నోబెల్ పురస్కారాలు - 2018

2018 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. వైద్య, భౌతిక, రసాయన, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేసినవారికి ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతిని అందిస్తారు. అవార్డును ఎంపిక చేసే అకాడమీ సభ్యుడిపై లైంగిక ఆరోపణలు రావడంతో సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్‌ను ప్రకటించకుండా వాయిదా వేశారు. 1949 తర్వాత ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబరు 10న స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో వీరికి బహుమతి ప్రదానం చేస్తారు.
క్యాన్సర్‌పై పోరాటానికి వైద్యశాస్త్రంలో నోబెల్
* క్యాన్సర్ వ్యాధి చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఇద్దరు శాస్త్రవేత్తలు జేమ్స్ పి. అల్లిసన్ (అమెరికా), తసుకు హోంజో (జపాన్)కు వైద్యశాస్త్రంలో నోబెల్‌ను ప్రకటించారు.
* మానవ శరీరంలోని సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తి సహాయంతో క్యాన్సర్‌ను జయించే విధానాన్ని కనుక్కున్నందుకు వీరికి ఈ పురస్కారం దక్కింది. క్యాన్సర్‌ను నయం చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాల్లో నేరుగా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అల్లిసన్, హోంజోలు ఇమ్యునో థెరపీ అనే కొత్త విధానంలో మరింత వేగంగా క్యాన్సర్‌ను తగ్గించేందుకు రోగి శరీరంలోని వ్యాధి నిరోధకశక్తి ఎలా సాయపడుతుందనే అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించారు. వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు ఉత్పత్తి చేసే ప్రొటీన్లను చికిత్సలో లక్ష్యంగా చేసుకోవడం ద్వారా క్యాన్సర్ కణాలను వేగంగా చంపేసే విధానాన్ని వీరు అభివృద్ధి చేశారు.
* రోగ నిరోధక కణాలు కొన్ని ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తాయి. ఒక్కోసారి ఈ ప్రొటీన్లే రోగ నిరోధక వ్యవస్థ చేతిలో క్యాన్సర్ కణాలు హతంకాకుండా అడ్డుకుంటాయి. ఈ పరిణామాన్నే 'బ్రేక్' అంటారు. బ్రేక్ సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనా వేస్తూ రోగ నిరోధక వ్యవస్థను క్రియాశీలం చేయడంలో అల్లిసన్ విజయం సాధించారు. ఇదే సమయంలో బ్రేక్‌గా పని చేస్తున్న కొత్త ప్రొటీన్ పీడీ-1ను హోంజో కనుగొన్నారు. అల్లిసన్ పరిశోధన ఆధారంగా తయారు చేసిన ఔషధానికి అమెరికా ఆహార, ఔషధ పరిపాలన విభాగం ఆమోదం తెలిపింది. మెలనోమా చికిత్సకు వైద్యులు దీన్ని సూచిస్తున్నారు.
* అల్లిసన్ (70) టెక్సాస్ విశ్వవిద్యాలయంలో, హోంజో (76) క్యోటో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా వ్యవహరిస్తున్నారు. శరీర వ్యాధి నిరోధక శక్తిలో అత్యంత కీలకమైన టీ-సెల్స్ (తెల్ల రక్తకణాల్లో ఒక రకం)పై నిరోధక గ్రాహంగా సీటీఎల్ఏ-4 అణువు పనిచేస్తుందని 1995లో గుర్తించిన ఇద్దరు శాస్త్రవేత్తల్లో అల్లిసన్ ఒకరు. హోంజో తాను కనుగొన్న ప్రోగ్రామ్డ్ సెల్‌డెత్ ప్రొటీన్ (పీడీ-1)తో ప్రాచుర్యం పొందారు.
* వీరి పరిశోధనలకు 2014లో 'ఆసియా నోబెల్‌'గా పరిగణించే ట్యాంగ్‌ప్రైజ్‌ను గెల్చుకున్నారు.
* నోబెల్ బహుమతి విలువ 1.01 మిలియన్ డాలర్లు (90 లక్షల స్వీడిష్ క్రోనార్లు). ఈ మొత్తాన్ని వీరిద్దరూ చెరిసగం పంచుకుంటారు.
