం తదితర అంశాలను అంచెలవారీగా చేయాల్సి ఉంటుందని, అతితక్కువ వ్యవధిలో మే 8 నాటికి వీటన్నింటినీ పూర్తిచేయడం కష్టమని అధికారులు మంత్రికి వివరించారు. ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణకు వ్యయం కూడా రూ.కోట్లలో ఉంటుందని చెప్పారు.
పరీక్షా సమయం...ఇవి పాటిద్దాం!
పండగలొస్తున్నాయంటే పిండి వంటలూ, కొత్త బట్టలూ ఎలా మామూలో... పరీక్షలొస్తున్నాయంటే భయం, ఆందోళన, ఒత్తిడి, కలవరం, సందేహాలు సర్వసాధారణం! కళాశాల విద్యార్థులూ, పోటీ పరీక్షల అభ్యర్థులూ ఈ తరుణంలో ఎదురయ్యే అవరోధాలను దాటితేనే మెరుగైన ఫలితం సాధ్యం. ఇందుకు ఉపకరించే నిపుణుల సూచనలు ఇవిగో!
అర్జెంటుగా స్వీటు కావాలమ్మా' అన్నాడు వినోద్‌. 'ఇప్పటికిప్పుడు ఎలా తీసుకురాను?' ప్రశ్నించింది అమ్మ. 'అదంతా నాకు తెలియదు. స్వీట్‌ కావాలంతే'.సరే! ఓ రెండు మూడు రోజులు తింటాడులే- అని అమ్మ గులాబ్‌జామ్‌ చేసింది. తయారైన వెంటనే తినడం మొదలుపెట్టాడు వినోద్‌. అతిగా తిన్నాడు. కొద్దిసేపు నిద్రపోయి తర్వాత లేచి చదువుతానన్నాడు. 'అదేం తిండిరా? అన్నీ తినేశావేంటి?' అంది అమ్మ. 'తినాలనిపించింది. తినేశా. దిష్టి పెట్టకు' అన్నాడు వినోద్‌. రెండు గంటల నిద్ర తర్వాత లేచాడు. ఇదంతా విపరీత ధోరణిలా అనిపించింది అమ్మకు. నిజమే! మానసిక ఒత్తిడిలో ఉన్నవారికి అతిగా తినాలనిపిస్తుంది. లేదా అసలు తినాలనిపించదు. బాగా చదివి కూడా పరీక్షల ముందు టీవీని ఎక్కువసేపు చూస్తున్నారంటే అది మానసిక ఒత్తిడికి కారణంగా చెప్పుకోవచ్చు.
ఇవీ మానసిక ఒత్తిడి లక్షణాలు..
* విపరీత ధోరణితో ఉండడం. అంటే- అతిగా తినడం/ అసలు తినకపోవడం. అతిగా నిద్రపోవడం/ అసలు నిద్ర లేకుండా కలత నిద్రలో గడపడం.
* విసుగు, కోపం ప్రదర్శించడం.
* పరీక్షలంటే భయం.
* గొంతు తడి ఆరిపోవడం.
* శరీరంలో నొప్పులున్నట్లు అనిపించడం.
* ఉన్నట్టుండి ఏడవడం.
* ఏదో విధంగా వాదనలు పెట్టుకుని చదువును వాయిదా వేయడం.
* తలనొప్పి.
* తియ్యని పదార్థాలు తినాలనిపించడం.
ఒక స్థాయిలో ఒత్తిడి అవసరమే అని చెప్పవచ్చు. ఒత్తిడి ఉంటేనే మనిషి లక్ష్యంవైపు పరుగులెడతాడు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం- శరీరంలో బ్లడ్‌ ప్రెజర్‌ (బీపీ) ఉంటే రక్తం అన్ని భాగాలకూ సరఫరా అవుతుంది. ఇది ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. అలాగే మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండకూడదు. తక్కువైతే మనిషి నిస్సత్తువగా అయిపోతాడు. ఎక్కువైతే ఆందోళన, కలవరం. లాభసాటిగా ఉండే ఒత్తిడిని EUSTRESS అనీ, హాని కలిగించే ఒత్తిడిని DISTRESS అనీ అంటారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, తెలివితేటలు, గ్రహణశక్తి, సమయానుగుణంగా తక్షణం స్పందించడం (స్పాంటేనిటీ)... ఇవన్నీ పుట్టుకతోనే వస్తాయనే భ్రమలో ఉంటారు చాలామంది. ఎవరికి వారు వీటిని పెంపొందించుకోవాలి.
* మనకు ప్రస్తుతం ఉన్న జ్ఞాన సంపద
* కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస
* నేర్చుకున్న విషయాలను తెలియజేయాలనే తపన... ఈ మూడు కారణాల వల్లా మన శక్తియుక్తులు ప్రదర్శితమవుతాయి.
చేయవలసినవి...
పరీక్ష అనేది జీవితానికి కాదు. చదువుకున్న సిలబస్‌కు మాత్రమే. ఈ పరీక్షల్లో ఎంతోమంది నూటికి నూరు శాతం/ 98 శాతం సాధిస్తున్నారు. కాబట్టి ఇది సాధ్యపడే విషయమేనని ఒప్పుకోవాల్సిందే. ముందుగా చేయాల్సిన విషయాల గురించి..
1. చదువుకునే వాతావరణం: గాలి, వెలుతురు ఎంతో అవసరం. చదువుకునే ప్రదేశంలో మనసును ఇబ్బందిపెట్టే వస్తువులు ఉండకూడదు. తక్కువ పుస్తకాలు ఉండాలి. ఘాటులేని సువాసన వెదజల్లే ఆహ్లాదకరవాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
2. ఆత్మవిశ్వాసం: సిలబస్‌లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అడుగుతారనేది అందరికీ తెలిసిందే. అందువల్ల చదివిన విషయాలను ధీమాతో పరీక్షలో రాయాలి. కొన్ని పరీక్షల్లో అన్ని ప్రశ్నలకూ జవాబు రాసే అవసరం లేదు. చాయిస్‌ ఉండనే ఉంటుంది. అందుకని ఆత్మవిశ్వాసంతో పరీక్షకు వెళ్లాలి. లేని పక్షంలో భయం, ఒత్తిడికి గురి కావడం, దాని ద్వారా చదువుకున్న విషయాలు పరీక్షహాలులో మరచిపోయే అవకాశముంది. ఇది జ్ఞాపకశక్తి సమస్య కాదు. ఎందుకంటే.. పరీక్షహాలు నుంచి బయటకు వచ్చిన తరువాత మరచిపోయామనుకున్న విషయాలు అప్రయత్నంగా గుర్తుకొస్తాయి.
ఇక్కడ గమనించాల్సింది- పరీక్షహాల్లో మానసిక ఒత్తిడికి గురైనపుడు ఆ సమాచారం గుర్తు రాలేదు. బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి ఒత్తిడీ లేనపుడు అదే సమాచారం గుర్తుకువచ్చింది. ఈవిధంగా తాత్కాలికంగా మరచిపోవడాన్ని Blockade of retrieval process అంటారు.
3. భయం: ఆత్మవిశ్వాసానికి ఇది వ్యతిరేకం. భయం అనేది కేవలం వ్యక్తి వూహించుకున్నదే. ఒక విషయానికి ఒక వ్యక్తి భయపడుతూ ఉండొచ్చు. అదే విషయంలో అందరికీ భయం ఉండదు. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఒక సబ్జెక్టు అంటే భయం. అది కేవలం ఆ విద్యార్థి పెంచుకున్నదే. ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఇంగ్లిష్‌లో ఈ పదాన్ని ఒక ఏక్రోనిమ్‌గా చెప్పుకుందాం. F - Fictious, E - Experience, A - Appearing, R - Real (FEAR) అంటే... 'కల్పితమైన అనుభవం వాస్తవంలా కనిపించడం'. ఈ వూహించుకున్న భయాన్ని దూరం చేసుకోవడానికి DESENSITIZATION అనే ప్రక్రియను సాధన చేయాలి. భయాలూ, అలవాట్లూ పుట్టుకతో రావు కాబట్టి భయం పెంచుకున్నదే. ఈ భయం విషయంలో ఉన్న సున్నితత్వాన్ని పోగొట్టుకుని, మానసికంగా దృఢంగా మారడం అన్నమాట. పరీక్ష హాలు వాతావరణాన్ని వూహించుకుని పాత ప్రశ్నపత్రాలకు జవాబులు రాయడం అలవాటు చేసుకోవాలి. ఈ సాధన భయాన్ని తప్పకుండా దూరం చేస్తుంది.
4. VAK పద్ధతి: మనకున్న పంచేంద్రియాల్లో మూడు ఇంద్రియాలను ఉపయోగించి చదివే పద్ధతి ఇది. వి- విజువల్‌ (కళ్లు), ఎ- ఆడిటరీ (చెవులు), కె- కైనెస్థిటిక్‌ (ముట్టుకోవడం) ద్వారా ఉద్వేగంతో భావించడం. అంటే చర్మం ద్వారా. కళ్లతో చూస్తూ, వినిపించే స్థాయిలో తక్కువ స్వరంలో పైకి చదువుతూ, చదివే పదాల కింద చూపుడువేలు పెట్టి ముందుకు కదుపుతూ చదివితే ఏకాగ్రతను కట్టి పడేయవచ్చు.
5. మ్యాపింగ్‌ పద్ధతి: చదువుకునే సమయంలో పక్కనే ఒక కాగితం పెట్టుకుని సబ్జెక్టును అర్థం చేసుకుంటూ మ్యాప్‌ గీయాలి. ఉదాహరణకు- భూమి నుంచి పైకి వచ్చిన చెట్టు మొదలు, దాని నుంచి అనేక శాఖలు వచ్చినట్లు. ముందుగా సబ్జెక్టును చెట్టు మొదలు అనుకుని ఒక వృత్తంలో ఆ టాపిక్‌ రాయాలి. ఆ వృత్తం నుంచి ఎన్ని దిశల్లో ఎన్ని శాఖలు వచ్చాయో రాసుకుంటూ చదివితే, ఆ మ్యాప్‌ బాగా గుర్తుండిపోయి జవాబును సులభంగా రాయగలుగుతారు.
6. జ్ఞాపకశక్తి: ఇదో మానసిక ప్రక్రియ. దీనిలో నాలుగు దశలుంటాయి. అవి: 1. రికగ్నైజింగ్‌ 2. ఎనలైజింగ్‌ 3. స్టోరింగ్‌ 4. రీకాలింగ్‌. ఈ నాలుగు దశలున్న ఈ ప్రక్రియ ఏ దశలో ఆగిపోయినా సమాచారం గుర్తుకు రాదు. ఈ ప్రక్రియను ఆసక్తి, ఏకాగ్రత, పునశ్చరణలతో పూర్తి చేస్తే జ్ఞాపకశక్తి సొంతమవుతుంది.
బట్టీ విధానం... గుర్తుచేసుకోవడానికి మంచిది కాదు. సబ్జెక్టును అర్థం చేసుకుంటూ చదవడం అలవాటు చేసుకుంటే అది ఎప్పటికైనా మంచిదే.
7. తెలివితేటలు: మెదడు వృద్ధి చెందని అతి కొద్దిమంది (మెంటల్లీ చాలెంజ్‌డ్‌) తప్ప అందరికీ తెలివితేటలు బాగానే ఉంటాయి. మనకున్న పరిజ్ఞానాన్ని సృజనాత్మకంగా ప్రదర్శించడమే తెలివితేటలు. పరిజ్ఞానం లేనివాడిని తెలివైనవాడిగా గుర్తించరు. కాబట్టి తెలివితేటల గురించి సందేహాలు పెట్టుకోకుండా విజ్ఞానాన్ని పెంచుకోవడానికి సాధన చేస్తూ ఉండాలి.
8. ఆరోగ్యం: పరీక్షలు రాసేవాళ్లు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినాలి. సమయానికి తినడం, నిద్రించడం, మంచి విషయాల గురించి మాత్రమే ఆలోచించడం ఎంతో మంచిది. పోషకపదార్థాల పాత్ర ఎంతో ముఖ్యం. రోజుకొక అరటిపండు చాలా మేలు చేస్తుంది. పండ్లు, పండ్ల రసాలు ఎంతో ముఖ్యం.
9. పునశ్చరణ: ఒక విషయాన్ని తెలుసుకున్నపుడు అది మనకు ఇంతకుముందే తెలుసుంటే పునశ్చరణ చేయాల్సిన పనిలేదు. కాబట్టి విషయజ్ఞానాన్ని బట్టి ఎన్నిసార్లు పునశ్చరణ అనేది ఆధారపడి ఉంటుంది.
10. చదవడానికి అనుకూల సమయం: ఉదయం పూట చదివితేనే మంచిదన్న అభిప్రాయం ఒకటుంది. కానీ ఆధునిక ప్రవర్తనా శాస్త్రవేత్తల అభిప్రాయం వేరుగా ఉంది. ఒక్కొక్కరికి శక్తి స్థాయులు (ఎనర్జీ లెవల్స్‌) ఒక్కో రకంగా ఉంటాయి. ఎవరికి ఏ సమయంలో బాగుంటుందో ఆ సమయంలో చదవడం మేలు. కానీ రాత్రిపూట 6 గంటలపాటు విశ్రాంతి తీసుకున్న తరువాత ఉదయం లేచి చదివితే మెదడు ఎంతో నిర్మలంగా ఉంటుందనేది ఒక అభిప్రాయం.
11. నిద్ర: ఎవరికైనా ఆహారంలాగానే నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 6 గంటల నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికీ, చదువుకూ, ఏకాగ్రతకూ మంచిది. ప్రతిరోజూ ఒక నిర్దిష్టమైన సమయానికి నిద్రను అలవాటు చేసుకోవాలి.
12. మధ్యలో విశ్రాంతి: ప్రతి గంటకూ అయిదు నిమిషాల వ్యవధి విశ్రాంతికి కేటాయించాలి. దీని వల్ల విసుగు లేకుండా చదువు కొనసాగించే వీలుంటుంది. 5 నిమిషాల తరువాత మళ్లీ క్రమశిక్షణతో చదువు మొదలుపెట్టాలి. ఒకసారి చదివే స్థలం నుంచి లేస్తే 5 నిమిషాల్లో తిరిగి చదవలేకపోతున్నామని కొంతమంది విద్యార్థులు అంటుంటారు. పరీక్షల సమయంలో పరీక్షహాలు నుంచి వాష్‌రూమ్‌కు వెళ్ళి తిరిగి పరీక్షహాల్లోకి ఎలా వెళ్తామో అలాగే క్రమశిక్షణతో చదవాలి.
13. చదివే సమయంలో ఏవైనా గుర్తుకొస్తే: చదివే సమయంలో పక్కనే ఒక తెల్ల కాగితం, పెన్ను ఉంచుకోవాలి. ఏమైనా గుర్తుకొస్తే ఆ పేపర్‌ మీద రాసుకోవాలి. కానీ ఆలోచిస్తూ కూర్చోకూడదు. ప్రతి గంటకో అయిదు నిమిషాల విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ పేపర్‌ మీద రాసిన విషయాల గురించి 5 నిమిషాలు మాత్రమే ఆలోచించాలి.
14. ప్రజంటేషన్‌: పరీక్షలో ముందుగా మీకు బాగా వచ్చిన ప్రశ్నలకు మాత్రమే జవాబులు చేయాలి. దీనివల్ల జవాబుపత్రాన్ని దిద్దేవారికి మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది. సబ్‌హెడ్డింగ్‌లను కలర్‌ పెన్సిల్‌తో అండర్‌లైన్‌ చేసి, అవసరమైనచోట్ల బొమ్మలు వేసి మంచి దస్తూరీతో రాస్తే జవాబుపత్రం ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇవి చేయకూడదు..
చెయ్యవలసిన పనులు ఎంత ముఖ్యమో, చెయ్యకూడనివి కూడా తెలుసుకుని, జాగ్రత్త తీసుకోవడం అంతే ముఖ్యం. ఆందోళన వద్దు
పరీక్ష ముందు ఆందోళన చెందడం వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు. కాబట్టి పరీక్షల ముందు ఆదుర్దా, ఆందోళన పడకూడదు. రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజ్‌ వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
పరీక్ష హాలు దగ్గర పునశ్చరణ
చాలామంది పరీక్షహాల్లోకి వెళ్లే వరకూ చదువుతూనే ఉంటారు. దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఆ సమయంలో చదివినపుడు సరిగా గుర్తుకు రాకపోతే ఆత్మవిశ్వాసం సన్నగిల్లవచ్చు. అంతేకాకుండా ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది.
టీవీ/ క్రికెట్‌
క్రికెట్‌ వీరులకు కూడా మార్చి-ఏప్రిల్‌ నెలల్లో పరీక్ష సమయం అన్నట్లు అదే సమయంలో అనేక క్రికెట్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తుంటారు. టీవీ చూడడం వల్ల పరీక్ష హాల్లో మార్కులు తక్కువ వస్తే ఆ మార్కుల జాబితా మాత్రం ఒక డాక్యుమెంటులా ఉండిపోతుంది. కాబట్టి పరీక్షల ముందు టీవీ, క్రికెట్‌లు చూడకుండా నిగ్రహించుకోవాలి.
చదువుకు ప్రదేశం
చదవడానికి అనువుగా ఉండాలంటే గదిలో సినీనటుల, క్రీడాకారుల పోస్టర్లు; పత్రికలు లేకుండా చూసుకోవాలి. టీవీ, కంప్యూటర్‌, డీవీడీ ప్లేయర్‌, ఫోన్‌ వంటివి కూడా అందుబాటులో లేకుండా జాగ్రత్త వహించాలి.
మానసిక ఒత్తిడి
ప్రతికూల ఆలోచనల వల్లే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వేరే విద్యార్థుల, అభ్యర్థుల గురించి ఆలోచించకూడదు. టీనేజ్‌ ఆకర్షణలు, ఇతర వ్యాపకాలంటూ ఒత్తిడిని పెంచుకోకుండా అన్నింటినీ పక్కన పెట్టేయటం అవసరం.
వేరే వారితో పోల్చుకోవడం
పరీక్షల ముందు వేరే వారితో పోల్చుకుని కుంగిపోకూడదు. పోటీ పడడంలో తప్పు లేదు. కానీ నిరాశ చెందడం మంచిది కాదు.
వాయిదా అలవాటు
వాయిదాలు వేయడం వల్ల సమయం వృథా అవడమే కాకుండా విలువైన అవకాశాలను పోగొట్టుకున్న వాళ్లమవుతాం. వాయిదాల వల్ల ఆదుర్దా, తరువాత ఆందోళన, ఆ తరువాత ఒత్తిడీ ఏర్పడతాయి.
ర్యాంకు
ర్యాంకుల గురించి ఆలోచించకూడదు. మీకెంత ర్యాంకు వస్తుందనేది మీ పోటీదారులపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిత్యం కృషి చేయడమే మీ వంతు. మీ కళాశాల/ సంస్థ నుంచి మాత్రమే కాకుండా అనేక ప్రదేశాల్లో ఉండే కళాశాల/ సంస్థ నుంచి ఎంతోమంది పరీక్ష రాస్తారు. కాబట్టి ర్యాంకు గురించి ఆలోచించడం మాని చదువుపై దృష్టి పెట్టడం మేలు.
జ్ఞాపకశక్తి
మెమరీ ప్రదర్శనలను చూసి మీకు అటువంటి శక్తి లేదేమోననే అపోహను పెంచుకోకండి. ప్రదర్శనలో కొన్ని పేర్లు, వస్తువులు, ముఖాలు గుర్తుపెట్టుకోవడానికి కొన్ని చిట్కాలను వాడతారు. వాటివల్ల పేరాగ్రాఫ్‌లు, పేజీలు గుర్తుండవు. కాబట్టి మీ జ్ఞాపకశక్తి గురించి అనవసరంగా ఆందోళన పడవద్దు.
చర్చలు వద్దు
పరీక్ష రోజున ఎవరితోనూ చర్చించకూడదు. తెలియని విషయాలను ఎదుటివారు చెబుతుంటే మీలో నిరాశ కలిగే అవకాశముంది. ఇది ఏ విధంగానూ లాభం చేకూర్చదు.
పరీక్ష తరువాత
పరీక్ష రాసిన తర్వాత పరీక్ష హాలు నుంచి బయటకు వచ్చి వేరే విద్యార్థులతో చర్చించడం కూడా మంచిది కాదు. మీరు రాసిన జవాబు తప్పు అని ఎవరైనా అంటే మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అంతేకాదు.. దాని ప్రభావం మర్నాడు జరిగే పరీక్ష మీద పడుతుందని గుర్తుంచుకోవాలి.
చివరగా.. మీ కష్టానికీ, ప్రతిభకూ పట్టం కట్టే రోజే పరీక్ష రోజు. కాబట్టి సానుకూల ఆలోచనలతో పరీక్షలు రాస్తే మెరుగైన ఫలితం సులువుగా దక్కుతుంది!
* పరీక్ష ముందు రోజు ఎటువంటి ఆందోళనా, ఒత్తిడీ లేకుండా చూసుకోవాలి. పరీక్ష హాలు ఎక్కడుందో చూడడానికి తల్లిదండ్రుల సాయం తీసుకోవాలి.
పరీక్ష రోజు: పరీక్ష రోజు హాలుకు గంట ముందు చేరుకోవాలి. విశ్రాంతిగా ఉండాలి. ప్రతి సంవత్సరం పరీక్ష హాలుకు ఆలస్యంగా వచ్చేవారి ఫొటోలను దినపత్రికల్లో చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని అశ్రద్ధ చేయకూడదు.
చదివే సమయంలో నిద్ర వస్తే?: చేతి మణికట్టుకు గడియారం పెట్టుకున్నట్లు ఒక రబ్బర్‌ బ్యాండ్‌ను పెట్టుకోవాలి. నిద్ర వచ్చిన సమయంలో దాన్ని లాగి వదిలితే ఆ మెత్తని దెబ్బకు నిద్రమత్తు వెంటనే వదిలిపోతుంది.
సమయాన్ని నిర్ధారించుకోవడం: పరీక్షలో చిన్న, పెద్ద జవాబులుండే ప్రశ్నలు రెండూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సరైన సమయం కేటాయించడం విషయంలో కొంత సాధన చేయాలి. లేనిపక్షంలో సమయాన్ని వాడుకోవడంలో విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది.
రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజ్‌: విద్యార్థులూ, పోటీ పరీక్షల అభ్యర్థులూ మనసుకు విశ్రాంతినిచ్చే కసరత్తులు చేయాలి. వీటివల్ల ఎన్నో లాభాలున్నాయి. 'స్కై వాకింగ్‌' అనే ఎక్సర్‌సైజ్‌ చాలా సులభం. తలను కొంచెం పైకి ఎత్తి పైకప్పు వైపు చూస్తూ గదిలో ఒక పక్క నుంచి మరొక ప్రక్కకు వడివడిగా నడవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయాలను ఆలోచిస్తూ ఇలా నడవడం వల్ల ఎంతో లాభం ఉంటుంది. విజువలైజేషన్‌ ఎక్సర్‌సైజ్‌లు కూడా మంచి ఫలితాలనిస్తాయి. ఒక కుర్చీపై కూర్చుని కళ్లు మూసుకుని సానుకూల దృక్పథంతో వూహించుకోవాలి. పరీక్ష చాలా బాగా రాస్తున్నట్లు, ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు వూహించుకుంటే ఫలితాలొస్తాయి.
రాయడం సాధన: చాలామంది విద్యార్థులు చదువుతారు. కానీ రాయడం సాధన చేయరు. అటువంటివారికి పరీక్షహాలులో కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక అరగంటసేపు రాయడం సాధన చేయాలి.
ఫ్లాష్‌ కార్డ్స్‌: ముఖ్యమైన సూత్రాలనూ, నిర్వచనాలనూ ఫ్లాష్‌ కార్డ్స్‌ తయారు చేసుకుని... చదివే టేబిల్‌కు దగ్గరగా గోడమీద కానీ తలుపు మీద కానీ ఉంచుకోవాలి. వీలైనన్నిసార్లు వాటిని చదువుతుండాలి.
600 ఖాళీల్లోనూ ఆయుష్ వైద్యులే!
* ఆర్‌బీఎస్‌కేలో భర్తీపై వైద్యారోగ్య శాఖ యోచన
* మార్గదర్శకాల మార్పుపై కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఒప్పంద ప్రాతిపదికన చేపట్టనున్న వైద్య ఉద్యోగ నియామకాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఎంబీబీఎస్ వైద్యులకు నిరాశే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే) కింద నియామకాలు చేపట్టనున్న 600 మంది వైద్యుల ఖాళీను పూర్తిగా ఆయుష్ వైద్యులతో భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తున్నట్లు తెలిసింది. తొలుత ఈ ఖాళీల్లో 20 శాతం మాత్రమే ఆయుష్ వైద్యులతో భర్తీ చేయాలని భావించారు. కానీ, ప్రస్తుతం అన్ని ఖాళీలనూ ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్ఎం) కింద తెలంగాణలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. ఇందులో ఆర్‌బీఎస్‌కే కింద 600 మంది, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్(ఎన్‌యూహెచ్ఎం) కింద 275 మంది వైద్యులను నియమించనున్నారు. ఆర్‌బీఎస్‌కే కింద చేపట్టే భర్తీలో 120 మంది ఆయుష్, 480 మంది ఎంబీబీఎస్ వైద్యులను నియమించాలని మార్గదర్శకాలను రూపొందించారు. సంబంధిత దస్త్రం ఆరోగ్య శాఖ మంత్రి పేషీకి చేరిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆమోదంతో త్వరలోనే ఈ వైద్యుల నియామకానికి ప్రకటన వెలువరించాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తుండగా.. ఇటీవల జరిగిన ఎన్‌హెచ్ఎం సమావేశంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్‌యూహెచ్ఎం కింద వైద్యుల నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పు చేయలేదు. కానీ, ఆర్‌బీఎస్‌కే నిబంధనల్లో మాత్రం పూర్తిగా ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేయాలనే అంశంపై చర్చించినట్లు తెలిసింది. ఆర్‌బీఎస్‌కేలో వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది. పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, ఎదుగుదలలో సమస్యలు, రక్తహీనత, పోషకాహార లోపం.. తదితర ఆరోగ్య సమస్యలను గుర్తించాల్సిన బాధ్యత వీరిదే. కేంద్రం నుంచి వచ్చిన ఎన్‌హెచ్ఎం ఉన్నతాధికారి ఒకరు 'గుర్తించడాన్ని ప్రధానాంశంగా చేసుకొని మాట్లాడినట్లు తెలిసింది. కేవలం పిల్లల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించడమే కాబట్టి ఎంబీబీఎస్‌లు అవసరం లేదనీ, ఆర్‌బీఎస్‌కేలో అన్ని నియామకాలనూ ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేయడంపై ఆలోచించాలని సూచించినట్లు సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేస్తున్నారని ఉదాహరణలు కూడా వెల్లడించినట్లు తెలిసింది. దీంతో పునరాలోచనలో పడిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను మార్చాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఎన్‌హెచ్ఎం రాష్ట్ర అధికారులు తిరిగి కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
మరింత జాప్యమే..
ఈ నియామకాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల భర్తీలో పాటించాల్సిన రిజర్వేషన్ శాతాన్ని పేర్కొంది. ఎంబీబీఎస్ వైద్యులకు 80 శాతం, ఆయుష్ వైద్యులకు 20 శాతం కేటాయించింది. ఆ మేరకు రూపొందించిన మార్గదర్శకాలను ఇప్పుడు మార్చాలని యోచిస్తుండటంతో నియామక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎన్‌హెచ్ఎం కార్యక్రమాలు ఇప్పటికే మానవ వనరుల కొరతతో నత్తనడకన సాగుతుండగా తాజా నిర్ణయంతో వీటికి మరింత ఆటంకం కలిగే అవకాశాలున్నాయి.
తెలంగాణ ఐసెట్, ఈసెట్ ప్రవేశ ప్రక‌ట‌న విడుద‌ల‌!
* మే 21న ఈసెట్, 22న ఐసెట్
హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ఐసెట్- 2015; బీఈ, బీటెక్, బీఫార్మసీ (రెండో సంవత్సరం) కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) అభ్యర్థులకు నిర్వహించే టీఎస్ఈసెట్ - 2015 ప్రవేశ ప్రక‌ట‌న‌ ఫిబ్రవ‌రి 28న విడుదలైంది. మే 21న ఈసెట్ పరీక్ష, మే 22న జ‌రుగనున్న ఐసెట్ ప‌రీక్ష జరుగనుంది. ఐసెట్ పరీక్షను కాక‌తీయ విశ్వవిద్యాల‌యం, ఈసెట్ పరీక్షను జేఎన్‌టీయూ హైదరాబాద్ నిర్వహించ‌నున్నాయి. ప‌రీక్షకు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఐసెట్ పరీక్షకు రూ.250, ఈసెట్ పరీక్షకు రూ.300లు ద‌ర‌ఖాస్తు రుసుముగా నిర్ణయించారు.
* ఐసెట్ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 5 నుంచి ప్రారంభం కానుంది. ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేదీ ఏప్రిల్ 9. మే 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగనుంది.
వెబ్‌సైట్‌: http://tsicet.org/
* ఈసెట్ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 6 నుంచి ప్రారంభం కానుంది. ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేదీ ఏప్రిల్ 15. మే 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది.
వెబ్‌సైట్‌: http://tsecet.in/
నైపుణ్య ప్రాప్తిరస్తు!
* త్వరలో జాతీయ నైపుణ్యాల మిషన్ ప్రారంభం
దిల్లీ: జాతీయ నైపుణ్యాల మిషన్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ ద్వారా దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వివిధ మంత్రిత్వశాఖలు నిర్వహిస్తున్న నైపుణ్య పథకాలను ఈ మిషన్ బలోపేతం చేస్తుంది. నైపుణ్య మండళ్ల విధానాలను, ఫలితాలను ప్రమాణీకరించేందుకు తోడ్పడుతుందని ఆయన అన్నారు. దేశంలో 54 శాతం మంది 25 ఏళ్లలోపు వారేనని జైట్లీ పేర్కొన్నారు. ఇప్పటికీ మన కార్మికశక్తిలో 5 శాతంలోపే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ పొందుతున్నారన్నారు. గ్రామీణ యువతలో ఉద్యోగ సాధన నైపుణ్యాల పెంపునకు 'దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజనపథకాన్ని ప్రారంభించినట్లు జైట్లీ చెప్పారు. దీనికి రూ.1500 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో అర్హులైన విద్యార్థులకు డిజిటల్ వోచర్ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా ఉపకారవేతనాలను జమ చేస్తారు.
3న ఏపీ ఎంసెట్ ప్రకటన!
* ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు
* ఏపీ ఎంసెట్ కమిటీ ఛైర్మన్ ప్రభాకర్‌రావు వెల్లడి
కాకినాడ (బాలాజీచెరువు), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి మూడో తేదీన ఎంసెట్ ప్రకటన వెలువడనుందని ఎంసెట్ 2015 కమిటీ ఛైర్మన్, జేఎన్‌టీయూకే ఇన్‌ఛార్జి ఉపకులపతి డాక్టర్ ప్రభాకర్‌రావు వెల్లడించారు. ఫిబ్రవరి 27న కాకినాడ జేఎన్‌టీయూలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంసెట్ 2015 పరీక్ష వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఎంసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సమయం తక్కువగా ఉన్నందున ఈ విధానాన్నే కొనసాగిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మే 10న ఎంసెట్ నిర్వహించనున్న విషయం విదితమే. ఈ ఏడాది ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడిసిన్ విభాగాల్లో కలిపి సుమారు 2.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా. ఇందులో సుమారు 1.80 వేల మంది ఇంజినీరింగ్.., 70 వేల మంది వ్యవసాయ, వైద్యవిభాగ విద్యార్థులు ఉండొచ్చన్నారు.
పాత విధానంలోనే ప్రశ్నపత్రం
ప్రశ్నపత్రం గతేడాది తరహాలోనే ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సాయిబాబు తెలిపారు. ఇంజినీరింగ్ ప్రశ్నపత్రం 160 మార్కులకు ఉంటుందన్నారు. ఇందులో గణితం 80, భౌతిక శాస్త్రం 40, రసాయన శాస్త్రం 40 మార్కులకు ఉంటుందన్నారు. వ్యవసాయ, వైద్య విభాగంలోనూ 160 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుందన్నారు. దీనిలో ప్రశ్నలు వృక్షశాస్త్రం 40, జంతుశాస్త్రం 40, భౌతిక శాస్త్రం 40, రసాయన శాస్త్రం 40 మార్కులకు ఉంటాయన్నారు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉంటుందన్నారు. వందకు.. 25 అర్హత మార్కులుగా నిర్ణయించామన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు వ్యవసాయ, వైద్య విభాగం పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఈ ఏడాది ఏపీలో అవసరం మేరకు పరీక్షా కేంద్రాలు పెరిగే అవకాశాలున్నాయని కన్వీనర్ తెలిపారు. విద్యార్థుల నిష్పత్తిని అనుసరించి హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసే యోచనలో ఉన్నామన్నారు.
2న సెట్ కమిటీ సమావేశం..
మార్చి 2న ఎంసెట్ కమిటీ సమావేశం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. ఇందులో మండలి ఛైర్మన్ ఆధ్వర్యంలో 21 మంది సభ్యులు ఎంసెట్-2015 పరీక్ష విధివిధానాలు నిర్ణయిస్తారన్నారు. పరీక్ష ఫీజు, అపరాధ రుసుంతో ఫీజు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, సిలబస్, ర్యాంకు కార్డుల జారీ వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు వెల్లడిస్తామన్నారు. 3వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్ వెలువరిస్తామన్నారు. మరోవైపు.. మాస్ కాపీయింగ్ నివారించే లక్ష్యంతో మెడిసిన్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్ డాక్టర్ ప్రసాద్‌రాజు, డీఏపీ డాక్టర్ ఉదయ్‌భాస్కర్ పాల్గొన్నారు.
పీఎస్సీకొద్దు... మేమే చేస్తాం!
* ఉద్యోగాల భర్తీ కేంద్రీకరణపై వివిధ శాఖల అభ్యంతరం!
ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీని కేంద్రీకృతం చేయాలన్న ఆలోచనకు ఆదిలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని శాఖల్లోని ఉద్యోగాల ఖాళీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించాలన్న ప్రభుత్వ యోచనకు మిగిలిన శాఖల నుంచి సానుకూలత కన్పించటం లేదని సమాచారం. జెన్‌కో, ట్రాన్స్‌కో (విద్యుత్‌), సింగరేణి తదితర శాఖలు తమ ఉద్యోగాల భర్తీని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించటానికి ఇష్టపడటంలేదని తెలిసింది. ప్రస్తుతం గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4లతో పాటు కొన్ని ఇతర రకాల గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. అవి కాకుండా కొన్ని శాఖల్లోని ఖాళీలను ఆయా శాఖల్లోని నియామకాల బోర్డు ద్వారా చేస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలోని అన్నిరకాల ఉద్యోగాల భర్తీని కమిషన్‌ ద్వారా జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమైనట్లు సమాచారం. స్థానిక సంస్థలు (ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టులు... తదితరాలు) ప్రభుత్వ రంగ సంస్థల (సింగరేణి, జెన్‌కో, ట్రాన్స్‌కో... తదితరాలు) ఖాళీలను పీఎస్సీకి అప్పగించాలనే ప్రతిపాదన ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ కేంద్రీకృత భర్తీ పద్ధతికి శాఖలు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సింగరేణి దాదాపు 5వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసేసింది కూడా! విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాలను డీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నియామకాల్లో అక్రమాలను అరికట్టాలంటే పీఎస్సీ ద్వారానే చేయాలని వాదించేవారు ఆయా విభాగాల్లోనూ ఉన్నారు. అయితే ఏ శాఖల అభిప్రాయం ఎలా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే కీలకాంశంగా మారింది.
165 కళాశాలలకు సంజాయిషీ నోటీసులు!
* జారీచేసిన ఏపీ ఉన్నత విద్యామండలి
* వెబ్‌సైట్‌లో కళాశాలల జాబితా
ఈనాడు-హైదరాబాద్: యాజమాన్య కోటా సీట్ల భర్తీలో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న కారణాలతో ఆంధ్రప్రదేశ్‌లోని 165 ప్రైవేట్ ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఫార్మాడీ కళాశాలల యాజమాన్యాలకు ఆ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంజాయిషీ నోటీసులు జారీచేసింది. జీఓ 66, 67, 74 నెంబర్లు అనుసరించి కళాశాలల యాజమాన్యాలు వెబ్‌పోర్టల్‌లో 'బి' కేటగిరి దరఖాస్తులు పెట్టకపోవడం, భర్తీ జాబితాలు సమర్పించడంలో ఇష్టానుసారం వ్యవహరించడం, సీట్ల భర్తీపై పత్రికా ప్రకటనలు జారీచేయకుండా ఉండటం వంటి కారణాలతో సంబంధిత కళాశాలలకు సంజాయిషీ నోటీసులను జారీచేసినట్లు ఏపీ ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి.
కొన్ని కళాశాలల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించి పొరుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను మాత్రమే చేర్చుకున్నాయి. పలు కళాశాలల్లో యాజమాన్య కోటా కింద పొరుగు రాష్ట్రాల విద్యార్థులు మాత్రమే చేరడం గమనార్హం. ఈ ప్రక్రియలో బిలాస్‌పూర్ వంటి ప్రాంతాల్లో గుర్తింపులేని విద్యాసంస్థల నుంచి పొందిన ఇంటర్ పత్రాలతో ప్రవేశాలు పొందినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఏపీ ఉన్నత విద్యామండలి.. 104 ఇంజినీరింగ్, 34 బీఫార్మసీ, 27 ఫార్మాడీ కళాశాలల యాజమాన్యాలకు సంజాయిషీ నోటీసులు జారీచేసింది. నోటీసులు అందుకున్న కళాశాలల జాబితా వివరాలను ఏపీ ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ నోటీసులపై పదిరోజుల్లోపు కళాశాలల యాజమాన్యాల నుంచి వివరణ అందిన అనంతరం ఆ సీట్ల భర్తీకి ఆమోదం తెలపాలా.. లేదా అన్న దానిపై ప్రత్యేక కమిటీ అధ్యయనం తర్వాత ఏపీ ఉన్నత విద్యామండలి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలోనూ ఇలాగే సంజాయిషీ నోటీసులు జారీచేయడం...ఆ తర్వాత చోటుచేసుకున్న 'ప్రత్యేక' పరిణామాలతో ఆమోదం తెలిపిన సందర్భాలూ ఉన్నాయి.
తెలంగాణ 'ఎంసెట్' నోటిఫికేష‌న్ విడుద‌ల‌
* ఫిబ్రవ‌రి 28 నుంచి ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం
* ఏప్రిల్ 9 ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేదీ
* మే 14న ప‌రీక్ష
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్ & మెడిక‌ల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించ‌నున్న ఎంసెట్-2015 నోటిఫికేష‌న్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ ఫిబ్రవ‌రి 25న విడుద‌ల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మే 14న ఎంసెట్ ప‌రీక్ష జ‌రగ‌నుంది. ఫిబ్రవ‌రి 28న ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏప్రిల్ 9 ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేదీ. ఇంజినీరింగ్, మెడికల్ విభాగాలకు రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.250. రెండు విభాగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.500 చెల్లించాలి. రిజిస్ట్రేష‌న్ ఫీజును టీఎస్ ఆన్‌లైన్‌, ఏపీ ఆన్‌లైన్‌, మీసేవా లేదా ఈ-సేవా కేంద్రాలతోపాటు క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లించ‌వ‌చ్చు.
* మే 14న ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు ఇంజినీరింగ్ అభ్యర్థుల‌కు, మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు అగ్రిక‌ల్చర్ & మెడిక‌ల్ అభ్యర్థుల‌కు ప‌రీక్ష ఉంటుంది.
* రూ.500ల‌ ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 15 వ‌ర‌కు, రూ.1000ల‌ ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 22 వ‌ర‌కు, రూ.5000 ఆల‌స్య రుసుంతో మే 5 వ‌ర‌కు, రూ.10,000ల‌ ఆల‌స్య రుసుంతో మే 12 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 8 నుంచి 12 వ‌ర‌కు వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
వెబ్‌సైట్‌: http://tseamcet.in/
ఆంధ్రప్రదేశ్‌లో మే 10న ఎంసెట్‌: మంత్రి గంటా
* హక్కులు కోల్పోకూడదనే ఆలస్యమా?
* తేల్చుకోలేక ఏపీ సతమతం
* ఆందోళనలో విద్యార్థులు
* స్పష్టమైన వైఖరితో తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్‌: నాలుగు నెలలుగా ఎంసెట్ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఉమ్మడికి బదులు విడిగా పరీక్షల నిర్వహణకే తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనందున... ఇదే దిశగా పోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో మే 10న ఎంసెట్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మే 14 ఈసెట్‌, పీఈసెట్‌, మే 16న ఐసెట్‌, మే 25న పీజీ ఈసెట్‌, మే 28న ఎడ్‌సెట్‌, మే 30న లాసెట్‌-పీజీ లాసెట్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. 1.65 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్‌కు హాజరవుతారని వివరించారు. ఎంసెట్‌ కన్వీనర్‌గా కాకినాడ జేఎన్టీయూ వీసీ ఉంటారని వెల్లడించారు. 1.16లక్షల సీట్లు కన్వీనర్‌ కోటాలో ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రాజీ పడేందుకు సిద్ధమయ్యాం. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదు. అందుకే సొంతంగా ఎంసెట్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఉమ్మడి ఎంసెట్ నిర్వహణ విషయంలో.... న్యాయ పోరాటానికి తగిన సమయం లేనందున అనివార్య పరిస్థితుల్లో విడిగా పరీక్షలు నిర్వహించుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది. జాతీయ, రాష్ట్రాల విద్యాసంస్థలు నిర్వహించే పరీక్షల సన్నద్ధతపరంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు విడిగానే పరీక్షలు నిర్వహించేందుకు ఫిబ్రవరి 24న ఏపీ ఉన్నత విద్యాశాఖకు ఆమోదం తెలిపారు. స్థానికంగా ఉండే రాష్ట్రంలోనే చదవాలనుకునేవారు ఆ రాష్ట్రం నుంచి నిర్వహించే ఎంసెట్ రాస్తే సరిపోతుంది. స్థానికేతర కోటాలో ఏపీ వారు తెలంగాణాలోనూ, తెలంగాణ వారు ఏపీలోనూ చదవాలంటే ఆయా మండళ్లు నిర్వహించే పరీక్షలకు హాజరుకావాల్సిందే. స్థానికేతర కోటాలో సీట్లను ఆశిస్తూ పరీక్షలు రాసే వారి సంఖ్య పరిమితంగా ఉండబోతుంది.
ఎంసెట్‌పై నాన్చుడు ఎందుకు?
* హక్కులు కోల్పోకూడదనే ఆలస్యమా?
* తేల్చుకోలేక ఏపీ సతమతం
* ఆందోళనలో విద్యార్థులు
* స్పష్టమైన వైఖరితో తెలంగాణ ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాన్చుడి వైఖరి అవలంబిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుఈ అంశంపై పలుదఫాలుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నా పురోగతి కనిపించడంలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి సన్నద్ధతపరంగా జాగ్రత్తలు పడాలన్న ఆలోచనలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ వైఖరితో ఆందోళన చెందుతున్నారు. సచివాలయంలో ఫిబ్రవరి 23న సీఎం, మంత్రి గంటా శ్రీనివాసరావు బృందం జరిపిన చర్చల ద్వారా ఎంసెట్‌ నిర్వహణపై స్పష్టత వస్తుందని అంతా ఆశించినా నిరాశే ఎదురైంది. తెలంగాణ ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయంతో ఒంటరిగా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమై దరఖాస్తుల స్వీకరణ తేదీలు కూడా ప్రకటించినా... ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక రాకపోవడం ఏమిటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎంసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, ఇతర వృత్తివిద్య ప్రవేశ పరీక్షలను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నిర్వహించాలా, విడివిడిగా నిర్వహించాలా, ఉమ్మడిగా అయితే ఎవరు నిర్వహించాలన్న దానిపై మొదలైన చర్చ గత నాలుగు నెలల నుంచి చర్చ, వాదోపవాదాలు జరిగాయి. చివరకు తెలంగాణ సొంతంగా పరీక్ష నిర్వహణకు సిద్ధపడింది.
ఏపీ ఇప్పటివరకు ఏం చేసింది
పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడిగా పరీక్షల నిర్వహణపై కిందటేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో రెండుసార్లు ఎంసెట్‌-2015 నిర్వహణ గురించి గవర్నర్‌ నరసింహన్‌ జోక్యాన్ని కోరారు. ఈ ఏడాది జనవరిలో ఇరు రాష్ట్రాలకు చెందిన విద్యా శాఖ మంత్రులైన జగదీశ్‌రెడ్డి (తెలంగాణాలో అప్పటి విద్యాశాఖ మంత్రి), గంటా శ్రీనివాసరావుతో కలిసి పలు ప్రత్యామ్నాయాలతో ఉమ్మడి పరీక్షలను జరపాలని గవర్నర్‌ కోరినప్పటికీ తదుపరి చర్యల్లో పురోగతి కనిపించలేదు. ఈ విషయమై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీల దృష్టికీ తీసుకువెళ్లారు.
స్థానికేతర కోటాలో ప్రవేశాలు స్వల్పమే
2014-15 విద్యా సంవత్సరంలో ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న 306 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 1,61,159 సీట్లు ఉన్నాయి. సీట్ల వరకు ఎటువంటి సమస్యలేదు. రెండు రాష్ట్రాల్లో విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తే స్థానికేతర కోటాకు ప్రాధాన్యం చేకూరుతుంది. ఇలాచూస్తే 2014-15 విద్యా సంవత్సరంలో తెలంగాణ విద్యార్థులు స్థానికేతర కోటాలో... ఏపీలో 709, ఏపీ విద్యార్థులు తెలంగాణలో 1399 మంది మాత్రమే చేరారు. ఇదే సంఖ్య ఇంచుమించు 2015-16 విద్యా సంవత్సరంలో ఉండే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో విడివిడిగా పరీక్షల నిర్వహించడం ద్వారా ఇంజినీరింగ్‌లో స్థానికేతర కోటాలో చేరే విద్యార్థుల సంఖ్య రెండువేలలోపు మాత్రమే ఉన్నా... ఏపీ ప్రభుత్వం రెండున్నర లక్షల మందిని అయోమయంలోకి ఎందుకు నెడుతోందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి ఉమ్మడిగా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల ఒక పరీక్షతోనే ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, మెడికల్‌లో ప్రవేశాలు పొందుతారు. విడివిడిగా నిర్వహిస్తే... హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండటం వల్ల ఏపీకి చెందిన వారు తెలంగాణలో స్థానికేతర కోటాలో చేరేందుకు మరొక పరీక్షను అదనంగా రాయాల్సి ఉంటుంది. అలాగే ఏపీలో స్థానికేతర కోటాలో చేరాలంటే తెలంగాణ విద్యార్థులు ఇంకో పరీక్షను రాయాల్సి వస్తుంది. ఈ మేరకు విద్యార్థులపై ఒత్తిడి పడనుంది.
జాప్యానికి కారణమేంటి
ఎంసెట్‌ అంశాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలిస్తున్నందున అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హక్కులను కోల్పోకూడదన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన విధంగా వ్యవహరించలేదన్న అభిప్రాయం రాకూడదన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలియవచ్చింది. ఉమ్మడికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటూ ముందుకెళ్లింది. అయితే ఏపీ ఉన్నత విద్యా మండలి బ్యాంకు ఖాతా కార్యకలాపాల స్తంభనపై హైకోర్టులో విచారణ సాగుతోంది. ఈ సమయంలో ఏమైనా తెలంగాణ ఉన్నత విద్యా మండలికి గుర్తింపులేదని, ఏపీకి సానుకూలంగా తీర్పు రావచ్చునన్న ఆశలు ఏపీ ప్రభుత్వంలో ఉన్నా ఇందుకు ఇంకొంత సమయంపట్టే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో 23వ తేదీన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏపీ ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి చర్చించారు. సమావేశ అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడలేదు. ఇటీవల నీటి సమస్య పరిష్కారంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీం చంద్రబాబు కలుసుకుని చర్చించారు. ఇదేవిధంగా ఈ విషయంలో జరిగేందుకు అనువైన పరిస్థితులు ఎంసెట్‌లో తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. పరీక్షల నిర్వహణకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం అధికారులూ ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 24న దీనిపై సీఎం నుంచి స్పష్టత రావచ్చునేమోనన్న ఆశలో అధికార యంత్రాంగం ఉంది.
ఇంజినీరింగ్ పూర్తికాగానే ఉద్యోగం!
* పరిశ్రమలకు అక్కరకొచ్చేలా కొత్త పాఠ్యప్రణాళిక సిద్ధం
* దేశంలోనే తొలిసారిగా జేఎన్‌టీయూహెచ్‌కు అవకాశం
* 24న నాస్కామ్-టాస్క్‌లతో వర్సిటీ ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్ చేశాక ఉద్యోగం సంపాదించేందుకు ఐటీ శిక్షణ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది! ప్రాంగణ నియామకాల్లో ఎంపిక చేసుకున్నా మరో ఆరునెలల పాటు అంతర్గత శిక్షణ ఇచ్చుకుంటే తప్ప ఉద్యోగానికి పనికిరారని కంపెనీలూ చింతించాల్సిన అవసరం లేదు! ఇంజినీరింగ్ విద్యలో ఉత్తీర్ణులు కాగానే కంపెనీలో ఉద్యోగానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా, విద్యార్థుల ఉద్యోగార్హతల్ని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం మొదలెట్టిన ఏర్పాట్లు ఓ కొలిక్కి వచ్చాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యాప్రణాళికలో మార్పులు చేర్పులు చేయాలని నాలుగు నెలల కిందట యోచించిన ప్రభుత్వం ఫిబ్రవరి 24 నుంచి దాన్ని ఆచరణలో పెట్టబోతోంది.
ఐటీ సంస్థల ఫిర్యాదుతో...
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత అస్సలు బాగోలేదని, ఉత్తీర్ణులై వస్తున్నవారిలో ఉద్యోగార్హత కలవారు 15 శాతం కూడా ఉండట్లేదనీ, ఎంపిక చేసుకున్నవారికి సైతం మళ్లీ ఆరు నెలల నుంచి ఏడాదిపాటు శిక్షణ ఇచ్చుకోవాల్సి వస్తోందని ఐటీ కంపెనీలు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదుచేశాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు దేశంలోనే తొలిసారిగా పరిశ్రమలకు అవసరమైన పాఠ్యప్రణాళికతో హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) ముందుకొచ్చింది. సాఫ్ట్‌వేర్, సర్వీస్ కంపెనీల జాతీయ సంఘం 'నాస్కామ్' సూచనల మేరకు రూపొందించిన సిస్టమ్ సెక్యూరిటీస్, డాటా అనలటిక్స్ తదితర కొత్త ఐటీ కోర్సులను రూపొందించారు. ఈ వేసవి నుంచే జేఎన్‌టీయూచ్ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో వీటిని ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న రెగ్యులర్ కోర్సుకు కొత్తగా రూపొందించిన మూడు కోర్సులను అనుసంధానిస్తారు. ఇంజినీరింగ్ మూడు, నాలుగో సంవత్సర విద్యార్థులకు వీటిని బోధిస్తారు. ఈ కొత్త కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లను నాస్కామ్, తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన మండలి (టాస్క్) సంయుక్తంగా జారీచేస్తాయి. వర్సిటీ ఇచ్చే ఇంజినీరింగ్ పట్టాకిది అదనం! విద్యార్థులు కళాశాలలో ఉత్తీర్ణులై బయటకు వచ్చేసరికే ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు పూర్తిస్థాయిలో సంపాదించుకొని ఉంటారు. ఇంజినీరింగ్ విద్యను పరిశ్రమలకు అనుసంధానం చేయాలని యోచిస్తున్న అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కూడా దీన్ని ఆమోదించి, జేఎన్‌టీయూకు సంధానపాత్ర అప్పగించినట్లు సమాచారం. రాష్ట్ర సాంకేతిక సమాచార శాఖ(ఐటీ)కు చెందిన టాస్క్, నాస్కామ్‌లతో ఫిబ్రవరి 24న జేఎన్‌టీయూహెచ్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తున్నట్లు తెలిసింది. తొలుత జేఎన్‌టీయూ పరిధిలోని 30 కళాశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ కోర్సులను ప్రవేశపెడతారు. తర్వాత మిగతా అనుబంధ కళాశాలలకు విస్తరిస్తారు.
తర్వాత మిషన్ కాకతీయ, జలహారం
మొదట ఐటీ రంగంలోని కంపెనీల అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికల్ని మార్చి కోర్సులు ఆరంభిస్తున్న జేఎన్‌టీయూ, తర్వాత రాష్ట్ర భావి అవసరాలకు, ప్రణాళికలకు అనుగుణంగా ఇతర విభాగాల్లోనూ కొత్త అంశాలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ప్రతిష్ఠాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టు కింద లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు పెరగొచ్చనేది ప్రభుత్వ అంచనా. ఇవన్నీ స్థానిక విద్యార్థులకు దక్కాలంటే పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలని ఐటీ శాఖ భావిస్తోంది. ప్రాధాన్య ప్రణాళికలైన జలహారం, మిషన్ కాకతీయలతో పాటు తెలంగాణలో కీలకం కాబోతున్న విద్యుత్‌రంగ అవసరాలు తీర్చేందుకు వీలుగా విద్య, పాఠ్యప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేయాలని సర్కారు జేఎన్‌టీయూహెచ్ అధికారులకు సూచించినట్లు తెలిసింది.
'ప్రాథమిక ' మార్కులే ప్రధానం
ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ సాధనలోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అఖిలభారత స్థాయిలో 21వ ర్యాంకు సాధించిన రంగనాథ రామకృష్ణ ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే... మొదటి ప్రయత్నంలోనే ఈ సర్వీస్‌ సాధించటం విశేషం. తన విజయ ప్రస్థానం గురించి అతడి మాటల్లోనే...
నేను పుట్టిపెరిగింది హైదరాబాద్‌లోనే. దిల్‌సుఖ్‌నగర్‌ హైస్కూల్లో ఆరు నుంచి పదో తరగతి వరకూ చదివాను. మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్నలిద్దరూ బ్యాంకింగ్‌ రంగానికి చెందినవారు. సివిల్‌ సర్వీసెస్‌లో చేరడానికి ప్రేరణ మాత్రం మా తాతయ్య నరసయ్య నాయుడు. ఆయన డివిజనల్‌/ డిస్టిక్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా చేశారు. నిజాయతీ, చిత్తశుద్ధి లక్షణాలను ఆయన నుంచే పొందాను.
మధ్యప్రదేశ్‌ గుణలోని జేపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ & టెక్నాలజీలో బీటెక్‌- ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌ పూర్తిచేశాను. ఆ తర్వాత ఎంబీఏ- ఫైనాన్స్‌ & మార్కెటింగ్‌ను ఎస్‌డీఎం ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌, మైసూరు నుంచి చేశాను. కొన్ని క్విజ్‌ కార్యక్రమాల్లో పాల్గొని, విజయం సాధించాను.
ఉద్యోగానుభవం
ఎంబీఏ పూర్తవగానే ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బెంగళూరు, ముంబై బ్రాంచీల్లో ఏడాదిపాటు ఉద్యోగం చేశాను. ఆ తరువాత ఇన్ఫోసిస్‌, హైదరాబాద్‌లో అసోసియేట్‌ కన్సల్టెంట్‌గా చేరాను.
ఇన్ఫోసిస్‌లో నాకు సవాలుతో కూడిన ఉద్యోగం, మంచి కెరియర్‌ మార్గం దొరికాయి. కానీ, జీవితంలో సంతృప్తి కోసం సివిల్‌ సర్వీస్‌ మార్గం ఎంచుకున్నాను. ఎందుకంటే, దీని ద్వారా ప్రజలకు అతి దగ్గరగా ఉండే అవకాశం కలుగుతుంది.
మధ్యే మార్గం ఎంచుకున్నా
సివిల్స్‌ రాయాలంటే చిన్నతనం నుంచే సిద్ధమవాలి, సివిల్స్‌కు సన్నద్ధమవడానికి సంపూర్ణమైన అంకితభావం ఉండాలి, ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కు సన్నద్ధమవడం కష్టం వంటి భావనలను సాధారణంగా వింటుంటాం. నా విషయంలో వదలలేని మంచి ఉద్యోగం నాకుంది. అంతేకాకుండా దేన్నో ఆశించి, చేతిలో ఉన్న అవకాశాన్ని వదిలేసుకోకూడదనే సిద్ధాంతాన్ని నమ్మే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. దీంతో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యే మధ్యే మార్గాన్ని ఎంచుకున్నాను.
ముందుగా 'బ్రెయిన్‌ ట్రీ' సంస్థకు వెళ్లి, డైరెక్టర్‌ గోపాలకృష్ణను కలిశాను. ఉద్యోగం చేస్తూ సన్నద్ధమడంలో ఉన్న సమస్యలు, పరిమితులను ఆయన నాకు వివరించారు. అక్కడ వారాంతపు బ్యాచ్‌లో శిక్షణకోసం చేరాను. జనరల్‌ స్టడీస్‌తోపాటు ఆప్షనల్స్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రోపాలజీల్లో శిక్షణ తీసుకున్నాను. వారాంతపు బ్యాచ్‌లో చేరడం వల్ల ఉద్యోగం కొనసాగిస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యే అవకాశం లభించింది. ఉద్యోగ బాధ్యతలు, చదువులకు సమప్రాధాన్యం ఇవ్వడంలో కొంత కష్టపడ్డాను. కానీ, సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలన్న బలమైన కోరిక ముందుకు సాగేలా చేసింది. ఈ విషయంలో కుటుంబం, స్నేహితులు, ఉపాధ్యాయులు ఇచ్చిన సాయం, ప్రేరణ కీలకం.
ఇటీవల సివిల్‌ సర్వీసెస్‌ విధానంలో జరుగుతూవచ్చిన మార్పుల మూలంగా (సీశాట్‌ ప్రవేశపెట్టటం, మెయిన్స్‌లో 4 జీఎస్‌ పేపర్లు, ఆప్షనల్‌ను ఒకటికి తగ్గించటం) అనిశ్చిత స్థితి పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదిలెయ్యటం పెద్ద రిస్కు అని భావించి ఉద్యోగం చేస్తూనే పరీక్ష సన్నద్ధత కొనసాగించాను.
మన అధీనంలో లేని విషయాలపై కాకుండా నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెట్టాలనేది నా ఉద్దేశం. మెయిన్స్‌/ప్రిలిమ్స్‌ జరిగే ముందు ఎన్నో రకాల వదంతులు అంతర్జాలంలో వెల్లువెత్తుతుంటాయి. సివిల్‌ ఆశావహులు ఇలాంటివి పట్టించుకుని ప్రశాంతతను చెడగొట్టుకోవడం మంచిది కాదు.
ప్రిలిమ్స్‌ పాసై 2012లో మెయిన్స్‌కు అర్హత సాధించాను. కానీ మౌఖికపరీక్షకు అర్హత పొందలేకపోయాను. 2013లో మరో ప్రయత్నం చేశాను. ఈసారి ఇంటర్‌వ్యూకు అర్హత పొందినా తుది కటాఫ్‌ మార్కులకు 23 మార్కుల దూరంలో ఆగిపోయాను.
ఐఎఫ్‌ఎస్‌ వైపు చూపు
2013 పరీక్షలో ముఖ్యమైన మార్పు- ఐఎఫ్‌ఎస్‌, సివిల్స్‌ ప్రాథమిక పరీక్షలను (ప్రిలిమినరీ) కలపటం. 2013లో ఐఎఫ్‌ఎస్‌ పరీక్షకు హాజరు కాలేదు- సివిల్స్‌ సన్నద్ధత దెబ్బ తింటుందని. కానీ తొలి ప్రయత్నంలోనే విద్యార్థులు ఐఎఫ్‌ఎస్‌లో ఉత్తీర్ణులవుతున్న ధోరణి గమనించి 2014లో సివిల్‌సర్వీస్‌ పరీక్షతో పాటు ఐఎఫ్‌ఎస్‌కు కూడా దరఖాస్తు చేశాను.
ఐఎఫ్‌ఎస్‌ పరీక్షలో ప్రిలిమ్స్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవటం చాలా కీలకం. ఎందుకంటే దీని జనరల్‌ కేటగిరిలో కటాఫ్‌... సివిల్స్‌లో కంటే 26 మార్కులు ఎక్కువ. అంటే ప్రిలిమ్స్‌ రెండో పేపర్‌లో ఎక్కువ స్కోరు చేయటం ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌కు అర్హత పొందటానికి ముఖ్యం. మెయిన్‌ సివిల్‌ సర్వీస్‌ సిలబస్‌లో కొన్ని అంశాలు కలిసొచ్చే ఆప్షనల్‌ను ఎంచుకోవటమూ మంచిదే. దీనివల్ల జనరల్‌ స్టడీస్‌ను వేగంగా పూర్తిచేయటానికి వీలుంటుంది.
2103 నుంచి సివిల్స్‌కూ, ఫారెస్ట్‌ సర్వీస్‌కూ ఉమ్మడి ప్రిలిమినరీ ఉండటం వల్ల మొదటి పేపర్లో పర్యావరణం, వ్యవసాయం అంశాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. మెరుగైన స్కోరు కోసం వీటిని శ్రద్ధగా చదవాలి. ఐఎఫ్‌ఎస్‌లో నా ఆప్షనల్స్‌కు (వ్యవసాయ శాస్త్రం- భూగర్భశాస్త్రం) సిద్ధమవటం కోసం అంతర్జాలాన్ని విరివిగా ఉపయోగించుకున్నాను. అభివృద్ధి, పాలన, పల్లెలు, ముఖ్యంగా ప్రజలపై విభిన్న కోణాలను గ్రహించేలా చేసింది నా క్షేత్రానుభవం. మెయిన్స్‌లో, మౌఖికపరీక్షలో నా జవాబులు మెరుగ్గా తయారవటానికి ఇది ఉపకరించింది.
నమూనా ఇంటర్‌వ్యూలూ, హాజరైన సివిల్స్‌ ఇంటర్‌వ్యూ అనుభవమూ ఆత్మవిశ్వాసంతో జవాబులు చెప్పడానికి తోడ్పడ్డాయి.
అంతర్జాలంలోని వివిధ ఆధారాల నుంచి తాజా వార్తాంశాలను పొందటానికి ట్విటర్‌, ఫేస్‌బుక్‌లను ఉపయోగించుకోవాలి. అయితే- వచ్చే సమాచారాన్ని వడపోత పోయటం ముఖ్యం.
ఈలోగా ప్రైమ్‌ మినిష్టర్స్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫెలోస్‌ కోసం డిసెంబరు 2013లో ప్రకటన వెలువడింది. ప్రిలిమ్స్‌, ఆ తర్వాత వ్యాసం రాసి, ఇంటర్‌వ్యూకి కూడా హాజరయ్యాను; ఎంపికయ్యాను. 2014 మే నెల్లో PMRDFలో చేరాను.
మెట్రోలో ఐదంకెల జీతంతో సౌకర్యవంతంగా ఉండే ఇన్ఫోసిస్‌ నుంచి గ్రామీణప్రాంతానికి మారటం వల్ల దేశంలోని అత్యంత వెనకబడిన ప్రాంతాల్లోని జిల్లా అధికారవర్గంతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. నా విధుల్లో భాగంగా లభించిన క్షేత్ర అనుభవం... అభివృద్ధి, పాలన, పల్లెలు, ముఖ్యంగా ప్రజలపై విభిన్న కోణాలను గ్రహించేలా చేసింది.
మెయిన్స్‌లోనూ, నా మౌఖికపరీక్షలోనూ నా జవాబులు మెరుగ్గా తయారవటానికి ఈ అనుభవం ఉపకరించింది.
