పరాయి దేశంలో 10 సూత్రాలు!

చదువు బాటలో విదేశాలకు చలో అంటున్నవాళ్లు కొందరు... కలల కొలువుకు దేశం దాటుతున్నవాళ్లు ఇంకొందరు... ఇలా పరాయి దేశాలకు ఏటా వలస వెళుతున్న యువత సంఖ్య అక్షరాలా రెండున్నర లక్షలు... అక్కడ వరించే అవకాశాలే కాదు... వహించని అవలక్షణాలు కాచుకొని కూర్చుంటాయ్‌... ఎంచుకున్న మార్గం సక్రమమైతే ఎదురులేని విజేతలవుతాం... సరదాలు, చెడు సావాసాల్లో మునిగితే... వినాశకాల ఉధృతిలో కొట్టుకొని పోతాం... మరి అనుకున్న గమ్యం చేరాలంటే ఏం చేయాలి? కాలు పెట్టింది మొదలు కార్యం పూర్తయ్యేవరకు ఎలా మసలు కోవాలి? ఈ అంశాలను స్పశిస్తూ ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపల్‌ ఎం. నాగేశ్వరరావు, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళుతున్న తన స్నేహితుల పిల్లలకు ఓ ఉత్తరం రాశారు. విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఉపయుక్తంగా ఉన్న ఆ మేటి సూత్రాలు మీకోసం.

అమెరికా వెళ్లడమంటే భూగోళంపై మనం ఉన్న ప్రదేశం నుంచి సరిగ్గా అటువైపుకి వెళ్లడమే. కోట్లమంది భారతీయుల్లో అంతటి అవకాశం దక్కిన అతికొద్ది మందిలో నువ్వొకరివి కావడం నీ అదృష్టం. అమ్మనాన్నలు, కుటుంబం, చదువు చెప్పిన టీచర్లు, చుట్టూ ఉన్న సమాజం, అన్నీ ఇచ్చిన జన్మభూమి... ఇలా అందరివల్లా... అన్నింటివల్లా నీ జీవితం ఇలా గొప్పగా రూపుదిద్దుకొంటోంది. నువ్వెప్పటికీ రుణపడి ఉండాల్సిన వ్యక్తులు వీరు. అమెరికా చదువు నీలో పరిణతి తేవాలి. నీ జీవితానికి ఒక సార్థకత ఏర్పరచాలి. బహుముఖంగా నువ్వు ఎదిగే అవకాశాలున్న చోటుకి వెళ్తున్న ఈ సంతోష సమయంలో నీకు ఏం బహుమానం ఇవ్వాలా ఆలోచించా. నీకు చెప్పగలిగిన, చెప్పవలసిన విషయాలే మంచి కానుక అని భావించి ఈ లేఖ రాస్తున్నా. చదివి నువ్వూ ఆలోచించు. నచ్చితే ఆచరించు. అమెరికాలో ఉన్నంతకాలం గుర్తుపెట్టుకో! మనం ఏం ఆలోచిస్తామో అదే అవుతాం అంటారు. జీవితంలో లక్ష్యం లేని వ్యక్తి అందరికన్నా పేదవాడని తెలుసుకో.