'ఆప్టికల్ లేజర్‌'కు భౌతికశాస్త్ర నోబెల్
* సునిశిత నేత్ర చికిత్సకు ఉపకరించే సూక్ష్మ పరికరాల రూపకల్పన దిశగా లేజర్ ఫిజిక్స్‌పై పరిశోధనలు చేసిన ముగ్గురికి 2018 సంవత్సరానికి భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి దక్కింది. అమెరికాకు చెందిన ఆర్థర్ ఆష్కిన్ (96), ఫ్రాన్స్‌కు చెందిన గెరార్డ్ మౌరో (74), కెనడా శాస్త్రవేత్త డోనా స్ట్రిక్‌ల్యాండ్ (55)ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. నోబెల్ అవార్డు కింద అందే 1.01 మిలియన్ డాలర్ల నగదు పురస్కారంలో ఆష్కిన్ సగం, మిగతా సగాన్ని ఇద్దరు పరిశోధకులు మౌరో, స్ట్రిక్ ల్యాండ్ పంచుకోనున్నారు.
* నోబెల్ పురస్కారాల చరిత్రలో భౌతికశాస్త్ర విభాగం కింద అవార్డుకు ఎంపికైన మూడో మహిళ డోనా. ఈమె కంటే ముందు 1903లో మేడం క్యూరీ, 1963లో గోపర్ట్ మేయర్ భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి పొందారు. నోబెల్ బహుమతి పొందిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆర్థర్ ఆష్కిన్ నిలిచారు. 2007లో అమెరికా ఆర్థికవేత్త లియోనిడ్ హుర్విజ్ 90 ఏళ్ల వయసులో నోబెల్ పొందారు.
* లేజర్ బీమ్ సహాయంతో రేణువులు, పరమాణువులు, వైరస్‌లు, ఇతర సజీవ కణాలను ఒడిసి పట్టుకోగలిగే ఆప్టికల్ ట్వీజర్లను ఆవిష్కరించినందుకు ఆష్కిన్‌కు ఈ గౌరవం దక్కింది. ఈ ట్వీజర్ల సాయంతో కాంతి ధార్మిక పీడనాన్ని ఉపయోగించి భౌతిక పదార్థాలను ఆయన కదల్చగలిగారని అకాడమీ తెలిపింది. ఇది సైన్స్ కాల్పనిక సాహిత్యంలో ఉండేదని, దీన్ని ఆచరణలోకి తీసుకురావాలన్నది ఎప్పటి నుంచో కల అని నోబెల్ ఎంపిక కమిటీ పేర్కొంది. ఆష్కిన్ అమెరికాలోని ఏటీ అండ్ టీ బెల్ ల్యాబొరేటరీస్‌లో పనిచేస్తున్నప్పుడు (1952-1991) 1987లో సూక్ష్మ జీవులకు హాని చేయకుండా వాటిని పట్టుకొనే ట్వీజర్లను కనుక్కున్నారు.
* మౌరోకు ఫ్రాన్స్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్‌తో పాటు అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉంది. డోనా స్ట్రిక్‌ల్యాండ్ ఈయన విద్యార్థే. ప్రస్తుతం ఈమె కెనడాలోని వాటర్‌లూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
కొత్త ఎంజైముల సృష్టికర్తలకు రసాయనశాస్త్ర నోబెల్
* రసాయనశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. వీరిలో అమెరికాకు చెందిన పరిశోధకురాలు ఫ్రాన్సిస్ అర్నాల్డ్, పరిశోధకుడు జార్జ్ పి స్మిత్, బ్రిటన్‌కు చెందిన గ్రెగరీ వింటర్ ఉన్నారు. వీరు ముగ్గురూ పరిణామ సమీకరణం ద్వారా కొత్త ఎంజైములు సృష్టించి ఆసక్తికర ఫలితాలు సాధించారు. ఈ కొత్త ఎంజైముల ఆధారంగా జీవ వైవిధ్య ఇంధనం, ఔషధాలను తయారు చేయవచ్చు. 'పరిణామక్రమాన్ని నియంత్రించి మానవాళికి గొప్ప ప్రయోజనం చేకూర్చే విధంగా ఎంజైములను ఉపయోగించడంలో వీరు కృషిచేశారు' అని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. జన్యు మార్పులు, జన్యువుల ఎంపిక, విస్తృత రంగాల్లో ప్రొటీన్లను అభివృద్ధి చేయడానికి ఈ ముగ్గురూ ఒకే విధమైన పరిణామ సూత్రాలను ఎంచుకున్నారు. 'టెస్ట్‌ట్యూబ్స్‌లో డార్విన్ సిద్ధాంతాన్ని అమలు చేశారు. పరిణామ ప్రక్రియలో ఉన్న పరమాణు అవగాహనను ఉపయోగించుకుని ప్రయోగశాలలో ప్రక్రియను పునరుద్ధరించారు' అని అకాడమీలోని నోబెల్ కెమిస్ట్రీ కమిటీ వెల్లడించింది. కొత్త ప్రొటీన్ల తయారీలో వెయ్యి రెట్లు వేగంగా పనిచేసే పరిణామ క్రమాన్ని సృష్టించారని తెలియజేసింది.
