విదేశీ విద్యకు ఆర్థిక ఆసరా!

అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలకు ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులు వస్తాయి. అయితే అర్హతలున్న విద్యార్థులందరికీ ప్రవేశాల, ఉపకారవేతనాల విషయంలో హామీ ఏమీ ఉండదు. సీట్లూ, నిధుల- అసిస్టెంట్‌షిప్‌ అవకాశాలు పరిమితంగా ఉండటమే దీనికి కారణం. అందుకే విదేశీ విశ్వవిద్యాలయాలకు ముందస్తుగా దరఖాస్తు చేసుకుంటే ఆశించిన ప్రవేశం, ఆర్థిక ఆసరా పొందే వీలుంటుంది.

వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకారవేతనంతో కూడిన ప్రవేశాలు పొందడానికి గడువు తేదీలు వేర్వేరుగా ఉంటాయి. ఇటువంటి అసిస్టెంట్‌ షిప్‌ తదితరాలను సెప్టెంబర్‌ నెలలో మొదలయ్యే ఫాల్‌ ఇన్‌టేక్‌లో మాత్రమే అందిస్తారు. కాబట్టి ఆఖరి గడువుకు కనీసం 3 నెలల ముందుగా దరఖాస్తు చేసుకోవడం శ్రేయస్కరం.

విశ్వవిద్యాలయం నుంచి నిధులు/ అసిస్టెంట్‌షిప్‌ పొందిన విద్యార్థులకు వీసా పొందే అవకాశాలూ ఎక్కువే. విద్యార్థి తన దరఖాస్తులో ఉపకారవేతనం (స్కాలర్‌షిప్‌)తో కూడిన ఆఫర్‌ లెటర్‌ను ప్రస్తావిస్తే వీసా అవకాశాలు మెరుగవుతాయి.

నిధులు, ఉపకార వేతనాలు విశ్వవిద్యాలయాలు ఇచ్చేవి. ఇవే కాకుండా ప్రభుత్వం, ఇతర సంస్థలు ఇచ్చే ఉపకార వేతనాలూ ఉన్నాయి. అయితే ఇవి చాలా తక్కువ. వీటిని విద్యాపరంగా ఉన్నత స్థాయిలో ఉన్న విద్యార్థులకు మాత్రమే ఇస్తారు.

ఏదేశంలోనైనా వివిధ ఉపకారవేతనాలకు దరఖాస్తు చేయదలిచిన విద్యార్థులు ఆయా విశ్వవిద్యాలయాలు నిర్దేశించిన గడువు తేదీలను గమనించటం ముఖ్యం. సాధారణంగా ఈ తేదీలు ప్రవేశాలు ప్రారంభవటానికి రెండు నెలల ముందు ఆరంభమవుతాయి. విద్యాపరమైన ప్రతిభ ఆధారంగానే ఏ ఉపకారవేతనాలైనా లభిస్తాయనేది గుర్తుంచుకోవాలి.

యూఎస్‌ఏ

ఇతర దేశాలతో పోలిస్తే యూఎస్‌ఏ ఉపకార వేతనాలను ఎక్కువగా అందిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులకు యూఎస్‌ఏలో ఆర్థిక సహాయం పొందే మార్గాలు చాలా ఉన్నాయి. ఎక్కువగా ప్రతిభ (మెరిట్‌) ఆధారంగా, అరుదుగా అవసరాన్ని బట్టి ఆర్థిక సహాయం పొందే వీలుంటుంది.

