ఉచిత విద్యకు ఛలో జర్మనీ!

ఇటీవలి కాలంలో భారతీయ విద్యార్థులు చాలామంది ఉచిత విద్యను అందించే జర్మనీ, స్వీడన్, ఆస్ట్రియా, నార్వేలాంటి దేశాల్లో చదువుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. కోర్సు చదవటానికి ఎలాంటి రుసుములూ ఈ దేశాల్లో చెల్లించే అవసరం లేదు. దైనందిన జీవనవ్యయం సంగతి చూసుకుంటే సరిపోతుంది!
చాలా ఐరోపా దేశాలు ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీన్ని అధిగమించటం కోసం అక్కడి విశ్వవిద్యాలయాలు ఉచిత విద్యను ప్రవేశపెట్టాయి. జర్మన్ విశ్వవిద్యాలయాలు అటానమస్‌గా ఉంటాయి. పరిశోధన, బోధనలపై ఇవి శ్రద్ధ పెడతాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆవిష్కరణలు ఈ యూనివర్సిటీల ద్వారానే జరిగాయి. పరిశోధన విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు జర్మనీ వైపు మొగ్గుచూపుతుండటానికి బలమైన కారణమిదే.

పరిశోధన సంబంధ ప్రోగ్రాములు చాలా జర్మనీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి. వీటి వివరాలను www.research-in-germany.de/52/home.html లింకు ద్వారా తెలుసుకోవచ్చు.
జర్మనీలో అన్ని విశ్వవిద్యాలయాలూ సెప్టెంబర్లో ప్రవేశాలు నిర్వహిస్తాయి. దరఖాస్తు గడువులు ఫిబ్రవరి 15 నుంచి మే 31 వరకూ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీలు మార్చిలో ప్రవేశాలు కల్పిస్తాయి. ఇలాంటి విద్యాసంస్థల్లో నవంబరు 15 నుంచి జనవరి చివరివరకూ దరఖాస్తులు పంపుకోవచ్చు. జర్మనీలో అత్యధిక కోర్సులకు బోధన రుసుములుండవు. కానీ కొన్ని విద్యాసంస్థలు ఏడాదికి 300-500 యూరోలను రుసుముగా వసూలు చేస్తాయి. విద్యాపరంగా అత్యుత్తమ రికార్డు ఉన్నవారికి ఉపకార వేతనాలూ లభిస్తాయి. www.daad.org లో వివరాలు చూడవచ్చు. జర్మన్ విశ్వవిద్యాలయాలు అందించే అత్యధిక ఇంటర్నేషనల్ మాస్టర్ ప్రోగ్రాములను ప్రత్యేకంగా ఇంగ్లిష్ మాధ్యమంలో బోధిస్తారు.
ప్రవేశానికి అర్హతలు
అండర్ గ్రాడ్యుయేట్: 13 సంవత్సరాల విద్య తప్పనిసరి. (12 ఏళ్ళు+ యూనివర్సిటీ నుంచి ఏడాది). ఈ అర్హత లేనివారు ఏడాది ఫౌండేషన్ కోర్సు చేయాల్సివుంటుంది. లేదా 10 ఏళ్ళ విద్య+ 3 ఏళ్ళు డిప్లొమా. IELTS 6.0 ఓవరాల్/ TOEFL 80 పాయింట్లు
మాస్టర్స్: 15 & 16 సంవత్సరాల విద్య 65 శాతం మార్కులతో. లేదా సంబంధిత సబ్జెక్టులో 2.3 GPA. IELTS 6.0 ఓవరాల్/ TOEFL 85 పాయింట్లు
