ఎంబీబీఎస్‌కు విదేశీ భరోసా!

తీవ్రమైన ఎంసెట్‌ పోటీలో నిలవలేక ఎంబీబీఎస్‌ ప్రవేశం ఇక అసాధ్యమనుకుని ఎందరో నిరాశపడుతుంటారు. ఇలాంటివారికి విదేశీ విశ్వవిద్యాలయాలు భరోసాగా నిలుస్తున్నాయి. వీరు చేయాల్సిందల్లా తమకు అన్నివిధాలా అనుకూలమైన దేశాన్నీ, అక్కడి విద్యాసంస్థనూ జాగ్రత్తగా ఎంచుకుని చేరటం. ఆపై శ్రద్ధగా విద్యాభ్యాసం చేస్తే... తమ కలలు సాకారం చేసుకున్నట్టే!
ఎంబీబీఎస్‌ చదవాలని కోరుకునే విద్యార్థులకు అనేక దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. డొనేషన్ల అవసరం లేకుండా, ప్రవేశపరీక్షలు రాయకుండా కేవలం ఇంటర్‌ మార్కులతో తమ వైద్యకళాశాలల్లో చేరగలిగే అవకాశాన్ని ఇవి అందిస్తున్నాయి. ముఖ్యంగా చైనా, కిర్గిస్థాన్‌, ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌, జార్జియా, తజకిస్థాన్‌, సెంట్రల్‌ అమెరికా దేశాలు మనదేశ విద్యార్థులను పెద్దసంఖ్యలో చేర్చుకుంటున్నాయి.
ఈ రకంగా కొంత చొరవ, మరికాస్త ధైర్యం, రూ. 15- 25 లక్షలు (ఫీజు, ఇతర ఖర్చులతో) చెల్లించగల మధ్యతరగతి విద్యార్థులు కూడా కోర్సు పూర్తిచేసి నాణ్యమైన వైద్యపట్టా సాధించగలుగుతున్నారు. స్క్రీనింగ్‌ టెస్టులో నెగ్గి మాతృభూమిలో డాక్టరుగా ప్రాక్టీస్‌ చేసుకోగలుగుతున్నారు.

కనీస అర్హతలు
విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించగోరే విద్యార్థికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే అడ్మిషన్‌ తీసుకున్న ఏడాది డిసెంబర్‌ 31 నాటికి వయసు లెక్కింపు చేయాలి.
రెండో అంశం- హైయర్‌ సెకండరీ ఎగ్జామినేషన్‌/ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అంటే 12 ఏళ్ల చదువులో చివరి రెండు సంవత్సరాల్లో భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రంతోపాటు ఇంగ్లిష్‌ కూడా ఒక సబ్జెక్టు తప్పనిసరిగా ఉండాలి. లేదా.. ఇంటర్‌లో భౌతికశాస్త్రం, రసాయశాస్త్రం, జీవపరిణామ శాస్త్రాల్లో ప్రాక్టికల్స్‌తోపాటు ఆంగ్లం పాఠ్యాంశంగా తప్పనిసరిగా ఉండాలి. అంటే... మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ బైపీసీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు పూర్తిగా అర్హులు. ఎస్టీ, ఎస్‌సీ, బీసీ విద్యార్థులైతే 40 శాతం మర్కులు వచ్చినా సరిపోతుంది. పూర్తి వివరాలకు: www.mciindia.org సందర్శించవచ్చు. ఈ సైట్‌లో స్క్రీనింగ్‌ టెస్ట్‌ రెగ్యులేషన్స్‌ 2002, ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ రెగ్యులేషన్స్‌ 2002, గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్స్‌ 1997 జీవోలను పరిశీలించినట్లయితే సవివరమైన సమాచారం లభ్యమవుతుంది.
నిబంధనలు మారాయి
మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌కు సంబంధించి పబ్లిక్‌ నోటీసు 07.10.2013న విడుదల చేసింది. గత ఏడాది మే నెల 15కంటే ముందు విదేశీ వైద్యవిద్యను చదవగోరే విద్యార్థులు ఎంసీఐను సంప్రదించి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ను పొందేవారు. ఇకపై ఈ తేదీ తరువాత విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించేందుకు వెళ్లేవారు ఎంసీఐ నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ పొందాల్సిన అవసరం లేదు.