1. అసిస్టెంట్‌షిప్స్‌: అసిస్టెంట్‌షిప్‌ కళాశాల/ విశ్వవిద్యాలయం నుంచి లభించే ఆర్థిక సహాయం. ఇది సాధారణంగా క్యాష్‌ స్త్టెపెండ్‌ రూపంలో ఉంటుంది. విద్యార్థి నిత్యజీవనానికి అయ్యే ఖర్చు, ట్యూషన్‌ ఫీజు మినహాయింపు అన్నమాట. ఇందుకోసం విద్యార్థి వారానికి 20 గంటలు మించకుండా పనిచేయాల్సివుంటుంది.
అందుబాటులో ఉన్న అసిస్టెంట్‌ షిప్‌లు మూడు రకాలు.
* గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్‌షిప్‌
* రిసర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌
* టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌. సాధారణంగా వీటిని సంబంధిత విభాగాలు అందజేస్తాయి.
* గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్‌షిప్‌: ఒక డిపార్ట్‌మెంట్‌/ యూనిట్‌లో ఆ విభాగానికి సహాయకంగా ఉండేలా సూపర్‌వైజర్‌ విద్యార్థికి కొంత పని కేటాయిస్తారు. ఇది విద్యార్థికి చదువుకు అదనంగా జ్ఞానాన్ని సంపాదించుకునేలా ఉపయోగపడుతుంది.
* రిసర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌: ఒక పరిశోధన కార్యకలాపానికి సంబంధించిన పనిలో చేసే సహాయం. పరిశోధన యూనిట్‌కు సంబంధించిన ప్రయోగశాల, ఫీల్డ్‌/ కంప్యూటర్‌ పని/ ఇతర కార్యకలాపాల్లో గ్రాడ్యుయేట్‌ విద్యార్థి పాల్గొనవచ్చు.
* టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌: బోధన కార్యకలాపంలో సహాయం చేసే పని. క్విజ్‌, డ్రిల్‌/ ప్రయోగశాల విభాగంలో విద్యార్థి బాధ్యతలు నిర్వహించాల్సివుంటుంది.

2. గ్రాడ్యుయేట్‌ పార్ట్‌-టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌
గ్రాడ్యుయేట్‌ విద్యార్థి తరగతి/ తరగతి సెక్షన్‌లో క్విజ్‌, డ్రిల్‌/ ప్రయోగశాల విభాగాల బోధనలో ఇన్చార్జిగా సహాయం అందించే పని ఇది.

3. ఇన్‌స్టేట్‌ ట్యూషన్‌ వెయ్‌వర్‌
ఇటువంటి ఉపకారవేతనాలు టెక్సాస్‌, మిస్సోరి వంటి కొన్ని రాష్ట్రాల్లోనే లభ్యమవుతాయి. వీటివల్ల ఫీజును చెల్లించే అవసరం ఉండదు. ఇలా సెమిస్టర్‌కి కొన్ని వేల డాలర్లు ఆదా చేసినట్లవుతుంది. కానీ వీటి లభ్యత పరిమితమే.

4. ఉపకార వేతనాలు/ గ్రాంట్లు/ అవార్డులు
ఉపకార వేతనాలు/ గ్రాంట్లు/ అవార్డులను విద్యార్థి ప్రతిభ, విద్యాసంవత్సరాల్లో చదివే తీరు ఆధారంగా మంజూరు చేస్తారు. విద్యాపరంగా ఉన్నతంగా ఉన్న విద్యార్థులను మాత్రమే ఇటువంటి వాటికి అర్హులుగా పరిగణిస్తారు. వీటి విషయంలో డబ్బులు తిరిగి చెల్లించడం/ బదులుగా పనిచేయడం వంటివి ఉండవు. ఇవి ప్రైవేటు/ పబ్లిక్‌, పరిశోధన గ్రాంట్లగా ఉండొచ్చు. ఇటువంటి సహాయం సాధారణంగా డబ్బు రూపంలో నిర్దిష్ట ప్రయోజనం కోసం ఇస్తారు.

ఉపకార వేతనాలన్నిటిలో అందుబాటులో ఉండేవి ఎక్కువగా ఇవే. మన భారతీయ విద్యార్థులు వీటిని ఎక్కువగా పొందుతుంటారు. ఇటువంటివి చాలా విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. సహజంగానే ముందస్తుగా దరఖాస్తు చేసుకుంటేనే లభిస్తాయి.

న్యూజీలాండ్‌

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విద్యావేత్తలు, పరిశోధకుల వద్ద అధ్యయనం చేసే అవకాశాన్ని న్యూజీలాండ్‌లో విద్య కలిగిస్తోంది. ఆచరణశీలత, ఆధునికత ఉండడం వల్ల న్యూజీలాండ్‌ విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు సాధించినవారు ఏ దేశంలోనైనా రాణిస్తారు. ముఖ్యంగా బయోటెక్నాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, మెరైన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో న్యూజీలాండ్‌ డిగ్రీలు ప్రపంచ వ్యాప్త గుర్తింపును పొందాయి.
ఇక్కడ చదవాలనుకునే విద్యార్థులు 'న్యూజీలాండ్‌ ఇంటర్నేషనల్‌ స్కాలర్‌షిప్స్‌ అండ్‌ స్టడీ అబ్రాడ్‌ అవార్డ్‌ ప్రోగ్రామ్‌' ద్వారా ఆర్థికసహాయం పొందే అవకాశముంది.