విధి నిర్వహణ కొనసాగిస్తూనే అఖిలభారత సర్వీస్‌ సాధించగలిగానంటే అది సరైన సమయ నిర్వహణ వల్లనే. నిరంతరం, స్థిరంగా చదివే పద్ధతిని అనుసరించాను. మనసు, శరీరాలపై పడే భారం తగ్గించుకోవడానికి సినిమాలు చూడటం; స్నేహితులతో బయటకు వెళ్ళటం; ఇతర పుస్తకాలూ, కామిక్సూ చదవటం చేశాను.
ప్రిలిమ్స్‌కు చదివిన పుస్తకాలు
ప్రిలిమినరీలో ప్రాథమిక భావనలపై పట్టు అవసరం. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యంగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనమిక్స్‌. పాలిటీకి లక్ష్మీకాంత్‌, మోడర్న్‌ ఇండియా బై స్పెక్ట్రమ్‌, ఇండియన్‌ ఎకానమీ బై రమేష్‌ సింగ్‌, జాగ్రఫీకి గో చోంగ్‌, పర్యావరణానికి ఐసీఎస్‌ఈ, పాత ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఉపయోగం.
ఇంటర్వ్యూ కోసం...
ఐఎఫ్‌ఎస్‌ ఇంటర్‌వ్యూ కోసం, వివిధ చట్టాలపై హైలెవెల్‌ కమిటీ ఇటీవలి నివేదిక చదివాను. ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌, పీఈఎస్‌ఏ, పర్యావరణానికీ, అడవులకీ సంబంధించిన వివిధ చట్టాలను అవగాహన చేసుకున్నాను. వ్యక్తిగత వివరాలూ, రాష్ట్రం, దేశం గురించీ పటిష్ఠంగా తయారవ్వాలి. వీటినుంచే దాదాపు ప్రశ్నలన్నీ వస్తాయి.
యూపీఎస్‌సీ ఇంటర్‌వ్యూ కోసం హాజరైన నమూనా ఇంటర్‌వ్యూలూ, సివిల్స్‌లో అసలైన ఇంటర్‌వ్యూ అనుభవమూ నేను ఆత్మవిశ్వాసంతో జవాబులు చెప్పడానికి తోడ్పడ్డాయి. బోర్డు సభ్యులు స్నేహపాత్రంగా ఉండటంతో మొదట్లో ఏ మూలనో ఉన్న ఒత్తిడి మాయమైపోయింది. నేను చదివిన కామిక్స్‌ గురించీ, ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ యాక్ట్‌, ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌, ఐసీడీఎస్‌, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సర్వీసెస్‌, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌, దేశంలోని వివిధ రకాల అడవుల గురించీ ప్రశ్నలు అడిగారు. పీఎంఆర్‌డీఎఫ్‌లో నా విధులూ, సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపులూ, భారతీయ పురాణాలకూ పర్యావరణ పరిరక్షణకూ ఉన్న సంబంధం; స్థిర అభివృద్ధి, పర్యావరణ ఉద్యమాల్లో మహిళల పాత్ర... ఈ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి.
అభ్యర్థులకు సూచనలు
* సన్నద్ధత సమయంలో అంతర్జాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. నెట్‌లోని వివిధ ఆధారాల నుంచి తాజా వార్తాంశాలను పొందటానికి ట్విటర్‌, ఫేస్‌బుక్‌లను ఉపయోగించుకోవాలి. అయితే వచ్చే సమాచారాన్ని వడపోత పోయటం తెలుసుకోవాలి.
* ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమ్స్‌లో నెగ్గటం సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో నెగ్గటం కంటే కష్టం. కటాఫ్‌ మార్కులు ఎక్కువ ఉండటమే దీనికి కారణం.
* ప్రిలిమినరీలోని పేపర్‌-2లో అత్యధిక మార్కులు తెచ్చుకోవాలి.
* ప్రిలిమినరీకి సంబంధించిన ప్రాథమిక పుస్తకాలు సివిల్స్‌కూ, ఐఎఫ్‌ఎస్‌కూ ఒకటే.
* పరీక్షల్లో చాలా ఉపయోగకరమైన పర్యావరణ అంశంపై ప్రిలిమినరీలో శ్రద్ధ చూపటం ప్రధానం.
* నమూనా ఇంటర్‌వ్యూలు గానీ, యూపీఎస్‌సీ నిర్వహించే ఇంటర్‌వ్యూలు గానీ అభ్యర్థులకు ఎప్పుడూ ఉపయోగకరమే.
* వైఫల్యం ఎదురైతే నిరాశపడిపోకూడదు. పొరపాట్లనుంచి నేర్చుకోవాలి గానీ, ప్రయత్నాన్ని విరమించుకోకూడదు.
ఏడాదిలోగా విద్యాశాఖలో ఖాళీలు భర్తీ
* డీఎస్సీకి సమయం పడుతుంది
* పాఠశాలల హేతుబద్ధీకరణ ఉండదు
* 'ఈనాడు' ప్రత్యేక ముఖాముఖిలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
ఈనాడు, హైదరాబాద్: 'తెలంగాణ'లో విద్యావ్యవస్థ దారుణంగా దిగజారింది. క్రమపద్ధతిలో తప్పకుండా మెరుగు పర్చగలమని నమ్ముతున్నాను. దీనికి కాస్త సమయం పడుతుంది. ప్రజల భాగస్వామ్యంతో తప్పకుండా సమస్యల్ని పరిష్కరిస్తాం. తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో తలెత్తుకునేలా ప్రమాణాల్ని మెరుగుపరుస్తాం. వచ్చే ఏడాదిలోపు విద్యాశాఖలోని అన్ని ఖాళీలనూ భర్తీ చేస్తాం. డీఎస్సీకి కాస్త సమయం పడుతుంది అని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఆయన 'ఈనాడు ముఖాముఖి'లో మాట్లాడారు.
ప్రశ్న: గతంలో విద్యామంత్రిగా చేశారు. మళ్లీ ఆ శాఖకే వచ్చిన నేపథ్యంలో శాఖ పనితీరు ఎలా ఉంది?
జవాబు: శాఖ పనితీరు చాలా బాధగా ఉంది. ఉమ్మడిరాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో విద్యావ్యవస్థను నాశనం చేశారు. అధికారులను, సిబ్బందిని తప్పుపట్టను. వారిలో స్ఫూర్తి నింపే నాయకత్వం సరిగ్గా లేక ఇలా తయారైంది. విద్యాశాఖ నాకిష్టమైన శాఖ. ఈ సిబ్బందితోనే అద్భుతాలు సృష్టించి చూపిస్తాం.
ప్రశ్న: ప్రమాణాల మెరుగుదలకు మీ కార్యాచరణ ఏంటి?
జవాబు: మా శాఖలో ప్రతి అధికారికీ లక్ష్యాలు నిర్దేశించాం. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభానికి ఆయా విభాగాధిపతులు తమతమ విభాగాల పనితీరు మెరుగు పర్చటానికి లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రాబోతున్నారు. అందులో ప్రమాణాల పెంపు కూడా భాగమే.
ప్రశ్న: కేజీ నుంచి పీజీపై ప్రభుత్వానికే ఇంకా స్పష్టత లేనట్లుంది?
జవాబు: కేజీ నుంచి పీజీపై విధానపత్రం రూపొందిస్తున్నాం. ప్రజల ముందుకు వెళ్లేముందు మేం స్పష్టత తెచ్చుకుంటున్నాం. కొంత ఆలస్యమైనా.. తొందరపడదలచుకోలేదు. ఈ పథకాన్ని సఫలం చేసి చూపిస్తాం. దీనితో ప్రభుత్వ స్కూళ్లలో నమోదు పెరిగే అవకాశముంది.
ప్రశ్న: ఆది నుంచే ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యమంటే తెలుగు పరిస్థితేంటి?
జవాబు: తెలుగుకు అన్యాయం చేయాలని ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితులల్లో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి. ప్రాథమికస్థాయిలో తెలుగులోనే బోధన సాగే అవకాశముంది. తర్వాత ఆంగ్లమాధ్యమంలోకి మారినా... తెలుగును విస్మరించే సమస్య లేదు.
ప్రశ్న: విద్యాశాఖలో బోలెడన్ని ఖాళీలున్నాయి. వాటి భర్తీ ఎప్పుడు?
జవాబు: ఖాళీలున్న మాట నిజం. గత ప్రభుత్వాలు తాత్కాలిక పద్ధతిలో బండి లాగేయడంతో అనేక సమస్యలొచ్చాయి. తాత్కాలిక పద్ధతిలో చేస్తున్నవారు చాలాకాలంగా ఉన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా క్రమబద్ధీకరణ చేయటమెలా అని చూస్తున్నాం. ఆ తర్వాతే ఖాళీలపై స్పష్టత వస్తుంది. వాటన్నింటినీ గరిష్ఠంగా ఏడాదిలోపు భర్తీ చేస్తాం.
ప్రశ్న: డీఎస్సీ పరిస్థితి?
జవాబు: డీఎస్సీ వేస్తాం. కాకుంటే కాస్త సమయం పడుతుంది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ తర్వాత ఖాళీలపై స్పష్టత వస్తుంది. అనంతరం డీఎస్సీపై నిర్ణయం ఉంటుంది. ఉపాధ్యాయ విద్యను ముందు మెరుగు పరచాలి. డైట్లలో పరిస్థితి బాగోలేదు. ఉపాధ్యాయులకే బోధకుల్లేరు. గత ప్రభుత్వాలదే ఈ తప్పంతా. ఉపాధ్యాయ విద్యలో సమూల మార్పులు తేబోతున్నాం.
ప్రశ్న: హేతుబద్ధీకరణతో పాఠశాలలు మూతపడతాయని, పోస్టులు తగ్గిపోతాయనే ఆందోళన ఉంది?
జవాబు: ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేయం. కేజీ నుంచి పీజీ పథకం తీసుకొచ్చినా... ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను, ఉద్యోగులను ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తున్నాం. దీనిపై ఎవరికీ ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు.
ప్రశ్న: ఈసారీ ఉపాధ్యాయుల సేవా నిబంధనల్ని (సర్వీస్‌రూల్స్) ఏకీకృతం చేస్తారా?
జవాబు: వీటిపై ఉపాధ్యాయుల మధ్య విభేదాలున్నాయి. వారందరినీ పిలిచి నిర్ణయం తీసుకోవాలి. సమస్య పరిష్కారమైతే వారికే లాభం. ప్రమోషన్లు వస్తాయి. ఎవరికీ ఇబ్బంది కలగకుండా పరిష్కరించటానికి ప్రయత్నిస్తా.
ప్రశ్న: విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులెప్పుడు?
జవాబు: ఆ ప్రక్రియను వేగవంతం చేశాం. సెర్చి కమిటీలు త్వరలో రాబోతున్నాయి.
ప్రశ్న: ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలపై ఏమైనా కరుణ చూపిస్తారా?
జవాబు: మేము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడచుకున్నామంతే. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని కళాశాలల వివరాలు వెబ్‌సైట్‌లో స్పష్టంగా పెడతాం. విద్యార్థులే మంచి కళాశాలలను ఎంచుకుంటారు.
ప్రశ్న: ఎంసెట్ భవితవ్యం ఏంటి?
జవాబు: దీనిపై భిన్నమైన వాదనలున్నాయి. వాటిని పరిశీలించాక స్పందిస్తా.
ఎంసెట్ నిర్వహణపై ఏం చేద్దాం!
* రెండు విడతలుగా మంత్రి గంటాతో చర్చించిన ఏపీ సీఎం చంద్రబాబు
* 23న మరోసారి భేటీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర హక్కులు కాపాడుకుంటూ..విద్యార్థుల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని ఎంసెట్, ఇతర వృత్తివిద్య ప్రవేశపరీక్షల నిర్వహణపై నిర్ణయాలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రబాబుతో ఫిబ్రవరి 21న రెండు విడతలుగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ పరీక్షల నిర్వహణ కోసం ప్రకటన జారీ వివరాలు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడిగానే తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు జరపాలని పట్టుదలతో ఉన్న ఏపీ నిర్ణయం ఎలా ఉండబోతుందన్న దానిపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు చేరుకున్న మంత్రి గంటా శ్రీనివాసరావు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రితో ఉదయం చర్చించారు. సాయంత్రం ఉన్నత, న్యాయశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులతో కలిసి మరోవిడత చంద్రబాబును కలిశారు. ఈ రెండు సందర్భాల్లో పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హక్కులను కాపాడుకోవాల్సిందేనని.. ఉమ్మడిగానే పరీక్షలు జరపలేమా అన్న దానిపైనే సీఎం ప్రధానంగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం కారణంగా ఒక విషయంలో మెతకదనంగా వ్యవహరిస్తే.. మిగిలిన అన్ని అంశాల్లోనూ ప్రతికూల పరిస్థితులే ఎదురవుతాయన్న విధంగా సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. న్యాయ నిపుణులు సైతం రాష్ట్రానికే పూర్తి అధికారాలు ఉన్నాయని సీఎంకు నివేదించారు. దీనిపై జాప్యం జరిగేకొద్దీ విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోందని.. దీనిని తొలగించాల్సిన అవసరం కూడా ఉందని పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతుందన్నది వాస్తవమే.. ఆలోచనకు కాస్త సమయం తీసుకుందాం.. నిశితంగా అధ్యయనం చేయండి.. ఫిబ్రవరి 23న మళ్లీ కలుద్దామని పేర్కొన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతా కార్యకలాపాలను ఎస్‌బీహెచ్ స్తంభింప చేయడంపై త్వరలో హైకోర్టులో జరగనున్న విచారణ విషయం కూడా చర్చకు వచ్చింది.
మే14న తెలంగాణ ఎంసెట్!
* ఫిబ్రవరి 25న ప్రకటన విడుదల
* 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ
* అన్నీ ఆన్‌లైన్లోనే; ధర రూ.250
* పరీక్ష పద్ధతిలో మార్పుల్లేవు
* తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్, వ్యవసాయ-మెడికల్ ప్రవేశ పరీక్ష (ఎంసెట్) నిర్వహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి మరో అడుగు ముందుకేసింది. ఫిబ్రవరి 28 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఈనెల 25న దీనికి సంబంధించిన ప్రకటన విడుదలవుతుంది. మే 14న పరీక్ష జరిగాక... మే 28న ర్యాంకుల్ని విడుదల చేస్తారు. తెలంగాణలో ఎంసెట్ నిర్వహణను జేఎన్‌టీయూ హైదరాబాద్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే! తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డి, జేఎన్‌టీయూహెచ్ ఉపకులపతి శైలజా రామయ్యర్ సారథ్యంలో ఎంసెట్ కమిటీ శుక్రవారం సమావేశమై పరీక్షకు సంబంధించిన కీలకాంశాలపై చర్చించి ప్రధాన తేదీలను ఖరారు చేసింది. తర్వాత విలేకరులకు వివరాల్ని వెల్లడించారు. సిలబస్ తదితర వివరాలన్నీ 25న ప్రకటనతో వెలువరిస్తామని, వెబ్‌సైట్‌లో అన్ని వివరాల్ని పొందుపరుస్తామని ఎంసెట్ కన్వీనర్ ఆచార్య రమణారావు తెలిపారు. పరీక్ష పద్ధతిలో ఈసారి ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే...160 మార్కులకు విడివిడిగా ఇంజినీరింగ్, వ్యవసాయ-మెడికల్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. ఇంజినీరింగ్‌లో గణితం-80 మార్కులు, భౌతికశాస్త్రం- 40; రసాయనశాస్త్రం-40 మార్కులకు ఉంటుంది. వైద్య విద్య ప్రవేశపరీక్షలో జంతు, వృక్ష, భౌతిక, రసాయన శాస్త్రాలన్నీ 40 మార్కుల చొప్పునుంటాయి. ర్యాంకు నిర్ధారణలో గతంలో మాదిరిగానే... ఇంటర్మీడియెట్ మార్కులకు 25శాతం ప్రాధాన్యం (వెయిటేజీ) ఇస్తారు. ఎంసెట్‌లో 75శాతం, ఇంటర్‌లోని 25శాతం మార్కుల్ని లెక్కగట్టి...ర్యాంకుల్ని నిర్ధారిస్తారు. ప్రవేశ పరీక్షలో 25శాతం మార్కుల్ని కనీస ఉత్తీర్ణతార్హతగా నిర్ధారించారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఇది వర్తించదు. పరీక్షకు రెండు రోజుల ముందటి దాకా ఆన్‌లైన్ దరఖాస్తుల్ని (రూ.10వేల ఆలస్య రుసుముతో) స్వీకరించటం విశేషం. ఇలా చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకునే వారికి అప్పటికప్పుడు హైదరాబాద్/సికింద్రాబాద్‌ల్లో మాత్రమే పరీక్ష కేంద్రాల్ని కేటాయిస్తారు. ఎంసెట్ దరఖాస్తు ఖరీదు రూ.250గా ఉంచినట్లు సమాచారం.
కోరితే ఆంధ్రలోనూ పరీక్ష కేంద్రాలు....
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 పట్టణాల్లో ఎంసెట్ నిర్వహణకు నిర్ణయించారు. ఆదిలాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్‌లతో పాటు హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో ఎనిమిది కేంద్రాలుంటాయి. వీటికి అదనంగా... కొత్తగూడెం, కోదాడల్లోనూ పరీక్ష కేంద్రాలు ఆరంభించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. వీటి గురించి త్వరలోనే నిర్ణయం తీసుకొంటారు. ఆర్మూర్ కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించారు. తెలంగాణలోని కళాశాలల్లో ప్రవేశం పొందాలనుకునే వారు తప్పనిసరిగా ఈ ఎంసెట్ రాయాల్సి ఉంటుందని పాపిరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఆంధ్రలో ఎలాంటి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయలేదనీ... అంతా ఇక్కడికే వచ్చి రాయాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరితే మాత్రం అక్కడ కేంద్రాల ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలికి చట్టబద్ధత లేదన్న ఆంధ్ర వాదనను ప్రస్తావించగా... 'అసలిప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికే చట్టబద్ధత లేదు అని పాపిరెడ్డి స్పందించారు. 'అయినా వారితో గొడవపడాలనేది మా ఉద్దేశం కాదు. వ్యవహారం న్యాయస్థానంలో తేలుతుంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్ట ప్రకారం మేం నడచుకుంటున్నాం. 371డి ప్రకారం... 15 శాతం ఓపెన్‌మెరిట్ కోటాను కొనసాగిస్తాం. ఆంధ్ర విద్యార్థులకూ అందులో అవకాశముంటుంది అని పాపిరెడ్డి స్పష్టం చేశారు.
మొత్తం 2.5 లక్షల మంది....
ఈసారి ఎంసెట్‌కు తెలంగాణ నుంచి సుమారు లక్షా 80వేలపైగా దరఖాస్తులు వస్తాయని ఆశిస్తున్నట్లు కన్వీనర్ రమణారావు తెలిపారు. ఆంధ్ర నుంచి సుమారు 70వేల మంది రాస్తారని అనుకుంటున్నామన్నారు. మొత్తంమీద 2.5లక్షల మంది దాకా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చనేది తమ అంచనా అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల విద్యార్థులు విడివిడిగా ఇంటర్మీడియెట్ పరీక్షలు రాయబోతున్న నేపథ్యంలో... ర్యాంకుల నిర్ధారణ ఎలా చేస్తారనే ప్రశ్నకు... 'గతంలోనూ ఇలా వేరే బోర్డు విద్యార్థులు (సీబీఎస్ఈ) ఎంసెట్ రాశారు. వారి విషయంలో ఎలా చేశారో ... ఏపీ విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తాం. అవసరమైతేనే సాధారణీకరణ (నార్మలైజేషన్) ప్రక్రియ గురించి ఆలోచిస్తాం అని జేఎన్‌టీయూహెచ్ ఉపకులపతి శైలజా రామయ్యర్ వివరించారు.
ఎంసెట్ కీలక తేదీలు...
ప్రకటన విడుదల: ఫిబ్రవరి 25న
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణఐ: ఫిబ్రవరి 28 నుంచి
దరఖాస్తుల దాఖలు చివరి తేదీ: ఏప్రిల్ 9
దరఖాస్తుల్లో వివరాల సవరణ: ఏప్రిల్ 15 నుంచి 20 దాకా
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు: ఏప్రిల్ 15 దాకా
రూ.1000 ఆలస్య రుసుముతో: ఏప్రిల్ 22 దాకా
రూ.5000 ఆలస్య రుసుముతో: మే 5దాకా
రూ.10వేల ఆలస్య రుసుముతో: మే 12దాకా
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: మే 8 నుంచి మే 12 దాకా
ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ: మే 14న
పరీక్ష వేళలు:ఇంజినీరింగ్ స్ట్రీమ్: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
మెడికల్ స్ట్రీమ్: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు
ప్రాథమిక కీ విడుదల: మే 16
కీ పై అభ్యంతరాల స్వీకరణ: మే 23 వరకు
ర్యాంకుల ప్రకటన: మే 28న
'మెయిన్స్‌' వెయిటేజీపై అయోమయం
* ఇంటర్‌ రెండో ఏడాది మార్కులా? రెండేళ్ల మార్కులా?
* ఏవి పరిగణనలోకి తీసుకుంటారో?
* లక్షలాది విద్యార్థుల్లో సందిగ్ధం
ఈనాడు, హైదరాబాద్‌: ఎన్‌ఐటీల్లో, ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చే విషయంపై ఈసారీ సందిగ్ధత వీడటం లేదు. ఇందుకు ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సర మార్కుల్ని పరిగణనలోకి తీసుకుంటారా? రెండేళ్ల మార్కుల్ని కలిపి వెయిటేజీ ఇస్తారా.. అన్నది వేలాది విద్యార్థులను వేధిస్తోంది. దీనిపై ఇంటర్‌ బోర్డు అధికారులు ఏమైనా స్పష్టత ఇస్తారనుకుంటే వారూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో 2013 నుంచి పలుమార్పులు చేశాక జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. మిగతా 60 శాతం మెయిన్స్‌ మార్కులకు కేటాయిస్తున్నారు. అయితే సీబీఎస్‌ఈలో 11వ తరగతికి బోర్డు పరీక్షలుండవు. అంటే 12వ తరగతి మార్కులకే 40 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. అదే తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఇంటర్‌కు రెండేళ్లు పబ్లిక్‌ పరీక్షలుంటాయి. మొదటి ఏడాది ఎంపీసీ విద్యార్థులకు 470, రెండో సంవత్సర ప్రయోగ పరీక్షల (ప్రాక్టికల్స్‌)కు 60 మార్కులు కలుపుకొని మొత్తం 530 మార్కులుంటాయి. కొత్తగా వెయిటేజీ పెట్టినందున విద్యార్థులు నష్టపోతారని 2013లో రెండో సంవత్సర మార్కుల్నే పరిగణనలోకి తీసుకున్నారు. తర్వాతి నుంచి రెండేళ్ల మార్కులకు కలిపి వెయిటేజీ ఉంటుందని విద్యార్థులు కష్టపడి మొదటి సంవత్సరంలో మంచి మార్కులు తెచ్చుకున్నారు. రెండోసంవత్సరంలో ప్రాక్టికల్స్‌ ఉంటాయి. అంతేకాక జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌, ఎంసెట్‌, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధం అవుతుంటారు. అందువల్ల ఒత్తిడికారణంగా రెండో సంవత్సరంలో మార్కులు కొంత తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే విచిత్రంగా సీబీఎస్‌ఈ అధికారులు మాత్రం 2014లో సైతం రెండో ఏడాది మార్కులకే వెయిటేజీ ఇచ్చారు. దాంతో కంగుతినడం తెలుగు విద్యార్థుల వంతైంది.
ఈసారీ ఉత్కంఠేనా?: జేఈఈ మెయిన్స్‌ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కలుపుకొని సుమారు 30 వేల సీట్లుంటాయి. వాటిలో కనీసం 25 శాతం సీట్లు తెలుగు విద్యార్థులే దక్కించుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మెయిన్స్‌కు సుమారు లక్షన్నర మంది రాస్తున్నారు. జాతీయస్థాయిలో పోటీ ఉంటున్నందున ప్రతి మార్కూ కీలకమే. ఒక్క మార్కు వెనకబడినా ర్యాంకు మారిపోవడం ఖాయమన్నది నిపుణులు చెబుతున్నారు. అందుకు మెయిన్స్‌ ప్రారంభించి ఇది మూడో సంవత్సరం అయినందున రెండేళ్ల మార్కులకు కలిపి వెయిటేజీ ఇస్తారా? గత ఏడాది మాదిరే రెండో సంవత్సర మార్కులను పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోంది. ముఖ్యంగా తొలి సంవత్సరంలో మంచి మార్కులు వచ్చిన వారిలో మరింత ఆందోళన కనిపిస్తోంది. శిక్షణ సంస్థల నిపుణులు, వాటి నిర్వాహకులు సైతం విద్యార్థుల సందేహాలను తీర్చలేకపోతున్నారు.
మేమూ మాట్లాడతాం
జేఈఈ మెయిన్స్‌కు ఏ మార్కుల్ని పరిగణనలోకి తీసుకుంటారన్నది సీబీఎస్‌ఈ వెల్లడించాలి. ఎందుకంటే ఆ పరీక్షను ఆ బోర్డే నిర్వహిస్తుంది. మేం అడిగినా ఆ బోర్డు స్పందిస్తుందా అన్నది చెప్పలేం. ఇది వేలాది విద్యార్థులకు చెందిన వ్యవహారం కాబట్టి మేం కూడా సీబీఎస్‌ఈ అధికారులతో మాట్లాడతాం. విద్యార్థులకు స్పష్టత ఇచ్చేందుకు మా వంతు కృషిచేస్తాం.
------ శైలజా రామయ్యర్‌, తెలంగాణ ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి
మా రాష్ట్రంలో కొత్త కాలేజీలకు అనుమతులొద్దు!
* ఇప్పటికే ఎక్కువయ్యాయ్
* ప్రభుత్వ రంగంలోనైతే సరే..
* ఏఐసీటీఈకి స్పష్టంచేయనున్న తెలంగాణ!
ఈనాడు, హైదరాబాద్: వృత్తి, ఉన్నత విద్యలో నాణ్యతపై దృష్టిపెట్టిన తెలంగాణ ప్రభుత్వం... కొత్తగా రాష్ట్రంలో ఎలాంటి ప్రైవేటు కళాశాలలకు అనుమతులు మంజూరు చేయకూడదంటూ కేంద్రాన్ని కోరాలని యోచిస్తోంది. వృత్తి విద్యా కళాశాలలకు అనుమతులిచ్చే అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)కి, ఫార్మా కళాశాలను చూసే... ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)కు ఈ మేరకు లేఖ రాయబోతోందని సమాచారం. ప్రతి ఏడాది మాదిరిగానే రాష్ట్రంలో కళాశాలల స్థితిగతులు... భవిష్యత్ అవసరాలపై కేంద్రం ఈ సారి కూడా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కోరింది. అయితే ఏటా దీన్ని అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ... వృత్తి విద్యలో ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యలో నాణ్యతను పెంచాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం... ఇప్పటికే సదుపాయాలు, బోధన సిబ్బంది సరిగ్గా లేని కళాశాలలపై వేటు వేసింది. జేఎన్‌టీయూ హైదరాబాద్ పరిధిలోని 143 కళాశాలలకు ఈ ఏడాదికి అనుబంధ గుర్తింపునివ్వని సంగతి తెలిసిందే. వీటిని తీసేయగా కూడా వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోవటం గమనార్హం! ఈ నేపథ్యంలో... వచ్చే విద్యాసంవత్సరం తమ రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు వృత్తి విద్య కళాశాలకు అనుమతులు ఇవ్వవద్దని ఏఐసీటీఈకి స్పష్టంచేయాలని ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏటా రాష్ట్రంలోని వృత్తి విద్య కళాశాలల నుంచి 3 లక్షలపైగా విద్యార్థులు పట్టభద్రులై బయటకు వస్తున్నారని ప్రభుత్వం గుర్తుచేస్తోంది.
రాజకీయ ఒత్తిళ్ళు, అనూహ్య పరిణామాలేమైనా జరిగితే తప్ప... ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు ఏఐసీటీఈకి లేఖ పంపే అవకాశాలున్నాయి. ప్రైవేటు రంగంలో కొత్త కళాశాలలు వద్దంటున్న ప్రభుత్వం... తమ ఆధీనంలో మాత్రం కొత్త వాటికి అవకాశం ఇవ్వాలని కోరుతోందని సమాచారం. కొత్త కళాశాలలు ఈ ఏడాదికి గుర్తింపు పొందటానికి ఈ నెల 27 దాకా ఏఐసీటీఈ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖ రాస్తుండటం గమనార్హం.
త్రిశంకు స్వర్గంలో 20 వేల మంది
* గడువు ముగిసినా అందని డీఎస్సీ అభ్యర్థుల వివరాలు
* జిల్లా కార్యాలయంలో ఇవ్వని దరఖాస్తు ప్రతి
* విద్యాశాఖ తర్జనభర్జనలు
ఈనాడు-హైదరాబాద్‌: డీఎస్సీ-2014 (ఏపీ టెట్‌-కమ్‌-టీఆర్టీ)కు వచ్చిన 4.20 లక్షల దరఖాస్తుల్లో ఇరవైవేల మందికి సంబంధించిన పూర్తి సమాచారం విద్యాశాఖకు అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతర్జాలంలో పంపిన దరఖాస్తు ప్రతిని తప్పనిసరిగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నేరుగా అందజేయాలి. రాత పరీక్షల సమయంలో చూసిరాతల లాంటి అక్రమాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ వెల్లడించింది. దరఖాస్తుల ప్రతిని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరవేసే గడువు ఫిబ్రవరి 5వ తేదీతో ముగిసినప్పటికీ సుమారు 20వేల మంది అభ్యర్థుల సమాచారం అందలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
అభ్యర్థులు అంతర్జాలంలో ఒకటికి మించి దరఖాస్తులు పంపినందువల్ల ఇలా జరిగిందా? అర్హతలు లేదా ధ్రువపత్రాలు లేక పంపలేదా? అన్న దానిపై అధికారులు పరిశీలన జరుపుతున్నారు. దరఖాస్తు ప్రతిని జిల్లా కేంద్రంలో నేరుగా అందజేయాలన్న విషయం తెలియక కొందరు కేవలం అంతర్జాలంలోనే దరఖాస్తు చేసి మిన్నకుండిపోయారని భావిస్తున్నారు. తొలుత జిల్లా కేంద్రంలో నేరుగా దరఖాస్తు ప్రతిని అందజేయాలని... కొద్దిరోజుల అనంతరం తపాలా ద్వారా పంపినప్పటికీ సరిపోతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడైనా పొరబాట్లు జరిగాయా అన్న దానిపైనా పరిశీలన జరుగుతోంది. జిల్లా కేంద్రాల నుంచి ఈ తరహా అభ్యర్థుల వివరాలను పంపాలని అధికారులను విద్యాశాఖ కోరింది. ఫిబ్రవరి 18న దీనిపై హైదరాబాద్‌ నుంచి ఉన్నతస్థాయిలో ప్రత్యక్ష ప్రసార సమావేశం జరిగింది. మరోసారి అభ్యర్థులకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. అప్పటికీ అభ్యర్థుల నుంచి వివరాలు రాకుండా ఉంటే అటువంటి వారికి హాల్‌టిక్కెట్లను పంపకపోవచ్చు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో భారీగా దరఖాస్తులు
తూర్పుగోదావరి జిల్లాలో గరిష్ఠంగా 48,558, పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లాలో కనిష్ఠంగా 16,358 మంది దరఖాస్తు చేశారు. మొత్తం 4,20,408 మంది దరఖాస్తు చేశారు. విద్యాశాఖ తరపున 1849 స్కూల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు, లాంగ్వేజ్ పండిట్స్‌-812, పీఈటీ-156, ఎస్జీటీ-6244 పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేశారు. మున్సిపల్‌ శాఖ తరపున 184 స్కూల్‌ అసిస్టెంట్స్‌, లాంగ్వేజి పండిట్స్‌ గ్రేడ్‌ 2-214, పీఈటీ 41, ఎస్జీటీ కింద 813 పోస్టులు ప్రకటించారు. విద్యాశాఖ, మున్సిపల్‌ శాఖల తరపున మొత్తం 7,057 ఎస్జీటీ పోస్టులు ప్రకటించగా 61,331 మంది దరఖాస్తు చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ కింద 2033 పోస్టులను ప్రకటించగా దరఖాస్తుల సంఖ్య రెండు లక్షలు దాటింది.
5 కి.మీ. పరుగుకు స్వస్తి!
* మానసిక నిపుణులతో ఇంటర్వ్యూలు
* తెలంగాణ పోలీసు నియామకాల్లో సంస్కరణలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న ఈ ప్రతిపాదనలకు త్వరలోనే అనుమతి వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఏటా నియామకాలు జరిగే కొద్ది ప్రభుత్వ శాఖల్లో పోలీసు శాఖ కూడా ఒకటి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో అమలు పరిచిన నియామక ప్రక్రియ యావత్ దేశానికీ ఆదర్శంగా నిలిచింది. చాలా రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షలు నిర్వహించేవారు. ఫలితాల వెల్లడిలో కూడా పారదర్శకంగా వ్యవహరించేవారు. గత కొన్నేళ్లుగా ఎక్కడా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రాకపోవడానికి ఇదే కారణం. రాష్ట్ర విభజన తర్వాత దీన్ని మరింత శాస్త్రీయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ముఖ్యంగా వివాదాస్పదమైన 5 కి.మీ. పరుగు పందేన్ని తొలగిస్తున్నారు. ఈ పరుగు వల్ల అనేక మంది నిరుద్యోగులు మరణించారు. ఉద్యోగార్థుల నుంచి భారీగా వచ్చే దరఖాస్తులను వడపోసే ఉద్దేశంతోనే ఈ పరుగుపందెం నిర్వహించేవారు. కానీ, ఈ పరుగులో అనేక మంది అకాల మృత్యువాత పడుతుండడంతో దీన్ని తొలగించాలన్న డిమాండ్ ఉమ్మడి రాష్ట్రంలోనూ తెరపైకి వచ్చింది. తాజాగా దాన్ని తొలగించాలని తెలంగాణ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. పోలీసు ఉద్యోగానికి శారీరక దారుఢ్యం కూడా ముఖ్యం కాబట్టి 5 కి.మీ.లను 3 కి.మీ.లకు తగ్గించాలని, అది కూడా మిగతా పరీక్షలు పూర్తయిన తర్వాత చివర్లో నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో తొలుత ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి తుది పరీక్ష పెడతారు. ఇందులోనూ ఉత్తీర్ణులైన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారికి చివరిగా మానసిక నిపుణులతో ఇంటర్వూలు నిర్వహిస్తారు. వీటిలో విజయం సాధించిన వారిని ఎంపిక చేస్తారు. ఈ ప్రతిపాదనలన్నీ ఇప్పటికే ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్నాయి. త్వరలోనే వీటికి ఆమోదం లభించవచ్చని భావిస్తున్నారు.
ఉన్నతవిద్యపై కేంద్రీకృత నియంత్రణ!
* కేంద్రప్రభుత్వం కసరత్తు
* నాలుగు బిల్లులకు తుదిరూపు
* పార్లమెంటు సమావేశాల్లో ఆమోదానికి ప్రయత్నాలు
ఈనాడు, దిల్లీ: ఉన్నతవిద్యారంగంలో ఒక కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థను నెలకొల్పటానికి కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యాసంస్థల గుర్తింపు నుంచి విద్యార్థుల మార్కుపత్రాల డిజిటలీకరణ వరకూ వివిధ అంశాలపై గట్టి నిబంధనలను రూపొందిస్తోంది. ఈ మేరకు ఉన్నతవిద్యకు సంబంధించిన 4 బిల్లులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ తుదిరూపునిచ్చింది. ఫిబ్రవరి 23 నుంచి మొదలయ్యే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లుల ఆమోదానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నించనుంది. ఈ బిల్లుల వివరాలు..
జాతీయ గుర్తింపు నియంత్రణ బిల్లు: కొత్తగా ఏర్పాటయ్యే ఉన్నత విద్యాసంస్థలు కచ్చితంగా మూడేళ్లలోపు అన్ని నిబంధనలను నెరవేర్చి గుర్తింపు తెచ్చుకోవాలి. వైద్యకళాశాలలకైతే ఈ వ్యవధి ఐదేళ్లు. ఈలోపు గుర్తింపు లభించకపోతే విద్యాసంస్థలు తిరిగి కొత్తగా ఏర్పాటుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ విద్యాసంస్థలను ఈ బిల్లు పరిధిలో చేర్చలేదు.
జాతీయ అకాడమీ డిపాజిటరీ బిల్లు: దేశవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సులను పూర్తి చేసిన విద్యార్థుల మార్కుల పత్రాలను, ఆయా విద్యార్థుల 'ప్రవర్తన ధ్రువీకరణపత్రాలను' డిజిటలీకరించి భద్రపరచటానికి ఈ బిల్లు వీలుకల్పిస్తుంది. ఈ భారీప్రాజెక్టును తొలుత కేంద్రం నిర్వహించే విద్యాసంస్థలతో ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు, విశ్వవిద్యాలయాలకు విస్తరిస్తారు.
దూరవిద్య బిల్లు: ఈ బిల్లు ప్రకారం.. రాష్ట్రప్రభుత్వచట్టం కింద ఏర్పాటయ్యే విశ్వవిద్యాలయాలు తమ పరిధిలో మాత్రమే దూరవిద్య కోర్సులను అందజేయాలి. ఉదాహరణకు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక విశ్వవిద్యాలయం తెలంగాణ తప్ప ఇతర రాష్ట్రాల విద్యార్థులకు దూరవిద్య కోర్సులను అందజేయటానికి వీలుండదు. దేశవ్యాప్తంగా దూరవిద్యను అందించే సాధికారికత 'ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం' (ఇగ్నో)కు మాత్రమే ఉంటుంది.
ఐఐఎం బిల్లు: ఐఐఎంలు ఇక మీదట ఎంబీఏ పట్టాలను అందించటానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 13 ఐఐఎంలు రెండేళ్ల డిప్లొమా కోర్సులను మాత్రమే అందిస్తున్నాయి. డిప్లొమా కారణంగా ఐఐఎం విద్యార్థులు ఫెలోషిప్‌నకు, కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు.
జాతీయ దృక్పథం అవసరం.. స్మృతిఇరానీ: ఈ బిల్లులపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతిఇరానీ 'ఈనాడు' ప్రతినిధితో మాట్లాడుతూ.. ''ఉన్నతవిద్యను అభ్యసించే విద్యార్థులు ఒక రాష్ట్రానికే పరిమితం కారు. వేర్వేరు రాష్ట్రాల్లో వారి విద్యాభ్యాసం కొనసాగుతుంటుంది. ఒక విద్యార్థి తన సొంతరాష్ట్రాన్ని దాటుకొని వచ్చి వేరే రాష్ట్రంలో చదువుకుంటున్నప్పుడు ఎలాంటి ఇబ్బందికి గురికాకుండా ఒక జాతీయ దృక్పథాన్ని తీసుకురావల్సి ఉంది. దీనికోసం కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థ అవసరం. నాలుగు బిల్లులు పార్లమెంటు ఆమోదం పొంది చట్టాలుగా మారిన తర్వాత.. రాష్ట్రప్రభుత్వాలు అంగీకరిస్తేనే అవి సరిగా అమలవుతాయి'' అని చెప్పారు.
పోస్టుల భర్తీకి మేం అడ్డంకి కాదు
* తెలంగాణ సర్కారుకు కమలనాథన్ లేఖ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ఖాళీల భర్తీకి తామెంత మాత్రం అడ్డంకిగా లేమని ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన సలహా సంఘం ఛైర్మన్ కమలనాథన్ తెలంగాణ సర్కారుకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికానందునే పోస్టుల భర్తీకి ఆలస్యం అవుతున్నట్టుగా కొంత మంది నాయకులు పేర్కొనటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఒక లేఖ రాసినట్టు సమాచారం. తాము విభజించేది కేవలం రాష్ట్ర స్థాయి పోస్టులు మాత్రమేనని, భారీ సంఖ్యలో ఉండే జిల్లా, జోనల్, స్థానిక పోస్టులతో తమకు సంబంధమే లేదని ఆలేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి లక్షకు పైచిలుకు పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా సర్కారు ఇప్పటికే ప్రకటించింది. దీంతో లక్షల మంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. మరో వైపు రాష్ట్ర స్థాయి పోస్టులు, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో.. కమలనాథన్ కమిటీ చేస్తున్న జాప్యం కారణంగా.. పోస్టుల భర్తీకి ఆలస్యం అనివార్యమవుతోందంటూ వస్తున్న విమర్శలు ఆయనకు ఆవేదన కలిగించాయి. ఈ నేపథ్యంలోనే సీఎస్‌కు లేఖ రాయాల్సిన పరిస్థితికి దారితీసినట్లు తెలుస్తోంది. ఉభయ రాష్ట్రాలకు విభజించాల్సిన ఉద్యోగుల్లో సగం మంది పోలీసులే కాగా వారి విభజనలో ప్రస్తుతం ప్రతిబంధకాలు ఏర్పడి ఉద్యోగుల పంపిణీకి మరికొంత సమయం పట్టే అవకాశముంది. విభజన పూర్తయ్యాకే పోస్టుల భర్తీని చేపట్టనుంటే మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. దీంతో నిరుద్యోగులు కమలనాథన్‌ను కారకులుగా పరిగణించే అవకాశం ఉన్నందున ఆయన స్పందించినట్టు అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి.
కొనసాగింపునకే అవకాశం?
సలహా సంఘం ఛైర్మన్‌గా కమలనాథన్ పదవి ఈ మార్చి 28తో ముగుస్తుంది. ఉద్యోగుల విభజన ప్రక్రియ త్వరలో మొదలుకానున్న దశలో ఛైర్మన్‌గా మళ్లీ కేంద్ర ప్రభుత్వం ఆయన్నే కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సింగరేణిలోకొలువుల జాతర
* నిరుద్యోగులకు అపార అవకాశాలు
* మొదటి విడతగా 1178 పోస్టుల భర్తీ
గోదావరిఖని, న్యూస్ టుడే: సింగరేణిలో కొలువుల జాతర మొదలైంది. చాలా సంవత్సరాల తర్వాత 1178 ఖాళీలను భర్తీ చేసేందుకు సింగరేణి ప్రకటన విడుదల చేసింది. స్థానికత ఆధారంగా కొన్ని ఉద్యోగ నియామకాలను రిజర్వు చేయగా, మరి కొన్ని స్థానికేతరులకు కూడా ఈ ఉద్యోగాల్లో అవకాశం కల్పించనున్నారు. సింగరేణిలో ప్రస్తుతం విడుదల చేసిన నియామక ప్రకటనలో 1178 ఖాళీల్లో, 811 ఖాళీలు కేవలం మైనింగ్‌ డిప్లొమా ఉద్యోగాలకే కావడం విశేషం. అర్హత గల ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 25 వరకు ఆన్‌లైన్‌లో తమ పూర్తి వివరాలను అప్‌లోడ్‌ చేసిన తర్వాత హార్డ్‌కాపీని మార్చి 4లోపు ఖమ్మం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం. జనరల్‌ మేనేజర్‌ (పర్సనల్‌) రిక్రూట్‌మెంటు సెల్‌ విభాగానికి చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు విద్యార్హతలు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలను జత చేసి అందజేయాలి. భారీ స్థాయిలో ఖాళీల నియామకానికి ప్రకటన విడుదల చేసిన సింగరేణి ఉద్యోగార్థుల కోసం మార్గదర్శనం చేస్తూ 'న్యూస్‌టుడే' అందిస్తున్న ప్రత్యేక కథనం..
* అండర్‌మేనేజర్‌
హోదా: మేనేజ్‌మెంటు ట్రైనీ (మైనింగ్‌)
ఖాళీలు: 100 (స్థానికత ఆధారంగా 60)
జీతం శ్రేణి: ఈ-2 గ్రేడ్‌, కనీస మూల వేతనం రూ.20,600 సీనియారిటీ ఆధారంగా రూ.46500 పెరుగుతుంది.
విద్యార్హత: బీఈ, బీటెక్‌ (మైనింగ్‌) లేదా సమానమైన చదువు. 55 శాతం మార్కులు
విధులు: గని ప్రణాళిక. గనిలో పని విధానం. కింది స్థాయి ఉద్యోగులతో సక్రమంగా పనులు చేయించడం, గనిలో పని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ దానికి అనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలి. గనుల చట్టం ప్రకారం పనులు చేయిస్తుండాలి. గనుల పర్యవేక్షక విధి. నియామక పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: వెంటిలేషన్‌, మిషనరీ, పని విధానం. ప్రథమ చికిత్స, గనుల చట్టం, గనుల సర్వేతో పాటు లెజిస్లేషన్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి.
* అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ అండ్‌ ఎం)
హోదా: మేనేజ్‌మెంటు ట్రైనీ (ఇంజినీరింగ్‌, మెకానికల్‌)
ఖాళీలు: 67 (స్థానికత ఆధారంగా 41)
జీతం శ్రేణి: ఈ-2 గ్రేడ్‌, కనీస మూల వేతనం రూ.20,600 నుంచి సీనియారిటీ ఆధారంగా రూ.46500 వరకు
విద్యార్హత: బీఈ, బీటెక్‌, ఏఎంఐఈ (ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌) 55 శాతం మార్కులు
విధులు: ఏరియా వర్క్‌షాపుల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్లుగా పని చేయాలి. ఎలక్ట్రికల్‌ అయితే విద్యుత్తు సరఫరా. గనుల్లో మోటార్లకు అవసరమైన విద్యుత్తును సరఫరాకు పర్యవేక్షణ. కింది స్థాయి సాంకేతిక సిబ్బందితో పనులు చేయించాల్సి ఉంటుంది. అదే మెకానికల్‌ ఇంజినీర్‌ అయితే యంత్రాల పనితీరు. గనులు, వర్క్‌షాపుల్లో మోటార్లకు సంబంధించిన పర్యవేక్షణ చేయాలి.
నియామక పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించి సర్క్యూట్‌, ఏసీ, డీసీ కరెంటుకు సంబంధించిన అంశాలపై పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వనున్నారు. దీంతో పాటు సాధారణ ఐక్యూ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. అదే మెకానికల్‌కు వచ్చే సరికి యంత్రాలకు సంబంధించిన మోటార్లు, వాటి పని విధానానికి సంబంధించిన అనుబంధ ప్రశ్నలు పరీక్షల్లో అడుగుతారు.
* అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌)
హోదా: మేనేజ్‌మెంటు ట్రైనీ (సివిల్‌)
ఖాళీలు: 10 (స్థానికత ఆధారంగా 6)
జీతం శ్రేణి: ఈ-2 గ్రేడ్‌, కనీస మూల వేతనం రూ.20,600 నుంచి సీనియారిటీ ఆధారంగా రూ.46,500 పెరుగుతుంది.
విద్యార్హత: బీఈ, బీటెక్‌ (సివిల్‌). 55 శాతం మార్కులు
విధులు: నిర్మాణాలకు సంబంధించిన కట్టడాల పర్యవేక్షణ. నీటి సరఫరా. నిర్మాణాల్లో నాణ్యత పరీక్షలు. శానిటరీ పైపులైను, నీటి సరఫరా పైపులైన్‌ నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలు. ముఖ్యంగా నిర్మాణాలపై పర్యవేక్షణ.
నియామక పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: సివిల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించిన అంశాలపై అనుబంధ ప్రశ్నలు. భవన నిర్మాణాలు, ఇతర సౌకర్యాలకు సంబంధించిన నిర్మాణాల ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై ప్రశ్నలు ఇవ్వనున్నారు.
* సంక్షేమాధికారులు (వెల్ఫేర్‌ ఆఫీసర్‌)
హోదా: మేనేజ్‌మెంటు ట్రైనీ (పర్సనల్‌)
ఖాళీలు: 40 (స్థానికత ఆధారంగా 24)
జీతం శ్రేణి: ఈ-2 గ్రేడ్‌. కనీస మూల వేతనం రూ.20,600 నుంచి సీనియారిటీ ఆధారంగా రూ.46,500 పెరుగుతుంది.
విద్యార్హత: పీజీ, మేనేజ్‌మెంటు పీజీ, పీజీ డిప్లొమా, హెచ్‌.ఆర్‌., ఇండస్ట్రీయల్‌ రిలేషన్స్‌, పర్సనల్‌ మేనేజ్‌మెంటు, ఎంఎస్‌డబ్ల్యూ., ఎంహెచ్‌ఆర్‌డి, ఎంబీఏ (హెచ్‌ఆర్‌.), 60 శాతం మార్కులు.
విధులు: కార్మికుల సంక్షేమం.. సీఎంపీఎఫ్‌ ప్రయోజనాల అంశంపై సంబంధిత శాఖతో సంప్రదింపులు, సంస్థ విధి విధానాలపై కార్మికులకు అవగాహన కలిగించే పనులు. విధులకు హాజరు కాని కార్మికులకు కౌన్సెలింగ్‌, సెలవులు, సిక్‌, మెడికల్‌ సిక్‌ల వినియోగంలో కార్మికులకు వర్తించే వాటికి సహకరిస్తుంటారు.
నియామక పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: పర్సనల్‌ మేనేజ్‌మెంటు, సోషియాలజీ, కార్మిక చట్టాలు, పారిశ్రామిక సంబంధాలు, ఆర్థిమెటిక్‌, రీజనింగ్, జనరల్‌ ఇంగ్లిషు, జనరల్‌ నాలెడ్జ్‌, ఐక్యూలలో ప్రశ్నలు అడుగుతారు.
* గణాంకాధికారి (అకౌంట్స్‌ ఆఫీసర్‌)
హోదా: మేనేజ్‌మెంటు ట్రైనీ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)
ఖాళీలు: 18 (స్థానికత ఆధారంగా 11)
జీతం శ్రేణి: ఈ-2 గ్రేడ్‌. కనీస మూలవేతనం రూ.20,600 నుంచి రూ.46,500 పెరుగుతుంది.
విద్యార్హత: సీఏ, ఐసీడబ్ల్యూఏ
విధులు: బిల్లుల తయారీ. కార్మికుల వేతనాలు చెల్లింపు జాబితాలు. సంస్థ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన లెక్కలు. వసూలు చసే బిల్లులు. చెల్లింపులు.
పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: అకౌంట్స్‌, ఆడిట్‌కు సంబంధించిన అనుబంధ ప్రశ్నలు. లాభ నష్టాలు, రెవెన్యూ. పారిశ్రామిక చట్టాలు. మార్కెటింగ్‌, వడ్డీలు, పన్నులకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.
* మైనింగ్‌ సూపర్‌వైజర్‌
హోదా: జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీర్‌ ట్రైనీ
ఖాళీలు: 811 (స్థానికత ఆధారంగా 648)
జీతం శ్రేణి: ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగి, కనీస మూలవేతనం రూ.19,035
విద్యార్హత: మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా
విధులు: గనిలో పని చేసే సిబ్బందికి సూపర్‌వైజర్‌గా బాధ్యతలు నిర్వహించాలి. డీజీఎంఎస్‌, గనుల చట్టాన్ని అనుసరించి కింది స్థాయి సిబ్బందితో పనులు చేయించాలి. కోల్‌ మైన్స్‌ రెగ్యులేషన్‌ చట్టం-43 ప్రకారం తన బాధ్యతలు గుర్తించి విధులు నిర్వహిస్తారు.
పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: ప్రథమ చికిత్స. ఫైర్‌గ్యాస్‌. వాటర్‌. వెంటిలేషన్‌. గనుల చట్టాలు. గనుల సర్వేకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
* అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ (మెకానికల్‌)
హోదా: అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ
ఖాళీలు: 72 (స్థానికత ఆధారంగా 58)
జీతం శ్రేణి: ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగి, కనీస మూల వేతనం రూ.19,035
విద్యార్హతలు: మెకానికల్‌ డిప్లొమా ఇంజినీరింగ్‌
విధులు: గనుల్లో యంత్రాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. కింది స్థాయి సాంకేతిక సిబ్బందితో యంత్రాలు నిలిచిపోకుండా పనులు చేయించాలి. సాంకేతిక సిబ్బందికి సూపర్‌వైజర్‌ బాధ్యతలు నిర్వహిస్తారు.
నియామక పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: మెకానికల్‌ విభాగానికి సంబంధించిన అనుబంధ ప్రశ్నలు. యంత్రాల పనితీరు. వాటికి విద్యుత్తు సరఫరా ఇచ్చే ఏసీ, డీసీ విధానంపై సాంకేతిక ప్రశ్నలు ఇవ్వనున్నారు.
* అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ (ఎలక్ట్రికల్‌)
హోదా: అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ
ఖాళీలు: 60 (స్థానికత ఆధారంగా 48)
జీతం శ్రేణి: ఎన్‌సీడబ్ల్యూఏ, టెక్నికల్‌ స్పెషల్‌ గ్రేడ్‌, కనీస మూలవేతనం రూ.19,035
విద్యార్థలు: ఎలక్ట్రికల్‌ డిప్లొమా, ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా
విధులు: కార్మిక వాడల్లో గృహ అవసర విద్యుత్తు సరఫరా పర్యవేక్షణ. గనులకు విద్యుత్తు సరఫరా. యంత్రాలకు విద్యుత్తు సరఫరా అందుతుందా అన్న విషయాల్లో పర్యవేక్షణ.
నియామక పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు: ఎలక్ట్రికల్‌కు సంబంధించిన అనుబంధ అంశాలు. విద్యుత్తు సరఫరా, ఏసీ, డీసీ, హెచ్‌టీతో పాటు ఇతర విద్యుత్తుకు సంబంధించిన ప్రశ్నలను పరీక్షల్లో అడుగుతారు.
* వయో పరిమితి 30 ఏళ్లు
ప్రస్తుతం ప్రకటించిన ప్రతి ఉద్యోగానికి 30 ఏళ్ల వయో పరిమితిని నిర్ధారించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రం మరో 5 ఏళ్లు సడలింపునిచ్చారు. జనరల్‌ కేటగిరి అభ్యర్థులైతే 30 ఏళ్ల వయో పరిమితి ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 35 ఏళ్ల వరకు ఉంటే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* రాత పరీక్షే ప్రామాణికం
సింగరేణిలో తొలిసారిగా ఒకే ఒక్కసారి రాత పరీక్షతోనే ఉద్యోగానికి ఎంపిక చేయనున్నారు. గతంలో రాత పరీక్ష తర్వాత మౌఖిక పరీక్షలు నిర్వహించే విధానానికి స్వస్తి పలికిన సింగరేణి ఈ సారి మాత్రం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేయనున్నారు. ఇందులో స్థానికత, సామాజిక వర్గాల వారిగా రిజర్వేషన్‌ను అమలు చేయనున్నారు. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఉద్యోగాల్లో అమలు చేయనుంది.
* మైనింగ్‌ కోర్సుకు తిరుగులేదు - మార్కండేయ, జేఎన్టీయూహెచ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌.
ప్రతి ఏటా మైనింగ్‌ ఇంజినీరింగ్‌, మిషనరీ నుంచి 90 మంది విద్యార్థులు బయటకు వస్తుంటారు. అదే విధంగా డిప్లొమా మైనింగ్‌ నుంచి కూడా 180 మంది విద్యార్థులు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం సింగరేణిలో భారీగా మైనింగ్‌ ఇంజినీరింగ్‌, డిప్లొమాకు సంబంధించిన ఉద్యోగ ఖాళీల నియమకానికి ప్రకటన విడుదల చేశారు. గతంలో సింగరేణితో పాటు ఇతర ప్రాంతాల్లోని బొగ్గు పరిశ్రమల్లో మైనింగ్‌ విద్యార్థులు పనిచేస్తున్నారు. ఒకప్పుడు సివిల్‌కు డిమాండ్‌ ఉండేది. కానీ ప్రస్తుతం మైనింగ్‌ను మించిన కోర్సు లేదు. సింగరేణిలో వచ్చిన అవకాశాన్ని రెండు, మూడేళ్లుగా బయటకు వచ్చిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకునే అవకాశం కలిగింది.
* పారదర్శకంగా నియామకాలు - మల్లయ్యపంతులు, జీఎం, సింగరేణి పర్సనల్‌.
ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పాటిస్తాం. అవకతవకలకు ఎలాంటి ఆస్కారం ఉండడు. అభ్యర్థులు దళారులను ఆశ్రయించి మోసపోకండి. ప్రతిభ ద్వారానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పైరవీకారులను ఆశ్రయించి మోసపోకుండా పరీక్షలపై దృష్టి పెట్టి చదివితే తప్పకుండా విజయం సాధిస్తారు. ఎవరైన పైరవీల పేరుతో అభ్యర్థులను మోసం చేసే ప్రయత్నం చేస్తే తమకు సమాచారం ఇవ్వండి. తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటాం. సింగరేణిలో ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ పోస్టుకు గతంలో ఎన్నడు ఎంబీఏ ఫైనాన్స్‌ విద్యార్హతకు అవకాశం ఇవ్వలేదు.
మార్కుల చదువులు మారాలి
* సృజనాత్మక, వృత్తి విద్య పెరగాలి
* ఆలోచన, శోధన పెంచాలి
* ఉపాధ్యాయుల చేతుల్లోనే రెండు రాష్ట్రాల భవిత
* ఈనాడుతో టెక్సాస్ వర్సిటీ ఆచార్యుడు జేఎన్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ఆయన తల్లిదండ్రులు అక్షరాస్యులు కారు... ఇంటి నుంచి హైస్కూల్ దాటినవారెవరూ లేరు... చిన్నతనంలోనే పొలంపని చేశారు! కష్టపడి హన్మకొండలో ట్యూషన్లు చెప్పుకొని చదువుకున్నారు. అదీ... తెలుగు మాధ్యమంలోనే!
ఇప్పుడాయనే...
అమెరికాలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో పేరొందిన అధ్యాపకుల్లో ఒకరయ్యారు! ప్రతిష్ఠాత్మక యూఎస్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో సభ్యులు కూడా. ఆయన రాసిన పుస్తకాల్ని ప్రపంచవ్యాప్తంగా ఎందరో విద్యార్థులు చదువుకొంటున్నారు! ఆయనే... జేఎన్‌రెడ్డిగా పేరొందిన జొన్నత్తుల నారాయణరెడ్డి
టెక్సాస్ ఎ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో అత్యున్నత ఆచార్యుడిగా పనిచేస్తున్న జేఎన్‌రెడ్డి ఓ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల విద్యావిధానంలో రావాల్సిన మార్పులు, మన ఇంజినీరింగ్ విద్య తీరుతెన్నులు, నైపుణ్యాలు, మాతృభాష-ఆంగ్ల మాధ్యమం... తదితరాంశాలపై ఈనాడుతో ఆయన మాట్లాడారు.
మార్కుల చదువులు మారాలి
ఇటీవల మన దేశ విద్యార్థులు అనేకమంది డిగ్రీలు చేతపట్టుకొని అమెరికాకు వస్తున్నారు. కొన్నేళ్ల కిందట అక్కడికి వచ్చేవారిలో ఎంతో అంకితభావం, క్రమశిక్షణ ఉండేది. ఇప్పటివారిలో పరిశోధన దృష్టే కనిపించటం లేదు. అందుకే కొత్తగా ప్రస్థానం ఆరంభించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు చదువులపై మొట్టమొదట దృష్టిపెట్టాలి. ఎందుకంటే అవే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రస్తుతం మన విద్యావిధానంలో పరీక్షల్ని ఎలా ఎదుర్కోవాలి? మార్కులెలా తెచ్చుకోవాలనే దానిపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాం. అలాకాక విషయాల్ని అర్థం చేసుకోవటం; వాటిని ఆచరణలో ప్రయోగాత్మకంగా గమనించి తెలుసుకునే దిశగా విద్యా ప్రణాళిక రూపొందాలి. పాఠాలను రోజంతా రుబ్బుతూ పోవటం వల్ల సృజనకు చోటే ఉండటం లేదు. నిజానికి సృజనాత్మక, వృత్తివిద్యలను పాఠశాలల్లోనే మొదలెట్టాలి. అమెరికన్ విద్యావిధానంలో ఆలోచించే, ప్రశ్నించే, శోధించే తత్వం అధికం. అందుకే వారు పరిశోధనల్లో ముందున్నారు.
గురువుల చేతుల్లోనే రాష్ట్రాల భవిత...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బంగారు భవిష్యత్‌ను నిర్మించాలన్నా, చెడగొట్టాలన్నా ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. కేవలం మార్కులు సంపాదించేవారిని కాక, భావి సమాజాన్ని మార్చే బుర్రల్ని, మేథావుల్ని తయారుచేయాలనే స్పృహ ప్రతి గురువులో ఉండాలి. ఇంటర్మీడియెట్ స్థాయిలోపే సొంతంగా ఆలోచించేలా, పదిమందితో కలిసి మెలిగేలా, చక్కగా మాట్లాడేలా వారిని తీర్చిదిద్దాలి. చదివేది ఏదైనా భిన్నంగా ఆలోచించే శక్తిసామర్థాలు మెరుగైతేనే మంచి బతుకుతెరువు ఉంటుంది.
గుడ్డిగా ఆంగ్లాన్ని ప్రోత్సహించొద్దు...
భాషకు, ఆలోచనకు సంబంధముంది. నేను తెలుగులోనే చదువుకున్నా. గుడ్డిగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. అలాగని పూర్తిగా వదిలేయమనీ కాదు. అవసరార్థం ఆంగ్లం నేర్వాల్సిందే. కానీ ప్రాథమిక దశలో మాతృభాష చాలా కీలకం.
హార్వర్డ్, ఎంఐటీలూ ప్రైవేటే...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో దాదాపు 800 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయంటున్నారు. వీటిలో ప్రైవేటువే ఎక్కువట.. అక్కడ హార్వర్డ్, ఎంఐటీలు కూడా ప్రైవేటువే! కానీ వాటి ప్రధాన లక్ష్యం నాణ్యతే. ప్రైవేటు కాలేజీలుండటం, అవి లాభాన్ని ఆశించటంలో తప్పేం లేదు. కానీ అవి సమాజ సేవ బాధ్యతను మరవకూడదు. కానీ ఇక్కడి కాలేజీలు ఎక్కువగా పరీక్షలు పాసయ్యే విద్యార్థులను తయారుచేస్తున్నాయి. ఆ ధోరణి మారాలి. పరిశ్రమల సమస్యలపై తరగతి గదుల్లో చర్చించి, విద్యార్థులతో పరిష్కారాలు సూచించేలా చూడాలి.
ఐటీతో శాస్త్రరంగానికి దెబ్బ...
ఐటీ రంగం సైన్స్ రంగాన్ని కొంతమేరకు దెబ్బతీసింది. ఎందుకంటే తెలివైన విద్యార్థులు ఎందరో ఐటీ రంగంలోకి వెళ్ళారు. వారు తెలివికి, చేసే పనికి పొంతన లేకుండా ఉంది. వారు శాస్త్రరంగంలో ఉంటే మంచి శాస్త్రవేత్తలు తయారయ్యేవారు. మేధోపరంగా విద్యార్థులను పరిశోధన, సైన్స్ వైపు ప్రోత్సహించగలిగే వ్యవస్థను పాఠశాల స్థాయిలోనే రూపొందించాలి.
ఐటీ వలసలపై...
మెకానికల్, సివిల్... ఇలా చదివేది ఏదైనా చివరకు ఐటీ రంగం వైపు మళ్లుతున్నారు. దీని వెనక డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంది. మిగిలిన రంగాల్లో ఉద్యోగావకాశాలు తక్కువ. ఐటీ రంగంలో కొద్దిపాటి శిక్షణతో నెట్టుకు రాగలుగుతున్నారు. అందుకే తయారీ రంగంలో ముందుగా భారత్ బలం పెంచుకోవాలి. అప్పుడు వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ఇంజినీరింగ్‌లోని ఇతర శాఖల పాఠ్య ప్రణాళికను అవసరాలకు అనుగుణంగా సమాజానికి అనుసంధానించేలా మార్చాలి. ఇంజినీరింగేతర కోర్సుల్లోనూ సంపదను సృష్టించే మార్గాల్ని అన్వేషించాలి.
