విదేశాల్లో ఉచిత విద్యా విధానం

యూరోపియన్‌ దేశాల్లో ఉచిత విద్యపై చాలా అపోహలున్నాయి. కారణం ఈ దేశాల్లోని విద్యా విధానంపై సరైన అవగాహన లేకపోవడమే. ప్రధానమైన అపోహలూ, వాటి వాస్తవాల గురించి తెలుసుకుందాం!
విదేశాల్లో లభించే ఉచితవిద్య గురించి విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో సందేహాలూ, అపోహలూ ఎక్కువే ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఏ అంశాల్లో ఉన్నాయో చూద్దాం.
* ఈ విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయా లేదా?
* యూరోపియన్‌ దేశాలు అంతర్జాతీయ విద్యార్థులకు ఎందుకు ఉచిత విద్యనందిస్తున్నాయి?
* భాష * విద్యా విధానం * ప్రవేశాలు * వీసా * స్థిరపడడం
విశ్వవిద్యాలయాలు ఉచిత విద్యను అందిస్తున్నాయంటే, వాటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లేదేమో.. లేదంటే ఉచిత విద్యను ఎలా అందిస్తాయని ప్రజలు సందేహపడుతుంటారు. మనదేశంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లోని ఎక్కువ భాగం రక్షణకే కేటాయిస్తున్నారు. విద్యకు తగినంత వ్యయం చేయలేకపోతున్నారు. కానీ యూరోపియన్‌ దేశాలు తమ స్థూలజాతీయోత్పత్తిలో ఎక్కువ భాగం విద్యకే కేటాయిస్తున్నాయి. అక్కడ స్థానిక- అంతర్జాతీయ విద్యార్థులు అనే భేదం లేదు. ఇద్దరికీ అవి సమాన ప్రాముఖ్యాన్నిస్తున్నాయి. కాబట్టి స్థానిక విద్యార్థులు చెల్లించే ట్యూషన్‌/ రిజిస్ట్రేషన్‌ ఫీజులను అంతర్జాతీయ విద్యార్థులకు అందజేస్తాయి. ఆ దేశాల్లో తక్కువ జనాభా ఉండటం కూడా మరో కారణం.

యోగ్యతా ప్రమాణాలు
ఏదైనా ఉచితంగా వస్తోందంటే దానిలో నాణ్యత లేనట్లే అనే భావన చాలామందికి ఉంటుంది. యూరోపియన్‌ దేశాలకు సంబంధించి సమాచారం, సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ విశ్వవిద్యాలయాలపైనా అటువంటి పొరపాటు అభిప్రాయమే వ్యాపించింది. ఈ యూనివర్సిటీలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఇవి అంతర్జాతీయ గుర్తింపునూ పొందాయి. వీటిలో నోబెల్‌ బహుమతి విజేతలు చదివినవీ ఉన్నాయి.
ప్రపంచంలో అత్యుత్తమ 10/ అత్యుత్తమ 100 విశ్వవిద్యాలయాల్లో యూరప్‌కు చెందినవి ఎక్కువగా ఉండడం గమనించవచ్చు. మన విద్యాసంస్థల విషయానికొస్తే కనీసం 200/ 300 ర్యాంకుల్లోనూ లేవు. కాబట్టి మన విశ్వవిద్యాలయాలను గొప్పవిగా భావిస్తే టాప్‌ 100 ర్యాంకుల్లో ఉన్న యూరప్‌ విశ్వవిద్యాలయాలు మరే స్థాయిలో ఉంటాయో అర్థమవుతుంది. అక్కడివి చాలా పురాతనమైనవి. అంతేకాకుండా ఇవి ప్రపంచంలోనే గొప్ప పరిశోధనా విశ్వవిద్యాలయాలు కూడా. వీటికి నిధులు మొత్తం ప్రభుత్వం నుంచే వస్తాయి. విద్యార్థులకు ఉపకారవేతనాలూ లభిస్తాయి. మనదేశంలోని కొన్ని ఐఐటీలు యూరోపియన్‌ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకున్నాయి.

