కాప్‌-13 సదస్సు నినాదం ఏమిటి?

విద్యార్థులూ, ఉద్యోగార్థులూ జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలను గమనిస్తూ ఉండాలి. వాటిలోని ప్రధానాంశాలను గుర్తుంచుకోవాలి. కేంద్ర స్థాయిలో జరిగేవైనా, రాష్ట్ర స్థాయిలో జరిగేవైనా పోటీ పరీక్షల్లో వర్తమానాంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవడం ఎంతో అవసరం!

జాతీయం
1. సైనిక దళాల్లో లింగ వివక్షకు ముగింపు పలికే దిశగా సైన్యంలో మహిళా అధికారులకు ‘కమాండ్‌ హోదా’లను ఇచ్చేందుకు మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు ఏ రోజున చరిత్రాత్మక తీర్పు వెలువరించింది? (అతివల శారీరక పరమైన పరిమితుల కారణంగా కమాండ్‌ హోదా ఇవ్వడం లేదన్న ప్రభుత్వ వాదనను సుప్రీం కోర్టు తప్పుపట్టింది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ - ఎస్‌ఎస్‌సీ మహిళా అధికారులందరికీ మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్‌ మంజూరు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. మహిళా ఎస్‌ఎస్‌సీ అధికారులకు శాశ్వత కమిషన్‌ ఇవ్వాలంటూ దిల్లీ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీలతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది.)
1) 2020 ఫిబ్రవరి 13 2) 2020 ఫిబ్రవరి 15 3) 2020 ఫిబ్రవరి 17 4) 2020 ఫిబ్రవరి 19
2. ప్రమాదపుటంచుల నుంచి పర్యావరణాన్ని గట్టెక్కించడానికి ఉద్దేశించిన కీలకమైన పారిస్‌ ఒప్పందాన్ని అమలుచేసే దిశగా సమాయత్తమవుతున్న భారత్‌ తాజాగా 2020-21 బడ్జెట్‌లో పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలకు ఎంత మొత్తం కేటాయించింది? (ప్రధానంగా కాలుష్యం బారిన పడి ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరాల్లో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు, క్షీణిస్తున్న వాయు నాణ్యతను కాపాడేందుకు ప్రాధాన్యమిస్తూ ఈ నిధులు కేటాయించారు)
1) రూ. 1,400 కోట్లు 2) రూ. 2,400 కోట్లు 3) రూ. 3,400 కోట్లు 4) రూ. 4,400 కోట్లు
3. ‘వన్యప్రాణి వలస జాతుల సంరక్షణ (సీఎంఎస్‌) ఒప్పందానికి సంబంధించిన భాగస్వామ్య పక్షాల సదస్సు (కాప్‌)-13’ను ఇటీవల ఎక్కడ నిర్వహించారు? (ఈ సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఫిబ్రవరి 17న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ‘వలస జాతులు భూ ప్రపంచాన్ని అనుసంధానిస్తాయి. కలసికట్టుగా వాటిని ఆహ్వానిద్దాం’ అన్న నినాదంతో ఈ సదస్సును నిర్వహించారు. సీఎంఎస్‌ కాప్‌ సదస్సు అధ్యక్ష బాధ్యతలను ఫిలిప్పీన్స్‌ నుంచి భారత్‌ అధికారికంగా స్వీకరించింది. 2023 వరకు ఈ బాధ్యతల్లో మనదేశం కొనసాగనుంది)
1) గాంధీనగర్‌ 2) లఖ్‌నవూ 3) వారణాసి 4) తిరువనంతపురం
4. అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటైన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికయ్యారు? (ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్రాను ఆలయ నిర్మాణ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు)
1) చంపత్‌రాయ్‌ 2) మహంత్‌ నృత్యగోపాల్‌దాస్‌ 3) స్వామి గోవింద్‌దేవ్‌గిరీ 4) జ్ఞానేష్‌కుమార్‌
5. స్వచ్ఛభారత్‌ మిషన్‌ (గ్రామీణ) రెండో దశకు కేంద్ర మంత్రివర్గం 2020 ఫిబ్రవరి 19న ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద ఎంత మొత్తం ఖర్చు పెట్టనున్నారు? (ఉపాధి హామీ పథకంతో దీనిని అనుసంధానిస్తారు)
1. రూ. 22,497 కోట్లు 2. రూ. 32,497 కోట్లు 3. రూ. 42,497 కోట్లు 4. రూ. 52,497 కోట్లు
జవాబులు: 1-3, 2-4, 3-1, 4-2, 5-4