తొలిసారే గెలిచేదెలా?
ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించే పోటీ పరీక్షల్లో యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, గేట్‌ ప్రధానమైనవి. వీటిలో తొలి ప్రయత్నం (21- 22 ఏళ్ళ వయసులో)లోనే విజయం సాధిస్తే మంచి ఉద్యోగంతోపాటు భవిష్యత్తులో అత్యున్నత హోదాకు చేరుకోవచ్చు. సరైన ప్రణాళిక, కార్యాచరణలకు సానుకూల దృక్పథం తోడైతే ఇదంతా సాధ్యమే!
ఒక అభ్యర్థి నాలుగైదు ప్రయత్నాల్లో సాధించినపుడు తాను విఫలమైన ప్రతి ప్రయత్నం నుంచీ గుణపాఠం నేర్చుకుంటాడు. సబ్జెక్టుపై కొంత నూతన పునాది వేసుకుంటాడు. తొలి ప్రయత్నాల్లో నేర్చుకున్న సారాంశం, మలి ప్రయత్న విజయానికి దోహదపడుతుంది. మరి మొదటి ప్రయత్నంతో సాధించాలంటే? ఈ పూర్తి అనుభవ పాఠాలను ముందుగా అర్థం చేసుకోవాలి. ఆచరించాలి.
డిగ్రీ పొందడం ఎంతో తేలిక. కారణం- విశ్వవిద్యాలయాలు విద్యార్థులను ఆయా పరీక్షల్లో ఉత్తీర్ణులు చేయడానికి ప్రయత్నిస్తాయి. తక్కువ సంఖ్యలో ఉండే ఉద్యోగ ఖాళీలకు ఎక్కువమంది అభ్యర్థులు పోటీ పడతారు. కాబట్టి పోటీ పరీక్షలు నిర్వహించే సంస్థలు అభ్యర్థులను అనర్హులను చేయడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి విశ్వవిద్యాలయ పరీక్షలకూ పోటీ పరీక్షలకూ సిలబస్‌లో తేడా, పరీక్ష విధానంలో తేడా ముందు అర్థం చేసుకోవాలి. పోటీ పరీక్షల్లోని ప్రశ్నల సరళి విభిన్నం. ఇంజినీరింగ్‌ చదివే మూడో సంవత్సరం నుంచే ఈ ప్రధాన మార్పులపై దృష్టిపెట్టి చదవాలి.
ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌)
వయసు: పరీక్ష రాసే సంవత్సరపు ఆగస్టు 1వ తేదీకి 21- 30 సంవత్సరాలు. కొన్ని కేటగిరీల అభ్యర్థులకు కొంత సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు: ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ సమాన అర్హత. ఎంఎస్‌సీ/ తత్సమానం.
ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (2013 ఆధారంగా) ప్రతి పేపర్‌లో సాధించాల్సిన కనీస మార్కులు:
ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాలు: 15% (30/200)
కన్వెన్షనల్‌ ప్రశ్నపత్రంలో కమ్యూనిటీ మార్కుల శాతం:
జనరల్‌ 20% (30/200) ఓబీసీ 15% (30/200)
ఎస్‌సీ & ఎస్‌టీ 10% (20/200) పీహెచ్‌ 10% (20/200)
ఏదైనా ఒకటి/ అన్ని ప్రశ్నపత్రాల్లో కనీస నిర్ణయాత్మక మార్కులు నిర్దేశించే విచక్షణాధికారం సర్వీస్‌ కమిషన్‌కు ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అన్ని పేపర్లకూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువమంది అభ్యర్థులు జనరల్‌ ఎబిలిటీ పేపర్‌పై శ్రద్ధ పెట్టరు. ఇది సరి కాదు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తెలుగు మీడియం అభ్యర్థులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాల్లో అర్హతా మార్కులు వస్తేనే కన్వెన్షనల్‌ జవాబు పత్రాలు దిద్దుతారు.
జనరల్‌ కేటగిరిలో ఇంజినీరింగ్‌ విభాగం మౌఖిక పరీక్షకు అర్హత పొందిన ఆఖరి అభ్యర్థి మార్కులు (1000 మార్కులకుగాను)
సివిల్‌: 352, మెకానికల్‌: 418 ఎలక్ట్రికల్‌: 367
ఎలక్ట్రానిక్స్‌ & టెలికమ్యూనికేషన్స్‌: 482
తుది ఎంపికకు నిర్ణయించిన కనీస మార్కులు
జనరల్‌ కేటగిరిలో ఇంజిన ీరింగ్‌ విభాగం తుది ఎంపికకు ఆఖరి అభ్యర్థి మార్కులు (1200 మార్కులకు గాను)
సివిల్‌: 511, మెకానికల్‌: 584 ఎలక్ట్రికల్‌: 531
ఎలక్ట్రానిక్స్‌ & టెలికమ్యూనికేషన్స్‌: 636
తుది ఎంపికకూ, మౌఖిక పరీక్ష అర్హతకూ సుమారుగా 150 మార్కుల తేడా ఉంటోంది. మౌఖిక పరీక్షలో మార్కులు కనిష్ఠ స్థాయిలో 40 నుంచి 50 వరకూ, గరిష్ఠ స్థాయిలో 150 నుంచి 160 వరకూ వస్తుంటాయి. అంటే అభ్యర్థి ఇంటర్‌వ్యూలో కనిష్ఠ స్థాయి మార్కులు దృష్టిలో పెట్టుకుని రాత పరీక్షపై శ్రద్ధ పెట్టాలి. మౌఖికపరీక్షలో 150 మార్కులు వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి రాతపరీక్షలోని కనీస మార్కుకి 100 మార్కులు తమ కేటగిరీలో కలుపుకుని ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడే కచ్చితంగా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
ఆబ్జెక్టివ్‌ టెక్నికల్‌ పేపర్లలో ప్రశ్నల తీరు
* ఈ విభాగానికి కాలిక్యులేటర్లను అనుమతించరు.
* ఫార్ములాలు, వాస్తవ విషయాలకు సంబంధించినవి 15%
* అసర్షన్‌, రీజనింగ్‌ 8 - 10%
* జతపరిచే ప్రశ్నలు 10%
* ప్రాథమిక, మౌలిక అంశాలకు సంబంధించినవి 40%
* అప్లికేషన్స్‌కు సంబంధించినవి 25%
* ఇటువంటి ప్రశ్నల ద్వారా సబ్జెక్టుపై పట్టునూ, విశ్లేషణ సామర్థ్యాన్నీ పరీక్షిస్తారు.
ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాల్లో 120 ప్రశ్నలకు సమయం 120 నిమిషాలు. ఓఎంఆర్‌ షీటులో 120 సమాధానాలు బ్లాక్‌ పెన్నుతో గుర్తించాలంటే కనీసం 12 నిమిషాలు పడుతుంది. మిగిలినవి 108 నిమిషాలు అంటే ఒక ప్రశ్నకు కేవలం 54 సెకన్లు. కాబట్టి 120 ప్రశ్నలు ఎవరూ చేయలేరు. 90 ప్రశ్నల వరకూ లక్ష్యంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాలకు సంబంధించి తయారీ విస్తృతంగా ఉండాలి. కన్వెన్షనల్‌కి సంబంధించి ఎంపిక చేసుకున్న అంశాలను కేంద్రీకృతంగా చదవాలి.
యూపీఎస్‌సీ నిర్వహిస్తున్న సివిల్‌ సర్వీస్‌, ఫారెస్ట్‌ సర్వీస్‌ పరీక్షల పేపర్లను రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌, గేట్‌ పాత పేపర్లు, ఇతర ప్రభుత్వ రంగ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
రుణాత్మక మార్కులున్నాయ్‌
ప్రతి తప్పు సమాధానానికీ కేటాయించిన మార్కుల్లో 1/3 వంతు తగ్గిస్తారు. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రంలో 120 ప్రశ్నలకు 200 మార్కులు. అంటే ప్రతి ప్రశ్నకూ 5/3 మార్కులు. తప్పు సమాధానానికి 5/9 రుణాత్మక మార్కులు. కొన్ని ప్రశ్నలకు ఎలిమినేషన్‌ విధానంలో జవాబులు రాబట్టవచ్చు. అయితే ఎలాంటి క్లూ దొరకని ప్రశ్నలను వదిలేయడమే మంచిది.
కన్వెన్షనల్‌ ప్రశ్నల తీరు
* ముఖ్యమైన డెరివేషన్స్‌
* విశ్లేషణాత్మక థియరీ ప్రశ్నలు
* న్యూమరికల్‌ ప్రశ్నలు
జనరల్‌ ఇంగ్లిష్‌: తెలుగు మీడియం విద్యార్థులు తగిన జాగ్రత్తలు వహించాలి. వ్యాకరణం, అర్థాలు, వ్యతిరేక అర్థాలు, వాక్యపూరణం, కాంప్రహెన్సివ్‌ ప్యాసెజెస్‌ మీద సాధన చేయాలి. English by Wren & Martin చాలా ఉపయోగపడుతుంది.
పోటీ స్థాయి ఎలా?
2013లో 702 ఉద్యోగాలు ఇచ్చారు. 2,11,184 మంది దరఖాస్తు చేశారు. కానీ 78,794 మంది మాత్రమే పరీక్ష రాశారు. అంటే సుమారుగా మూడోవంతు పోటీ పడ్డారు. పోటీస్థాయి 1: 112. వీరిలో కూడా సీరియస్‌ పోటీదారులు 1.20
గ్రాడ్యుయేట్లు సాధించగలరా?
2013లో ఉత్తీర్ణత సాధించిన పట్టభద్రులు సుమారుగా 630 అంటే 90% మంది గ్రాడ్యుయేట్లు.
ద్వితీయ శ్రేణి విద్యార్థులు సాధించగలరా?
2013లో 3.5% మంది ద్వితీయ శ్రేణి విద్యార్థులే. అంటే ఎటువంటి వ్యతిరేక ఆలోచన లేకుండా పోటీ పడవచ్చు.
అదనపు సూచనలు
* ఏదైనా ఒక గత ప్రశ్నపత్రం తీసుకుని సమయానుగుణంగా పరీక్ష రాస్తే తన ప్రస్తుత స్థాయి తెలుస్తుంది. దాన్ని బట్టి ఎంతవరకు సన్నద్ధమవాలో అంచనాకు రావచ్చు.
* ఆఖరి అభ్యర్థుల మార్కుల శాతం చూస్తే (సివిల్‌ 42.6%, మెకానికల్‌ 48.7%, ఎలక్ట్రికల్‌ 44.3%, ఎలక్ట్రానిక్స్‌ 53%) జనరల్‌ కేటగిరీలోనే ఎంత సులభమో అర్థమవుతుంది. మొదటి ర్యాంకర్‌ మార్కుల శాతం చూస్తే మరింత ధైర్యం వస్తుంది.
* 100% సిలబస్‌ చదవాల్సిన అవసరం లేదు. 80% చక్కగా అర్థం చేసుకుని దానిలో 60% మార్కులు సాధిస్తే టాప్‌ ర్యాంకర్‌ కావచ్చు.
* ఏమి చదవాలో, ఏం చదవకూడదో సరిగా నిర్ణయించుకున్నవారే విజేతలు!
* దొరికిందల్లా చదవకూడదు. ప్రామాణిక పుస్తకాలు మాత్రమే చదవాలి.
* గత ప్రశ్నలననుసరించి సబ్జెక్టులు, అంశాలకు సన్నద్ధతలో ప్రాముఖ్యమివ్వాలి.
* ప్రతి సబ్జెక్టుకీ సంక్షిప్తంగా, సూక్ష్మంగా నోట్సు పది పేజీలలోపు తయారు చేసుకోవాలి. దీనివల్ల పునశ్చరణ (రివిజన్‌) సులభమవుతుంది.
* ముగ్గురు/ నలుగురు బృందంగా చదివితే తేలిక.
* సీనియర్ల, అనుభవజ్ఞులైన అధ్యాపకుల సలహాలు తీసుకోవాలి.
నమూనా ప్రశ్నపత్రాలు
ఆబ్జెక్టివ్‌, సబ్జెక్టు ప్రశ్నపత్రాలు సమయానుసారంగా సాధన చేస్తే పరీక్ష హాలులో ఒత్తిడి లేకుండా సమాధానాలు రాయవచ్చు.
మౌఖిక పరీక్ష: రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా 1ః2.5 నిష్పత్తిలో అభ్యర్థులను మౌఖికపరీక్షకు సాధారణంగా పిలుస్తారు. దీనిలో అభ్యర్థి ఆలోచన విధానాన్నీ, శక్తి సామర్థ్యాలు, నీతి నిజాయతీలను అంచనా వేస్తారు. ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి ఐఈఎస్‌ మౌఖిక పరీక్షలో వ్యక్తిగత విషయాలకూ, హాబీలకూ కొంత ప్రాముఖ్యమిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. వీరు ఉద్యోగం చేస్తున్నా/ ఎంటెక్‌ చేస్తున్నా సంబంధిత విషయాల గురించి ప్రశ్నలు అడిగే అవకాశముంది. సామాజిక, వర్తమాన అంశాల గురించి కూడా అడగవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండి ప్రణాళిక ప్రకారం వెళ్తే అధిక మార్కులు సాధించవచ్చు.

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)
ఐఐటీలతోపాటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ బెంగళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ ఫార్మసీ విభాగాల్లో చేరడానికి గేట్‌ స్కోరు ఉపయోగపడుతుంది.
* ఈ పరీక్ష స్కోరును మలేసియా, సింగపూర్‌ తదితర దేశాల్లో కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వంటి పరిశోధనా సంస్థలు కూడా ఈ స్కోరును గుర్తిస్తున్నాయి. గేట్‌తో మనదేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సులో ప్రవేశంతోపాటు రూ. 12,400 ఉపకార వేతనం కూడా లభిస్తుంది.
* మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఉన్నత విద్యాశాఖల తరపున ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు, 7 ఐఐటీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం స్థాయి కూడా ఆ సంస్థలకున్న పేరు ప్రతిష్ఠలకు అనుగుణంగానే ఉంటుంది. అందువల్ల ఈ పరీక్ష రాయదలచుకున్న ప్రతి ఇంజినీరింగ్‌ సైన్స్‌ విద్యార్థీ ప్రణాళికబద్ధంగా శ్రమించాల్సిందే.
* 22 బ్రాంచీల అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహిస్తారు.
రెండు విభాగాలు
* గేట్‌ ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి.
విభాగం-1
జనరల్‌ ఆప్టిట్యూడ్‌: ఇందులో పది ప్రశ్నలుంటాయి. ఒకటి- ఐదు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 6-10 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులుంటాయి. ఈ విభాగంలోని నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఇంగ్లిష్‌కు సంబంధించి ఇవ్వవచ్చు.
విభాగం-2

* 1- 25 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.
* 26- 55 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు.
* ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌కు సీరియస్‌గా సిద్ధమయే విద్యార్థులు తాము మ్యాథ్స్‌, ఆప్టిట్యూడ్‌ తప్ప మిగతా అన్ని సబ్జెక్టులూ అవలీలగా చేసేస్తారు. మ్యాథ్స్‌, ఆప్టిట్యూడ్‌ ప్రశ్నల కోసం కొంత అదనపు కృషి అవసరమవుతుంది.
రుణాత్మక మార్కులతో జాగ్రత్త!
గేట్‌లో ఒక తప్పు జవాబుకు 33.33% రుణాత్మక మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున. న్యూమరికల్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు.
మానసిక సంతులత: సన్నద్ధత సమయంలో కొంతమంది అధైర్యపరచవచ్చు. కొన్ని సంఘటనలు నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. కానీ ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకోవడానికి దృఢ చిత్తంతో కష్టపడాలి. గత విజేతలను స్ఫూర్తిగా తీసుకోవాలి.
వైద్య విద్యార్థులకు తీపి కబురు
* పీజీ ప్రవేశపరీక్షపై సానుకూలంగా స్పందించిన సీఎం
* దరఖాస్తులకు ఆఖరి రోజు 16
ఈనాడు, హైదరాబాద్: పీజీ ప్రవేశపరీక్ష అనుమతిపై ఆందోళన చెందుతున్న శిక్షణలో ఉన్న వైద్య విద్యార్థులకు (హౌజ్‌సర్జన్స్) తెలంగాణ సర్కారు తీపి కబురు ప్రకటించింది. మార్చి 1న జరగనున్న పీజీ ప్రవేశపరీక్షకు అనుమతించడంపై సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 15న సానుకూలంగా స్పందించారు. వైద్య విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పాటు తప్పనిసరి వైద్యసేవలు అందించాలనే నిబంధనను వ్యతిరేకిస్తూ సుమారు రెండు నెలల పాటు పీజీ వైద్య విద్యార్థులు (జూడాలు) సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. జూడాల ఆందోళనకు మద్దతుగా హౌజ్‌సర్జన్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా విధులను, తరగతులను బహిష్కరించారు. ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినా.. ఆందోళన మానలేదు. చివరకు హైకోర్టు ఆదేశాలతో సమ్మె విరమించి విధుల్లో చేరారు. సమ్మె కాలంలో కోల్పోయిన విద్యను అభ్యసించడం కోసం రెండు నెలలు కాల పరిమితిని ప్రభుత్వం పొడిగించింది. దీంతో శిక్షణలో ఉన్న వైద్య విద్యార్థులు, పీజీ వైద్య విద్యార్థులు మరో రెండు నెలల పాటు సేవలందించాల్సి వస్తోంది. ఇలా రెణ్నెళ్ల పొడిగింపు వల్ల మార్చి 1న జరగనున్న పరీక్షకు... ఉస్మానియా వైద్య కళాశాలలో 200 మంది, గాంధీలో 150 మంది, కాకతీయలో 150 మంది, రిమ్స్‌లో 100 మంది హౌజ్‌సర్జన్లు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తోంది.
ఈ విషయాన్ని వివరించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ పుట్టా శ్రీనివాస్‌తో కలిసి వైద్య విద్యార్థుల ప్రతినిధులు శ్రీనివాస్, సందీప్, అభిలాష్.. తదితరులు ఫిబ్రవరి 15న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. జూడాల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నా అప్పుడు సమ్మె కొనసాగించారని ఈ సందర్భంగా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలా జరగదనీ, విద్యా సంవత్సరం నష్టపోకుండా పీజీ ప్రవేశపరీక్షకు అనుమతించాలని వారు విజ్ఞప్తి చేయడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. పీజీ ప్రవేశ పరీక్షకు అర్హత పొందే విషయంలో అనువైన నిర్ణయం తీసుకోవాలని వైద్య ఆరోగ్య మంత్రిని, ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ)తో డీఎంఈ మాట్లాడారు. ప్రభుత్వ ఆలోచనను వీసీకి వివరించారు. ఫిబ్రవరి 16తో ప్రవేశపరీక్ష దరఖాస్తు దాఖలుకు ఆఖరి తేదీ కావడంతో.. మరో రెండు రోజులు పొడిగించే విషయంపై వీసీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
గ్రూప్‌-1లో ఆరో పేపర్‌!
* పూర్తిగా తెలంగాణ ఉద్యమంపైనే
* మొత్తం మార్కులు వెయ్యికి పెంపు
* హరగోపాల్‌ కమిటీ సిఫార్సు
ఈనాడు - హైదరాబాద్‌: గ్రూప్‌-1 పరీక్ష విధానం మార్చకున్నా తెలంగాణ ఉద్యమానికి హరగోపాల్‌ కమిటీ పెద్దపీట వేసినట్లు తెలిసింది. ఉద్యమంపై ఒక పేపర్‌ అదనంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న ఐదు పేపర్లతో పాటు అదనంగా ఆరో పేపర్‌ను (150 మార్కులు) కూడా ప్రవేశపెడుతూ హరగోపాల్‌ కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ ఆరో పేపర్‌ పూర్తిగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందేనని తెలిసింది. అంతేగాక ఇప్పుడున్న మొత్తం మార్కుల్ని కూడా 1000కి పెంచాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం రాత పరీక్షలకు 750, మౌఖికానికి 75 (మొత్తం 825) మార్కులున్నాయి. వీటిని 900 + 100గా మార్చొచ్చు. తెలంగాణ ఉద్యమాన్ని అంశంగా చేర్చాలని విద్యార్థులతో పాటు అన్ని రంగాల నుంచి విజ్ఞప్తులొచ్చిన మీదటే కమిటీ కూలంకషంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. తెలంగాణలో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఇక్కడి ఉద్యమ చరిత్రపైనా అవగాహన ఉండాలనే ఈ ఏర్పాటుచేశారు. 1912లో ఆరంభమైన ముల్కీ ఉద్యమంతో మొదలుపెడితే 2014 జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావం నాటి దాకా చాలా ఘట్టాలు అటు చరిత్రలో, ఇటు ఉద్యమంలో చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలో నాలుగో పేపర్‌ శాస్త్రసాంకేతికాంశాల(సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ)పై, ఐదో పేపర్‌ గణితంపై ఉంది. గణితం పాఠ్యప్రణాళికను సులభతరం చేసి స్థాయి తగ్గించాలని కమిటీ సిఫార్సుచేసింది. ఈ నేపథ్యంలో నాలుగు, ఐదు పేపర్లను కలిపి ఒకే పేపర్‌గా (శాస్త్రసాంకేతిక + గణితం) నిర్వహిస్తారు. నాలుగో పేపర్‌గా సామాజిక, రాజకీయ, భౌగోళిక, రాజ్యాంగపరమైన అంశాలుండే అవకాశముంది. ఆరో పేపర్‌గా 150 మార్కులకు తెలంగాణ ఉద్యమ పేపర్‌ ఉండొచ్చు. ఇప్పటిదాకా అనుసరించిన పద్ధతితో పోల్చి చూసుకుంటే ప్రిలిమ్స్‌లో ఎలాంటి మార్పులుండవు. కమిటీ సిఫార్సుల ప్రకారం గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష పేపర్లు ఇలా ఉండే అవకాశముంది. అయితే ఇవన్నీ ప్రభుత్వం ఆమోదిస్తేనే అమల్లోకి వస్తాయి. లేదంటే మార్పులు కూడా చేయొచ్చు.
* తొలి పేపర్ (సాధారణ వ్యాసం) -150 మార్కులు
* రెండో పేపర్ (చరిత్ర అంశాలపై) -150 మార్కులు
* మూడో పేపర్ (ఆర్థికాంశాలపై) - 150 మార్కులు
* నాలుగో పేపర్ (రాజకీయ, భౌగోళికాంశాలు) - 150 మార్కులు
* ఐదో పేపర్ (శాస్త్రసాంకేతిక, గణితం) - 150 మార్కులు
* ఆరో పేపర్ (తెలంగాణ ఉద్యమం) - 150 మార్కులు
మొత్తం - 1000 మార్కులు
గ్రూప్ పరీక్షల్లో గణితభారం తగ్గింపు
* అధ్యాపక పరీక్షల్లోనే అదనపు మార్పులు
* గ్రూప్-2 పోస్టుల బదిలీ ప్రభుత్వ ఇష్టం
* పాఠ్యప్రణాళిక సిద్ధం.. ఉద్యోగ ప్రకటనలతో పాటే వెల్లడి
* ఘంటా చక్రపాణి స్పష్టీకరణ
* హరగోపాల్ కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పణ
* యూపీఎస్సీ తరహాలో రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏర్పాటుకు సిఫార్సు
ఈనాడు, హైదరాబాద్: భావి తెలంగాణకు సమర్థ అధికారుల్ని అందించేందుకు సూచనలివ్వాలన్న ఉద్దేశంతో ఏర్పాటైన హరగోపాల్ కమిటీ గ్రూప్ అభ్యర్థులకు వరమిచ్చింది. అధ్యాపక (లెక్చరర్) ఉద్యోగాల అభ్యర్థులపై మాత్రం కాసింత అదనపు భారం మోపింది. గ్రూప్-1 పరీక్షల్లో గణిత ప్రభావాన్ని (స్థాయి) తగ్గించాలని, గ్రూప్-2 కార్యనిర్వాహక పోస్టుల్ని యథాతథంగా ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే నింపాలని సిఫార్సు చేసింది. గతంలోలా కాక కాస్త తక్కువ స్థాయిలో గణితాన్ని గ్రూప్-1 పరీక్షల్లో ఇవ్వాలన్నది కమిటీ భావన. ఇంతకు ముందున్న పరీక్షలో గణితం స్థాయి ఇంజినీరింగ్ విద్యార్థులకే లాభం చేసేలా ఉందని ఆరోపణలొచ్చాయి. దానితో పాటు గ్రామీణ, గణితేతర విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తాజా సిఫార్సు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. అయితే డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ అధ్యాపక ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులపై అదనపు భారం మోపింది. వీరికి నిర్వహించే జనరల్ స్టడీస్ పేపర్లో ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఫిలాసఫీ, విద్యా విధానం... అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అనుసరించాల్సిన పరీక్ష విధానం, పాఠ్యప్రణాళిక మార్పులపై ఏర్పాటైన హరగోపాల్ కమిటీ సిఫార్సులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శనివారం తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. ఛైర్మన్ ఘంటా చక్రపాణి సారథ్యంలో శనివారం ఉదయం సమావేశమైన పీఎస్సీ సభ్యులు విఠల్, చంద్రావతి, ఖాద్రి, కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యంలు 9 రోజుల కిందట హరగోపాల్ కమిటీ ఇచ్చిన నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. దాన్నలాగే ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం ఈ సిఫార్సులను ఆమోదించవచ్చు. లేదంటే మార్చవచ్చు. ప్రభుత్వం పరీక్ష విధానంపై ఉత్తర్వులు (జీవో) జారీ చేసి, ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీకి అనుమతినిచ్చాకే ఉద్యోగ ప్రకటనలు వెలువడతాయి. సిలబస్ సిద్ధంగానే ఉన్నా ఉద్యోగ ప్రకటనలతోపాటే దాన్ని వెల్లడిస్తామని కమిషన్ ఛైర్మన్ చక్రపాణి తెలిపారు. యూపీఎస్సీ తరహాలో రాష్ట్ర సివిల్ సర్వీసెస్‌కు కమిటీ సిఫార్సు చేసిందని ఆయన అన్నారు.
గ్రూప్-1 యథాతథం...
గ్రూప్-1 పరీక్షల విధానం ఇప్పుడున్నట్లే ఉంటుందని కమిషన్ ఛైర్మన్ చక్రపాణి తెలిపారు. ఇప్పుడున్నట్లే ప్రాథమిక, ప్రధాన పరీక్షలతో పాటు ముఖాముఖీ పద్ధతిలో కొనసాగుతాయన్నారు. గ్రూప్-2లోని కొన్ని కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్) పోస్టులను గ్రూప్-1లోకి బదిలీ చేయాలన్న 622 జీవో అమలుపై నిర్ణయం ప్రభుత్వం చేతుల్లో ఉందని ఆయన స్పష్టం చేశారు. ''హరగోపాల్ కమిటీ అయితే ఈసారికి వీటిని యథాతథంగా గ్రూప్-2లోనే (ఎలాంటి మౌఖిక పరీక్ష కూడా లేకుండా కేవలం ఆబ్జెక్టివ్ పరీక్ష మాత్రమే) ఉంచాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ నిర్ణయం అంతిమం అని చక్రపాణి అన్నారు. సిలబస్‌లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక స్థితిగతులు, ఉద్యమ నేపథ్యం తప్పనిసరిగా ఉంటాయన్నారు. 1948 నుంచి 2014 మధ్య సంఘటనలు, పరిణామాలపై అభ్యర్థులు దృష్టిపెట్టాలన్నారు.
ప్రభుత్వం చెప్పకుండా క్యాలెండర్ ఎలా?
ప్రభుత్వం నిర్వహించమంటే... ఉపాధ్యాయ (డీఎస్సీ) సహా ఏ పరీక్ష నిర్వహణకైనా తాము సిద్ధంగా ఉన్నామని చక్రపాణి అన్నారు. ''మా పని ప్రభుత్వం అనుమతిచ్చిన ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి భర్తీ చేయటం. అలా కాకుండా ఉద్యోగాల కాలమానిని రూపొందించటంలో అర్థంలేదు. మరో వారం పదిరోజుల్లో ఉద్యోగుల శాఖాపరమైన పరీక్షలకు ప్రకటన వెలువరిస్తాం అని ఆయన తెలిపారు.
స్థూలంగా... ఆర్థిక సూక్ష్మం!
పోటీపరీక్షల్లో ఆర్థిక అంశాలపై ఆధారపడి ప్రశ్నలు వస్తుంటాయి. ఆర్‌బీఐ, ప్రభుత్వం ద్వారా జరిగే వివిధ కార్యకలాపాల స్వరూపాన్ని గ్రహించటం అభ్యర్థులకు అవసరం. ఇలాంటి ప్రాథమికాంశాలపై పట్టు సాధించినప్పుడే లోతైన అవగాహనకు దారి ఏర్పడుతుంది!
'అయినా ఈ ఆర్థిక సిద్ధాంతాలన్నీ ఎట్టా కనిపెడతారు?' బుర్ర గోక్కుంటూ వచ్చాడు కొండల్రావు.
'సిద్ధాంతాలు పుట్టేది మనుషుల బుర్రల్లో కాదు. మనుషులు నివసించే సమాజంలో నుంచి. నువ్వు నీ కుటుంబ ఆర్థిక వ్యవహారాల్ని చూస్తావు. అలాగే సమాజంలోని ఆర్థిక కార్యకలాపాల్ని ఒక క్రమపద్ధతిలో అర్థం చేసుకోగలవాళ్లు ఆ పద్ధతిని సిద్ధాంతంగా చెబుతారు. నీకూ, వాళ్లకీ పరిమాణంలోనే తేడా'- చెప్పాడు రామారావు.
'అయితే నేనూ ఆర్థికవేత్తనే అంటావ్‌!'
'మరే! నువ్వు నీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలను ఒక క్రమంలో పెట్టి చూస్తావు కనుక నీది మైక్రో ఎకానమీ. ఒక విశాల ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేవారు ఉంటారు. వారి అనుభవాలను క్రమపద్ధతిలో పేర్చి అధ్యయనం చేయడం మాక్రో ఎకానమీ. నీ కుటుంబమే ఒక దేశం అనుకుంటే నువ్వూ మాక్రో ఎకనమిస్టువే.'
'సరిగ్గా నా అనుమానం దగ్గరికే వచ్చావు. అసలీ మాక్రో, మైక్రో తేడాలు ఏమిటి?'
'అడవికీ, చెట్టుకీ ఉన్న తేడాయే!'
'అట్లా చెబితే నాకు అర్థం కావద్దా?'
'ఒక ఆర్థికవ్యవస్థలో అనేకమంది పాత్రధారులుంటారు. సొంతంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. పాత్రధారుల కార్యకలాపాలను విడివిడిగా పరిశీలించడం మైక్రో ఎకానమీ. వారందరి కార్యకలాపాల్ని ఉమ్మడిగా రాష్ట్రం/ దేశం స్థాయిలో పరిశీలించడం మాక్రో ఎకానమీ'.
'అవి ఏమేం చేస్తాయో కూడా చెప్పు'.
'మైక్రో ఎకానమీ అంటే సూక్ష్మ ఆర్థికశాస్త్రం అని. ఇది విడివిడి పాత్రధారుల ఆర్థిక లక్షణాల ధోరణులను, వాటి వల్ల మొత్తం ఆర్థికవ్యవస్థపై పడే ప్రభావాన్ని పరిశీలిస్తుంది. ఉదాహరణకు- రైతు, కూలి, ఉద్యోగి, ఎస్‌ఈ (స్మాల్‌ ఎంటర్‌ప్రైజ్‌), ఎంఈ (మీడియం), వ్యాపారి, సంస్థ మొదలైనవారు పాత్రధారులు. మాక్రో ఎకానమీ సాధారణంగా రాష్ట్రం, దేశం స్థాయిల్లో ఎకానమీలను అధ్యయనం చేస్తుంది. అందుకు అనుగుణమైన సిద్ధాంతాలను, సిద్ధాంతకర్తలను తయారు చేసుకుంటుంది'.
వార్తాపత్రికల వాణిజ్య పేజీల్లో తరచుగా స్థూల ఆర్థిక వ్యవస్థ, దీని పాలసీల గురించి చదువుతుంటాం. ఆర్థికశాఖ మంత్రుల, కార్యదర్శుల, ఆర్థిక విశ్లేషకుల మాటల్లో ఈ పదాలు దొర్లుతుంటాయి. వీటిపైన సాధారణ అవగాహన తప్ప కాస్త లోతుగా వెళ్లి ఆలోచించడం తక్కువ. అందువల్ల పత్రికల్లో ఇచ్చే విశ్లేషణలు అర్థమయ్యీ కానట్లుంటాయి. ఈ పదజాలంపై ఒక మోస్తరు అవగాహన అయినా పెంచుకుంటే వార్తలూ, విశ్లేషణలూ తేలిగ్గా అర్థం అవుతాయి.
అడవీ... చెట్టూ: ఒక దేశ/ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పై నుంచి కిందివరకు ఉన్న దృశ్యాన్ని స్థూల దృష్టితో పరిశీలించడమే స్థూల ఆర్థికశాస్త్రం. భూమికి కాస్త ఎత్తుకు వెళ్లి చూస్తే ఒక ప్రాంతంలో అడవి ఉన్నట్లు అర్థమవుతుంది. ఆ అడవిలోకి ఒక్కో చెట్టును పరిశీలించి అది చింత, రావి, టేకు, చందనం.. ఇలా వేర్వేరు పేర్లు చెబుతాం. అడవి అని చెప్పడం స్థూల దృష్టి. ఒక్కో చెట్టు పేరు చెప్పడం సూక్ష్మ దృష్టి.
ఆర్థికం కూడా ఇంతే. ఒక దేశం/ రాష్ట్రంలోని ఆర్థిక కార్యకలాపాల స్థూల లక్షణాల పరిశీలన- మాక్రో ఎకానమీ. ఆధునిక ప్రపంచంలో దీన్ని ఆయా దేశాల ప్రభుత్వాలు, సెంట్రల్‌ బ్యాంకులు (రిజర్వ్‌ బ్యాంకులు) నిర్వహిస్తాయి. ఆర్థికశాఖ మంత్రి, అధికారులు ప్రణాళిక శాఖ (నీతి ఆయోగ్‌) అధికారులు, వాణిజ్యమంత్రి, అధికారులు, ప్రధానమంత్రి వీరంతా ప్రభుత్వంలో భాగం. వీరంతా మాక్రో ఎకనమిక్‌ విధానాల ద్వారా స్థూల ఆర్థికాన్ని నిర్వహిస్తారు. * వివిధ స్వల్ప, దీర్ఘకాలిక వడ్డీరేట్లను పెంచడం/ తగ్గించడం (ద్రవ్య పరపతి విధాన సమీక్ష; ద్రవ్య/ విత్త సరఫరాను నియంత్రించడం).. ఈ రెండింటి ద్వారా ఆర్‌బీఐ స్థూల ఆర్థికాన్ని నిర్వహిస్తుంది.
* పన్నులలో మార్పు చేర్పులు; రాయితీల ప్రకటన; ఎగుమతి, దిగుమతి విధానాలు; కోశాగార విధానం (ఫిస్కల్‌ పాలసీ) ద్వారా నిర్ణయించే ప్రభుత్వ వ్యయం మొదలైన చర్యల ద్వారా ప్రభుత్వాలు స్థూల ఆర్థికాన్ని నిర్వహిస్తాయి.
అంటే వడ్డీరేటు, నగదు నిర్వహణ ఆర్‌బీఐకి ఉపకరణాలు. పన్నులు, రాయితీలు, సబ్సిడీలు (బడ్జెట్‌) వ్యయం.. ఇవన్నీ ప్రభుత్వ ఉపకరణాలు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగాలను సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూస్తూ దేశం ఆర్థికాభివృద్ధి సాధించేలా చూడడం స్థూల ఆర్థిక విధానాల లక్ష్యం. ఈ విధానాల ద్వారా నగదు నిల్వల నిర్వహణ- పంపిణీ, ఉత్పత్తి నిర్వహణ- పంపిణీలను వివిధ చట్టాల ప్రకారం దేశ ప్రజలందరికీ న్యాయబద్ధంగా, సమానతా ప్రాతిపదికన జరిగేలా చూడడం ఆర్‌బీఐ, ప్రభుత్వాల విధి. ఇది ఉత్పత్తుల సమాన పంపిణీని పక్కనపెట్టి ఎలాగోలా అధిక జీడీపీ వృద్ధి రేటు సాధించడానికి తంటాలు పడడంగా మారిపోయింది.
విడివిడి పాత్రధారుల అధ్యయనమే మైక్రో ఎకనమిక్స్‌! ఇందులోనూ ప్రభుత్వాలకు విధులుంటాయి. కుటుంబాలు, వ్యాపారాలు, కంపెనీలు... తమ వినియోగం/ వ్యయం, పొదుపుల విషయంలో ఏ అంశాలపై ఆధారపడి నిర్ణయించుకుంటారో సాధ్యమైనంత దగ్గరగా అంచనా వేయగలిగితే స్థూల ఆర్థిక నిర్వహణ తేలిక అవుతుంది. కంపెనీలు, సంస్థలు తమ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించే విధానాలను ప్రభుత్వాలే నిర్దేశించాలి. ఆచరణలో రైతులకు తమ ఉత్పత్తుల ధరలు నిర్ణయించుకునే హక్కు లేదు. కంపెనీలు మాత్రం ఇష్టానుసారం ధరలు నిర్ణయిస్తున్నాయి. ఉత్పత్తుల మార్కెట్‌లోనూ, లేబర్‌ మార్కెట్‌లోనూ తగినంతగా పోటీ, సామర్థ్యం ఉండేలా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. విద్య, వైద్యం, వేతనాలు, అంతర్గత వలసలు మొదలైనవి మైక్రో ఎకనమిక్‌ విధానాల్లో భాగం.
వీటి ద్వారా తాజా ఆవిష్కరణలకు తగినట్లుగా శారీరక మేధా కార్మికుల నైపుణ్యం, సామర్థ్యాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. సిలబస్‌లో మార్పులు చేయాలి.
పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
* ఎన్ఐఈఎల్ఐటీతో ఒప్పందం
* మార్చి 1 నుంచి 12 కేంద్రాల్లో ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ), ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాల అభివృద్ధి సంస్థ మధ్య శుక్రవారం ఒప్పందం జరిగింది. సచివాలయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో రెండు సంస్థలకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ అశ్వినీకుమార్, డాక్టర్ గంటా సుబ్బారావు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, కొంతవరకు టెలికాం రంగంలో ఈ శిక్షణ ఉంటుంది. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాల్లో 15 వేల మంది పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకు దశల వారీగా శిక్షణ ఇస్తారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తారని, మిగిలిన వారు నిర్దేశించిన రుసుములో కొంత మొత్తాన్ని చెల్లించాల్సిందని ఉంటుందని వివరించారు. తొలివిడతగా ఒక్కో కేంద్రంలో 120 మందికి చొప్పున మార్చి ఒకటో తేదీ నుంచి 12 కేంద్రాల్లో శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో బీటెక్ వంటి కోర్సులకు కూడా ఈ శిక్షణను విస్తరింపచేయాలని కోరుతున్నామని తెలిపారు. ఎన్ఐఈఎల్ఐటీ మేనేజింగ్ డైరెక్టర్ అశ్వినీకుమార్ మాట్లాడుతూ ఈ శిక్షణ మూడు నుంచి ఆరునెలల వరకు ఉంటుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ రంగానికి చెందిన మొబైల్ ఫోన్లు, ఇతర అంశాల్లో శిక్షణ ఇస్తారన్నారు. దేశవ్యాప్తంగా ఐదువేల కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం మంచి పూర్తి సహకారం లభిస్తోందని తెలిపారు. అందరికీ ఆధార్ నెంబర్లు ఉన్నందున కార్యక్రమాల అమలు సులభతరమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి సంస్థ తరపున విశ్రాంత ఐ.ఎ.ఎస్. లక్ష్మీనారాయణ, ఐటీ శాఖ కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పరిశీలనలో ఐటీఐఆర్ ఏర్పాటు: విశాఖపట్నంలో ఐటీఐఆర్ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి పల్లె రఘునాధరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌పై ప్రకటనలు చేస్తున్నా, కేంద్రం నుంచి స్పందన లేని విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఐటీ సలహాదారు సత్యనారాయణ ఆశాభావం వ్యక్తంచేశారు.
గురుకులాలన్నీ ఒకే గొడుగు కిందికి?
ఈనాడు, హైదరాబాద్: గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తే ఎలా ఉంటుంది? ఆదర్శ పాఠశాలల్ని కేజీ నుంచి పీజీలో భాగంగా చేయొచ్చా?.. ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు సమాధానం వెదికి, కేజీ నుంచి పీజీ పథకంపై మౌలిక పత్రం రూపొందించేందుకు తెలంగాణ విద్యాశాఖ ఫిబ్రవ‌రి 13న‌ కీలక భేటీ ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొనే ఈ సమావేశంలో వివిధ అంశాల్ని లోతుగా చర్చించబోతున్నారు. ఇపుడున్న గురుకులాల్ని ఒకే ఛత్రం కిందికి తేవడమనేది కూడా ఇందులో ఒక అంశమని సమాచారం. గురుకుల విద్యకు ముఖ్యమంత్రి ప్రాధాన్యమివ్వాలని యోచిస్తున్న నేపథ్యంలో ఈ దిశగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థల సొసైటీతో పాటు, సాంఘిక సంక్షేమం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, ఆశ్రమ్ పాఠశాలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల‌(కేజీబీవీ) పేరుతో దాదాపు 1000 పాఠశాలలు గురుకుల పద్ధతిలో సాగుతున్నాయి. 177 ఆదర్శ పాఠశాలలు వీటికి అదనం. భిన్న యాజమాన్యాల కింద నడుస్తున్న వీటిని కలిపి కేజీ నుంచి పీజీ పద్ధతికి అనుసంధానిస్తే ఎలా ఉంటుంది? అసలు గురుకుల స్కూళ్లను ఏ తరగతి నుంచి ఆరంభించాలి? ఏ తరగతి నుంచి వసతి గృహ (రెసిడెన్షియల్) సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది? ప్రాథమిక స్థాయిలో ఏ మాధ్యమంలో చదువులుండాలి? ఆడ, మగ పిల్లలకు కలిపి నిర్వహించాలా? విడిగానా? ఒక్కో పాఠశాలలో ఎందరిని తీసుకోవాలి? వనరుల సమీకరణ ఎలా చేయాలి? ఎంత మంది ఉపాధ్యాయులు, సిబ్బంది అవసరమవుతారు?...ఇలా పలు అంశాలపై సమావేశంలో చర్చించబోతున్నారు. నిజానికి గతంలో విద్యారంగ నిపుణులతో సదస్సు ఏర్పాటుచేసి సూచనలు స్వీకరించాలని భావించారు. అయితే ప్రభుత్వం, విద్యాశాఖకు తనదంటూ ఒక ప్రాథమిక ఆలోచనే లేకుండా ప్రజల్లోకి వెళ్లటం సరికాదనే ఉద్దేశంతో ఈ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత విద్యానిపుణులు, సంఘాల సూచనల్నీ స్వీకరిస్తారు.
కేంద్రం కూడా.. కేజీ నుంచి పీజీ బాట?
* వెనకబడిన జిల్లాలకే పరిమితం!
వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు బలం చేకూర్చేలా కేంద్రం కూడా కేజీ నుంచి పీజీ పథకం ఆరంభించాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా వెనకబడిన జిల్లాల్లో వీటి ఏర్పాటుకు కేంద్ర సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రతిపాదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వీటిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఆరంభిస్తారా లేక ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిర్వహిస్తుందా అనేది ఇంకా తేలలేదు. బహుశా అది పీపీపీ పద్ధతికే మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువని విద్యాశాఖవర్గాలు తెలిపాయి.
ఇక తప్పుల్లేని పాఠ్య పుస్తకాలు
* కొన్ని అంశాల్లో మార్పులు
ఈనాడు, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తప్పులు లేని పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందబోతున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో గుర్తించిన భావన, అక్షర దోషాలు సరిదిద్దారు. 2015-16 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందే పాఠ్య పుస్తకాల్లో 99 శాతం మేర తప్పులు ఉండవన్న ధీమాను అధికారిక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి నుంచి పదో తరగతి వరకు దశలవారీగా పాఠ్య పుస్తకాలు మారిన విషయం తెలిసిందే. వీటిల్లో దొర్లిన తప్పులు, భావన దోషాలపై విమర్శలు వెల్లువెత్తాయి. వీటిపై జిల్లా విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గాల నుంచి వివరాలు సేకరించి వాటి సవరణకు ఏపీ రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ ఉపక్రమించింది.
ఒకటి నుంచి 5వ తరగతి వరకు తెలుగు పాఠ్యపుస్తకంలో దొర్లిన 80 దోషాలను సవరించారు. గణితంలో 40, ఆంగ్లంలో 80 వరకు తప్పులు సవరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 8వ తరగతి జీవశాస్త్రంలో ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి అర్థం మారేలా ఉన్న అంశాన్ని సవరించారు. కిందటేడాది మాత్రమే పదో తరగతి పాఠ్యపుస్తకంలో భారీగా తప్పులు దొర్లాయి. వీటిని పూర్తిస్థాయిలో సరిచేశారు. పదో తరగతి గణితంలో 265, భౌతికశాస్త్రంలో 109, జీవశాస్త్రంలో 150, ఆంగ్లంలో 120, తెలుగులో 80, సాంఘికశాస్త్రంలో 70 వరకు ఉన్న దోషాలను గుర్తించి సవరించినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణాలో భారీగా.. ఏపీలో పరిమితంగా మార్పులు!
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్థానిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాన్ని తీసుకోనందున ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాల్లోనే రాష్ట్రానికి అనుగుణంగా పలు మార్పులు చేశారు. ఉదాహరణకు ప్రాథమిక స్థాయిలోని 'మనం-మనపరిసరాల పాఠ్య పుస్తకంలో రాష్ట్ర పటం, నదులు-పంటలు వంటి విషయాల్లో ఏపీకి అనుగుణంగా మార్పులుచేశారు. కిందటేడాది వరకు రాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నందున ఆయా ప్రాంతాలకు సమాన ప్రాతినిథ్యం ఇచ్చారు. ఇప్పుడు ఏపీలోని 13 జిల్లాలకు సంబంధించిన అంశాల్లో మార్పులు చేశారు. ఇదివరకు మహబూబ్‌నగర్ మండలం అని ఉంటే దానిని నెల్లూరు మండలంగా చూపించారు. గణితం పాఠ్యపుస్తకంలో విద్యార్థులకు ఆయా ఊర్ల మధ్య ఉన్న దూరాల గురించి అర్థమయ్యేందుకు వీలుగా తెలంగాణాలోని ప్రాంతాల పేర్లను ఉదహరించగా.. ఇప్పుడు దానిని ఏపీకి పరిమితంచేశారు. రేఖాచిత్రాల్లోనూ మార్పులు జరిగాయి.
యథాతథం!
ఆరు నుంచి 10వ తరగతి వరకు ఉన్న కవులు, కళలు, సాంస్కృతిక సంప్రదాయాలు, చారిత్రక ప్రదేశాల మార్పు వంటి విషయాల్లో ఎటువంటి మార్పులు జరగలేదు. ఈ అంశాలపై కిందటేడాది వరకు ఉన్నట్లే పాఠ్యపుస్తకాలు రాబోతున్నాయి. ఇలా మార్పులు చేయాలంటే ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణాకు చెందిన బతుకమ్మ పండుగ, హైదరాబాద్ విమోచన ఉద్యమం వంటి అంశాలపై ఉన్న పాఠాలు కిందటేడాది మాదిరిగానే రానున్న విద్యా సంవత్సరంలోనూ ఉంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ఏపీకి సంబంధించిన అంశాలను చాలావరకు పరిమితంచేశారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యపుస్తకాలపరంగా పూర్తిస్థాయిలో మార్పులు చోటుచేసుకుంటాయి.
స్థానిక కోటాలో ప్రవేశాలకే సాయం!
* బోధన రుసుములపై విధివిధానాలు ఖరారు
* 14న సీఎంకు సిఫార్సులు
* రూ.862 కోట్ల బకాయిల విడుదల
* తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు
ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణలో ఈ విద్యాసంవత్సరంలో బోధన రుసుములు, ఉపకార వేతనాల ప్రాథమిక విధివిధానాలను తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేసింది. స్థానిక కోటా మినహా గతంలో ఉన్న నియమనిబంధనలన్నింటినీ ఈ ఏడాదికి కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. 371-డి అధికరణాన్ని అనుసరించి స్థానిక కోటా కింద విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని సమావేశం అభిప్రాయపడింది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఫిబ్రవరి 11న సచివాలయంలో ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించింది. ఇతర మంత్రులు హాజరుకాకున్నా తమ అభిప్రాయాలను వారు కడియం శ్రీహరికి తెలిపారు. సంక్షేమ, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ఆర్థిక తదితర శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ, గత ఏడాది విధానాన్ని ఈసారి యథాతథంగా అమలు చేస్తామని చెప్పారు. ప్రాథమిక విధివిధానాలను ఖరారు చేశామని, మరో రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌కు తమ సిఫార్సులను సమర్పిస్తామని చెప్పారు. సమావేశంలో 371-డిపై సుదీర్ఘ చర్చ జరిగింది. దరఖాస్తులకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వారిని, మొత్తం ఏడేళ్ల కాలంలో తెలంగాణలో నాలుగేళ్లు చదివిన వారిని స్థానికులుగా గుర్తించనుంది. వారికి ఉపకారవేతనాలు, బోధనరుసుములు ఇవ్వాలనే అంశంపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులలో స్థానిక, స్థానికేతరులెవరనే స్పష్టత ఉందని, 371-డిని అనుసరించి, మరోసారి దరఖాస్తుల పరిశీలన జరపాలని నిర్ణయించారు. గత మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించిన విధంగా రూ. 862 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. ఇప్పటికే సీఎం వీటికి ఆమోదం తెలిపారని, రెండు రోజుల్లో వీటి ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాదికి విడుదల చేసే ఉపకారవేతనాలు, బోధన రుసుములపై నిఘా వేయాలని సంక్షేమ శాఖలను ఆదేశించారు. ఈ ఏడాది ఉపకారవేతనాలు, బోధనరుసుములకు ఎలాంటి సమస్యల్లేవని, సకాలంలో నిధులిస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.
తేలని నిర్ణయంతో ఆందోళన!
* ఎంసెట్ నిర్వహణపై రాని స్పష్టత
* న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూపు
ఈనాడు-హైదరాబాద్: ఎంసెట్, ఇతర వృత్తి విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణకు అవసరమైన సమయంపై ఏపీ ఉన్నత విద్యా మండలి ఆందోళన చెందుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఖాతా లావాదేవీల స్తంభన పిటిషన్లపై విచారణను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సింగిల్ జడ్జీ బుధవారం నివేదించారు. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 18వ తేదీన జరగవచ్చని భావిస్తున్నారు. ఆ రోజున స్పష్టత వస్తుందా? లేదా అన్న దానిపై ఏమీ చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యా మండలి ఎంసెట్, ఐసెట్, పీజీ ఇంజినీరింగ్, ఈసెట్, లా, ఎడ్‌సెట్, వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించింది. పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో తామే పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం తామే పరీక్షలు నిర్వహించుకుంటామని పేర్కొంటూ తేదీలు ప్రకటించింది. దీనిపై ఏపీలో తర్జనభర్జనలు జరిగాయి. పునర్విభజన చట్టం ప్రకారం పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర హక్కులను కోల్పోకూడదని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఉన్నత విద్యా మండలి బ్యాంక్ ఖాతాను ఎస్బీహెచ్ అధికారులు స్తంభింపచేయడంతో విషయం హైకోర్టుకు వెళ్లింది. దీనిపై హైకోర్టు ఆదేశాలు అనుసరించి ఏపీ ప్రభుత్వం అధికారిక నిర్ణయాన్ని తీసుకోవల్సి ఉంది. ఈ ఆదేశాల ద్వారానే పరీక్షల నిర్వహణపై స్పష్టత వస్తుందని ఏపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆదేశాలు వెలువడేందుకు మరింత సమయం అనివార్యమై పోతుండడంతో పరీక్షల నిర్వహణపరంగా తీసుకోవల్సిన చర్యలకు ఉపక్రమించే విషయంలో ఏపీ ఉన్నత విద్యా మండలి అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. పరీక్షల నిర్వహణపై స్పష్టత వస్తే విద్యార్థులు అందుకు తగినట్లు సన్నద్ధమయ్యేందుకు వీలు ఏర్పడుతోంది. తెలంగాణ వైపు నుంచి ఎంసెట్ నిర్వహణకు త్వరలో ప్రకటన రాబోతుంది. పరీక్షల నిర్వహణ అధికారులు, విశ్వవిద్యాలయాల పేర్లను తెలంగాణ ప్రకటించింది. ఏపీలో ఇప్పటివరకు ఇదేమీ జరగలేదు. ఏపీలో ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలకు పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ఉమ్మడి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోతే జేఎన్‌టీయూ కాకినాడకు ఎంసెట్ బాధ్యతలు అప్పగిస్తారు. ఆచార్య నాగార్జున, ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర, జేఎన్‌టీయూ అనంతపురంలకు ఇతర పరీక్షల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది. ఎంసెట్ పరీక్షలకు ప్రశ్నపత్రాల రూపకల్పన వరకు ఎటువంటి జాప్యం ఉండదని, అవసరమైన చర్యలు వివిధ దశల్లో ఉందని, నిర్వహణపరంగానే చర్యలకు ఉపక్రమించాల్సి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
బోధనకూ మార్కులకూ ఓ లెక్క!
ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి గణిత బోధన పద్ధతుల సిలబస్‌ దాదాపు ఒకటే. ప్రశ్నల సంఖ్యలో మాత్రమే తేడా ఉంటుంది. అభ్యర్థులు సన్నద్ధత ప్రారంభించి నిరాటంకంగా కొనసాగించాలి!
టెట్‌ కమ్‌ టీఆర్‌టీ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పేపర్లలో సబ్జెక్టుకు కేటాయించిన మొత్తం మార్కుల్లో 20 శాతం బోధన పద్ధతులకు వెయిటేజి ఉండటానికి అవకాశముంది. అంటే గణితం కంటెంట్‌ + మెథడాలజీ 70 మార్కులకు గాను మెథడాలజీ దాదాపు 14 మార్కులకు ప్రశ్నలు రావొచ్చు. ఎస్‌జీటీ పరీక్షలో 6 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
ఈసారి గణితం, సైన్సు విభాగం స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ గణితం అభ్యసించాల్సివుంది. ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌ సబ్జెక్టులకు పరీక్ష రాసేవారు కూడా కనీసం 3 మార్కులకు గణితం మెథడాలజీ నుంచి జవాబులు ఇవ్వవలసి వుంటుంది.
బోధనా పద్ధతుల్లో ప్రధానమైన అధ్యాయాలు:
1. గణితశాస్త్ర స్వభావం, గణితశాస్త్రజ్ఞుల కృషి
2. గణితశాస్త్ర బోధనా ఉద్దేశాలు, విలువలు, బోధనా లక్ష్యాలు
3. గణిత విద్యాప్రణాళిక
4. గణితశాస్త్ర బోధన పద్ధతులు
5. బోధనోపకరణాలు
6. గణితశాస్త్ర ఉపాధ్యాయుడు, బోధన, సాంకేతిక విధానాలు, గణిత సంఘాలు
7. మూల్యాంకనం.
పాత ప్రశ్నపత్రాలు చూస్తే...
గత పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎక్కువ శాతం ప్రశ్నలు ఏయే అధ్యాయాల నుంచి అడిగారో ఒక నిర్ణయానికి రావచ్చు. గతంలో ప్రశ్నల స్వభావం పరిశీలిస్తే- ఎక్కువ శాతం జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు గమనించవచ్చు. కానీ ఈసారి టెట్‌+టీఆర్‌టీ రెండింటినీ కలిపి ప్రశ్నపత్రం రాబోతోంది. కాబట్టి జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలతో పాటు అవగాహన, అనుప్రయుక్త లక్ష్యాలకు సంబంధించిన ప్రశ్నలు అడగటానికి వీలుంది. అందుకని అభ్యసించే సమయంలోనే విశ్లేషణాత్మక ధోరణిలో, విషయాన్ని తరగతి గది పరిస్థితులకు అన్వయించుకోవడం, తదనుగుణంగా సన్నద్ధత వుండేటట్లు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి మ్యాథ్స్‌ మెథడాలజీ సిలబస్‌ దాదాపు ఒకే విధంగా ఉంది. కేవలం ప్రశ్నల సంఖ్యలో తేడా వుంటుంది.
* ప్రధానంగా గణిత విద్యావిలువలు, భారతీయ గణితశాస్త్రజ్ఞుల కృషిలో ఆర్యభట్ట, భాస్కరాచార్య-||, శ్రీనివాస రామానుజన్‌.
* డా|| బీఎస్‌ బ్లూమ్‌ విద్యార్థుల వర్గీకరణ, ఇందులో ముఖ్యంగా జ్ఞానాత్మకరంగానికి చెందిన అంశాలు అభ్యసించాలి.
* గణిత విద్యాప్రణాళికలో విద్యాప్రణాళిక నిర్వహణ సూత్రాలు, సిలబస్‌ నిర్వహణ విధానాలలో ఏక కేంద్ర, సర్పిల పద్ధతులు.
* గణితశాస్త్ర బోధనా పద్ధతులలో ఆగమన, నిగమన పద్ధతులు, ప్రకల్పన, ప్రయోగ పద్ధతులు, సమస్యా పరిష్కార పద్ధతి.
* పాఠ్యపథక రచనలోని హెర్బార్షియన్‌ సోపానాలు
* బోధనోపకరణాలలో ఎడ్గార్‌డేల్‌ శంఖాకార అనుభవం, వివిధ రకాల బోర్డులు, గణిత పేటిక.
* మేథమేటిక్స్‌ ఒలింపియాడ్‌, గణిత పోటీలు, గణిత సంఘాలు
* గణితంలో వేగం, కచ్చితత్వాన్ని పెంపొందించే మార్గాలు, మౌఖిక పని
* నిరంతర సమగ్ర మూల్యాంకనం- మూల్యాంకనంలోని రకాలు, విషయతంత్ర పరీక్షలు - ఉత్తమ నికష లక్షణాలు మొదలైన అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది.
వీటిని గమనించండి
* చదవడం, మాదిరి ప్రశ్నపత్రాల అభ్యాసం, తప్పులు సరిదిద్దుకోవడం నిరంతరం (పరీక్ష రోజు వరకూ) సాగాలి.
* పరీక్ష విధానం తెలుసుకొని, సరైన అవగాహనతో సమయపాలనతో అభ్యసిస్తే విజయం మీ పొంతం.
* సెకండరీ గ్రేడ్‌ టీచరు ఉద్యోగాలకంటే స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షకు పోటీ ఎక్కువ. కాబట్టి పోటీతత్వం పెంచుకొని విజయం వైపు కొనసాగాలి.
* సన్నద్ధతలో ఏ పరిస్థితిలోనూ అంతరాయం రాకుండా చూసుకోవాలి.
* సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఏం చదవాలి? ఎలా చదవాలి? అనే మార్గాన్ని నిర్దేశించుకోవాలి. ఆలస్యం చేయకుండా సన్నద్ధత మొదలుపెట్టి, విజయవంతంగా కొనసాగించాలి.
సన్నద్ధత ఎలా ఉండాలి?
తెలుగు అకాడమీ పుస్తకాలపైన మాత్రమే ఆధారపడకూడదు. ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్‌ పరిశీలించి తదనుగుణంగా తయారీ సాగాలి.
* పాత ప్రశ్నపత్రాలు టెట్‌, డీఎస్‌సీ- రెండింటికీ సంబంధించినవి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎక్కువగా ఏ అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయో ఆ అంశాలూ, ప్రాథమిక భావనలూ విశ్లేషణాత్మకంగా అభ్యసించాలి.
* అవగాహన, అన్వయ రూపంలో ఉండే ప్రశ్నలకు జవాబులు రాసే విధంగా సన్నద్ధత మెరుగు పరచుకోవాలి. ఇందుకు మాదిరి పరీక్షలు, సాధన చేయడం ఉపకరిస్తాయి.
* కేవలం విషయాన్ని అభ్యసించడమేగాక, పునశ్చరణ చేయాలి. సవరణాత్మక అభ్యసనం అవసరం.
* 'మే' మాసం వరకూ మధ్యలో ప్రేరణ, ఆత్మవిశ్వాసం తగ్గకుండా నిరంతర సన్నద్ధత కొనసాగాలి.
* ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌, ఆప్షనల్‌తో మ్యాథ్స్‌ మెథడ్స్‌తో రాసేవారికి కూడా వారి మెథడ్స్‌ అంశాలు చాలావరకూ ఇందులో దోహదపడతాయి.
ఉదా:
* ఫలితాలను సరిచూడడం అనేది ఏ లక్ష్యానికి చెందినది.
1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం
జవాబు: 2
* గణిత బోధనలో మౌఖికపని (Oral Work) విద్యార్థుల్లో ఏ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది?
1) సత్వర నిర్ణయం 2) పరిశీలన 3) ఏకాగ్రత 4) క్లిష్ట సమస్యల సాధన
జవాబు: 3
* Kuder Richardson అంచనా పద్ధతి దేన్ని పరీక్షించటానికి ఉపయోగిస్తారు?
1) లక్ష్యాత్మకత 2) విశ్వసనీయత 3) సప్రమాణత 4) సమగ్రత
జవాబు: 2
* ప్రస్తుత సిలబస్‌ ప్రకారం 10వ తరగతిలోని రేఖాగణితంలో సిద్ధాంతాలతోపాటు ఆ సిద్ధాంతాల ఆధారంగా జ్యామితి నిర్మాణాలను పొందుపరచారు. ఈ అమరిక కరికులమ్‌ ఏ నిర్మాణ సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది?
1) ఆచరణ విలువ 2) సాంస్కృతిక విలువ 3) సమాజ కేంద్రీకృత విలువ 4) క్రమశిక్షణ విలువ
జవాబు: 1
కళాశాలల మోసాలకిక కత్తెర!
* పూర్తి వివరాలతో మే నాటికి ప్రత్యేక వెబ్‌సైట్
* ప్రవేశాల్లో విద్యార్థులకు ఉపయోగపడేలా వెసులుబాటు
* ఉపముఖ్యమంత్రి ఆదేశంతో కసరత్తు ఆరంభం
ఈనాడు, హైదరాబాద్: భవనం ఒకచోట చూపించి, ఇంకోచోట కళాశాల నడపటం; ఒకే కళాశాల ప్రాంగణంలో బోర్డులు మార్చి రెండు, మూడు కాలేజీలు నడపటం; బోధన సిబ్బంది లేకున్నా ఉన్నట్లు ప్రచారం చేసుకోవటం; ఒకే బోధన సిబ్బందిని రెండు మూడు కళాశాలలు తమవారని చెప్పుకోవటం.. ఇలాంటి మోసాలన్నింటికీ వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ సర్కారు కత్తెర వేయబోతోంది. డిగ్రీ, పీజీ, వృత్తివిద్య కళాశాలలన్నింటి సమగ్ర సమాచారాన్ని ప్రవేశానికి ముందే విద్యార్థి చిటికెలో పొందేలా ప్రత్యేక అంతర్జాల గవాక్షం (వెబ్‌పోర్టల్) ఏర్పాటుచేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు కసరత్తు ఆరంభమైనట్లు సమాచారం. మే నెలాఖరునాటికి రాష్ట్రంలోని అన్ని డిగ్రీ, పీజీ, వృత్తివిద్య కళాశాలల పూర్తి వివరాలు సేకరించి ఈ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. వృత్తి విద్యా కళాశాలల్లోనైతే ఎంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయనే వివరాల్నీ సేకరించి పోర్టల్‌లో ఉంచుతారు. ''తద్వారా ప్రవేశాలకు ముందే విద్యార్థులు ఈ సైట్‌లోకి వెళ్ళి కళాశాలల స్వరూప స్వభావాలను అంచనా కట్టి, ఎందులో చేరితే బాగుంటుందో నిర్ణయించుకోవటానికి వీలవుతుంది. కళాశాలలు కూడా మోసానికి పాల్పడకుండా కట్టడి చేసినట్లవుతుంది'' అని ఉపముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యులు కడియం శ్రీహరి తెలిపారు.