భాషా సమస్య?
ఈ దేశాల్లో స్థానిక భాష అవసరంపైనా కొన్ని అపోహలున్నాయి. యూరప్‌లోని ఫ్రాన్స్‌, జర్మనీ లేదా మరే ఇతర దేశాన్ని ఎంచుకున్నా అక్కడి స్థానిక భాషను నేర్చుకోవడం తప్పనిసరేమీ కాదు. ఎలాగంటే.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చదవటానికి వెళ్ళే మన రాష్ట్ర విద్యార్థులకు అక్కడి స్థానిక భాష నేర్చుకోవాలనే నిబంధన ఏమీ లేదు కదా? కాబట్టి స్థానికభాషను నేర్చుకోవడం తప్పనిసరేమీ కాదు. బోధించే భాష ఇంగ్లిషు అయితే స్థానిక భాషతో పనేమీ లేదు. అయితే అంతర్జాతీయ విద్యార్థులు స్థానికభాషను నేర్చుకుంటే అక్కడి ప్రజలతో సంభాషించడానికి ఉపయోగపడుతుంది. ఇందులోనూ రాయడం, చదవడం నేర్చుకోవాల్సిన పనిలేదు. స్థానికులతో మాట్లాడడానికీ, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకూ ఆ భాష తెలిసివుండటం మంచిది.

విద్యావిధానం

యూరోపియన్‌ విశ్వవిద్యాలయాల్లో చాలావరకు ECTS (యూరోపియన్‌ క్రెడిట్‌ ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్‌) ఉంది. అంటే విద్యార్థులు తమ క్రెడిట్లను క్రెడిట్‌ బదిలీ విధానాన్ని అంగీకరించే ఒక విశ్వవిద్యాలయం నుంచి మరోదానికీ/ ఒక దేశం నుంచి మరో దేశానికీ బదిలీ చేసుకోవచ్చు. యూరోపియన్‌ దేశాల్లో డిగ్రీలకు బీఎస్‌సీ, ఎంఎస్‌సీ వంటి పేర్లుంటాయి (ఇంజినీరింగ్‌కి బీఈ, బీటెక్‌ వంటి ప్రత్యేక పేర్లేమీ లేవు). 10, +2, +3 / +4 విద్యావిధానాన్ని అనుసరించే విశ్వవిద్యాలయాలు మాత్రం ఎంఎస్‌ అని వ్యవహరిస్తాయి. అలాగే పీహెచ్‌డీ 3 సంవత్సరాలు. ప్రతి సెమిస్టర్‌లో విద్యార్థి 30 క్రెడిట్లు సంపాదించుకుంటాడు; సంవత్సరానికి 60.


క్రెడిట్‌ విధానం, గ్రేడింగ్‌

విద్యాసంవత్సరం ఆగస్టు మధ్య నుంచి జూన్‌ మధ్య కాలం వరకు సాగుతుంది. ఈసీటీఎస్‌ (యూరోపియన్‌ క్రెడిట్‌ ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్‌ క్రెడిట్స్‌) ప్రమాణాల ప్రకారం ఒక కోర్సును "studiepoeng"గా లెక్కిస్తారు. ఒక విద్యాసంవత్సరానికి ఫుల్‌టైం వర్క్‌లోడ్‌ 60 studiepoeng/ ఈసీటీఎస్‌ క్రెడిట్లు.
డిగ్రీ, పీజీ పరీక్షలకు గ్రేడ్లను ఎ (ఎక్కువ) నుంచి ఎఫ్‌ (తక్కువ) వరకు గల గ్రేడ్‌ స్కేల్‌ ఆధారంగా ఇస్తారు. కనీస పాస్‌ గ్రేడ్‌ ఈ. కొన్ని పరీక్షలకు పాస్‌/ ఫెయిల్‌ మార్కు మాత్రమే ఇస్తారు.

