ఉచితం...ఉన్నతం... ఐరోపా విద్య

విదేశీ డిగ్రీ కోసం లక్షలు ఖర్చుచేస్తూ... అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యు.కె.లనే భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. కానీ ఎలాంటి ఫీజులు లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తోన్న దేశాలు ఐరోపాలో చాలా ఉన్నాయి. అధికశాతం యూనివర్సిటీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండటం, నిధులు విరివిగా లభిస్తుండటంతో జర్మనీ, ఫ్రాన్స్‌, ఆస్ట్రియా, స్వీడన్‌, బెల్జియం, ఫిన్‌లాండ్‌, ఇటలీ, నార్వే దేశాలు ఉచితంగా, లేదా నామమాత్ర ఫీజులతో ఉన్నత విద్యను అందిస్తున్నాయి. మంచి ప్రతిభ గల, లక్షల్లో ట్యూషన్‌ ఫీజులు చెల్లించలేని విద్యార్థులు ఐరోపా దేశాలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఈ దేశాల్లో విద్యావ్యవస్థ ప్రత్యేకతలు, ప్రవేశ వివరాలను తెలుసుకుందాం.

 
ఐరోపాకు విద్య, పరిశోధనల పరంగా ఘనచరిత్ర ఉంది. ఐన్‌స్టీన్‌, అరిస్టాటిల్‌, మేడమ్‌ క్యూరీ, న్యూటన్‌, రుడాల్ఫ్‌ డీజెల్‌, కార్ల్‌ బెంజమిన్‌ లాంటి మేథావులు, శాస్త్రవేత్తలు ఐరోపాకు చెందినవారే. పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే విద్యాసంస్థలు ఐరోపాలో అధికంగా ఉన్నాయి. అంతర్జాతీయ ర్యాంకింగ్‌లలో అనేక యూనివర్సిటీలు ఉన్నత స్థానాల్లో ఉంటుంటాయి. అందుకే ఐరోపా యూనివర్సిటీల్లోని పరిశోధకులకు, అధ్యాపకులకు తరచుగా నోబుల్‌ బహుమతులు వస్తుంటాయి.
ఐరోపాలోని చాలా దేశాలు విద్యారంగానికి జీడీపీలో సుమారు 20 శాతం నిధులను కేటాయిస్తున్నాయి. ఎక్కువ యూనివర్సిటీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. ప్రైవేటు కంపెనీలు కూడా ఉదారంగా నిధులను అందిస్తున్నాయి. దీనివల్ల అనేక యూనివర్సిటీలు ఎలాంటి ట్యూషన్‌ ఫీజులు లేకుండా, మరికొన్ని సంస్థలు నామమాత్ర ఫీజులతో కోర్సులను నిర్వహిస్తున్నాయి. అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, తదితర దేశాల్లో స్థానిక విద్యార్థుల కంటే విదేశీ విద్యార్థులకు ఫీజులు అధికంగా ఉంటాయి. కానీ ఐరోపా దేశాలు విదేశీ, స్థానిక విద్యార్థులు అనే తేడా లేకుండా, అందరికీ ఒకే ఫీజుల విధానాన్ని వర్తింపజేయడం విశేషం.
స్కాలర్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు
ఐరోపా యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరిగా చేయాలి. ఇది పాఠ్యప్రణాళికలో ముఖ్యభాగం. స్వీడన్‌, ఇటలీ లాంటి దేశాల్లో చదవడానికి ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌, జీఆర్‌ఈ స్కోర్లు తప్పనిసరేమీ కాదు. చాలా బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశానికి జీమ్యాట్‌ స్కోరు కూడా అవసరం లేదు. కానీ ఈ స్కోర్లు ఉంటే ప్రాధాన్యం ఇస్తారు. విభిన్న రకాల కోర్సులు ఐరోపా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. జర్మనీలో మెకానికల్‌, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఆటోమొబైల్‌ కోర్సులు; ఫ్రాన్స్‌లో న్యూక్లియర్‌ ఎనర్జీస్‌, మేనేజ్‌మెంట్‌, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, ఏరోనాటిక్స్‌, తదితర కోర్సులకు ప్రాధాన్యం ఉంటుంది. ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌తోపాటు ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులు చేయవచ్చు. స్పోర్ట్స్‌, ఆధ్యాత్మికం, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సంబంధిత కోర్సులకు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పెరుగుతోంది.