అంతర్జాతీయం
1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 2020 ఫిబ్రవరి 18న బెర్లిన్‌లో ప్రదానం చేసిన ప్రతిష్టాత్మక లారియస్‌ క్రీడా పురస్కారాల్లో గత 20 ఏళ్లలో అత్యుత్తమ క్రీడా ఘట్టంగా ‘స్పోర్టింగ్‌ మూమెంట్‌’ అవార్డును సచిన్‌ తెందూల్కర్‌ గెలుచుకున్నాడు.
బి) 2011 ఏప్రిల్‌ 2న భారత క్రికెట్‌ జట్టు వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన అనంతరం జట్టు సభ్యులు సచిన్‌ను తమ భుజాలపై మోసుకుంటూ మైదానంలో కలియతిరిగారు. ఇప్పుడు అదే ఘట్టానికి ‘ఈ స్పోర్టింగ్‌ మూమెంట్‌’ పురస్కారం లభించింది. రెండు దశాబ్దాల లారియస్‌ క్రీడా పురస్కారాల చరిత్రలో భారత్‌ లేదా భారత క్రీడాకారుడు ఒక అవార్డును గెలుచుకోవడం ఇదే తొలిసారి.
సి) తాజా లారియస్‌ క్రీడా పురస్కారాల్లో స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారాన్ని లూయిస్‌ హామిల్టన్‌ (ఫార్ములావన్‌- బ్రిటన్‌), లయోనల్‌ మెస్సీ (ఫుట్‌బాల్‌ -అర్జెంటీనా) సంయుక్తగా గెలుచుకున్నారు. స్పోర్ట్స్‌ ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారాన్ని సిమోన్‌ బైల్స్‌ (జిమ్నాస్టిక్స్‌-అమెరికా) గెలుచుకుంది.
డి) వరల్డ్‌ టీమ్‌ ఆప్‌ ద ఇయర్‌ పురస్కారాన్ని దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు నెగ్గింది. వరల్డ్‌ బ్రేక్‌ త్రూ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారాన్ని ఎగాన్‌ బెర్నాల్‌ (సైక్లింగ్‌-కొలంబియా) గెలుచుకున్నారు.
1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
2. ‘న్యూ జనరేషన్‌ ఫైటర్‌ (ఎన్‌జీఎఫ్‌)’ పేరిట అత్యంత అధునాతన యుద్ధ విమానాన్ని ఏ రెండు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి? (కొత్త రకం మానవ రహిత విమానాలు, క్రూయిజ్‌ క్షిపణులు, యుద్ధ విమానాలతో సరికొత్త వైమానిక రక్షణ వ్యవస్థను ఇరు దేశాలు సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్‌జీఎఫ్‌ను తయారుచేస్తున్నాయి)
1) అమెరికా - బ్రిటన్‌ 2) అమెరికా - చైనా 3) జర్మనీ - ఫ్రాన్స్‌ 4) రష్యా - చైనా
3. భారత్, బంగ్లాదేశ్, మాల్దీవుల నుంచి ప్రాంతీయ పర్యటకుల స్వేచ్ఛా ప్రవేశానికి 2020 ఫిబ్రవరి 4న ఏ దేశం ముగింపు పలికింది? (ఇకపై పర్యటకులు రోజుకు రూ. 1200 చొప్పున సుస్థిరాభివృద్ధి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ దేశంలో పర్యటించే మొత్తం పర్యటకుల్లో భారతీయుల సంఖ్య 70 శాతం దాకా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌తో విహారయాత్రలు చేపట్టేవారిని నిలువరించి ఉన్నతశ్రేణికి చెందిన ఖరీదైన పర్యటకుల్ని ఆకర్షించేందుకు ఈ దేశ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉన్నతశ్రేణి పర్యటకులు అయితే దీర్ఘకాలంపాటు బసచేస్తారని, కార్లు, ఆహారం, ఇతర సౌకర్యాలపై పెద్దమొత్తంలో ఖర్చు చేస్తే తమకు లబ్ధి చేకూరుతుందని ఈ దేశం భావిస్తోంది)
1. శ్రీలంక 2. భూటాన్‌ 3. నేపాల్‌ 4. పాకిస్థాన్‌
4. ప్రపంచ జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి పరిష్కారాలు సూచించేవారికి ఒక్కొక్కటి 10 లక్షల డాలర్ల (సుమారు రూ. 7 కోట్లు) వంతున రెండు పురస్కారాలు ఏటా అందజేస్తామని తాజాగా ఏ దేశం ప్రకటించింది? (ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసేలా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ దేశం ఈ నిర్ణయం తీసుకుంది)
1) స్వీడన్‌ 2) నార్వే 3) సింగపూర్‌ 4) స్విట్జర్లాండ్‌
జవాబులు: 1-4, 2-3, 3-2, 4-1