ముందుగానే పరీక్షల తేదీల ఖరారు!
విద్యాశాఖలోని అన్ని విభాగాధిపతులతో ఉపముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వారంతా స్వీయలక్ష్యాలు నిర్దేశించుకొని, వ్యక్తిగతంగానే కాక తమ శాఖ పనితీరు మెరుగుకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని శ్రీహరి ఆదేశించారు. ప్రతి నెలో వారంపాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఆ ప్రణాళిక వివరాల్ని ముందస్తుగానే ముఖ్యకార్యదర్శికి అందజేయాలని సూచించారు. ''విద్యాసంవత్సరం ఆరంభం నాటికే ఆ ఏడాది విద్యా ప్రణాళికను ప్రకటించాలి. అంటే 2016లో జరిగే ఎంసెట్ తదితర ప్రవేశపరీక్షల తేదీలు ఈ జూన్‌లోనే సిద్ధమవుతాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాటుచేస్తారు. క్షేత్రస్థాయి పర్యటనల సందర్భంగా తమ పరిధి అంశాల్లో చర్యలు తీసుకునే అధికారం వారికి ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి విభాగాధిపతుల సమావేశం ఏర్పాటుచేసి పనితీరును సమీక్షిస్తాం. మెరుగ్గా పనిచేసేవారిని ప్రోత్సహిస్తాం.. వారు తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యాల దృష్టానే పనిచేయాలి.'' అని కడియం శ్రీహరి అధికారులకు స్పష్టంచేశారు.
ఖాళీలపై సీఎంనడిగి నిర్ణయం
విద్యాశాఖలో ఉన్న అన్ని రకాల ఖాళీలపై వివరాలు సేకరించాలని కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. వీటిపై పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చాక భర్తీ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నిర్ణయం తీసుకుందామని శ్రీహరి అన్నారు.
తెలంగాణలో నిరుద్యోగుల వివరాల సేకరణ
* త్వరలోనే ప్రత్యేక వెబ్‌సైట్‌
* ఉద్యోగాల భర్తీకి ప్రామాణికం
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగుల సమగ్ర వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు త్వరలోనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. ఉద్యోగాల భర్తీకి ఈ గణాంకాలనే ప్రామాణికంగా తీసుకోనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి కల్పన కార్యాలయాల్లో నిరుద్యోగుల సమాచార నమోదు విధానం ఉంది. కానీ.. 14 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సరిగా జరగక, నిరుద్యోగులు ఆ కార్యాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పునరుద్ధరణ (రెన్యువల్‌) చేసుకునేందుకూ వెళ్లడం లేదు. నిరుద్యోగుల వివరాల నమోదుకు ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించినా అది జరగలేదు. 2012 వరకు తెలంగాణలో 9,49,888 మంది నిరుద్యోగుల పేర్లు నమోదయ్యాయి. మూడేళ్లుగా వివరాల నమోదు మరీ మందగించింది. ఈ సమాచారాన్ని ఉపాధి కల్పన శాఖ క్రోడీకరించలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని యోచిస్తోంది. మార్చి మాసాంతానికి కమలనాథన్‌ కమిటీ ద్వారా ఉద్యోగుల విభజన పూర్తయ్యే వీలున్నందున.. ఆ తర్వాత నియామకాల ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని అంచనా వేస్తోంది. ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల వారీగా ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఇవిగాక నిరుద్యోగుల వివరాలను సేకరించి, వాటి ఆధారంగా నియామకాలను ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాలని భావిస్తోంది. మెడిసిన్‌, ఇంజినీరింగు, ఫార్మసీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ, బీఈడీ, టీటీసీ, పారామెడికల్‌ తదితర కోర్సులు పూర్తి చేసిన వారి వివరాలను విభాగాల వారీగా సేకరిస్తుంది. ఏ విభాగంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉంటే.. వారికి సంబంధించిన ఉద్యోగాలను త్వరగా భర్తీ చేసే అవకాశముంది. నిరుద్యోగుల జాబితాకు అనుగుణంగా ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పన కార్యక్రమాలను సైతం చేపడుతుంది. వివరాల నమోదుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, ఆన్‌లైన్‌ ద్వారా వివరాలను సేకరిస్తుంది. ప్రతీ అభ్యర్థి వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, కుటుంబ సమాచారం, ఆదాయం, ఆర్థిక స్థితిగతులు, అభ్యర్థులకు ఆసక్తి గల ఉద్యోగ, ఉపాధి రంగాల వివరాలను నమోదు చేస్తుంది. సామాజిక వర్గం, వికలాంగులు, మహిళలు వంటి కేటగిరీల వారీగా వాటిని క్రోడీకరిస్తుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్‌ యువ కిరణాల పథకం కింద ఆన్‌లైన్‌లో నిరుద్యోగుల వివరాలను సేకరించారు. వాటిని ఉపయోగించలేదు. అలా కాకుండా, ఈసారి వివరాలను పక్కాగా సేకరించి, ఉద్యోగాలను కలిపంచాలని సర్కారు యోచిస్తోంది. ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చినా... ఉపాధి కల్పనశాఖ ద్వారా నిరుద్యోగుల నమోదు ప్రక్రియ యథాతథంగా సాగుతుంది.
డీఎస్సీ ద్వారానే రెండు వేల గిరిజన ఉపాధ్యాయుల భర్తీ
* మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడి
ఈనాడు-హైదరాబాద్: డీఎస్సీ-2014 ద్వారానే గిరిజన సంక్షేమ శాఖలోని రెండు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విద్యా శాఖను కోరినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన గురుకుల విద్యాలయాల సంస్థ 23వ పాలకమండలి సమావేశం ఫిబ్రవరి 9న జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం ఎమ్మెల్సీలు చైతన్యరాజు, గాదె శ్రీనివాసులునాయుడు, రవివర్మతో కలిసి మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పలు సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. గురుకుల విద్యాలయాల పరిధిలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసే 502 బోధనేతర సిబ్బందిలో 371 మంది గిరిజన అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. తొలిదశలో గిరిజన అభ్యర్థుల సర్వీసును క్రమబద్ధీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గురుకుల విద్యాలయాలపై పర్యవేక్షణ కోసం జిల్లాల్లో సమన్వయ అధికారులను నియమించనున్నామని తెలిపారు.
తిరువనంతపురంలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో విలువిద్యలో స్వర్ణాన్ని సాధించిన బైరాగినాయుడిని మంత్రి రావెల అభినందించారు. విశాఖ జిల్లా పాడేరు శివారులోని లోచలిపుట్టు గ్రామంలో పేద కుటుంబానికి చెందిన బైరాగినాయుడు ఆదర్శప్రాయుడని కొనియాడారు.
సివిల్స్‌ నిబంధనల్లో మార్పులుంటాయా?
సివిల్‌ సర్వీసెస్‌ రాయదలిచిన అభ్యర్థులకు ఈ పరీక్షపై ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వాటిని నివృత్తి చేసుకుంటే సన్నద్ధత ప్రణాళికపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించటానికి వీలవుతుంది. ఆశావహుల్లో చాలామందిని కలవరపరుస్తున్న కొన్ని అనుమానాలూ, వాటికి సమాధానాలూ... ఇవిగో!
1. కిందటి సంవత్సరం సీశాట్‌ వివాదం మూలంగా సివిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదలలో ఆలస్యం జరిగిందనీ, ఎన్నికల మూలంగా ఆగస్టులో పరీక్ష జరిగిందనీ భావిస్తున్నాం. మరి ఈ ఏడాది కూడా ఆగస్టులోనే ఎందుకని నిర్వహిస్తున్నారు?
* రెండో పాలనాసంస్కరణల కమిషన్‌ పరీక్షల నిర్వహణ వ్యవధిని తగ్గించాలని సిఫార్సు చేసింది. ఆ ప్రకారం యూపీఎస్‌సీ టైమ్‌ టేబుల్‌ను మార్చింది. ఇప్పటినుంచీ పరీక్ష నోటిఫికేషన్‌ మేలో వస్తుంది. ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ) ఆగస్టులో, ప్రధానపరీక్ష (మెయిన్స్‌) డిసెంబరులో జరుగుతాయి. ఇది శాశ్వతంగా కొనసాగనున్నది.
2. వయసు పరిమితినీ, ప్రయత్నాల సంఖ్యనూ తగ్గిస్తారని కొన్ని పత్రికలు వార్తలు రాశాయి. యూపీఎస్‌సీ దాన్ని నిరాకరించింది. ఈ వివాదం ఎందుకని ఏర్పడింది?
* 2015 నుంచి వయసు పరిమితిని తగ్గించవచ్చనే ప్రస్తావన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనెల్‌ వెబ్‌సైట్‌లో ఉంది. దాని ఆధారంగా వార్తాపత్రికలు అలా రాశాయి. ఇది విద్యార్థుల్లో తికమకను సృష్టించింది.
2014 ఫిబ్రవరి 10న ప్రభుత్వం గ్రామీణ అభ్యర్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయత్నాల సంఖ్యలో వెసులుబాటు గురించి ఇలా ప్రకటించింది- The Cetral Government has approved ''two additional attemts to all categories of candidates w.e.f. Civil Services Examination 2014, with consequential age relaxation of maximum age for all catogories of candidates, if required'' దీని ప్రకారం వెబ్‌సైట్‌లో కనపడిన ప్రస్తావనకు ప్రాధాన్యం ఏమీ లేదు.
3. 2016 నుంచి వీటిని తగ్గిస్తారా?
* 32 ఏళ్ళ నుంచి 26 ఏళ్ళకు తగ్గించటం లాంటిదేమీ ఉండదు. వయసు పరిమితిని తగ్గించటం ప్రజలు హర్షించని చర్య కాబట్టి ఏ ప్రభుత్వమూ దానికి సిద్ధపడదు. అందుకని 2016 నుంచి 30 సంవత్సరాలూ, 4 ప్రయత్నాల సంఖ్య కొనసాగిస్తారని ఆశించవచ్చు. 30 సంవత్సరాల వయసు దాటుతున్నవారు పరీక్షకు హాజరై తమ ప్రతిభను చూపటం శ్రేయస్కరం.

4. 2014 మెయిన్‌ పరీక్షల ఫలితాలు ఎప్పుడు వస్తాయి? కటాఫ్‌ ఎంత ఉండొచ్చు?
* ఈ పరీక్షల కనీస- గరిష్ఠ కటాఫ్‌ శ్రేణి ఈ మేరకు ఉంటుందని ఆశించవచ్చు.
* జనరల్‌: 570-600
* ఓబీసీ : 540- 575
* ఎస్‌సీ: 520-540
* ఎస్‌టీ: 500-530

5. సీశాట్‌ సంగతి? అదే పద్ధతిలో కొనసాగుతుందా? మార్పులు చేస్తారా?
* ప్రభుత్వం అన్ని పార్టీల అభిప్రాయాలనూ సేకరించింది. 2015కి ఎలాంటి మార్పూ ఉండదు. కంపల్సరీ ఇంగ్లిష్‌ ప్రశ్నలను ర్యాంకింగ్‌కు పరిగణించబోరని ఆశిస్తున్నారు.
2016లో ఏమైనా మార్పులుంటే తగిన వ్యవధి ఉండగానే ప్రకటిస్తారు.
6. సివిల్స్‌ నోటిఫికేషన్‌ ఎప్పుడు రాబోతోంది? పోస్టుల సంఖ్య ఎంత ఉండవచ్చు?
* మేలో నోటిఫికేషన్‌ రాబోతోంది. పోస్టుల సంఖ్య గత ఏడాదిలాగే ఉండొచ్చు.
7. ఇప్పటి పరిస్థితి కచ్చితంగా ఏమిటి?
* 2015 సంవత్సరానికి కనిష్ఠ, గరిష్ఠ వయసు పరిమితులు కొనసాగుతాయి.

కొనసాగుతున్న ఆర్మీ ఎంపికలు మేలుకోండి!
* సోల్జర్ జనరల్ డ్యూటీకి అధికంగా అర్హత
కొత్తగూడెం (సింగరేణి), న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరుగుతున్న సైనిక ఎంపికల్లో భాగంగా ఫిబ్రవరి 8న సోల్జర్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాల కోసం మూడున్నరవేల మంది హాజరయ్యారు. అందులో 2,756 మంది ఫిబ్రవరి 9న జరిగే పరుగు పరీక్షకు అర్హులుగా నిలిచారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8 వరకు నిర్వహించిన సోల్జర్ జనరల్ డ్యూటీ ఉద్యోగానికి అధిక సంఖ్యలో అభ్యర్థులు అర్హతను సాధించడం విశేషం. సోల్జర్ జనరల్ డ్యూటీ ఉద్యోగానికి వివిధ తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి పదివేల మందికి పైగా అభ్యర్థులు హాజరుకాగా పరుగు పరీక్షను అధిగమించి 1,481 మంది వైద్య పరీక్షలకు అర్హత పొందారు. ఫిబ్రవరి 8న జరిగిన సైనిక ఎంపికల ప్రక్రియను నియామకాల ఉపసంచాలకులు జనరల్ (చెన్నై) సంగ్రం దాల్వి పరిశీలించారు.
చదువుల్లో నాణ్యత పడిపోతోంది మేలుకోండి!
* తెలంగాణకు కేంద్రం స్పష్టీకరణ
ఈనాడు, హైదరాబాద్‌: చదువుల్లో నాణ్యత నానాటికీ దిగజారుతోందనీ... త్వరగా మేలుకొని సరిదిద్దుకోవాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ముఖ్యంగా విద్యాశాఖలో పర్యవేక్షణ, ఉపాధ్యాయ బోధకుల ఖాళీల కొనసాగింపును తీవ్రంగా ఆక్షేపించింది. జిల్లా విద్యాశాఖాధికారులకు సమాంతరంగా సర్వశిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఎ)లో నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు అధికారుల (పీవో)ను నియమించి కొనసాగిస్తుండటం పట్ల అభ్యంతరం వ్యక్తజేసింది. ఎస్‌ఎస్‌ఎ, ఆర్‌ఎంఎస్‌ఎ (రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌) వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనల ఆమోదం కోసం రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, పాఠశాల విద్య సంచాలకులు చిరంజీవుల సారథ్యంలో దిల్లీ వెళ్ళిన బృందానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు ఈ విషయాల్ని కుండబద్దలు కొట్టి చెప్పినట్లు తెలిసింది. అందుకే ఎస్‌ఎస్‌ఎ కింద రాష్ట్రం రూ.2600 కోట్టు ఈసారి ప్రతిపాదించగా... కేవలం రూ.1650 కోట్లకే ఆమోదం వేసింది. అలాగే ఆర్‌ఎంఎస్‌ఎ కింద రూ.2001 కోట్లకు గానూ రూ.866 కోట్లు ఇవ్వటానికి అంగీకరించింది. మధ్యాహ్న భోజన పథకం కింద రూ.426కోట్లు అడగ్గా... కేంద్రం వాటాగా 245 కోట్లు ఇవ్వటానికి ఓకే అన్నారు. డైట్లకు 82 కోట్లు అడగ్గా... 8.60 కోట్లు మంజూరు చేశారు. అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానించాలన్న ప్రతిపాదన ఆమోదించలేదని సమాచారం. నిబంధనలకంటే దూరంగా ఉన్న పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యానికి నిధులు (20 వేల మందికి... ఒక్కొక్కరికి నెలకు రూ.300 చొప్పున) మంజూరు చేయటం చెప్పుకోదగ్గ అంశం. డీఈవోలకు సమాంతరంగా నియమించిన ఎస్‌ఎస్‌ఎ పీవోలకు జీతాలివ్వబోమని కేంద్రం స్పష్టం చేసింది. 'జిల్లాలో విద్యాశాఖ నిర్వహణ డీఈవో దగ్గరే ఉండాలి. ఇప్పుడు పీవోల నియామకంతో సమాంతర వ్యవస్థ నడుస్తోంది. ఎస్‌ఎస్‌ఎ నిబంధనల ప్రకారం... అసిస్టెంట్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ (ఏపీసీ)ను ఏర్పాటు చేయాలి. వారు డీఈవోల కింద పనిచేయాలి. కానీ అలాకాకుండా... డీఈవో స్థాయికంటే ఎక్కువ... రాష్ట్రస్థాయి కేడర్‌ అధికారుల్ని తీసుకొచ్చి పీవోలుగా ఎలా నియమించారు? ఆర్‌ఎంఎస్‌ఎలో ఉన్నట్లుగా... ఎస్‌ఎస్‌ఎలో కూడా ఎందుకని ఏపీసీతో నడిపించట్లేదు? పీవోలకు జీతాలు మేం ఇవ్వలేం. మీరే సర్దుబాటు చేసుకోండి' అని కేంద్ర అధికారులు చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు ఏడు జిల్లాల్లో ఇతర శాఖల నుంచి వచ్చిన వారు పీవోలు పనిచేస్తున్నారు. వీరిలో డిప్యూటీ కలెక్టర్‌ హోదా అధికారులు కూడా ఉన్నారు. వీరందరికీ జీతాల్ని ఎస్‌ఎస్‌ఎలోని ఇతర ఖాతాల్లో కోతపెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం దీనికి అంగీకరిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఉన్నతాధికారులు ఎస్‌ఎస్‌ఏ కింద మరికొన్ని ఆంశాలపై వివరించగా అదనంగా నిధులు మంజూరుచేసేందుకు కేంద్రం అంగీకరించినట్టు సమాచారం. ఈలెక్కన మరో రూ.300 కోట్లదాక వచ్చే అవకాశముంది.
ఆ పోస్టులెందుకు తీసేశారు?: నాలుగైదు రోజులుగా జిల్లాల్లో పర్యటించిన జేఆర్‌ఎం (జాయింట్‌ రివ్యూ మిషన్‌) బృందం ఫిబ్రవ‌రి 7న‌ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో మండలవిద్యాశాఖాధికారుల ఖాళీలు, ఉపాధ్యాయవిద్య కళాశాలల్లో బోధకుల ఖాళీల పట్ల ఆందోళన వ్యక్తంజేసింది. అంతేగాకుండా... ఎంఆర్పీ (మండల్‌ రిసోర్స్‌ పర్సన్‌)ల వ్యవస్థను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించింది.
వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనం, నాణ్యమైన విద్య
* కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి
కావలి (పురపాలకం), న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు, నాణ్యమైన విద్యను అందించేందుకు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కావలిలోని విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన విశ్వోదయ వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఏటా విశిష్ట వ్యక్తులకు అందించే విశ్వోదయ గౌరవ జీవిత సభ్యత్వాన్ని కళాశాల రెక్టార్.. వెంకయ్యనాయుడికి అందించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నాలుగు రకాల సంస్థల ఆధ్వర్యంలో పర్యవేక్షణ, 9 అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకుని ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటు తెలిపారు. ఈ-లైబ్రరీ, బాలికల చదువుకు ఆర్థిక సాయం, ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీ ఇలా 35 సంస్థలు దేశవ్యాప్తంగా పెట్టేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
విశాఖలో 'అభివృద్ధి కేంద్రం'!
* కెల్టన్‌ టెక్‌ యోచన
* భారత్‌, అమెరికాల్లో 500 ఉద్యోగాలు
ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌, గుడ్‌గావ్‌తోపాటు అమెరికాలో రెండు అభివృద్ధి కేంద్రాలు కలిగిన బీఎస్‌ఈ నమోదిత కంపెనీ కెల్టన్‌ టెక్‌ కంపెనీల కొనుగోలు ద్వారా వేగంగా కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. విశాఖలో అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కెల్టన్‌ టెక్‌ ఎండీ కృష్ణ చింతం తెలిపారు. 2015 మార్చితో ముగిసిన తొమ్మిది నెలలకు కంపెనీ ఆదాయం రూ.200 కోట్లు ఉండగా. వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.600 కోట్లకు (100 మిలియన్‌ డాలర్లు) పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కృష్ణ తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా కాలిఫోర్నియాలోని కుపర్టినోలో కొత్త కార్యాలయాన్ని (అభివృద్ధి కేంద్రం) ప్రారంభించనుంది. 2015లో మొత్తం 500 మంది సాఫ్ట్‌వేర్‌ నిపుణులను నియమిస్తామని, ఇందులో 100 మంది హైదరాబాద్‌లో ఉంటారని కృష్ణ వివరించారు. ప్రస్తుతం కంపెనీకి అమెరికాలో 200 మంది, భారత్‌లో 450 మంది ఉద్యోగులు ఉన్నారు. సోషల్‌, మొబైల్‌, క్లౌడ్‌, ఈఆర్‌పీ రంగాల్లోని రెండు, మూడు కంపెనీల కొనుగోలు కోసం దాదాపు 25 మిలియన్‌ డాలర్లను ఈక్విటీ, రుణ రూపంలో ఏడాది కాలంలో సమీకరించనున్నట్లు కృష్ణ చెప్పారు. ఇ-కామర్స్‌, మొబైల్‌, బిగ్‌ డేటా, సెక్యూరిటీ తదితర రంగాల్లోని కంపెనీలకు కెల్టన్‌ టెక్‌ సేవలందిస్తోంది. 2014కు భారత స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన ఐటీ సేవల కంపెనీల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందిన రెండో కంపెనీగా కెల్టన్‌ టెక్‌ను డెలాయిట్‌ గుర్తించింది. మొదటి స్థానంలో టెక్‌ మహీంద్రా ఉంది.
ఇలాగైతే చదువులెలా?
* పాఠశాలల్లో పర్యవేక్షణేదీ?
* ఎంఈవో పోస్టుల ఖాళీలపై పెదవి విరిచిన కేంద్ర బృందం
* తెలంగాణలో సర్వశిక్ష అభియాన్ అమలుపై తనిఖీ
ఈనాడు, హైదరాబాద్: ''పాఠశాలల్లో పర్యవేక్షణ దారుణంగా ఉంది! ఉపాధ్యాయులేం చెబుతున్నారో, ఎలా చెబుతున్నారో పర్యవేక్షించే వ్యవస్థే లేకుంటే ఎలా? ఇన్నిన్ని ఖాళీలుంటే చదువులెలా సాగుతాయి?" తెలంగాణలోని ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన కేంద్ర బృందం (జాయింట్ రివ్యూ మిషన్ - జేఆర్ఎం) చేసిన వ్యాఖ్య ఇది! సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఎ) పథకం అమలు తీరుతెన్నుల్ని, దాని ప్రభావాల్ని, ఫలితాల్ని సమీక్షించేందుకు ప్రపంచ బ్యాంకు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖల నుంచి ఓ ప్రతినిధి బృందం గత మూడు రోజులుగా రాష్ట్రంలోని నల్గొండ, మెదక్ జిల్లాలోని పలు పాఠశాలల్ని తనిఖీ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పరిస్థితుల్ని బేరీజు వేసింది. ఫిబ్రవరి 7న విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం కాబోతోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో భారీస్థాయిలో మండల విద్యాధికారుల (ఎంఈవో) పోస్టులు ఖాళీగా ఉండటం; డైట్ కళాశాలల్లో ఖాళీల కొనసాగింపుపై అసంతృప్తి వ్యక్తంజేసింది. పర్యవేక్షణ యంత్రాంగమే లేదని, ఎంఆర్‌పీల వ్యవస్థను ఎందుకు తీసేశారని ఆక్షేపించినట్లు తెలిసింది. 7వ తేదీన జరిగే సమావేశంలో తమ పరిశీలనాంశాలను, సూచనలు, సలహాలను కేంద్ర బృందం ఇచ్చే అవకాశముంది.
ఈ సారీ రూ.1800 కోట్లే!
వచ్చే విద్యా సంవత్సరానికి భారీ బడ్జెట్ ప్రతిపాదనలతో వెళ్లిన రాష్ట్ర బృందానికి కేంద్రం నుంచి ఆశించినంత మద్దతు లభించినట్లు లేదు. ఫిబ్రవరి 5, 6 వ తేదీల్లో సర్వశిక్ష అభియాన్ వార్షిక బడ్జెట్ ఆమోదానికి ఉద్దేశించిన పీఏబీ (ప్రాజెక్టు అనుమతుల మండలి) సమావేశంలో నిరుడిచ్చినంతే (రూ.1800 కోట్లు) ఈసారి కూడా ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలిసింది. చదువుల్లో నాణ్యతను పెంచాలనే ఉద్దేశంతో దాదాపు రూ.2600 కోట్ల మేరకు తెలంగాణ అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. అయితే, నిర్మాణాలకు ఉద్దేశించిన ప్రతిపాదనల్ని పీఏబీ తోసిపుచ్చినట్లు తెలిసింది. మరుగుదొడ్ల నిర్మాణాలకు మాత్రం సాయం చేసేందుకు అంగీకరించింది. దూర ప్రాంత విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించటం విశేషం. సుమారు 20 వేల మంది విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున నిధులు వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికి 1800 కోట్ల రూపాయలకే పీఏబీ ఆమోదం తెలిపినా రాష్ట్రంలో తాజాగా పెరిగిన వేతన సవరణల నేపథ్యంలో... ఉపాధ్యాయుల జీతభత్యాలకిచ్చే మొత్తంలో కాసింత పెంపుదలకు అవకాశాలున్నాయని అధికారులు ఆశిస్తున్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, పాఠశాల విద్య సంచాలకులు చిరంజీవితో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
సాధారణ డిగ్రీలకూ.. అసాధారణ అవకాశాలు!
* బీఏ, బీఎస్సీ, బీకాం తదితర కోర్సులకూ ప్రాంగణ నియామకాలు
* జేకేసీల్లో శిక్షణ పొందిన వారిలో 24 శాతం మందికి ఉద్యోగాలు
ఏపీలో ప్రాంగణ నియామకాల్లో కొత్త ఒరవడి మొదలైంది. ఇటీవలి దాకా ఇంజినీరింగ్ విద్యకే పరిమితమైన ఈ ప్రాంగణ నియామకాలు ఇప్పుడు డిగ్రీ విద్యార్థులకూ మంచి ఉద్యోగ అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సులల్లో చదువుతూ.. జవహర్ నాలెడ్జ్ సెంటర్(జేకేసీ)లలో శిక్షణ పొందిన వారు ప్రభుత్వ, ప్రయివేటు కళాశాల్లో ప్రాంగణ నియామకాలను అందిపుచ్చుకుంటున్నారు.
ఇదీ కారణం...
* ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల కుటుంబ నేపథ్యం, స్వభావం వేరు
* వీరు ఎక్కువకాలంలో ఉద్యోగంలో ఉంటారని సంస్థలు భావించడం
* విధుల నిర్వహణపట్ల శిక్షణను అందిస్తే.. ఇంజినీరింగ్ విద్యార్థులతో సమానంగా పనిచేస్తారని సంస్థలు నమ్మడం
ఇదీ లెక్క...
* ఏపీలోని 130 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జవహర్ నాలెడ్జి కేంద్రాలు పనిచేస్తున్నాయి.
* ఇవి ఉద్యోగం సాధించేందుకు అవసరమైన భావవ్యక్తీకరణ, విశ్లేషణ, సాంకేతిక, నైతిక అంశాలపట్ల తర్ఫీదు నిస్తున్నాయి.
* 17,123 మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందారు.
* 15,898 మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాలకు హాజరుకాగా 3817 (24%) మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011-12లో 9%, 2012-13లో 17%, 2013-14లో 11% మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాలు లభించాయి.
* ఏపీలోని 13 జిల్లాల్లో కలిపి ఇప్పటివరకు ఈ శాతం 22% వరకు నమోదుకావడం గమనార్హం.
జీతం ఇలా - నెలకు (రూ.లలో)
* యురేకా, ఐసీఐసీఐ వంటి సంస్థలు: రూ.6500 - 9000
* విప్రో విస్టా, ఐఎల్ఎం, ఐటీసీ వంటి సంస్థలు: రూ.12000-18000
* విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర సంస్థలు: ఆరునెలలపాటు ప్రత్యేకంగా శిక్షణ, నెలకు పదివేల రూపాయల ఉపకారవేతనం
ప్రాంగణ నియామకాల్లో పాల్గొంటున్న సంస్థలు
* బీపీవో రంగంలో: ఇన్ఫోసిస్, హిందుజా గ్లోబల్ సర్వీసెస్
* బ్యాంకింగ్ రంగంలో: హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్
* ఫార్మా రంగంలో: అరబిందో, హెటిరో డ్రగ్స్, డాక్టర్ రెడ్డీస్
* తయారీ రంగంలో: కోరమండల్, హెరిటేజ్
* నిర్మాణ రంగంలో: సువర్ణభూమి, శుభగృహ
* మార్కెటింగ్ రంగంలో: యురేకాఫోర్బ్స్, బిగ్ సీ
* ఇంకా..: వరుణ్ మోటార్స్, కిమ్స్ హాస్పిటల్, టెక్నోసాఫ్ట్, ఐటీసీ
* ఇలాంటివి మొత్తం 78 కంపెనీలు ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నాయి
గత మూడు సంవత్సరాలతో పోలిస్తే ... 2014-15 విద్యాసంవత్సరంలో డిగ్రీ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు పెరిగాయని జేకేసీ ముఖ్య సమన్వయకర్త డాక్టర్ జి. శ్రీనివాస్ తెలిపారు.
నియామకాల్లో మార్పులు అవసరమే... కానీ చేయట్లేదు
* ఆచార్య హరగోపాల్ కమిటీ వెల్లడి
* టీఎస్‌పీఎస్సీకి తుది నివేదిక సమర్పణ
* నివేదికను యథాతథంగా ప్రభుత్వానికిస్తాం: చక్రపాణి
ఈనాడు, హైదరాబాద్: రాబోయే 30 ఏళ్ల తెలంగాణ భవిష్యత్ కోసం జరిపే నియామకాలకు ఎలాంటి ఒత్తిడీ లేకుండా సిఫార్సులు చేస్తామంటూ ప్రకటించిన ఆచార్య హరగోపాల్ కమిటీ స్వల్ప మార్పులతోనే ఉద్యోగ పరీక్షల విధానానికి పచ్చజెండా ఊపింది. పాఠ్యప్రణాళికలో మాత్రమే తెలంగాణ నేపథ్యంలో భారీ మార్పులు చేశారు. దాదాపు 30 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ తుది నివేదికను ఫిబ్రవరి 5న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చంద్రావతి, మతీనొద్దీన్ ఖాద్రిలకు అందజేసింది. ''నియామకాల ప్రక్రియలో కొన్ని మార్పులు చేర్పులు అవసరమైనా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఉద్యమ నేపథ్యాన్ని, తెలంగాణ సంధికాలాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈసారికి నివేదిక ఇచ్చాం. భారీ మార్పులేమీ లేవు. సిలబస్‌లో మాత్రమే తెలంగాణ ఆర్థిక, రాజకీయ, చరిత్ర రంగాల్లో మార్పులున్నాయి. తెలంగాణలో పేద, గ్రామీణ ప్రాంత ప్రజలకు సరైన పాలన అందించడంలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలకపాత్ర వహించాల్సి ఉంది. కాబట్టి ఈ ఉద్యోగుల పాత్ర తగ్గించవద్దు. వీలైనన్ని ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి'' అని ఆచార్య హరగోపాల్, కోదండరాం వివరించారు. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగ ప్రకటన వచ్చేలా టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని హరగోపాల్ సూచించారు. లాంఛనాలు ముగిశాక వారంలోగా కమిటీ నివేదికను ప్రభుత్వానికి యథాతథంగా పంపిస్తామని కమిషన్ ఛైర్మన్ చక్రపాణి అన్నారు.
గ్రూప్-2 పోస్టులపై ఈసారికి ఆగాలి
గ్రూప్-2లోని కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్) పోస్టుల్ని గ్రూప్-1లోకి బదిలీ చేయాలన్న యోచనపై ఫిబ్రవరి 5న ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయం పత్రికల్లో రావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు భారీగా ఆందోళనకు దిగారు. వారు టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి వస్తున్నారనే సమాచారంతో ఫిబ్రవరి 5 వరకు తర్జనభర్జన పడిన కమిటీ సభ్యులు ఆ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని దానిపై భారం పెట్టేశారు. ఈసారికి పాతపద్ధతిలోనే (గ్రూప్-2 కీలక పోస్టులను ఆబ్జెక్టివ్ పరీక్ష పద్ధతిలోనే ఎంపిక చేయడం) కొనసాగిస్తే మేలని ప్రభుత్వానికి సూచన చేశారు. ''ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జీవో ఇచ్చాక ఇప్పటిదాకా ప్రకటనలు విడుదల కాలేదు. ఇప్పుడవి ఇచ్చాక కూడా ఈ ఒక్కసారికి మాత్రం గ్రూప్-2 పోస్టులను బదిలీ చేయకుండా యథాతథంగా కొనసాగిస్తే మంచిది'' అని ఆచార్య హరగోపాల్, కోదండరాం అన్నారు.
మా వల్లే మీకీ పదవులు..
హరగోపాల్ కమిటీ సమావేశానంతరం తెలంగాణ నిరుద్యోగ ఐకాస వ్యవస్థాపక అధ్యక్షుడు కడియం రాజు, ఛైర్మన్ కల్యాణ్, రాష్ట్ర అధ్యక్షుడు మానవతారాయ్‌ల ఆధ్వర్యంలో ప్రతినిధులు టీఎస్‌పీఎస్సీకి వచ్చి ఆందోళన చేశారు. ఛైర్మన్ ఘంటా చక్రపాణిని కలసి గ్రూప్-2 నుంచి గ్రూప్-1లోకి పోస్టుల బదిలీ చేయొద్దని వినతి పత్రం సమర్పించారు. ''నా చేతుల్లో ఏమీ లేదు... ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తాం. కమిటీతో మాట్లాడండి'' అంటూ ఆయన హరగోపాల్ కమిటీ వద్దకు వారిని పంపించారు. మార్పులు చేయాలని తామెలాంటి సిఫార్సు చేయట్లేదని హరగోపాల్, కోదండరాం వారికి వివరించారు. ఈ సందర్భంగా ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు మనవతారాయ్ టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ చక్రపాణిని ఉద్దేశించి విద్యార్థులను కించపరిచేలా మాట్లాడవద్దన్నారు. విద్యార్థుల వల్లే తెలంగాణ, వారి వల్లే మీకందరికీ ఈ పోస్టులు వచ్చాయని మరచిపోకూడదని గుర్తు చేశారు.
'గ్రూప్‌-1'లోకి మరో పది!
* గ్రూప్‌-2 నుంచి కీలక పోస్టులు బదిలీ
* పరీక్ష విధానం యథాతథం!
* హరగోపాల్‌ కమిటీ నివేదిక కమిటీ సిఫార్సులపై ఉత్కంఠ
ఈనాడు - హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పరీక్షల విధానాన్ని సమీక్షించటానికి ఏర్పాటైన ఆచార్య హరగోపాల్‌ కమిటీ ఫిబ్రవరి 5న తమ నివేదికను సర్వీస్‌ కమిషన్‌కు సమర్పించబోతోంది. కమిటీలోని సభ్యులంతా కాకుండా కొంతమందితో కూడిన కోర్‌గ్రూప్‌ సమావేశమై నివేదికకు తుది రూపమిస్తుంది. పరీక్షల విధానాన్ని ఈసారికి మార్చకూడదని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిన కమిటీ... మరేమైనా కీలకమైన సిఫార్సులు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అత్యంత ప్రధానమైంది... ప్రస్తుతం గ్రూప్‌-2లో ఉన్న పదిరకాల కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్‌) పోస్టులను గ్రూప్‌-1లోకి మార్చటం! మున్సిపల్‌ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ అధికారులు, డిప్యూటీ తహసిల్‌దార్లు... తదితర పోస్టులు ఇందులో ఉన్నాయి. నిజానికివి గతంలో గ్రూప్‌-1లోనే భాగంగా ఉండేవి. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీటిని గ్రూప్‌-2 కింద ఉంచి... ఎలాంటి మౌఖిక పరీక్షలు లేకుండా నేరుగా రాత పరీక్ష ఆధారంగానే నియామకాలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. కొన్ని చోట్ల మాస్‌కాపీయింగ్‌ జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. అదేగాకుండా... ఈ పోస్టుల్లో నియమితులయ్యే వారు తర్వాత పదోన్నతులపై గ్రూప్‌-1 అధికారులవటమేగాకుండా... తర్వాతికాలంలో ఐఏఎస్‌ హోదా కూడా పొందే అవకాశముంది. అలాంటి కీలకమైన ఉద్యోగాల్లోకి ఎలాంటి మౌఖిక పరీక్ష లేకుండా, రాత పరీక్షలో విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేయకుండా... కేవలం ఆబ్జెక్టివ్‌ విధానంలో అభ్యర్థుల్ని ఎంపిక చేయటం సరికాదని బలమైన వాదనలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం అప్పుడే జీవో నెంబర్‌ 622, 623ల ద్వారా ఈ పద్ధతిని రద్దు చేసి గ్రూప్‌-2లోని కీలకమైన పది పోస్టులను గ్రూప్‌-1లోకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2014 నుంచి ఇచ్చే ఉద్యోగ ప్రకటనలను ఈ కొత్త పద్ధతి ప్రకారం ఇవ్వాలని నిర్ణయించినా ఆ తర్వాత ఉద్యోగ ప్రకటనలేవీ వెలువడలేదు. మార్పు జీవోలు అమలులోకి రాలేదు.
పరీక్ష మార్చాలని అనుకున్నా...
పోస్టులకున్న ప్రాధాన్యం, ప్రజాసంబంధాలు, భవిష్యత్‌ పదోన్నతుల దృష్ట్యా తెలంగాణలో కూడా ఈ కార్యనిర్వాహక పోస్టులకు సరైన పరీక్ష అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. హరగోపాల్‌ కమిటీ కూడా దీనిపై విస్తృతంగా చర్చించింది. మొదట ఈ పోస్టులను అలాగే గ్రూప్‌-2లో ఉంచి పరీక్షలో మార్పులు (ఆబ్జెక్టివ్‌ కాకుండా రాతపరీక్ష, మౌఖిక పరీక్షలు ప్రవేశపెట్టడం) చేయాలనే సూచన వచ్చింది. అయితే, విద్యార్థుల ఆత్రుతను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి పరీక్షల విధానాన్ని మార్చకూడదని భావించిన హరగోపాల్‌ కమిటీ ఈ మార్పునకు మొగ్గు చూపే అవకాశాలు దాదాపు లేనట్లే! అయితే, మధ్యే మార్గంగా గ్రూప్‌-2లోని ఈ కీలకమైన కార్యనిర్వాహక పోస్టులను గ్రూప్‌-1లోకి మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా చేస్తే కమిటీ భావించినట్లుగా ప్రస్తుత పరీక్ష విధానం మార్చకుండానే ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరినట్లవుతుంది. కమిటీలో ఈ మార్పుపై సానుకూలత వ్యక్తమైనప్పటికీ తాము దీన్ని సూచించాల్సిన అవసరం లేదని... నిర్ణయాన్ని ప్రభుత్వానికే విడిచిపెట్టాలని కొంతమంది భావిస్తుంటే... సవరణలు సూచించటానికి ఏర్పాటైన తమ కమిటీ ఈ మార్పు సూచిస్తే తప్పేమీ లేదని మరికొందరు భావిస్తున్నారు. ఒకవేళ కమిటీ సిఫార్సు చేయకున్నా తర్వాతైనా ప్రభుత్వం ఈ మార్పు చేయటం అనివార్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తద్వారా గ్రూప్‌-1కు మాదిరిగానే ఈ పోస్టులకూ రాతపరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఈ కొత్త విధానంలో గ్రూప్‌-1లో ఇప్పటికే ఉన్న 20 రకాల పోస్టులకు ఈ పది పోస్టులు కూడా కలుస్తాయి. వీటన్నింటికీ (30) కలిపి ఒకే గ్రూప్‌-1 పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో సాధించే మార్కులు, ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో పోస్టులను కేటాయిస్తారు. పది రకాల పోస్టులు గ్రూప్‌-1లోకి బదిలీ అయితే మరో 17 రకాల నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు గ్రూప్‌-2లో మిగులుతాయి.
మార్పునకు కారణమేంటంటే...
ఈ కీలక కార్యనిర్వాహక పోస్టుల్లో నియమితులయ్యేవారు అనునిత్యం ప్రజలతో సంబంధాలు నెరపాల్సి ఉంటుంది. భావవ్యక్తీకరణ నైపుణ్యాలు కలిగి ఉండాలి. పదోన్నతులపై వీరు గ్రూప్‌-1 అధికారులవుతారు. కొంతమంది ఐఏఎస్‌ హోదా కూడా పొందొచ్చు. కాబట్టి అత్యంత కీలకమైన ఈ పోస్టులకు కేవలం ఆబ్జెక్టివ్‌ పరీక్షతో ఎంపిక చేయటం సరికాదనేది ప్రభుత్వ భావన.
స్థానిక కోటాలో ప్రవేశాలు పొందినవారికే చెల్లింపులు
* 371(డి) ప్రాతిపదికన మంజూరు
* స్థానికేతర కోటా రుసుము ఏపీ నుంచి వసూలు
* తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయాలు
* బోధన రుసుముల చెల్లింపులపై వారం రోజుల్లో మార్గదర్శకాలు
ఈనాడు-హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థుల బోధన రుసుముల చెల్లింపునకు సంబంధించిన మార్గదర్శకాలను వారం రోజుల్లో ఖరారు చేయాలని రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. 371(డి) ఆర్టికల్ ప్రాతిపదికన, స్థానిక కోటాలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు రుసుములను మంజూరు చేయాలని, స్థానికేతర కోటా వారి రుసుములను ఏపీ నుంచి వసూలు చేయాలనే ప్రతిపాదనను సూత్రప్రాయంగా ఆమోదించింది. స్థానిక, స్థానికేతరుల గుర్తింపునకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా రుసుమలను చెల్లిస్తామని ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధన రుసుముల విధానంలో సంస్కరణలు తేవాలని... విద్యా సంస్థల ప్రమాణాలను బట్టి చెల్లింపులు ఉంటాయని వెల్లడించింది.
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఫిబ్రవరి 4న సచివాలయంలో బోధన రుసుములు, ఉపకార వేతనాలపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశం జరిగింది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు విద్య, సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ... అర్హులైన విద్యార్థులందరికీ బోధన రుసుములు, ఉపకార వేతనాలను అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్రం నుంచి కొంత సాయం అందుతున్నా బీసీలు, ఈబీసీలు, మైనారిటీలు, వికలాంగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపైనే భారం పడుతోందన్నారు. ఎంత వ్యయమైనా భరిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారని గుర్తుచేశారు. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చినందున.. విద్యార్థులకు సత్వరమే ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థల ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని, 163 ఇంజినీరింగ్ కళాశాలల్లో కనీస ప్రమాణాలు లేవని తేలడంతో వాటి గుర్తింపు రద్దయిందని చెప్పారు. విద్యా రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని, 2015-16 విద్యా సంవత్సరం నుంచి దీనికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులు జీవితంలో స్థిరపడేలా, భవిష్యత్తుకు భరోసా కల్పించేలా విద్యావ్యవస్థ ఉండాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. మౌలిక వసతులు, బోధన సిబ్బంది, ఉత్తీర్ణతలు వంటి అంశాల ఆధారంగా ప్రమాణాలను నిర్దేశిస్తామన్నారు. హాజరు గుర్తింపునకు బయోమెట్రిక్ విధానం అమలు, కళాశాలల శ్రేణీకరణ (గ్రేడింగు) వంటి అంశాలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... బోధన రుసుములు, ఉపకార వేతనాల కోసం శాశ్వత విధానాన్ని రూపొందించాలని, పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆసరాగా ఉంటుందని అన్నారు.
ఏపీలోనూ 371 (డి) ప్రకారమే...
ఇటీవల మంత్రి మండలి సమావేశం నిర్ణయించిన విధంగానే 371 (డి) నిబంధనల ప్రాతిపదికన బోధన రుసుముల చెల్లింపులకు మంత్రులు ఆమోదం తెలిపారు. విద్యా సంస్థల్లో 80 శాతం వరకు స్థానిక కోటా కింద ప్రవేశాలు ఈ అధికరణ కిందే జరిగినట్లు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అర్హత పరీక్షకు ముందు నాలుగేళ్ల పాటు విద్యనభ్యసించిన కాలాన్ని పరిగణనలోనికి తీసుకొని స్థానిక అభ్యర్థుల ఖరారు జరుగుతోందని వారు వివరించారు. ఏపీలోనూ 371(డి)ని అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అక్కడ స్థానిక అభ్యర్థులకే బోధన రుసుములను చెల్లిస్తామని ప్రకటించిందని తెలిపారు. తెలంగాణలోనూ 371(డి) ప్రాతిపదికన స్థానిక, స్థానికేతర విధి విధానాలను ఖరారు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
14 లక్షల మందికి రూ.2,500 కోట్లు
సమావేశం సందర్భంగా దళిత అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్... బోధన రుసుములు, ఉపకార వేతనాల వేతనాల చెల్లింపుల విధానాలను దృశ్య ప్రదర్శన (పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్)తో వివరించారు. 14 లక్షల మంది విద్యార్థులకు రూ.2,500 కోట్ల సాయం అవసరమని తెలిపారు. 371(డి) అమలుకు నిర్ణయించినందున... అన్ని శాఖలు తమ పరిధిలోని విద్యార్థులు, బడ్జెట్ తదితర అంశాలపై సమగ్ర ప్రతిపాదనలను సమర్పించాలని మంత్రులు సూచించారు. వచ్చేనెల 11న జరిగే సమావేశంలో వీటిపై చర్చించి, ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధంచేసి, ముఖ్యమంత్రికి సమర్పిస్తామన్నారు.
పేద విద్యార్థులకు న్యాయం
ప్రతి పేద విద్యార్థీ ఉన్నత విద్యను నభ్యసించేలా ఆర్థిక సాయం అందించాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సమావేశం అనంతరం మంత్రులు ఈటెల, లక్ష్మారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం నాటి సమావేశంలో పథకం అమలు జరిగిన తీరుపై ప్రాథమికంగా చర్చించామన్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు పెరిగారు... అదనంగా ఎన్ని నిధులు అవసరం అనే వివరాలు ఇవ్వాలని సాంఘిక, గిరిజన, మైనారిటీ, బీసీ, మహిళా శిశు సంక్షేమశాఖలను కోరామన్నారు.
కొలువుల దిశగా..
* అడుగులేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
* ఖాళీల వివరాలు తెలపాలని అన్ని విభాగాధిపతులకు ఆర్థికశాఖ లేఖ
* జోనల్‌, జిల్లా స్థాయి ఉద్యోగాలపై కసరత్తు
* శాఖాపరమైన పరీక్షలకూ పచ్చజెండా
ఈనాడు, హైదరాబాద్‌: పరీక్షల విధానం, సిలబస్‌ రూపకల్పనపై టీఎస్‌పీఎస్సీ (తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) ఒకవైపు ముందస్తు సన్నాహాలు చేసుకుంటుంటే... మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కొలువుల కల్పన దిశగా హడావుడిలేకుండా ఆచితూచి ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ''ఉద్యోగ ప్రకటనలకు ప్రభుత్వమూ ఆత్రంగానే ఉంది'' అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కొద్దిరోజుల కిందట టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో హరగోపాల్‌ కమిటీతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! అందుకు కొనసాగింపుగా అన్నట్లు ఫిబ్రవరి 3న తెలంగాణ ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని విభాగాల అధిపతులకు కీలకమైన లేఖ రాసింది. తమ విభాగాల్లోని జోనల్‌, జిల్లాస్థాయి ఖాళీల వివరాలు తెలపాలనేది ఈ లేఖ సారాంశం. ఫిబ్రవరి 15 లోగా వివరాల్ని సేకరించి ఆర్థిక శాఖకు పంపాలని గడువు విధించింది. ఆర్థికశాఖ పంపిన నమూనా ఆధారంగా అన్ని విభాగాల అధిపతులు తమతమ శాఖల్లోని జిల్లా, జోనల్‌స్థాయి ఖాళీల వివరాలను సేకరించాల్సి ఉంటుంది. కమలనాథన్‌ కమిటీ రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన పూర్తవటానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో... ఈలోపు ఆ కమిటీతో సంబంధం లేని జోనల్‌, జిల్లా స్థాయి ఖాళీ లెక్కలు తేల్చేసేందుకే ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు సమాచారం. ఒప్పంద ఉద్యోగుల వ్యవహారంపై ఏర్పాటైన కమిటీ కూడా మార్గదర్శకాల్ని సిద్ధం చేస్తే... ఖాళీల సంఖ్యపై పూర్తి స్పష్టత వస్తుందన్నది ప్రభుత్వ భావన. ఒకవేళ ఒప్పంద ఉద్యోగుల్లేని విభాగాల్లో ఉన్న జోనల్‌, జిల్లాస్థాయి పోస్టుల్లో కొన్నింటికి ముందే ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినా చేయొచ్చు. మొత్తానికి ఉద్యోగ ప్రకటనలు జారీ చేశాక ఎలాంటి న్యాయపరమైన, సాంకేతిక ఇబ్బందులు, ఆటంకాలు తలెత్తకుండా ఉండేలా చూసుకొని ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. పరీక్ష విధానం, సిలబస్‌ స్థూల రూపకల్పనపై టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు చేసిన హరగోపాల్‌ కమిటీ తన తుది నివేదికను ఇంకా సమర్పించలేదు. నివేదిక రాగానే టీఎస్‌పీఎస్సీ సభ్యులోసారి సమీక్షించి ప్రభుత్వానికి పంపిస్తారు.
* అనుమతి వచ్చేసింది...
ఉద్యోగులకు ప్రతి ఆరునెలలకోసారి నిర్వహించే శాఖాపరమైన పరీక్షలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. పదోన్నతులు, ఇంక్రిమెంట్ల పెంపునకు ఉద్యోగులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాలి. రాష్ట్ర విభజన తదితరాంశాల కారణంగా దాదాపు ఏడాదికాలంగా తెలంగాణ ఉద్యోగులకు ఈ పరీక్షలు జరగట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం పచ్చజెండా వూపడంతో పరీక్షల్ని నిర్వహించటానికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది. ప్రశ్నపత్రాల రూపకల్పనకు కసరత్తు కూడా మొదలైంది. పరీక్షల రుసుమును ఆన్‌లైన్లో తీసుకోవాలని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో... ప్రభుత్వం నుంచి టీఎస్‌పీఎస్సీ పేరిట బ్యాంకు ఖాతా తెరిచేందుకు అనుమతి రావటం మిగిలి ఉంది.
ఇంటరు మూల్యాంకనంపై కెమెరా కన్ను!
* విజయవాడ కేంద్రంగా 'స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్'
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటరు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించే అంశాన్ని ఏపీ ఇంటరు విద్యామండలి అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో 54 పరీక్షా కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిల్లో గుర్తించిన వాటిల్లో ఈ చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. మరోవైపు 'స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్‌'ను విజయవాడ కేంద్రంగా చేపట్టాలని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రోజూ పరీక్ష మొదలైన కొద్దిసేపట్లోనే హైదరాబాద్‌లోని ఇంటరు విద్యా మండలి కార్యాలయానికి పక్కనే ఉన్న కళాశాల నుంచి ప్రశ్నపత్రాన్ని తెప్పిస్తున్నారు. ప్రశ్నపత్రాల మాధ్యమాలను అనుసరించి అక్కడే సిద్ధంగా ఉండే అధ్యాపకులు 'స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ తయారు చేస్తున్నారు. దీనిని వెంటనే జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాలకు పంపుతున్నారు. ఇదంతా గోప్యంగా జరుగుతోంది. ఇదే సమయంలో ప్రశ్నపత్రంలో తప్పులుంటే అధ్యాపకులు నిర్థారించిన అనంతరం వెంటనే పరీక్షా కేంద్రాలకు చేరవేస్తూ వస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినందున హైదరాబాద్ నుంచి ఏపీ వరకూ ఈ చర్యలు తీసుకోవడం కష్టమైన విషయంగా మారింది. 225 కిలోమీటర్ల దూరంలో పరీక్షలు జరుగుతున్నందున ప్రశ్నపత్రాన్ని హైదరాబాద్‌కు తెప్పించి 'స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్‌ను తయారుచేయించడం కష్టం. అందువల్లే ఈ ప్రక్రియను పూర్తిగా విజయవాడ కేంద్రంగా జరపాలని యోచిస్తున్నామని ఇంటరు విద్యా మండలి కార్యదర్శి రామశంకర నాయక్ తెలిపారు.
కేంద్ర భద్రతా బలగాల్లో భారీగా నియామకాలు!
* 62వేలకు పైగా ఖాళీలు
* అక్టోబరులో నియామకం పూర్తి
దిల్లీ: కేంద్ర పారామిలటరీ, పోలీసు సంస్థల్లో ప్రభుత్వం ఈ ఏడాది భారీ ఎత్తున నియామకాలు చేపట్టనుంది. కానిస్టేబుల్ పోస్టుల్లో 62వేల మందికిపైగా నియమించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర రిజర్వు పోలీసు బలగం(సీఆర్‌పీఎఫ్), సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), భారత్-టిబెట్ సరిహద్దు పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్‌బీ), కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగం(సీఐఎస్ఎఫ్), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), సచివాలయ భద్రతా బలగం(ఎస్ఎస్ఎఫ్) వంటి కేంద్ర బలగాల్లో అభ్యర్థులను నియమించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ వర్తిస్తుంది. 2002 గుజరాత్ అల్లర్ల బాధితులు, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులపై ఆధారపడిన వారికి, ఆ బాధితుల పిలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ''ఈ బగాల పాత్ర పెరగడాన్ని, ఇటీవల కాలంలో ఈ బలగాలకు బెటాలియన్ల సంఖ్యను పెంచడాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంత భారీ ఎత్తున నియామకం చేపట్టాం.'' అని కేంద్ర హోం మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. తమ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అర్హత పరీక్షను నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. తుది నియామకం ఈ ఏడాది అక్టోబరులో పూర్తవుతుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో శిక్షణకు పంపిస్తామని ఆ అధికారి వెల్లడించారు.
నియామకం వివరాలు
మొత్తం ఖాళీలు : 62,390
మహిళా అభ్యర్థులకు కేటాయించినవి: 8,533
సీఆర్‌పీఎఫ్: 24,588
బీఎస్ఎఫ్: 22,517
సీఎస్ఎఫ్: 5,000
ఎస్ఎస్‌బీ: 6,224
ఐటీబీపీ: 3,101
అస్సాం రైఫిల్స్: 600
ఎస్ఎస్ఎఫ్: 274
ఎన్ఐఏ: 86
మూడంచెల పరీక్ష: దేహదారుఢ్యపరీక్ష, రాత పరీక్ష, వైద్యపరీక్ష
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
వయోపరిమితి: 18-23
జీతభత్యాలు: వేతనం-రూ.20,200, ఇతర కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు వర్తించే ప్రయోజనాలు.
విడివిడిగానే పరీక్షలు
* అధికారికంగా ప్రకటించనున్న మంత్రి గంటా
ఈనాడు-హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్, ఇతర వృత్తివిద్యా ప్రవేశపరీక్షలు విడివిడిగానే జరగనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశ అనంతరం ఈ విషయాన్ని తనను కలిసిన విలేకర్లతో మంత్రి పేర్కొన్నారు. పూర్తి వివరాను మంత్రి బుధవారం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గ సమావేశంలో కాకుండా సీఎంతో గంటా విడిగా ఎంసెట్, ఇతర పరీక్షల నిర్వహణ గురించి మాట్లాడినట్లు తెలిసింది.
'పది' పరీక్షల్లో ఉత్తీర్ణత పెరిగేలా చూడాలి
మరోపక్క పదో తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా అధికారులను కోరారు. ఏపీలోని 13 జిల్లాలకు చెందిన డీఈఓలతో విద్యా శాఖ కార్యదర్శి సిసోడియా, కమిషనర్ సంధ్యారాణి సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో మంత్రి గంటా కొద్దిసేపు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న మూడు నెలలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైనవని పేర్కొన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపుపైనా దృష్టిపెట్టాలని అధికారులనుద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తగిన మార్పులతో మున్ముందుకు!
లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్‌-1, 2 పరీక్షలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కదలిక మొదలైంది. తెలంగాణలో సిలబస్‌ సమీక్ష కమిటీ కసరత్తు పూర్తికావడంతో అభ్యర్థులు తమ సన్నద్ధత వ్యూహాన్ని సమీక్షించుకోవాల్సిన పరిస్థితి. తాజా పరిస్థితుల్లో గ్రూప్స్‌ పరీక్షలకు సమగ్రంగా తయారయ్యే వ్యూహం పరిశీలిద్దాం!
    రెండు రాష్ట్రాల్లోనూ లక్షల మంది ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్న నోటిఫికేషన్‌ ఇది. తెలంగాణ రాష్ట్రంలో సిలబస్‌ మార్పులు వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆ దిశగా కసరత్తు జరగకపోయినా అనివార్యంగా గణాంక సమాచారం, భౌగోళిక సమాచారం, ఇతర వాస్తవికాంశాల్లో అనివార్యంగా మార్పులుంటాయి. అందువల్ల పాత సమాచారం ఆధారంగా సన్నద్ధమవడం సమంజసం కాదు. నూతన సమాచారం అనుసంధానించుకోవాల్సిందే!
తెలంగాణ గ్రూప్‌-2 విషయానికి వస్తే 3 పేపర్ల ఆబ్జెక్టివ్‌ విధానం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే 3 పేపర్ల సిలబస్‌ల్లో కొన్ని మార్పులు ఉంటాయి.
పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌)
భారతదేశ చరిత్ర, భౌగోళిక అంశాలు, ఆర్థిక అంశాలు గతంలో మాదిరిగానే తయారవ్వాలి. బయోసైన్స్‌, భౌతికశాస్త్ర అంశాలు కూడా గత పరీక్షలకు తయారైనట్లుగానే మౌలిక అంశాలు, అనువర్తనాలపై దృష్టిపెడితే సరిపోతుంది. అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ వెయిటేజీలో మార్పు రావచ్చు. కానీ సన్నద్ధత తప్పక కొనసాగించాలి.
రెండు రాష్ట్రాల్లోనూ..
* జనరల్‌ నాలెడ్జ్‌ సంబంధిత అంశాల్లో మార్పులు చేసుకోవాలి. ప్రధానంగా రాష్ట్రస్థాయి జీకేలో విస్తృత మార్పులు తప్పవు.
* వర్తమానాంశాలు కూడా రాష్ట్ర పరిధికి లోబడి వస్తాయి. కాబట్టి పరిధిని దృష్టిలో పెట్టుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ కోణంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు.
* భౌగోళిక అంశాలకు సంబంధించి అనేక మార్పులు ఉంటాయి. రాష్ట్ర సంబంధిత పంటలు, ఖనిజాలు, జనాభా, జల వనరులు, ఇంధనశక్తి వనరులు, మౌలిక భౌగోళిక అంశాలు, పర్యాటకం, అడవులు, పారిశ్రామిక వ్యాప్తి లాంటి అనేక అంశాల్లో గణాంక సమాచారంతోసహా అనేక విషయాల్లో మార్పులు గమనిస్తూ తయారవ్వాలి.
* రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పరిణామం, సామాజిక అంశాల్లో ఆయా రాష్ట్ర అభ్యర్థులు అనుగుణమైన మార్పులను సమాచారంలో పొందుపరచుకోవాలి.
తెలంగాణ అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌లో భాగంగా అడిగే... రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక అంశాలపై ప్రత్యేక దృష్టిని పెట్టాలి. కాకతీయ ప్రభువులకు ముందున్న చారిత్రక అంశాలు తప్పనిసరిగా పరిశీలించాలి. అదేవిధంగా స్వాతంత్య్రోద్యమ కాలంనాటి తెలంగాణ చారిత్రక పరిణామాలపై పట్టు సాధించాలి. తెలంగాణ సాంస్కృతిక, సామాజిక అంశాలపై కూడా జనరల్‌ దృష్టితో సిద్ధపడాలి.
* విపత్తు నిర్వహణ ఎప్పటి మాదిరిగానే సిలబస్‌లో ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి రకరకాల విపత్తుల్ని ఎదుర్కునేందుకు నిర్దేశిత వ్యూహాలపై పట్టు బిగించాలి.
పేపర్‌- 2
రెండు రాష్ట్రాల్లోనూ పాలిటీ విభాగం ఎప్పటి మాదిరిగానే కొనసాగనుంది. అందులోనూ స్కోరింగ్‌ విభాగం కాబట్టి రాజ్యాంగ అంశాలపై విశ్లేషణాత్మకంగా తయారైతే మంచి ఫలితం ఉంటుంది. పాలిటీ ఆధారిత జీకేకి ప్రాధాన్యం తక్కువ. ఈ తేడాను గమనించి సన్నద్ధమవాలి.
తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర:
ఈ విభాగంలోనే భారీ మార్పులు ఉంటాయి. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య సామాజిక అంశాలు ప్రధానంగా తెలంగాణ పరీక్షల్లో ఉంటాయి. తెలంగాణ భూభాగానికి సంబంధించని రాజ్యపాలనలు గతంలో సిలబస్‌లో ఉండేవి. వాటిని వదిలేయడం ఉత్తమం. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. రెండు రాష్ట్రాల ఉమ్మడి అంశాలూ రెండు రాష్ట్రాల సిలబస్‌లో ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో తప్ప మిగతా విషయాల్లో తక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
తెలంగాణ సాంస్కృతిక అంశాలు వెలుగులోకి రానున్నాయి. వాటిపై పట్టు సాధించాలి. ముఖ్యంగా తెలంగాణ స్వాతంత్య్రం తదుపరి ఉద్యమాలు, ప్రస్తుత స్థితి వరకు కొనసాగిన పరిణామాలు సింహభాగం పొందే అవకాశం ఉంది. తెలంగాణ సాహిత్య గుబాళింపులపై పట్టు సాధించాలి.
     ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులు గత ధోరణిలోనే సన్నద్ధతను కొనసాగించవచ్చు. గతంలో హైదరాబాద్‌ రాజ్య చారిత్రక పరిణామాలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పటి పరిస్థితిలో ఉండకపోవచ్చు. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర పాలకులు, స్వాతంత్య్రోద్యమ కాలం నాటి ఆంధ్ర భూభాగ పరిణామాలు ప్రాధాన్యాన్ని పొందే అవకాశం స్పష్టంగా ఉంటుంది. స్వాతంత్య్ర అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ భూభాగాల్లో వచ్చిన ఉద్యమాలూ, ప్రభావాలూ చదువుతూ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014 వరకు ఉన్న అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం మీద రెండు రాష్ట్రాల అభ్యర్థులూ తమ తమ భూభాగాలకు సంబంధించిన చారిత్రక అంశాలకు తగిన ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉమ్మడి చారిత్రక అంశాలను వారి భూభాగ ప్రాధాన్యాన్ని బట్టి అధ్యయనం చేయాలి.
