వెర్బల్‌ రీజనింగ్‌... పదజాల పరీక్షా?

అమెరికా లాంటి దేశాల విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి విద్యార్థులు రాయాల్సిన పరీక్ష- గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామ్‌ (GRE). దీనిలోని మూడు భాగాల్లో ఒకటైన వెర్బల్‌ రీజనింగ్‌లో అత్యధిక స్కోరు చేసే మెలకువలను తెలుసుకుందాం!
జీఆర్‌ఈలో వెర్బల్‌ రీజనింగ్‌ విభాగాలు రెండు ఉంటాయి. ప్రతి సెక్షన్‌ 20 ప్రశ్నలతో ఉంటుంది. 30 నిమిషాల్లో పూర్తిచేయాల్సివుంటుంది. వెర్బల్‌ రీజనింగ్‌లో స్కోరు 130-170 మధ్య ఉంటుంది.
మనదేశ విద్యార్థుల్లో జీఆర్‌ఈ రాసేవారిలో ఎక్కువమంది నేపథ్యం టెక్నికల్‌ లేదా సైన్స్‌ అయివుంటోంది. దీంతో వీరు వెర్బల్‌ విభాగాలను కఠినంగా భావిస్తున్నారు. ఇలాంటివారికి నేనిక్కడ స్పష్టం చేయాలనుకుంటున్నదేమిటంటే.. వెర్బల్‌ రీజనింగ్‌ అనేది మీ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ లేదా ఒకాబులరీని పరీక్షించేది కాదు. ఇది మీ భాషాసామర్థ్యాలను ఉపయోగించి తర్కం, రీజనింగ్‌లను పరీక్షించేది. తగిన అవగాహనతో దీనికి సిద్ధమైతే మంచి స్కోరును తేలిగ్గానే తెచ్చుకోవచ్చు!

