అమెరికా డిగ్రీకి SAT స్కోరు!

పీజీ కోర్సులతో పోలిస్తే బ్యాచిలర్ కోర్సులు చదవటానికి అమెరికా వెళ్ళే విద్యార్థుల సంఖ్య తక్కువే. ఇలాంటి విద్యార్థులు 12వ తరగతిలో రాసే పరీక్ష SAT (Scholastic Aptitude Test). ఈ పరీక్ష స్వరూపం, సిద్ధమవ్వాల్సిన విధానం పరిశీలిద్దాం!
యు.ఎస్.లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవటానికి తప్పనిసరి పరీక్ష అయిన SATను 'కాలేజ్ బోర్డ్' అనే లాభాపేక్ష లేని సంస్థ రూపొందించి నిర్వహిస్తోంది. ఇదొక రీజనింగ్ టెస్ట్. మూడు గంటల వ్యవధిలో విద్యార్థి verbal, mathematical, reasoning నైపుణ్యాలను అంచనా వేస్తుంది. ఐదేళ్ళపాటు ఈ టెస్టు స్కోర్లు చెల్లుబాటవుతాయి. SAT రాయదల్చిన విద్యార్థులు http://sat.collegeboard.com/register లింకు ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ రుసుము 102 డాలర్లు. SATలో మూడు ప్రధాన విభాగాలుంటాయి. క్రిటికల్ రీడింగ్, రైటింగ్, మాథమ్యాటిక్స్. మొత్తం 10 ఉప విభాగాలుంటాయి.

క్రిటికల్ రీడింగ్
విద్యార్థి అవగాహన నైపుణ్యాలను ఇందులో పరీక్షిస్తారు. 25 నిమిషాల విభాగాలు రెండు, 20 నిమిషాల విభాగం ఒకటి ఉంటాయి. వీటిలో 48 రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు, 19 సెంటెన్స్ కంప్లీషన్ ప్రశ్నలు ఉంటాయి. స్కోర్లు 200-800 మధ్య ఉంటాయి. కాలవ్యవధి 70 నిమిషాలు. ఈ మాడ్యూల్‌లో కింది ఉప విభాగాలుంటాయి.
సెంటెన్స్ కంప్లీషన్: విద్యార్థికి పదజాలం ఎంత బాగా తెలుసో, వాక్యనిర్మాణంపై అవగాహన ఎంత ఉందో పరీక్షిస్తారు. సరైన జవాబును మల్టిపుల్ చాయిస్ జవాబుల్లోంచి ఎంచుకుని ప్రతి వాక్యంలో ఇచ్చే ఒకటి/ రెండు ఖాళీల్లో నింపాలి.
పాసేజ్ బేస్డ్ రీడింగ్: దీనిలో రెండు రకాలుంటాయి. ఒకాబ్యులరీ ఇన్ కాంటెక్ట్స్, లిటరల్ కాంప్రహెన్షన్. హ్యుమానిటీస్, సోషల్‌స్టడీస్, ప్రకృతిశాస్త్రాలు, కాల్పనిక సాహిత్యం వంటి విభిన్న రంగాల నుంచి పాసేజ్‌లను ఎంచుకుంటారు.
రైటింగ్
దీనికి కేటాయించే మొత్తం సమయం 60 నిమిషాలు. దీనిలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు 70 శాతం, సంక్షిప్త వ్యాసం 30 శాతం వెయిటేజీతో ఉంటాయి. ఎరర్ ఐడెంటిఫికేషన్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్రశ్నలు వ్యాకరణ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తాయి. తార్కికంగా అమర్చిన ఆలోచనలను అర్థం చేసుకునే ప్రతిభను పేరాగ్రాఫ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రశ్నలు పరీక్షిస్తాయి. వ్యాసానికి 25 నిమిషాల వ్యవధినిస్తారు.
మాథమ్యాటిక్స్
దీన్ని క్వాంటిటేటివ్ విభాగం అనీ అంటారు. దీనిలో మూడు విభాగాలుంటాయి.
¤
25 నిమిషాల విభాగం: దీనిలో 20 మల్టిపుల్ చాయిస్ (ప్రాబ్లమ్ సాల్వింగ్) ప్రశ్నలుంటాయి. 25 నిమిషాల్లో పూర్తిచేయాల్సివుంటుంది.
¤
25 నిమిషాల విభాగం: దీనిలో 8 మల్టిపుల్ చాయిస్ (ప్రాబ్లమ్ సాల్వింగ్) ప్రశ్నలు, 10 గ్రిడిన్ ప్రశ్నలుంటాయి. 25 నిమిషాల్లో పూర్తిచేయాల్సివుంటుంది.
¤
చిన్న విభాగం: దీనిలో 16 మల్టిపుల్ చాయిస్ (ప్రాబ్లమ్ సాల్వింగ్) ప్రశ్నలుంటాయి. 20 నిమిషాల్లో ముగించాలి.
వేరియబుల్/ఈక్వేషన్ విభాగం పేరుతో డమ్మీ విభాగం కూడా ఉంది. దీనికి 20 నిమిషాల వ్యవధి. వ్యక్తిగత స్కోరుకు దీన్ని పరిగణించరు. SAT భవిష్యత్ ఎడిషన్ కోసం మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు.
SAT లో మూడు విభాగాలకూ విడిగా- రీడింగ్ స్కోర్, రైటింగ్ స్కోర్, మాథ్ స్కోర్ అని ఉంటాయి. ప్రతి విభాగంలో సగటు స్కోరు 500.
¤ టెస్ట్ పూర్తయిన తర్వాత నాలుగు విశ్వవిద్యాలయాలకు ఉచితంగా అధికారిక రిపోర్ట్ చేయవచ్చు.
¤ అదనంగా స్కోరును రిపోర్టు చేయటానికి ప్రతి విశ్వవిద్యాలయానికీ 10.5 డాలర్ల ఖర్చవుతుంది.
¤ SAT సబ్జెక్టు టెస్టులు కూడా ఉంటాయి. అయితే చాలా కొద్ది యూనివర్సిటీలే వీటిని పరిగణనలోకి తీసుకుంటాయి కాబట్టి వీటిని రాసేవారి సంఖ్య బాగా తక్కువ.

Ask the Expert
Click Here..