* ఫ్రాన్సిస్ అర్నాల్డ్ (62) కాలిఫోర్నియా సాంకేతిక విద్యాసంస్థలో రసాయన ఇంజినీరింగ్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. డీఎన్ఏ సవరణలకు ఆమె అనుసరించిన విధానంతో కొన్ని విషపూరిత శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు దొరికాయి. కావాల్సిన ధర్మాలతో కొత్త ప్రొటీన్లను ఉత్పత్తి చేసేందుకు ఆమె విధానం ఉపయోగపడింది. చెరకు పిప్పి లాంటి పునర్వినియోగ ఇంధన వనరులతో జీవ ఇంధనాల తయారీ, పర్యావరణహిత రసాయనాల ఉత్పత్తికి తోడ్పడింది. అత్యల్ప ఉష్ణోగ్రతల్లోనూ గిన్నెలు తోముకునే, వస్త్రాలు ఉతుక్కునే సబ్బులు సమర్థంగా పనిచేసేందుకూ ఈ విధానం సాయపడుతోంది.
* రసాయనశాస్త్రంలో నోబెల్ దక్కించుకున్న అయిదో మహిళ అర్నాల్డ్. పురస్కారం కింద అందే 1.01 మిలియన్ డాలర్లలో సగం ఈమెకు, మిగతా సగం స్మిత్, వింటర్‌లకు పంచుతారు.
* మిస్సౌరీ వర్సిటీలో స్మిత్, కేంబ్రిడ్జ్ వర్సిటీలో గ్రెగరీ వింటర్ పరిశోధకులు. వీరు 'ఫేజ్ డిస్‌ప్లే'గా పిలిచే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. దీనిలో బ్యాక్టీరియాకు సోకే వైరస్‌లను కొత్త ప్రొటీన్ల ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చు. దీర్ఘకాలంపాటు వేధించే కీళ్లవాతం, సొరియాసిస్ లాంటి చర్మవ్యాధి, పేగువాపు లాంటి రుగ్మతలకు కొత్త ఔషధాల తయారీకి వీరి పరిశోధన తోడ్పడుతుంది. శరీరంలోని విషపూరిత పదార్థాలను నిర్వీర్యం చేయడం, వ్యాధి నిరోధక కణాల అసాధారణ స్పందనలను, శరీరం మొత్తం వ్యాపించకుండా క్యాన్సర్ కణాలను నియంత్రించడం లాంటి చర్యలకు ఉపయోగపడే యాంటీబాడీల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
లైంగిక హింసపై పోరాటానికి నోబెల్ శాంతి
* ప్రపంచ వ్యాప్తంగా ఘర్షణలు, యుద్ధాలు జరుగుతున్న కల్లోలిత ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇద్దరిని ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది.
* డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ డెనిస్ ముక్వెగె (63), ఇరాక్‌లోని యాజిది తెగకు చెందిన యువతి నదియా మురాద్ (25)లను 2018 నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు కమిటీ ఛైర్మన్ బెరిట్ రెయిస్ అండర్సన్ ప్రకటించారు.
* ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ప్రముఖుల బండారాన్ని బయటపెట్టడంతోపాటు లైంగికదాడి బాధితుల్లో ధైర్యాన్ని నింపిన 'మీటూ' ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా నోబెల్ శాంతి బహుమతి ఎంపిక కమిటీ ఈ ఏడాది లైంగిక హింసను ప్రధాన అంశంగా ఎంచుకుంది. యుద్ధాల్లో లైంగిక హింసను ఒక ఆయుధంగా వాడుకోకుండా నిరోధించేందుకు ఈ ఇద్దరూ ఎంతో పోరాడారని నార్వేజియన్ నోబెల్ ఎంపిక కమిటీ ప్రశంసించింది.
* డాక్టర్ డెనిస్ ముక్వెగెను స్థానికులు 'డాక్టర్ మిరాకిల్' అని పిలుస్తారు. అంతర్యుద్ధంతో దశాబ్దాలుగా అట్టుడుకుతున్న తూర్పు కాంగోలో ఆయన రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. 1999లో ఇలాంటి బాధితుల కోసం బుకావు పట్టణంలో హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఏటా దాదాపు 3,500 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. సామూహిక లైంగిక దాడులకు గురైన ఎంతోమంది బాధితులకు ముక్వెగె తన వైద్యంతో ప్రాణం పోశారు. ఆయనపై పలు మార్లు హత్యాయత్నాలు జరిగాయి. తన జీవితంలో ఎదురైన సంఘటనలను వివరిస్తూ ఆయన 'ప్లీ ఫర్ లైఫ్' అనే పేరుతో ఆత్మకథను రాశారు. ఇప్పటివరకు ఆరు సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు.
* నదియా ఉత్తర ఇరాక్‌లోని మైనార్టీ యాజిదీ తెగకు చెందిన యువతి. అక్కడ కోజో అనే మారుమూల గ్రామం ఆమె నివాసం. 2014 ఆగస్టులో ఐఎస్ ఉగ్రవాదులు యాజిదీ ప్రజలను సామూహికంగా మట్టుబెట్టే ఉద్దేశంతో సింజార్ జిల్లాలోని గ్రామాలపై పాశవిక దాడులకు దిగారు. నదియా తల్లితోపాటు ఆరుగురు సోదరులనూ పొట్టన పెట్టుకున్నారు. యువతులు, బాలికలను అపహరించుకెళ్లి, లైంగిక బానిసలుగా మార్చేశారు. వీరి అరాచకానికి దాదాపు 3 వేల మంది యాజిదీ తెగ మహిళలు, బాలికలు బాధితులయ్యారు. వీరిలో నదియా కూడా ఉంది. దాదాపు మూడు నెలలపాటు ఈ నరకాన్ని అనుభవించిన నదియా ఎట్టకేలకు తప్పించుకుని, జరిగిన అఘాయిత్యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇతర బాధితుల తరఫునా గళం విప్పింది. తన తోటి యాజిదీలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించి 'ద లాస్ట్‌గర్ల్' పేరుతో ఓ పుస్తకాన్ని ఆవిష్కరించింది. నదియాను 23 ఏళ్లకే 2016లో ఐరాస తరఫున తొలి 'మానవ అక్రమ రవాణా బాధితుల సగౌరవ సౌహార్ద్ర రాయబారిగా నియమించారు.
* ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం 331 వ్యక్తులు, సంస్థల తరఫున నామినేషన్లు దాఖలయ్యాయి. డిసెంబరు 10న నార్వే రాజధాని ఓస్లోలో జరిగే వేడుకలో విజేతలకు నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తారు.