పేపర్‌-3 (ఆంధ్రప్రదేశ్‌ / తెలంగాణ ఆర్థిక వ్యవస్థలు)
రెండు రాష్ట్రాల అభ్యర్థులకు తయారీలో సవాల్‌గా తయారైన అంశం ఇదే అని చెప్పవచ్చు. విస్తృతమైన గణాంక సమాచారం (మార్పులు) సేకరించుకోవాలి. ఆర్థిక పరిణామాలను ఆయా రాష్ట్రాలకు తగిన రీతిలో అర్థం చేసుకోవాలి. వివిధ ఆర్థిక రంగాల్లో పరిధినీ, పరిమితినీ నిర్ణయించుకుని అధ్యయనం చేయాలి. రాష్ట్రాల వారీగా తక్కువ సమాచారం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో- ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్ని అధ్యయనం చేయడం క్లిష్టమే అయినా అనివార్యం. ముఖ్యంగా ప్రణాళికల ఆధారంగా గత 60 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి రాష్ట్ర కోణంలో చదవడం తక్షణ కర్తవ్యం. సహకార, పంచాయతీరాజ్‌ లాంటి అనేక చట్టాలు ప్రస్తుతానికి రెండు రాష్ట్రాలకూ పాతవే వర్తిస్తాయి. కాబట్టి వాటిని యథాతథంగా చదవవచ్చు. పారిశ్రామిక, పర్యాటక, ఐటీ, సైన్స్‌ విధానాల్ని గతంలో ఉన్న రీతిలో చదువుతూనే తాజా విధాన ప్రకటనలు విడుదలైతే అధ్యయనం చేయాలి. త్వరలో తెలంగాణ పారిశ్రామిక విధానం విడుదలవుతుంది. భూసంస్కరణల్లో వచ్చిన మార్పులు కీలకం. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి వర్తమాన ఆధారిత ఆర్థిక అంశాలకు 2008 పరీక్ష మాదిరిగానే పెద్దపీట వేసే అవకాశం ఉంది. అందువల్ల రెండు రాష్ట్రాల బడ్జెట్‌ (2015-16)లు, ఆర్థిక సర్వేలు (2014-15) మొత్తం మీద ప్రధాన భూమికను పోషించవచ్చు. వాటి ద్వారానే ఆర్థిక గణాంక సమాచారానికి విశ్వసనీయత సమకూరుతుంది. అందువల్ల రానున్న బడ్జెట్‌లు, ఆర్థిక సర్వేల అధ్యయనం మెరుగైన ఫలితాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఆర్థిక మూల వనరులు, తాజా గణాంకాలతోపాటు తులనాత్మక గణాంకాల అధ్యయనం కూడా మేలు చేస్తుంది. ఎప్పటి మాదిరిగానే సామాజిక ఆర్థిక విషయాలు, ఎకనమిక్‌ జాగ్రఫీ తగిన ప్రాధాన్యాన్ని తప్పక పొందే అవకాశం ఉన్నందువల్ల తమ రాష్ట్రాలకు సంబంధించిన సమాచారంపై అభ్యర్థులు దృష్టి నిలపాలి.
గ్రూప్‌-1 సంగతేమిటి?
వెలువడుతున్న సమాచారం మేరకు గ్రూప్‌-1 పరీక్ష నిర్మాణాంశాల్లో మార్పులు లేనప్పటికీ సిలబస్‌లో గట్టి మార్పులే తెలంగాణ సిలబస్‌ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ప్రిలిమ్స్‌లో చిన్న చిన్న మార్పులున్నాయి. తెలంగాణ భౌగోళిక, ఆర్థిక, చారిత్రక అంశాలు ప్రాధాన్యాన్ని పొందాయి. అందువల్ల ఆ మార్పులకు అనుగుణంగా స్పందించాలి. మెయిన్స్‌లో మొదటి పేపర్‌ వ్యాసరచనలో తెలంగాణ సంబంధిత అంశాలపై ఒక వ్యాసం వచ్చే అవకాశముంది. రెండో పేపర్‌లో తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక అంశాలు సగానికి పైగా మార్కుల వెయిటేజి పొందవచ్చు. తెలంగాణ భౌగోళిక అంశాలపై సమాధానాలు కోరే ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి, అధికంగా సన్నద్ధతలో మార్పులు రావాల్సి ఉంటుంది. మూడో పేపర్‌లో పాలిటీ, సాధారణ పాలనా నియమాలు, సామాజిక అవగాహన సిలబస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కేవలం 50 మార్కులకే పరిమితమైన పాలిటీని సాధారణ పాలన నియమాల్లో అనుసంధానించడం వల్ల ఉద్యోగంలో చేరకముందే పాలన అవగాహన పెరుగుతుంది. అలాంటి అవగాహన పెంచుకునేలా అధ్యయనం చేయాలి. నాలుగో పేపర్‌లో భారతదేశ, తెలంగాణ ఆర్థిక అంశాలను పేర్కొన్నారు. దీన్నిబట్టి ఈ పేపర్‌లో కూడా తెలంగాణ స్థితిగతులే ప్రధాన భూమికను పోషించే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక అంశాల అధ్యయనంపై ప్రత్యేక దృష్టిని నిలపాలి. అయిదో పేపర్‌ సైన్స్‌ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అవడం ద్వారా ప్రస్తుత పరీక్షలో సైన్స్‌ & టెక్నాలజీ పాత్ర తగ్గిందనే చెప్పవచ్చు. గతంలో 300 మార్కులకు ఉండే ఈ సిలబస్‌ 150 మార్కులకు మారిన నేపథ్యంలో సన్నద్ధతకు కేటాయించిన సమయాన్ని మార్చుకోవాలి.
పరీక్ష విధానంలో మార్పుల్లేవు
తెలంగాణ సిలబస్‌ కమిటీ పేర్కొన్నట్లుగా ప్రస్తుతం ఉన్న పరీక్ష విధానం కొనసాగనుంది. అందువల్ల గ్రూప్‌- 1, 2, 4 అభ్యర్థులు యథాతథంగా తమ సన్నద్ధతను కొనసాగించవచ్చు. అంటే గ్రూప్‌-1లో ప్రిలిమ్స్‌, రాతపరీక్ష (మెయిన్స్‌), ఇంటర్వ్యూ 3 అంచెల పద్ధతి యథాతథం. గ్రూప్‌-2లో కూడా ప్రస్తుతం ఉన్న 3 పేపర్ల ఆబ్జెక్టివ్‌ విధానం, గ్రూప్‌-4లో ప్రస్తుతం ఉన్న 2 పేపర్ల ఆబ్జెక్టివ్‌ విధానం కొనసాగనున్నాయి. జేఎల్‌, డీఎల్‌ లాంటి పరీక్షలు కూడా అంతే.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరీక్ష విధానాల్లో మార్పులు ఉండే అవకాశం లేదు.
మీమాంస విడిచి సన్నద్ధత...
2012 నాటి గ్రూప్‌-1 పరీక్షపై నిర్ణయం తీసుకోకుండా కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వడం సాధ్యమా అనే మీమాంసను విడిచిపెట్టి సన్నద్ధతకు సిద్ధపడాలి. 2012 నోటిఫికేషన్‌ నిబంధనల ప్రకారం ఏ దశలోనైనా పరీక్షను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎలానూ ఖాళీ పోస్టుల సంఖ్య భారీగానే ఉంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి పోస్టులు పొందాలంటే ఇప్పటినుంచే సన్నద్ధత ప్రారంభించాలి. పైగా సీనియర్‌ అభ్యర్థులతో పోటీ కూడా. కొత్త అభ్యర్థులకు గత సన్నద్ధత అనే అవరోధం లేదు కాబట్టి కొత్త సిలబస్‌నే ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం చేయడం ప్రారంభించాలి. సీనియర్లు అతి విశ్వాసం లేకుండా సున్నా నుంచి ప్రారంభిస్తున్నట్లుగా భావించి తయారైతే ఏర్పడిన గ్యాప్‌ నుంచి బయటపడవచ్చు. మార్కెట్లో తెలంగాణ చరిత్ర ఆర్థిక అంశాలపై లభిస్తున్న పుస్తకాలను నిశిత పరిశీలన అనంతరమే ఉపయోగించుకోవడం మంచిది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచురణలు విడుదల అవుతున్నాయి. వాటిని అధికారిక సమాచార పుస్తకాలుగా గుర్తించాలి. విశ్వవిద్యాలయాలు, అకాడమీ పుస్తకాలు కూడా కచ్చితమైన సమాచార వనరులు. సర్వీస్‌ కమిషన్‌ కూడా రిఫరెన్స్‌ పుస్తకాలు ఇచ్చే అవకాశం ఉన్నందున వాటిపై అధికంగా ఆధారపడాలి. సిలబస్‌ గురించిన సూక్ష్మ అంశాలు పూర్తిగా అందిన తరువాత మరింత లోతుగా అధ్యయనం చేయవచ్చు. అయితే పోటీ తీవ్రత దృష్ట్యా ఇప్పటి నుంచే సమాయత్తం అవడం మంచిది.
బోధన సిబ్బంది నియామకాలకు మార్చిలో ప్రకటన
నూజివీడు, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ట్రిపుల్ఐటీల్లో బోధన సిబ్బంది నియామకాల్లో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దుతున్నామని.. మార్చిలో బోధన సిబ్బంది నియామకాలకు ప్రకటన జారీ చేయనున్నట్లు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆచార్య ఎస్.సత్యనారాయణ తెలిపారు. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫిబ్రవరి 1న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నూతన విద్యా సంవత్సరం నుంచి ట్రిపుల్ఐటీల విద్యా విధానం (అకడమిక్ క్యాలెండర్)లో సమూల మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఓపెన్ నోటిఫికేషన్ ద్వారా బోధన నైపుణ్యం గలవారిని ఎంపిక చేస్తామని తెలిపారు. విద్యార్థుల్లో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ మెరుగుపరచి అంతర్జాతీయ స్థాయి విద్యనందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రిపుల్ఐటీల విద్యార్థులు గేట్, ఐఈఎస్ లాంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించేలా సిలబస్‌లో తగు మార్పులు చేయడానికి 'బోర్డ్ ఆఫ్ స్టడీస్‌'ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత గలవారిని అధ్యాపకులుగా గుర్తించడమే కాక వారి వేతన పెంపునకు కృషి చేస్తామన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల విభాగం పేరుతో వెబ్‌సైట్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ట్రిపుల్ఐటీ ఇన్‌ఛార్జి డైరెక్టర్ ఆచార్య కె.హనుమంతరావు, పరిపాలనాధికారి పి.రామనరసింహం, ఖజానా అధికారి జీఆర్కే రెడ్డి, పీఆర్వో వీరబాబు పాల్గొన్నారు.
3 వేల మంది పరిస్థితేంటి..?
* ఆ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం!
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని 143 ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలలకు గుర్తింపు నిరాకరించాలని నిర్ణయించిన నేపథ్యంలో... ఆ కళాశాలల్లో చేరిన విద్యార్థుల పరిస్థితేంటనే ప్రశ్న తలెత్తుతోంది. రెండో విడత కౌన్సెలింగ్‌లో 163 కళాశాలలకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. నిపుణుల కమిటీ తనిఖీల తర్వాత తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడే ప్రవేశాలుంటాయనేది సుప్రీం షరతుల్లో ప్రధానమైంది. అంటే ఒకవేళ గుర్తింపు రాకుంటే ప్రవేశాలు కోల్పోవటానికైనా సిద్ధమైతేనే విద్యార్థులు వాటిలో చేరాలని స్పష్టం చేశారు. ఆ మేరకు కన్వీనర్‌ కోటాలో చేరే విద్యార్థుల ఫీజును కూడా ప్రత్యేక ఖాతాలో ఉంచాలని సూచించారు. రెండో విడతలో సుమారు మూడువేల మంది దాకా విద్యార్థులు కన్వీనర్‌ కోటాలో ఈ కళాశాలల్లో చేరారు. ఇప్పుడు వీరికి ఆ రుసుము తిరిగిస్తారా? లేక ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేస్తారా అనేది తేలాల్సివుంది. ''కౌన్సెలింగ్‌కు అనుమతిచ్చేటప్పుడే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రవేశాలు తనిఖీల తర్వాత గుర్తింపునకు లోబడి ఉంటాయని. అయినా విద్యార్థులు చేరారంటే పూర్తిగా వారిదే బాధ్యత. వారి ఫీజుల్ని ఎలాగూ ప్రత్యేక ఖాతాలో ఉంచమన్నారు. కాబట్టి తిరిగి తీసుకునే అవకాశం ఎలాగూ ఉంటుంది'' అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మానవతా దృక్పథంతో ఈ విద్యార్థులను ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. అలా చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. పక్కనున్న కళాశాలల్లో ఏఐసీటీఈ నిబంధనల మేరకు ప్రత్యేకంగా సీట్లను సృష్టించి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఆ పనిని మళ్ళీ అధీకృత అధికారికి (ఉన్నత విద్యామండలికే) అప్పగించాల్సి ఉంటుంది.
143 ఇంజినీరింగ్ కళాశాలల్లో సౌకర్యాలు లేవు
* 20 కాలేజీల్లో 32 కోర్సులకే పచ్చజెండా
* 163 కళాశాలలపై ఐఐటీ, బిట్స్ పిలానీ నిపుణుల నివేదిక
* ఏఐసీటీఈ, పీసీఐలకూ సమాచారం
* సుప్రీంకు నివేదిక సమర్పించిన జేఎన్‌టీయూహెచ్
ఈనాడు, హైదరాబాద్: సుప్రీంకోర్టు గడపదొక్కిన తెలంగాణలోని 163 ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో 143 కళాశాలల పరిస్థితి నిబంధనలకు అనుగుణంగా లేదని నిపుణుల కమిటీ తేల్చింది. సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు ఐఐటీ హైదరాబాద్, బిట్స్ పిలానీ, జేఎన్‌టీయూహైదరాబాద్ నిపుణుల ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో కూడా కళాశాలల్లో లోపాలున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు ఆ నివేదికను జేఎన్‌టీయూహెచ్ సుప్రీంకోర్టుకు నివేదించింది.
జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపును నిరాకరించడంతో ఈ ఏడాది ఇంజినీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్‌లో 163 కళాశాలలకు అనుమతి లభించని విషయం తెలిసిందే. దీంతో అవి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఊరట పొందాయి. బయటి నిపుణులతో కూడిన కమిటీతో మళ్లీ తనిఖీలు చేయాలని ఆదేశిస్తూ రెండో దశ కౌన్సెలింగ్‌లో ఈ కాలేజీలకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఫలితంగా జేఎన్‌టీయూ మళ్లీ నవంబరు, డిసెంబరు నెలల్లో 163 కళాశాల్లో తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), భారతీయ ఫార్మసీ మండలి (పీసీఐ) నిబంధనల ప్రకారం కళాశాల భవనాలు, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తి, అధ్యాపకుల అర్హతలు, ప్రయోగశాలలు, గ్రంథాలయ, కంప్యూటర్ తదితర సదుపాయాలను కళాశాలల్లో పరిశీలించింది. 143 కళాశాలల్లో సదుపాయాలు ఏమాత్రం గుర్తింపునివ్వడానికి అనుకూలంగా లేవని తేల్చారు. ఎనిమిది బీఫార్మసీ కళాశాల్లో ఏడింటిలో నిబంధనల మేరకు సదుపాయాలు లేవని గుర్తింపు నిరాకరించారు. నిపుణుల కమిటీ పరిశీలించిన అంశాలను ఢిల్లీకి వెళ్లి ఏఐసీటీఈ, పీసీఐ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తెచ్చారు. నిపుణుల నివేదిక ప్రకారం జేఎన్‌టీయూ హైదరాబాద్ పలు నిర్ణయాలు తీసుకుందని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రమణారావు తెలిపారు. ''గత రెండు మూడేళ్లుగా కళాశాలల్లో ఈ లోపాలు కొనసాగుతున్నాయి. సరిదిద్దుకుంటామంటూ వారిచ్చిన స్వీయ హామీ మేరకు గుర్తింపు కొనసాగిస్తూ వచ్చాం. కానీ వారు హామీని నిలబెట్టుకోలేదు. అందుకే నిబంధనల మేరకు లేని కళాశాలలకు అనుబంధ గుర్తింపు నిలిపివేశాం. వచ్చే విద్యాసంవత్సరం లోపాల్ని సరిదిద్దుకుంటే మళ్లీ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయన అన్నారు.
నిపుణుల నివేదికతో జేఎన్‌టీయూ తీసుకున్న నిర్ణయాలు...
* ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం సదుపాయాలు సరిగ్గా లేనందున, భారీగా లోపాలున్నందున 143 కాలేజీల్లోని 807 కోర్సులకు తొలి సంవత్సరం గుర్తింపు రద్దు. కేవలం 20 కళాశాలల్లోని 32 కోర్సులకే గుర్తింపు.
* ఈ కళాశాలల్లో (163) నడుస్తున్న రెండు, మూడు, నాలుగో సంవత్సరం కోర్సులకు సంబంధించి లోపాలను (అర్హులైన అధ్యాపకుల నియామకం వంటివి) సవరించుకోవడానికి 45 రోజుల గడువు.
* కంప్యూటర్లు, గ్రంథాలయాల్లో పుస్తకాలు, తదితర స్వల్ప లోపాలను సరిదిద్దుకోవటానికి 45 రోజుల గడువు.
* నిబంధనలకు అనుగుణంగా లేని ఏడు బీఫార్మసీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పీసీఐకి సిఫార్సు
* నకిలీ సిబ్బందిని చూపుతున్నారంటూ 16 కళాశాలలపై కేసు పెట్టగా వీటిలో ఆరు కళాశాలలకు వర్సిటీ నిబంధనల ప్రకారం గుర్తింపు లభించింది. అయితే... పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేదాకా వీటి గుర్తింపును నిలిపివేయాలని నిర్ణయించారు.
'ఫాస్ట్‌' పథకం నిలిపివేత
* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌
* పాత ఫీజు రీయంబర్స్‌మెంట్‌ విధానమే కొనసాగింపు
హైదరాబాద్‌: ఫాస్ట్‌ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. జనవరి 30న జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పాత ఫీజు రీయంబర్స్‌మెంట్‌ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులు గానీ, వారి తల్లిదండ్రులు గానీ, కాలేజీల యాజమాన్యాలు గానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని అన్నారు.
విద్యార్థుల ఫీజు బకాయిలకు రూ. 862 కోట్లు
విద్యార్థుల ఫీజు బకాయిలకు రూ. 862 కోట్లు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని కేసీఆర్ చెప్పారు. గత ప్రభుత్వాలు నాలుగేళ్లుగా పీజు బకాయిలను తమ నెత్తిపై పెట్టిందన్నారు. ఈ మొత్తాలు రూ.1650 నుంచి రూ.1800 కోట్ల వరకు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక ఫీజు చెల్లింపునకు కొత్త పథకంపై చర్చోపచర్చలు జరిగాయని తెలిపారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత పేద పిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి కొంత ఉదారంగా ఉండాలన్న ఉద్దేశంతో పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించామన్నారు. ఫాస్ట్ పథకం ఇక ఉండదని స్పష్టం చేశారు. 371(డి) ప్రకారమే ముందుకెళ్తామని, దీనికి సంబంధించి ఎలాంటి వివాదం లేదన్నారు. ఈ ఏడాదికి సంబంధించిన బకాయిలను దఫాలుగా చెల్లిస్తామని, ఇప్పటివరకైతే పాతబకాయిలు పూర్తిగా చెల్లిస్తున్నామని చెప్పారు. స్కాలర్‌షిప్‌లపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిందండ్రులు, కాలేజీలు, స్కూళ్ల యజమాన్యాలు ఆందోళన చెందాల్సిన పనిలేదని సీఎం భరోసా ఇచ్చారు.
'ఫాస్ట్‌' ఉపసంహరణ ఆహ్వానించదగిన పరిణామం
* మంత్రి గంటా
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్‌ పథకాన్ని ఉపసంహరించుకోవటం ఆహ్వానించదగిన పరిణామమని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫాస్ట్‌ పథకం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తాము మొదటి నుంచీ అంటున్నామని, హైకోర్టు సైతం చెప్పాక తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుందని తెలిపారు. మిగిలిన వివాదాస్పద అంశాలపైనా ఇలాంటి సానుకూల నిర్ణయాలే తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
మార్కుల సమయంలో సరిచేస్తాం
* వీలున్నవారు ఇప్పుడు మార్చుకోవచ్చు
* లేకున్నా ఇబ్బందేమీ లేదు
* తెలంగాణ ఇంటర్ విద్యామండలి వర్గాల భరోసా
* జేఈఈ గందరగోళానికి పరిష్కారం
ఈనాడు, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ పరీక్షలో తెలంగాణ విద్యార్థులకు తలెత్తిన సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి అడుగులు వేస్తోంది. దరఖాస్తుల్లో మార్పులకు జనవరి 31 వరకు మాత్రమే గడువు నేపథ్యంలో మండలి అధికారులు దీనిపై సీబీఎస్ఈ అధికారులతో సంప్రదించి విద్యార్థుల్లో తలెత్తిన గందరగోళాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. దరఖాస్తులో ఏ బోర్డు కింద ఇంటర్మీడియెట్ పరీక్ష రాస్తున్నారని పేర్కొనే చోట తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి పేరు లేకపోవడంతో గందరగోళం తలెత్తిన సంగతి తెలిసిందే. 31 లోపు మార్పులు చేర్పులకు గడువున్న కారణంగా... వీలైన అభ్యర్థులు ఆన్‌లైన్లో తమ దరఖాస్తుల్ని తెరచుకొని... మండలి పేరు పేర్కొనే చోట ఇతర (అదర్స్) అనే ఆప్షన్‌పై నొక్కి 'తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అని రాసుకోవచ్చని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే... ఇప్పటికే ఏవైనా ఇతర మార్పులు చేసుకొని ఉంటే మళ్లీ మార్పులు చేర్పులకు సీబీఎస్ఈ వెబ్‌సైట్ అంగీకరించడం లేదనే ఫిర్యాదులొచ్చాయి. దీంతో చాలామంది విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు పేరు మార్చుకోలేని ఇబ్బంది తలెత్తింది. దీనిపై ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రత్యేకాధికారి వీరభద్రయ్య 30న సీబీఎస్ఈ అధికారులను ఆగమేఘాలపై సంప్రదించినట్లు సమాచారం. ''ఇప్పుడు మార్పులకు వీలైనవారు చేసుకోవచ్చు. లేకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంటర్ పరీక్షల్లో మార్కుల్ని తెలంగాణ బోర్డు ఇచ్చాకే ఎన్ఐటీ ర్యాంకులు ఖరారవుతాయి. కాబట్టి... ఆ మార్కుల్ని ఇచ్చేటప్పుడు ప్రవేశపత్రం సంఖ్య (హాల్‌టికెట్ నెంబర్) వారీగా చూసినప్పుడు ఏ మండలి పరిధిలో పరీక్ష రాశారనే సమస్యను పరిష్కరిస్తామని సీబీఎస్ఈ అధికారులు హామీ ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమస్య దాదాపు పరిష్కారమైనట్లే అని తెలంగాణ బోర్డు వర్గాలు తెలిపాయి.
కన్వీనర్ల జాబితాలివ్వండి...
ఎంసెట్ సహా ఇతర ఉన్నత, వృత్తివిద్య ప్రవేశపరీక్షలకు సంబంధించి కన్వీనర్ల పేర్ల జాబితాలను సమర్పించాలంటూ తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డి వివిధ విశ్వవిద్యాలయాలకు లేఖలు రాశారు. ఇప్పటికే సెట్ల తేదీలతో పాటు నిర్వహణ బాధ్యతలనూ (ఎంసెట్, ఈసెట్‌లను జేఎన్‌టీయూ హైదరాబాద్‌కు, మిగిలిన ఆరు సెట్లను కాకతీయ, ఉస్మానియాలకు) వివిధ విశ్వవిద్యాలయాలకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయా సెట్లకు కన్వీనర్లుగా ఎవర్ని అనుకుంటున్నారో తెలియజేయాలంటూ... విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు రాశారు. ఉపకులపతులు ముగ్గురు చొప్పున పేర్లను పంపితే... వారిలోంచి ఒకర్ని (ప్రతి సెట్‌కు ఒకరు) ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఎంపిక చేస్తారు.
పాఠ్యప్రణాళికలో తెలంగాణ ముద్ర
* పరీక్షల విధానం యథాతథం
* ప్రశ్నపత్రాల కూర్పులో మార్పులు
* హరగోపాల్‌ కమిటీ నిర్ణయం!
* ఒకట్రెండు రోజుల్లో నివేదిక
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ప్రస్తుత పరీక్షల విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని, ప్రశ్నపత్రాల కూర్పును మార్చాలని, పాఠ్యప్రణాళికలో మార్పులు, చేర్పులకు సిఫార్సులు చేయాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ కమిటీ నిర్ణయించింది. అన్ని అంశాల్లో తెలంగాణ ముద్ర కనిపించేలా పాఠ్యాంశాలను రూపొందించాలని పేర్కొంది. ఒకట్రెండు రోజుల్లో సంబంధిత నివేదికను టీఎస్‌పీఎస్సీకి సమర్పించనుంది. జనవరి 29న టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో హరగోపాల్‌తో పాటు కోదండరాం, అడపా సత్యనారాయణ, మల్లేశం, నాగేశ్వర్‌, కనకదుర్గ, రమా మెల్కోటె, నందనీసిద్ధారెడ్డి, శివారెడ్డి, లింగమూర్తి ఇతర సభ్యులు పాల్గొన్నారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్‌, చంద్రావతి, మతీనుద్దీన్‌ ఖాద్రిలు సమావేశానికి హాజరయ్యారు. పరీక్ష విధానంలో మార్పుల కోసం పలు ప్రతిపాదనలు వచ్చినప్పటికీ తగిన గడువు లేకపోవడంతో పాటు సత్వరమే ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉన్నందున ప్రస్తుత విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. గ్రూపు-1కి రాతపరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలు, గ్రూపు-2కి రాతపరీక్షల పద్ధతిని పాటించాలని అభిప్రాయపడింది. ఉమ్మడి రాష్ట్రంలో పీఎస్సీ పాలకమండళ్లు, ప్రభుత్వాలు చూపిన వివక్ష వల్ల తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తిని చాటేలా పాఠ్యాంశాలు ఉండాలని, విద్యార్థులకు మేలు కలిగేలా ప్రశ్నపత్రాల కూర్పు జరపాలనే అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
సిఫార్సులివీ..
* గ్రూపు-1లో ప్రాథమిక, ప్రధాన పరీక్షల విధానం కొనసాగుతుంది. ప్రిలిమ్స్‌ ఫలితాలను వడపోసి తుది పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రధాన పరీక్షలో ఆంగ్లంలో అర్హత సాధించిన వారినే పరిగణనలోకి తీసుకుంటారు. వారికి ఐదు ప్రశ్నపత్రాల విధానం కొనసాగుతుంది.
* గతంలో ప్రశ్నపత్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలే ఉండేవి. గణితానికి ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండేది. ఇందులో తెలంగాణ విద్యార్థులు ఎక్కువ మార్కులు పొందలేక నష్టపోయేవారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా నిర్వహించే పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులకు పూర్తిగా అనుకూలంగా ఉండేలా ప్రశ్నపత్రాల కూర్పు జరగాలి. గణితం ప్రాధాన్యాన్ని తగ్గించాలి.
* గతంలో ఇలా..
గతంలో మొదటి పేపర్‌లో సాధారణ వ్యాసం, రెండో పేపర్‌లో చరిత్ర, సంస్కృతి, వారసత్వం, రాజ్యాంగం, మూడో పేపర్‌లో భారత ఆర్థికాభివృద్ధి, ప్రణాళిక, ఏపీ ఆర్థికాభివృద్ధి, నాలుగో పేపరులో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పర్యావరణ శాస్త్రం, ఐదో పేపర్‌లో గణాంక అర్థవివరణ, సమస్యల పరిష్కారం ఉండేవి.
* ఇకపై ఇలా..
తాజా నిర్ణయం ప్రకారం మొదటి పేపర్‌లో సాధారణ వ్యాసం, రెండో పేపర్‌లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, భౌగోళికశాస్త్రం, మూడో పేపర్‌లో ఇండియన్‌ పొలిటీ, సమాజం, పాలన అంశాలుంటాయి. నాలుగో పేపర్‌లో భారత, తెలంగాణ ఆర్థికాభివృద్ధి; ఐదో పేపర్‌లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, గణాంక అర్థవివరణ ఉంటాయి. సాధారణ వ్యాసంతో పాటు చరిత్ర, సంస్కృతి, రాజనీతి, సమాజం, పాలన, ఆర్థికాభివృద్ధి తదితర అన్ని అంశాల్లో తెలంగాణ ముద్ర కనిపించేలా పాఠ్యప్రణాళిక ఉంటుంది. నోటిఫికేషన్‌ నాటికి పాఠ్యప్రణాళిక: ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్‌ నాటికి పాఠ్యాంశాలను కమిటీ సిద్ధం చేస్తుంది. ప్రశ్నపత్రాల్లో వీటికి సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి. పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ హరగోపాల్‌ కమిటీకి జనవరి 30 వరకు గడువు ఇవ్వగా జనవరి 29 నాటికే సిఫార్సులతో కూడిన నివేదిక సిద్ధమైంది. దీన్ని అధికారికంగా ఒకట్రెండు రోజుల్లో కమిషన్‌కు అందజేస్తుంది. కమిషన్‌ పాలకమండలి ఈ నివేదికను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపుతుంది. ప్రభుత్వం అనుమతించిన వెంటనే కార్యాచరణ ప్రారంభమవుతుంది. తమకు నిర్దేశించిన విధంగా పాఠ్యప్రణాళిక, పరీక్షల విధానంపై విస్తృత స్థాయిలో చర్చించామని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తెలిపారు.
అయిదేళ్లలో 5వేల స్టార్టప్ విలేజీలు!
* నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహం
* కళాశాల స్థాయిలో పారిశ్రామికవేత్తల గుర్తింపు
* ఐటీ రంగానికి మళ్లీ పూర్వ వైభవం
* స్టార్టప్-బూటప్ సదస్సులో ఏపీ ఐటీశాఖ మంత్రి రఘునాథరెడ్డి
ఈనాడు - విశాఖపట్నం: వినూత్న ఆలోచనలు కలిగిన విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రానున్న అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 5వేల స్టార్టప్ విలేజీలను ప్రారంభిస్తామని రాష్ట్ర సమాచార, సాంకేతిక (ఐటీ)శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. విశాఖలోని మధురవాడ ఐటీ ఆర్థికమండలి ఆవరణలోని స్టార్టప్ విలేజీ ప్రాంగణంలో జనవరి 29న ఏర్పాటుచేసిన 'స్టార్టప్-బూటప్ సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు ఇందులో పాల్గొన్నారు. విశాఖ, కాకినాడ, తిరుపతిలో స్టార్టప్ విలేజీలు అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి పల్లె తెలిపారు. నిపుణులైన విద్యార్థులను కళాశాల స్థాయిలో గుర్తించి ప్రోత్సహించడం వల్ల పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత ఐటీ ఎగుమతులు గణనీయంగా పడిపోయాయని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా రూ.65 వేల కోట్లు ఉండగా, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో రూ.1600 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. 3.30 లక్షలు ఉండే ఉపాధి అవకాశాలు 22,750కి పడిపోయాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ రంగానికి పూర్వ వైభవాన్ని తెచ్చే క్రమంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతోందని ప్రకటించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన సంస్థలకు ప్రభుత్వం అనేక రాయితీలు ప్రకటించిందన్నారు. ఎలక్ట్రానిక్, ఇన్నోవేషన్ విధాన ప్రత్యేకతలను కూడా మంత్రి రఘునాథరెడ్డి వివరించారు. అయిదేళ్లలో ఐటీ రంగంలో రూ.12 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించి 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో మరో నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. విశాఖలోని స్టార్టప్ విలేజీ దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉండేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. 750 మంది విద్యార్థులు ఐటీ రంగంలో తమ వినూత్న ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు.
విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయాలి..
రాష్ట్ర ఐటీ ముఖ్య సలహాదారు జె.సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతోపాటు వీరి సేవలు ప్రపంచానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నదే స్టార్టప్ విలేజీ ప్రధాన ఉద్దేశమన్నారు.
ఇంటికో ఐటీ నిపుణుడు
* విద్యార్థులకు ముఖ్యమంత్రి సందేశం
ప్రతి ఇంటికో ఐటీ నిపుణుడ్ని తయారు చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో మొదటిసారి విశాఖలో ప్రారంభించిన స్టార్టప్ విలేజీ సదస్సుకు ఆయన తన సందేశాన్ని పంపారు. విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలు సాకారమయ్యేలా ప్రతి కళాశాలలోనూ ఆలోచనా నిధి (ఇంక్యుబేషన్ సెంటర్లు) ఏర్పాటుచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. పదుగురికి ఉద్యోగాలు కల్పించే దిశగా నేటి యువతరం ఎదగాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ ఐటీ ఉద్యోగ నిపుణుడు ఉండాల్సిందేనన్నారు. రాష్ట్రంలోని విద్యార్థిలోకాన్ని ప్రోత్సహించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థను కూడా ప్రభుత్వం ప్రారంభించిందని చంద్రబాబు తెలిపారు.
ఎవరి దారి వారిదే!
* వేరువేరుగా ఎంసెట్‌, ఇతర పరీక్షల నిర్వహణ
* న్యాయపోరాటానికి సమయం కాదన్న ఉద్దేశంలో ఏపీ
* స్థానికేతర కోటాకు రెండు పరీక్షలు రాయాల్సిందే
ఈనాడు-హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విడివిడిగా ఎంసెట్‌, ఇతర వృత్తివిద్య ప్రవేశ పరీక్షలు జరగబోతున్నాయి. ఉమ్మడిగా పరీక్షలు జరపాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా విడిగా పరీక్షలు నిర్వహించే దిశగా సమాలోచనలు జరుపుతోంది. ఉమ్మడి పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో తదుపరి చర్యలపై దృష్టి పెట్టింది. ఉమ్మడిగా పరీక్షలు జరిపేలా న్యాయ పోరాటం చేయాలనే ఆలోచన వచ్చినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు అందుకు ఇది తగిన సమయం కాదని భావిస్తోంది. సమయాభావం దృష్ట్యా ఆ ఆలోచనను తాత్కాలికంగా పక్కనబెట్టాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. స్థానికేతర కోటాలో ఇక్కడి వారు అక్కడ, అక్కడి వారు ఇక్కడ చదవాలంటే రెండు చోట్లా పరీక్షలు రాయాల్సిందే.
ఒకే పాఠ్యప్రణాళిక.. రెండు ప్రశ్నపత్రాలు: ఒకే పాఠ్య ప్రణాళిక ఆధారంగా రెండు రాష్ట్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఏపీ ఉన్నత విద్యా మండలి ఎంసెట్‌, ఇతర వృత్తివిద్య పరీక్షలకు రూపొందించిన 'ప్రశ్నల నిధి' ఆధారంగా ప్రశ్నపత్రాలు తయారు చేస్తారు. ఎంసెట్‌ విషయంలో ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యా మండలి ఓ అవగాహనకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ అధికారులు ఎంసెట్‌ను నిర్వహించారు. ఈ బాధ్యతలను ఏపీలో జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగించనున్నారు. ఆంధ్రా, ఎస్వీయూ, నాగార్జున, జేఎన్‌టీయూ-అనంతపురంలకు ఐసెట్‌, లాసెట్‌, వ్యాయామ, పీజీ ఇంజినీరింగ్‌, ఈసెట్‌ బాధ్యతలు అప్పగించనున్నారు. ఆయా విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన పేర్లను అనుసరించి కన్వీనర్లను నియమించనున్నారు. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ కోసం ఏపీలోనూ ప్రధాన కేంద్రం ఏర్పాటు చేయడానికి సమాలోచనలు జరుగుతున్నాయి. ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జనవరి 27న మాట్లాడుతూ ఎంసెట్‌, ఇతర వృత్తివిద్య ప్రవేశపరీక్షల నిర్వహణపై రెండు రోజుల్లో తుదినిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు జనవరి 28న రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. వీరివురి సమావేశంలో ఎంసెట్‌, ఇతర పరీక్షల ఉమ్మడి నిర్వహణపై చర్చకు వచ్చినది లేనిదీ తెలియరాలేదు. ఈ పరిస్థితుల్లో అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఉమ్మడిగా ప్రవేశ పరీక్షలు జరిగేందుకు అవకాశాలు లేనట్టేనని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఏపీ కళాశాలల్లో 'బూట్‌క్యాంపులు'!
* 29న ప్రారంభించనున్న ఐటీశాఖ
* విద్యార్థుల ఆలోచనలకు ప్రోత్సాహం
ఈనాడు, హైదరాబాద్: వినూత్న ఆలోచనలతో విద్యార్థులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏపీ కళాశాలల్లో ఐటీశాఖ బూట్‌క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. సన్‌రైజ్ స్టార్టప్ టెక్నాలజీ రీసెర్చి ఇన్‌క్యుబేషన్ పార్కు(ట్రిప్)లో భాగంగా వీటిని జనవరి 29న విశాఖలో వందకు పైగా కళాశాలల్లో అధికారికంగా ప్రారంభించనుంది. విశాఖ కొత్త ఆలోచన కేంద్రానికి పైలెట్ ఇన్‌క్యుబేటర్‌గా ఎంపికైన మొబ్‌మి వైర్‌లెస్ కమ్యూనికేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వీటిని నెలకొల్పనుంది. స్టార్టప్ విలేజి పథకంలో భాగంగా 'కళాశాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభివృద్ధి క్లబ్‌లు రానున్నాయి. ఈ క్లబ్‌లు ఒక సంస్థను ఏర్పాటు చేసేందుకు విద్యార్థులకు అవగాహన, అధ్యయన మార్గాలుగా ఉపయోగపడతాయి. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఉత్పత్తులు, ఆలోచనల్ని ప్రచారం చేస్తూ, సమన్వయం చేసే బాధ్యతలు సంబంధిత కళాశాలల్లోని ఆయా క్లబ్‌లు నిర్వహిస్తాయి. కళాశాలల నుంచి వచ్చిన విభిన్న ఆలోచనలు క్లబ్‌ల ద్వారా ఇన్‌క్యుబేటర్ కేంద్రాల్లో ఆచరణలోకి తీసుకువచ్చే అవకాశం కలుగనుంది. విశాఖపట్నంలో ప్రారంభించనున్న బూట్‌క్యాంపు కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు హాజరుకానున్నారు.
ఇవీ ఉపయోగాలు...
* బూట్‌క్యాంప్‌లో ఆలోచనలను ప్రోత్సహించడం, విద్యార్థులు నైపుణ్యాల్లో శిక్షణ పొందడం, నూతన సాంకేతిక అంశాలపై సదస్సులు, మేథోమధన కార్యక్రమాలు, కళాశాల స్థాయిలోనే పరిశోధనల్ని ప్రోత్సహించడం, ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది.
* విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక పారిశ్రామిక వేత్తల సమన్వయంతో కొత్త ఆలోచనలు అమలు చేస్తూ విద్యార్థులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దనుంది.
* పరిశోధనలకు ప్రయోగశాలలు, అధిక సామర్థ్యం కలిగిన కంప్యూటర్లు, సర్వర్లు, టెలికం, డేటా కమ్యూనికేషన్ పరికరాలు అందుబాటులోకి వస్తాయి. కంప్యూటర్లు, ఇంటర్నెట్ 24 గంటలూ వినియోగించుకునే సౌకర్యం కలుగుతుంది.
* సెమినార్లు, సదస్సులతో విద్యార్థుల ఆలోచనలు, వారి ఇష్టమైన రంగాల్లో రాణించేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి ఆడియో, వీడియోలతో కూడిన ప్రచురణలు తీసుకురావచ్చు.
* కార్యనిర్వాహక కమిటీలో విద్యార్థులే సీఈవో, సీవోవో, సీఎంవో, సీఎఫ్‌వో, సీటీవో, సీసీవో, సీఎస్‌వోలుగా వ్యవహరిస్తారు.
తెలంగాణ 'జేఈఈ' విద్యార్థులకు గుర్తింపు సమస్య
* సీబీఎస్‌ఈలో రాష్ట్ర ఇంటర్‌ బోర్డుకు దక్కని సభ్యత్వం
* మార్పులు, చేర్పులకు గడువు జనవరి 31
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు కొత్త చిక్కు వచ్చిపడింది. ఈ రాష్ట్ర ఇంటర్‌ బోర్డుకు సీబీఎస్‌ఈలో ఇప్పటివరకు సభ్యత్వం దక్కకపోవడమే అందుకు కారణమవుతోంది. ఐఐటీల్లో ప్రవేశానికి మొదటి దశగా జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్స్‌ (జేఈఈ) మెయిన్‌ను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) నిర్వహిస్తుంది. అందువల్ల ఆయా రాష్ట్రాల ఇంటర్‌ బోర్డులు సీబీఎస్‌ఈలో సభ్యత్వం తీసుకోవాలి. విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఇంటర్‌ బోర్డు ఉమ్మడిగానే ఉండటంతో తెలంగాణ విద్యార్థులు సైతం ఏపీ ఇంటర్‌ బోర్డు నుంచి దరఖాస్తు చేసినట్లుగా చూపారు. తర్వాత బోర్డు రెండుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల్లో ఏమైనా మార్పుంటే జనవరి 31 లోపు మార్చుకోవాలని సీబీఎస్‌ఈ ప్రకటించింది. అంటే ఇక నాలుగు రోజుల వ్యవధే మిగిలి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యామండలికి ఇంకా సీబీఎస్‌ఈ నుంచి గుర్తింపు రాలేదు. దీంతో తాము తెలంగాణ నుంచి హాజరవుతున్నామని నమోదు చేసుకునేందుకు వీల్లేకపోతుందన్న ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.
జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. అంతేకాక వచ్చే విద్యాసంవత్సరం (2015-16) నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్‌ఐటీ తరగతులు ప్రారంభమవుతాయన్న వార్తలు వస్తున్నాయి. ఎన్‌ఐటీలో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రం వారికి ఉంటాయి. అంటే వరంగల్‌ ఎన్‌ఐటీలో సగం సీట్లు తెలంగాణ వారికే దక్కుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము తెలంగాణ రాష్ట్ర విద్యార్థులమైనా ఆంధ్రప్రదేశ్‌ నుంచి అని దరఖాస్తు చేస్తే మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన విద్యార్థులలో నెలకొంది.
తెలంగాణ ఇంటర్‌ బోర్డుకు కాబ్సేలో సభ్యత్వం..: తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యామండలికి కౌన్సిల్‌ ఆఫ్‌ బోర్డ్స్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (కాబ్సే)లో సభ్యత్వం దక్కింది. ఈ మండలిలో సీబీఎస్‌ఈతో పాటు అన్ని రాష్ట్రాల బోర్డులూ సభ్యులుగా ఉంటాయి. తాజాగా తెలంగాణ ఇంటర్‌ బోర్డుకు కాబ్సే సభ్యత్వం మంజూరైనా సీబీఎస్‌ఈ గుర్తింపు ఇంకా రాలేదు.
ఎంసెట్‌పై రెండు రోజుల్లో స్పష్టత!
* ఏపీ మంత్రి గంటా వెల్లడి
ఈనాడు-హైదరాబాద్: ఎంసెట్, ఇతర వృత్తివిద్య ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండురోజుల్లో స్పష్టత ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జనవరి 27న వెల్లడించారు. ప్రవేశ పరీక్షలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనూ సంప్రదింపులు జరిపారు. రాజ్‌భవన్‌లో 26న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లతో గవర్నర్ నరసింహాన్ ఎంసెట్‌పై చర్చించారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడిగా పరీక్షలు జరపాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంటోంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. ఇరు ప్రభుత్వాలూ పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటించేశాయి. ఈ తేదీల్లో కాకుండా..తెలంగాణ పేర్కొనే తేదీల్లో కూడా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. తదుపరి చర్యలపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ఇంటర్ విద్య మండలి కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఎన్ని రకాలుగా విజ్ఞప్తిచేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కొంతమంది న్యాయస్థానానికి వెళ్లాలని పేర్కొంటుండంగా..సమయాభావం..విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఇది తగిన సమయం కాదని భావిస్తున్నారు. ప్రవేశ పరీక్షలపై మంత్రి ఏపీ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సుమితావాద్రా, తదితరులతో చర్చించారు. త్వరలోనే ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్‌ల ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. తిరుపతిలో ఉపఎన్నికల వల్ల చిత్తూరు జిల్లాలో ఈ సంస్థల శంకుస్థాపన కార్యక్రమం వాయిదాపడిందన్నారు. త్వరలోనే ట్రిఫుల్ఐటీ, ఎన్ఐటీ, సెంట్రల్, ట్రైబల్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలసేకరణ పూర్తికానుందని పేర్కొన్నారు.
మౌఖిక పరీక్షలో మీ సత్తా చూపండి!
రాతపరీక్షలో ప్రతిభ చూపించి నెగ్గుకొచ్చినవారు కీలకమైన మౌఖిక పరీక్షలోనూ సత్తా చూపించాలి. ఉద్యోగసాధనకు ఇది అత్యావశ్యకం. ఐబీపీఎస్‌ క్లర్క్‌, రీజనల్‌ రూరల్‌ బ్యాంక్స్‌; NIACL - ఏఓ; యూఐఐసీ- ఏఓ, అసిస్టెంట్‌ పోస్టుల నియామకాల ప్రక్రియలో భాగంగా రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పాటించవలసిన మెలకువలు..
ఆఫీసర్‌ పోస్టు కోసం జరగబోయే మౌఖికపరీక్షలో అభ్యర్థులు ఆంగ్లభాషపై తమకున్న పట్టును నిరూపించుకోవాలి. అంటే సమాధానాలు ఇంగ్లిష్‌లో మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఉద్యోగం ఖరారైన తరువాత దేశంలో ఏ ప్రదేశంలోనైనా ఉద్యోగం రావచ్చు. అందుకని ఇంగ్లిష్‌పై పట్టు తప్పనిసరి.
క్లరికల్‌ పోస్టులు రాష్ట్రస్థాయిలో జరుగుతాయి. ప్రాంతీయ భాషపై (తెలుగు- ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు) పట్టు తప్పనిసరి.
రాతపరీక్షలో అభ్యర్థులు సబ్జెక్టుపై తమకున్న పట్టు నిరూపించుకున్నారు కాబట్టి, మౌఖికపరీక్షలో సబ్జెక్టు గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు.
వేటిపై దృష్టిపెట్టాలి?
1. భావ వ్యక్తీకరణ
2. సానుకూల దృక్పథం
3. కెరియర్‌పై పూర్తి అవగాహన
4. గ్రాడ్యుయేషన్‌/ పీజీలో చదివిన సబ్జెక్టులు
5. అభ్యర్థుల ఇంటిపేరు/ పేరు/ వూరు/ జిల్లాలకు ఉన్న ప్రాముఖ్యాలు- ప్రత్యేకతలు
6. కరంట్‌ అఫైర్స్‌ (ప్రత్యేకంగా పరీక్ష రోజు నాటి దినపత్రిక)
7. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీలు
8. ఇన్సూరెన్స్‌ కంపెనీలోని పోస్టులకు- ఆ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
9. బ్యాంకింగ్‌ టెర్మినాలజీ
10. ఐబీపీఎస్‌- క్లర్క్‌ పరీక్ష కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు, నేషనల్‌ బ్యాంకు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
డ్రస్‌ కోడ్‌: మౌఖికపరీక్ష రోజు అభ్యర్థులు డ్రస్‌కోడ్‌ తప్పనిసరిగా పాటించాలి. ముదురు రంగు దుస్తులు ధరించరాదు. పురుషులు: ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించాలి. క్లీన్‌ షేవ్‌, హెయిర్‌ కట్‌ నీటుగా ఉండాలి. ఇన్‌షర్ట్‌ చేస్తే చూడడానికి బాగుంటుంది. షూ వేసుకుని చక్కగా పాలిష్‌ చేయించుకోవాలి. జీన్స్‌ పాంట్‌, టీ షర్ట్‌ వేసుకోకూడదు. ఫుల్‌హ్యాండ్‌ షర్ట్‌ వేసుకున్నట్త్లెతే చేతులు మడవకూడదు. గుండీలు పెట్టుకోవాలి.
మహిళలు: పార్టీలకు ధరించే దుస్తులు వేసుకోకూడదు. ఎక్కువ మేకప్‌ వేసుకోకూడదు. తలలో పూలు పెట్టుకోరాదు. హై హీల్‌ చెప్పులు వేసుకోకూడదు.
ఆశించదగ్గ ప్రశ్నలు
* Tell me about yourself
* Types of banks, bank rates, banking related act, functions of RBI
* Insurance company policies
* Lates news related to Banking, Finance, Insurance companies
* Latest news related to 'RBI'
* State/ Central cabinet ministers
* Central government policies
* Bank/ Insurance company norms
* Why Banking?
* What if posted in remote area?
* What is the bank/ govt office visited recently etc
ఈ తరహా ప్రశ్నలు సాధారణంగా అడుగుతూ ఉంటారు. వీటిని గమనించుకుంటూ, రెజ్యూమెలో ఇచ్చిన సమాచారానికి తగ్గట్టుగా సన్నద్ధం అవడం మంచిది.
వీటిని పాటించాలి
* నిర్ణీత సమయానికి 15 నిమిషాలు ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
* కావాల్సినవి సర్టిఫికెట్స్‌/ డాక్యుమెంట్లను ముందు రోజే అమర్చుకోవాలి.
* ఇంటర్వ్యూ పానెల్‌ సభ్యులను (గుడ్‌ మార్నింగ్‌/ గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌) అని విష్‌ చేయాలి.
* ప్రతి అభ్యర్థి చేతిలో సర్టిఫికెట్స్‌ ఫైల్‌, పురుషులు చొక్కా జేబులో కలం పెట్టుకోవాలి.
* 'Introduce yourselfÑ అనే ప్రశ్నకు సమాధానాన్ని ముందుగా సిద్ధమవాలి. ముందుగా పేరు, వూరు, 10, ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌ చదివిన విద్యాలయాలు, అభిరుచి మొదలైనవి.
* ఇంటర్వ్యూ జరుగుతున్నంత వరకూ 'ఐ కాంటాక్ట్‌' జాగ్రత్తగా కొనసాగించాలి.
* ముఖంలో ఒత్తిడి కనిపించకుండా చిరునవ్వుతో ఉండాలి.
* తెలిసిన ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పాలి. తికమక పెట్టడానికి ప్రయత్నించినా, తడబడకుండా జవాబివ్వాలి.
* తెలియని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించకూడదు. అలా ప్రయత్నిస్తే దానికి సంబంధించి ఇంకొన్ని ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సున్నితంగా తెలియదని చెప్పాలి.
* సానుకూల దృక్పథంతో మెలగాలి- తెలియని సమాచారాన్ని ఇంటర్వ్యూ బోర్డులోని వారు చెప్పినపుడు థాంక్యూ సర్‌/ మేడం అని విష్‌ చేయడం, తెలియని ప్రశ్నలకు నిజాయతీగా 'తెలియదు' అని చెప్పడం వంటివి ముఖ్యం.
* సమాధానం చెప్పే సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించకూడదు. తెలిసిన ప్రశ్నలు అడిగిన వెంటనే ఉత్సాహంగా చెప్పకూడదు.
* చివరిగా థాంక్యూ సర్‌/ మేడం అని చెప్పి ముగించాలి.
చేయకూడని పనులు
* మౌఖిక పరీక్ష ముగించిన అభ్యర్థులతో ఎక్కువగా మాట్లాడకూడదు.
* నిర్లక్ష్యంగా/ అజాగ్రత్తగా ఉండకూడదు.
* కాళ్లు, చేతులూ టేబుల్‌పై నిర్లక్ష్యంగా ఉంచకూడదు. సమాధానం చెప్పే సమయంలో దిక్కులు చూడడం, పైకి- కిందకి చూడడం వంటివి చేయకూడదు.
* అనవసరమైన విషయాలూ, తెలియని ప్రశ్నకు సమాధానాలూ చెప్పకూడదు.
* చప్పుడు వచ్చే పనులేవీ ఇంటర్వ్యూలో చేయకూడదు.
* పదోన్నతి, జీతభత్యాలు వంటి అంశాలు ప్రస్తావించకూడదు.
మీ బడినెలా తీర్చిదిద్దుతారు?
* ప్రధానోపాధ్యాయులు ఇకపై వార్షికాభివృద్ధి ప్రణాళికలివ్వాలి
* 31 నుంచి అన్ని జిల్లాలో బాధ్యత, నైపుణ్యం పెంచే శిక్షణ తరగతులు
ఈనాడు, హైదరాబాద్: మీ పాఠశాలనెలా అభివృద్ధి చేస్తారు? వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి మీ ప్రణాళికేంటి? చదువుల్లో నాణ్యత పెంచడానికి ఏం చేయాలనుకుంటున్నారు? స్థానిక వనరుల్ని ఎలా సమీకరిస్తారు?... వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎంలు) ఆలోచించాల్సిన ప్రశ్నలివి! సర్కారు బడుల్ని బలోపేతం చేసేందుకు, చదువుల నాణ్యత పెంచేందుకు, సామాజిక అనుసంధానంతో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు... ప్రధానోపాధ్యాయుల పాత్రను పటిష్ఠం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ అంశాలపై అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ఎంలు అందరికీ జనవరి 31 నుంచి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అన్ని జిల్లాల్లోని విద్యా డివిజన్లలో ఈ తర్ఫీదు కార్యక్రమాలుంటాయి. కొద్దిరోజుల కిందట రాష్ట్రస్థాయిలో సుమారు 175 మంది హెచ్ఎంలకు శిక్షణ ఇచ్చారు. వీరంతా ఇప్పుడు జిల్లాల్లో శిక్షణనిస్తారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు.. గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పరీక్షల సంస్కరణలు, మూల్యాంకన పత్రాల్ని భద్రపరచడం, పాఠ్యప్రణాళిక, వార్షిక ప్రణాళిక, విద్యాపరమైన పర్యవేక్షణ, పాఠశాల నిర్వహణ, ఆర్థిక నిర్వహణలతో పాటు ఈసారి అదనంగా లక్ష్యాల సాధనెలా అనే అంశంపైనా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ''ప్రభుత్వం ఎన్ని పథకాలు ఆరంభించినా... క్షేత్రస్థాయిలో వాటి అమలే కీలకం. ఆ ప్రక్రియలో హెచ్ఎంలే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు క్రియాశీలకంగా, సృజనాత్మకంగా ఉన్నచోటల్లా పిల్లల చదువులు బాగున్నాయి. సమస్యలు తక్కువగా ఉన్నాయి. అందుకే... ప్రధానోపాధ్యాయుల పాత్రను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం కూడా దీనిపై దృష్టిపెడుతోంది. ప్రతి హెచ్ఎంకూ తమ పాఠశాల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ముందుచూపు ఉండాలి. ఏం చేయాలో.. ఎలా చేయాలో.. ఇతరుల కంటే భిన్నంగా ఎలా నడపాలో ఆలోచించాలి అని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఏటా లక్ష్యాల సాధన...
విద్యార్థుల నమోదు, నాణ్యత, ఫలితాలు, స్థానికంగా వనరుల సమీకరణ, నాయకత్వ లక్షణాలు, పని విభజన, నిరంతరం వృత్తిపరమైన అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో శిక్షణ కొనసాగుతుంది. చాలా బడుల్లో బోధన, బోధనేతర సిబ్బంది కొరత ఉంది. ప్రభుత్వపరంగా ఏర్పాట్లు జరిగేదాకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి? ఉన్న వనరులతో సవాళ్లను ఎదుర్కోవడం ఎలా? స్థానికంగా సామాజిక భాగస్వామ్యాన్ని ఏయే రంగాల్లో ఎంతమేరకు తీసుకోవచ్చు? ఇతర ప్రభుత్వ సంస్థలతో ఎలా సమన్వయం చేసుకోవచ్చు... తదితరాలపై అవగాహన కల్పిస్తారు. ఈ అంశాల్లో ఇప్పటికే సమర్థంగా వ్యవహరిస్తున్నవారి అనుభవాలను అందరికీ పంచుతారు. బడి బయటి పిల్లల సంఖ్యను తగ్గించడం, ఒక తరగతి నుంచి మరో తరగతికి పూర్తిస్థాయిలో చేరేలా చూడటం వంటి విషయాల్లోనూ మార్గదర్శనం చేస్తారు.
బ్యాంకు పరీక్షల పద్ధతి మారింది!
ఐబీపీఎస్‌ పరీక్షా విధానంలో కీలకమైన మార్పు జరిగింది. దరఖాస్తు ఫీజును చెల్లించే పద్ధతి కూడా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగార్థులు దృష్టిపెట్టాల్సిన అంశాలేమిటో చూద్దామా?
2015- 16 లో నిర్వహించబోయే ఉమ్మడి రాతపరీక్షల కోసం ఐబీపీఎస్‌ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీంతో పీఓ, క్లర్క్‌, ఆర్‌ఆర్‌బీ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పరీక్షలకు ఐబీపీఎస్‌ మళ్లీ ఎపుడు ఉమ్మడి రాత పరీక్షలను నిర్వహిస్తుందోనని ఎదురుచూస్తున్న ఎందరికో సమాధానం లభించినట్లయింది.
ఐబీపీఎస్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రెండు ముఖ్యమైన మార్పులున్నాయి.
1. పీఓ, క్లర్క్‌ రాతపరీక్షలకు రెండంచెల పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టడం.
2. దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌ పద్ధతిలో మాత్రమే చెల్లించడం.
ఈ రెండింటిలో అత్యంత ప్రధానమైన మార్పు ... రెండంచెల పరీక్షా విధానం.
సివిల్‌ సర్వీసెస్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌- కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌) మొదలైన వాటిలో ఈ రెండంచెల రాత పరీక్షావిధానం ఉంది. బ్యాంకు పరీక్షలకు సంబంధించి ఆర్‌బీఐ గ్రేడ్‌- బి ఆఫీసర్స్‌, నాబార్డ్‌ గ్రేడ్‌ ఏ, బీ ఆఫీసర్స్‌ పరీక్షలకు ఈ రెండంచెల రాతపరీక్ష విధానాన్ని పాటిస్తున్నారు. అయితే మొట్టమొదటిసారిగా పీఓ, క్లర్క్‌ రాత పరీక్షలకు ఐబీపీఎస్‌ ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది.
రెండంచెల పరీక్ష ఎందుకు?
బ్యాంకుల్లో లక్షలాది ఉద్యోగాలు భర్తీ అవుతున్న దృష్ట్యా ప్రతి సంవత్సరం బ్యాంకు పరీక్షలు రాసే అభ్యర్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. వారిలో ఉత్తీర్ణులైన వారందరికీ ఉమ్మడి మౌఖికపరీక్ష నిర్వహణ కూడా ఇబ్బంది అవుతున్నందున మొదటి అంచెలో ప్రాథమిక పరీక్ష నిర్వహించి దానిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రధాన పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే మౌఖిక పరీక్షకు అర్హత సాధిస్తారు. ప్రధాన పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విధానం ద్వారా చాలామంది అభ్యర్థుల వడపోత ప్రాథమిక దశలోనే జరుగుతుంది.
పరీక్ష విధానం, సిలబస్‌
పరీక్ష విధానం, సిలబస్‌ల గురించిన వివరాలను ఐబీపీఎస్‌ వెల్లడించలేదు. పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల చేసినపుడు వాటి వివరాలు తెలియజేయవచ్చు. అయితే ఐబీపీఎస్‌ వెల్లడించిన వివరాల్లో ప్రాథమిక పరీక్షలో పరిమిత సంఖ్యలో ప్రశ్నలు తక్కువ కాలవ్యవధిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ప్రధాన పరీక్ష మాత్రం ప్రస్తుతం ఉన్న రాతపరీక్ష స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
ఈ రెండంచెల రాత పరీక్ష విధానంలో అభ్యర్థులు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. రాత పరీక్షను రెండు అంచెల్లో నిర్వహిస్తున్నప్పటికీ సబ్జెక్టులు, వాటిలోని ప్రశ్నల స్థాయి ప్రస్తుతమున్న పరీక్షల్లో లాగానే ఉండొచ్చు. అయితే పోటీ పెరుగుతున్న దృష్ట్యా ప్రశ్నల స్థాయిని కొద్దిగా పెంచే అవకాశం కూడా ఉంది. ఐబీపీఎస్‌ నిర్వహిస్తున్న గత పరీక్షలను గమనిస్తే ప్రశ్నల స్థాయి పెరుగుతూ వస్తున్న విషయం తెలుస్తుంది.
ప్రణాళికాబద్ధ సన్నద్ధత
ఐబీపీఎస్‌ విడుదల చేసిన పరీక్షల క్యాలెండర్‌ను పరిశీలిస్తే- గత 2, 3 సంవత్సరాల నుంచి ఐబీపీఎస్‌ స్థిరంగా ఒకే సమయాల్లో నిర్వహిస్తున్న ప్రకారమే అదే సమయాల్లోనే ఈ పరీక్షలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. గ్రామీణ బ్యాంకుల పరీక్షలు సెప్టెంబర్‌లోనూ, పీఓ పరీక్షలు అక్టోబర్‌లోనూ, క్లర్క్‌ పరీక్షలు డిసెంబర్‌లోనూ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పరీక్ష జనవరిలోనూ నిర్వహిస్తారు.
వీటిలో మొదటగా నిర్వహించే ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు కనీసం 7 నెలల సమయం ఉంది. అందువల్ల బ్యాంకు ఉద్యోగం లక్ష్యంగా ఉన్న అభ్యర్థులు తమ సన్నద్ధతను ఇప్పటినుంచే మొదలుపెట్టాలి. చివరి సంవత్సరంలో ఉండి త్వరలో డిగ్రీ పూర్తిచేయబోతున్న అభ్యర్థులు తమ వార్షిక పరీక్షలు పూర్తికాగానే వెంటనే బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవాలి.
ప్రకటన వచ్చాక పరీక్షకు కేవలం రెండు నెలల సమయం ఉంటుంది. అందువల్ల సన్నద్ధతను ప్రణాళికాబద్ధంగా ముందే ప్రారంభించాలి.
బ్యాంకు పరీక్షల్లో ఉండే క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (అరిథ్‌మెటిక్‌ & డేటా ఇంటర్‌ప్రిటేషన్‌), రీజనింగ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలపై బాగా అవగాహన పెంచుకోవాలి. సమయం చాలా ఉంది కాబట్టి ప్రతి అంశం గురించి ప్రాథమిక భావనలతో సహా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఆ తరువాత ఆయా అంశాల్లోని తేలికపాటి ప్రశ్నల నుంచి ఎక్కువ స్థాయి ప్రశ్నల దాకా వివిధ రకాల ప్రశ్నలను బాగా సాధన చేయాలి.
ప్రస్తుత నోటిఫికేషన్లు
ఐబీపీఎస్‌ నిర్వహించబోయే పరీక్షలే కాకుండా దాదాపు అవే సబ్జెక్టులు సిలబస్‌తో ఉన్న నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ అసిస్టెంట్స్‌, ఆఫీసర్స్‌ పరీక్షలు ఏప్రిల్‌లో జరగబోతున్నాయి.
* వీటిలో అసిస్టెంట్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది (చివరి తేదీ- జనవరి 31).
* స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌) మొదటి అంచె పరీక్ష జూన్‌ నెలలో (ప్రకటన మార్చి 14న విడుదలవుతుంది) జరగనుంది.
అభ్యర్థులు బ్యాంకు పరీక్షల సిలబస్‌, సబ్జెక్టులలాగే ఉన్న ఈ పరీక్షలను రాసి ఆ తదుపరి ఐబీపీఎస్‌ నిర్వహించబోయే ఉమ్మడి పరీక్షల కోసం తమ సన్నద్ధతను కొనసాగిస్తే బావుంటుంది.
పరీక్షల పట్ల అవగాహన పెంచుకుని చక్కని ప్రణాళికతో, అంకిత భావంతో సన్నద్ధమయితే 2015లో బ్యాంకు ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు.
రుసుము కడితేనే రండి!
