విశ్వ విఖ్యాత విద్యాలయాలు

ప్రపంచస్థాయిలో అగ్రశ్రేణిలో నిలవటం ఏ విద్యాసంస్థకైనా గర్వకారణమే. ఉన్నత ప్రమాణాల విద్యాసంస్థల విషయంలో అమెరికా, యు.కె.లు తమ ఆధిపత్యం చాటుకున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వే... అత్యుత్తమ 10 విద్యాసంస్థలన్నీ ఇక్కడివేనని తేల్చింది. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యాసంస్థల విశిష్టత, ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందామా?.

ఉన్నతవిద్యకు సంబంధించిన సుప్రసిద్ధ నెట్‌వర్కింగ్‌ సంస్థ క్యూఎస్‌ (Quacquarelli Symonds ) ఇటీవలే వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. అంతర్జాతీయంగా మూడువేల విద్యాసంస్థల సబ్జెక్టు స్థాయి, పరిశోధన ప్రమాణాలు, విద్యాపరమైన ఖ్యాతిలను పరిశీలించి ఈ వార్షిక ర్యాంకులను రూపొందించారు. విద్యాపరంగా 62,094, ఉద్యోగ నియామకాలపరంగా 27,957 సమాచార స్పందనలను క్రోడీకరించి ఫలితాలు రూపొందించటంతో ప్రపంచంలోనే ఇది అతి పెద్ద సర్వేగా రూపొందింది.

 

మనదేశానికి చెందిన ఏ విద్యాసంస్థకూ టాప్‌ 200 జాబితాలో చోటు దొరకలేదు. ఇది నిరాశపరిచే విషయమే. దేశానికే మకుటాయమానంగా భావించే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీలు)లు ఇంకా కొన్ని కీలక అంశాల్లో వెనకబడేవున్నాయని ఈ సర్వే ద్వారా అర్థమవుతోంది. ఐఐటీ ఢిల్లీ 222, ఐఐటీ బాంబే 223 స్థానాల్లో నిలిచాయి.

ఆసియా ఖండం వరకూ చూస్తే... ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబేలు 38, 39 స్థానాల్లో ఉన్నాయి. ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ రూర్కీలు 51, 66 స్థానాలు దక్కించుకున్నాయి.

ఉత్తమ ర్యాంకులు పొందిన విశ్వవిద్యాలయాలు అమెరికాలోనే (144) ఎక్కువ. తర్వాత వచ్చే దేశాలు- యు.కె. (69), జర్మనీ (42), ఫ్రాన్స్‌ (40), జపాన్‌ (38).

అమెరికాకు చెందిన ఎం.ఐ.టి. ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఖ్యాతిని సాధించింది. రెండో స్థానం అమెరికాకే చెందిన హార్వర్డ్‌కూ, మూడో స్థానం యు.కె.లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికీ లభించాయి. తర్వాతి మూడు కూడా యు.కె. లోనివే. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ (4వ ర్యాంకు), ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ (5వ ర్యాంకు), ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ (6వ ర్యాంకు). మిగిలిన స్థానాలు వరసగా స్టాన్‌ఫర్డ్‌, యేల్‌, ద యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (కాల్‌టెక్‌), ప్రిన్స్‌టన్‌లకు దక్కాయి. చివరి రెండు సంస్థలూ పదోస్థానం పంచుకున్నాయి.

పెరిగిన ట్యూషన్‌ ఫీజు

అత్యున్నత 10 విశ్వవిద్యాలయాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చదవటానికి ట్యూషన్‌ ఫీజు ఏడాదికి 34 వేల డాలర్లకు పెరిగింది. 2007లో ఈ ఫీజు 18,500 డాలర్లు మాత్రమే ఉండేది. రూపాయి విలువ పడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో మన భారతీయ విద్యార్థులు ప్రపంచస్థాయి విద్యాభ్యాసం కోసం చేయాల్సిన ఖర్చు అధిక భారంగా పరిణమించింది.

ర్యాంకులకు ప్రమాణాలు

క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ను ఆరు అంశాల ప్రాతిపదికగా నిర్ణయించారు.
1. విద్యాపరమైన ప్రతిష్ఠ (40 శాతం)
2. ఉద్యోగావకాశాల ఖ్యాతి (10 శాతం)
3. అధ్యాపకుల- విద్యార్థుల నిష్పత్తి (20 శాతం)
4. అంతర్జాతీయ బోధన సిబ్బంది (5 శాతం)
5. అంతర్జాతీయ విద్యార్థులు (5 శాతం)
6. బోధనసిబ్బంది విజయాలు (20 శాతం)

సర్వ శ్రేష్ఠం... ఎం.ఐ.టి.