ప్రవేశాలకు పద్ధతి

యూరోపియన్‌ దేశాల్లో ప్రవేశం దొరకడం కష్టమని చాలామంది భారతీయ విద్యార్థులు భావిస్తుంటారు. అది నిజం కాదు. కానీ సులువుగా సీటు సాధించాలంటే విద్యాపరంగా మంచి నేపథ్యం మాత్రం తప్పనిసరి. ఇవి ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు. కాబట్టి ప్రవేశం కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడం సమంజసం. ఈ విశ్వవిద్యాలయాల్లో స్థానిక, అంతర్జాతీయ విద్యార్థులకు 50% చొప్పున సీట్లు కేటాయిస్తారు. అంతర్జాతీయ విద్యార్థులంటే మనదేశం వాళ్లతోపాటు మిగతా దేశాలవారూ వస్తారు. కాబట్టి ఉచిత విద్య ఆశించేవారు విశ్వవిద్యాలయాలకు ముందస్తుగానే దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది.
ఇక మరో అపోహ ఏంటంటే.. దాదాపుగా అన్ని విశ్వవిద్యాలయాలూ ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌/ జీఆర్‌ఈని అడుగుతాయనేది. ఇవి ప్రవేశం పొందడానికి సహాయపడతాయి కానీ, కొన్ని విశ్వవిద్యాలయాలు ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌/ జీఆర్‌ఈ లేకపోయినా ప్రవేశ ప్రక్రియను అనుమతిస్తాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు స్థానిక భాష సర్టిఫికేషన్‌ను అడుగుతున్నాయి. వాటిల్లో సబ్జెక్టులు స్థానికభాషలోనే ఉంటాయి. కాబట్టి దరఖాస్తు చేసుకునేముందు కోర్సు ఇంగ్లిష్‌ మాధ్యమంలో బోధిస్తారో లేదో సరిచూసుకోవాలి.

వీసా ఎంత సరళం?

యూరోపియన్‌ దేశాలకు వీసా పొందడానికి డాక్యుమెంటేషన్‌ సరళంగా ఉంటుంది. అవరోధాలు తక్కువ, విజయం సాధించేవారే ఎక్కువ. ప్రతి యూరోపియన్‌ దేశానికీ వీసా ప్రక్రియ ఒక్కోలా ఉంటుంది. ప్రతి దేశానికీ ప్రత్యేక అవసరాలుంటాయి. కానీ చాలామంది విద్యార్థులు ఎంబసీల నుంచి అనుకూల స్పందననే పొందుతున్నారు. ఎంబసీ కోరినట్టుగా డాక్యుమెంట్లు సమర్పిస్తే వీసా వచ్చే అవకాశాలే ఎక్కువ.

స్థిరపడటానికి అనువేనా?

చాలామంది ప్రపంచంలోని మిగతాదేశాలతో పోలిస్తే యూకే, యూఎస్‌ఏ, కెనడా దేశాలు స్థిరపడడానికి అనువైన దేశాలుగా భావిస్తారు. అయితే యూరప్‌దేశాల్లో పర్మనెంట్‌ రెసిడెన్సీ (పీఆర్‌) పొందడం సులువు. గత 10- 20 సంవత్సరాల్లో యూరప్‌ ఇమిగ్రేషన్స్‌లో కొత్త నియమనిబంధనలు వచ్చాయని చాలామందికి తెలియదు. ఇప్పుడు అంతర్జాతీయ విద్యార్థులు యూరప్‌ దేశాల్లో సులభంగా స్థిరపడవచ్చు. ఒకసారి డిగ్రీ, పీజీ/ పీహెచ్‌డీ పూర్తయ్యాక వర్క్‌ పర్మిట్‌/ పీఆర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. యూరప్‌ దేశాలు గ్రీన్‌, బ్లూ, రెడ్‌, వైట్‌ కార్డులను అందిస్తున్నాయి. అలాగే యూరప్‌దేశాల్లో ఏదైనా సహాయం కావాల్సివస్తే తెలుగు కమ్యూనిటీలతోపాటు అనేక భారత కమ్యూనిటీలూ ఉన్నాయి.


Ask the Expert
Click Here..