విద్యార్థులు ఇక్కడే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో సరైన కళాశాల ఎంపికలో ఏ మాత్రం పొరపాటు చేసినా ఎంసీఐ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ను తిరస్కరించేది. ఇప్పుడు మాత్రం గుర్తింపు విషయంలో సరైన నిర్థ్ధారణకు వచ్చి తగిన కళాశాల ఎంపిక చేసుకునే బాధ్యత విద్యార్థులదే!
ముఖ్యంగా ఇదే సంవత్సరం కొత్తగా ప్రారంభించిన కళాశాలల గుర్తింపు విషయంలో సకల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి! ఇందుకు కన్సల్టెన్సీలు చెప్పిన విషయాలతోనే సరిపుచ్చుకుని ఒక అభిప్రాయానికి రాకుండా, స్వీయ నిర్థ్ధారణలో భాగంగా సీనియర్‌ విద్యార్థులను సంప్రదించడం మేలు.
కళాశాలల ఎంపిక
ఎంసీఐ నిబంధనలూ, సూచనల పట్ల పూర్తి సమాచారం తెలుసుకుని విదేశాల్లో వైద్య కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. ప్రపంచ ఆరోగ్యసంస్థ తన వైద్య నిఘంటువును 'అవిసెన్నా' డిక్షనరీ ఆఫ్‌ మెడిసిన్‌కు బదిలీ చేసింది. దేశాలవారీగా వైద్యకళాశాలల చిట్టా అందులో పొందుపరచి ఉంది. ఎంపిక చేసుకున్న దేశాల్లో సదరు కళాశాల ఉన్న విషయాన్ని నిర్థా´రించుకుని ఆయా కళాశాలల్లో చేరవచ్చు/ విదేశాల్లో ఉన్న మన భారతీయ ఎంబసీ నిర్థ్ధారించినా ఆ కళాశాలలో చేరవచ్చు.
http://avicenna.ku.dk/database/medicine
ప్రధానంగా చైనా దేశానికి సంబంధించి ఈ సంవత్సరం 52 కళాశాలలకు అనుమతి ఉంది. ఈ కళాశాలల్లో మాత్రమే ఆంగ్లంలో బోధన ఉందని అక్కడి ప్రభుత్వం తెలియజేసినందున వీటిలో మాత్రమే చేరటం శ్రేయస్కరం. పూర్తి వివరాలకు www.mciindia.org/MediaRoom/ListofChinaColleges.aspx సైట్‌ను సందర్శించాలి.
కళాశాలల్లో చేరేముందు...
* విద్యార్థులు కళాశాలలో చేరేముందే పాస్‌పోర్టు కలిగి ఉండాలి. మన ఉభయ రాష్ట్రాల్లో రెండు ప్రాంతీయ కార్యాలయాలు- ఒకటి సికింద్రాబాదులో, రెండోది విశాఖపట్నంలో ఉన్నాయి. విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలతోపాటు ఉభయ గోదావరి జిల్లా వాసులు మాత్రమే సంప్రదించాలి. మిగిలిన ప్రాంతాలైన రాయలసీమ, తెలంగాణ పది జిల్లాలు, నెల్లూరు నుంచి కృష్ణాజిల్లా వాసులు సికింద్రాబాదులో పాస్‌పోర్టు కార్యాలయాన్ని సంప్రదించాలి. అయితే సికింద్రాబాదు పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలో కొన్ని ఉపకార్యాలయాలున్నాయి. హైదరాబాద్‌లోనే బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకిలోనూ, తిరుపతి, విజయవాడ, నిజామాబాద్‌లోనూ ఈ ఉపకార్యాలయాలున్నాయి.
పాస్‌పోర్టుకు కావాల్సిన ధ్రువపత్రాలు
1. స్టడీ సర్టిఫికెట్లలో పదో తరగతి పాస్‌/ మార్కుల జాబితా
2. నివాస ధ్రువపత్రం- ఆధార్‌ కార్డు వంటివి
3. మునిసిపాలిటీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి, జనన మరణ రిజిస్ట్రార్‌ కార్యాలయం జారీ చేసిన జనన ధ్రువపత్రం (ఫారం 5).
ఈ పత్రాలతో పాస్‌పోర్ట్‌ కార్యాలయాన్ని సంప్రదించి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయవచ్చు.