ఎంబీఏ: సంబంధిత సబ్జెక్టుల్లో 15 & 16 సంవత్సరాల విద్య. IELTS 6.5 / TOEFL 85 పాయింట్లు నిర్వాహక హోదాలో పని అనుభవం 2-3 సంవత్సరాలు GMAT - 550 (తప్పనిసరి)
ప్రవేశాలకు తీసుకునే వ్యవధి: 2-3 నెలలు
అడ్మిషన్ తర్వాత...
జర్మనీ వీసా ప్రక్రియ, డాక్యుమెంటేషన్ చాలా సున్నితం. ఈ ప్రక్రియలో అనుభవజ్ఞుల సాయం, మార్గదర్శకత్వం తీసుకుంటే మేలు.
¤ వీసా సమయంలో 7800 యూరోలను బ్యాంక్ డీడీగా చూపాల్సివుంటుంది. ఇది లేకుండా వీసా పొందటం చాలా కష్టం.
వీసా వివరాల కోసం చూడాల్సిన లింక్: http://vfs-germany.co.in/south/index.aspx
ఏమిటి ప్రయోజనాలు?
¤ యు.కె., ఆస్ట్రేలియా, కెనడా విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థుల నుంచి 7-10 లక్షలను రుసుముగా వసూలు చేస్తున్నాయి. కానీ పైన పేర్కొన్న ఐరోపా దేశాలు మాత్రం ఉచిత విద్యను అందిస్తూ 5-7 లక్షలను అంతర్జాతీయ విద్యార్థులపై వెచ్చిస్తున్నాయి.
¤ ఈయూ దేశాల్లో 20 లక్షలమంది సిబ్బంది కొరత ఉంది. మానవ వనరుల అలభ్యత, జనాభా వృద్ధి తగ్గిపోవటం కారణంగా ఈ దేశాలు ఉచిత విద్యను అందిస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.
¤ Shcengien వీసా ద్వారా యూరపియన్ యూనియన్లోని 14 దేశాల్లో ప్రయాణించటానికీ, పని చేయటానికీ వీలవుతుంది. ఈయూ దేశాలన్నీ అభివృద్ధి చెందినవీ, సాంకేతికంగా మెరుగైనవీ. ఇవి ప్రసిద్ధ పర్యాటక ప్రాధాన్యమున్న దేశాలు కూడా. వీటన్నిటికీ ఉమ్మడి కరెన్సీ యూరో.
¤ కామన్‌వెల్త్ దేశాల్లో అడ్మిషన్ పొందటం చాలా తేలిక. కానీ వీసా దొరకటం చాలా కష్టం. కానీ ఈయూ దేశాల్లో అడ్మిషన్ పొందటం కష్టం కానీ వీసా చాలా తేలిగ్గా లభిస్తుంది. ఈ ఎంబసీలు విద్యార్థుల ఆస్తివివరాల గురించి పట్టించుకోవు. జర్మనీని మినహాయిస్తే మిగిలినదేశాలకు ఏ ఒక్క వీసా దరఖాస్తూ ఇప్పటివరకూ తిరస్కరణకు గురికాలేదు. ఒకవేళ తిరస్కరించినప్పటికీ పాస్‌పోర్టుపై రిజెక్షన్ స్టాంప్ వేయరు!
¤ చదువుతూనే పనిచేసుకోగలిగే వెసులుబాటు ఉంది. అంతర్జాతీయ విద్యార్థులు వారానికి 20 గంటలు పనిచేయటానికి అనుమతి ఉంది. జర్మనీ ఏడాదిలో 90 పూర్తిరోజుల extra work facility అందిస్తోంది (ఏడాదిలో 90 రోజులు+ వారానికి 20 గంటల పని). కోర్సులు పూర్తవుతూనే ప్రసిద్ధ బహుళజాతి సంస్థల్లో 'పెయిడ్ ఇంటర్న్‌షిప్స్'కు అవకాశమిచ్చే ఏకైక దేశం జర్మనీ.
¤ కోర్సులు పూర్తయిన ఏడాది వరకూ విద్యార్థులు ఆ దేశంలోనే కొనసాగుతూ ఉపాధి అన్వేషణ చేసుకునే వెసులుబాటుంది.

Ask the Expert
Click Here..