హరితవృద్ధి నిపుణులకు ఆర్థిక నోబెల్
* 'హరిత వృద్ధి' నిపుణులకు 2018కిగాను ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. ఆర్థికాభివృద్ధిని, వాతావరణ విధానాలను ఎలా అనుసంధానించాలో ప్రపంచానికి తెలియజేసిన అమెరికా ఆర్థికవేత్తల ద్వయం విలియం నార్డ్‌హాస్, పాల్ రోమర్ సంయుక్తంగా ఈ ఏడాది అర్థశాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. సృజనాత్మకత, వాతావరణాలను ఆర్థికవృద్ధితో జోడించినందుకు వారిని ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. దీర్ఘకాలంపాటు నిలదొక్కుకునేలా, నిలకడైన వృద్ధిని సృష్టించడంలో వీరు చేసిన కృషి అమోఘమైందని ప్రశంసించింది. పర్యావరణ అనుకూల (గ్రీన్‌గ్రోత్) వృద్ధి నమూనాలను రూపొందించటంలో వీరిద్దరూ స్వతంత్రంగా పని చేస్తూ అద్భుతమైన ఫలితాలను రాబట్టారని శ్లాఘించింది. 1990ల్లోనే వీరిద్దరూ ఈ పద్ధతులను అభివృద్ధి చేశారని అకాడమీ తెలిపింది. నోబెల్ బహుమతి విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, వీరిద్దరూ ఈ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటారు.
* వాతావరణం విపత్తుల నుంచి తప్పించుకోవాలంటే సమాజం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు అవసరమని ఐరాస చరిత్రాత్మక నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో హరితవృద్ధి పరిశోధకులకు అవార్డులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
* 'నార్డ్‌హాస్, రోమర్‌లు అంతిమ సమాధానాలు ఇవ్వలేదు. అయితే, సుస్థిర ఆర్థికవృద్ధి ఎలా సాధించగలం? అనే ప్రశ్నకు వారి పరిశోధనలు చాలా దగ్గర సమాధానాలు ఇచ్చాయి. దీర్ఘకాల ఆర్థిక స్థితిగతుల విశ్లేషణకు వాతావరణ మార్పులను జోడించిన 77 ఏళ్ల నార్డ్‌హాస్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. 1990ల్లోనే భౌతిక, రసాయన, ఆర్థిక శాస్త్రాల సిద్ధాంతాల ఆధారంగా తన విధానాన్ని ఆయన రూపొందించారు. ఆర్థిక రంగం, వాతావరణం ఒకదానిపై మరొకటి ఆధారపడేలా చేస్తూ సత్ఫలితాలు సాధించేందుకు ప్రపంచ దేశాలు దీన్ని ఉపయోగిస్తున్నాయి' అని కమిటీ పేర్కొంది.
* 'సాంకేతిక ఆవిష్కరణలను, ఆర్థిక స్థితిగతుల విశ్లేషణలకు కలిపినందుకు 62 ఏళ్ల రోమర్‌ను ఈ అవార్డుతో సత్కరిస్తున్నాం. 'ఎండోజీనియస్ గ్రోత్ థియరీ'ను ఆయన అభివృద్ధి చేశారు. వస్తువుల కంటే నవకల్పనలు ఎలా భిన్నమైనవి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే వీటి మనుగడకు ప్రత్యేక పరిస్థితులు అవసరమని వివరిస్తోంది. నవకల్పనలు, ఆవిష్కరణలను సంస్థలు ప్రోత్సహించడంలో ఆర్థిక పరిస్థితుల పాత్రను రోమర్ విశ్లేషించారు' అని కమిటీ వివరించింది.
* నార్డ్‌హాస్ యేల్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, రోమర్ న్యూయార్క్ విశ్వవిద్యాలయ అనుబంధ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పనిచేస్తున్నారు. రోమర్ గతంలో ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా కూడా పని చేశారు.


'నోబెల్' విశేషాలు
* ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతులను స్వీడన్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా 1901 నుంచి ప్రదానం చేస్తున్నారు. ప్రారంభంలో అయిదు రంగాల్లో (వైద్యం, భౌతిక, రసాయనశాస్త్రం, సాహిత్యం, శాంతి) ఈ పురస్కారాలను అందజేసేవారు. 1969 నుంచి ఆర్థికశాస్త్రానికి కూడా ఈ అవార్డును అందజేస్తున్నారు.
