విదేశీ విద్యకు ఛలో!

నాణ్యమైన విద్యతో పాటు నూతన భాషా సంస్కృతుల పరిచయం, కొత్త స్నేహాలు పొందే అవకాశాన్నిస్తుంది విదేశీ విద్య. అందుకే ప్రతి సంవత్సరం నాలుగు లక్షలకు మించిన విద్యార్థులు ఇతరదేశాల విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందుతున్నారు. గత ఐదేళ్ళలో ఈ సంఖ్య నిలకడగా పెరుగుతోంది. తగిన అర్హతలతో సిద్ధమై వివిధ కోర్సులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించటానికి ఇదే సరైన తరుణం!.

డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ముందు ప్రధానంగా రెండు అవకాశాలుంటాయి. మొదటిది కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ, రెండోది ఉన్నత విద్యాభ్యాసం. పైచదువుల విషయంలోనూ రెండు దారులున్నాయి. 1) మనదేశంలోనే చదువు కొనసాగించటం 2) ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవటం. విదేశాల్లో చదువుకోవాలనుకున్నవారు ప్రాథమికంగా ఏమేం అవసరం, దానికి తగిన ప్రణాళిక ఎలా వేసుకోవాలి అనేవి తెలుసుకోవాలి.

స్థూలంగా పరిశీలిస్తే... ఏ దేశంలోనైనా ప్రవేశాలు పొందటానికి 8 రకాల అంశాలు ప్రధానం.

1) మంచి మార్కుల శాతం 2) ఇంగ్లిష్‌లో నైపుణ్యం తెలిపే రుజువు (ఐఈఎల్‌టీఎస్‌/టోఫెల్‌) 3) సంబంధిత విశ్వవిద్యాలయం/ విభాగం నిర్దేశించిన జీఆర్‌ఈ/జీమ్యాట్‌/శాట్‌/ఏసీటీ స్కోరు 4) రికమెండేషన్‌ లేఖలు 5) ఆర్థిక డాక్యుమెంట్ల రుజువు 6) స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ 7) రెజ్యూమె 8) సంబంధిత అనుభవం సూచించే ధ్రువపత్రం (వర్తించేవారికి మాత్రమే)

ఏ దేశంలో?

విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు వారి అవసరాలనుబట్టి ప్రధానంగా 15కు పైగా దేశాల్లో చదువుకునే అవకాశముంది. వాటిలో ఒక దేశాన్ని ఎంచుకుని, అవసరమైన విధివిధానాలను ప్రారంభించి దరఖాస్తు ప్రక్రియ జరిగేలా చూడడానికి అనుకూల సమయమిదే.

మనదేశం నుంచి ఎక్కువమంది విద్యార్థులు ఉన్నతవిద్య కోసం ఎంచుకునే దేశాల జాబితా ఇలా ఉంది.
* యూఎస్‌ఏ
* ఉచిత విద్యనందించే దేశాలు- జర్మనీ, స్వీడన్‌, ఆస్ట్రియా మొదలైనవి
* కెనడా
* ఆస్ట్రేలియా
* న్యూజీలాండ్‌
* యూకే
* ఐర్లాండ్‌, సింగపూర్‌, సైప్రస్‌, ఫ్రాన్స్‌ మొదలైనవి

ప్రవేశాల సమయం

విద్యార్థి ఏ దేశంలో చదవాలనుకుంటున్నదీ నిర్ణయించుకున్నాక ఆ దేశంలో ప్రవేశాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసుకోవాలి. చాలా దేశాలు ఒకసారి ప్రవేశాలు పూర్తవగానే వెంటనే మరోదశ ప్రవేశ ప్రక్రియను మొదలుపెడతాయి. ఎక్కువ దేశాల్లోని విద్యాసంస్థలు జులై లేదా సెప్టెంబర్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తాయి.