* ముందే చెల్లించాలని డీఈడీ కళాశాలల పట్టు
* అయోమయంలో విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్: ఆలస్యంగానైనా కౌన్సెలింగ్ జరుగుతోందని ఊపిరిపీల్చుకుంటున్న డీఈడీ విద్యార్థులకు తెలంగాణలోని కొన్ని ప్రైవేటు కళాశాలలు షాకిస్తున్నాయి. బోధన రుసుములు చెల్లించనిదే చేర్చుకోలేమని యామాన్యాలు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఫాస్ట్ మార్గదర్శకాలపై న్యాయస్థానంలో కేసు నడుస్తుండటంతో బోధన రుసుముల వ్యవహారం తేలట్లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత లేకుంటే రుసుములు తామే చెల్లిస్తామని స్వీయ ధ్రువీకరణ తీసుకుని ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకున్నారు. డీఈడీలో ఇలా చేర్చుకోవడానికి పలు కళాశాలలు నిరాకరిస్తున్నాయని రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలికి ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. ''రెండు మూడేళ్లుగా మాకు బకాయిలున్నాయి. రుసుములు చెల్లించకుంటే కష్టమనే ఫీజుల గురించి పట్టుబడుతున్నాం. ప్రభుత్వం ఇవ్వగానే విద్యార్థుల ఖాతాల్లో వేస్తాం అని ఓ కళాశాల యజమాని చెప్పారు. ప్రవేశపరీక్ష జరిగి ఆర్నెల్లయినా రెండు రాష్ట్రాల్లో కళాశాలల వివరాలు తేలక, అగ్నిమాపక భద్రత ధ్రువీకరణ పత్రాలు రాక ఇన్నాళ్లూ కౌన్సెలింగ్ జరగలేదు. తెలంగాణలోని 250కిపైగా కళాశాలల్లో అగ్నిమాపక ధ్రువీకరణపత్రాలు అందజేసిన 118 కాలేజీలకే కొద్దిరోజుల క్రితం తొలివిడత కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండో విడతలో మరో 50 కళాశాలలు చేరతాయంటున్నారు. వీటికి ధ్రువీకరణపత్రాలు ఉన్నట్టుండి పుట్టుకొస్తుండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎస్జీటీ ఉద్యోగాలకు డీఈడీ అర్హత కావడంతో యాజమాన్య కోటా సీటు లక్షన్నరదాకా పలుకుతోందని సమాచారం. కన్వీనర్ కోటా సీటుకూ కొన్ని కళాశాలలు అభివృద్ధి ఫీజు పేరిట రూ.5వేల నుంచి రూ.10 వేలు డిమాండ్ చేస్తున్నాయన్న సమాచారాన్ని ప్రభుత్వానికి తెలపాలని ఎస్‌సీఈఆర్‌టీ భావిస్తోంది.
ఔషధ నగరి కొలువుల సిరి
* ఏడాదికి అదనంగా 20 వేలు
* ఫార్మా విద్యార్థులకు మేలు
ఈనాడు, హైదరాబాద్‌: ఔషధ రంగానికి హైదరాబాద్‌ కేంద్రంగా ఉంది. బల్క్‌ డ్రగ్స్‌ నుంచి ఫార్ములేషన్ల వరకూ అన్నీ ఇక్కడ తయారవుతున్నాయి. బల్క్‌ డ్రగ్స్‌కు ప్రపంచానికే హైదరాబాద్‌ కేంద్రం. బల్క్‌ డ్రగ్‌ కంపెనీలు అనుసరిస్తున్న అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాల వల్లే విదేశీ కంపెనీలు ఇక్కడ కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, దివీస్‌, నాట్కో ఫార్మా, అరబిందో, సువెన్‌ ఫార్మా, బయో టెక్నాలజీ రంగంలో శాంత బయో వంటి ఎన్నో ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఔషధ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మాసిటీ తెలుగు రాష్ట్రాల్లో ఫార్మా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు భారీ ఉద్యోగావకాశాలను తెచ్చిపెట్టనుందని ఔషధ విద్యా రంగంలోని నిపుణులు చెబుతున్నారు. 11 వేల ఎకరాల్లో రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల వద్ద ఔషధ పార్కు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఉద్యోగులు ఉండటానికి వసతులతో పాటు, ఔషధ విశ్వవిద్యాలయాన్ని, పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. స్థానిక కంపెనీలే దాదాపు రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అనుకున్నట్లుగా అంతా జరిగితే.. కొన్ని సంవత్సరాల పాటు ఏడాదికి కొత్తగా 20 వేల ఉద్యోగ అవకాశాలు వచ్చే వీలుందని చెబుతున్నారు. పరిశ్రమ మరింతగా వేళ్లూనుకోవడానికి దోహదం చేయగలదని అంటున్నారు.
ప్రస్తుతం ఏడాదికి 15,000 కొత్త ఉద్యోగాలు: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 300 వరకూ ఫార్మా కాలేజీలు ఉన్నాయి. వీటి నుంచి ఏటా 18 వేల మంది బీఫార్మసీ, 9 వేల మంది ఎం. ఫార్మసీ చదివిన వారు బయటకు వస్తున్నారు. హైదరాబాద్‌లోని ఔషధ పరిశ్రమ ఏటా కొత్తగా 12,000-15,000 ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తోందని ఎన్‌ఎన్‌ఆర్‌ గ్రూప్‌నకు చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ డీన్‌ కృష్ణ మోహన్‌ చిన్నాల తెలిపారు. ఔషధ పరిశ్రమతోపాటు కాంట్రాక్టు పరిశోధన కంపెనీలు, బోధన రంగం, ఔషధ విక్రయ కేంద్రాలలో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని హోలీ మేరీ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మాసీ ప్రిన్సిపల్‌ ఆర్‌.నరసింహారావు తెలిపారు. మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాలు కలిగిన విద్యార్థులకు ఔషధ రంగంలో ప్రస్తుతం మంచి అవకాశాలు లభిస్తున్నట్లు చెప్పారు. ఔషధ నగరి అందుబాటులోకి వస్తే, అందులో కంపెనీలు ఏర్పాటు చేసే యూనిట్లలో ఏటా కొత్తగా మరో 20,000 ఉద్యోగావకాశాలు లభించగలవని భావిస్తున్నట్లు కృష్ణ మోహన్‌ చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో 516 ఔషధ కంపెనీలు ఉన్నాయని అంచనా.
ఫార్మా డి కోర్సుకు మంచి అవకాశాలు: భవిష్యత్తులో ఫార్మా డి కోర్సుకు మంచి అవకాశాలు లభించగలవని ఔషధ విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ కోర్సు చేసిన వారు క్లినికల్‌ ఫార్మసిస్ట్‌గా స్థిరపడవచ్చు. కార్పొరేట్‌ ఆసుపత్రులు పెరుగుతున్నందున క్లినికల్‌ ఫార్మసిస్ట్‌లకు గిరాకీ ఏర్పడనుంది. వీరు ఆసుపత్రులలో రోగులకు ఔషధాలపై అవగాహన కల్పిస్తారు. ఔషధాల వినియోగం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైనవి వివరిస్తారు. కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు క్లినికల్‌ పరిశోధన సంస్థలు, ఔషధ నియంత్రణ సంస్థలు, ఫార్మకో విజిలెన్స్‌ రంగాల్లో వీరికి ప్రాధాన్యం ఇస్తారు. అమెరికాలో గుర్తింపు పొందిన ఫార్మసిస్టులకు మంచి గిరాకీ ఉంది. డాక్టర్ల తర్వాత వీరికే ఎక్కువ ప్రాధాన్యం. ఫార్మా డి కోర్సు పూర్తి చేసిన వారు అమెరికాలో గుర్తింపు పొందిన ఫార్మసిస్టుగా నమోదు కావడానికి అవసరమైన పరీక్ష రాయడానికి అర్హులు. అమెరికాలో ఫార్మసిస్ట్‌గా స్థిరపడడానికి ఫార్మా డి కోర్సును చదివేందుకు విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఇంటర్మీడియట్‌ తర్వాత ఆరేళ్లపాటు ఈ కోర్సు చేయొచ్చు. బీ ఫార్మసీ చేస్తున్న వారు 4వ ఏడాది ఈ కోర్సులోకి ప్రవేశించే వెసులుబాటు ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 1,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలి బ్యాచ్‌ విద్యార్థులు ఇంకా కోర్సును పూర్తి చేయలేదని కృష్ణ మోహన్‌ చెప్పారు.
'కొత్త ఆలోచన'లకు ఏపీ ఐటీశాఖ ఆహ్వానం!
* దరఖాస్తులకు గడువు జనవరి 31
* ఎంపికైన ప్రతిపాదనలకు అవార్డులు
* ప్రభుత్వ విభాగాల్లో అమలుకు నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: ఐటీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో యువత ఆలోచనలు, కలల ప్రాజెక్టులను ప్రోత్సహించి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ కసరత్తు మొదలుపెట్టింది. యువత మదిలోని ఆలోచనలు, వారి ప్రాజెక్టుల ప్రతిపాదనలతో జనవరి 31లోగా ఐటీ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతోంది. 'కొత్త ఆలోచనల' విధానం కింద ప్రభుత్వం ఎంపిక చేసిన విభాగాల్లో దరఖాస్తులు ఇవ్వాలని యువ పారిశ్రామికవేత్తలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, తొలితరం టెక్నోక్రాట్లు, స్టార్ట్అప్ సంస్థలకు సూచించింది. దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిన యువత తమ ప్రతిపాదనలు పంపాలని చెప్పింది.
ప్రతిపాదనలపై పరిమితి లేదు..
కొత్త ఆలోచనలపై పరిమితి విధించకూడదని ఐటీశాఖ నిర్ణయించింది. యువత పంపిన ప్రాజెక్టుల్లో అర్హమైన వాటన్నిటినీ ప్రోత్సహించనుంది. పలువురు ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ.. ఉత్తమ ప్రతిపాదనలను ఎంపిక చేస్తుంది. వీటిని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అమలు చేయాలని ఐటీ శాఖ భావిస్తోంది. ఉదాహరణకు మెరుగైన ట్రాఫిక్ సిగ్నల్, నియంత్రణ వ్యవస్థను రూపొందిస్తే ఆ ప్రతిపాదనను హోంశాఖ తీసుకుని అమలు చేస్తుంది. ప్రతిపాదనలన్నీ ఏపీ ప్రభుత్వం రూపొందించిన నమూనాకు లోబడి ఉండాలి.
ప్రతిపాదనలకు మార్గదర్శకాలు...
* దేశంలో ఎక్కడైనా రిజిస్టరు అయి రూ.50 లక్షల వార్షిక టర్నోవరు కలిగిన కంపెనీలు.. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్ అక్షరాస్యత, గ్రామీణాభివృద్ధి, ఆకర్షణీయ నగరాలు, సమగ్ర నీటి నిర్వహణ, హరిత సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), సోషల్, మొబైల్, అనలటిక్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్(ఎస్ఎంఏసీ), సెమీకండక్టర్(చిప్, డివైజ్, సిస్టమ్స్), లాజిస్టిక్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ప్రతిపాదనలు పంపించవచ్చు.
* రూ.50 లక్షల నుంచి రూ.25 కోట్ల వార్షిక టర్నోవరు కలిగిన చిన్న, మధ్యతరహా కంపెనీలు, తొలితరం టెక్నోక్రాట్లు, పారిశ్రామికవేత్తలు.. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్‌మెంట్, ఈ-సర్వీసు డెలివరీ, క్లౌడ్ సర్వీసులు, నాలెడ్జ్ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్ నిర్దేశిత నెట్‌వర్క్, సామాజిక భద్రత నిర్వహణ, లొకేషన్ బేస్డ్ సర్వీసులు తదితర విభాగాల్లో ప్రతిపాదనలు పంపించవచ్చు.
పోస్టుల భర్తీకి ప్రకటన
ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో, వినూత్న ఆవిష్కరణల సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీ, సొసైటీలలో ముఖ్య కార్యనిర్వహణాధికారి పోస్టులను భర్తీ చేసేందుకు ఐటీ శాఖ ఇటీవల ప్రకటన జారీ చేసింది. సొసైటీ తాత్కాలిక కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించి, తిరుపతికి మార్చనుంది.
ఏపీలో 'మైక్రోసాఫ్ట్‌' కేంద్రం!
* ఏర్పాటుపై పరిశీలనకు బిల్‌గేట్స్‌ హామీ
* చంద్రబాబుతో దావోస్‌లో ప్రత్యేక భేటీ
* డిజిటల్‌ అక్షరాస్యతకు సహకరిస్తామన్న గూగుల్‌ సీఈవో ఎరిక్‌స్మిత్‌
ఈనాడు - హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో విద్య, యాప్స్‌, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, ఆరోగ్యం, ఇమ్యూనైజేషన్‌ అంశాల్లో పూర్తి సహకారం అందిస్తానని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి కోరగా, పరిశీలిస్తానని బిల్‌గేట్స్‌ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ అందించడం, ఇంటికొక ఐటీ నిపుణుడిని, పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని చంద్రబాబు బిల్‌గేట్స్‌తో అన్నారు. జాతీయ స్థాయిలో సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో 5 శాతం వాటా సాధించేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేకంగా ప్రెజంటేషన్‌ ఇచ్చారు. భారత్‌లో పోలియో నిర్మూలనకు, ఎయిడ్స్‌పై అవగాహన పెంచేందుకు మిలిందా ఫౌండేషన్‌ చేసిన కృషిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని బిల్‌గేట్స్‌ను కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే నైపుణ్యాభివృద్ధి మండలిని ఏర్పాటు చేశామని, త్వరలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని ఆయనకు వివరించారు. గతంలో హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తాను చేసిన కృషి, దానికి బిల్‌గేట్స్‌ అందించిన తోడ్పాటును చంద్రబాబు ఆయనకు గుర్తు చేశారు. అదే తరహాలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. దీనికి బిల్‌గేట్స్‌ సానుకూలంగా స్పందించారు. విశాఖపట్నంలో కేంద్ర పరిశోధన సంస్థ సమీర్‌కు 13 ఎకరాలు, చిత్తూరులో శ్రీసిటీ ద్వారా నెలకొల్పనున్న ఎలక్ట్రానిక్‌ తయారీ సమూహం తదితర అంశాలను బిల్‌గేట్స్‌కు వివరించారు.
తెలుగువాడైన మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయిన చంద్రబాబు ప్రతిష్ఠాత్మక సంస్థకు సీఈవోగా కావడం ప్రతి తెలుగువాడికి గర్వకారణమంటూ ఆయన్ను అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆయనకు వివరించారు. డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందకు సహకారం కావాలని కోరగా బిల్‌గేట్స్‌, సత్యనాదెళ్ల దానికి సానుకూలంగా స్పందించారు. అలాగే హీరో మోటోకార్ప్‌ అధినేతలు పవన్‌ ముంజాల్‌, సునీత్‌కాంత్‌ ముంజాల్‌ ఆహ్వానం మేరకు ఆ సంస్థ వసతి కేంద్రంలో విందు సమావేశానికి, ఇన్ఫోసిస్‌ సీఈఓ విశాల్‌సిక్కా, కెనడా పారిశ్రామిక వేత్తలతో మరో విందు భేటీకి ముఖ్యమంత్రి హాజరై వివిధ అభివృద్ధి అంశాలపై వారితో చర్చించారు.
అంతకు ముందు దావోస్‌ ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తూ ''ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్‌, స్టార్టప్‌ విధానాలను (పాలసీలను) తీసుకొచ్చాం. ఐటీలో రూ.12 వేల కోట్లు, ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో రూ.30 వేల కోట్లు పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విశాఖపట్నంలో ఒక ఐటీఐఆర్‌, తిరుపతి నుంచి అనంతపురం మధ్య మరొకటి ఏర్పాటు చేయనున్నాం. పది ఐటీ హబ్‌లు, 20 ఎలక్ట్రానిక్స్‌ తయారీ సమూహాలు నెలకొల్పి 5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు మార్గసూచిని సిద్ధం చేశాం'' అని వెల్లడించారు.
డిజిటల్‌ అక్షరాస్యతకు గూగుల్‌ చేయూత
ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్‌ అక్షరాస్యతను మెరుగుపరిచేందుకు అన్ని విధాల సహకరిస్తామని గూగుల్‌ సంస్థ సీఈవో ఎరిక్‌ స్మిత్‌ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. స్మిత్‌తో సుమారు 30 నిమిషాల పాటు భేటీ అయిన చంద్రబాబు డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడంలో తన లక్ష్యాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 4జీ సేవలను ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలు, ఇతర అంశాలపైన భారతీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌తో చర్చించారు. వెల్‌స్పన్‌ గ్రూపు సంస్థల ప్రతినిధి బి.గోయెంకా, జీఈ వైస్‌ ఛైర్మన్‌ జాన్‌ రైస్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని వనరుల గురించి వివరించి ఎంచుకున్న రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటు ఇవ్వాలని కోరారు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ డీన్‌ నితిన్‌ నోరియా చంద్రబాబును కలిసి మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు గురించి తమ విద్యాలయాన్ని సందర్శించే పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులకు వివరిస్తామని నోరియా చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
'ఐటీ'లో అగ్రగామిగా హైదరాబాద్
* నూతన ఆవిష్కరణల వేదిక 'టి' హబ్
* నగరంలో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్
* తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడి
* ఐఐఐటీ ఆవరణలో టి-హబ్‌కు శంకుస్థాపన
ఈనాడు, హైదరాబాద్: సమాచార సాంకేతిక (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటి) రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత అనువైన నగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఐఐఐటీ ఆవరణలో టి-హబ్‌కు జనవరి 23న ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టి-హబ్ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అవుతుందన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహికులకు టి-హబ్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఐటీ రంగంలో ఆలోచనల దశలోని వారికి, ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొనిరావాలనుకొనే వారికి, ఉత్పాదనలను మార్కెట్‌లోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలకు టి-హబ్ చక్కటి వేదిక అవుతుందన్నారు. నిర్వచించు (డిఫైన్), రూపరచన చేయు (డిజైన్), అందజేయు (డెలివరీ) అనే వాటికి కార్యరూపం ఇవ్వడానికే టి-హబ్ అని వివరించారు. అత్యధికంగా దాదాపు 60 శాతం ఉద్యోగాలు కల్పించినవి చిన్న కంపెనీలే అని పేర్కొంటూ వీటి వైపే ప్రపంచం చూస్తోందన్నారు. చిన్న కంపెనీల ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. ఇప్పటికే ఐఐఐటీ, ఐఎస్‌బీ, నల్సార్‌లలో ఉన్న ఆలోచన జనని కేంద్రాలు (ఇంక్యుబేటర్లు) టి-హబ్‌లో భాగమవుతాయని, దీంతో ఇది ఇంక్యుబేటర్లకే ఇంక్యుబేటర్‌గా నిలుస్తుందన్నారు. ఇప్పటికే ఐఐఐటీలో అయిదు స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. ఆలోచనలను ఉత్పాదన వరకూ తీసుకురావడమే టి-హబ్ లక్ష్యమన్నారు. టి-హబ్‌కు అనుబంధంగా ప్రభుత్వం, వివిధ సంస్థలు కలసి సుమారు రూ.300 కోట్లతో నూతన కార్యక్రమాలలో పెట్టే పెట్టుబడి నిధి(వెంచర్ క్యాపిటల్ ఫండ్)ని ఏర్పాటు చేస్తుందన్నారు. దీని ద్వారా ఔత్సాహికులకు అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించడం సాధ్యమవుతుందని తెలిపారు. గూగుల్, ఫేస్‌బుక్, వాట్సప్‌లాంటి సరికొత్త ఆలోచనల ఆవిష్కరణలు టి-హబ్ నుంచి రావాలని ఆకాంక్షించారు.
మూడు సంస్థల భాగస్వామ్యంతో టి-హబ్
టి-హబ్ మొదటి దశకు రూ.35 కోట్లను తెలంగాణ ప్రభుత్వం వ్యయం చేస్తోందని, దీంతో ఐఐఐటీ ఆవరణలో 60వేల చదరపు అడుగుల భవనం అందుబాటులోకి వస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. జూన్ రెండో కంటే ముందే టి-హబ్ మొదటి దశను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. టి-హబ్‌ను తెలంగాణ ప్రభుత్వం, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్‌లు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ మూడు సంస్థలు పూర్తి స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. 2018 ఫిబ్రవరిలో జరిగే ప్రపంచ ఐటీ కాంగ్రెస్ నాటికి మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టి-హబ్ రెండో దశను అందుబాటులో తీసుకొస్తామన్నారు. రాయదుర్గంలో నిర్మించే ఈ భవనానికి రూ.200 కోట్లు వ్యయమవుతుందని వివరించారు. దీనికి కేంద్రం సాయాన్నీ కోరామని, కేంద్ర మంత్రి సుజనాచౌదరితో మాట్లాడామని తెలిపారు.
శ్రీకాకుళం చిన్నోడు... ఆల్ ఇండియా మొనగాడు
* సీఏ సీపీటీలో ఫ‌స్ట్ ర్యాంకు సొంతం చేసుకున్న తెలుగు తేజం విశ్వేశ్వర‌రావు
ఆ కుర్రోడు ఒక ద‌శ‌లో సీఏ సీపీటీలో ఎందుకు చేరాన‌బ్బా అంటూ త‌ల‌ప‌ట్టుకున్నాడు. నెమ్మదిగా ఆ స్థాయి నుంచి బ‌య‌ట‌ప‌డి ఎలాగైనా స‌రే అర్హత సాధించాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్నాడు. ఇంత‌కు ముందెప్పుడూ ఎదురుకాని అకౌంట్స్‌, లా స‌బ్జెక్టుల‌ను అర్థం చేసుకుంటూ క‌ష్టప‌డి చ‌ద‌వ‌డం మొద‌లెట్టాడు. నెమ్మదిగా విశ్వాసం పెరిగింది. కోచింగ్ సెంట‌ర్ నిర్వహించే గ్రాండ్ టెస్ట్‌ల్లో 70వ స్థానానికి చేరుకున్నాడు. కొన్నాళ్లకు ప్రతిటెస్ట్‌లోనూ టాప్‌-5లో ఉండేలా జాగ్రత్త ప‌ట్టాడు. చివ‌రికి ఐసీఏ నిర్వహించిన కామ‌న్ ప్రొఫిషియ‌న్సీ టెస్ట్ (సీపీటీ) ఫ‌లితాల్లో అఖిల భార‌త స్థాయిలో నెంబ‌ర్‌-1 స్థానంలో నిలిచాడు. ఈ ఘ‌న‌త‌ను సాధించిన తెలుగు తేజం శ్రీకాకుళం జిల్లా వంగ‌ర మండ‌లం గీత‌నాప‌ల్లి గ్రామానికి చెందిన పి.విశ్వేశ్వర‌రావు. ఈ విజ‌యం ఎలా సాధ్యమైందో ఆ విద్యార్థి మాట‌ల్లోనే...
బీజం ప‌డిందిలా...
ఇంజినీరింగ్ ల‌క్ష్యంతో ఇంట‌ర్ ఎంపీసీలో చేరాను. ద్వితీయ సంవ‌త్సరంలో ఉన్నప్పుడు సీఏ గురించి తెలిసింది. అంధ విద్యార్థి సీఏలో టాప‌ర్‌గా నిలిచి నాటి రాష్ట్రప‌తి అబ్దుల్ క‌లాం చేతుల‌ మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ వివ‌రాల‌ను ఒక శిక్షణ సంస్థ ప్రచార క‌ర‌ప‌త్రంలో ముద్రించింది. దీంతో సీఏ కోర్సుపై ఆస‌క్తి పెరిగింది. నాకు తెలిసిన ఉపాధ్యాయుల‌తో మాట్లాడాను. వాళ్లు కూడా సీఏ కోర్సు, కెరీర్ గురించి గొప్పగా చెప్పడంతో వెంట‌నే నా ల‌క్ష్యాన్ని మార్చుకున్నాను. ఇంట‌ర్ పూర్తికాగానే సీపీటీ శిక్షణ కోసం విజ‌య‌వాడలోని ఓ కోచింగ్ సెంట‌ర్‌ బాట ప‌ట్టాను.
విజ‌యం సాధ్యమైందిలా...
శిక్షణ‌లో చేరిన తొలినాళ్లలో ఎంతో బాధ‌ప‌డ్డాను. ఇంజినీరింగ్‌లో చేరకుండా అన‌వ‌స‌రంగా ఇటువైపు ఎందుకొచ్చానా అనిపించేది. ఎందుకంటే ఇంటర్‌లో నేను ఎంపీసీ విద్యార్థిని. సీపీటీలో అకౌంట్స్‌, లా, ఎక‌నామిక్స్‌, క్వాంటిటేటివ్‌ స‌బ్జెక్టులు ఉంటాయి. వీటిలో అకౌంట్స్‌, లా నాకు పూర్తిగా కొత్త. 200 మార్కుల‌కు ఉండే సీపీటీ ప్రశ్నప‌త్రంలో సింహ‌భాగం (60 మార్కుల‌కు) అకౌంట్స్ నుంచే ప్రశ్నలొస్తాయి. అలాగే లా స‌బ్జెక్టు నుంచి 40 ప్రశ్నల‌డుగుతారు. ఇక ఎక‌నామిక్స్ విష‌యానికొస్తే ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు కొంత చ‌ద‌వ‌డంతో నెట్టుకురావ‌చ్చనుకున్నాను. అకౌంట్స్ స‌బ్జెక్టు స‌రిగా బుర్రకెక్కక‌ భ‌య ప‌డేవాడిని. వెన‌క్కి వెళ్తే ఏడాది వృథా అవుతుంది. స‌రే ఎలాగైనా సీపీటీలో అర్హత సాధించాల‌ని నాకు నేనే ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నేను చేరిన కోచింగ్ సెంట‌ర్‌లో ఎంపీసీ విద్యార్థుల‌కు స్పెష‌ల్ బ్యాచ్ ఉంది. అకౌంట్స్ స‌బ్జెక్టులో ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. సీపీటీలో ఉత్తీర్ణత సాధించ‌డ‌మెలాగో కోచింగ్ సెంట‌ర్లో టెక్నిక్స్ చెప్పారు. అవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి. అకౌంట్స్‌లో సందేహాలు నివృత్తిచేస్తూ ఎప్పటిక‌ప్పుడు ఎంతగానో ప్రోత్సహించేవారు. నెమ్మదిగా స‌బ్జెక్టును అర్థం చేసుకుంటూ క‌ష్టప‌డి చ‌ద‌వ‌డం మొద‌లుపెట్టాను. మా బ్యాచ్‌లో 200 మంది విద్యార్థులు ఉండేవారు. కోచింగ్ తొలినాళ్లలో నిర్వహించిన గ్రాండ్ టెస్టుల్లో 70వ స్థానంలోపు ఎప్పుడూ రాలేదు. ఆ ద‌శ నుంచి ప‌రీక్షకు మందు నిర్వహించే గ్రాండ్ టెస్టుల్లో ప్రతి టెస్టులోనూ టాప్‌-5లో నేనొక‌డిగా ఉండే స్థితికి చేరుకున్నాను. ప‌రీక్షలో త‌ప్పక అర్హత సాధిస్తాన‌నే న‌మ్మకం క‌లిగింది. అలాగే మంచి మార్కులు వ‌స్తాయ‌నే విశ్వాసం కుదిరింది. అయితే ఆలిండియా టాప‌ర్‌ని నేనే అవుతాన‌ని ఎప్పుడూ ఊహించ‌లేదు. నా క‌ష్టానికి ఈ గుర్తింపు ద‌క్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ స్ఫూర్తితో సీఏ ఫైన‌ల్ ఫ‌లితాల్లోనూ టాప‌ర్‌గా నిల‌వాల‌నే ల‌క్ష్యంతో మ‌రింత‌గా క‌ష్టప‌డాల‌ని నిర్ణయించుకున్నాను.
ఆశావ‌హులూ ఇలా సిద్ధం కండి...
సీపీటీలో సులువుగా అర్హత సాధించ‌డం మాత్రం సాధ్యం కాదు. అలాగ‌ని చెప్పి అర్హత సాధించ‌డం అసాధ్యం అనుకోవ‌డం కూడా త‌ప్పే. ఇంట‌ర్‌లో చేర‌క‌ముందే సీఏ కోర్సు చేయ‌డాన్ని లక్ష్యంగా పెట్టుకునేవాళ్లు ఎంఈసీ గ్రూప్ తీసుకోవ‌డం మంచిది. ఎందుకంటే ఇందులో ఎక‌నామిక్స్, కామ‌ర్స్ (అకౌంట్స్‌) రెండు స‌బ్జెక్టుల‌పైనా సీపీటీలో వంద మార్కుల‌కు ప్రశ్నలొస్తాయి. అంటే ప్రశ్నప‌త్రంలో అర్ధ భాగం ఈ రెండు స‌బ్జెక్టుల‌దే. కాబ‌ట్టి ఎంఈసీ గ్రూప్‌లో చేర‌డం ద్వారా అవ‌కాశాల‌ను మ‌రింత మెరుగుప‌ర్చుకోవ‌చ్చు. ఇంట‌ర్ ఎంపీసీ గ్రూప్‌లో చేరి అనంతరం సీఏను ల‌క్ష్యంగా పెట్టుకున్నవారు మాత్రం అద‌నంగా శ్రమించ‌డం త‌ప్పనిస‌రి. ఇలాంటివాళ్లు మంచి సంస్థలో శిక్షణ తీసుకుంటే విజ‌యావ‌కాశాలు మెరుగుప‌ర‌చుకోవ‌చ్చు. ప్రారంభంలో కొంచెం క‌ష్టంగా అనిపించినా భ‌య‌ప‌డ‌కుండా చ‌ద‌వాలి. ప్రతి రోజూ త‌ర‌గ‌తుల‌కు హాజ‌రు కావ‌డం, ఏ రోజు పాఠ్యాంశాల‌ను ఆ రోజు పూర్తిచేయ‌డం చేయాలి. ముందురోజు చెప్పిన అంశాల ఆధారంగా మ‌రుస‌టి రోజు త‌ర‌గుతులు ఉంటాయి. కాబ‌ట్టి ప్రతిరోజూ పాఠాలు వినాలి. ఐసీఏ మెటీరియ‌ల్ బాగా చ‌ద‌వాలి. అకౌంట్స్‌, లా స‌బ్జెక్టుల‌పై ప్రత్యేక శ్రద్ధ వ‌హించాలి. ప్రాథ‌మికాంశాల నుంచి స‌న్నద్ధత‌ను ప్రారంభించి, చ‌ద‌వ‌డానికి ఎక్కువ స‌మ‌యం వెచ్చిస్తే సీపీటీలో గ‌ట్టెక్కడం సాధ్యమ‌వుతుంది. ఈ ఏడాది సీపీటీకి దేశ‌వ్యాప్తంగా ల‌క్ష మంది హాజ‌రుకాగా వారిలో 14 వేల‌మంది అర్హత సాధించారు. 200 మార్కుల‌కు నిర్వహించిన ఈ ప‌రీక్షలో నేను 188 మార్కుల‌తో ప్రథ‌ముడిగా నిలిచాను. అకౌంట్స్ 60కి 52, లా 40కి 38, ఎక‌నామిక్స్‌లో 50కి 49, క్వాంటిటేటివ్‌లో 50కి 49 మార్కులొచ్చాయి.
నేప‌థ్యమిదీ...
మాది శ్రీకాకుళం జిల్లా వంగ‌ర మండ‌లంలోని గీత‌నాప‌ల్లి గ్రామం. అమ్మ గౌరీశ్వరి, నాన్న అప్పల‌నాయుడు. వ్యవ‌సాయాధార కుటుంబం. త‌మ్ముడు ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఒక‌టి నుంచి అయిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు మా ఊరిలోనే మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో చ‌దువుకున్నాను. 6 నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు బ‌లిజ‌పేట‌లోని సాహితీ విద్యానికేత‌న్‌లో చ‌దివాను. టెన్త్‌ ప‌బ్లిక్ ప‌రీక్షల్లో 9.7 జీపీఏ సాధించాను. ఇంట‌ర్ బొబ్బిలిలోని తాండ్ర పాపారాయ జూనియ‌ర్‌ క‌ళాశాల‌లో చ‌దివి 940 మార్కులు సాధించాను. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవ‌డ‌మే నా ల‌క్ష్యం. సీఏ కోర్సు పూర్తిచేసి పెద్ద కంపెనీలో ప‌నిచేయ‌డం లేదా సివిల్స్ రాసి ఐఏఎస్ కావాల‌నుకుంటున్నాను.
పరిశోధనాసక్తి ఉంటే... మేలైన కోర్సు
ఇంటర్మీడియట్‌ సైన్స్‌ గ్రూపు విద్యార్థులు వైద్య, ఫార్మసీ కోర్సుల్లోనో, సాధారణ బీఎస్‌సీ కోర్సులోనో చేరటానికి మొగ్గు చూపుతుంటారు. కానీ పరిశోధన రంగంపై ఆసక్తి ఉండి, దానిలో రాణించదలిచినవారి సంగతి? వీరికి ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ చక్కని కోర్సు. ఇందుకు ఉపకరించేది నెస్ట్‌ (నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌). ఎంసెట్‌, జేఈఈ రాసేవారికి ఈ పరీక్ష సులువే!
'నెస్ట్‌' ర్యాంకు ద్వారా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ & రీసెర్చ్‌, భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీబీఎస్‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థల ప్రత్యేకత ఏమిటంటే.. బోధన, పరిశోధన రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న బోధన సిబ్బంది, అత్యాధునిక ప్రయోగశాలలు, ఉన్నత ప్రమాణాలు ఉండటం. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా శాస్త్రవేత్తలు ఇక్కడికొచ్చి పాఠాలు చెబుతుంటారు.
జీవశాస్త్రం, గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో ఇక్కడ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల్లో ప్రవేశం లభిస్తే ఇన్‌స్పైర్‌ ఉపకార వేతనానికి అర్హత పొందినట్టే. ఐదేళ్లపాటు నెలకు రూ.5000 చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. వేసవి ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున చెల్లిస్తారు. అన్ని సెమిస్టర్లలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) శిక్షణ స్కూల్లో మౌఖిక పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
ఐదు విభాగాలు: మొత్తం 5 విభాగాలుంటాయి. ప్రతి విభాగానికీ 60 మార్కులు. బహుళైచ్ఛిక ప్రశ్నలే అన్నీ. మొదటి విభాగం విద్యార్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. ఈ విభాగం ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు. 2 నుంచి 5 విభాగాల వరకూ బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలడుగుతారు. ఈ సబ్జెక్టుల నుంచి వీలైనన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించుకోవచ్చు. ఈ నాలుగు విభాగాల్లో ఎక్కువ మార్కులు సాధించిన మూడు విభాగాల నుంచి పొందిన మార్కులు, మొదటి విభాగం స్కోరు రెండూ కలిపి మెరిట్‌ జాబితాను తయారుచేస్తారు. అభ్యర్థికి ఆయా సబ్జెక్టుల్లో ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. సబ్జెక్టు ప్రశ్నలకు (విభాగం 2 నుంచి 5 వరకు అడిగే ప్రశ్నలకు) రుణాత్మక మార్కులుంటాయి. కొన్ని ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సరైన సమాధానాలుగా ఉండొచ్చు. ఇలాంటి వాటికి ఆ ఆప్షన్లంటినీ గుర్తించాలి. ఇంగ్లిష్‌ మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది.
సిలబస్‌ ఎలా ఉంటుంది?
సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల్లోని బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ అంశాల నుంచే ప్రశ్నలను ఇస్తారు. మొదటి విభాగంలోని ప్రశ్నలకు ప్రత్యేక సిలబస్‌ ఉండదు. ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రాథమికాంశాలను ఈ విభాగంలో ప్రశ్నలుగా అడుగుతారు. ఆయా సబ్జెక్టుల్లో అభ్యర్థి కనీస అవగాహన స్థాయిని పరీక్షిస్తారు. విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే ఎనలిటికల్‌ ఎబిలిటీ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. వీటి కోసం పదో తరగతి గణితంపై కొంత అవగాహన ఉండాలి.
సన్నద్ధత ఎలా?
* ఎంసెట్‌, జేఈఈలకు సిద్ధమవుతున్నవారు నెస్ట్‌ను తేలిగ్గానే ఎదుర్కోగలుగుతారు. ఇందుకు నెస్ట్‌ పాత ప్రశ్నపత్రాలను నిశితంగా పరిశీలించాలి. ప్రతి సబ్జెక్టులోనూ ఏయే అధ్యాయాల నుంచి ఎలాంటి ప్రశ్నలు, ఎన్నెన్ని వస్తున్నాయో గమనించి అనుగుణంగా తయారీ మెరుగుపరచుకోవాలి.
* ఎంసెట్‌, జేఈఈలతోపాటు జాతీయస్థాయిలో నిర్వహించిన ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ పాత ప్రశ్నపత్రాల సాధన మంచిదే.
* నెస్ట్‌కు హాజరయ్యేవారు సిలబస్‌ను అధ్యయనం చేయాలి. సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల్లోని బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. సంబంధిత సబ్జెక్టుల్లో ఆ తరగతుల సీబీఎస్‌ఈ పుస్తకాలు విపులంగా చదవాల్సివుంటుంది.
* 2 నుంచి 5 వరకు ఉన్న నాలుగు విభాగాల్లో ఎక్కువ మార్కులు సాధించిన 3 విభాగాల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారని తెలుసుకున్నాం. కాబట్టి బైపీసీ విద్యార్థులు గణితం, ఎంపీసీ విద్యార్థులు జీవశాస్త్ర విభాగాలను తమ సన్నద్ధత నుంచి మినహాయించుకోవచ్చు.
* రుణాత్మక మార్కులు మొదటి విభాగానికి తప్ప మిగిలిన అన్ని విభాగాల్లోని ప్రశ్నలకూ ఉన్నాయి. కాబట్టి తెలియని ప్రశ్నలకు జవాబు గుర్తించటం ప్రమాదం. అలాంటివాటిని వదిలేయడమే మంచిది.
* అందరికీ ఉమ్మడిగా ఉన్న మొదటి విభాగంలోని అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సబ్జెక్టుల్లోని కీలకమైన అంశాలు, ముఖ్య ఘట్టాలను మననం చేసుకోవాలి.
* ప్రతి సబ్జెక్టు నుంచీ ప్రాథమికాంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల వాటిని క్షుణ్ణంగా చదువుకోవాలి.
* పాత ప్రశ్నపత్రాలు నెస్ట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
ఇవి గమనించండి
దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: ఎంపీసీ/ బైపీసీ గ్రూపుతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు పరీక్ష రాయడానికి అర్హులు. 2013, 14 సంవత్సరాల్లో ఇంటర్‌ పూర్తిచేసినవారు కూడా అర్హులే. కనీసం 60% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55% మార్కులు అవసరం.
డీడీల స్వీకరణ గడువు: ఫిబ్రవరి 19, 2015
దరఖాస్తుల స్వీకరణ గడువు: మార్చి 7, 2015
అడ్మిషన్‌ కార్డులు: ఏప్రిల్‌ 15, 2015 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: మే 30, 2015 ఉదయం 9.30- 1.00 గంటల వరకు
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం
ఫలితాల ప్రకటన: జూన్‌ 19, 2015.
www.nestexam.in
తెలంగాణలో జాతీయ వృత్తివిద్య శిక్షణ సంస్థ
* ఏటీఐకు రూ.100 కోట్ల కేటాయింపు
* మహిళలకు ఫ్యాషన్ టెక్నాలజీ కేంద్రం
* కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ
హైదరాబాద్, న్యూస్‌టుడే: తెలంగాణలో జాతీయ వృత్తివిద్య శిక్షణ సంస్థను ఏర్పాటుచేస్తామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. దేశంలోనే పేరొందిన హైదరాబాద్‌లోని పురోగామి శిక్షణ సంస్థ(అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్- ఏటీఐ)కు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ కార్మికులకు అనుబంధ పరిశ్రమలు, ఆధునిక వ్యవసాయ పనిముట్ల నిర్వహణపై శిక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ విద్యానగర్‌లోని ఏటీఐ కేంద్రాన్ని సందర్శించి విలేకర్లతో మాట్లాడారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఫ్యాషన్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు చెందిన ఐటీఐల శిక్షకులకు ఏటీఐలో తర్ఫీదునిస్తున్నారని దత్తాత్రేయ వివరించారు. అసంఘటిత రంగ కార్మికులకు 2-3 నెలల స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి వెంటనే ఉపాధిని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఏటీఐని సద్వినియోగం చేసుకోండి..
ఏటీఐలో తెలంగాణ రాష్ట్రానికి 3,808 సీట్లు ఉంటే 2199; ఆంధ్రప్రదేశ్‌కు 2619 సీట్లు ఉంటే 1,121 భర్తీ అయ్యాయని మంత్రి దత్తాత్రేయ చెప్పారు. రెండు రాష్ట్రాల వారు మిగిలిన ఖాళీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పార్లమెంటులో అప్రెంటిస్‌షిప్ బిల్లును ఆమోదించటం ద్వారా ఏటా 10 లక్షల మందికి ఉపాధి శిక్షణ ఇవ్వాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమని మంత్రి తెలిపారు. బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, బీడీఎల్, మిథాని, డీఆర్‌డీవో, సింగరేణి కాలరీస్, ఎన్ఎండీసీ, రైల్వేలు తదితరాల్లో అప్రెంటిస్‌షిప్ పూర్తిచేసుకున్న వారికి అక్కడే ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. వికలాంగులతో పాటు మహిళలకు ఉపాధి శిక్షణలో 35 శాతం రిజర్వేషన్లను ఇవ్వనున్నామని మంత్రి దత్తాత్రేయ తెలిపారు.
గేట్‌కు తుది మెరుగులు
ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే 'గేట్‌' (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) వ్యవధి ఇంకా 2 వారాలు కూడా లేదు. ఈ పరీక్షలో మంచి స్కోరు తెచ్చుకోవాలంటే ఇప్పటివరకూ సాగించిన సన్నద్ధతకు వ్యూహాత్మకంగా మెరుగులు దిద్దుకోవాలి. అందుకు ఉపకరించే సూచనలు...
'గేట్‌' స్కోరును బట్టే వివిధ ఐఐటీలు, ఐఐఎస్‌సీ, ఎన్‌ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. అంతే కాదు- బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌టీపీసీ వంటి వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలకూ ఈ స్కోరే ఆధారం.
ఐఐటీల్లో ఎంఈ/ ఎంటెక్‌ సీటు అంటే నాణ్యమైన సాంకేతిక విద్య మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా అత్యుత్తమమైన సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు పొందగల సదవకాశం. ఈ బంగారు భవితను మనసులో పెట్టుకుని ప్రవేశపరీక్షకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలి.
సబ్జెక్టుల వెయిటేజీ
గేట్‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వహించడం వల్ల ప్రశ్నపత్రాలను వివిధ సెట్లుగా రూపకల్పన చేస్తున్నారు. కాబట్టి అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. అభ్యర్థులు ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్నిటిలో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి.
కొన్ని అధ్యాయాలు కఠినంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇందులో ప్రశ్నలు కూడా నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. సబ్జెక్టు మీద పూర్తిగా పట్టులేనివారు వీటి కోసం ఎక్కువ సమయం కేటాయించడం ఆచరణీయం కాదు. గత ప్రశ్నపత్రాలను బట్టి దాదాపు 25% ప్రశ్నలు పునరావృతమవుతాయి. వీటి కోసం సుమారు 25 సంవత్సరాల ప్రశ్నపత్రాలను సాధన చేయడం మంచిది. 75% ప్రశ్నలు సృజనాత్మకంగా, పరిశోధనాత్మకంగా ఉంటాయి. వీటి కోసం మౌలికాంశాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గతంలో ఎన్నడూ అడగని అంశాలపై (అన్‌టాప్‌డ్‌ ఏరియాస్‌) తగిన దృష్టి సారించాలి. యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, సివిల్‌ సర్వీసెస్‌ ప్రశ్నలు చాలావరకు గేట్‌లో అడుగుతుంటారు. కాబట్టి వీటిని గేట్‌ సిలబస్‌కు అనుగుణంగా సాధన చేయాలి.
కొన్ని ప్రశ్నలకు పూర్తి సమాచారం ఇవ్వరు. తార్కికంగా ఆలోచించి వీటికి సమాధానం రాబట్టాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రశ్నలు ప్రామాణిక గ్రంథాల్లోని అభ్యాస ప్రశ్నల్లో ఉంటాయి. న్యూమరికల్‌ ప్రశ్నల సమాధానాలు సమయపాలనను దృష్టిలో పెట్టుకుని సాధన చేయాలి.
కంప్యూటర్‌ పరిజ్ఞానం
గేట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. కాబట్టి తగిన రీతిలో కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం. దీని కోసం ఆన్‌లైన్‌లో నిర్వహించే వివిధ నమూనా పరీక్షలు రాయడం మంచిది. రోజుకు కనీసం 6- 8 గంటల సంసిద్ధత అవసరం. ఇప్పటి వరకూ ఎన్నడూ చదవని కొత్త విషయాల జోలికి పోవద్దు. ఇప్పటికే తగినంత సమయం కేటాయించిన విషయాలను పునశ్చరణ చేయడం చాలా మంచిది. ప్రతిరోజూ రెండు/ మూడు సబ్జెక్టుల నుంచి ముఖ్యమైన ఫార్ములాలను, ఒక్కో ఫార్ములాకు సంబంధించి ఒక న్యూమరికల్‌ ప్రాబ్లమ్‌ను అభ్యాసం చేయాలి. క్లిష్టమైన కీలకాంశాలను మరోసారి మననం చేసుకోవాలి.
పునశ్చరణతోపాటు ఆన్‌లైన్‌లో నిర్వహించే నమూనా పరీక్షలు రాయడం చాలా ముఖ్యం. దీని వల్ల సమగ్ర అవగాహన లేని విషయాలను పునశ్చరణ చేసుకోవచ్చు. ఉత్సాహంగా చదివే- ఎనర్జీ లెవల్స్‌కు అనుగుణంగా కఠినమైన సబ్జెక్టులు, సంబంధిత సబ్జెక్టులనూ సాధన చేయాలి. క్రమం తప్పకుండా రోజూ కనీసం అరగంట యోగా/ ధ్యానం/ చిన్నపాటి వ్యాయామం చేస్తే ఒత్తిడికి దూరం కావచ్చు.
న్యూమరికల్‌ ప్రాధాన్యం:గేట్‌- 2014 ప్రశ్నపత్రాల ప్రకారం వివిధ బ్రాంచీల్లో న్యూమరికల్‌ సమాధాన ప్రశ్నలకు వెయిటేజీ: ఎలక్ట్రానిక్స్‌ &కమ్యూనికేషన్‌: 46/100, కంప్యూటర్‌ సైన్స్‌: 43/100, మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 45/100, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: 37/100, సివిల్‌ ఇంజినీరింగ్‌: 37/100, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌: 49/100, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌: 40/100
కాబట్టి న్యూమరికల్‌ ప్రశ్నలను అశ్రద్ధ చేయడకూడదు. Consistency of units చాలా ముఖ్యం. చిత్తు కాగితంపై తగిన రీతిలో స్టెప్స్‌ రాసుకోవడం మంచిది. సమాధానం రాని పక్షాన వీటిని పరిశీలించుకునే అవకాశం దొరుకుతుంది.
బహుళైచ్ఛిక ప్రశ్నల విషయంలో ఒక ఫార్ములానీ, మౌలికాంశాన్నీ విద్యార్థి ఎన్ని విధాల తప్పు చేయవచ్చో, ఎన్ని రకాల సమాధానాలు వస్తాయో ముందుగానే పేపర్‌ తయారు చేసేవారు వూహించి తదనుగుణంగా ఆప్షన్లు ఇస్తారు. వచ్చిన సమాధానం కనపడగానే వెంటనే గుర్తించవద్దు. ఒక్క క్షణం మిగతా ఆప్షన్లు కూడా పరిశీలించి చూడాలి.
సమగ్రమైన అభ్యాసం
నమూనా పరీక్షలు రాస్తున్నపుడే తగిన మెలకువలు అలవాటు చేసుకోవాలి. పరీక్షలో సాధారణంగా మొదటి ప్రశ్నలు కొంత కఠినంగా ఉంటాయి. కాబట్టి ఆందోళనకు గురి కాకూడదు. మొత్తం పేపర్‌ కఠినంగా అనిపించినప్పటికీ కంగారు అనవసరం. గేట్‌ స్కోర్‌ కేవలం సహ అభ్యర్థుల సాపేక్ష ప్రతిభపై ఆధారపడి ఉంటుంది.
గేట్‌ 2014లో ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాల్లో మొత్తం 100 మార్కులకు 50- 60 మార్కులు సాధించినవారు కూడా ఉత్తమ ర్యాంకులను సాధించారు. మంచి సంస్థల్లో ప్రవేశం పొందారు. గ్రూప్‌-1లోని ఒక మార్కు ప్రశ్నలను త్వరగా చేయాలి. చాలావరకు ఈ విభాగంలో థియరీకి సంబంధించిన మౌలికాంశాలపై ప్రశ్నలు వస్తాయి.
రుణాత్మక మార్కులతో జాగ్రత్త: తప్పు సమాధానాలు రాస్తే, ఒక మార్కు ప్రశ్నలకు 1/3 మార్కులు, రెండు మార్కుల ప్రశ్నలకు 2/3 మార్కులు తగ్గిస్తారు. కాబట్టి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేటపడు అంచనా (గెస్‌) చేసి గుర్తించడం వల్ల ఒక్కోసారి నష్టం జరుగుతుంది. అలాగే న్యూమరికల్‌ ప్రశ్నల విషయానికొస్తే వీటికి ఆప్షన్లుండవు. సరైన సమాధానాన్ని మౌస్‌, వర్చువల్‌ కీ ప్యాడ్‌ ఉపయోగించి సమాధానం మార్క్‌ చేయాలి. వీటికి రుణాత్మక మార్కులు ఉండవు. ఇప్పటివరకూ ఎన్నడూ చదవని కొత్త విషయాల జోలికి పోవద్దు. క్లిష్టమైన కీలకాంశాలను మరోసారి మననం చేసుకోవాలి.
ఉన్నత విద్యకు కొత్త ప్రణాళిక!
* రూసా అనుమతి సాధించేలా..
* తెలంగాణ అధికారుల కసరత్తు వేగిరం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యకు కొత్త ప్రణాళిక తయారీ వేగవంతమైంది. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద అనుమతులు సాధించేలా తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కసరత్తును వేగిరం చేసింది. గత ప్రతిపాదనల్ని పునఃపరిశీలించి... భవిష్యత్ అవసరాలతోపాటు, కేంద్ర ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని సరికొత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చేనెల తొలివారంలో రూసా ప్రాజెక్టు అనుమతుల మండలి (పీఏబీ) సమావేశం జరిగే అవకాశం ఉండటంతో... విద్యాశాఖ కొత్త ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య... కళాశాల, సాంకేతిక విద్యాశాఖ సంచాలకులుగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారిణి వాణీప్రసాద్ దీనిపై వేగంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారులు సిద్ధం చేసిన వార్షిక ప్రణాళికను సమీక్షిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు రాష్ట్రాలకూ కలిపి ప్రతిపాదనల్ని రూసాకు సమర్పించారు. రాష్ట్రం విడిపోవటంతో విడివిడిగా ఇవ్వాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో కొత్తగా మళ్లీ సవరించిన ప్రతిపాదనల్ని తెలంగాణ రాష్ట్రం సమర్పిస్తోంది. సుమారు రూ.1300 కోట్ల మేర ప్రతిపాదనల్ని తెలంగాణ తరఫున ఇదివరకే తయారు చేశారు. వచ్చేనెల జరిగే పీఏబీ సమావేశంలో ప్రతిపాదనల్ని సమర్థంగా వివరించగలిగితే... తొలివిడతగా నిధుల్ని కేంద్రం రూసా కింద మంజూరు చేస్తుంది. నిధుల రాకకు రాష్ట్రస్థాయిలో ఎస్పీడీ (స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్), నోడల్ అధికారుల్ని నియమించాలి. వీరిద్దరి ఉమ్మడి ఖాతాకే డబ్బులు జమవుతాయి. కళాశాల కమిషనర్‌ను ఎస్పీడీగా నియమిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నోడల్ అధికారిగా ఎవర్ని నియమిస్తారనేదే ఆసక్తికరంగా ఉంది. ఆంధ్రలో నోడల్ అధికారిగా ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్‌ను ఉంచారు.
రూసా కింద కొత్తగా మూడు విశ్వవిద్యాలయాలకు అధికారులు గతంలో ప్రతిపాదనలు పంపారు. ఆదిలాబాద్, సిద్దిపేట (డిగ్రీ) కొత్తగూడెం (ఇంజినీరింగ్) కళాశాలల్ని విశ్వవిద్యాలయాలస్థాయికి పెంచాలని, వీటితోపాటు మరో రెండు క్లస్టర్ (కొన్ని కాలేజీలు కలిపి) వర్సిటీలకు ప్రతిపాదించారు. స్వయం ప్రతిపత్తిగల కళాశాలలకు మాత్రమే విశ్వవిద్యాలయాల హోదా ఇస్తామంటూ రూసా అధికారులు మెలిక పెడుతున్న నేపథ్యంలో ఏం చేయాలో అధికారులు ఆలోచిస్తున్నారు. వర్సిటీల కిందున్న అనుబంధ కళాశాలల నాణ్యత, సదుపాయాల మెరుగుదల... తదితరాలపై సమాలోచనలు జరుపుతున్నారు. దీంతోపాటు ఎస్పీడీ కార్యాలయ తీరుతెన్నులపైనా ముఖ్యకార్యదర్శి దృష్టిసారించినట్లు సమాచారం. గతంలో సూచించినట్లుగా కాకుండా నిబంధనలకు అనుగుణంగా కొత్త పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టరేట్‌ను రూపొందించాలని అధికారులకు ముఖ్యకార్యదర్శి సూచించారని తెలిసింది. కొద్దిరోజుల్లోనే దీనికి సంబంధించిన విధివిధానాలు పూర్తయ్యే అవకాశముంది.
భారీగా గురుకులాల ఏర్పాటు!
* చదువులు బాగుపడటానికి ఇదే మార్గం
* తొలుత నియోజకవర్గానికోటి... తర్వాత మండలాల్లో
* ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గ నిర్దేశనం!
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో దిగజారిన విద్యాప్రమాణాలు మెరుగవ్వాలంటే గురుకుల వ్యవస్థే మేలైన మార్గమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా రాష్ట్రంలో భారీ స్థాయిలో గురుకులాల్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కేజీ నుంచి పీజీ విధానంపై ఇంకా స్పష్టత రానప్పటికీ... గురుకుల వ్యవస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. దీనిపై ఆయన ఇప్పటికే విద్యామంత్రికీ, ఇతర ఉన్నతాధికారులకు మార్గనిర్దేశనం చేసినట్లు తెలిసింది. పట్టణీకరణ నేపథ్యంలో గతంలో మాదిరిగా ఉపాధ్యాయులు పనిచేసేచోట ఉండటం లేదు. దీంతో విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఇద్దరూ ఒకేచోట ఉంటేనే వ్యక్తిగత శ్రద్ధ పెరిగి... ఎక్కడ వెనకబడుతున్నారో... ఏం చేయాలో అవగాహన పెంచుకోవటానికి, ఆలోచించటానికి సమయం దొరుకుతుందనీ... ఇది గురుకులాలతోనే సాధ్యమవుతుందనీ ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. మొదట ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికొకటి చొప్పున వీటిని ఆరంభించి... తర్వాత మండలానికొకటి లేదా... అవసరమైతే అంతకుమించి కూడా ఏర్పాటు చేసేలా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేజీ నుంచి పీజీ విధానాన్ని ఈ గురుకుల వ్యవస్థకు అనుసంధానించే అవకాశముంది. ఇందులో భాగంగా వీలైతే ప్రస్తుతమున్న వివిధ పాఠశాలల్ని, గురుకులాల్ని ఒకే గొడుగు కిందికి తీసుకు వచ్చే అవకాశాల్ని కూడా పరిశీలిస్తారు. ఆదర్శ పాఠశాలల్ని కూడా ఉపయోగించుకోవటానికున్న మార్గాలను పరిశీలిస్తున్నారు.
ఉద్యోగాలకు అర్హులుగా సిద్ధం చేసేలా...: కేవలం వ్యక్తిగత శ్రద్ధ పెరగటమే కాకుండా... భవిష్యత్‌ అవసరాలను, అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకొని పాఠ్యప్రణాళికల్లో మార్పులు చేయాలనుకుంటున్నారు. ''ఇక నుంచి పాఠ్యప్రణాళికలో మార్పులు నిరంతర ప్రక్రియ. రాబోయే ఉద్యోగాల్ని మనవాళ్లు అందుకునేలా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి'' అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. విద్యార్థులకు అన్ని వసతులతో వసతిగృహాలు, పాఠశాల, ఉపాధ్యాయ సిబ్బంది అంతా అందులోనే ఉండేలా నివాసగృహాలను అన్ని హంగులతో నిర్మిస్తారు. ప్రస్తుతమున్న ఉపాధ్యాయుల్లో ఆంగ్లంలో బోధించగలిగేవారిని గురుకుల వ్యవస్థలోకి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆంగ్లమాద్యంలో బోధించలేని వారిని ప్రాథమిక విద్యకు ఉపయోగించుకొంటారు. ఇక నుంచి కొత్తగా నియమించే వారందరినీ ఆంగ్లమాధ్యమంలో బోధించగలవారినే తీసుకుంటారు.
ఐటీఐఆర్‌లో ఉద్యోగాలు మనవాళ్ళకే వచ్చేలా చేస్తాం
''ప్రస్తుత చదువుల్లో నాణ్యతలేని మాట నిజం! వేల కోట్లు ఖర్చుపెడుతున్నా ఫలితాలు ఆశాజనకంగా లేవు. అందుకు కారణాలను విశ్లేషించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గురుకుల వ్యవస్థే దీనికి సరైన మందు అని నిర్ణయించారు. ప్రాచీన భారత విద్యావిధానమైన గురుకులాలకే పెద్దపీట వేయబోతున్నాం. మన హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న ప్రతిష్ఠాత్మక ఐటీఐఆర్‌ ప్రాజెక్టుతో లక్షలాది ఉద్యోగాలు రానున్నాయి. ఆ ఉద్యోగాలను తెలంగాణ గ్రామీణ పిల్లలు అందుకోవాలంటే ఈ విద్యా వ్యవస్థను మెరుగుపర్చుకోవాల్సిందే. తెలంగాణ భవిష్యత్‌ అవసరాలు, భారతదేశ అవసరాలు, అంతర్జాతీయంగా వస్తున్న అవకాశాలు, పోటీ... వీటన్నింటినీ తట్టుకునే పద్ధతిలో ఉన్నత విద్య ఎలా ఉండాలనే దానిపై అందరితో చర్చించబోతున్నాం. ఈ క్రమంలో ప్రపంచంలోని అన్ని మంచి పద్ధతుల్ని సేకరించి... మనకు అనువైనవాటితో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు.''
- తెలంగాణ విద్యామంత్రి జగదీశ్‌ రెడ్డి
ఐఐటీ, ఎన్ఐటీలకు ఒకేసారి కౌన్సెలింగ్?
ఈనాడు, హైదరాబాద్: జేఈఈ ద్వారా ప్రవేశాలు జరిగే ఎన్ఐటీ, ఐఐటీలకు ఈసారి ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సాంకేతిక బృందం ఈ మేరకు సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఐఐటీల్లో సీట్లు మిగిలిపోతుండటాన్ని తగ్గించే దిశగా ఈ చర్య తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు విడివిడిగా కౌన్సెలింగ్ జరుగుతోంది. జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీల్లో... జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు లభిస్తున్న సంగతి తెలిసింది. అయితే ఐఐటీల్లో మొదట సీటు లభించిన కొంతమంది (వందల్లోనే) మళ్ళీ ఎన్ఐటీలకూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒకవేళ ఐఐటీలో తాము కోరుకున్న చోట, కోరుకున్న కోర్సులో సీటు లభించక... మంచి ఎన్ఐటీలో కోరుకున్న స్థానం దొరికితే దానికే ప్రాధాన్యమిచ్చి వెళ్ళిపోతున్నారు. ఇలా ఎన్ఐటీల్లో ప్రవేశాలు పూర్తయ్యే దాకా ఐఐటీ సీటును అట్టిపెట్టుకొని.. చివర్లో వెళ్ళిపోతుండటంతో ఐఐటీల్లో వందల సంఖ్యలోనే ఖాళీలుండిపోతున్నాయి. నిరుడు సుమారు 200 సీట్ల దాకా వివిధ ఐఐటీల్లో ఇలా మిగిలిపోయినట్లు అధికారులు తేల్చారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఐటీ సీట్లు ఇలా వృథా కాకుండా ఉండేందుకు, అర్హులైన అందరికీ అందుబాటులో ఉంచేందుకు రెండింటికీ ఒకేసారి కౌన్సెలింగ్ చేపట్టాలనేది ఆలోచనగా తెలుస్తోంది.
'శాట్‌'లో దూసుకువెళ్దాం
అమెరికా లాంటి దేశాల్లో డిగ్రీ చేయాలనుకునే భారత విద్యార్థులు రాసే పరీక్ష- స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌/ శాట్‌ (SAT). యూఎస్‌లోని చాలా కళాశాలలూ, విశ్వవిద్యాలయాలూ అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష స్కోరును కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. విద్యార్థి కళాశాలలో చేరడానికి ఎంతవరకూ సంసిద్ధతతో ఉన్నాడో శాట్‌ పరీక్షిస్తుంది. దీనిలో మెరుగైన స్కోరు సాధించేదెలాగో పరిశీలిద్దాం! జవాబులను చాకచక్యంతో వూహించటం వల్ల ఇచ్చిన చాయిస్‌లలో తప్పు వాటిని తొలగించటం తేలిక. కానీ, మరీ ఎక్కువగా వూహించకండి. ఎందుకంటే.. మైనస్‌ మార్కులున్నాయి. ఒకవేళ సమాధానం ఏదైనా రెండు చాయిస్‌ల్లోనే ఉందని దృఢంగా భావిస్తే 'ఎడ్యుకేటెడ్‌ గెస్‌' చేయటం మంచిదే. ప్రతి తప్పు సమాధానానికీ మీరు సంపాదించుకున్న స్కోరు నుంచి 0.25 మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది. సమాధానం గుర్తించకుండా వదిలేసిన ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు. కాబట్టి అలాంటి ప్రశ్నలను వదిలేయటం మేలు. రుణాత్మక మార్కుల కంటే, ఇది నయమే కదా! అజాగ్రత్తగా మార్కింగ్‌ చేయడం వంటి చిన్న చిన్న తప్పుల వల్ల కూడా మార్కులు కోల్పోయే ప్రమాదముంది. శాట్‌లో విజయానికి- ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించారన్నది కాదు, ఎంత శాతం సరైన సమాధానాలు గుర్తించారన్నదే ముఖ్యం. అతి కఠినమైన ప్రశ్నలను వదిలేసి తేలిక, మధ్యతరహా ప్రశ్నలపై మొదట శ్రద్ధ వహించాలి. వదిలేసిన ప్రశ్నల సంగతి తర్వాత చూడవచ్చు.
సమయపాలన
శాట్‌లో సమయవ్యవధి కచ్చితంగా పరిమితమైనప్పటికీ, అతివేగంగా చేస్తే అది స్కోరును దెబ్బతీసే ప్రమాదముంది. చాలా ప్రశ్నలు సూక్ష్మ అంశాలపై ఆధారపడి ఉంటాయి. వాటిని చాలా శ్రద్ధగా గమనించాల్సివుంటుంది. చాలామంది తమ కళాశాలల్లో అలవాటైనవిధంగా ప్రశ్నలను త్వరత్వరగా చదివేస్తూ, ప్రశ్న సారాంశాన్ని మాత్రమే గ్రహిస్తారు. తీరా పరీక్ష రాశాక ఆ ప్రశ్నలను తప్పుగా చదవడమో, సూక్ష్మ అంశాలను పట్టించుకోకపోవడమో చేశామని గుర్తిస్తారు.