1. అమెరికా అంటే అభివృద్ధికి నమూనా. ఎన్నో విశిష్టాంశాల సమాహారం. శాస్త్ర విజ్ఞానాల ఖని. స్వేచ్ఛా సమానత్వ భావనలకు పుట్టినిల్లు. ప్రజాస్వామ్యాన్ని పాదుగొల్పి పరిపుష్ఠం చేసిన జార్జి వాషింగ్టన్‌, థామస్‌ జఫర్సన్‌, అబ్రహాం లింకన్‌, రూజ్‌వెల్ట్‌, మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ జూనియర్‌ల జన్మభూమి. ఆధునిక ప్రపంచాన్ని మలుపుతిప్పిన స్టీవ్‌ జాబ్స్‌, బిల్‌గేట్స్‌, లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్‌, బరాక్‌ ఒబామాల కర్మభూమి. అలాంటి దేశం నీకిప్పుడు రెండో ఇల్లు కాబోతోంది. అందుకే ఆ దేశ సంస్కృతిలోని గొప్పగుణాల గురించి తెలుసుకో. నీ దేశానికి ఎలా ఉపయోగించాలో నేర్చుకో. స్వామి వివేకానంద అన్నట్లు నీ భవిష్యత్తుకి ఇప్పుడు నువ్వే సృష్టికర్తవు.
2. నువ్వు అమెరికా వెళ్తున్నది ఉన్నత చదువుల కోసం. చదువుకుంటూ ఆ పనులూ ఈ పనులూ చేసి సంపాదంచుకోవడం నీ ప్రధాన లక్ష్యం కాకూడదు. శ్రమించడం, సొంత ఖర్చుల కోసం సంపాదించడం మంచిదే కానీ అవి నీ లక్ష్యాన్ని దారిమళ్లించకూడదు. మన దేశం నుంచి వెళ్లిన చాలామంది విద్యార్థులు ఇలాచేసి మొదటికే మోసం తెచ్చుకొంటారు. నీ చదువుకి నష్టం చేయని పార్ట్‌టైం ఉద్యోగమైతేనే చెయ్యి. లేదంటే వదిలెయ్యి. నీ సర్వశక్తులూ చదువుమీదే పెట్టు. మండేలా అన్నట్లుగా... ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగపడే అత్యంత పదునైన ఆయుధం విద్య మాత్రమే. నీకు నీ గమ్యం ఏమిటో స్పష్టంగా తెలిస్తే ప్రపంచం మొత్తం పక్కకు తొలగి మరీ నీకు దారి ఇస్తుంది.
3. నీ కోర్సు పూర్తయ్యాక మంచి ఉద్యోగం కోసం ఒక రెజ్యూమే తయారుచేసుకొంటావు కదా! ఎక్కడ పుట్టావో, ఏమేం చదివావో, ఎన్నెన్ని మార్కులొచ్చాయో అందులో రాయడం అందరూ చేస్తారు. కానీ ఉద్యోగం ఎందుకివ్వాలో నువ్వు చెప్పగలగాలి. చదువులు, మార్కులు, సర్టిఫికెట్లకంటే నీలో ఇంకేవో మేలిమి గుణాలు ఉన్నాయని నువ్వు నిరూపించాలి. అందుకోసం విజ్ఞానంతోపాటు జీవిత పరిజ్ఞానం పెంచుకో. మంచి పుస్తకాలు చదువుతూ ఉండు. సెలవులు దొరికినప్పుడు కొత్త కొత్త ప్రదేశాలకూ మ్యూజియాలకూ వెళ్లు. మీ అధ్యాపకులతో మాట్లాడి ప్రత్యేక ఎసైన్‌మెంట్లు తీసుకో.

నీ ఆసక్తిని బట్టి ఈ పుస్తకాలతో నీ పఠనాన్ని ప్రారంభించవచ్చు... పంచతంత్రం, మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌ (మహాత్మాగాంధీ), మహాభారత, రామాయణ (సి.రాజగోపాలాచారి), వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌ (అబ్దుల్‌కలాం), ఫ్రీడం ఫ్రమ్‌ ఫియర్‌ (ఆంగ్‌ సాంగ్‌ సూకీ), లెగసీ (సుధామీనన్‌), స్టే హంగ్రీ స్టే ఫూలిష్‌ (రష్మీ బన్సాల్‌), లైట్‌ ఫ్రం మెనీ ల్యాంప్స్‌ (లిలియన్‌ ఐషర్‌ వాట్సన్‌), ఎంపైర్‌ ఆఫ్‌ ది మైండ్‌ (డెనిస్‌ వెయిట్లీ), ది సీక్రెట్‌ (రొండా బర్న్‌), పీపుల్స్‌ హిస్టరీ ఆఫ్‌ యు.ఎస్‌.ఎ. (హొవార్డ్‌ జిన్‌). వీటిలో కొన్ని పుస్తకాలకు తెలుగు అనువాదాలూ లభ్యమవుతున్నాయి. విలువైన పుస్తకాలు ఒకచోట ఉంటే అక్కడ విశ్వవిద్యాలయం ఉన్నట్లే. సేకరిస్తూ... చదువుతూ ఉండు. వారానికి ఒక పుస్తకం చదివినా రెండేళ్లలో 100 పుస్తకాల జాబితా నీ ప్రొఫైల్‌కి జోడవుతుంది. ఇంటర్‌నెట్‌లో 'ఇన్‌స్పైరింగ్‌ లెక్చర్స్‌' ఎన్నో లభ్యం అవుతున్నాయి. రాండీ పౌష్‌ 'లాస్ట్‌ లెక్చర్‌' తప్పకుండా విను. విద్యార్థుల కోసం చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలూ నెట్‌లో ఉన్నాయి. ఇవన్నీ నువ్వు చేస్తే ప్రపంచంలో ఏ అత్యుత్తమ కంపెనీ నిన్ను వదులుకోదు సరికదా, నీ వెంట పడుతుంది. అసలు నువ్వే వందల వేలమందికి ఉపాధిని కల్పించే మార్గదర్శివి కాగలవు.