* ఆల్ఫ్రెడ్ బెర్న్‌హార్డ్ నోబెల్ 1833, అక్టోబరు 21న స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో జన్మించారు. ఆయన రసాయన శాస్త్రవేత్తగా, ఇంజినీర్‌గా, పారిశ్రామికవేత్తగా బహుముఖ ప్రజ్ఞ కనబరిచారు. 1895, నవంబరు 27న పారిస్‌లో రాసిన వీలునామా ప్రకారం తన ఆస్తిలోని 31 మిలియన్ స్వీడిష్ క్రోనార్లతో (సుమారు 265 మిలియన్ డాలర్లు) నిధిని ఏర్పాటు చేసి నోబెల్ బహుమతులను ప్రారంభించారు. 1896, డిసెంబరు 10న ఇటలీలోని శాన్‌రెమోలో మరణించారు.
* 'రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' భౌతిక, రసాయన, ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతులను అందిస్తోంది. వైద్యశాస్త్ర నోబెల్‌ను 'నోబెల్ అసెంబ్లీ ఎట్ ది కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్', నోబెల్ సాహిత్య అవార్డును 'స్వీడిష్ అకాడమీ', నోబెల్ శాంతి బహుమతిని 'నార్వేజియన్ నోబెల్ కమిటీ' ప్రదానం చేస్తున్నాయి.
* 1968లో స్వీడన్ కేంద్ర బ్యాంకు స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ 300వ వార్షికోత్సవం సందర్భంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మృత్యార్థం 'ది స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్' పేరిట ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఏర్పాటు చేశారు. 1969 నుంచి దీన్ని ప్రదానం చేస్తున్నారు.
* వైద్యం, భౌతిక, రసాయనశాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో ఇదే క్రమంలో ఏటా అక్టోబరులో నోబెల్ బహుమతులను ప్రకటిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబరు 10న ఈ ఆరు అవార్డులను అందిస్తారు. శాంతి బహుమతి మినహా మిగిలిన అయిదు పురస్కారాలను స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో స్వీడన్ రాజు ప్రదానం చేస్తారు.
* నార్వే రాజధాని ఓస్లోలో నార్వే రాజు సమక్షంలో నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్ నోబెల్ శాంతి బహుమతిని అందిస్తారు.
* ఒక నోబెల్ బహుమతిని అత్యధికంగా ముగ్గురు వ్యక్తులకు ప్రదానం చేయవచ్చు.
* 1974 నుంచి నోబెల్ బహుమతులను మరణానంతరం ప్రకటించట్లేదు. అంతకుముందు రెండు సార్లు మాత్రమే 1931లో సాహిత్య నోబెల్‌ను ఎరిక్ ఆక్సెల్ కార్ల్‌ఫెల్ట్‌కు, 1961లో నోబెల్ శాంతి బహుమతిని డాగ్ హామర్‌షోల్డ్ (ఐరాస ప్రధాన కార్యదర్శి)కు మరణానంతరం ప్రకటించారు.
* నోబెల్ బహుమతి విజేతల్లో అతిపిన్న వయస్కురాలు పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్. 2014లో నోబెల్ శాంతి బహుమతి పొందినపుడు ఈమె వయసు 17 ఏళ్లు.
* నోబెల్ పురస్కార గ్రహీతల్లో అత్యంత పెద్ద వయస్కుడు ఆర్థర్ ఆష్కిన్ (96). 2018లో భౌతికశాస్త్ర నోబెల్‌కు ఎంపికవడం ద్వారా ఆయన ఈ రికార్డు సృష్టించారు.
* రెడ్‌క్రాస్ సంస్థ (ఐసీఆర్‌సీ - ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్‌క్రాస్) ఇప్పటివరకూ అత్యధికంగా మూడు సార్లు నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంది. 1917, 1944, 1963ల్లో ఈ ఘనత సాధించింది. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్ కార్యాలయం (యూఎన్‌హెచ్‌సీఆర్)కు 1954, 1981ల్లో రెండుసార్లు నోబెల్ శాంతి పురస్కారం లభించింది.
