అమెరికాలో బీబీఏ, బీఈ

డిగ్రీ చదివిన తర్వాత మన విద్యార్థులు విదేశాలకు వెళ్ళి పీజీ స్థాయి కోర్సులు చేస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి కోర్సుల కోసమూ విదేశాలను ఎంచుకోవడం ఇటీవలి పరిణామం. ఈ తరహా దరఖాస్తుల సంఖ్యా, ప్రవేశాల సంఖ్యా బాగా పెరుగుతోంది!

ప్రపంచంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయ విధానాలున్న దేశాల్లో యూఎస్‌ఏ ఒకటి. ఇక్కడ దాదాపు అన్ని విభాగాల్లో విశిష్టమైన కోర్సులను అభ్యసించవచ్చు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో సంప్రదాయ విభాగాల్లోనేకాక ప్రొఫెషనల్‌ విభాగాల్లోనూ శ్రేష్ఠమైన ప్రోగ్రాములు లభిస్తున్నాయి.

ప్రధానంగా మన విద్యార్థులు అమెరికా లాంటి దేశాల్లో ఇంజినీరింగ్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులను డిగ్రీ స్థాయిలో అభ్యసించటానికి ఆసక్తి చూపుతున్నారు.

అమెరికాలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేరటం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. పీజీ అయితే రెండేళ్ళే కాబట్టి పరిస్థితులకు అలవాటు పడటానికే కొంత కాలం పడుతోంది. కానీ డిగ్రీ నాలుగేళ్ళ వ్యవధి అయినందున విద్యాభ్యాసంపై, కెరియర్‌పై దృష్టి కేంద్రీకరించటానికి తగిన వ్యవధి ఉంటోంది. అవసరమైతే పీజీ కూడా సులభంగానే అక్కడే చేయటానికి ఎటూ వీలుంటుంది.

అమెరికాలో చాలా అండర్‌గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రాములకు అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (ABET)గుర్తింపు ఉంటాయి. విశ్వవిద్యాలయాల్లో ఈ తరహా కోర్సుల అవసరం, ప్రమాణాలను ఈ బోర్డు నిర్ధారిస్తుంది.

అమెరికాలో కళాశాల దరఖాస్తు విధానం చాలా సుదీర్ఘం. ప్రతి విశ్వవిద్యాలయానికీ దరఖాస్తు పత్రాలు, ఫీజు, తుది గడువు తేదీలు, ప్రవేశానికి కావాల్సిన అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. ముందుగా చేయాల్సింది మాత్రం సరైన కళాశాలను ఎంచుకోవడం.

కనీసం ఏడాది ముందుగా ప్రణాళిక వేసుకోవడం, SAT, TOEFL/ IELTS/ PTE వంటి అవసరమైన పరీక్షలకు సిద్ధమవడం సమంజసం.

ఇంజినీరింగ్‌లో వీటికి ఆదరణ

* కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
* ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌
* మెకానికల్‌ ఇంజినీరింగ్‌
* కెమికల్‌ ఇంజినీరింగ్‌
* సివిల్‌ ఇంజినీరింగ్‌
* ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌
* బయోటెక్‌/ బయోమెడికల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంకా ఎన్నో...

ప్రవేశానికి కావాల్సినవి

అమెరికాలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రామ్‌ చేయడానికి మనదేశంలో మాదిరే 4 సంవత్సరాలు పడుతుంది. డిగ్రీ పూర్తయ్యాక విద్యార్థులు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (బీఈ) పట్టా పొందుతారు. చాలా ఇంజినీరింగ్‌ కళాశాలలు అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకునేవారికి 10+2 విద్యాభ్యాసం, SAT స్కోరు అవసరంగా నిర్దేశిస్తున్నాయి..

సెకండరీ విద్యలో ఆంగ్లం, గణితం, ప్రకృతి శాస్త్రాలు (భౌతిక, రసాయనశాస్త్రాలు/ బయాలజీ), మానవీయ/ సోషల్‌ సైన్సెస్‌ (చరిత్ర, భూగోళశాస్త్రం, ఎకనామిక్స్‌, పాలిటిక్స్‌/ సంబంధిత సబ్జెక్టులు), ఒక విదేశీ భాష వంటి వివిధ భాషలుండడమూ ముఖ్యమే. చివరగా ఇక్కడి విశ్వవిద్యాలయాలు 17 సంవత్సరాలు మించని విదేశీ విద్యార్థులను అనుమతించవు. మరింత సమాచారం కోసం ఫెడరల్‌ గవర్నమెంట్‌ (యూఎస్‌ఏ సెంట్రల్‌ గవర్నమెంట్‌) నిర్వహించే వెబ్‌సైట్‌ http://educationusa.state.gov/undergrad/...