ట్యూషన్‌ ఫీజులు లేకపోగా... ఇతర ఖర్చులకు కూడా అనేక స్కాలర్‌షిప్‌లు ఐరోపా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. యూరోపియన్‌ కమిషన్‌, ఆయా దేశాల ప్రభుత్వాలు, సొసైటీలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు విరివిగా స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి.
జర్మనీ (DAADస్కాలర్‌షిప్‌లు, ఇండో - జర్మన్‌ స్కాలర్‌షిప్‌లు), ఫ్రాన్స్‌ (క్యాంపస్‌ ఫ్రెంచ్‌, ఇంటర్నేషనల్‌ స్కాలర్‌షిప్‌లు), స్వీడన్‌, ఫిన్‌లాండ్‌లలో ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులకు వివిధ రకాల ఇంటర్నేషనల్‌ స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి. నార్వేలో ఆసియా కోటా కింద స్కాలర్‌షిప్‌లు ఉంటాయి. అందువల్ల రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు.
ఫెలోషిప్‌ మొత్తం యూనివర్సిటీ, సంబంధిత స్కీమ్‌లను బట్టి 1000 నుంచి 2000 యూరోల వరకు ఉంటుంది. నెదర్లాండ్స్‌లో యూనివర్సిటీ ఉద్యోగిగా స్కేల్‌ 4 వేతనం పొందే అవకాశం ఉంటుంది.
పరిశ్రమలతో అనుసంధానం
ఐరోపా విద్యావ్యవస్థలోని అద్భుత లక్షణం... యూనివర్సిటీలకు, పరిశ్రమలకు మధ్య అనుసంధానం. పరిశ్రమలతో కలిసి పనిచేయడానికి యూనివర్సిటీలు అధిక ప్రాధాన్యం ఇస్తాయి. వివిధ కోర్సులు చేసిన విద్యార్థులు తమ సబ్జెక్టుకు సంబంధించిన పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌ చేయడానికి యూనివర్సిటీలు అవకాశం కల్పిస్తాయి. లైవ్‌ రిసెర్చ్‌ ప్రాజెక్టుల్లో పనిచేయవచ్చు. పాఠ్యప్రణాళికలో నవ్యత్వం ఉంటుంది. సాంస్కృతిక పరంగా కూడా ఐరోపా దేశాల్లో మరింత భిన్నత్వం, పోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త భాషలు నేర్చుకోవడానికి వీలుంటుంది. మంచి ఉద్యోగ అవకాశాలు సాధించడానికి ఇవి తోడ్పడతాయి. చదువుకుంటూ పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేయడానికి అనుమతిస్తారు.
అనేక ఇతర దేశాలతో పోల్చుకుంటే ఐరోపా దేశాల్లో నేరశాతం చాలా తక్కువ. పర్యావరణానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు.
వీసా కంటే ప్రవేశం కష్టం...
వీసా సాధించడం కంటే ఐరోపా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందడం కష్టం. ప్రభుత్వ యూనివర్సిటీల్లో గరిష్ఠంగా 30 వరకు మాత్రమే సీట్లు ఉంటాయి. వీటిలో సాధారణంగా 50 శాతం.. అంటే 15 సీట్లు విదేశీ విద్యార్థులకు కేటాయిస్తారు.
ఐరోపా విద్యలో మరో విశిష్ఠత... Schengen visa. విదేశీ విద్యార్థులకు దీన్ని ఇస్తారు. దాదాపు ఐరోపా దేశాలన్నింటికీ ఇదే వీసా సరిపోతుంది. ఈ వీసా పొందడం కూడా తేలిక. కనీస ఫైనాన్షియల్‌ డాక్యుమెంటేషన్‌ అవసరం. యూనివర్సిటీలను బట్టి వీసా నిబంధనల్లో మార్పులు ఉండొచ్చు. అడ్మిషన్‌ మార్గదర్శకాల్లో వీటిని పొందుపరుస్తారు.