యూఎస్‌ఏ: ఆగస్టు/సెప్టెంబర్‌ తర్వాత జనవరి

జర్మనీ: సెప్టెంబర్‌/అక్టోబర్‌ తర్వాత మార్చి

కెనడా: సెప్టెంబర్‌ తర్వాత జనవరి

ఆస్ట్రేలియా/ న్యూజీలాండ్‌: జులై/ ఆగస్టు తర్వాత నవంబర్‌ (కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఫిబ్రవరి, మార్చి)

యూకే: సెప్టెంబర్‌/ అక్టోబర్‌ తర్వాత జనవరి

సింగపూర్‌: జులై అనంతరం అక్టోబర్‌, జనవరి

ఎక్కువ దేశాలు సెప్టెంబర్‌/ అక్టోబర్‌లలో ప్రవేశాలు ప్రారంభిస్తాయి.

ప్రవేశాల ప్రక్రియ ఏడాదిలో చాలాసార్లు జరుగుతున్నప్పటికీ, జులై, సెప్టెంబరుల్లోనే భారీగా జరుగుతాయి. విద్యార్థులు కూడా జులై, సెప్టెంబర్‌ల్లోనే కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఆ సమయంలోనే ఎక్కువ ఆప్షన్లు ఉండడంతోపాటు కోర్సు పూర్తయిన తర్వాత సమయమూ వృథా కాదు.

దరఖాస్తు ప్రక్రియ

ఏ దేశంలో చదవాలనుకున్నారో మీరు నిర్ణయించుకున్నారు. ప్రవేశాల ప్రక్రియ గురించి కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు విద్యాసంస్థలకు ఆఖరి గడువుకు ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయడం చాలా ముఖ్యమైన పని. ఎంచుకున్న దేశాలను బట్టి, ఎంపిక చేసుకున్న విద్యాసంస్థలను బట్టి తుది గడువు తేదీల్లో మార్పులుంటాయి. వీటిన్నిటిపై స్పష్టత వచ్చాకే ప్రవేశ ప్రక్రియను ప్రారంభించడం ముఖ్యం. వీసా ప్రక్రియ వ్యవధిని కూడా గుర్తుంచుకోవాలి.

మన విద్యార్థుల కోర్సులు సాధారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో పూర్తయిపోతాయి. అప్పటిదాకా ఆగి ఆపై ప్రయత్నాలు మొదలుపెడదామనుకుంటే జులై/ సెప్టెంబరుల్లో జరిగే ప్రవేశాలను కోల్పోవాల్సి ఉంటుంది. కావాల్సిన అర్హతలతోపాటు వెళ్లేందుకు అవసరమైన వాటిపైనా అవగాహన తెచ్చుకుని, దరఖాస్తు ప్రక్రియ వెంటనే ప్రారంభించుకోవాలి. చాలా సందర్భాల్లో దరఖాస్తు చేయడం ఆలస్యమై చిన్న చిన్న విద్యాసంస్థల్లో ప్రవేశాలకే విద్యార్థులు పరిమితమైపోవాల్సి వస్తుంది. కాబట్టి సరైన సమయంలో దరఖాస్తు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. అందుకుగాను డిసెంబర్‌ కంటే ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

తుది గడువులు

ఎంచుకున్న కోర్సు, దరఖాస్తు పరిశీలనా సమయాన్ని బట్టి దరఖాస్తుల ఆఖరి గడువులు మారుతుంటాయి. ఎంపిక చేసుకున్న దేశాలను బట్టీ మారతాయి. ఆయా దేశాల విశ్వవిద్యాలయాలు పాటించే తుది గడువుల వివరాలు చూద్దాం.

యూఎస్‌ఏ

సెప్టెంబర్‌ ఇన్‌టేక్‌- కొన్ని మంచి విద్యాసంస్థలకు ముందు సంవత్సరం డిసెంబర్‌లోనే తుది గడువులుంటాయి. చాలావాటికి మార్చిలో, మరికొన్నింటికి మేలో ఉంటాయి. కాబట్టి విద్యార్థులు తుది గడువుల్ని దృష్టిలో ఉంచుకుని తొందరగా దరఖాస్తు చేయడం ప్రారంభించాలి.