4. జీవితమంటే మరేమిటో కాదు, విలువైన సమయమే. ఎవరికోసమైనా సమయం కేటాయించావు అంటే నీ జీవితంలో కొంత భాగాన్ని ఇచ్చినట్లే. అందుకే నీకున్న అత్యంత గొప్ప సంపద సమయం. డాలర్‌ కంటే నిమిషాన్ని విలువైనదిగా భావించు. మీ అమ్మానాన్న లక్షలు ఖర్చుపెట్టి నిన్ను అక్కడకు పంపిస్తున్నారు. ప్రాథమ్యాల్ని ఎప్పుడూ మరిచిపోకు. లక్ష్యాల్ని చేరుకోవడానికి ప్రతి నిమిషాన్నీ సక్రమంగా ఉపయోగించు. సమయపాలన సాధించావంటే దేన్నయినా ఇట్టే సాధించగలవు.
5. నీ చదువుని అమితంగా ఇష్టపడు. యాపిల్‌ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ అంటాడిలా... ''నువ్వేదైనా గొప్ప కార్యాన్ని సాధించాలంటే ఒకటే మార్గం. నువ్వు చేసే పనిని ప్రేమించడమే. నీ మనసుకి నచ్చిన పని ఇప్పటివరకు నీకు దొరకకపోతే దానికోసం నిరంతరం ప్రయత్నించు. ఎక్కడా రాజీపడకు.'' అందుకే నీ మనసు తెలుసుకో. ప్రపంచమే నీదవుతుంది. గెలుపు ఓటములను నిర్ణయించడంలో ప్రధాన పాత్ర సామర్థ్యానిది కాదు, స్వభావానిది.
6. సాలెగూటిలో చిక్కుకుపోవద్దు. ల్యాప్‌ టాప్‌, స్మార్ట్‌ ఫోన్‌లు నీకు సేవకులుగా ఉన్నంతకాలం నీ జీవితం హాయిగా ఉంటుంది. అవి నిన్నే అదుపులోకి తీసుకొన్నాయా గందరగోళమే. గంటలు గంటలు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ ప్లస్‌ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సాలెగూళ్లలో ఇరుక్కుపోతుంటారు. కంప్యూటర్‌ చాటింగ్‌, మెసేజింగ్‌ సమయాన్ని హరించివేస్తాయి. టాక్‌టైం చౌక కావచ్చు... సమయం, జీవితం చాలా విలువైనవని గుర్తించు.
7. మార్కులూ ర్యాంకులూ నీకు మంచి విశ్వవిద్యాలయాల్లో సీట్లూ, మంచి కంపెనీల్లో ఉద్యోగాలూ తెచ్చిపెట్టవచ్చు. కానీ జీవితం వేరు. సోనీ కంపెనీ ఒకప్పటి ఛైర్మన్‌ అకియో మోరిటా తన ఆత్మకథ 'మేడ్‌ ఇన్‌ జపాన్‌'లో గొప్ప విషయం చెప్పాడు. ''చదువులో మీ పనితీరు 0-100 మార్కుల మధ్యే ఉంటుంది. జీవితం వేరు. సున్న నుంచి పాతాళానికి జారిపోవచ్చు. వందకి మించి ఆకాశం వైపు పరుగులు తీయనూవచ్చు''. అందుకే చదువుకన్నా, ఉద్యోగంకన్నా జీవితం విస్తారమైంది. అందులో రాణించడానికి అవసరమైన నైపుణ్యాల్ని పెంపొందించుకో. ఇతరులు నిన్నెలా అర్థం చేసుకొంటారన్నది కాదు, నువ్వు ఇతరుల్ని సవ్యంగా అర్థం చేసుకో. నీ దృక్పథమే నీ ఉత్థాన పతనాలను నిర్ణయిస్తుంది.