అమెరికాకు చెందిన మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎం.ఐ.టి.)ని 1861లో స్థాపించారు. నాలుగేళ్ళ తర్వాత ప్రవేశాలు మొదలయ్యాయి. ఇది ప్రైవేటు రిసెర్చ్‌ యూనివర్సిటీ. ప్రపంచ గమనంతో సంబంధమున్న బోధన, పరిశోధనలు ఇక్కడి లక్ష్యం, ఆచరణ. ఇక్కడ 5 స్కూళ్ళు, ఒక కళాశాల ఉన్నాయి. శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక విద్య, పరిశోధనలపై దృష్టి పెట్టేలా మొత్తం 34 విభాగాలున్నాయి.ఈ విద్యాసంస్థలో ఏటా అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో 4 వేలమందికీ, పోస్టుగ్రాడ్యుయేట్‌ స్థాయిలో 6,500 మందికీ ప్రవేశాలు లభిస్తాయి. అసంఖ్యాకమైన ఇంటర్‌ డిసిప్లినరీ కేంద్రాలు, ప్రయోగశాలలు, ప్రోగ్రాములు ఇక్కడి ప్రత్యేకతలు.

నోబెల్‌ విజేతల హార్వర్డ్‌

అమెరికాలోని ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్‌ ఒకటి. 1636లో దీన్ని స్థాపించారు. ఈ విద్యాసంస్థలో ప్రతి సంవత్సరం 20 వేలమంది వివిధ కోర్సుల్లో చేరుతుంటారు. అమెరికాలోని అతిపెద్ద విద్యా గ్రంథాలయం ఇక్కడే ఉంది. ఈ వర్సిటీ 46 అండర్‌ గ్రాడ్యుయేట్‌ మేజర్స్‌, 134 గ్రాడ్యుయేట్‌ డిగ్రీలూ, 32 ప్రొఫెషనల్‌ డిగ్రీలూ అందిస్తోంది.

బరాక్‌ ఒబామాతోపాటు ఎనిమిది మంది అమెరికా అధ్యక్షులు ఇక్కడే గ్రాడ్యుయేషన్‌ చేశారు. 75 మంది నోబెల్‌ బహుమతి గ్రహీతలు విద్యార్థులుగానో, ఫ్యాకల్టీ సభ్యులుగానో, అనుబంధ అధ్యాపకులుగానో ఉన్న ప్రతిష్ఠాత్మక సంస్థ ఇది.

ప్రాచీన కేంద్రం... కేంబ్రిడ్జి

యు.కె.లో ఉన్న కేంబ్రిడ్జి ప్రపంచంలోని ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటి. 1209లో స్థాపితమైంది. ఈ విద్యాసంస్థలో ఎన్నో సెల్ఫ్‌ గవర్నింగ్‌, స్వతంత్ర కళాశాలలున్నాయి. ఇవి గణితం నుంచి సైన్స్‌, హ్యుమానిటీస్‌, సంగీతం, ఆర్ట్‌, సాహిత్యం వరకూ వైవిధ్యమైన కోర్సులను అందిస్తున్నాయి. మౌలికమైన పరిశోధనకూ, విద్యాపరమైన ఉత్కృష్టతకూ పేరున్న సంస్థ ఇది. లెక్చర్లు, సెమినార్లు, ప్రాక్టికల్‌ తరగతుల ద్వారానే కాకుండా తమ రంగాల్లో ప్రపంచస్థాయి నిపుణులైనవారి బోధన అందించటం ఇక్కడి ప్రత్యేకత.

నాణ్యమైన విద్యకోసం దూరతీరాలకు...

ఈ సర్వే ద్వారా ఆసక్తికరమైన కొన్ని అంశాలు వెల్లడయ్యాయి. వాటిలో ఒకటి - సాంకేతిక కళాశాలల ఆధిపత్యం. ప్రపంచ ర్యాంకింగ్‌లో అప్రతిహతంగా ప్రథమస్థానంలో నిలిచిన ఎం.ఐ.టి. మాదిరిగానే ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విద్యాసంస్థలు ర్యాంకుల విషయంలో ముందంజలో నిలిచాయి. ఉదాహరణకు... ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ (6), యు.ఎస్‌.లోని కాల్‌టెక్‌ (10), స్విట్జర్లాండ్‌లోని ETH Zurich ) (13)

 

ఐఐటీ (ఢిల్లీ)

చెప్పుకోదగ్గ మరో అంశం- ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళటం గతంలో కంటే పెద్దసంఖ్యలో పెరగటం. అత్యుత్తమ 100 విశ్వవిద్యాలయాల్లో ఈ పెరుగుదల 10 శాతం ఉంది. టాప్‌ 700 ర్యాంకులు సాధించిన కళాశాలల్లో కూడా అంతర్జాతీయ విద్యార్థులు 4 శాతం పెరగటం విశేషం.

ప్రధానంగా యు.ఎస్‌., యు.కె., ఆస్ట్రేలియాలకు భారత్‌, చైనా, కొరియాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్యకోసం వెళుతున్నారు. ఆసియా దేశాలైన సింగపూర్‌, హాంకాంగ్‌, మలేషియాలు కూడా పెద్దసంఖ్యలో విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.Ask the Expert
Click Here..