ఆస్ట్రేలియా- న్యూజీలాండ్‌

జులై ఇన్‌టేక్‌- చాలా విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవడానికి తుదిగడువు లేనప్పటికీ, ప్రవేశాల ప్రక్రియ పరిశీలన 3 నుంచి 4 వారాలు పడుతుందని విద్యార్థులు గమనించాలి. వీసా డ్రాప్‌బాక్స్‌ పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఆమోదం పొందడానికి 2- 4 వారాల సమయం పడుతుంది.

జర్మనీ, స్వీడన్‌, ఆస్ట్రియా: ఉచిత విద్యను అందించే ఇటువంటి దేశాల్లో ప్రవేశం పొందడం చాలా సుదీర్ఘ ప్రక్రియ. వీటిల్లో చాలావాటికి మే నెలలోనే తుది గడువు. అయినా వీటిల్లో ప్రవేశం పొందాలంటే ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడం సమంజసం. డిసెంబర్‌ నెలలోనే ముందస్తుగా దరఖాస్తు చేసుకుంటే ప్రవేశాలు పొందే అవకాశాలు ఎక్కువ.

యూకే

సెప్టెంబర్‌ ఇన్‌టేక్‌- చాలాసంస్థలకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు జులై వరకు ఉంటుంది. కొన్నింటికి తరువాత కూడా దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. ప్రవేశ విధానం వేగంగా జరుగుతుంది, వీసా ఆమోదం కూడా వేగంగానే జరుగుతుంది. కాబట్టి యూకేకి దరఖాస్తు ప్రక్రియ జులైలో మొదలైనప్పటికీ విద్యార్థి ఎక్కువ విద్యాసంస్థలకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.

కెనడా

సెప్టెంబర్‌ ఇన్‌టేక్‌- ఒకవేళ విద్యార్థి విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకుంటున్నట్లయితే, తుదిగడువు మే వరకు ఉన్నప్పటికీ వీలైనంత తొందరగా దరఖాస్తు చేసుకోవడం సమంజసం. కొన్ని విశ్వవిద్యాలయాలకు తుది గడువు మార్చి వరకే ఉంటుంది. కానీ ప్రవేశ ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకుంటుంది. సుమారు 6- 12 వారాలు, ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. ఒకవేళ విద్యార్థి కమ్యూనిటీ కళాశాలలకు దరఖాస్తు చేస్తున్నట్లయితే, వాటి తుదిగడువు మే వరకు ఉంటుంది. కానీ చాలాసంస్థలు జులై వరకు అనుమతిస్తాయి.

ఇతర దేశాలు

ఇతర దేశాలకు అడ్మిషన్‌, వీసా ప్రకియలు చాలా తేలికగా, తొందరగా జరుగుతాయి. కాబట్టి విద్యార్థులు ఇన్‌టేక్‌కు రెండు నెలల ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ కోర్సులకు గిరాకీ

విదేశాల్లో మన విద్యార్థులు బిజినెస్‌, సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమేటిక్స్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం బాగా గిరాకీ ఉన్న కోర్సులు:

* బయో ఇన్‌ఫర్మేటిక్స్‌
* బయో మెకానిక్స్‌
* లైఫ్‌ సైన్సెస్‌ ప్రోగ్రాములు
* రోబోటిక్స్‌
* ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌
* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌

* ఆటోమోటివ్‌ సిస్టమ్స్‌
* రెన్యూవబుల్‌ ఇంజినీరింగ్‌
* జియో సైన్సెస్‌

* మెరైన్‌ ఇంజినీరింగ్‌
* ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌
* ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌
* మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌
* ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌
* క్లినికల్‌ రిసర్చ్‌
* ఓషనోగ్రఫీ
* హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌

ప్రవేశ ప్రమాణాలు ఏమిటి?

ఎక్కువ సంస్థలు మొదటి శ్రేణి (ఫస్ట్‌క్లాస్‌)లో పాస్‌ అయినవారిని తీసుకుంటాయి. మరికొన్ని రెండో శ్రేణిలో ఉత్తీర్ణులైనవారినీ తీసుకుంటున్నాయి. కానీ ఇతర పరీక్షల విషయంలో మాత్రం దేశాలు, సంస్థల మధ్య తేడాలున్నాయి. వాటిని కింద తెలుసుకోవచ్చు.

