అత్యధిక బ్రాండ్‌ విలువున్న భారత్‌ సెలబ్రిటీ?

విద్యార్థులూ, ఉద్యోగార్థులూ జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలను గమనిస్తూ ఉండాలి. వాటిలోని ప్రధానాంశాలను గుర్తుంచుకోవాలి. కేంద్ర స్థాయిలో జరిగేవైనా, రాష్ట్ర స్థాయిలో జరిగేవైనా పోటీ పరీక్షల్లో వర్తమానాంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవడం ఎంతో అవసరం!

జాతీయం
1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) అయోధ్యలో అద్భుతంగా రామ మందిర నిర్మాణం జరిపేందుకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు 2020 ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభలో ప్రకటించారు.
బి) మందిర నిర్మాణానికి 3 నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన నేపథ్యంలో, ఫిబ్రవరి 9తో గడువు ముగుస్తున్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
సి) అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామని, శ్రీరాముడి జన్మస్థలంలో అద్భుతమైన రామాలయ నిర్మాణానికి భారతీయులంతా సహకరించాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
డి) ఈ ట్రస్ట్‌లో 15 మంది సభ్యులుంటారని, వారిలో ఒకరు దళిత వర్గానికి చెందినవారని ప్రభుత్వం ప్రకటించింది. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ప్రధాన కార్యాలయాన్ని దిల్లీలోని గ్రేటర్‌ కైలాష్‌ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
2. 11వ డిఫెక్స్‌పో (రక్షణ ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌)ను 2020 ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు ఏ నగరంలో నిర్వహించారు? (ప్రధాని మోదీ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. రానున్న అయిదేళ్లలో భారత్‌ నుంచి 500 కోట్ల డాలర్లు - సుమారు రూ. 35.6 వేల కోట్ల విలువైన మిలిటరీ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ వెల్లడించారు. భారత్‌ రెండేళ్లకు ఒకసారి ఈ ‘డిఫెక్స్‌పో’ను నిర్వహిస్తోంది. 38 దేశాల రక్షణ మంత్రులు, 172 విదేశీ, 856 స్వదేశీ మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ సంస్థల ఉన్నతస్థాయి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.)
1) లఖ్‌నవూ 2) బెంగళూరు 3) అహ్మదాబాద్‌ 4) వారణాసి
3. రూ. 65,544 కోట్లతో ఏ రాష్ట్రంలో భారీ పోర్టు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది? (ఈ రాష్ట్ర రాజధానిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌కు 97 కిలోమీటర్ల దూరంలోని వధావన్‌ వద్ద దీని నిర్మాణం చేపడతారు.)
1) గుజరాత్‌ 2) మహారాష్ట్ర 3) పశ్చిమ్‌ బంగ 4) తమిళనాడు
4. భారత్‌లో అత్యధిక బ్రాండ్‌ విలువ గల సెలబ్రిటీగా ఎవరు నిలిచారు? (ఈయన ఈ ఘనత సాధించడం ఇది వరుసగా మూడో ఏడాది. ‘ద డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌’ అనే సంస్థ అధ్యయనం ప్రకారం రూ. 1690 కోట్ల బ్రాండ్‌ విలువతో ఈయన అగ్రస్థానంలో నిలిచారు.)
1) అక్షయ్‌ కుమార్‌ 2) రోహిత్‌ శర్మ 3) విరాట్‌ కోహ్లీ 4) అమితాబ్‌ బచ్చన్‌
5. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ రూపొందించిన రోబో ఏది? (గగన్‌యాన్‌ పరిశోధనలో భాగంగా ఇస్రో చేపట్టే మానవరహిత యాత్రలో ఈ రోబో రోదసిలోకి అడుగుపెట్టనుంది. అంతరిక్షంలో దాదాపుగా మనుషుల తరహాలోనే ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది. వ్యోమగాములకు అవసరమైన జీవనాధార ఆపరేషన్లు, ఆక్సిజన్‌ సమాచారాన్ని ఇది అందిస్తుంది)
1) ఆకాశ మిత్ర 2) అంతరిక్ష మిత్ర 3) గగన మిత్ర 4) వ్యోమ మిత్ర
సమాధానాలు: 1-4 2-1 3-2 4-3 5-4.


Back..

Posted on 10-02-2020