ప్రతి ప్రశ్నకూ నిర్ణీత సమయాన్ని సమానంగా కేటాయించుకోవడం మంచి వ్యూహంగా కనిపిస్తుండొచ్చు. కానీ- శాట్‌లో ప్రశ్నలు (క్రిటికల్‌ రీడింగ్‌ విభాగం మినహా) అతి తేలిక నుంచి అతి కఠినమైన ప్రశ్నల వరకు క్రమంలో ఉంటాయని విస్మరించకూడదు. కాబట్టి తేలిక ప్రశ్నలను చాలా వేగంగా పూర్తిచేసి, మిగిలిన సమయాన్ని చివరలో క్లిష్టమైన ప్రశ్నలకు కేటాయించుకోవాలి.
ఎక్కువ సాధన: మాదిరి పరీక్షలను ఎన్ని ఎక్కువ రాస్తే అంతగా పురోగతి సాధించవచ్చు. సమయ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. మాదిరి పరీక్షలు పరీక్ష స్వరూపం, నియమ నిబంధనలపై అవగాహన పెంచుకోవడానికి తోడ్పడతాయి. మాదిరి పరీక్షల్లో సాధించిన స్కోరే ప్రాథమిక స్కోరు అవుతుంది. ఇది మీరు ఏయే విభాగాల్లో మెరుగ్గా ఉండాలో చూపిస్తుంది. మిగతా వాటికంటే వీటిపై ఎక్కువ దృష్టిసారించి సాధన చేయాలి. అసలైన పరీక్షను సమర్థంగా ఎదుర్కోవడానికి వీలైనన్ని మాదిరి పరీక్షలతో సిద్ధమవాలి. మొత్తం పరీక్ష 225 నిమిషాల్లో 170 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సివుంటుంది. వీలైనన్ని మాదిరి పరీక్షలు రాయడం ద్వారా శక్తిసామర్థ్యాలను ఎక్కువ సమయం కొనసాగించేలా చూడొచ్చు.
చాలామంది విద్యార్థులు విడివిడి విభాగాలు, విడివిడి ప్రశ్నలపై దృష్టి పెడుతుంటారు. మొదటి దశలో.. ముఖ్యంగా కాన్సెప్టులను నేర్చుకునే క్రమంలో ఇది మంచి ప్రక్రియే. కానీ తర్వాత పూర్తిస్థాయి నమూనా పరీక్ష ద్వారా అసలైన పరీక్ష పరిస్థితులకు అలవాటు పడాల్సివుంటుంది. ఎక్కువ సమర్థంగా తయారవడం ద్వారా ప్రతి ప్రశ్నకూ కేటాయించే శ్రమా, శక్తీ తగ్గుతాయి. వాటిని తదుపరి విభాగాలు, క్లిష్టమైన ప్రశ్నలకు కేటాయించవచ్చు. శాట్‌ నైపుణ్యాల, కాన్సెప్టుల అవగాహనకూ, ప్రావీణ్య సాధనకూ తోడ్పడే అదనపు ప్రయోజనాలుగా నమూనా పరీక్షలను భావించాలి. పురోగతిని అంచనా వేసుకోవడానికి ఈటీఎస్‌ సైట్‌ ద్వారా వీటిని సాధన చేయాలి.
ఒత్తిడి: మానసికంగా, ఉద్వేగపరంగా సిద్ధమవడాన్ని కూడా సన్నద్ధతలో భాగంగా చేర్చుకోవాలి. ఒత్తిడిని నియంత్రించడానికి మార్గం- మళ్లీ సరైన సన్నద్ధతే. సవ్యంగా సన్నద్ధమైన భావన పరీక్షను హాయిగా, కచ్చితంగా రాసేలా చేస్తుంది. మీరు చేసే సాధన గరిష్ఠ ఫలితాన్ని అందిస్తుందని దృఢంగా నమ్మవచ్చు.
ఇవి ఉపయోగపడతాయి: https://sat.collegeboard.org/ home, https://sat.collegeboard.org/practice/sat-practice-test
The Official SAT Study Guide: Second Edition
'ఫాస్ట్‌'పై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు!
* 1956ను ప్రస్తావించడంలో ఉద్దేశమేంటి?
* కౌంటర్ దాఖలు చేయని అధికారులపై అసహనం
* విధాన నిర్ణయాలు రాజ్యాంగ పరిధిలో ఉండాలని వ్యాఖ్య
* విచారణ రెండు వారాలకు వాయిదా
ఈనాడు, హైదరాబాద్: గతేడాది జులై 30న తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన బోధన రుసుముల ఆర్థిక సహాయ పథకం 'ఫాస్ట్ జీవోలో 1956 నవంబరు 1ని ఎందుకు ప్రస్తావించారో చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. (ఉపకార వేతనాలు చెల్లించేందుకు అర్హులైన విద్యార్థులను గుర్తించే విషయమై మార్గదర్శకాల రూపకల్పన కోసం ఈ జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే.) సంబంధిత అధికారులను ఆ విషయాన్ని అడిగి కోర్టుకు తెలపాలని తెలంగాణ అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ఆదేశించింది. 1956 నవంబరు 1 నాటికి తెలంగాణలో స్థిరపడిన కుటుంబాలకు చెందిన విద్యార్ధులకే 'ఫాస్ట్‌ను అమలు చేస్తామని ఆ జీవోలో పేర్కొనడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. వచ్చే విచారణ నాటికి స్పష్టమైన నిర్ణయంతో రావాలని తేల్చిచెప్పింది. ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చుకాని.. అవి భారత రాజ్యాంగ పరిధిలో ఉండాలని గుర్తుచేసింది. ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. 'జాతీయ సమగ్రతను దృష్టిలో ఉంచుకొని.. బీహార్‌కు చెందిన వ్యక్తులు తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే వారి పిల్లలకు ఈ పథకం వర్తింపజేయరా? అని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యాల్లో గతంలోనే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించినా ఆ మేరకు వ్యవహరించని అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేసింది. భవిష్యత్తులో అధికారులు కోర్టులతో ఈ విధంగా ఆటలాడుకోరని భావిస్తున్నామంటూ వ్యాఖ్యానించింది. ఏజీ అభ్యర్థన మేరకు కౌంటర్ దాఖలకు చివరి అవకాశంగా విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం గతేడాది జులై 30న జారీచేసిన 'ఫాస్ట్ జీవోను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ మాజీమంత్రి, తెదేపా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు.
తెలంగాణ ఏజీ వాదనలు ప్రారంభిస్తూ.. ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులను గుర్తించేందుకు 'మార్గదర్శకాల రూపకల్పనకు కమిటీకి అప్పగించామన్నారు. ప్రస్తుత దశలో పథకం అమలు కానందున ఈ వ్యాజ్యాలపై విచారణ సరికాదన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కాబట్టి మార్గదర్శకాల రూపకల్పన చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. మార్గదర్శకాలనే రూపొందించొద్దనే విధంగా కోర్టును ఆశ్రయించడం సరికాదన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ జోక్యం చేసుకుంటూ.. మార్గదర్శకాల రూపకల్పనకు ఉద్దేశించిన ప్రస్తుత జీవోలో '1956 నవంబరు 1ని ప్రస్తావించడాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గతంలో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని.. ధర్మాసనం ఆదేశించిందని గుర్తుచేశారు. ప్రభుత్వ అవసరాలైతే అధికారులు పరిగెత్తి చేస్తారని.. కోర్టు వ్యవహారంలో ఈ విధంగా కౌంటర్ దాఖలు చేయకపోవడం సరికాదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫాస్ట్ వ్యవహారం ప్రభుత్వ విధానపర నిర్ణయం (పాలసీ డెసిషన్) అన్న ఏజీ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఏ విధానపరమైన నిర్ణయమైనా రాజ్యాంగానికి లోబడి ఉండాలని పేర్కొంది. మన దేశాన్ని రాజ్యాంగం నడుపుతోందా? లేక ఏ ఇతర యంత్రాంగం నడుపుతోందా? అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలుకు నాలుగు వారాల గడువు కావాలని ఏజీ అభ్యర్థించినా.. రెండు వారాల్లో దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది.
నిశ్చింతగా... సన్నద్దత!
ఉద్యోగ నియామక ప్రకటనలు వచ్చినపుడే రాతపరీక్షలకు చదవటమంటే విజయాన్ని చేజేతులా దూరం చేసుకోవడమే! ఎందుకంటే పరీక్ష సన్నద్ధతకు అప్పుడు ఎక్కువ సమయం ఉండదు. అందుకే గ్రూప్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్న రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులూ కీలక సబ్జెక్టులపై, మౌలిక అంశాలపై దృష్టి పెట్టాలి. తెలంగాణ అభ్యర్థులు- గ్రూప్స్‌ పరీక్షల సిలబస్‌లో జరిగే మార్పు స్వల్పమేనని గ్రహించాలి!
మనదేశంలో అన్ని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పోటీ పరీక్షలన్నింటిలో తప్పనిసరిగా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. అది టీఎస్‌పీఎస్‌సీ అయినా, ఏపీపీఎస్‌సీ అయినా అభ్యర్థులందరినీ ఈ అంశాల్లో తప్పనిసరిగా పరీక్షించాల్సి ఉంటుంది. ఆ సబ్జెక్టులు... 1. భారతీయ రాజకీయ వ్యవస్థ- రాజ్యాంగం 2. భారతదేశ చరిత్ర- సంస్కృతి 3. భారత స్వాతంత్రోద్యమం 4. ప్రపంచ, భారతదేశ భౌగోళికాంశాలు 5. విపత్తు నిర్వహణ 6. భారతదేశ ఆర్థిక వ్యవస్థ- ఆర్థికాభివృద్ధి- ప్రణాళికలు 7. శాస్త్ర- సాంకేతిక పరిజ్ఞానం (సైన్స్‌ & టెక్నాలజీ) వాటి అనువర్తనాలు 8. జాతీయ, అంతర్జాతీయ వర్తమాన విషయాలు 9. మానసిక సామర్థ్యం 10. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ- జీవ వైవిధ్యం, శీతోష్ణస్థితి మార్పు- భూతాప ప్రక్రియ.
గ్రూప్‌-1, గ్రూప్‌-2, ఇతర ఉద్యోగాలను ఆశించే తెలంగాణ అభ్యర్థుల్లో కొందరు 'సిలబస్‌ తెలియకుండా చదవలేం కదా!' అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది అపోహ మాత్రమే. ఇలాంటివారు సిలబస్‌ కోసం వేచి చూడకుండా పై అంశాలను ముందుగా అధ్యయనం చేస్తే తమ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నవారు అవుతారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ఏర్పడగానే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగానే వివిధ పరీక్షల విధానం, సిలబస్‌ రూపకల్పనకు వివిధ రంగాల నిపుణులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ ఈ సంవత్సరంలో జరిగే పరీక్షల విధానంలో పెద్దగా మార్పు ఉండబోదనీ, కానీ పాఠ్యాంశాల్లో (సిలబస్‌) మార్పు ఉంటుందనీ తెలియజేసింది. జనవరి 17న టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో సిలబస్‌ కమిటీ భేటీ అయింది. ఏపీ చరిత్ర, ఎకానమీల స్థానంలో తెలంగాణ చరిత్ర, ఎకానమీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
అందరూ చదవాల్సిందే
భారత రాజకీయ వ్యవస్థ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకూ ఉన్న 10 కీలక అంశాలూ దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతి ఉన్నతస్థాయి పోటీ పరీక్షలన్నింటిలో తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల్లో కూడా కొనసాగించాల్సి ఉంటుంది. వీటికి అదనంగా తెలంగాణ రాష్ట్ర చరిత్ర సంస్కృతి; సామాజిక పరిస్థితులు; రాజకీయ పరిణామాలు; వివిధ భౌగోళికాంశాలు, వివిధ వనరులు- వాటి వినియోగం, ఆర్థికవ్యవస్థ- ఆర్థికాభివృద్ధి చదవాల్సి ఉంటుంది.
నిజానికి ఈ అంశాలన్నింటినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సిలబస్‌లో కూడా చేర్చారు. అయితే ఉమ్మడి రాష్ట్రానికి చెందినవి అవడంచేత తెలంగాణ అభ్యర్థులు ఈ అంశాలన్నింటినీ తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేసి ప్రతి అంశాన్నీ క్షేత్రస్థాయిలో విపులంగా చదవవలసి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ చరిత్ర సంస్కృతి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం- తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు- భౌగోళిక, ఆర్థిక వనరులు- మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. మార్కుల కేటాయింపులో కొత్తగా చేర్చే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండవచ్చు.
మార్కుల ప్రాధాన్యం
మార్కుల ప్రాధాన్యం ఎంతవరకూ ఉండవచ్చనేది నిపుణుల కమిటీ త్వరలో నిర్ణయిస్తుంది. నిజానికి ఏదైనా ఒక అంశాన్ని సిలబస్‌లో చేర్చినట్లయితే పరీక్షలో ఆ అంశం నుంచి 15 ప్రశ్నలు వచ్చినా 75 ప్రశ్నలు వచ్చినా సిలబస్‌ మొత్తాన్ని క్షుణ్ణంగా చదవాల్సిందే. ఎందుకంటే ఈ పోటీ పరీక్షల్లో ఎలాంటి చాయిస్‌ ఉండదు. అందుకే ఒక్క ప్రశ్నను కూడా వదిలేయడానికి వీలులేదు. పరీక్షలోని ప్రతి ఒక్క ప్రశ్నా విజయాన్ని నిర్ధారిస్తుంది. అందుకే ప్రశ్నల పరంగా, మార్కుల పరంగా ఆలోచించకుండా సిలబస్‌లో చేర్చిన ప్రతి అంశాన్నీ కూలంకషంగా చదవాల్సి ఉంటుంది. రాజకీయ వ్యవస్థను పరిశీలిస్తే- గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో వచ్చే 15- 20 ప్రశ్నలకు కూడా గ్రూప్‌-2లో వచ్చే 75 ప్రశ్నలకు ఏమి చదవాలో, ఎంత చదవాలో అంతే చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను 75 మార్కులకు ఎంత చదవాలో 15 మార్కులకు కూడా అంతే చదవాల్సిందే.
కొత్త సిలబస్‌పై ఆందోళన వద్దు
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాధాన్యాలను పూర్తి సిలబస్‌ను ప్రకటించిన తరువాత శాస్త్రీయంగా ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేయవచ్చు. మారనున్న సిలబస్‌ ఏవిధంగా ఉంటుంది? వాటిలో ఏయే అంశాలు ఉంటాయి? అనే విషయాలపై ఆందోళనకూ, ఆదుర్దాకూ గురికాకూడదు. వాటికి ఎన్ని ప్రశ్నలు, ఎన్ని మార్కులు కేటాయిస్తారనేదాని గురించి ఆలోచించవద్దు. ఈ లోపు భారత రాజ్యాంగం, భారతదేశ ఆర్థికవ్యవస్థ, ప్రపంచ- భారతదేశ భౌగోళికాంశాలు, సాధారణ శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన వివిధ సబ్జెక్టులనూ; విపత్తు నిర్వహణ, వర్తమాన అంశాలను శ్రద్ధగా అధ్యయనం చేయండి. నిర్భయంగా, నిశ్చింతగా ఈ అంశాల ప్రాథమిక భావనలను లోతుగా చదవాలి. అంతేకానీ నూతన సిలబస్‌ ప్రకటించేవరకూ వేచి చూస్తూ సమయం వృథా చేసుకోకూడదు. ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులు కూడా మౌలిక అంశాల అధ్యయనం ప్రకటనలకు ముందే ముగించేలా కృషి కొనసాగించాలి.
ఏ స్థాయిలో చదవాలి?: ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ అధ్యక్షుడు, నిపుణుల కమిటీ సూచనప్రాయంగా తెలియజేసిన విషయాలన్నింటి బట్టి ఆలోచిస్తే పరీక్షలోని ప్రశ్నలు యూపీఎస్‌సీ తరహాలో కఠినంగానే ఉంటాయని భావించవచ్చు. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలను ప్రామాణికంగా, పటిష్ఠంగా నిర్వహించి దేశంలోని అన్ని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లకు ఆదర్శంగా ఉండాలని యోచిస్తోంది. అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది.
ఇతర పరీక్షల సంగతేంటి?: గ్రూప్స్‌ పరీక్షలకే పరిమితం కాకుండా జూనియర్‌ లెక్చరర్స్‌; డిగ్రీ కళాశాల లెక్చరర్స్‌; నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలకు చెందిన ఏఈఈలు, ఏఈలు; అటవీశాఖలోని ఎఫ్‌ఆర్‌ఓలు, ఫారెస్ట్‌ రేంజర్లు, ఏసీఎఫ్‌లు; రాష్ట్ర రవాణా శాఖల్లోని ఏఎంవీఐలు; రాష్ట్ర పోలీస్‌ శాఖలోని ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల్లో కూడా అందరికీ ఉమ్మడిగా తప్పనిసరిగా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ ఉంటుందా! అనే అనుమానం చాలామంది అభ్యర్థుల్లో ఉంది.
టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే పోటీ పరీక్షలన్నింటిలో తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యంతో జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ ఒకటి తప్పకుండా ఉంటుందని భావించవచ్చు. పైన పేర్కొన్న ఈ పరీక్షలన్నింటిలో ఒక జనరల్‌ స్టడీస్‌ పేపర్‌తోపాటు సంబంధిత సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు కూడా ఉంటాయి. కాబట్టి కొత్త సిలబస్‌ కోసం వేచి చూడకుండా వెంటనే అభ్యర్థులు తమ సబ్జెక్టులను చదువుకోవడం మంచిది.
సిలబస్‌లో లేని అంశాలను కొత్తగా చదవడం
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు గ్రూప్‌-2 పరీక్షకు గత రెండు, మూడు సంవత్సరాలుగా సన్నద్ధమవుతూ ఉన్నారు. వారందరిలో ఇప్పటి సందిగ్ధత మారబోయే సిలబస్‌పైనే. కాబట్టి వారు కొత్త సిలబస్‌ గురించి ఆందోళన చెందకుండా ముందుగా భారత రాజ్యాంగాన్ని ప్రస్తుత గ్రూప్‌-2 సిలబస్‌ ప్రకారం కాకుండా మొత్తం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ చరిత్రతో ప్రారంభించి, రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని స్ట్రక్చరల్‌, ఫంక్షనల్‌ కోణాల్లో వివరంగా అధ్యయనం చేయాలి. ప్రస్తుత సిలబస్‌లో రాజ్యాంగ చరిత్రకానీ, రాజ్యాంగ రూపకల్పనకానీ చేర్చలేదు. అలాగే రాజ్యాంగంలోని పెక్కు అంశాలు ఆ సిలబస్‌లో పేర్కొనలేదు. చాలామంది సిలబస్‌లో లేవని వదిలి వేశారు. ఇప్పుడు వాటిన్నింటినీ చదవాల్సిందే.
భారత ఆర్థికవ్యవస్థ: దీన్ని కూడా సమగ్రంగా చదవాలి. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలతో మొదలుపెట్టి ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలు- వాటా- వాటి అభివృద్ధికి చెందిన అన్ని అంశాల నుంచి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వరకు, అంటే ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన ఎన్‌ఐటీఐ ఆయోగ్‌ వరకు, ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నరేంద్రమోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలన్నింటినీ సమగ్రంగా చదవాలి.
సైన్స్‌ & టెక్నాలజీ: సాధారణ శాస్త్ర- సాంకేతిక విషయాలకు సంబంధించి వివిధ సైన్స్‌ సబ్జెక్టుల్లో మౌలిక భావనలను అర్థం చేసుకుని నిత్య జీవితంలో వాటి అనువర్తనాలను సోదాహరణంగా చదవాలి. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన, అణు విజ్ఞాన శాస్త్రం, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, నానో టెక్నాలజీ మొదలైన సబ్జెక్టులను నిత్యజీవితంలో వాటి ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చదవాల్సి ఉంటుంది.
భారతదేశ చరిత్ర- సంస్కృతి, భారతదేశ స్వాతంత్రోద్యమం అనే అంశాలను అన్ని పోటీపరీక్షలకు సన్నద్ధమైనట్లుగానే చదవాలి.
ప్రపంచ భౌగోళికాంశాలను - భారతదేశ భౌగోళికాంశాలను వాటి భౌతిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలతోపాటు ప్రపంచ, భారతదేశ జనాభా తీరు తెన్నులను కూడా అధ్యయనం చేయాలి. భౌగోళికాంశాలతోపాటు విపత్తు నిర్వహణకు చెందిన అంశాలూ ముఖ్యమే.
ప్రత్యేక అంశాల అధ్యయనం సులభతరం
అభ్యర్థులందరూ గుర్తించాల్సిన కీలకమైన అంశం ఏమిటంటే- భారతదేశ ఆర్థిక వ్యవస్థపై సమగ్రమైన అవగాహన ఉంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. భారతదేశ భౌగోళికాంశాలపై అవగాహన ఉంటే రాష్ట్ర భౌగోళికాంశాల అవగాహన చాలా సులభం. ఇక భారతదేశ చరిత్రపై అవగాహన ఉంటే చారిత్రక క్రమం ప్రకారం తెలంగాణ చరిత్రను తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కాకతీయులు చదివేటపుడు దిల్లీ సుల్తానుల చరిత్రపై అవగాహన ఉండాలి. అదేవిధంగా గోల్కొండ సుల్తానుల గురించి చదివేటపుడు బహమనీ సుల్తానుల గురించీ, విజయనగర రాజుల గురించీ అవగాహన అవసరం. తెలంగాణ చరిత్రలో ఆసఫ్‌ జాహివంశ నవాబుల గురించి చదివేటపుడు ఫ్రెంచ్‌, ఇంగ్లిష్‌ ఇండియా సంస్థల అవగాహన ఉండాలి. ఈ విధంగా తెలంగాణ చరిత్రను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి నాటి సమకాలీన భారతదేశ చరిత్రను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందుకే భారతదేశ చరిత్రను చదివితే నిర్దేశించిన సిలబస్‌ను ముందే చదవడంతోపాటు తెలంగాణ చరిత్రను తేలికగా అర్థం చేసుకోవచ్చు.
ఏ పోటీ పరీక్షలోనైనా తప్పనిసరిగా ఆవశ్యకంగా ఉండే అంశాలు మానసిక సామర్థ్యం, వర్తమాన విషయాలు. కాబట్టి కొత్త సిలబస్‌తో సంబంధం లేకుండా మెంటల్‌ ఎబిలిటీ అంశాలను ముందుగానే సన్నద్ధం కావచ్చు. వర్తమాన విషయాలను ప్రతిరోజు చదివి ప్రత్యేకంగా నోట్సు సిద్ధం చేసుకోవాలి.
ఈ విధంగా కొత్తగా చేర్చే తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం గల వివిధ అంశాలు మొత్తం సిలబస్‌తో పోలిస్తే స్వల్పంగానే ఉండవచ్చు. కానీ మార్కుల దృష్ట్యా ప్రాధాన్యం ఎక్కువగా ఉండవచ్చు.
లోతుగా విశ్లేషణాత్మకంగా: తాము నిర్వహించబోయే పోటీ పరీక్షలు యూపీఎస్‌సీ తరహాలో ప్రామాణికంగా ఉంటాయని టీఎస్‌పీఎస్‌సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి సూచనప్రాయంగా తెలియజేశారు. దీన్ని బట్టి అభ్యర్థులు ప్రతి అంశాన్నీ లోతుగా, విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది. సబ్జెక్టులను పైపైన చదివితే సరిపోదని గుర్తించడం అవసరం!
17 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు శ్రీకారం
* నేడు విజయవాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఈనాడు, హైదరాబాద్: యువతలో నైపుణ్యాలకు మెరుగులు దిద్ది, శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు సోమవారం ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించడంతోపాటు, ఒకేసారి 17 కేంద్రాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు కావడం దేశంలోనే ప్రథమం. వినూత్న ఆలోచనలకు, కొత్త ఆవిష్కరణలకు నైపుణ్యాభివృద్ధి సంస్థ వేదికగా నిలవాలన్నది ముఖ్యమంత్రి యోచన. ముందుగా మొబైల్ యాప్స్ రూపకల్పనపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సంస్థ అందుకు తగ్గవిధంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటికే 98 కళాశాలలకు చెందిన 650మంది విద్యార్థులు మొబైల్ అప్లికేషన్లు రూపకల్పనపై దృష్టిపెట్టారు. సుమారు 3వేల యాప్‌లను అభివృద్ధి చేశారు. వీటిలో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం ఇ-గవర్నెన్స్ కోసం తీసుకొంటోంది. సాంకేతిక, వ్యవసాయ, గవర్నెన్స్, అత్యవసర సేవలు, ఫ్యాషన్స్, సౌందర్య సంబంధిత అంశాలకు అవసరమైన యాప్స్‌ను రూపొందించడంలో రాష్ట్ర యువత ముందంజలో ఉంటోంది. నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టి మొదటి ప్రాజెక్టు విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రంగంలో మరింత మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఏప్రిల్, మే నెలల్లో 5వేల మందికి, ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో 20వేల మందికి యాప్స్ అభివృద్ధిలో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ ప్రాజెక్టులో నైపుణ్యాభివృద్ధి సంస్థకు సహకరించేందుకు మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలు తమ నిపుణులకు పంపబోతున్నాయి. దీంతోపాటుగా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు.
చదువుల వేదికగా ఏపీ
* విభజన చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థలన్నింటినీ ప్రారంభిస్తాం
* కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రకటన
* విశాఖలో ఘనంగా ఐ.ఐ.ఎం.కు శంకుస్థాపన
ఈనాడు - విశాఖపట్నం: 'విద్యారంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఏ (పైలెట్‌ ప్రాజెక్టు) ప్రయోగాత్మక కార్యక్రమాన్నయినా ముందుగా ఆంధ్రప్రదేశ్‌లోనే అమలు చేస్తాం. కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలన్నింటినీ నెలకొల్పుతాం. ఈ విషయంలో సమన్వయం చేయడానికి కార్యదళం (టాస్క్‌ఫోర్సు)ను ఏర్పాటు చేస్తామ'ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. జనవరి 17న విశాఖ శివారు గంభీరంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐ.ఐ.ఎం.-విశాఖపట్నం)కు ఆమె శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, రాష్ట్రమంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, నారాయణ, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాసరావులు హాజరయిన ఈ కార్యక్రమంలో ఆమె రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేస్తామని పేర్కొన్న అన్ని సంస్థలూ కచ్చితంగా నెలకొల్పేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
* నేనూ విశాఖవాసినే
తన తండ్రి నౌకాదళంలో పనిచేయడంతో తాను కొంతకాలం విశాఖలోని నేవీ కాలనీలో ఉన్నానని స్మృతి ఇరానీ గుర్తుచేసుకున్నారు. విశాఖ నగరమంటే తనకెంతో ఇష్టమని అన్నారు. కేంద్రం ప్రకటించిన ఆరు ఐ.ఐ.ఎం.లలో మొట్టమొదటిదానికి విశాఖలో శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. సీనియర్‌ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా విశాఖలోనే చదువుకున్నారని తెలిసిందని, నగర అభివృద్ధిలో ఆయన సహకారం తీసుకుంటామని తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఐ.ఐ.ఎం. బిల్లు ఆమోదించడమే తన లక్ష్యమని తెలిపారు.
* ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు
దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థలైన ఐ.ఐ.ఎం., ఐ.ఐ.టి. తదితర సంస్థల నుంచి ఆన్‌లైన్లో పలు కోర్సులు చేసుకునే సౌలభ్యం కల్పించబోతున్నట్లు స్మృతి ఇరానీ వెల్లడించారు. ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు వస్తేనే ప్రధాని మోదీ ప్రవచిస్తున్న 'మేక్‌ ఇన్‌ ఇండియా' కల సాకారం అవుతుందని తెలిపారు. సంస్కరణల్లో భాగంగా జనవరి 26వ తేదీ నుంచి విద్యావిధానంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు.
* చంద్రబాబే ప్రత్యేక ఆకర్షణ
ఈ సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ నగరం ప్రత్యేక ఆకర్షణ అని, ఆ నగరాన్ని చూసి పలువురు పెట్టుబడులు పెడతారని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రత్యేక ఆకర్షణ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి దార్శనికతకు ఆకర్షితులైన పలువురు వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి తరలివస్తారని అన్నారు. ప్రాచీనకాలం నుంచి భారతదేశం విజ్ఞానగనిగా పేరుపొందిందని, ఆ వారసత్వం కొనసాగాలంటే అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో విద్యాబోధన చేసే ఐ.ఐ.ఎం., ఐ.ఐ.టి., ఐ.ఐ.ఐ.టి. లాంటి సంస్థలు ఏర్పడాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల పల్లెటూరికి చెందిన నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా నియమితులవ్వడం తెలుగువారి ప్రతిభకు నిదర్శనమన్నారు.
* అభివృద్ధికి అడ్డంకులు వద్దు
30ఏళ్ల తరువాత దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని, అభివృద్ధికి అడ్డంకులు కలగకుండా సహకరించాలంటూ ప్రతిపక్షాలను వెంకయ్య నాయుడు కోరారు. పార్లమెంటును జరగనివ్వబోమని కొందరు ప్రకటిస్తున్నారని, ఆ ధోరణి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని అన్నారు. నిర్ణయాల్లో లోపాలుంటే సభలో చర్చించి మార్పుచేర్పులకు ప్రయత్నించాలిగానీ సభనే అడ్డుకుంటామంటూ ప్రకటించడం అవివేకమన్నారు. ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలు చేయడం తక్షణావశ్యకమని, వాటిని ఆలస్యం చేయడం వల్లే దేశం వెనుబడిపోయిందని గుర్తుచేశారు. ఆర్థిక అంటరానితనం ఉండకూడదన్న ఉద్దేశంతో మోదీ 'ప్రధాని జన్‌ ధన్‌ యోజన'ను అమలు చేయించారని చెప్పారు. కేవలం 10 వారాల వ్యవధిలో ఏకంగా 10 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు సమకూరడం భాజపా ప్రభుత్వ వేగానికి రుజువు అని చెప్పారు. దేశప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రధాని మోదీ అభివృద్ధి, సుపరిపాలన అనే సూత్రాలతో; 'స్కిల్‌, స్కేల్‌, స్పీడ్‌' అనే లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు.
* సృజనాత్మక కోర్సులు అవసరం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఐ.ఐ.ఎం-విలో సంప్రదాయ కోర్సులతోపాటు సృజనాత్మకంగా ఉండే అధునాతన కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. నౌకాయానం (మెరైన్‌), రవాణా (లాజిస్టిక్స్‌) తదితర రంగాల్లో కోర్సులు ప్రవేశపెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. విశాఖ నగరంపై ఒకప్పుడు పెద్దగా దృష్టి ఉండేదికాదని, ఇప్పుడు నగర ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయికి పెరుగుతోందని చెప్పారు. విశాఖవాసులది ఉక్కు సంకల్పమని, హుద్‌హుద్‌లాంటి తీవ్రపెనుతుపానులే నగరవాసుల్ని ఏమీ చేయలేకపోయాయన్నారు.
* వేదికపైనే నిర్ణయాల అమలు
కేంద్రప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి చేపట్టబోయే ఎలాంటి ప్రయోగాత్మక ప్రాజెక్టులకైనా (పైలెట్‌ ప్రాజెక్టులు) ఆంధ్రప్రదేశ్‌నే ఎంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపైనున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కోరారు. రాష్ట్రానికి కేటాయిస్తామన్న 11 సంస్థలు మంజూరు కావడానికి ఒక కార్యదళం (టాస్క్‌ఫోర్స్‌)ను ఏర్పాటుచేయాలని, ఆమేరకు ఆమె హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన స్మృతి ఇరానీ సీఎం నుంచి మైకు తీసుకుని 'టాస్క్‌ఫోర్స్‌' ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పైలెట్‌ ప్రాజెక్టుల అమలుకు కూడా రాష్ట్రాన్ని ఎంచుకుంటామని హామీ ఇచ్చారు.
       కేంద్రమంత్రి ప్రసంగాన్ని విశాఖ ఎంపీ డాక్టర్‌ కె.హరిబాబు తెలుగులోకి అనువదించారు. రాష్ట్ర మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ నైపుణ్యాల అభివృద్ధికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని, త్వరలో ఇందుకోసం ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. బెంగళూరు ఐ.ఐ.ఎం. డైరెక్టర్‌ సుశీల్‌ వచానీ మాట్లాడుతూ విశాఖ ఐ.ఐ.ఎం.ను ప్రపంచశ్రేణి ప్రమాణాలతో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఏఎన్‌యూలో 'శాస్త్ర మథనం' !
* 19 నుంచి 3రోజుల పాటు భారతీయ యువజన సైన్స్ కాంగ్రెస్
* ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు
* వెయ్యి మంది ప్రతినిధులు వస్తారని అంచనా: వీసీ వియ్యన్నరావు
ఈనాడు, గుంటూరు: పరిశోధనల వైపు యువతను ఆకర్షించే లక్ష్యంతో 2009 నుంచి ఏటా నిర్వహిస్తున్న భారతీయ యువజన సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ఈ సారి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదికైంది. జనవరి 19 నుంచి మూడురోజుల పాటు ఈ సమావేశాలు స్థానికంగా జరుగుతాయని విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) ఆచార్య కె.వియ్యన్నరావు తెలిపారు. డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు ఏఎన్‌యూతో పాటు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం (చెన్నై), రాజీవ్‌గాంధీ జాతీయ యువజన అభివృద్ధి సంస్థ (చెన్నై) సహకారం అందిస్తున్నాయని వివరించారు. స్వామినాథన్ పరిశోధన సంస్థ ప్రతినిధులు డాక్టర్ పరశురామన్, రాజ్యలక్ష్మితో కలిసి ఏఎన్‌యూ వియ్యన్నరావు 17న గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ఆకలి చావులకు తావులేకుండా ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత ఎలా కల్పించాలి? ఆకలి సమస్యలను అధిగమించేందుకు యువ శాస్త్రవేత్తల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు డాక్టర్ స్వామినాథన్ వారితో నేరుగా సమావేశమవుతారని చెప్పారు. వీరి నుంచి సుమారు 350 పరిశోధన పత్రాలు వస్తాయని, వాటిపై చర్చ ఉంటుందని తెలియజేశారు. పరిశోధక విద్యార్థులు ఈ సమావేశాలకు విధిగా హాజరై తమ ఆలోచనలను పంచుకోవాలని కోరారు. యువ శాస్త్రజ్ఞులు, ఆయా పరిశోధన సంస్థల డైరెక్టర్లు, ఆచార్యులు, స్కాలర్ విద్యార్థులు అంతా కలిపి వెయ్యి మంది వరకు ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. మూడు రోజుల పాటు డాక్టర్ స్వామినాథన్ స్థానికంగానే ఉంటారని తెలిపారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై సమావేశాలను ప్రారంభిస్తారని చెప్పారు. గౌరవ అతిథిగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి వై.ఎస్.సుజనాచౌదరి హాజరుకానున్నారని వివరించారు. ముగింపు సమావేశానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని ఉపకులపతి వియ్యన్నరావు వివరించారు.
ఇక రెండు ద‌శ‌ల్లో ఐబీపీఎస్ ప‌రీక్షలు
ముందుగా ప్రిలిమిన‌రీ ప‌రీక్ష
అర్హత సాధిస్తే మెయిన్స్‌కు అవ‌కాశం
క్లరిక‌ల్‌, పీవో/ఎంటీ రెండు ప‌రీక్షల‌కూ వ‌ర్తింపు
సీడ‌బ్ల్యుఈ 5 నుంచి అమ‌లు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (ఎస్‌బీఐ, అనుబంధ బ్యాంకులు త‌ప్ప) క్లర్క్‌, ప్రొబేస‌న‌రీ ఆఫీస‌ర్‌, మేనేజ్‌మెంట్ ట్రెయినీ...త‌దిత‌ర పోస్టుల‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) ద్వారా భ‌ర్తీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పటి దాకా (సీడ‌బ్ల్యుఈ-4) ఈ ఎంపిక ప్రక్రియ రాత ప‌రీక్ష అనంత‌రం ఇంట‌ర్వ్యూలో చూపిన ప్రతిభ ద్వారా ఉండేది. ఇక‌పై నిర్వహించే ప‌రీక్షల్లో ( సీడ‌బ్ల్యుఈ-5) నుంచి కొత్త విధానం అమ‌ల్లోకి వ‌స్తుంది.
కొత్తగా ఇలా...
తాజా మార్పుల ప్రకారం ముందుగా ప్రిలిమిన‌రీ ప‌రీక్షను నిర్వహిస్తారు. కొన్ని ప్రశ్నలుండి, త‌క్కువ వ్యవ‌ధిలో ముగిసేలా ఈ ప‌రీక్షను రూపొందిస్తారు. ఇందులో అర్హత సాధించిన‌వాళ్లే మెయిన్స్ రాయ‌డానికి అర్హులు. ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. మెయిన్స్‌లో అర్హత సాధించిన‌వారిని ఇంట‌ర్వ్యూకి ఆహ్వానిస్తారు. మెయిన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూలో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఆయా పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌య్యే స‌మ‌యానికి తాజా మార్పుల‌పై పూర్తి స్పష్టత వ‌స్తుంది. ప్రిలిమిన‌రీ నుంచి మెయిన్స్‌కి ఎంత మందిని ఎంపిక‌చేస్తారు, ఏ అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారో ప్రస్తుతానికి ఐబీపీఎస్ స్పష్టం చేయ‌లేదు.
ఆందోళ‌న అవ‌స‌రం లేదు
ప్రస్తుతం ఐబీపీఎస్ రెండంచెల్లో రాత ప‌రీక్ష నిర్వహిస్తామ‌ని పేర్కొంది త‌ప్ప సిల‌బ‌స్ మార్పుల గురించి ఎలాంటి నిర్ణయ‌మూ ప్రక‌టించ‌లేదు. కాబ‌ట్టి బ్యాంకు ఉద్యోగాల ఆశావ‌హులు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. ఇప్పటి వ‌ర‌కు ఉన్న అంశాల‌నే (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజ‌నింగ్‌, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్) భ‌విష్యత్తులోనూ కొన‌సాగించ‌డానికే అవ‌కాశాలెక్కువ‌. ఇవే అంశాల‌పై ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో తేలిక స్థాయి ప్రశ్నలు అడ‌గొచ్చు. మెయిన్స్‌లో మాత్రం కొంచెం క‌ఠినమైన ప్రశ్నలొస్తాయి. అలాగే వీటికి అనుబంధంగా డిస్క్రిప్టివ్ ప‌రీక్షనూ చేర్చే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం ఎస్‌బీఐ ఇంగ్లిష్‌లో డిస్క్రిప్టివ్ ప‌రీక్షనూ నిర్వహిస్తోంది. ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌, మేనేజ్‌మెంట్ ట్రెయినీల‌కు ఆంగ్లంలో రాయ‌గ‌లిగే సామ‌ర్థ్యం త‌ప్పనిస‌రి. ఎందుకంటే వృత్తిలో భాగంగా ఎక్కువ సంద‌ర్భాల్లో రాయాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి ఇంగ్లిష్‌లో డిస్క్రిప్టివ్ పేప‌ర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబ‌ట్టి అభ్యర్థులు నోటిఫికేష‌న్ వెలువ‌డేవ‌ర‌కు కొత్తగా ఏ మార్పులు చేస్తారో అని గంద‌ర‌గోళానికి గురికాకుండా ఎప్పటిలాగే ప్రిప‌రేష‌న్ కొన‌సాగించాలి. ప్రక‌ట‌న విడుద‌లైన త‌ర్వాత కొత్తగా చేర్చిన అంశాల‌ను చ‌దువుకోవాలి. ప్రక‌ట‌న‌కు, ప‌రీక్షకు మ‌ధ్య వ్యవ‌ధి క‌నీసం రెండు నెల‌ల‌కు తక్కువ కాకుండా, మూడు నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. ఆ స‌మ‌యం మార్పుల‌కు అనుగుణంగా స‌న్నద్ధం కావ‌డానికి స‌రిపోతుంది. అప్పటి వ‌ర‌కు ర‌క‌రకాల ఊహాగానాల గురించి ఆందోళన చెందకుండా పరీక్షకు సిద్ధమవుతూ విజయావకాశాలను మెరుగు పరుచుకోవాలి.
స్పెషలిస్ట్ ఆఫీసర్ల పరీక్షలో మార్పులులేవు !
ఐబీపీఎస్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నిర్వహించే రాత ప‌రీక్షలో ఎలాంటి మార్పులూ చేప‌ట్టలేదు. పాత విధాన‌మే కొనసాగుతుంది. అలాగే ఆర్ఆర్‌బీల్లో స్కేల్ 1, 2, 3 ఆఫీస‌ర్లు, ఆపీస్ అసిస్టెంట్ల‌ భ‌ర్తీకి చేప‌ట్టే సీడ‌ల్ల్యుఈ-4లో ఎలాంటి మార్పులూ లేవు. ఈ ప‌రీక్షలు సెప్టెంబ‌ర్ నెల‌లో వివిధ తేదీల్లో నిర్వహిస్తారు.
ఇదీ షెడ్యూల్‌
ప‌రీక్ష: సీడ‌బ్ల్యుఈ పీవో, ఎంటీ-5
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష: అక్టోబ‌ర్ 3, 4, 10, 11 తేదీల్లో
మెయిన్ ఎగ్జామ్‌: అక్టోబ‌ర్ 31
ప‌రీక్ష: సీడ‌బ్ల్యుఈ క్లర్క్‌-5
ప్రిలిమిన‌రీ: డిసెంబ‌ర్ 5, 6, 12, 13, 19, 20 తేదీలు
మెయిన్ ఎగ్జామ్‌: జ‌న‌వ‌రి 3, 2016
ప‌రీక్ష: సీడ‌బ్ల్యుఈ స్పెష‌లిస్ట్‌-5
పరీక్ష తేదీలు: జ‌న‌వ‌రి 30, 31 -2016 (ఒకే రాత ప‌రీక్ష)
» పరీక్షల షెడ్యూల్‌
పూర్తి వివ‌రాల కోసం www.ibps.in చూడొచ్చు.
ఇంప్రూవ్‌మెంట్‌పై అధ్యయనానికి నిపుణుల సంఘం
ఈనాడు-హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఇంప్రూవ్‌మెంట్ విధానం కొనసాగింపుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ప్రక్రియపై అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఇంటర్ విద్యామండలి నిపుణుల సంఘాన్ని నియమించింది. ముగ్గురు విశ్రాంత పరీక్షల నియంత్రణ అధికారులు, అనుభవజ్ఞులైన ప్రిన్సిపళ్లు, నలుగురు జూనియర్ కళాశాలల అధ్యాపకులతో ఈ సంఘం ఏర్పాటైంది. 80 శాతం వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు ప్రయోజనం పొందే ఈ విధానంపై వారు పరిశీలించనున్నారు. ఎంసెట్, జేఈఈ మెయిన్స్ తదితర ప్రవేశాల్లో ఇంటర్ మార్కులకు ప్రాధాన్యం ఇస్తున్నందున సైన్స్ గ్రూపు వారు ఎక్కువగా ఈ పరీక్షలు రాస్తున్నారు. 98 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు సైతం మళ్లీ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఒక్కమార్కు తేడాతో భవిష్యత్తు మారనున్న నేపథ్యంలో పోటీ పడుతున్నారు. మార్చి పరీక్షల్లో కంటే ఇంప్రూవ్‌మెంట్‌లో తక్కువగా మార్కులు వచ్చినట్లయితే ఎక్కువగా ఉన్న మార్కులనే పరిగణనలోకి తీసుకోవడం ప్రయోజకరంగా మారింది. మరోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి వార్షిక పరీక్షలే అక్కర్లేదని, ద్వితీయ సంవత్సరంలో నిర్వహించే పబ్లిక్ పరీక్షలు సరిపోతాయనే వాదనలున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఈ పద్ధతి లేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. అసలు ఇంప్రూవ్‌మెంట్ నిర్వహించాల్సిన అవసరం ఏముందన్న దానిపై ఉన్నతాధికార స్థాయిలోనూ చర్చిస్తున్నారు.
బోధనపై ప్రభావం
ఇంప్రూవ్‌మెంట్ వల్ల ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో బోధనపై ప్రభావం కనిపిస్తోంది. వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధ్యాపకులు ఫిబ్రవరి నుంచే సిద్ధమవుతుండటంతో పాఠ్యాంశాల రివిజన్ దెబ్బతింటోంది. ఈ సమయంలో ఒక్కో కళాశాలలో ఒకరిద్దరు బోధకులు మాత్రమే ఉంటున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను తీసేయాలని, ఇంప్రూవ్‌మెంట్ విధానం ఎందుకన్న అంశంపై ఆసక్తి కనబరిచిన మాధ్యమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్ అధర్‌సిన్హా తెలంగాణ కేడర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఈ అంశంపై తదుపరి నిర్ణయం.. త్వరలో జరిగే ఇంటర్ విద్యామండలి సమావేశంలో వెల్లడికానుంది.
అందుకోండి... ఐఐటీ పాఠాలు!
* ఇంజినీరింగ్, ఇతర విద్యార్థులకూ అవకాశం
* కాన్పూర్, మద్రాస్ సంస్థల ఆన్‌లైన్ మూక్స్
ఈనాడు, హైదరాబాద్: ఆదిలాబాద్‌లోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఓ ఐఐటీ ఆచార్యుడి పాఠాన్ని వినాలంటే? శ్రీకాకుళం శివార్లలోని కళాశాల విద్యార్థి మద్రాసు ఐఐటీ ఆచార్యుడితో మాట్లాడాలనుకుంటే...? ఇన్నాళ్లూ సాధ్యపడకపోవచ్చు! కానీ ఇప్పుడది సాధ్యం కాబోతోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చదువుతున్నా... ఇంజినీరింగ్ విద్యార్థులు మద్రాసు, కాన్పూర్ ఐఐటీ ఆచార్యుల పాఠాల్ని అందుకోవచ్చు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆరంభించిన 'స్వయం మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు (మూక్)ల ద్వారా ఇది సాధ్యం కానుంది. కాన్పూర్, మద్రాసు ఐఐటీలు ఇంజినీరింగ్ విద్యార్థులకే కాకుండా... ఇతర రంగాల్లోని విద్యార్థుల కోసం కూడా స్వల్పకాలిక ఆన్‌లైన్ కోర్సులు ఆరంభించారు. ఆయా ఐఐటీల్లోని ఆచార్యుల ఆధ్వర్యంలోనే వీటిని నిర్వహిస్తున్నారు. మద్రాసు ఐఐటీ నుంచి ప్రస్తుతం 18 కోర్సుల్ని అందిస్తున్నారు. వీటిలో... ఇంజినీరింగ్‌కు సంబంధించినవే కాకుండా... భాష, కర్ణాటక సంగీతానికి సంబంధించినవి కూడా ఉండటం విశేషం. ఉచితంగా నిర్వహించే ఈ కోర్సుల్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి... ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. https://onlinecourses.nptel.ac.in/explorer వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు నమోదు చేసుకోవచ్చు. ''ప్రతిష్ఠాత్మక సంస్థల ద్వారా నిర్వహించే కోర్సుల్ని చేయడం ద్వారా అదనపు విజ్ఞానం సంపాదించే అవకాశం ఒకటైతే... మునుముందు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు వీటివల్ల అవకాశాలు పెరుగుతాయి అని జేఎన్‌టీయూ హైదరాబాద్ ఆచార్యుడొకరు పేర్కొన్నారు. ఇప్పటికే హార్వర్డ్‌లాంటి విదేశీ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు ఇలాంటి మూక్ ఆన్‌లైన్ కోర్సుల్ని అందిస్తున్నాయి. వాటి తరహాలోనే డిజిటల్ పాఠాల్ని మన దేశంలోని విద్యార్థులకు అందించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ కోర్సులు. ఇప్పటికే ముంబై ఐఐటీ ఇలాంటి కోర్సుల్ని అందజేస్తోంది. మునుముందు వీటి సంఖ్యను మరింతగా విస్తరించే అవకాశాలున్నాయి.
ఆలోచనలే పెట్టుబడులు!
* విద్యార్థులే సీఈవోలు
* ఇంజినీరింగ్ కళాశాలల్లో కొత్త ఆలోచనలకు పునాదులు
* ఔత్సాహిక వ్యాపారవేత్తల క్లబ్‌ల ఏర్పాటు
* 29న ప్రారంభించనున్న ఏపీ ముఖ్యమంత్రి
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కళాశాలలు కొత్త ఆలోచన కేంద్రాలుగా మారనున్నాయి. విద్యార్థుల ఆలోచనలే పెట్టుబడులుగా, సమూహాలే కంపెనీలుగా.. గ్రూపులోని సభ్యులే ముఖ్యకార్యనిర్వాహక అధికారి(సీఈవోలు)గా విభిన్న హోదాల్లో కనిపించనున్నారు. 'ఏపీ కొత్త ఆలోచనల విధానంలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టార్ట్అప్ విలేజి పథకంలో భాగంగా కళాశాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభివృద్ధి క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్ని భవిష్యత్తు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 'స్టార్ట్అప్ బూట్‌క్యాంప్ కార్యక్రమాన్ని జనవరి 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ప్రారంభించనున్నారు.
103 కళాశాలల భాగస్వామ్యం
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖపట్నంలో పైలెట్ ప్రాజెక్టు కింద స్టార్ట్అప్ విలేజీని ప్రారంభించింది. రానున్న పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటికి రూ.1000కోట్ల మూలధనాన్ని సమకూర్చడంతో పాటు ప్రైవేటు వెంచర్ కేపిటల్ సంస్థల ద్వారా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విశాఖపట్నంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన కొత్త ఆలోచనల కేంద్రంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం యూనివర్సిటీలను ఆదేశించింది. ఈ మేరకు బూట్‌క్యాంప్‌లో భాగంగా కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, విద్యార్థుల నైపుణ్యాల్లో శిక్షణ పొందడం, నూతన సాంకేతిక అంశాలపై సదస్సులు, మేధోమధన కార్యక్రమాలు, కళాశాల స్థాయిలోనే పరిశోధనల్ని ప్రోత్సహించడం, ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించనుంది. విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక పారిశ్రామికవేత్తగా సంయుక్తంగా కొత్త ఆలోచనలు అమలు చేస్తూ.. విద్యార్థులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఏపీలో 103 కళాశాలల్ని ఇందులో భాగస్వామ్యం చేయనుంది. 621 మంది విద్యార్థులు, 103 మంది పర్యవేక్షకులతో సహా 721 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జేఎన్‌టీయూ అనంతపురం ప్రాంతీయ పరిధిలోని 33 కళాశాలల విద్యార్థులతో ఈనెల 23, కాకినాడ పరిధిలోని 70 కళాశాలల విద్యార్థులతో ఈనెల 25న ముందస్తు సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నారు.
కళాశాలల్లో కల్పించాల్సిన సౌకర్యాలు
* పరిశోధన, శిక్షణ, కొత్త ఆలోచనల ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి. కళాశాలల్లో పుట్టిన ఆలోచనలు, ఉత్పత్తులను వాణిజ్య పరంగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఏర్పాట్లు ఉండాలి.
* అధిక సామర్థ్యం కలిగిన కంప్యూటర్లు, సర్వర్లు, టెలికం, డేటా కమ్యూనికేషన్ పరికరాలు అందుబాటులో పెట్టాలి. కంప్యూటర్లు, ఇంటర్నెట్ 24 గంటలూ వినియోగించుకునే వీలు కల్పించాలి.
* సెమినార్లు, సదస్సులు, వినోదం కోసం ఏర్పాట్లు ఉండాలి. విద్యార్థుల ఆలోచనలకు, వారి ఇష్టమైన రంగాల్లో రాణించేందుకు ప్రోత్సాహం కల్పించాలి.
* విద్యార్థుల ఆలోచనలతో కూడిన ప్రచురణలు, పుస్తకాలు, ఆడియో, వీడియోలు, న్యూస్‌లెటర్లు తీసుకువచ్చేందుకు అనుమతులివ్వాలి.
* వ్యాపార, ఆర్థిక, మార్కెటింగ్, న్యాయ తదితర నిపుణులతో కూడిన పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసి, వారి సలహాలు విద్యార్థులు తీసుకునేలా ప్రోత్సహించాలి.
* బూట్‌క్యాంప్ కార్యనిర్వాహక కమిటీలో సీఈవో, సీవోవో, సీఎంవో, సీఎఫ్‌వో, సీటీవో, సీసీవో, సీఎస్‌వోలు ఉంటారు. వీరితో పాటు ఒక ఉపాధ్యక్షుడ్ని తరగతి గది నుంచి విద్యార్థులు ఎన్నుకుంటారు.
అమ్మాయిలు సర్కారీ బడులకు.. అబ్బాయిలు ప్రైవేటుకు
* హైస్కూల్లో పెరుగుతున్న డ్రాపౌట్స్‌
* తెలంగాణలో విద్యా చిత్రమిది
* అసర్‌-ప్రథమ్‌ నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మనుగడ ప్రమాదంలో పడుతోందని, 'ప్రైవేటు' నుంచి పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోందని ప్రథమ్‌ విడుదల చేసిన విద్యావార్షిక నివేదిక (అసర్‌) - 2014 తేల్చి చెప్పింది. 2004 నుంచి అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సర్వే చేసి విడుదల చేస్తున్న విద్యావార్షిక నివేదికలో తొలిసారిగా తెలంగాణనూ విడిగా చేర్చారు. జ‌న‌వ‌రి 13న‌ దిల్లీలో విడుదలైన ఈ సర్వేలోని వివరాలను చూస్తే తెలంగాణలోని పాఠశాలల్లో (ప్రభుత్వ, ప్రైవేటు) విద్యార్థుల నమోదు భారీగానే (సుమారు 97.4శాతం) ఉన్నా నాణ్యత మాత్రం నాసిరకంగానే ఉంటోందని తేలింది. కేవలం 2.6 శాతం మంది మాత్రమే బడిబయట ఉంటున్నారు. గణాంకాల్ని చూస్తే ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధికంగా పిల్లలు చేరుతున్నారు. అయితే పదేళ్ల కిందట 20 శాతమున్న ప్రైవేటు పాఠశాలల నమోదు ఇప్పుడు 40 శాతానికి చేరడం ప్రభుత్వ పాఠశాలల మనుగడకు ముప్పేనని నిపుణుల అంచనా. ప్రాథమిక స్థాయిలో మూడుశాతం లోపు ఉన్న బడిబయట పిల్లలు ఉన్నత పాఠశాలకు వచ్చేసరికి 15 శాతానికి చేరడం గమనార్హం. నాణ్యతలో మాత్రం ప్రాథమికంతో పోల్చితే ఉన్నత పాఠశాలల్లో కాస్త మెరుగ్గా ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్న శిశుతరగతుల ఆరంభానికి ఈ సర్వేలో వూతం లభించింది. మూడేళ్లలోపు పిల్లలు 60శాతం దాకా అంగన్‌వాడీల్లో ఉండగా మధ్యలో స్కూలు లేకపోవడంతో ఐదేళ్లకు వచ్చేసరికి ఆ ప్రవాహంలో అత్యధికులు ప్రైవేటుబాట పడుతున్నట్లు సర్వే తేల్చింది. నాలుగో ఏడు నిండిన పిల్లల్ని ఎక్కడ చేర్చాలనే సందేహంతో చాలా మంది అంగన్‌వాడీలను వీడి ప్రైవేటు పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీల్లో చేర్చుతున్నారు. దీంతో ప్రైవేటులో ఈ దశలో దాదాపు 30శాతం పెరుగుదల నమోదవుతోంది. ఆరో ఏటికల్లా ఈ పిల్లల్లోంచి 45.9 శాతం ప్రభుత్వంలో.. 49.7 శాతం ప్రైవేటులో ఉంటున్నారు. ''2004లో ఈ సర్వే మొదలైనప్పుడు ప్రైవేటు స్కూళ్లలో నమోదు 20% లోపే ఉండేది. పదేళ్లలో ఇది సుమారు రెట్టింపైంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలు మూతపడే ప్రమాదం కనిపిస్తోంది. 9, 10 తరగతుల్లో బడి మానేసే వారి సంఖ్య పెరుగుతోంది. 4, 5 ఏళ్ల పిల్లలకు శిశు సంరక్షణ కేంద్రాలు ప్రారంభించడం తప్పనిసరని సర్వే చాటిచెబుతోంది. కేజీల్లోనే ప్రైవేటుకు అలవాటు పడుతున్న పిల్లలు మళ్లీ ప్రభుత్వం వైపు రావడం లేదు.
ఈసారికి పాత పద్ధతే!
* ఉద్యోగ పరీక్షల విధాన రూపకల్పన కమిటీ నిర్ణయం
* పాఠ్యాంశాల్లో మార్పులు తప్పనిసరి
* గడువుకు ముందే నివేదిక ఇస్తాం
* ప్రభుత్వానికీ కొన్ని ఇబ్బందులున్నాయి
* 'ఈనాడు'తో ఆచార్య హరగోపాల్, కోదండరాం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఈసారికి ఉద్యోగ పరీక్షల విధానం మారడం లేదు. మార్పులు చేర్పులపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటు చేసిన ఆచార్య హరగోపాల్ సారథ్యంలోని నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయించింది. ఈ ఏడాదికి మాత్రం ఉద్యోగ పరీక్షల విధానాన్ని గతంలో ఉన్నట్లే కొనసాగించాలని భావిస్తున్నాం. పాఠ్యాంశాల (సిలబస్)ను మాత్రం తెలంగాణకు అనుగుణంగా మార్చడం తప్పనిసరి. మా కమిటీ నివేదికను గడువుకంటే ముందే ఇవ్వబోతున్నాం. మా వల్ల ఎలాంటి జాప్యం జరగదు అని ఆచార్య హరగోపాల్, గ్రూప్ పరీక్షల తీరుతెన్నుల్ని పరిశీలిస్తున్న కార్యనిర్వాహక బృందం సమన్వయకర్త ఆచార్య కోదండరాంలు 'ఈనాడుకు స్పష్టం చేశారు. 30 మంది సభ్యుల నిపుణుల కమిటీ జనవరి 30లోపు తన నివేదికను టీఎస్పీఎస్సీకి సమర్పించాల్సి ఉంది. లక్షలాది మంది నిరుద్యోగులు వారి సిఫార్సుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో హరగోపాల్, కోదండరాంలను 'ఈనాడు పలకరించింది. వివరాలు వారి మాటల్లోనే..
* 4 కోట్ల మందికి.. 4 లక్షల ఉద్యోగాలుండాలి: హరగోపాల్
తెలంగాణలో ఉద్యోగాల కల్పనకు సంబంధించి అందరిలోనూ బలమైన ఆకాంక్ష ఉంది. ఉద్యమంలో చాలా వర్గాలు పాల్గొన్నాయి. వారిలో పెద్ద ఎత్తున నిరుద్యోగులున్నారు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వ్యవస్థను కాపాడుకోవడానికి ఉద్యమం జరిగితే.. ఇక్కడేమో కొత్త వ్యవస్థ కోసం జరిగింది. ఆ కొత్తవ్యవస్థతో కొత్త ఉద్యోగాలొస్తాయని వారంతా ఆశించారు. తెలంగాణ పోస్టుల్లో సుమారు 60 వేల దాకా ఆంధ్ర ప్రాంత ఉద్యోగులున్నారని గిర్‌గ్లానీ కమిటీ తేల్చింది. వీటికి తోడుగా కొత్త రాష్ట్రంలో కొత్త మానవ వనరులు కూడా అవసరం కాబట్టి లక్ష ఉద్యోగాలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. కానీ, ఒకే ఏడాది వీటన్నింటినీ నింపలేకపోవచ్చు. వరసగా రెండుమూడేళ్లు వీటిని భర్తీ చేయాలి. తెలంగాణలో సుమారు 2 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వీరిలో 30 శాతం దాకా పనికిరాని ఇంజినీర్లే ఉన్నారు. ప్రమాణాల్లేని, పనికిరాని కళాశాలల నుంచి తామరతంపరగా ఇంజినీర్లు పుట్టుకొస్తున్నారు. వీరిలో 10శాతం మందే ఉద్యోగాలకు అర్హులని అంటున్నారు. 90 శాతం మంది వారి చదువుకుతగ్గ ఉద్యోగాలకు అర్హులు కాదు. వీరంతా చిన్నాచితకా ఉద్యోగాలకు పోటీపడుతున్నారు. తెలంగాణకే కాదు.. ఆంధ్రప్రదేశ్‌కూ ఇది సమస్యే. వీరందరికీ అవకాశాలు కల్పించాలంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరీక్ష విధానాల్లో సమూల మార్పులకు పోకుండా పాఠ్యాంశాల మేరకు మాత్రమే మార్పులు చేయాలని కమిటీ సభ్యులంతా భావిస్తున్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వర్గాలు, సాంస్కృతిక, చారిత్రక అంశాల్ని తప్పనిసరిగా చేర్చాల్సిందే. 2016-17 నాటికి మాత్రం మౌలికంగా పూర్తి మార్పుల గురించి పునఃపరిశీలించే అవకాశం టీఎస్పీఎస్సీకి ఉంటుంది. మా కమిటీ వల్ల ఉద్యోగ ప్రకటనల విషయంలో జాప్యం జరగదని గట్టిగా చెప్పగలను. అనుకున్న సమయం కంటే ముందే నివేదిక ఇస్తాం.
ఎంపికైన వారికి కఠోర శిక్షణనివ్వాలి
గ్రూప్-1, గ్రూప్-2 లాంటి పోస్టులకు నియమించే అభ్యర్థులకు తెలంగాణ పునర్నిర్మాణానికి కావాల్సిన పోటీతత్వం ఎక్కువగా ఉండాలి. ఉద్యమంలో భాగంగా విద్యార్థులున్నారు కాబట్టి వారు ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత కూడా పునర్నిర్మాణంలో భాగమయ్యేలా, స్ఫూర్తి నింపేలా ఒకట్రెండేళ్లు కఠోర శిక్షణనివ్వాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు కూడా తెలంగాణ సామాజిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మసలుకోవాలి. రాష్ట్రంలో 85 శాతం బీదబడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలే. ఈ సామాజిక నిర్మాణాన్ని విస్మరించకుండా ఆ వర్గాల పట్ల సానుభూతితో ఉండాలి. విశాలమైన లౌకిక భావాలు, మహిళల పట్ల గౌరవం, శ్రద్ధ ఉండే ఉద్యోగవర్గం వస్తేనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు. పది రోజుల్లో జరగాల్సిన ఐఏఎస్ అధికారుల కేటాయింపు ఇన్నాళ్లు పట్టింది. ఈ జాప్యానికి కారణం కేంద్రానిదే. ఇక సాంకేతికంగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకోవాల్సిన సమస్యలు మరికొన్ని ఉన్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుంటే బాగుండేది. రెండు రాష్ట్రాల్లోనూ శాఖల వారీగా ఎన్ని ఖాళీలున్నాయి? ఎంత కావాలనే అంచనాలు ఇప్పటికీ సరిగ్గా వేయలేదు.
మా వల్ల ఆలస్యం కాదు: కోదండరాం
తెలంగాణ రాష్ట్రానికున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అవసరమైన మార్పులు సూచించమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేయాలనుకునేవారికి ఇక్కడి పరిస్థితులు తెలిసుండాలి. అందుకే ఆ దిశగా పరీక్షలో కొన్ని మార్పులు అవసరమని మా కమిటీ భావిస్తోంది. తెలంగాణ చరిత్రను ఎక్కువగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన లక్ష్యం, చరిత్ర, ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలియకుండా ఇక్కడ పనిచేయడం సాధ్యం కాదు. స్థానికాంశాలపై లోతైన అవగాహన కలిగి నిబద్ధతతో రాజ్యాంగబద్ధంగా పనిచేయడానికి వీలైన వ్యక్తుల్ని ఎంపిక చేయడమే సివిల్ సర్వీస్ పరీక్షల ఉద్దేశం. అలాగని సమూలంగా మౌలిక మార్పులకు మేం వెళ్లడం లేదు. అది సాధ్యం కాదు కూడా. ఎందుకంటే ప్రస్తుత తరహా పరీక్షకే అంతా సిద్ధమై ఉన్నారు. కాబట్టి దాన్ని పెద్దగా మార్చకూడదని మా కమిటీ భావిస్తోంది. మున్ముందు పరీక్ష విధానాల్లో కూడా మార్పుల్ని ప్రవేశపెట్టగలం. ఇప్పుడు మాత్రం కాదు. దీర్ఘకాలికంగా ఏం చేయాలనే దానిపై ఆలోచించి సూచనలు చేస్తాం. తక్షణం పరిమితమైన మార్పులే ఉంటాయి. ఏ లక్ష్యమైనా నిబద్ధతతో కూడిన, లోతైన అవగాహన గల, సమస్యల్ని పరిష్కరించగల, విషయ పరిజ్ఞానం గల అధికారుల్ని ఎంపిక చేయాలి. తెలంగాణను బంగారు బాటలో నడిపించే వారు కావాలి. దీనికి అవసరమైన సూచనలు చేస్తాం.
