మెరుగైన 'శాట్‌' స్కోరు ఇలా...

'శాట్‌'కు సిద్ధమయ్యే భారతీయ విద్యార్థులకు గొప్ప అనుకూలాంశాలు- వీరికి గణితంలో పట్టు ఉండటం; పాఠశాల స్థాయిలో ఆంగ్ల వ్యాకరణాన్ని బాగా చదివివుండటం. ఈ రెండు సబ్జెక్టులనూ SAT లో విస్తృతంగా పరీక్షిస్తారు!
'శాట్‌' తరహా ప్రామాణిక పరీక్షలను రాసిన అనుభవం లేకపోవటం ఒక్కటే మన విద్యార్థులు ఎదుర్కొనే సమస్య. వీరికి మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు కొంత తెలిసివున్నా నెగిటివ్‌ మార్కింగ్‌ పెద్దగా అలవాటు ఉండదు. ఎక్కువమంది 'శాట్‌'లో ప్రతిదీ రాయటానికి ప్రయత్నించి, పాయింట్లు కోల్పోతుంటారు.
క్రిటికల్‌ రీడింగ్‌ని చాలామంది అభ్యర్థులు క్లిష్టమైనదిగా భావిస్తుంటారు. ఈ విభాగానికి హెచ్చుస్థాయి పదజాలం (vocabulary) అవసరమవుతుంది. విస్తృతంగా చదివేవారయితే తప్ప మిగిలినవారందరికీ ఈ విభాగం జటిలంగా అనిపిస్తుంది.

ఇవి గమనించండి!
* తప్పు సమాధానం రాస్తే ఒక్కో ప్రశ్నకు .25 పాయింట్లు తగ్గిస్తారు.
* ఒక్కో విభాగంలో చివరికొచ్చేసరికి ప్రశ్నల క్లిష్టత పెరుగుతుంది. కష్టమైనవాటిపైనే దృష్టిపెట్టకుండా ఎక్కువ ప్రశ్నలను సాధించటానికి ప్రయత్నించాలి. ఏ ప్రశ్నకైనా- అది తేలికైనా, కష్టమైనా- ఒకే పాయింటు ఉంటుందని మర్చిపోకూడదు.
* ఎప్పటికప్పుడు జవాబులను నిర్దేశించిన షీటులో మార్క్‌ చేస్తుండాలి. చివర్లో చేద్దామనుకుంటే... వ్యవధి లేక ఒత్తిడి పెరిగి తప్పు జవాబులు గుర్తించాల్సివుంటుంది. ఫలితంగా పాయింట్లు కోల్పోక తప్పదు.
* ప్రామాణిక సిమ్యులేటెడ్‌ టెస్టులను సాధన చేయాలి. 'ఉచిత కంటెంట్‌' దొరుకుతోందని దానిపై ఆధారపడకూడదు. నాణ్యమైన టెస్టులు రాస్తేనే ప్రయోజనం!
* ఇతర టెస్టులకంటే భిన్నమైన శాట్‌పై తగిన అవగాహనకు సంబంధిత నిపుణుల సూచనలు తీసుకోవటం మేలు.
మ్యాథ్‌ సెక్షన్‌
* ప్రశ్నలో ఏం అడుగుతున్నారో శ్రద్ధగా గమనించాలి. 'What is x?' అని కాకుండా 'What is 3x?' అని అడగవచ్చు. గమనించాలి. ప్రశ్నను సరిగా చదవనపుడు ఎంత నిర్దుష్టంగా సమీకరణాలు చేసినా జవాబు తప్పే అవుతుంది.
* డయాగ్రమ్స్‌ స్కేలుకు అనుగుణంగా అన్నిసార్లూ ఉండకపోవచ్చు. జామెట్రీ ప్రశ్న చేసేముందు ఓసారి సరిచూసుకోవాలి.
* ఎక్కువ ప్రశ్నల్లో వచ్చే ముఖ్యమైన నిర్వచనాలూ, ఫార్ములాలూ, కాన్సెప్టులూ ముందుగానే నేర్చుకోవాలి. వీటిని ఎలా పరీక్షిస్తారో చూడాలి. రఫ్‌వర్క్‌ కోసం టెస్ట్‌ బుక్‌లెట్‌ను ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. టెస్ట్‌ సమయంలో అదనపు పేపర్లను ఇవ్వరు.
రీడింగ్‌ సెక్షన్‌
* Vocabulary కంటే మించి మరోటి ఏదీ ఈ స్కోరును ప్రభావితం చేయలేదు. లెక్కలేనన్ని పదాలు తెలిసివుంటే సరిపోదు. శాట్‌లో సాధారణంగా అడిగే పదాల జాబితా తయారుచేసుకుని నేర్చుకోవాలి.
* పాసేజిలను నెమ్మదిగా చదివి, జవాబులను వేగంగా రాయటం- విద్యార్థులు చేసే పెద్ద పొరబాటు. పాసేజిలోని ప్రతి వివరం పట్టించుకోనక్కర్లేదు. జవాబులు రాయటానికి అన్ని వివరాల అవసరమూ ఉండదు. కీలకమైన అంశాలపైనే దృష్టి పెట్టడం సముచితం.
* ముఖ్యమైన అంశాలను పెన్సిల్‌తో మార్క్‌ చేయాలి. ఇలా చేయకుండా ప్రతిదీ మెదడులో ఉంచుకోవాలని ప్రయత్నించకూడదు.
రైటింగ్‌ సెక్షన్‌
* ఎస్సేకు ఎప్పుడూ ముగింపు రాయాలి. అసంపూర్తి వ్యాసానికి పాయింట్లు తగ్గిపోతాయి. కనీసం ఒకటిన్నర పేజీలు రాయాలని గుర్తుంచుకోవాలి. చెప్పదల్చిన అంశాన్ని బలపరిచే ఉదాహరణలను రాయాలి. ఇవి సాహిత్యం, చరిత్ర, వర్తమాన అంశాల నుంచి ఉండొచ్చు. వ్యాకరణపరంగా దోషరహితంగా వ్యాసం ఉండనక్కర్లేదు కానీ దానికి సరైన క్రమం, నిర్మాణం ఉండితీరాలి. ఐదు పేరాగ్రాఫుల్లో ఏ అంశంమీదనైనా సమర్థంగా, సమగ్రంగా వ్యాసం రాయొచ్చు.
* సబ్జెక్ట్‌ వెర్బ్‌ అగ్రీమెంట్‌, ప్రొనౌన్‌ యూసేజి, మోడిఫయర్స్‌ లాంటి ముఖ్యమైన వ్యాకరణ నిబంధనలు తెలిసివుండాలి. శాట్‌ తరచూ వీటిలోనే ఎక్కువ పరీక్షిస్తుంది.
- Manya Abroad- The Princeton Review.


Ask the Expert
Click Here..