అంతర్జాతీయ విద్యార్థుల కోసం న్యూజీలాండ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలు అందించే కొన్ని ఉపకార వేతనాలు-
* ఇంటర్నేషనల్‌ స్కాలర్‌షిప్స్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌
* జాన్‌రైట్‌ స్కాలర్‌షిప్‌
* హిలరీ జాలీ మెమోరియల్‌ స్కాలర్‌షిప్‌
* పోస్టు గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్‌
* డాక్టోరియల్‌ స్కాలర్‌షిప్‌
* విక్టోరియా గ్రాడ్యుయేట్‌ అవార్డు

న్యూజీలాండ్‌ ప్రభుత్వం విద్యాపరంగా ఉన్నతస్థాయిలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులకు నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే ఉపకార వేతనాలను అందజేస్తోంది. ఎడ్యుకేషన్‌ న్యూజీలాండ్‌ వీటి నిర్వహణను చూస్తుంది.

న్యూజీలాండ్‌ ఇంటర్నేషనల్‌ డాక్టరల్‌ రిసర్చ్‌ స్కాలర్‌షిప్‌ లకు ఆ దేశ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. విద్యాపరమైన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉపకారవేతనాల మూలంగా పూర్తి ట్యూషన్‌ ఫీజు, జీవనవ్యయానికి అవసరమయ్యే మొత్తం లభిస్తుంది. ఏటా పది వరకూ ఉపకారవేతనాలు లభిస్తాయి. విశ్వవిద్యాలయాలు అందించే ఉపకారవేతనాలు మాత్రం చాలా పరిమితం.

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు చాలా ఉపకారవేతనాలు అందజేస్తున్నాయి.

* ఆస్ట్రేలియా అవార్డ్‌ స్కాలర్‌షిప్‌: వృత్తివిద్యా శిక్షణ కోర్సుల విద్యార్థులకూ; అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ, పీహెచ్‌డీల విద్యార్థులకూ వీటిని ఉద్దేశించారు.

* ఆస్ట్రేలియా అవార్డ్‌ ఫెలోషిప్‌: ఆ దేశంలో పరిశోధన చేసేవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఎండీవర్‌ పీజీ స్కాలర్‌షిప్‌ అవార్డు: మాస్టర్‌ ఆఫ్‌ పీహెచ్‌డీ స్థాయిలో కోర్సు/ పరిశోధన చేసేవారికి అర్హతలను బట్టి దీన్ని అందజేస్తారు.

* సిడ్నీ అచీవర్‌ ఇంటర్నేషనల్‌ స్కాలర్‌షిప్స్‌: ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులు ఈ ఉపకారవేతనాల కోసం యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

* మెల్‌బోర్న్‌ ఇంటర్నేషనల్‌ రిసర్చ్‌ స్కాలర్‌షిప్స్‌: మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్‌ రిసర్చ్‌ డిగ్రీ చదివే విదేశీ విద్యార్థుల కోసం వీటిని కేటాయించారు.

* లాట్రోబ్‌ అకడమిక్‌ ఎక్స్‌లెంట్‌ స్కాలర్‌షిప్స్‌: అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయుల్లో అంతర్జాతీయ విద్యార్థుల కోసం నిర్దేశించిన ఉపకార వేతనాలివి.

* యూనివర్సిటీ ఆఫ్‌ అడిలైడ్‌ స్కాలర్‌షిప్స్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌: ఇవి అడిలైడ్‌ విశ్వవిద్యాలయంలో పీజీ పరిశోధక విద్యార్థుల కోసం ప్రత్యేకించిన ఉపకార వేతనాలు.

వీటిని ఆశించే విద్యార్థులు కనీసం 8 నెలల ముందుగానే వీటికి దరఖాస్తు చేసుకోవటం మంచిది.Ask the Expert
Click Here..