అడ‌వుల విస్తీర్ణం ఎంత పెరిగింది?

విద్యార్థులూ, ఉద్యోగార్థులూ జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలను గమనిస్తూ ఉండాలి. వాటిలోని ప్రధానాంశాలను గుర్తుంచుకోవాలి. కేంద్ర స్థాయిలో జరిగేవైనా, రాష్ట్ర స్థాయిలో జరిగేవైనా పోటీ పరీక్షల్లో వర్తమానాంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవడం ఎంతో అవసరం!

జాతీయం
1. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘‘గగన్‌యాన్‌’కు దోహదపడేలా ఏ నగరంలోని ‘రక్షణ ఆహార పరిశోధన ప్రయోగశాల’ (డీఎఫ్‌ఆర్‌ఎల్‌) వ్యోమగాముల కోసం ప్రత్యేక ఆహారాన్ని సృష్టించింది (సాధారణంగా సుదూర విశ్వంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. దీంతో అక్కడ ఆహారాన్ని తయారుచేయడం, తినడం కష్టమవుతుంది. నీటిని తాగడంలోనూ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ ప్రతికూలతను అధిగమించేలా ఆహారాన్ని చెక్కుచెదరకుండా కలిపి ఉంచేందుకు డీఎఫ్‌ఆర్‌ఎల్‌ బైండర్స్‌ను ఉపయోగించి ప్రత్యేక ఆహారాన్ని సృష్టించింది)?
1) లఖ్‌నవూ 2) మైసూరు 3) కాన్పూర్‌ 4) అహ్మదాబాద్‌
2. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ ఇటీవల విడుదల చేసిన తాజా జాతీయ అటవీ సర్వే నివేదిక (2017-19) ప్రకారం గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం ఎంతశాతం మేర పెరిగింది (పారిస్‌ ఒప్పందం ప్రకారం 2030 నాటికి 250 కోట్ల నుంచి 300 కోట్ల టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌కు సమానమైన ఉద్గారాలను తగ్గించేందుకు వీలుగా దేశంలో అడవుల విస్తీర్ణాన్ని పెంచుతామని భారత్‌ 2015లో ఒప్పుకుంది. 1952లో అమలులోకి వచ్చిన మొదటి జాతీయ అటవీ విధానం ప్రకారం దేశ భూభాగంలో 33% విస్తీర్ణంలో అడవులు ఉండాలి. జాతీయ అటవీ సర్వే సంస్థ- ఎఫ్‌ఎస్‌ఐ రెండేళ్ళకోసారి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదల, క్షీణత తీరు తెన్నులను అంచనా వేస్తుంది. ఎఫ్‌ఎస్‌ఐ తాజా అటవీ నివేదిక ప్రకారం దేశ భూభాగంలో 7,12,249 చ.కి.మీ. మేర- 21.67 శాతం అడవులు విస్తరించి ఉన్నాయి)?
1) 0.56 శాతం 2) 0.66 శాతం 3) 0.76 శాతం 4) 0.86 శాతం
3. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) 2020 జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ‘పౌరసత్వ (సవరణ) చట్టం 2019 (47)లోని సెక్షన్‌ 1లోని సబ్‌ సెక్షన్‌ (2) ప్రకారం దాఖలైన అధికారాల మేరకు ఈ చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
బి) పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల్లో మత పీడనకు గురై 2014 డిసెంబరు 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించకుండా, వారికి పౌరసత్వం కల్పించేందుకు గాను పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం తీసుకువచ్చింది.
సి) గత ఏడాది డిసెంబరు 10న లోక్‌సభలో, మరుసటి రోజు రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించింది.
డి) డిసెంబరు 12న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ఆమోద ముద్ర వేయడంతో బిల్లు చట్టరూపం దాల్చింది.
1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
సమాధానాలు: 1-1, 2-1, 3-4.