ఇతరాలు
1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లుగానే, 2020 ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలను సమూలంగా మార్చేలా దీని పేరుమీదుగానే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బి) ఆసుపత్రుల అభివృద్ధి పనులను మూడు దశలవారీగా మూడేళ్లలో పూర్తిచేస్తామని, ఇందుకు రూ. 15,337 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
సి) వైఎస్సార్‌ ‘కంటి వెలుగు’ 3వ విడత కార్యక్రమాన్ని కూడా 2020 ఫిబ్రవరి 18న సీఎం జగన్‌ కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాలలో ప్రారంభించారు.
డి) మూడో విడత కంటి వెలుగు కార్యక్రమంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 56,88,420 మందికి కంటి వైద్య పరీక్షలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జులై 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
1) ఎ, బి మాత్రమే 2) ఎ, సి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
2. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 19న ఉత్తర్వులు జారీచేసింది? (ప్రస్తుతం 3 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. నియామకాలకు సంబంధించి అంధత్వం, కంటి చూపు మందగించిన వారికి 1%, వినికిడి లోపం ఉన్నవారికి 1%, చలన సంబంధ వైకల్యం, కండరాల బలహీనత, మస్తిష్క పక్షవాతం, కుష్టువ్యాధిగ్రస్థులు, మరుగుజ్జుతనం, యాసిడ్‌ దాడి బాధితులకు 1% రిజర్వేషన్‌ కల్పించనున్నారు. ఆటిజం, లర్నింగ్‌ డిజెబిలిటీతో బాధపడేవారికి 1% రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. ఐదుగురికి మించి సిబ్బంది ఉన్న ఏ శాఖలో అయినా పదోన్నతుల్లోనూ ఇవే రిజర్వేషన్లు వర్తింపజేస్తారు)
1) తెలంగాణ 2) తమిళనాడు 3) ఆంధ్రప్రదేశ్‌ 4) కర్ణాటక
3. ‘బయో ఏషియా 2020’ సదస్సును ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు ఏ నగరంలో నిర్వహించారు? (టుడే ఫర్‌ టుమారో అనే థీమ్‌తో ఈ సదస్సును నిర్వహించారు. 2004 నుండి బయోఏషియా సదస్సును ఏటా నిర్వహిస్తున్నారు. బయోఏషియా సదస్సు ఏటా ప్రదానం చేసే జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ పురస్కారాన్ని 2020 సంృృనికి గాను డాక్టర్‌ కార్ల్‌ హెచ్‌ జూన్, డాక్టర్‌ వసంత్‌ నరసింహన్‌లకు ప్రదానం చేశారు. 2020 బయో ఏషియా సదస్సుకు స్విట్జర్లాండ్‌ భాగస్వామ్య దేశంగా, ఒడిశా భాగస్వామ్య రాష్ట్రంగా వ్యవహరించాయి)
1) హైదరాబాద్‌ 2) బెంగళూరు 3) చెన్నై 4) లఖ్‌నవూ
4. ఏ దేశ అధ్యక్షుడు అయిన రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ఇటీవల పాకిస్థాన్‌ పర్యటన సందర్భంగా ఆ దేశ పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ కశ్మీర్‌ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని భారత్‌ తీవ్రంగా తప్పుపట్టింది? (తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని సూచించింది)
1) ఉత్తరకొరియా 2) టర్కీ 3) ఇండోనేషియా 4) ఇరాన్‌
జవాబులు: 1-4, 2-3, 3-1, 4-2


Back..

Posted on 24-02-2020