* ఎంపిక చేసుకున్న కళాశాల నుంచి ముందుగానే అడ్మిషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా గానీ, కళాశాలలు అనుమతించిన కన్సల్టెన్సీల ద్వారా కానీ ప్రవేశం పొందుతుంటారు.
* సకాలంలో పాస్‌పోర్టు పొంది ఆ పాస్‌పోర్టుపై ఆ దేశ ఎంబసీని సంప్రదించి స్టూడెంట్‌ వీసా స్టాంపింగ్‌ వేసుకోవాలి. విదేశానికి వెళ్లాలంటే ఈ విద్యార్థి వీసా తప్పనిసరి.
కొన్ని దేశాల ఎంబసీలకు విద్యార్థి నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేదు. ఇటువంటి దేశాలు కిర్గిస్థాన్‌, చైనా వంటివి. మరికొన్ని దేశాల విషయంలో- విద్యార్థి మనదేశంలో ఉన్న ఆ దేశ ఎంబసీలో కౌన్సెలర్‌ ముందు హాజరు కావాల్సి ఉంది. ఇటువంటి దేశాలు ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌ వంటివి!
* ప్రయాణం దగ్గరపడుతున్నపుడు- వెళుతున్న దేశానికి సంబంధించి ఫ్లయిట్‌ టికెట్‌ బుకింగ్‌ వంటివి తగిన సమాచారాన్ని పొంది అందుకు పూర్తిగా సిద్ధపడాలి. ఫీజు పైకం సిద్ధం చేసుకోవాలి. సొంత అవసరాల కోసం మన దగ్గర ఉన్న బ్యాంకులోనే అకౌంట్‌ ప్రారంభించి అంతర్జాతీయంగా ఉపయోగపడే ఏటిఎం/ డెబిట్‌ కార్డును వెంట తీసుకుని వెళ్లినట్లయితే విద్యార్థులు సొంత ఖర్చుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు.
* ఏ దేశానికి వెళుతున్నారో ఆ దేశ వాతావరణ పరిస్థితులు పూర్తిగా తెలుసుకోవాలి. అందుకు మానసికంగా సిద్ధపడాలి.
* కొన్ని విశ్వవిద్యాలయాల్లో భారతీయ భోజనం లభ్యమయ్యే మెస్‌లను కన్సల్టెన్సీలు తమ సర్వీసుల్లో భాగంగా నిర్వహిస్తున్నాయి. మరికొన్ని దేశాల్లో విద్యార్థులే అందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
* తరచుగా ఇబ్బందిపెట్టే తలనొప్పి, జలుబు, సాధారణంగా వచ్చే జ్వరం వంటి వాటికి డాక్టర్‌ను ముందుగా సంప్రదించి తగిన మందులను కొద్దిరోజులకు సరిపడా ఇక్కడి నుంచే తీసుకువెళ్లడం మంచిది.
* ప్రయాణంలో మీ వెంట స్టడీ సర్టిఫికెట్లు, వీసా స్టాంపింగ్‌ ఉన్న పాస్‌పోర్టు, కొంత విదేశీ కరెన్సీ, విశ్వవిద్యాలయం వరకు వెళ్లేందుకు విమానం టికెట్టు వెంట తీసుకుని వెళ్లాలి.
* ఆరోగ్య బీమా పాలసీ పొందడం మంచిది. దాని అవసరం రాకపోవడమే మంచిది. అవసరం రావడంలేదని పాలసీ తీసుకోకపోవడం తెలివైన పని అనిపించుకోదు. కొన్ని పాలసీలు ప్రయాణంలో లగేజీ పోయినా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. విదేశాల్లో విద్యార్థి అనారోగ్యం పాలయితే అతడికి అక్కడ తల్లిదండ్రుల అవసరం కావాల్సివస్తే పాలసీదారు తల్లిదండ్రులకు ప్రయాణఖర్చులు భరించగలరు. ఒకవేళ విద్యార్థి భారత్‌కు రావాలనుకుంటే తన ప్రయాణ టికెట్లనూ పాలసీదారు భరిస్తారు.
విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు విద్యాపరంగా తమ ఆశయం నెరవేర్చుకోవడానికి ఇష్టంతో వెళుతున్నారు కాబట్టి విమాన ప్రయాణం నుంచి ప్రతిదీ ఆనందించగలగాలి. అక్కడ వాతావరణాన్నీ, పరిస్థితులనూ ఇష్టపడాలి. కోర్సు పట్ల పూర్తి ఏకాగ్రత చూపాలి. వైద్యవిద్యతోపాటు విదేశాల్లో కొంతకాలం నివసించే అవకాశం లభించింది. అక్కడి సమాజంతో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిణామాలను ఆస్వాదించాలి. కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకుంటే నిపుణుడైన వైద్యుడిగా డాక్టర్‌ పట్టాతో మాతృభూమిపై సగర్వంగా అడుగుపెట్టొచ్చు!
ముఖ్యమైన జాగ్రత్తలు
భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) గుర్తింపు సదరు విశ్వవిద్యాలయానికి ఉందన్న విషయాన్ని నిర్థారించుకోవాలి.
* ఆంగ్ల మాధ్యమంలో బోధన ఏమేరకు జరుగుతున్నదీ తెలుసుకోవాలి.
* చదవడానికి అయే ఫీజు (ట్యూషన్‌ ఫీజు), ఇతరత్రా ఫీజు కచ్చితంగా ఎంత ఉన్నదీ నిర్ధారించుకోవాలి.
* కోర్సు వ్యవధి అంటే ఎన్ని సెమిస్టర్లు, ఎన్ని సంవత్సరాలన్నది ముందుగా తెలుసుకోవాలి.
* బోధనలో స్థానిక భాష ప్రాధాన్యం ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి. ఆంగ్లభాష బోధన నామమాత్రంగా ఉందేమో నిర్ధారించుకోవాలి.
* దేశ రాజధానిలోగానీ, మహానగరాల్లోగానీ ఉన్న కళాశాలలను మాత్రమే ఎంపిక చేసుకుంటే ప్రయాణం తేలికగా ఉంటుంది.
* ఆ దేశంలో ఉన్న భారతీయ ఎంబసీ అనుమతి, పట్టాలపై ఎంబసీ రాజముద్ర వేయడం వంటివి తప్పనిసరిగా ఉండాలి.
* మరింత లోతుగా పరిశీలించి ఆ కళాశాల నుంచి వస్తున్న విద్యార్థుల ఉత్తీర్ణత, స్క్రీనింగ్‌ టెస్టులో ఫలితాలు ఎంత మెరుగ్గా ఉన్నదీ పరికించాలి.
* వాతావరణ పరిస్థితులు, భారతీయ భోజనం లభ్యత పట్ల పూర్తి అవగాహన కలిగివుండాలి.
అపోహలు - నిజాలు
విదేశాల్లో వైద్యవిద్యను బోధించే కళాశాలల ఎంసీఐ గుర్తింపు పట్ల అనేక అనుమానాలు, భయాలు చాలామంది తల్లిదండ్రులు వ్యక్తం చేస్తుంటారు.
విదేశాల్లో చదదివిన డాక్టర్‌కు ఇక్కడ డాక్టర్‌తో సమానమైన గుర్తింపు ఉంటుందా అన్నది ఇందులో ప్రధానమైనది. భారతీయ వైద్యమండలి నిర్ధారించిన కళాశాలల్లో వైద్యవిద్యను అభ్యసించి, డాక్టర్‌ సర్టిఫికెట్‌తో భారతదేశానికి వచ్చిన తరువాత రెండు లాంఛనాలను పూర్తిచేయాల్సివుంటుంది.
1) నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించే ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ (ఎఫ్‌ఎంజీ)/ స్క్రీనింగ్‌ టెస్టులో ఉత్తీర్ణులు కావటం.
2) ఆ వెంటనే ఎంసీఐ గుర్తించిన ఆస్పత్రిలో హౌస్‌ సర్జన్సీని ఒక ఏడాదిలో పూర్తిచేయటం.
అలా పూర్తిచేసినవారికి ఎంసీఐ పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ అందజేస్తుంది. ఇక ఆ డాక్టర్‌ మనదేశంలో మెడిసిన్‌ చేసిన డాక్టర్‌తో పూర్తిగా సమానులు కాగలరు. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగాలు చేయడానికీ, ప్రాక్టీసు చేసుకోవడానికీ, ఉన్నత చదువులు చదవడానికీ అర్హులవుతారు.


Ask the Expert
Click Here..