అంతర్జాతీయం
1. ప్రపంచంలోనే అత్యంత భారీ పుష్పం ‘రఫ్లేసియా తువాన్‌ ముడే’ ఇటీవల ఏ దేశంలోని సుమత్రాలోని అగమ్‌ సంరక్షణ కేంద్రంలో విరబూసి వార్తల్లో నిలిచింది (ఈ భారీ పుష్పం వ్యాసం 3.6 అడుగులు)?
1) ఇండోనేషియా 2) మలేషియా 3) థాయ్‌లాండ్‌ 4) వియత్నాం
2. ‘మిస్‌ అమెరికా 2020’ పోటీలో విజేతగా ఎవరు నిలిచారు (గెలుపు కిరీటాన్ని శిరస్సున ధరిస్తూ ఈ యువతి.. ‘ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న కురచ ఈత దుస్తుల అంశాన్ని తొలగించిన కారణంగానే పోటీ పట్ల ఆసక్తి చూపించాను’ అని స్పష్టంగా ప్రకటించింది. ‘శరీరాలను కాదు, మా ప్రతిభా సౌందర్యాలను గమనించండి’ అంటున్న ఈ తరం యువతుల స్వరం ఈమె మాటల్లో ప్రతిధ్వనించింది)?
1) విక్టోరియా హిల్‌ 2) కెమిల్లె ష్రియర్‌ 3) సిమోన్‌ ఈస్టర్స్‌ 4) ఆడిసన్‌ ప్రైస్‌
3. అమెరికా డ్రోన్‌ దాడిలో మరణించిన ఇరాన్‌ దేశ రివల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ ఎవరు (అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు ఈ దాడిని చేపట్టినట్లు అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం- పెంటగాన్‌ ప్రకటించింది. ఈయన నాయకత్వం వహిస్తున్న ‘అల్‌ ఖుద్స్‌’ దళం తాము రూపొందించిన విదేశీ ఉగ్రవాద ముఠాల జాబితాలో ఉందని పెంటగాన్‌ వెల్లడించింది. ఇటీవల బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి సహా ఇరాక్‌లోని అమెరికా మిత్రపక్షాల సైనిక స్థావరాలపై దాడులకు ఇతడే సూత్రధారి అని పేర్కొంది. సిరియాలో అధ్యక్షుడు బషర్‌ అల్‌అసద్‌ సాగిస్తున్న అంతర్యుద్ధం, ఇరాక్‌లో సంఘర్షణలు, ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాద గ్రూపుపై పోరాటాల వెనక ఈయనదే ప్రధాన హస్తం అని పెంటగాన్‌ ప్రకటించింది)?
1) జనరల్‌ అబూ మహదీ 2) జనరల్‌ అల్‌ ముహందిస్‌ 3) జనరల్‌ ఖాసిం సులేమానీ 4) జనరల్‌ ఇస్మాయిల్‌ ఖానీ
4. ఇటీవల గత కొన్ని నెలలుగా ఏ దేశంలో కార్చిచ్చులు పెను బీభత్సం సృష్టిస్తున్నాయి (కార్చిచ్చుల ధాటికి ఈ దేశంలో కోటీ ఇరవై లక్షల ఎకరాల విస్తీర్ణంలోని అడవులు కాలిపోయినట్లు ప్రభుత్వం అంచనా వేసింది)?
1) అమెరికా 2) జర్మనీ 3) ఇండోనేషియా 4) ఆస్ట్రేలియా
5. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 77వ గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారాలను 2020 జనవరి 6న అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో ప్రదానం చేశారు.
బి) డ్రామా విభాగంలో ఉత్తమ చిత్రంగా మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ‘1917’ సినిమా పురస్కారం పొందింది. ఉత్తమ నటుడిగా జోక్విన్‌ ఫోనిక్స్‌ (జోకర్‌), ఉత్తమ నటిగా రెనీ జెల్‌వెగర్‌ (జాడో) పురస్కారాలు స్వీకరించారు.
సి) కామెడీ విభాగంలో ఉత్తమ చిత్రంగా ‘ఒన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌’ నిలిచింది. ఉత్తమ నటుడిగా టరొన్‌ ఎగర్టన్‌ (రాకెట్‌ మ్యాన్‌), ఉత్తమ నటిగా అక్వాఫినా (ది ఫేర్‌వెల్‌) పురస్కారాలు అందుకున్నారు.
డి) ఉత్తమ విదేశీ భాషాచిత్రంగా దక్షిణ కొరియా చిత్రం ‘పారాసైట్‌’ నిలిచింది.
1) ఎ, బి మాత్రమే 2) ఎ, సి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
సమాధానాలు: 1-1, 2-2, 3-3, 4-4, 5-4.