యూఎస్‌ఏ కోసం: చాలా విద్యాసంస్థలకు జీఆర్‌ఈ, టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ల స్కోర్లు ఉంటే మేలు. మరికొన్ని సంస్థల్లో మాత్రం ఈ స్కోర్లు తప్పనిసరి. కొన్ని సంస్థలు జీఆర్‌ఈ లేకపోయినా తీసుకుంటాయి. కానీ వీసా కోసం ఆ స్కోరు ఉండటం మంచిది. బిజినెస్‌ కోర్సులకు జీమ్యాట్‌ తప్పనిసరి. ఎక్కువ బాక్‌లాగ్‌లున్న విద్యార్థులతో పోలిస్తే తక్కువ బాక్‌లాగ్‌లున్న వారికి ప్రవేశం పొందే అవకాశాలెక్కువ.

ఉచిత విద్యనందించే దేశాల కోసం: అన్ని విద్యాసంస్థలకు టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ తప్పనిసరి. కానీ ఇంజినీరింగ్‌ కోర్సులు అందిస్తున్న సంస్థలు జీఆర్‌ఈనీ నిర్దిష్టంగా అడుగుతున్నాయి. విద్యాపరంగా అధిక మార్కుల శాతం ఉన్న విద్యార్థులకే ప్రవేశాలు లభిస్తున్న విషయాన్నీ గమనించవచ్చు.

ఆస్ట్రేలియా/ న్యూజీలాండ్‌: టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ తప్పనిసరి. చాలా సంస్థలు ఐఈఎల్‌టీఎస్‌లో 6 బాండ్స్‌/ అంతకన్నా ఎక్కువ ఆశిస్తున్నాయి. జీఆర్‌ఈ/ జీమాట్‌ తప్పనిసరేం కాదు. విద్యాపరంగా మంచి శాతం ఉన్న విద్యార్థులు ఉపకారవేతనం పొందే అవకాశం ఉంది.

కెనడా: చాలామంది విద్యార్థులు కెనడాలో కమ్యూనిటీ కళాశాలలను ఎంచుకుంటారు. వీరికి కేవలం ఐఈఎల్‌టీఎస్‌ స్కోరుంటే సరిపోతుంది. కానీ బ్యాక్‌లాగ్‌ల సంఖ్య విషయంలో నిబంధన ఉంది. ప్రవేశం, వీసా పొందడానికి విద్యార్థికి 8- 10 కంటే ఎక్కువ బ్యాక్‌లాగ్‌లు ఉండకూడదు. విద్యార్థి ఎంచుకునే కోర్సును బట్టి విశ్వవిద్యాలయాలు జీఆర్‌ఈ, జీమ్యాట్‌లను అడుగుతున్నాయి.

యూకే: చాలా సంస్థలు ప్రవేశం కోసం కేవలం టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ అడుగుతున్నాయి. కొన్ని సంస్థలు పూర్వ తరగతుల్లో మంచి స్కోరు సాధించి ఉంటే వీటినీ అడగడం లేదు.

సింగపూర్‌, ఇతర దేశాలు: ఈ దేశాల ప్రవేశ ప్రమాణాలు చాలా తేలిక. డిగ్రీలో ఫస్ట్‌ క్లాస్‌ సాధిస్తే సరిపోతుంది. సంస్థలను బట్టి ఎక్కువగా కూడా అడిగే అవకాశముంది.

ఇవి గుర్తుంచుకుని విద్యార్థులు ఆఖరి సంవత్సరం మొదటిలోనే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి. దీనివల్ల మంచి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందొచ్చు, ఉపకారవేతనాలు కూడా మొదట దరఖాస్తు చేసుకున్నవారికే వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆర్థిక మాంద్యం వల్ల గతంతో పోలిస్తే వీటి మంజూరు బాగా తగ్గిపోయింది. వివిధ దేశాల విద్యార్థుల నుంచి దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తాయి కాబట్టి విశ్వవిద్యాలయ అధికారులకు వడపోత తప్పనిసరి. అందుకే ముందుచూపుతో మూడు నాలుగు విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేస్తే తర్వాత నిరాశపడే అవసరం ఉండదు.Ask the Expert
Click Here..