8. మొదట నిన్ను నువ్వు గెలవాలి. నీ లోపాల్ని అధిగమించి నీ మీద నువ్వు అదుపు సాధించాలి. నిజమైన స్వేచ్ఛ అప్పుడే లభిస్తుంది. మనం వలస పాలనలో ఉన్నప్పుడు ఐరోపా వాసులు మన గురించి ''అక్కడి ప్రజలు కొత్తగా ఆలోచించడానికి, బాధ్యత మీద వేసుకోవడానికి ముందుకురారు. కేవలం బతుకుతెరువు మనస్తత్వం కలిగి ఉంటారు. మూఢ విశ్వాసాలతో, సోమరితనంతో, నిర్లక్ష్యంగా కాలం గడుపుతుంటారు'' అనుకొనేవారట. స్టాక్‌హోం విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ గన్నర్‌ మిర్డాల్‌ '' ఏషియన్‌ డ్రామా - యాన్‌ ఎంక్వయిరీ ఇన్‌టు పావర్టీ ఆఫ్‌ నేషన్స్‌'' అనే పుస్తకంలో ఈ మాటలు రాశారు. ఈ భావన నిజం కాబోదని నీలాంటివాళ్లు రుజువు చేయాలి. అలా చేయాలంటే అవసరమైన సామర్థ్యాల్ని నువ్వు పొందాలి. వ్యక్తిత్వం సంతరించుకోవాలి. అందుకే గాంధీజీ అన్నాడు మంచి జాతి నిర్మాణం జరగాలంటే ముందు మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలని!
9. మనదేశం గురించీ సంస్కృతి గురించీ చెప్పుకోవాలంటే గొప్ప గుణాలు చాలానే ఉన్నాయి. మనల్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలూ అలాగే ఉన్నాయి. కులమత వివక్షలు, అంధ విశ్వాసాలు, చాంధసవాదం, ప్రాంతీయ వైషమ్యాలు, కుత్సిత రాజకీయాలు అలాంటివే. పరాయి దేశాల్లో ఉన్నత విద్యావంతుల్లోనూ ఇలాంటివి కన్పించినప్పుడు ప్రవాసులమీద ఆధునిక విజ్ఞానం ప్రభావం అంతగా లేనట్లు అన్పిస్తుంది. చాలా బాధ కలుగుతుంది. వీటికి నీ సూట్‌కేసులో చోటివ్వకు. అవలక్షణాల మకిలి అంటని పరిపూర్ణ వ్యక్తిగా ప్రవాసంలో నువ్వు భాసిల్లాలి.
10. నీ మూలాల్ని మరవద్దు. నీ తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ఆశలన్నీ నీ మీదే. డబ్బు, సమయం, శక్తీ అన్నీ నీకోసం వెచ్చించారు. కుటుంబ గౌరవాన్ని పెంచే బాధ్యత నీ మీదే ఉందిప్పుడు. మంచి మార్కులతో పాసైతే, గొప్ప ఉద్యోగంలో స్థిరపడితే నలుగురికీ మేలుచేసే పనులు చేస్తుంటే, దేశానికి ఖ్యాతి తెస్తే వాళ్లకంటే సంతోషించే వాళ్లెవరూ ఉండరు. అందుకే నువ్వేం చేసినా, ఎక్కడున్నా మీ అమ్మానాన్న కళ్లల్లోని ఎదురుచూపుల్నీ కాంతిరేఖల్నీ మర్చిపోవద్దు.

కుటుంబానికీ దేశానికీ గర్వకారణంగా నిలిచిపోవాలి నువ్వు!
గుర్తుపెట్టుకో! వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక అడుగుతోనే ప్రారంభ మవుతుంది.

శుభాకాంక్షలతో... విజయీభవ!

CLICK HERE FOR ENGLISH VERSIONAsk the Expert
Click Here..