నోబెల్‌ను రెండు సార్లు గెలుపొందినవారు
1. మేరీక్యూరీ (ఫ్రాన్స్) - 1903 (భౌతికశాస్త్రం), 1911 (రసాయనశాస్త్రం)
2. లీనస్ పాలింగ్ (అమెరికా) - 1954 (రసాయనశాస్త్రం), 1962 (శాంతి)
3. జాన్ బర్డీన్ (అమెరికా) - 1956, 1972 (భౌతికశాస్త్రం)
4. ఫ్రెడరిక్ శాంగర్ (బ్రిటన్) - 1958, 1980 (రసాయనశాస్త్రం)
నోబెల్ పురస్కారాలు : మొదటి విజేతలు
* భౌతిక శాస్త్రం: విలియం రాంట్‌జెన్ (జర్మనీ)
* రసాయన శాస్త్రం: జాకోబ్స్ హెన్రికస్ వాంట్ హాఫ్ (నెదర్లాండ్స్)
* వైద్యశాస్త్రం: ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్ (జర్మనీ)
* సాహిత్యం: సల్లీ ప్రుదొమ్మే (ఫ్రాన్స్)
* శాంతి: జీన్ హెన్రీ డ్యూనాంట్ (స్విట్జర్లాండ్), ఫ్రెడరిక్ పాసీ (ఫ్రాన్స్)
* ఆర్థికశాస్త్రం: రాగ్నార్ ఫ్రిష్ (నార్వే), జాన్ టింబర్‌జెన్ (నెదర్లాండ్స్)
నోబెల్ పురస్కారాలు పొందిన భారతీయులు
1. రవీంద్రనాథ్ ఠాగూర్ - 1913 (సాహిత్యం)
2. చంద్రశేఖర్ వెంకటరామన్ - 1930 (భౌతికశాస్త్రం)
3. హరగోబింద్ ఖొరానా - 1968 (వైద్యశాస్త్రం)
4. మదర్ థెరిసా - 1979 (శాంతి)
5. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ - 1983 (భౌతికశాస్త్రం)
6. అమర్త్యసేన్ - 1998 (ఆర్థికశాస్త్రం)
7. వెంకటరామన్ రామకృష్ణన్ - 2009 (రసాయనశాస్త్రం)
8. కైలాష్ సత్యార్థి - 2014 (శాంతి)
* రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ పురస్కారం పొందిన తొలి ఆసియావాసిగా కూడా చరిత్ర సృష్టించారు.
* హరగోబింద్ ఖొరానా 1968లో రాబర్ట్ డబ్ల్యూ హోల్లీ (అమెరికా), మార్షల్ డబ్ల్యూ నిరెన్‌బర్గ్ (అమెరికా)లతో కలసి నోబెల్ వైద్యశాస్త్ర బహుమతిని పంచుకున్నారు.
* 1983లో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అమెరికాకు చెందిన విలియం ఏ. ఫౌలర్‌తో కలిసి నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతిని అందుకున్నారు.
* 2009లో వెంకటరామన్ రామకృష్ణన్ అమెరికాకు చెందిన థామస్ ఏ. స్టిట్జ్, ఇజ్రాయెల్‌కు చెందిన అదా ఇ. యోనత్‌తో కలిసి నోబెల్ రసాయన శాస్త్ర బహుమతిని పంచుకున్నారు.
* 2014లో కైలాష్ సత్యార్థి పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్‌తో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతిని గెలుపొందారు.
* హరగోబింద్ ఖొరానా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌లు నోబెల్ పురస్కారాలు పొందేనాటికి అమెరికా పౌరసత్వాలను కలిగి ఉన్నారు. వెంకటరామన్ రామకృష్ణన్ అమెరికా, బ్రిటిష్ పౌరసత్వాలను కలిగి ఉన్నారు.
* భారతీయ మూలాలు కలిగిన విదేశీ నోబెల్ గ్రహీతలుగా రోనాల్డ్ రాస్ (1902, వైద్యశాస్త్రం), రుడ్యార్డ్ కిప్లింగ్ (1907, సాహిత్యం)లు గుర్తింపు పొందారు. వీరు బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. బ్రిటన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. భారతీయ మూలాలున్న బ్రిటన్ పౌరుడు వీఎస్ నైపాల్ 2001లో సాహిత్య నోబెల్‌ను అందుకున్నారు.