ఎంత స్కోరు అవసరం?
సాంకేతిక కోర్సుల్లో చేరదలిచిన విద్యార్థులకు వెర్బల్‌ సెక్షన్‌లో కనీసం 145+ స్కోరు ఉండాలని విశ్వవిద్యాలయాలు భావిస్తాయి. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్రవేశం విషయంలో క్వాంటిటేటివ్‌ స్కోరుకు ఎక్కువ వెయిటేజి ఉంటుందని గ్రహించాలి. ఎక్కువ విశ్వవిద్యాలయాలు తమ కోర్సుల్లో ప్రవేశానికి క్వాంటిటేటివ్‌లో 155+ స్కోరు, వెర్బల్‌లో 145+ స్కోరును కనీస అవసరంగా పేర్కొంటున్నాయి. ఇక ఆర్ట్స్‌, సైన్స్‌, సాంకేతికేతర ప్రోగ్రాముల్లో చేరదలిచిన విద్యార్థులు వెర్బల్‌ రీజనింగ్‌ విభాగంలో కనీం 150 పాయింట్ల స్కోరు తప్పనిసరిగా సాధించాల్సివుంటుంది.
ఏ తరహా ప్రశ్నలు?
వెర్బల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు స్థూలంగా మూడు రకాలుగా ఉంటాయి. 1) సెంటెన్స్‌ ఈక్వివలెన్స్‌ 2) టెక్ట్స్‌ కంప్లీషన్‌ 3) రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ .
మొదటి రెండూ ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌ ప్రశ్నలు. వీటిని రాయటానికి క్రిటికల్‌ రీడింగ్‌, ఒకాబులరీ నైపుణ్యాలు అవసరం.
రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు లాంగ్‌, షార్ట్‌ పాసేజ్‌లు రెంటినుంచీ వస్తాయి. ఈ పాసేజ్‌ల్లోని ప్రశ్నలను సరిగా రాయాలంటే ఎనలిటికల్‌ రీజనింగ్‌, క్రిటికల్‌ రీడింగ్‌ నైపుణ్యాలు అవసరం.
క్రిటికల్‌ రీడింగ్‌ అంటే?
వెర్బల్‌ రీజనింగ్‌లో బాగా స్కోరు చేయటానికి మంచి పఠన నైపుణ్యాలు చాలా ముఖ్యం. పఠన ప్రయోజనాన్ని బట్టి మనం చదివే తీరు ఆధారపడివుంటుంది. వార్తాపత్రికను చదివే పద్ధతీ, పరీక్షలకు పాఠ్యపుస్తకం చదివే పద్ధతీ ఒకటి కాదు. వార్తాపత్రికలు యథాలాపంగా చదివేవి. వీటిలో కొన్ని వార్తాకథనాలను పైపైన చూస్తాం. కొన్నిటిని వదిలేసి, ఆసక్తిగా ఉన్న కొన్నిటినే చదువుతుంటాం. కానీ పరీక్షలకు పాఠ్యపుస్తకాలను కేంద్రీకృతంగా మనసు పెట్టి చదువుతాం. ఎందుకంటే ఆ సమాచారం అవగాహన చేసుకుని, పట్టు పెంచుకుని సమాధానాలుగా రాయాల్సివుంటుంది.
జీఆర్‌ఈకి చదివే ప్రయోజనం ఈ రెంటిటికంటే భిన్నమైనది. ఇక్కడ చదివి, అర్థం చేసుకోవడానికి కేంద్రీకృతంగా చదవటం అవసరమే. కానీ దీని ప్రయోజనం కేవలం జ్ఞాపకం ఉంచుకోవటం, పట్టు పెంచుకోవటం కాదు.
ఎందుకు చదవాలంటే సెంటెన్స్‌ ఈక్వివలెన్స్‌, టెక్ట్స్‌ కంప్లీషన్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లోని సమాచారం ఉపయోగించి సమస్యలను పరిష్కరించటం కోసం. ఈ తరహాలో చదవటాన్ని విమర్శనాత్మక పఠనం (క్రిటికల్‌ రీడింగ్‌)గా చెపుతారు. దీనిలో పరిష్కారాన్ని నిర్దిష్టంగా కనుగొనటం కోసం చదవటం, అర్థం చేసుకోవడం, విశ్లేషించటం, మదింపు చేయటం భాగంగా ఉంటాయి. జీఆర్‌ఈ రాసే ప్రతి విద్యార్థీ తర్ఫీదు పొందాల్సిన ముఖ్యమైన నైపుణ్యమిది. క్రిటికల్‌ రీడింగ్‌ కోసం ఈటీఎస్‌ ప్రశ్నలను సాధన చేయటం ఉత్తమమైన పద్ధతి.
రివైజ్డ్‌ జీఆర్‌ఈలో...
వెర్బల్‌ రీజనింగ్‌ విభాగంలో మంచి స్కోరు సాధించటానికి పదజాలం (ఒకాబులరీ) కీలక పాత్ర పోషిస్తుంది. కానీ రివైజ్డ్‌ జీఆర్‌ఈలో పదాల సందర్భోచిత అర్థానికి ప్రాధాన్యం ఉంటుందని గ్రహించాలి. కేవలం పదం అర్థం గుర్తుంచుకుంటే సరిపోదు. అడిగిన ప్రశ్నకు సంబంధించిన సందర్భంలోని అర్థాన్ని ఆధారం చేసుకునే ప్రతి పదాన్నీ పరీక్షిస్తారు.
ఎలా సిద్ధం కావాలి?
పదజాలం (ఒకాబులరీ) పెంచుకోవడానికి ఉపయోగడే పద్ధతులు...
* క్రమం తప్పకుండా చదవటం అలవాటు చేసుకోవాలి. వార్తాపత్రికలూ, మ్యాగజీన్లూ, మంచి పుస్తకాలను చదువుతుండాలి. దీనివల్ల పద సంపద దానికదే పెరుగుతుంది.
* జీఆర్‌ఈలో ఎక్కువగా వచ్చే పదాల జాబితా తీసుకోవాలి. వాటినుంచి ప్రతిరోజూ 30 పదాలు నేర్చుకోవాలి. వాటి అర్థంతో పాటు, వివిధ వాక్యాల ద్వారా సందర్భోచిత అర్థం కూడా తెలుసుకోవాలి.
* వర్డ్‌ క్లస్టర్ల ద్వారా అభ్యాసం చేయాలి. ఎక్కువగా ఉపయోగించే ఒక పదం తీసుకోవాలి. దాని అర్థం నిఘంటువు (డిక్షనరీ)లో చూడాలి. థిసారస్‌లోంచి మూడు నాలుగు నానార్థాలు (సిననిమ్స్‌) తెలుసుకోవాలి. ఈ రకంగా... పదాల సంఖ్యను పెంచుకోవాలి.
* పదాలను నేర్చుకోవడానికి రోజుకో గంట సమయం వెచ్చించాలి.
* ప్రతి మూడో రోజునా గత రెండు రోజుల్లో తెలుసుకున్న పదాలను పునశ్చరణ చేసుకోవాలి.
* జీఆర్‌ఈ ప్రాక్టీస్‌ ప్రశ్నల నుంచి తెలియని ప్రతి మాట అర్థం తెలుసుకుని, నేర్చుకోవాలి; పునశ్చరణ చేసుకోవాలి.
పదజాలం నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఒకరోజులోనో, కొద్దిరోజుల్లోనే దీనిలో ప్రావీణ్యం ఎవరూ సాధించలేరు. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే... వెర్బల్‌ రీజనింగ్‌ అనేది ఒకాబులరీ టెస్ట్‌ కాదు. ఇది క్రిటికల్‌ రీడింగ్‌ + ఒకాబులరీ పరీక్ష.
వెర్బల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు సాధన చేసేందుకు ఉపయోగపడే పుస్తకాలు:
ETS- GRE Official Guide-2nd edition
ETS-Official GRE Verbal Reasoning Practice Questions- Volume 1.


Ask the Expert
Click Here..