ఇతరాలు
1. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్ఫో దశాబ్దపు (2010-19) వన్డే, టీ20 జట్లకు ఎవరు కెప్టెన్‌గా ఎంపికయ్యారు?
1) మహేంద్ర సింగ్‌ ధోని, భారత్‌ 2) షేన్‌ వాట్సన్, ఆస్ట్రేలియా 3) క్రిస్‌గేల్, వెస్టిండీస్‌ 4) ఇయాన్‌ మోర్గాన్, ఇంగ్లాండ్‌
2. క్రింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తోన్న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం ఉన్న 1059 చికిత్సలతోపాటు కొత్తగా మరో 1000 చికిత్సలను చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బి) 2020 జనవరి 3న పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద 2059 వ్యాధులకు ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తూ మార్పులకు శ్రీకారం చుట్టారు. జనవరి 3 నుంచే మిగిలిన 12 జిల్లాల్లోనూ ప్రస్తుతం ఉన్న 1059 చికిత్సలకు అదనంగా మరో 200 చికిత్సలను చేర్చారు.
సి) పైలట్‌ ప్రాజెక్టు ముగిసిన తర్వాత అంటే ఏప్రిల్‌ 1, 2020 నుంచి నెలకొక జిల్లా చొప్పున 2059 వ్యాధులకు చికిత్సను విస్తరిస్తూ పోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
డి) 2020 జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద 510 రకాల మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చారు. డయాలసిస్‌ పేషెంట్లకు ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకూ నెలకు రూ. 10,000 పింఛను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎ) ఎ మాత్రమే బి) ఎ,బి మాత్రమే సి) ఎ,బి,సి మాత్రమే డి) పైవన్నీ
3. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ఐదు ‘యువ శాస్త్రవేత్త ప్రయోగశాల’లను 2020 జనవరి 2న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ నగరంలో ప్రారంభించి, జాతికి అంకిత చేశారు (ఈ నగరంతోపాటు హైదరాబాద్, చెన్నై, ముంబయిలలో ‘యువ శాస్త్రవేత్తల ప్రయోగశాల’లను ఏర్పాటు చేశారు)?
1) విశాఖపట్నం 2) దిల్లీ 3) అహ్మదాబాద్‌ 4) బెంగళూరు
4. తెలంగాణలోని ఏ జిల్లా వందశాతం మరుగుదొడ్లు నిర్మించి వినియోగించడం, ఇంకుడు గుంతలు నిర్మించి మురుగు కాల్వలు లేకుండా చేయడం, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించడం తదితర అంశాల్లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి స్వచ్ఛ దర్పణ్ పురస్కారాన్ని గెలుచుకుంది (ఈ జిల్లా ఇప్పటికీ స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ సుందర్‌ శౌచాలయ్‌లో జాతీయ అవార్డులు సాధించింది)?
1) సిద్దిపేట 2) పెద్దపల్లి 3) సంగారెడ్డి 4) వికారాబాద్‌
5. భారత్‌కు చెందిన ఏ విమాన వాహక నౌకను ఇటీవల అరేబియా సముద్రంలో మోహరించారు (సీ గార్డియన్స్‌’ పేరుతో చైనా-పాకిస్థాన్‌ తొమ్మిది రోజులపాటు సంయుక్తంగా భారీ నౌకా విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక మిషన్‌లో భాగంగా భారత రక్షణశాఖ ఈ నౌకను మోహరించింది)?
1) ఐఎస్‌ఎస్‌ విక్రాంత్‌ 2) ఐఎన్‌ఎస్‌ విరాట్‌ 3) ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య 4) ఐన్‌ఎస్‌ అరిహంత్‌
సమాధానాలు: 1-1, 2-4, 3-4, 4-2, 5-3.


Back..

Posted on 06-01-2020