* 1901 నుంచి 2018 వరకు 590 నోబెల్ బహుమతులను 935 మందికి, సంస్థలకు ప్రకటించారు. వీరిలో 51 మంది మహిళలు ఉన్నారు. కొందరు వ్యక్తులు, సంస్థలు ఈ పురస్కారాలను రెండుసార్లు పొందిన నేపథ్యంలో ఈ సంఖ్య 904 వ్యక్తులు, 24 సంస్థలుగా ఉంది.
వైద్యశాస్త్రం
* ఈ పురస్కారాన్ని ఇప్పటివరకు 109 సార్లు ప్రకటించారు. మొత్తం గ్రహీతలు 216 మంది. వీరిలో మహిళా విజేతలు 12 మంది. ఈ అవార్డు అందుకున్నవారిలో అత్యంత పిన్న వయస్కుడు 32 ఏళ్ల ఫ్రెడ్రిక్ జి బాంటింగ్. ఇన్సులిన్‌పై చేసిన పరిశోధనకు 1923లో ఈ అవార్డును అందుకున్నారు. అత్యంత వృద్ధ పరిశోధకుడు 87 ఏళ్ల పేటన్ రౌస్. కణితుల పెరుగుదలకు కారణమయ్యే వైరస్‌లపై చేసిన పరిశోధనకు 1966లో ఈ అవార్డు అందుకున్నారు.
భౌతికశాస్త్రం
* ఇప్పటివరకు భౌతికశాస్త్ర నోబెల్ పురస్కారాన్ని 112 సార్లు ప్రకటించారు. మొత్తం గ్రహీతలు 210 మంది. వీరిలో మహిళా విజేతలు ముగ్గురు. 1915లో ఈ అవార్డు అందుకున్న 25 ఏళ్ల లారెన్స్ బ్రాగ్ అత్యంత పిన్న వయస్కుడు. అత్యంత పెద్ద వయస్కుడు అమెరికాకు చెందిన 96 ఏళ్ల ఆర్థర్ ఆష్కిన్ (2018).
రసాయనశాస్త్రం
* 1901 నుంచి 2018 వరకు 110 సార్లు రసాయనశాస్త్ర నోబెల్‌ను ప్రదానం చేశారు. మొత్తం విజేతలు 181. వీరిలో మహిళలు ఐదుగురు. ఈ పురస్కారాన్ని పొందిన అత్యంత పిన్న వయస్కుడు 35 ఏళ్ల ఫ్రెడరిక్ జోలియట్ (1935). అతి పెద్ద వయస్కుడు 85 ఏళ్ల జాన్ బెనెట్ ఫెన్ (2002).
సాహిత్యం
* 1901 నుంచి 2017 వరకు 110 సార్లు సాహిత్య నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మొత్తం విజేతలు 114 మంది. వీరిలో మహిళలు 14 మంది. ఈ పురస్కారాన్ని పొందిన అతి పిన్న వయస్కుడు 41 ఏళ్ల రుడ్యార్డ్ కిప్లింగ్ (1907). అతి పెద్ద వయస్కుడు 88 ఏళ్ల డోరిస్ లెస్సింగ్ (2007).
శాంతి
* ఇప్పటివరకు మొత్తం 99 నోబెల్ శాంతి పురస్కారాలను ప్రకటించారు. మొత్తం 106 మంది, 27 సంస్థలు దీన్ని గెలుచుకున్నాయి. వీరిలో మహిళలు 17 మంది. 2014లో ఈ పురస్కారాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలు 17 ఏళ్ల మలాలా యూసఫ్‌జాయ్. అతిపెద్ద వయస్కుడు 87 ఏళ్ల జోసఫ్ రాట్ బ్లాట్ (1995).
ఆర్థికరంగం
* 1969 నుంచి 2018 వరకు ఆర్థికశాస్త్ర నోబెల్‌ను 50 సార్లు ప్రకటించారు. మొత్తం విజేతలు 81 మంది. వీరిలో ఒక మహిళ ఉన్నారు. ఈ పురస్కారాన్ని పొందిన అతి పిన్న వయస్కుడు 51 ఏళ్ల కెన్నెత్ జె అర్రో (1972), అతిపెద్ద వయస్కుడు 90 ఏళ్ల లియోనిడ్ హార్విక్జ్ (2007).