ఏదైనా స్కాలర్‌షిప్‌ లేదా ఫెలోషిప్‌ స్కీమ్‌లకు ఎంపికైన విద్యార్థులు ఫైనాన్షియల్‌ సెక్యూరిటీ చూపించాల్సిన అవసరం ఉండదు. లేకపోతే సంబంధిత దేశంలో జీవించడానికి అవసరమైన మొత్తాన్ని డాక్యుమెంటేషన్‌లో చూపించాలి. దీన్ని బ్యాంకు లోను, పొదుపు ఖాతా లేదా స్పాన్సర్‌షిప్‌ రూపంలో చూపించవచ్చు.
ప్రవేశ విధానం...
విద్యార్థులకు మంచి అకడమిక్‌ రికార్డు అవసరం. ముందుగా దరఖాస్తు సమయాన్ని తెలుసుకోవాలి. చాలావరకు ఐరోపా యూనివర్సిటీలు త్వరగా అడ్మిషన్‌ ప్రక్రియను ముగించేస్తాయి. 2013 ఆగస్టులో ప్రారంభమయ్యే ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నవంబరు, డిసెంబరులో ఉంటుంది. జనవరి 15, 2013 నాటికి దరఖాస్తు ప్రక్రియ పూర్తవ్వాలి. జర్మనీ, ఫ్రాన్స్‌, స్వీడన్‌, ఫిన్‌లాండ్‌, నార్వే దేశాలతో సహా 50 శాతం యూనివర్సిటీలు ఈ గడువులను పాటిస్తాయి. ఇతర దేశాల్లోని సంస్థలకు మార్చి - ఏప్రిల్‌ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యం ఇస్తాయి. మరికొన్ని దేశాల్లో ఆసియా విద్యార్థులకు సీట్లలో ప్రత్యేక కోటా ఉంటుంది.
ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జీఆర్‌ఈ, టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్లు లేకపోయినా ఫర్వాలేదు. కొన్ని యూనివర్సిటీలకు ఈ స్కోర్లు తప్పనిసరేమీ కాదు.
నిధుల సమస్యలు లేనందువల్ల చాలా యూనివర్సిటీల్లో నాణ్యమైన అంతర్జాతీయ పరిశోధన కేంద్రాలు ఉంటాయి. మంచి అకడమిక్‌ రికార్డు, అంతర్జాతీయ ప్రచురణలు, 1-2 ఏళ్ల పరిశోధన అనుభవం ఉంటే పీహెచ్‌డీలో ప్రవేశం పొందడం తేలిక.
ప్రవేశాల సమయంలో...
ప్రపంచవ్యాప్తంగా ఉచిత విద్యకు ఆదరణ పెరుగుతోంది. ఐరోపాలో ప్రధానంగా జర్మనీ, స్వీడన్‌, నార్వే, ఆస్ట్రియా, ఫిన్‌లాండ్‌, తదితర దేశాల్లో ఉచిత విద్య అందుబాటులో ఉంది. ఐరోపాలో ప్రభుత్వ యూనివర్సిటీలు మూడు కేటగిరీలుగా ఉంటాయి. అవి.. హెచ్‌.ఎస్‌. (యూనివర్సిటీ), ఎఫ్‌.హెచ్‌. (అప్లయిడ్‌ సైన్సెస్‌), టి.యు. (టెక్నికల్‌ యూనివర్సిటీ). వీటిని ప్రభుత్వమే వర్గీకరిస్తుంది. ప్రైవేటు యూనివర్సిటీలు చాలా తక్కువ. వీటితో పోల్చుకుంటే ప్రభుత్వ యూనివర్సిటీలు చాలా తక్కువ ఫీజులు వసూలు చేస్తాయి. చాలా సంస్థల్లో ఫీజు అసలు ఉండదు. విద్యార్థులు నామమాత్ర అడ్మిషన్‌ ఫీజు, పరీక్షల ఫీజులు చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వ యూనివర్సిటీలు ఎక్కువగా వందల సంవత్సరాల కిందట ఏర్పాటు చేసినవి ఉంటాయి. అగ్రశ్రేణి సంస్థల్లో విస్తృత సంఖ్యలో కోర్సులు అందుబాటులో ఉంటాయి.
ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు చాలా పోటీ ఉంటుంది. పూర్తిగా ఇంగ్లిష్‌లో బోధించే కోర్సులను ఇంటర్నేషనల్‌ కోర్సులు అంటారు. వీటిలో సీట్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల పోటీ ఎక్కువ. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు ఐరోపా యూనివర్సిటీలు ప్రసిద్ధిచెందినవి.
ఏమి అవసరం?
విద్యార్థులు 16 ఏళ్లు చదివుండాలి. మంచి యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవాలంటే అకడమిక్‌ రికార్డు బాగుండాలి. విద్యార్థులకు స్కూల్‌ లీవింగ్‌ సర్టిఫికెట్‌, బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌, యూనివర్సిటీ ట్రాన్‌స్క్రిప్ట్‌లు, ప్రొవిజనల్‌, సీఎంఎం, ఒరిజినల్‌ డిగ్రీ (అందుబాటులో ఉంటే), లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌, టోఫెల్‌ (90) / ఐఈఎల్‌టీఎస్‌ (6.5), జీఆర్‌ఈ (తప్పనిసరి కాదు), లెటర్‌ ఆఫ్‌ మోటివేషన్‌, సీవీ, స్థానిక భాషలో సామర్థ్యం (తప్పనిసరి కాదు), తదితర డాక్యుమెంట్లు అవసరం.
యూనివర్సిటీని బట్టి ప్రవేశ నిబంధనల్లో మార్పులు ఉండొచ్చు. ప్రభుత్వ యూనివర్సిటీలకు మంచి మార్కులు, స్కోర్లు అవసరం. ప్రైవేటు యూనివర్సిటీల్లో ఈ శాతాలు కొంచెం తక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఎక్కువ సంస్థలు అకడమిక్స్‌లో 70 శాతంపైగా మార్కులుంటే ప్రాధాన్యం ఇస్తాయి.
అడ్మిషన్‌ ప్రక్రియ కనీసం 3-4 నెలలు, అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. నేరుగా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. యూనివర్సిటీ అధికారులు స్థానిక భాషలో మాట్లాడే అవకాశాలు ఎక్కువ. చాలా సంస్థల వెబ్‌సైట్లు కూడా స్థానిక భాషల్లోనే ఉంటాయి. ఇవి చిన్న ప్రతికూల అంశాలు.
అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో కోర్సు ప్రారంభానికి చాలా ముందుగా దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. టెక్నికల్‌, సైన్స్‌ స్ట్రీమ్‌ల విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకుంటే అడ్మిషన్‌ లభించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ వరకు వేచి చూడకూడదు. డిసెంబరులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడం మంచిది.
భాష అవరోధం కాదు...
ఐరోపాలోని చాలా యూనివర్సిటీల్లో బోధన ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. కొన్ని సంస్థల్లో స్థానిక భాషల్లో కూడా కోర్సులు ఉంటాయి. విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. 100 శాతం ఇంగ్లిష్‌లో బోధన ఉండే కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలి. వీటికి స్థానిక భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, నేర్చుకుంటే పార్ట్‌ - టైమ్‌ ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ల విషయంలో కూడా ప్రయోజనం ఉంటుంది.
చదువు పూర్తయ్యాక పరిస్థితి ఏమిటనేది మరో ముఖ్య అంశం. ఐరోపా విద్యలో ఇంటర్న్‌షిప్‌ చాలా కీలకమైన భాగం. ఈ సమయంలో విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించాలి. మంచి అనుభవం సాధించాలి. తద్వారా ఉద్యోగం సాధించడం తేలికవుతుంది. ఇంటర్న్‌షిప్‌ సమయంలో నెలకు 800 నుంచి 1600 యూరోల వరకు వేతనం ఇస్తారు. చదువు పూర్తయ్యాక ఆర్నెల్ల నుంచి ఏడాది వరకు వీసాను పొడిగించుకోవచ్చు. ఉద్యోగం లభించాక వర్క్‌ పర్మిట్‌ లేదా పీఆర్‌ (పర్మనెంట్‌ రెసిడెన్షియల్‌) వీసాగా దీన్ని మార్చుకోవచ్చు. ఐరోపాలోని 27 దేశాల్లో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి ఒకే వీసా ఉపయోగపడటం విశేషం.


Ask the Expert
Click Here..