టోఫెల్‌ వివరాల కోసం http://www.ets.org/toefl కోసం www.collegeboard.com/student/test... సైట్లను సందర్శించవచ్చు.

ఎంత ఖర్చు అవుతుంది?

యూఎస్‌లో విద్యకు అయ్యే ఖర్చు రాష్ట్రాలు, యూనివర్సిటీ, కోర్సులను బట్టి మారుతూ ఉంటుంది. యూఎస్‌లో విశ్వవిద్యాలయాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి: ప్రభుత్వ/ దేశీయ సంస్థలు, ప్రైవేటు సంస్థలు.

ఎంచుకున్న విశ్వవిద్యాలయాన్ని బట్టి ట్యూషన్‌ ఫీజు/ ఖర్చు సంవత్సరానికి సగటున ప్రైవేటు సంస్థలకైతే 15000- 30000 డాలర్ల వరకూ; ప్రభుత్వ సంస్థలకు 10000- 20000 డాలర్లు; కమ్యూనిటీ కళాశాలలకు 8000- 12000 డాలర్లు ఉండే అవకాశముంది. ఏదేమైనా అమెరికాలో చదవడానికి అయ్యే ఖర్చు కోర్సును బట్టి సంవత్సరానికి సుమారుగా 5000- 50000 డాలర్ల మధ్య ఉంటుంది. యూఎస్‌ఏలో ఇంజినీరింగ్‌ కోర్సులతో పోల్చితే ఎంబీఏ, మెడిసిన్‌ కోర్సులకు అయ్యే ఖర్చు ఎక్కువ.

యూఎస్‌ఏలో జీవించడానికి అయ్యే ఖర్చు సంవత్సరానికి 10,000- 12,000 డాలర్ల మధ్య ఉంటుంది. విద్యార్థి వీసా ఫీజు 160 డాలర్లు.

వైద్య బీమా

ఆ దేశంలో వైద్యానికి అయ్యే ఖర్చు ఎక్కువ. అందుకే విద్యార్థులైనప్పటికీ తప్పకుండా మెడికల్‌/ హెల్త్‌ ఇన్‌స్యూరెన్స్‌ తీసుకోవాలి. అమెరికాలో చదువుతున్నపుడు సమగ్రమైన వైద్య బీమా (హెల్త్‌ ఇన్‌స్యూరెన్స్‌) తప్పనిసరి. దీనికి అయ్యే ఖర్చు సంవత్సరానికి దాదాపు 300- 500 డాలర్లు.

ఏదేమైనా అక్కడ విద్యకు అయ్యే ఖర్చు ఎక్కువ. దానిని తగ్గించుకోవడానికి విశ్వవిద్యాలయాలు అందించే ఉపకార వేతనాలు, ఫెలోషిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందస్తుగా దరఖాస్తు చేసుకున్నవారికే ఉపకారవేతనాలు లభించే అవకాశాలుంటాయి. ప్రతి విద్యాసంస్థా అంతర్జాతీయ విద్యార్థులకు ఉపకారవేతనాలను మంజూరు చేయడానికి భిన్నమైన అంశాలను చూస్తుంది. ఉపకారవేతనాల మంజూరు నిర్ణయం విద్యార్థి పూర్తి ప్రొఫైల్‌ ఆధారంగానే తీసుకుంటుంది.

ఉద్యోగావకాశాలు

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులందరికీ యూఎస్‌ఏ చక్కటి గమ్యం. అమెరికాలోని భారతీయ ఉద్యోగుల సంఖ్య సుమారు 30 శాతం. ఈ దేశం ఎక్కడివారైనా ప్రతి ఒక్కరికీ ఎదగడానికి పుష్కలమైన అవకాశాలనూ, పరిధినీ కల్పిస్తుంది.Ask the Expert
Click Here..