వీసా ఇంటర్వ్యూ తప్పనిసరా?

విదేశాల్లో ఉన్నతవిద్యకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఎన్నో సందేహాలుంటాయి. కొన్ని సందర్భాల్లో తదుపరి ప్రక్రియకు వెళ్లకుండా మధ్యలోనే వెనకడుగు వేసిన సంఘటనల గురించి వింటుంటాం. కానీ ఇలాంటివి సమాచారలోపం, అపోహల వల్లనే జరుగుతుంటాయి.

ప్ర: నా ప్రొఫైల్‌ ఉన్నత విదేశాల్లో ఉన్నత చదువులకు సరిపోతుందా?
: విదేశాల్లో చదవడానికి నిర్దిష్టమైన ప్రొఫైల్‌ తప్పనిసరి అని ఏమీ ఉండదు. విశ్వవిద్యాలయాలను బట్టి అడ్మిషన్‌ విధానాలు మారతాయి. అగ్రస్థానంలో నిలిచే విశ్వవిద్యాలయాలు ఎక్కువ ప్రొఫైల్‌ను అడుగుతుండొచ్చు. కానీ తక్కువ ప్రొఫైల్‌ ఉన్నవారినీ చాలా విశ్వవిద్యాలయాలు తీసుకుంటున్నాయి. కానీ కనీసం ద్వితీయశ్రేణి శాతంతో ఎక్కువ బ్యాక్‌లాగ్‌లు లేకుండా ఉండడం మంచిది.

ప్ర: ప్రక్రియ మొదలుపెట్టడానికి అనుకూల సమయమేది?
జ: మొత్తం ప్రక్రియ పూర్తవడానికి కనీసం 3 నెలల నుంచి ఒక్కోసారి ఏడాది సమయం పడుతుంది. విదేశాల్లో చదువుకోవాలనే నిర్ణయం తీసుకునే ముందు విద్యార్థులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.
* ఆసక్తి గల దేశం
* ఆసక్తి గల కోర్సు
* రాయాల్సిన పరీక్షలు
* కావాల్సిన పత్రాలు
* ఆర్థిక స్థోమతు
* అడ్మిషన్‌ విధానం
* వీసా ప్రక్రియ
* పైవాటికీ విద్యార్థుల అవసరాలకూ పొంతన
పై అంశాలపై స్పష్టత రావడానికీ, అవసరమైనవాటిని అమర్చుకోవడానికీ కొన్నిసార్లు ఎక్కువ సమయం పట్టొచ్చు. కాబట్టి ఆఖరి నిమిషంలో కంగారు పడకుండా వీలైనంత తొందరగా ప్రక్రియపై దృష్టిపెట్టడం మంచిది వీలైతే సంవత్సరం ముందుగానే.

ప్ర: ఏయే పరీక్షలను రాయాల్సి ఉంటుంది?
జ: ఎంచుకున్న దేశం, కోర్సు, సంస్థను బట్టి వేర్వేరు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. జీఆర్‌ఈ: అమెరికా, జర్మనీ దేశాల్లో పీజీ స్థాయిలో ఇంజినీరింగ్‌, ఐటీ స్పెషలైజేషన్లను అందించే సంస్థలు అడుగుతున్నాయి. జీమ్యాట్‌: ప్రపంచవ్యాప్తంగా పీజీస్థాయిలో కోర్సులు అందించే మేనేజ్‌మెంట్‌ సంస్థలు కోరుతున్నాయి.
టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌: ఆంగ్లభాషా నైపుణ్యానికి సంబంధించిన పరీక్ష కాబట్టి చాలా దేశాలు దీనిని తప్పనిసరి చేస్తున్నాయి. ఆంగ్లం మాతృభాషగా లేని మనదేశ విద్యార్థులు దీన్ని తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఎటువంటి పరీక్షలూ అడగకుండానే ప్రవేశాన్ని కల్పిస్తున్న కొన్ని సంస్థలు, దేశాలూ ఉన్నాయి.

ప్ర: నేను డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాను. డిగ్రీ పట్టా పొందకముందే దరఖాస్తు చేసుకునే వీలుందా?
జ: చేసుకోవచ్చు. ప్రొవిజనల్‌ డిగ్రీ పొందకముందే ఏ దేశానికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు నచ్చిన విశ్వవిద్యాలయంలో చేరే సమయంలో మాత్రం సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఒక విద్యాసంవత్సరం వృథా కాకుండా- చదువుతున్నపుడే దరఖాస్తు చేస్తే, వీసా తొందరగా వచ్చే అవకాశాలూ ఎక్కువగా ఉంటాయి.

ప్ర: ఎంతమేర నిధులు అవసరమవుతాయి?
జ: ఇది దేశం, విశ్వవిద్యాలయాలపై ఆధారపడి ఉంటుంది. విశ్వవిద్యాలయం, దేశాన్ని బట్టి ఖర్చు మారుతూ ఉంటుంది. పేరున్న కొన్ని విద్యాసంస్థల్లో ఫీజు కూడా ఎక్కువగానే ఉంటుంది. చాలా కొన్ని సంస్థల్లో మాత్రమే తక్కువ ఫీజులున్నాయి. ప్రాథమిక రుసుము ఏడాదికి రూ.5 లక్షల నుంచి మొదలవుతుంది. విద్యార్థులు రుణం కోసం బ్యాంకులను సంప్రదించవచ్చు.

ప్ర: చదువుకునేటపుడు సంపాదన వీలుంటుందా?
జ: తప్పకుండా. ప్రతి దేశం పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకోవడానికి చట్టపరమైన అనుమతినిస్తుంది. వారానికి 20 గంటలు, సెమిస్టర్‌ల మధ్య వ్యవధిలో పూర్తి సమయం పనిచేయవచ్చు. ఇది కూడా దేశాన్ని బట్టి మారుతుంటుంది.

ప్ర: విద్యార్థులందరికీ వీసా ఇంటర్వ్యూ తప్పనిసరా?
జ: ప్రతి ఒక్కరికీ కాదు. ఇది దేశంపై ఆధారపడి ఉంటుంది. యూఎస్‌ఏకు తప్పనిసరి. ఇతర దేశాలకు అవసరం లేదు. కానీ ప్రక్రియ జరిగేటపుడు విశ్వవిద్యాలయ అధికారులు టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూను నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఇంటర్వ్యూ విద్యార్థి ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది.Ask the Expert
Click Here..