సాధ్యమైనంత త్వరలో నోటిషికేషన్..
ఈ నెల 30 కంటే చాలా ముందే నివేదిక ఇస్తాం. పిల్లల ఆరాం, వారి మానసిక ఉద్వేగాల్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరగా మా పని పూర్తి చేస్తాం. మా కమిటీ వల్ల ఏమాత్రం ఆలస్యం కాదు. త్వరలోనే ఓ నోటిఫికేషన్ రావాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. కానీ, ప్రభుత్వానికీ సమస్యలున్నాయి. అయినా సాధ్యమైనంత త్వరగా ఓ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు వారూ చెప్పారు.
ఎండోక్రైనాలజీ ప్రవేశార్హత నుంచి బయోకెమిస్ట్రీ తొలగింపు సరైనదే!
* ఎంసీఐ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు
* వ్యాజ్యం కొట్టివేత
ఈనాడు, హైదరాబాద్‌: ఎండోక్రైనాలజీ సూపర్‌ స్పెషాలిటీ కోర్సు (డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌)లో ప్రవేశానికి నిర్ణయించిన అర్హత జాబితా నుంచి ఎండీ(బయోకెమిస్ట్రీ)ని భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) తొలగించడాన్ని హైకోర్టు సమర్థించింది. ఎంసీఐ నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. బయోకెమిస్ట్రీ అర్హత జాబితా నుంచి తొలగింపు వ్యవహారం నిపుణుల కమిటీ సిఫారసు మేరకు జరిగిందని గుర్తుచేసింది. దేశంలోని అన్ని వైద్య విశ్వవిద్యాలయాలకు ఎంసీఐ ఏకీకృత విధానం రూపొందించిందని జ్ఞప్తికి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బయోకెమిస్ట్రీలో పీజీ చేస్తున్నవారు ఆ నిబంధనల నుంచి మినహాయింపు పొందలేరని స్పష్టంచేసింది.
ఇదీ నేపథ్యం: ఎండోక్రైనాలజీ (డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌) సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఎండీ (బయోకెమిస్ట్రీ), ఎండీ (పీడియాట్రిక్స్‌), ఎండీ (జనరల్‌ మెడిసిన్‌)లు గత కొన్నేళ్లుగా విద్యార్హతలుగా ఉండేవి. గతేడాది ఏప్రిల్‌ 17న అర్హత జాబితా నుంచి ఎండీ (బయోకెమిస్ట్రీ)ని తొలగిస్తూ ఎంసీఐ సవరణ చేసింది. దాన్ని సవాలు చేస్తూ డాక్టర్‌ పి.హర్షవర్ధన్‌తో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 9 మంది వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఎండోక్రైనాలజీలో సూపర్‌ స్పెషాలిటీ చేసేందుకు ఎండీ (బయోకెమిస్ట్రీ) గత 13 ఏళ్లకు పైగా అర్హతగా ఉండేదని, ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్హత జాబితా నుంచి బయోకెమిస్ట్రీని తొలగించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు.
మరోవైపు ఎంసీఐ తరఫు న్యాయవాది ఎండోక్రైనాలజీ విభాగంలో అనుభవం ఉన్న నిపుణుల బృందం సూచన మేరకు కనీస అర్హతల జాబితా నుంచి ఎండీ (బయోకెమిస్ట్రీ)ని తొలగించినట్లు కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదలను విన్న ధర్మాసనం కనీస విద్యార్హతలు నిర్ణయించే అధికారం ఎంసీఐకి ఉంటుందని స్పష్టంచేసింది.
తరగతి గదిలో బతుకు పాఠం!
* సామాజిక అవగాహన.. బాధ్యత పెంచే విద్య
* వందశాతం ప్రాంగణ ఎంపికలు
* టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో వినూత్న కోర్సులు
* తెలంగాణ సమ్మిళిత అభివృద్ధికి చేదోడు
* ఆంధ్రలో సామాజిక సాధికారతకు బాసట
* హైదరాబాద్ క్యాంపస్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీలింగం
ఈనాడు, హైదరాబాద్: విజ్ఞానంతోపాటు సమస్యల పరిష్కారం, పేదరిక నిర్మూలన, సమాజంపట్ల బాధ్యత పెంచేలా 'టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్(టిస్) కృషి చేస్తోందని ఆ సంస్థ హైదరాబాద్ క్యాంపస్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీలింగం తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో కలసి పనిచేస్తూ.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, అనేక సామాజిక సమస్యల పరిష్కారానికి టిస్ చేయూతనిస్తోందన్నారు. కోర్సులు పూర్తిచేసిన వారిలో నూటికినూరుశాతం ప్రాంగణంలోనే ఉద్యోగాలకు ఎంపికవుతున్నారని వివరించారు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, సామాజిక అంశాలే పాఠ్యాంశాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో టిస్ అతిపెద్ద సొంత ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనుందని.. ఇది పూర్తయితే కోర్సుల, పరిశోధనలు మరింత విస్తృతమవుతాయని వివరించారు. ఆమె 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో టిస్ కలసి పనిచేస్తున్న కార్యక్రమాలు?
రెండు రాష్ట్రాల్లో అనేక సామాజిక సమస్యల పరిష్కారం కోసం టిస్ కృషి చేస్తోంది. గ్రామీణాభివృద్ధిలోపాటు నగరాల్లో జీవన పరిస్థితులు, రకరకాల సామాజిక సమస్యలపై అధ్యయనం చేయడంతోపాటు పరిష్కారానికి ప్రభుత్వ సంస్థలకు చేదోడుగా నిలుస్తోంది. ప్రధానంగా తెలంగాణలో నిరుపేద ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణ సమ్మిళిత అభివృద్ధి ప్రాజెక్టు (తెలంగాణ పల్లె ప్రగతి) అమలుకు టిస్ తోడ్పాటును అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక సాధికారతకు ఆ ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం. మతాశిశు మరణాలు తగ్గించడం, సామాజిక సమానత్వం, విద్య, మహిళాసాధికారతకు టిస్ సహకరిస్తోంది.
హైదరాబాద్‌కి సంబంధించి టిస్ ఏయే కార్యక్రమాలు చేపడుతోంది?
మహానగర ప్రత్యేకతను చాటేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. సెంటర్ ఫర్ హైదరాబాద్ స్టడీస్ ద్వారా వీటిని అమలు చేస్తాం. హైదరాబాద్ ప్రత్యేక సంస్కృతిని కాపాడేందుకు కార్యక్రమాలు చేపడుతున్నాం. జీహెచ్ఎంసీతో కలసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలూ చేస్తున్నాం.
టిస్‌లో విద్యాబోధనకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?
పుస్తకాల్లోని అంశాలు చెప్పడంతో బాధ్యత తీరిపోదు. సమాజం పట్ల బాధ్యత కలిగిన విద్యావంతులను తయారు చేయడం మా లక్ష్యం. అందుకే పాఠ్యప్రణాళిక అనేక సామాజిక అంశాలతో ముడిపడి ఉంటుంది. తరగతి గదిలో చెప్పే అంశాలను సమాజంలో వాస్తవ పరిస్థితికి అన్వయించి సమస్యలకు పరిష్కారాలను కనుగొనేలా సిలబస్‌ను తీర్చిదిద్దాం. బడుగు, బలహీనవర్గాలు, నిర్లక్ష్యానికి గురైనవారి అభ్యున్నతి మా విద్యలో కీలకాంశం. మరోవైపు ఆయా వర్గాలకు సామాజిక ప్రయోజనాలు అందేలా చూసేందుకు టిస్ కృషి చేస్తోంది. ఇందులోభాగంగా హైదరాబాద్‌లో భిక్షాటకుల సమస్యలపై దృష్టి సారించాం. దీనిపై త్వరలోనే రాత్రివేళల్లో ప్రత్యేక సర్వే చేయనున్నాం.
టిస్‌లో ఎన్ని కోర్సులు ఉన్నాయి? వాటి ప్రత్యేకత ఏమిటి?
హైదరాబాద్ టిస్‌లో డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ ఇలా మొత్తం పది కోర్సులు నడుస్తున్నాయి. సామాజిక శాస్త్రాలతోపాటు గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలూ నేర్పుతారు. అయిదేళ్ల సమీకృత కోర్సు ఉంది. అయిదేళ్లు చదివితే డిగ్రీతోపాటు పీజీ పూర్తవుతుంది. మూడేళ్ల తర్వాత వద్దనుకుంటే డిగ్రీతో బయటకు రావచ్చు. అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారంతో ఎంఏ ఎడ్యుకేషన్ కోర్సు నిర్వహిస్తున్నాం. గ్రామీణాభివృద్ధి-పరిపాలన, అభివృద్ధి, ప్రజావిధానం-పాలన, మహిళలకు సంబంధించి ప్రత్యేక పీజీ కోర్సులు నిర్వహిస్తున్నాం. ఎంఫిఎల్, పీహెచ్‌డీ ఇంటిగ్రేటెడ్ కోర్సుగా నిర్వహిస్తున్నాం. ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలోషిప్‌కు (పీఎంఆర్‌డీఎఫ్) ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇస్తాం. ప్రతిష్ఠాత్మక 'లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌తో పాటు మరికొన్ని సంస్థలతో అవగాహన ఒప్పందం ఉంది. త్వరలో డిగ్రీలో చేరేందుకు ప్రకటన వెలువడనుంది.
రిజర్వేషన్లు, నియమనిబంధనలు ఏమిటి?
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ తోడ్పాటు ఉంది. టిస్ ప్రత్యేకమైన డీమ్డ్ వర్సిటీ. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా అమలవుతాయి. రిజర్వేషన్లు కూడా ఇతర విద్యాసంస్థల్లో మాదిరిగా అమలవుతున్నాయి. జాతీయస్థాయిలో విద్యార్థుల ఎంపిక ఉంటుంది. 60 శాతం సీట్లు రిజర్వ్‌డ్ కేటగిరిలో భర్తీ అవుతాయి.
కోర్సు పూర్తి చేసుకున్నవారికి ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి?
కోర్సు పూర్తి చేసుకున్నవారందరూ ప్రాంగణ ఎంపిక ద్వారానే ఉద్యోగాలు పొందుతున్నారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు వీరిని ఎంపిక చేసుకుంటున్నాయి. జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్, ఉపాధి హామీపథకం, పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ఉన్నత చదువులకు, సివిల్ సర్వీసెస్ రాయడానికి ఈ కోర్సులు బాగా ఉపయోగపడతాయి.
స్వాగతిస్తున్నాయ్‌...బీమా కొలువులు!
ఉద్యోగార్థులకు బీమా సంస్థలు సాదర ఆహ్వానం పలుకుతున్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారితో రూ.40,000 నెలజీతం వచ్చే ఇన్సూరెన్స్‌ ఏఓ/ఏఏఓ పోస్టులను; ఇంటర్‌ విద్యార్హత ఉన్నవారితో రూ.25,000 జీతం వచ్చే అసిస్టెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. అభ్యర్థులు వీటిపై దృష్టిసారించాలి... సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలి!
ప్రఖ్యాత బీమా సంస్థలైన ఎన్‌ఐసీఎల్‌ (నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌), ఎల్‌ఐసీ (లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా), ఏఐసీ (అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా)లు అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏఏఓ)/ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏఓ) పోస్టులనియామకం జరపనున్నాయి. ఎన్‌ఐసీఎల్‌ 1000 అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి కూడా ప్రకటన విడుదల చేసింది. ఏఏఓ/ ఏఓ పోస్టుల కోసం దేశవ్యాప్తంగా పరీక్షను నిర్వహించి పోస్టులను కూడా అదేవిధంగా భర్తీ చేయనున్నారు.
* అసిస్టెంట్‌ పోస్టుల కోసం నిర్వహించే పరీక్ష దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ రాత పరీక్ష, మౌఖిక పరీక్షలో అభ్యర్థులకు వచ్చే మార్కులను రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు వచ్చే మార్కుల మెరిట్‌ ఆధారంగా భర్తీ చేస్తారు. అంటే... ఏఏఓ/ ఏఓ పోస్టులకు దేశవ్యాప్తంగా పరీక్ష రాయబోయే అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది (అభ్యర్థుల కేటగిరీల వారీగా). అసిస్టెంట్‌ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాయబోయే అభ్యర్థుల మధ్య పోటీ (కేటగిరీల వారీగా) ఉంటుంది.
పోస్టుల వివరాలు
ఎన్‌ఐసీఎల్‌ (ఏఓ): 362, ఎల్‌ఐసీ (ఏఏఓ): 200, ఏఐసీ (ఏఓ): 38, ఎన్‌ఐసీఎల్‌ (అసిస్టెంట్‌) (ఆంధ్రప్రదేశ్‌): 35, ఎన్‌ఐసీఎల్‌ (అసిస్టెంట్‌) (తెలంగాణ): 30.
* రాతపరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో రాయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.

* ఎన్‌సీఐఎల్‌ పోస్టులకు
https://nationalinsuranceindia.nic.co.in
, ఎల్‌ఐసీ పోస్టులకు http://www.licindia.in/, ఏఐసీ పోస్టులకు http://www.aicofindia.com/ పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌ ద్వారా కట్టవచ్చు.
* ఏఏఓ/ ఏఓ పోస్టులకు: గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి.
* అసిస్టెంట్‌ పోస్టులకు: గాడ్యుయేషన్‌/ ఇంటర్మీడియట్‌ ఉండాలి. ఇతర వివరాలకు సంబంధిత వెబ్‌సైట్లను గమనించవచ్చు.
అభ్యర్థులు ఏం గమనించాలి?
* పరీక్షలన్నీ ఆన్‌లైన్‌ విధానంలో ఉన్నాయి కాబట్టి అవగాహన పెంచుకోవాలి.
గమనిక: www.eenadupratibha.net వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ మాక్‌ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.
* ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు 0.25 రుణాత్మక మార్కు ఉంది కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి.
* ఎన్‌ఐసీఎల్‌ (ఏఓ), ఎల్‌ఐసీ (ఏఏఓ) పోస్టుల్లో ప్రొబేషన్‌ పీరియడ్‌తోపాటు 4 సంవత్సరాల సర్వీస్‌ బాండ్‌, ఏఐసీ (ఏఓ) పోస్టులకు 2 సంవత్సరాల సర్వీస్‌ బాండ్‌ ఉంది. * ఎన్‌ఐసీఎల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఏ విధమైన బాండ్‌ లేదు.
* దరఖాస్తు పూర్తిచేసిన తరువాత పరీక్ష ఫీజు మొదలైన వివరాలున్న డాక్యుమెంట్లను ప్రింట్‌/ మెయిల్‌లో భద్రపరచుకోవడం మంచిది.
* ఏఓ/ ఏఏఓ పోస్టింగులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది. నియమిత కాల వ్యవధి తరువాత బదిలీ కావొచ్చు.
మౌఖిక పరీక్ష
రాతపరీక్షలో అర్హత మార్కులు సాధించినవారికి మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్ష 200 మార్కులకు జరిగినప్పటికీ వీటిని 35 మార్కులకు పరిగణిస్తారు. మౌఖిక పరీక్షలో అభ్యర్థుల మార్కులను 15 మార్కులకు పరిగణించి మొత్తం 50 మార్కుల మెరిట్‌ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు. రాతపరీక్ష తరువాత మౌఖిక పరీక్షతోపాటు 'కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష' కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్షలో మార్కులు ఉండవు. ఇది కేవలం అర్హత పరీక్ష.
* ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు 0.25 రుణాత్మక మార్కులున్నాయి.
* ఎన్‌ఐసీఎల్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామకాలు రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ నుంచి దరఖాస్తు చేసిన అభ్యర్థుల నుంచి వారికి కేటాయించిన 35 పోస్టులూ, తెలంగాణ అభ్యర్థుల నుంచి వారికి కేటాయించిన 30 పోస్టులూ భర్తీ చేస్తారు.
* మౌఖిక పరీక్షలో అభ్యర్థులు రాష్ట్ర భాష (తెలుగు)పై పట్టును నిరూపించుకోవాల్సి ఉంటుంది.
* సరైన ప్రణాళిక, మంచి మెటీరియల్‌ సేకరించడం, వీలైనన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మాక్‌ పరీక్షలను రాయడం చాలా అవసరం. అప్పుడే మంచి ఫలితాలను సాధించి ఉద్యోగ జీవితంలో ప్రవేశించటం సాధ్యమవుతుంది.
ఎన్‌ఐసీఎల్‌ (ఏఓ): నియామకాల ప్రక్రియ రెండు అంచెలుగా ఉంటుంది. మొదట అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రాతపరీక్ష రాయాల్సివుంటుంది. రాతపరీక్షలో కనీస అర్హత మార్కు సాధిస్తే మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్ష - ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు 160, డిస్క్రిప్టివ్‌ ఇంగ్లిష్‌ 3 ప్రశ్నలకు 40 మార్కులు - మొత్తంగా 200 మార్కులకు జరుగుతుంది. రాత, మౌఖిక పరీక్షల్లో వచ్చిన మార్కులను 80 : 20 నిష్పత్తిలో తీసుకుంటారు.
* జనరలిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసినవారికి రాతపరీక్షలో 4 సెక్షన్లలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఉంటాయి.
* స్పెషలిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసినవారికి 5 సెక్షన్లలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు 160 మార్కులు. ఈ ప్రశ్నలను 2 గంటల సమయంలో పూర్తిచేయాలి. డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలకు 40 మార్కులు. ఈ 3 ప్రశ్నలను 45 నిమిషాల్లో పూర్తిచేయాలి. ప్రశ్నలను ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకుని సమాధానాన్ని కీ బోర్డుపై టైప్‌ చేయాలి.

ఎల్‌ఐసీ (ఏఏఓ): నియామకాలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటగా ఆన్‌లైన్‌లో రాత పరీక్ష, రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించినవారికి మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు.
* ఆన్‌లైన్‌ రాతపరీక్షలో 160 ప్రశ్నలను 2 గంటల వ్యవధిలో పూర్తిచేయాలి. రాత పరీక్షలో మొత్తం 300 మార్కులుంటాయి.

ఏఐసీ (ఏఓ): నియామకాలు 2 దశల్లో జరుగుతున్నాయి. మొదటగా ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలుంటాయి. రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించినవారికి మౌఖి కపరీక్ష నిర్వహిస్తారు. దీనిలో కూడా కనీస అర్హత మార్కులు సాధించినవారిని మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

మొబైల్ యాప్‌పై యువతకు శిక్షణ
* పది వేలమంది యువ ఇంజినీర్ల తయారీకి ప్రభుత్వ వ్యూహం
* మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీల శిక్షకుల సహకారం
* రాష్ట్రవ్యాప్తంగా 17 శిక్షణ కేంద్రాలు
* 19న విజయవాడలో ప్రారంభం
ఈనాడు, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని యువ ఇంజనీర్లను మొబైల్‌యాప్‌ల సాంకేతిక పరిజ్ఞానంలో మేటిగా తయారుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. యాప్‌లు అభివృద్ధి చేసే స్థాయికి వారిని తీర్చిదిద్ది ప్రభుత్వ పాలన, సమాజానికి ఉపయోగపడే యాప్‌లను రూపొందింపజేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కొన్ని వందలు, వేలమంది యువ ఇంజనీర్లను ఈ దిశగా తయారుచేయగలిగితే ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడడంతో పాటు దేశం మొత్తానికి ఇలాంటి యాప్‌లను అందించే స్థాయికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. అందుకే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 17 మొబైల్ యాప్ అభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాకు ఒక యాప్ డెవలప్‌మెంట్ సెంటర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 17 శిక్షణ కేంద్రాల్లో కలిపి తొలి విడతలో 600-700 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి మొబైల్ యాప్‌ల తయారీలో శిక్షణ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్, ఇతర పెద్ద కంపెనీల శిక్షకుల సేవలను కూడా ఉపయోగించుకోనున్నారు. పేరొందిన శిక్షకులతో నేరుగా తరగతులు నిర్వహించడం, మరోపక్క ఆన్‌లైన్ ద్వారా బోధించడం ఈ కోర్సులో భాగంగా ఉండనున్నాయి. వాస్తవానికి పెద్ద కంపెనీలు కూడా ఒకేసారి వందలమందికి ఇలా యాప్‌ల అభివృద్ధిలో శిక్షణ ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మార్గదర్శిగా ఉండాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన సిలబస్‌ను రూపొందించే బాధ్యతను రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి సంస్థకు అప్పగించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే కేంద్రాల్లో తొలి విడత శిక్షణ పూర్తయ్యాక మరికొన్ని బృందాలకూ శిక్షణ ఇవ్వనున్నారు. ఇలా సుమారు పదివేల మంది యువ ఇంజనీర్లను తీర్చిదిద్ది వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.
ప్రభుత్వం, సామాజిక అవసరాల యాప్‌ల అభివృద్ధి
శిక్షణ పొందిన యువ ఇంజనీర్లు విద్య, వైద్యం, సేవల కల్పన తదితర అంశాల్లో ఇటు ప్రభుత్వానికి, అటు ప్రైవేటు కంపెనీలు, సామాజిక అవసరాలకు ఉపయోగపడేలా యాప్‌లను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నట్లు సమాచారం. ఈ యాప్‌ల ద్వారా యువ ఇంజనీర్లు ఆర్థికంగా ఎదగడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు జనవరి 19న విజయవాడ సిద్దార్థ కళాశాలలో ఈ యాప్ అభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. మిగతా జిల్లాల్లోనూ అదేరోజునుంచి ఈ కేంద్రాలు ప్రారంభమవుతాయి.
ఉద్యోగాల భర్తీలో జోనల్ పద్ధతి కొనసాగేనా?
* స్పష్టతపై తెలంగాణ సర్కారు కసరత్తు
* తర్వాతే టీఎస్‌పీఎస్సీకి ఉద్యోగ ప్రకటనల ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీస్సీ) ఉద్యోగ పరీక్షల విధానంపై కసరత్తు చేస్తుంటే సంబంధిత ప్రకటనలకు సై అనేముందు సాంకేతిక అంశాలపై స్పష్టత ఇచ్చే దిశగా తెలంగాణ సర్కారు యోచిస్తోంది. వీటిలో కీలకమైంది జోనల్ పద్ధతి. ఈ పద్ధతిని కొనసాగిస్తారా? రద్దు లేక మార్పులు చేస్తారా? అనేది తేలాల్సివుంది. కమల్‌నాథన్ కమిటీ ద్వారా ఉద్యోగుల విభజన పూర్తయితే తప్ప రాష్ట్రస్థాయి ఉద్యోగ ఖాళీలపై స్పష్టత రాదు. ఆ కమిటీ పని ముగిసేదాకా గ్రూప్-1 పోస్టుల్ని ముట్టుకునే అవకాశాలు చాలా తక్కువ. మిగిలిన జోనల్, జిల్లాస్థాయి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయాలంటే మాత్రం ప్రస్తుత జోనల్ విధానంపై స్పష్టతనివ్వడం తప్పనిసరి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో 371(డి) అధికరణం ఆధారంగా 1975లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఉద్యోగాల భర్తీలో స్థానిక రిజర్వేషన్ల పద్ధతి అమల్లోకి వచ్చింది. వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యత కోసం దీన్ని ప్రవేశపెట్టారు.
ఇప్పుడు రాష్ట్రం విడిపోయినా రెండు రాష్ట్రాల్లోనూ 371 (డి) అధికరణం కొనసాగుతుందని రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం చెబుతోంది. దీని ప్రకారం స్థానిక రిజర్వేషన్లు అనివార్యం. ఏ పోస్టుల వరకు వాటిని ఉంచాలి? వేటికి ఎత్తివేయాలనే వెసులుబాటు ప్రభుత్వాలకు ఉంటుందని అంటున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం తమ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ(డీఎస్సీ)ని 13 జిల్లాలకే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ స్థానిక రిజర్వేషన్ల పద్ధతిని తేల్చాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో జోనల్ పద్ధతి ప్రకారం తెలంగాణలోని పది జిల్లాలు రెండు జోన్ల పరిధిలో ఉన్నాయి. జోనల్, జిల్లాస్థాయి ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. పాత పద్ధతి ప్రకారమైతే... జోనల్‌స్థాయి పోస్టుల విషయంలో హైదరాబాద్‌లో ఉద్యోగాలకు కరీంనగర్ జిల్లావారు అర్హులు (స్థానిక కోటాలో) కారు. ఆ పద్ధతినే కొనసాగిస్తే న్యాయస్థానాల్లో సమస్యలు రావొచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. జోనల్ పద్ధతిని రద్దుచేస్తే జిల్లాస్థాయి పోస్టులు తప్పిస్తే మిగతావన్నీ రాష్ట్రస్థాయివిగా మారి ఓపెన్ కోటాలోకి వస్తాయి. పదిజిల్లాల్లోని ఎవ్వరైనా పోటీపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో రెండు (5, 6) జోన్లున్నాయి. అయిదో జోన్‌లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు; ఆరో జోన్‌లో హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాలున్నాయి.
న్యాయ సలహా దిశగా యోచన..
రాష్ట్రపతి ఉత్తర్వుల్ని మార్చుకునే ప్రక్రియపై ప్రభుత్వం న్యాయసలహా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ''దీంతోపాటు తెలంగాణ, ఆంధ్ర మధ్యలో; తెలంగాణ జిల్లాల మధ్యలో కూడా ఒక స్థాయిలో సమస్య ఉంది. తెలంగాణను మొత్తం ఒకే జోన్ కింద పరిగణిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు. రాష్ట్రపతి ఉత్తర్వుల్ని మార్చుకోవడంపై ఉన్న అన్ని అవకాశాల గురించి ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ''పాత పద్ధతినే కొనసాగించాలన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా అవకాశం ఉంది. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించాలి. వారు పరిశీలించి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. ఆయన సంతకం చేస్తే సరిపోతుంది అని మరో ఉన్నతాధికారి పేర్కొన్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగ భర్తీ ఇలా...
నియామకాలకు మేమూ ఆత్రంగా ఉన్నాం
* అయితే కొన్ని ఆటంకాలున్నాయ్‌.. అధిగమిస్తాం
* హరగోపాల్‌ కమిటీతో ప్రధాన కార్యదర్శి
* పీఎస్సీకి వచ్చిన రాజీవ్‌శర్మ, నర్సింగ్‌రావు, పాపారావు
ఈనాడు - హైదరాబాద్‌: ఉద్యోగ పరీక్షల విధానంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) త్వరలోనే అన్ని శాఖాధిపతులతో సమావేశం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ సమావేశానికి అన్ని శాఖల అధిపతులు తమ తమ శాఖల్లోని ఖాళీలు, భర్తీకి ఆర్థికవిభాగం ఆమోదించిన వివరాలతో రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సలహాదారు పాపారావు, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగరావు జనవరి 9న టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి రావటం విశేషం. ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి, ఇతర సభ్యులు విఠల్‌, చంద్రావతిలతో మాట్లాడటంతో పాటు... టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు చేసిన ఆచార్య హరగోపాల్‌ సారథ్యంలోని నిపుణుల కమిటీ ఆరంభ సమావేశంలో కూడా వీరు కొద్దిసేపు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య హరగోపాల్‌.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగుల ఆశల్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, తొందరగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ స్పందిస్తూ... ''ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. నియామకాలు చేయాలని ఆత్రంగా ఉంది. కాకుంటే కొన్ని ప్రతిబంధకాలున్నాయి. వాటిని అధిగమిస్తాం. కమలనాథన్‌ కమిటీ విభజన ముగిస్తే పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది. ఉద్యోగాల ప్రకటనలకు ఆదేశాలిస్తాం. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు కావటం, ఇలాంటి నిపుణులతో కమిటీ వేయటం మరో మంచి పరిణామం. మీపై గురుతర బాధ్యతుంది'' అని అన్నట్లు తెలిసింది. పీఎస్సీ స్వయం ప్రతిపత్తిలో ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోదని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగరావు హామీ ఇచ్చారు. తెలంగాణ భవిష్యత్తును రూపొందించే దిశగా ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా ఉత్తమమైన విధానాన్ని సూచించాలని సలహాదారు పాపారావు కోరారు.
హరగోపాల్‌ కమిటీ మలి భేటీ 17న
అనంతరం హరగోపాల్‌ కమిటీ ప్రస్తుత పరీక్షల విధివిధానాలపై చర్చించింది. ఇప్పటిదాకా వివిధ పరీక్షలకు అనుసరిస్తున్న ప్రణాళిక, విధానాలు, పాఠ్యాంశాలను కమిటీకి పుస్తకరూపంలో టీఎస్‌పీఎస్సీ అందజేసింది. సాయంత్రం వరకూ కమిటీ సమాలోచనలు జరిపింది. మళ్ళీ జనవరి 17న సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే కమిటీని రెండు కార్యనిర్వాహక బృందాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఒక బృందానికి (గ్రూప్‌ ఉద్యోగాలు) ఆచార్య కోదండరాం, మరో బృందానికి (నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగాలకు) ఆచార్య లింగమూర్తి కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. జనవరి 30లోపు కమిటీ ఉద్యోగ పరీక్షల కొత్త విధానాలపై తన నివేదికను సమర్పిస్తుంది. ఆ తర్వాత సిలబస్‌ మార్పులు చేర్పులపై కసరత్తు ఆరంభమవుతుంది. కాగా... టీఎస్‌పీఎస్సీకి కేటాయించిన ఏపీపీఎస్సీలోని తెలంగాణ ఉద్యోగులు వచ్చి ఛైర్మన్‌, సభ్యులతో సమావేశమయ్యారు. కేటాయించిన పోస్టులకంటే (26) ఎక్కువమంది (31) ఉపవిభాగాధిపతులు ఏపీపీఎస్సీ వైపు నుంచి వచ్చినందున పోస్టుల సంఖ్య పెంచాలని, అలాగే కొత్త పోస్టుల్లో చేరే తేదీ విషయంలో కూడా మార్పు అవసరమని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నట్లు తెలిసింది.
వైద్యవిద్యలో 'ఈ-తరగతులు'
* ప్రతి కళాశాలలోనూ కేంద్ర 'ఈ-గ్రంథాలయం'
* ఆధునిక సాంకేతికత సాయంతో బోధన
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయంగా చికిత్స విధానాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా వైద్యవిద్యారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనే అంశంపై ఇటీవల జరిగిన వైద్యనిపుణుల సలహామండలి సమావేశంలో చర్చించారు. గతంలో వైద్య కళాశాలల్లో అధ్యాపకులుగా ఉన్నవారిలో ఎక్కువమంది ఆయా రంగాల్లో పూర్తిస్థాయి నైపుణ్యం కలిగి ఉండేవారు. ప్రస్తుతం వైద్య కళాశాలల్లో అనుభవజ్ఞులైన ఆచార్యుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కారణంగా ఎంబీబీయస్, ఎండీ, ఎంఎస్ కోర్సులు పూర్తిచేసిన వారు ఆశించినస్థాయిలో నైపుణ్యం సాధించలేకపోతున్నారు. దీనివల్ల ఒక్కోసారి రోగ నిర్ధారణలో కచ్చితత్వం లోపిస్తోంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకూ సరైన వైద్యం అందించలేకపోతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి వైద్య విద్యావిధానంలోనే మార్పు తేవాలని సంకల్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో 'ఈ-తరగతులు' నిర్వహించే పద్ధతి తేవాలని నిపుణుల సలహా మండలి సూచించింది. దీనివల్ల దేశ, విదేశాల్లోని ప్రముఖ వైద్యనిపుణులతో ప్రత్యక్ష ప్రసార విధానాలతో వివిధ అంశాలపై తరగతులు నిర్వహించడానికి వీలవుతుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఈ తరహా విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలోనూ అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వైద్యవిద్యాశాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. మొదటి దశలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు.. 'ఈ- తరగతుల' విధానాన్ని దశలవారీగా వైద్య కోర్సుల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఇంటర్నల్ మెడిసిన్, నియోనాటాలజీ తదితర సూపర్‌స్పెషాలిటీ, స్పెషాలిటీ కోర్సుల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయి నిపుణులతో బోధనా తరగతులు నిర్వహించడానికి వీలుగా వైద్య కళాశాలలన్నింటిలోనూ బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ-తరగతుల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలపై త్వరలోనే కార్యచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిసింది.
కేంద్ర విశ్వవిద్యాలయాల తరహాలో..
వైద్యకోర్సులు చదివే వారు ఆయా రంగాల్లో విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలు చాలా అవసరం. ఇటీవల కాలంలో ప్రతిదీ అంతర్జాలంతో ముడిపడి ఉన్నందున 'ఈ- గ్రంథాలయాల'ను అభివృద్ధి చేయాలని నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల వైద్యరంగంలో కొత్త అంశాలపై వెలువడే పరిశోధన పత్రికలు, పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నందున, గ్రంథాలయాల్లో సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంచేయనున్నట్లు సమాచారం. కేంద్ర విశ్వవిద్యాలయాల తరహాలో వైద్యకళాశాలల్లో ఏర్పాటుచేసే ఈ-గ్రంథాలయాలను 24 గంటలూ వినియోగించుకునేందుకు వీలుగా సదుపాయాలు కల్పించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి వైద్యకళాశాలల్లో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమాలు
భారతప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ & మేనేజ్‌మెంట్‌ (కోయంబత్తూర్‌) రెండేళ్ళ వ్యవధి ఉన్న మూడు ఫుల్‌టైం పీజీ ప్రోగ్రాములను అందిస్తోంది. వీటి ప్రవేశ ప్రకటనను సంస్థ విడుదల చేసింది.
1. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌- టెక్స్‌టైల్స్‌
2. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌- అపారెల్‌
3. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌- రిటైల్‌

ఈ కోర్సులు ఏఐసీటీఈ ఆమోదం పొందాయి. ఈ కోర్సులను అనుభవజ్ఞులైన విద్యావేత్తలు, టెక్స్‌టైల్‌ రంగంలో విజయాలు సాధించిన పారిశ్రామికవేత్తలు రూపొందించారు. భారత్‌లోని టెక్స్‌టైల్‌, అపారెల్‌ పరిశ్రమలకు సుశిక్షితులైన, సమర్థులైన మానవవనరులను అందించడమే ఈ ప్రోగ్రాముల లక్ష్యం. పరిశ్రమల అంచనాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలనే లక్ష్యంతో టెక్స్‌టైల్‌ మంత్రిత్వశాఖ మంచి ప్రాథమిక సదుపాయాలు, అర్హులైన అధ్యాపక బృందం, వివిధ పరిశ్రమలు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఎంఓయూ సౌకర్యాలను సంస్థ కల్పిస్తోంది.
ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ సౌకర్యాన్నీ కల్పిస్తోంది. SVP - MAT స్కాలర్‌షిప్‌ రూ.40,000 వరకూ ఉంటుంది. 2015- 16 సంవత్సరానికిగానూ SVPISTMలో ప్రవేశం కోరుకునే అర్హులైనవారు మొదటి సంవత్సరం రూ.40,000 వరకూ ఉపకారవేతనం పొందే అవకాశముంది. ఇది ప్రవేశ పరీక్ష అయిన SVP-MATలో సాధించిన మొత్తం స్కోర్లపై ఆధారపడి ఉంటుంది. మొదటి సంవత్సరం ప్రతిభావంతులైన 50% విద్యార్థులు ఉపకారవేతనం పొందే అవకాశముంది. రెండో సంవత్సరం రూ.40,000 వరకు ఉపకార వేతనం ప్రథమ సంవత్సరంలోని విద్యాపరమైన, హాజరు రికార్డుల ఆధారంగా కేటాయిస్తారు.
దరఖాస్తు ఇలా: దరఖాస్తు పత్రాన్ని విద్యాసంస్థ వెబ్‌సైట్‌ www.svpistm.ac.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు (జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులకు: రూ. 1000, ఎస్‌సీ/ఎస్‌టీ/పీహెచ్‌ అభ్యర్థులకు: రూ.500)ను డైరెక్టర్‌, SVPISTM, కోయంబత్తూరు పేరుమీద డీడీ తీయాలి. ఆన్‌లైన్‌లో కూడా కట్టవచ్చు. SVPISTM అడ్మిషన్‌ ఆఫీసులో నేరుగానూ చెల్లించవచ్చు. వివరాలు నమోదు చేసిన ఫారాన్ని అడిగిన పత్రాలకు జతచేసి విద్యాసంస్థకు పంపాల్సి ఉంటుంది.
చిరునామా: డైరెక్టర్‌, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, పోస్ట్‌బాక్స్‌ నెం: 1483, అవనాషి రోడ్‌, పీలమేడు, కోయంబత్తూర్‌- 641004 ఈ-మెయిల్‌:admission@svpitm.ac.in
ముఖ్యమైన తేదీలు: పూర్తిచేసిన దరఖాస్తు హార్డ్‌కాపీని పంపడానికి చివరి తేదీ: 20.1.2015, SVP-MAT (ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌) తేదీలు: 14 ఫిబ్రవరి- 22 ఫిబ్రవరి, 2015. బృందచర్చ, వ్యక్తిగత మౌఖికపరీక్ష వివరాలు తరువాత ప్రకటిస్తారు.
ఆస్కీలో పీజీడీహెచ్ఎం ప్రవేశాలు
ఈనాడు, హైదరాబాద్: అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఆధ్వర్యంలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు నిర్వహిస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఉన్న ఈ కోర్సు పాఠ్య ప్రణాళికను నిమ్స్ మాజీ డైరెక్టర్ ఆచార్య కాకర్ల సుబ్బారావు సారథ్యంలోని బోర్డు రూపొందించింది. ఈ కోర్సు పూర్తికాగానే... ఆస్పత్రుల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నట్లు ఆస్కిలో హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ కేంద్రం సంచాలకులు డాక్టర్ సుబోధ్ కందముత్తన్ తెలిపారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సును రూపొందించామని ఆస్కి డీన్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. వివిధ మేనేజ్‌మెంట్ అర్హత పరీక్షల్లో స్కోర్ పొందిన ఏ పట్టభద్రులైనా ఈ కోర్సు చేయడానికి అర్హులు. ఇతర వివరాలకు http://ascipgdhm.org/ వెబ్‌సైట్ చూడవచ్చు.
'సెట్‌' మళ్లీ వాయిదా!
* ఫిబ్రవరి 15కు వాయిదా
* 'సెట్‌' సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్‌: ఫిబ్రవరి 1న జరగాల్సిన 'సెట్‌' పరీక్ష మళ్లీ వాయిదా పడింది. గేట్‌ పరీక్ష కారణంగా సెట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది. ఈ మేరకు 'సెట్‌' సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ బి. రాజేశ్వర్‌రెడ్డి జనవరి 7న ఓ ప్రకటన విడుదల చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 1న గేట్, డీఆర్‌డీఓ పరీక్షలున్నందున అన్నింటిని ఒకే రోజు నిర్వహించడం వల్ల విద్యార్థులు నష్టపోతారని భావించి సెట్‌ను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడాలని ఆయన సూచించారు. సెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ పేర్లను, పుట్టిన తేదీ , ఇతర వివరాలను 'సెట్' వెబ్‌సైట్‌కు వెళ్లి ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని సెట్ కార్యాలయానికి చెప్పాలని ఆయన అన్నారు. మిగిలిన వివరాలకు 040-2709 7733 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
http://www.settsap.org/
సంక్రాంతి తర్వాతే ప్రథమ 'డీఎడ్' పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో డీఎడ్ ప్రథమ సంవత్సర పరీక్షలు (2013-15) సంక్రాంతి తర్వాత జరుగనున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం ఇవి డిసెంబరు 29నే మొదలవ్వాలి. అయితే సుమారు 200 డీఎడ్ కళాశాలల యాజమాన్యాలు 'స్పాట్ అడ్మిషన్ల నిబంధనలు ఉల్లంఘించి 800 మంది విద్యార్థులను అదనంగా చేర్చుకోవడంతో వారికి విద్యాశాఖ హాల్‌టికెట్లను జారీ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. యాజమాన్యాలు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చాయి. విద్యార్థులూ కోర్టును ఆశ్రయించి సానుకూల ఉత్తర్వులు పొందారు. వీరికి వెంటనే హాల్‌టికెట్లను మంజూరు చేయలేని పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామాలవల్ల తొలుత నిర్ణయించినట్లుగా పరీక్షలు నిర్వహించడం కష్టం కావడంతో వాయిదా వేశారు. సంక్రాంతి తర్వాత వీటిని ప్రారంభించాలని విద్యాశాఖలోని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. అప్పటికి విద్యార్థుల హాల్‌టికెట్ల జారీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాయి.
ఎం'సెట్‌' కాలేదు
ఈనాడు-దిల్లీ, హైదరాబాద్‌: ఉమ్మడి ఎంసెట్‌ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖల మంత్రులు ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నారు. జనవరి 6న నిర్వహించిన విద్యా మంత్రుల సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిని గంటా శ్రీనివాసరావు కలిసి ఎంసెట్‌ అంశంపై చర్చించారు. ఎంసెట్‌ నిర్వహణ గురించి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అది షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని, వారు పరీక్షకు సన్నద్ధం కావాలని గంటా విలేకర్లతో మాట్లాడుతూ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టాన్ని గౌరవించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు. ఎంసెట్‌ను సంయుక్తంగా నిర్వహించాలా, వేర్వేరుగానా అన్నది తర్వాత నిర్ణయమవుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ అనవసర వివాదం సృష్టిస్తోందని ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకుని విద్యార్థుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఎంసెట్‌ను తాము నిర్వహించుకోవచ్చని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లినా తమకేమీ అభ్యంతరం లేదని అన్నారు. ఎంసెట్‌ వివాదాన్ని కేంద్రం దృష్టికి తెచ్చినందున స్పందన వచ్చేంత వరకు తదుపరి చర్యలపై సంయమనం పాటించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం నుంచి తిరుగు సమాచారం వచ్చే వరకు, ముఖ్యంగా న్యాయస్థానాన్ని సంప్రదించే విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హక్కుల సాధన కోసమే కేంద్రంతో సంప్రదిస్తున్నామని మంత్రి గంటా పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే హైకోర్టులో పిటిషన్‌ వేసేందుకు వీలుగా ఏపీ ఉన్నత విద్యాశాఖ సిద్ధమైంది.
నేటి నుంచి డైట్‌సెట్ కౌన్సెలింగ్
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డీఎడ్ తొలివిడత కౌన్సెలింగ్ బుధవారం నుంచి ఈ నెల 10 వరకు జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 465, తెలంగాణలో 98 కళాశాలల్లో ప్రవేశాలు తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా జరగనున్నాయి. వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభ సమయానికి తెలంగాణలో కళాశాలల సంఖ్య మరో 30 వరకు పెరగనుందని తెలిసింది. ఆంధ్రపద్రేశ్‌లో అన్ని కళాశాలల్లో ప్రవేశాలు జరగనున్నాయి. తెలంగాణలో మాత్రం తొలివిడత కౌన్సెలింగ్‌కు అనేక కళాశాలలు దూరమయ్యాయి. దీనివల్ల ప్రవేశాలపై విద్యార్థుల అంచనాలు, ప్రణాళికలు దెబ్బతిననున్నాయి. ప్రవేశాలు జరగబోయే కళాశాలల వివరాలను అధికారులు వెబ్‌సైట్‌లో పెట్టారు. వెబ్ఆప్షన్ల నమోదుపై ఎలాంటి నియంత్రణా లేదని డైట్ సెట్ కన్వీనర్ ఆర్.సురేంద్రరెడ్డి తెలిపారు. విద్యార్థులు సాధ్యమైనంత మేర ఎక్కువగా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని, లేకుంటే నష్టపోయే ఆస్కారముందని హెచ్చరించారు. సీట్ల కేటాయింపు సమాచారం విద్యార్థుల సెల్‌ఫోన్ నంబర్లకు సంక్షిప్త సందేశంగా రానుంది. వీరికి ధ్రవపత్రాల పరిశీలన ఈ నెల 16న ఉంటుంది. మిగులు సీట్లకు మలివిడత కౌన్సెలింగ్ ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు జరుగుతుంది.
వృత్తివిద్య నైపుణ్య, జీవనోపాధి కేంద్రాలపై కసరత్తు
* యూజీసీ నిర్ణయం
* అన్ని విశ్వవిద్యాలయాలకు మార్గదర్శకాలు జారీ
ఈనాడు, హైదరాబాద్‌: వృత్తివిద్యకు మరింత ప్రోత్సాహమిచ్చేలా పన్నెండో ప్రణాళికలో భాగంగా 100 విజ్ఞానార్జిత, మానవ నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి (దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ కౌసల్య) కేంద్రాలను ఆరంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు మార్గదర్శకాలు పంపింది. రాబోయే కాలంలో వివిధ స్థాయుల్లో పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దటం లక్ష్యంగా ఈ కేంద్రాల్లో స్వల్పకాలిక సర్టిఫికెట్‌ కోర్సుల నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకూ వృత్తి విద్యా కోర్సుల్ని అందించాలని నిర్ణయించారు. డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, బీవోక్‌ (బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ వొకేషన్‌)తోపాటు ఇంకా పైస్థాయి కోర్సుల్ని కూడా ఆరంభిస్తారు. వివిధ స్థాయుల్లో చేరేలా, అవసరమైతే మధ్యలో వదిలేసి సాధారణ విద్యలోకి మళ్లేలా వీటిని రూపొందిస్తారు. తమ అనుబంధ విశ్వవిద్యాలయాలకు ఈ కోర్సులకు యూజీసీ సాయం చేస్తుంది. న్యాక్‌, ఎన్‌బీఏ గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలకు ఎలాంటి ఆర్థిక సాయం లేకుండా అనుమతిస్తారు. ఇప్పటికే వృత్తివిద్య కోర్సులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ కళాశాలల్లోనూ వీటిని ఆరంభించవచ్చు. యూజీసీ నుంచి వచ్చిన ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. తెలంగాణలో వృత్తివిద్యకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో త్వరలో రాష్ట్రం తరఫున ప్రతిపాదనలు పంపిస్తామన్నారు.
కేంద్ర విద్యా సంస్కరణలు భేష్
* తెలంగాణలో అమలుకు కసరత్తు
* మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి
* 6న ఢిల్లీలో విద్యామంత్రుల భేటీ
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొన్ని విద్యా సంస్కరణలకు తెలంగాణ సర్కారు ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచి వృత్తి విద్య, విస్తృత స్థాయిలో పాఠ్యాంశాలను ఎంచుకోవడానికి విద్యార్థులకు వీలు కల్పించే ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)లను ప్రవేశపెట్టడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. జనవరి 6న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగే అన్ని రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ''ప్రస్తుత చదువులు విద్యార్థుల్ని పూర్తిగా పుస్తకాల పురుగుల్లా మారుస్తున్నాయి. నూటికి నూరు మార్కులొచ్చినా ప్రపంచజ్ఞానం ఉండటం లేదు. ఆ అంతరాన్ని పూడ్చేలా విద్యావిధానంలో మార్పులు రావాలి. కేంద్రం ప్రస్తుతం ఆలోచిస్తున్న కొన్ని సంస్కరణలు బాగానే ఉన్నాయి. వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా సీబీసీఎస్ పద్ధతి బాగుందనిపిస్తోంది. సాధారణ విద్యను అభ్యసించేవారు సాంకేతిక విద్యను, సాంకేతిక విద్యలోంచి సాధారణ విద్యలోకి బదిలీ కావడానికి వీలు కల్పించే పద్ధతులను స్వాగతిస్తున్నాం. అయితే వీటిలో ప్రవేశానికి బ్రిడ్జ్ కోర్సుల్ని పూర్తి చేయాల్సి రావొచ్చు. విధివిధానాలను త్వరలో వెల్లడిస్తాం అని జగదీశ్‌రెడ్డి వివరించారు.
ఇంటర్ బోర్డుకు కొత్త ముద్ర
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కొత్త లోగోను జగదీశ్‌రెడ్డి జనవరి 5న ఆవిష్కరించారు. కాకతీయ తోరణం, బతుకమ్మ పేరిక, నిరంతర అధ్యయనాన్ని సూచించే తెరచిన పుస్తకం, విద్యార్థి జ్ఞానార్జనను ప్రతిబింబించే ఉషోదయాలతో కూడిన ఈ ముద్రలో వినయంతోనే విద్య శోభిస్తుందనే అర్థంలో విద్యా వినయేన శోభతే అనే నినాదాన్ని ఉంచారు.
కోల్‌ ఇండియాలో 800 ఉద్యోగాలు
* వచ్చే రెండు నెలల్లో అధికారుల నియామకాలు
దిల్లీ: రాబోయే ఐదేళ్ళలో ఉత్పత్తిని రెండింతలకు పెంచుకోవాలని భావిస్తోన్న కోల్‌ ఇండియా.. ఆ దిశగా వ్యూహ రచన చేస్తోంది. వచ్చే రెండు నెలల్లో దాదాపు 800 మంది అధికారులను (ఎగ్జిక్యూటివ్‌లు) నియమించుకోనుంది. దీర్ఘకాలిక నియామక ప్రణాళికలో భాగంగానే నియామకాలపై సంస్థ కసరత్తు చేస్తోందని ఓ అధికారి వెల్లడించారు. మానవ వనరులు, ఆర్థిక, మార్కెటింగ్‌, విక్రయాలు తదితర విభాగాల్లో వీరు నియమితులవుతారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కోల్‌ ఇండియాలో 3 లక్షల మందికి పైగానే పనిచేస్తున్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో ఖాళీల భర్తీ
* బోధనాస్పత్రుల్లో 280 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఈనాడు, హైదరాబాద్: ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విధాన పరిషత్, వైద్యవిద్యా శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఈసారి కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుకు అవసరమైన ఎంబీబీఎస్ వైద్యులందరినీ ప్రజారోగ్యశాఖ భర్తీ చేయనుంది. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో దాదాపు 846 మంది వైద్యులతో పాటు 2107 నర్సింగ్ పోస్టుల భర్తీకి త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీలో పూర్తి పారదర్శకత ఉండేలా ఆన్‌లైన్ విధానం అనుసరించనున్నట్లు సమాచారం. భర్తీలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద ఉద్యోగులుగా పనిచేసిన వారికి ప్రాధాన్యమివ్వనున్నారు.
వైద్యవిద్యా శాఖ పరిధిలోని మొత్తం 12 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ విధానంలో దాదాపు 190 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. వీటితో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను కలిపి మొత్తం 280 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మరో పది రోజుల్లో ప్రభుత్వ ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న దాదాపు 566 ఎంబీబీఎస్ వైద్యుల పోస్టుల భర్తీకి జనవరి నెలాఖరులో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 2107 నర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి కూడా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఎంసెట్‌పై గవర్నర్‌ త్రి సూత్రం
* మూడో దానికే తెలంగాణ, తొలి రెండింట్లో ఏదైనా సరేనన్న ఆంధ్ర
* నరసింహన్‌ సమక్షంలో విద్యామంత్రుల భేటీ
* ఎటూ తేలకుండానే ముగిసిన సమావేశం
ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ సహా ఇతర వృత్తివిద్యా ప్రవేశ పరీక్షలపై పరస్పర నిందలు, ప్రతిస్పందనలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వేడెక్కుతున్న వాతావరణాన్ని తేలికపర్చేందుకు గవర్నర్‌ నరసింహన్‌ రంగంలోకి దిగారు. జనవరి 3న ఆయన రెండు రాష్ట్రాల విద్యామంత్రుల్ని పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా సమస్య సామరస్యపూర్వక పరిష్కారానికి వీలుగా వారి ముందు మూడు మార్గాల్ని ప్రతిపాదించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం గవర్నర్‌ ప్రతిపాదనలిలా ఉన్నాయి.
1. ఏడాదికొకరు చొప్పున పరీక్షల్ని నిర్వహించటం
2. ఏడాది తెలంగాణ నిర్వహించటం; వచ్చేసారి ఆంధ్ర, మూడోసారి కేంద్రం ఎలా చెబితే అలా
3. ఈసారి తెలంగాణ నిర్వహించటం; వచ్చేసారి కేంద్రం ఎలా చెబితే అలా...
గవర్నర్‌ సూచించిన ఈ మూడింటిలో చివరి దానికి తెలంగాణ ఆమోదం తెలపగా; తొలి రెండింటికి ఆంధ్ర సరే అన్నట్లు తెలిసింది.ఎవరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వారు మాట్లాడుకొని చెప్పండని గవర్నర్‌ సూచించినట్లు సమాచారం. సమావేశంతర్వాత తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు.
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ''సమస్యకు ఇంకా పరిష్కారం లభించలేదు. గవర్నర్‌ పలు సూచనలు చేశారు. వాటిని బహిర్గతం చేయలేం. అవసరమైతే మరోమారు చర్చలకు కూర్చుంటాం. ఇరురాష్ట్రాల విద్యార్థులకు న్యాయం జరగాలన్న దిశగా మేం వెళ్తున్నాం. త్వరలో గవర్నర్‌ నిర్ణయాలపై సానుకూలత వస్తుంద''ని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. గంటా వ్యాఖ్యల్ని బట్టి చూస్తే మరోమారు రెండు రాష్ట్రాల మధ్య చర్చలకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు చర్చలు జరిగినా చట్టప్రకారం వెళ్లాలని తెలంగాణ భావిస్తోంది.
నాటకీయ పరిణామాలు: గవర్నర్‌తో శనివారం సాయంత్రం సమావేశానికి ముందు.. రోజంతా రెండు రాష్ట్రాల్లోనూ ఎంసెట్‌ విషయమై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ సెట్ల (ప్రవేశపరీక్షలు) తేదీలను ప్రకటించటానికి మధ్యాహ్నం తెలంగాణ ఉన్నత విద్యామండలి భేటీ కావాలని నిర్ణయించిన నేపథ్యంలో గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ మంత్రి గంటా మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇంతకుముందు గవర్నర్‌ చేసిన సూచనకు (ఏడాదికొక రాష్ట్రం పరీక్షల నిర్వహణ) అంగీకారం తెలుపుతూ తాను రాజ్‌భవన్‌కు లేఖ పంపిన విషయాన్ని నరసింహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా పరీక్షలు ఉమ్మడిగా జరపడమే మంచిదన్న వాదనను మరోసారి ఆయన వద్ద వినిపించారు. అలాగే.. తెలంగాణ ప్రభుత్వ చర్యల పట్ల గవర్నర్‌ సానుకూలత వ్యక్తంచేసినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ముందుంచారు. ఈ భేటీ ముగిసిన కాసేపటికి సాయంత్రం 4.30కి రాజ్‌భవన్‌కు రావాలంటూ రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకు సమాచారం వెళ్ళింది. సమీక్ష సమావేశాలున్నాయని తెలంగాణ మంత్రి చెప్పటంతో దీన్ని సాయంత్రం 6.30కు మార్చారు. 6.45 నిమిషాల సమయంలో ఏపీ, తెలంగాణ మంత్రులిద్దరూ గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో సమావేశమయ్యారు. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ జరిగింది. ఇది పూర్తిగా మంత్రులతోనే జరిగినట్లు తెలియవచ్చింది.
తెలంగాణ ప్రభుత్వ వైఖరి రాజ్యాంగ విరుద్ధం.. గంటా: అంతకుముందు మధ్యాహ్నం తొలిసారి గవర్నర్‌ను కలసి వచ్చాక... తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటుకు గుర్తింపు లేదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు. ఎంసెట్‌ పరీక్షల బాధ్యతలను దానికి అప్పగిస్తూ జారీచేసిన జి.ఒ.లో వివిధ అంశాలపై అభ్యంతరాలున్నాయన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీ ఉన్నత విద్యా మండలికే నిర్వహణ అధికారం ఉందని.. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో భేటీకి ముందు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలో ఏపీ ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు వేణుగోపాలరెడ్డి, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి డోబ్రియల్‌, న్యాయశాఖ అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ సర్కారు ఎంసెట్‌ నిర్వహణపై ఏకపక్షంగా జారీచేసిన జి.ఒ.లో పేర్కొన్న అంశాలపై అథార్టీపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి గంటా కార్యాలయం ఓ ప్రకటన జారీచేసింది.
తెలంగాణ ప్రకటన వాయిదా: మరోవైపు ప్రవేశ పరీక్షల తేదీల ఖరారుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశమైంది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు, నిర్వహించే విశ్వవిద్యాలయాల గురించి నిర్ణయించారు. గవర్నర్‌ సమావేశానికి పిలిచిన నేపథ్యంలో వాటిని వెల్లడించటం గౌరవప్రదం కాదనే ఉద్దేశంతో వాయిదావేశారు. ఐదో తేదీన తేదీల వివరాలను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గవర్నర్‌ సమక్షంలో పరిష్కారం లభించనట్త్లెతే మే 17న ఎంసెట్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మే 3 అని ముందుగా అనుకున్నా ఆ రోజు జాతీయస్థాయిలో మరో పరీక్ష ఉన్నందున 17వ తేదీని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. విడివిడిగా జరిగితేనే ఈ తేదీ ఉంటుంది. ఒకవేళ గవర్నర్‌ చొరవతో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం కుదిరి ఉమ్మడిగా ఒకే ప్రవేశ పరీక్షలు జరిగితే మాత్రం కొత్త తేదీలను ప్రకటించే అవకాశముంది.
గవర్నర్‌ అలా అనలేదు...
అంతకుముందు ఎంసెట్‌ తదితర పరీక్షలపై తెలంగాణ వాదనతో గవర్నర్‌ సంతృప్తి చెందినట్లు వచ్చిన వార్తల్ని ఆయన కార్యాలయం ఖండించింది. ''విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య ఆమోదయోగ్య పరిష్కారం సాధించాలనేదే గవర్నర్‌ ఏకైక ఉద్దేశం. పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలసి కూర్చోవాలి'' అని శనివారం మధ్యాహ్నం గవర్నర్‌ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంచేశారు.
ఉద్యోగ పథాన తొలి అడుగు
* కొలువుల ప్రణాళికకు కమిటీ ఏర్పాటు
* ఆచార్య హరగోపాల్ సారథ్యంలో 27 మంది సభ్యులు
* 3 వారాల్లో నివేదిక
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ఉద్యోగాల పథంలో కీలకమైన తొలి అడుగు వేసింది. వివిధ రకాల ఉద్యోగ పరీక్షలకు అనుసరించాల్సిన ప్రణాళిక రూపకల్పనకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని జనవరి 3న ఏర్పాటు చేసింది. 26 మంది సభ్యులున్న ఈ కమిటీకి ఆచార్య హరగోపాల్ సారథ్యం వహిస్తారని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటించారు. వివిధ రంగాలతోపాటు సబ్జెక్టులను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ కమిటీకి రూపమిచ్చారు. తమకు 121 మంది సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మర్నాడే పీఎస్సీ తన పనిని వేగవంతం చేయడం గమనార్హం. పీఎస్సీ ద్వారా వివిధ స్థాయుల్లో పోస్టుల (గ్రూప్-1, గ్రూప్-2, జోనల్, జిల్లాస్థాయి) భర్తీకి పరీక్షలను ఎలా నిర్వహించాలి? రాతపరీక్షలెలా? ఇంటర్వ్యూలెలా? ఏయే అంశాల్లో అభ్యర్థుల్ని పరీక్షించాలి? జాతీయ, రాష్ట్ర, స్థానికాంశాల్లో వేటికి ఎంత మేరకు విలువ ఇవ్వాలి?... తదితర అంశాలను ఈ కమిటీ సూచిస్తుంది. మూడువారాల్లోగా ఇది నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా ఉద్యోగ పరీక్షల రూపురేఖలపై ప్రభుత్వం జీవో జారీచేస్తుంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తర్వాత సబ్జెక్టులవారీగా పాఠ్యప్రణాళిక (సిలబస్) కమిటీలను మళ్లీ నియమిస్తారు.
పరీక్షల రూపురేఖల నిర్ధారణ బృందం
ఆచార్య జి.హరగోపాల్ (కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు), ఆచార్య శివారెడ్డి (తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి), డాక్టర్ చుక్కా రామయ్య (విద్యావేత్త), ఆచార్య కోదండరాం (ఉస్మానియా వర్సిటీ), ఆచార్య వీఎస్ ప్రసాద్ (న్యాక్ మాజీ డైరెక్టర్), ఆచార్య లింగమూర్తి (కాకతీయ వర్సిటీ మాజీ ఉపకులపతి), ఆచార్య నాగేశ్వర్ (ఉస్మానియా వర్సిటీ), ఆచార్య అడపా సత్యనారాయణ (విశ్రాంత ఆచార్యులు, ఉస్మానియా వర్సిటీ), డాక్టర్ ఇ.రేవతి (సెస్), ఆచార్య జి.కృష్ణారెడ్డి (ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణభారత మండలి ఛైర్మన్), రమా మెల్కోటె (ఉస్మానియా వర్సిటీ విశ్రాంత ఆచార్యులు), ఆచార్య మల్లేశ్ (తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్), ఆచార్య బీనా (ఉస్మానియా వర్సిటీ), ఆచార్య సి.గణేశ్ (ఏపీసెట్ సమన్వయకర్త), ఆచార్య వహీదుల్లా సిద్దిఖి (మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం), డాక్టర్ కనకదుర్గ (సీఫెల్), ఆచార్య భూపతిరావు (ఉస్మానియా వర్సిటీ), ఆచార్య వెంకటయ్య (అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం), డాక్టర్ నిషాంత్ డొంగరి (ఐఐటీ, హైదరాబాద్), డాక్టర్ నందిని సిధారెడ్డి (విశ్రాంత అధ్యాపకులు), ఆచార్య రాజశేఖర్ (హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్), ఆచార్య భద్రునాయక్ (కాకతీయ వర్సిటీ), ఆచార్య జె.మనోహర్‌రావు (హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం), డాక్టర్ టి.శ్రీనివాస్ (కాకతీయ వర్సిటీ), ఆచార్య జీబీరెడ్డి (ఉస్మానియా వర్సిటీ), డాక్టర్ బైరి ప్రభాకర్ (జీఎంఆర్ పాలిటెక్నిక్ విభాగాధిపతి, గజ్వేల్), డాక్టర్ ఎన్.వాసంతి (నల్సార్ వర్సిటీ).
కొలువుల భర్తీకి పథక రచన
* నిపుణులతో టీఎస్‌పీఎస్సీ కమిటీ
* ఒకట్రెండు రోజుల్లో పేర్ల వెల్లడి
* నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదిక
ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరో అడుగు ముందుకేస్తోంది. కీలకమైన ప్రణాళిక రూపకల్పనకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తోంది. ఏ స్థాయి పోస్టులను ఎలా భర్తీ చేయాలి? వేటికెన్ని మార్కులుండాలి? ఏ సిలబస్‌ ఎంతుండాలి? గ్రూప్స్‌లో ప్రిలిమ్స్‌ ఎలా? మెయిన్స్‌ ఎలా? ఇంటర్వ్యూకు ఎంత విలువివ్వాలి అనే ప్రణాళిక ఉద్యోగాల భర్తీలో ఎంతో కీలకం. ఒకట్రెండు రోజుల్లో దీని రూపకల్పనకు సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. 5 నుంచి 10 మంది దాకా ఈ కమిటీలో ఉండొచ్చు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం పోస్టుల భర్తీకి విధివిధానాలను ఖరారు చేస్తుం