ఏది మెరుగైనది?

ఎంఎస్‌/ఎంబీఏ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ఉపకరించే పరీక్షలు జీఆర్‌ఈ, జీమ్యాట్‌. వీటి మధ్య తేడాలు ఏమిటి? ఏ విద్యార్థులకు ఏది సరైనది?
జీఆర్‌ఈ, జీమ్యాట్‌లు ఎంఎస్‌, ఎంబీఏల్లో విద్యాపరంగా అభ్యర్థుల ప్రదర్శన ఎలా ఉంటుందో అంచనా వేయడానికి నిర్వహించే ప్రామాణిక పరీక్షలు. ఈ రెండూ విదేశీ చదువులు, కెరియర్‌ అభివృద్ధి, వ్యక్తిగత ఎదుగుదలతో కూడిన ఎన్నో అద్భుత అవకాశాలు కల్పిస్తాయి. అమెరికా, కెనడా, యూరప్‌లోని మేనేజ్‌మెంట్‌ స్కూళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్‌ తప్పనిసరి. మనదేశంలో కూడా ప్రతిష్ఠాత్మక ఐఐఎం, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఐఎస్‌బీ వంటి 100కుపైగా సంస్థలు అందించే 200కు మించిన కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్‌ స్కోరును పరిగణిస్తున్నారు.
యూఎస్‌ విద్యార్థులతో సహా అందరు విద్యార్థులూ ఎంఎస్‌లో ప్రవేశం పొందడానికి తమ ప్రతిభను చూపించగల అవకాశాన్ని అందించే ఉమ్మడి వేదిక జీమ్యాట్‌ జనరల్‌ టెస్ట్‌. కేవలం జీమ్యాట్‌నే అంగీకరించే ఎంఐఎస్‌ (మాస్టర్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌) వంటి అనేకానేక ప్రోగ్రాములకు కూడా ఇప్పుడు జీఆర్‌ఈ స్కోరునూ అదేస్థాయిలో పరిగణనలోకి తీసుకుంటున్నారు. జీఆర్‌ఈని ఇంగ్లిష్‌ టెస్టింగ్‌ సర్వీస్‌- ఈటీఎస్‌; జీమ్యాట్‌ను గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌ (జీఎంఏసీ) నిర్వహిస్తున్నాయి.

ఎందుకు రాయాలి?
అనేక గ్రాడ్యుయేషన్‌ కోర్సులు, బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశానికి జీఆర్‌ఈ తప్పనిసరి. ఈ పరీక్షను గ్రాడ్యుయేట్‌ స్కూళ్లు, 250పైగా ఎంబీఏ కోర్సులు ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఎంబీఏకీ, మాస్టర్స్‌ కోర్సులకూ దరఖాస్తు చేసుకునేవారికి ఇది సరైన ఎంపిక. అయితే ఎంబీఏకూ, కొన్ని ఆర్థికశాస్త్ర ప్రోగ్రాములకూ జీమ్యాట్‌ స్కోరు ప్రత్యేకంగా అవసరం. ఎంబీఏలో చేరడం పట్ల విద్యార్థులు ఎంత నిబద్ధతతో ఉన్నారో ఈ స్కోరు బిజినెస్‌ స్కూళ్లకు సూచిస్తుంది.
పరీక్ష విధానం
* జీఆర్‌ఈలో రెండు వ్యాసాలతో కూడిన అనలిటికల్‌ విభాగానికి 75 నిమిషాలు; 30 నిమిషాల వ్యవధి గల రెండు వెర్బల్‌ సెక్షన్లు, 35 నిమిషాల వ్యవధితో రెండు క్వాంటిటేటివ్‌ సెక్షన్లుంటాయి. 30 నిమిషాల వ్యవధిగల గణితం/ వెర్బల్‌లో ప్రయోగాత్మక సెక్షన్‌ కూడా ఉంటుంది.
* జీమ్యాట్‌లో 30 నిమిషాల ఒక వ్యాసంతో కూడిన ఎనలిటికల్‌ విభాగం; 30 నిమిషాల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌ విభాగం, 75 నిమిషాల క్వాంటిటేటివ్‌, 75 నిమిషాల వెర్బల్‌ విభాగాలు ఉంటాయి.
రెండు పరీక్షలూ కంప్యూటర్‌ అడాప్టివ్‌ టెస్టులే. ఒక్కో పరీక్ష 3.5 గంటల వ్యవధి ఉంటుంది. జీమ్యాట్‌లో అన్ని ప్రశ్నలూ బహుళైచ్ఛిక విధానం (మల్టిపుల్‌ చాయిస్‌)లో ఉంటాయి.
జీఆర్‌ఈలో బహుళైచ్ఛిక ప్రశ్నలతోపాటు ప్రశ్నకు సరిపోయే అన్ని సమాధానాలు ఎంపిక చేయడం/ ఒక ప్యాసేజీలో ఒక వాక్యాన్ని గుర్తించమనో అడుగుతారు. రెండు పరీక్షలకూ విషయపరంగా కొన్ని సారూప్యతలుంటాయి. కానీ.. ప్రశ్నల లక్ష్యం వేర్వేరు.
* జీమ్యాట్‌లో లాజిక్‌, గ్రామర్‌లకు ఎక్కువ ప్రాధాన్యం.
* జీఆర్‌ఈ ఒకాబులరీ, అభ్యర్థి రాసే విధానాలను పరీక్షిస్తుంది.
* జీఆర్‌ఈలో సెంటెన్స్‌ కంప్లీషన్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్స్‌, అనలిటికల్‌ రైటింగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం.
* జీమ్యాట్‌ అదే సెక్షన్‌లో సెంటెన్స్‌ కరెక్షన్‌, క్రిటికల్‌ రీజనింగ్‌లపై దృష్టిపెడుతుంది. గణితంలో ప్రావీణ్యం ఉంటే, జీమ్యాట్‌లో అత్యధిక స్కోరుకు అవకాశముంటుంది.
మార్కుల విధానం
అత్యుత్తమ మార్కులు సంపాదించాలంటే.. జీఆర్‌ఈ, జీమ్యాట్‌ రెండింటిలోనూ కఠినమైన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం ఇవ్వడం చాలా కీలకం. ఇక్కడ సులువైన ప్రశ్నల కన్నా కష్టతరమైన వాటికే ఎక్కువ విలువ. జీఆర్‌ఈలో మూడు విభిన్న రకాల స్కోర్లుంటాయి. క్వాంటిటేటివ్‌, వెర్బల్‌లకు మార్కులను 130- 170 స్కేలుపై, రైటింగ్‌కు 0- 6 స్కేలుపై ఇస్తారు. మొత్తం స్కోరును 230- 340 మధ్య కేటాయిస్తారు. చాలా విశ్వవిద్యాలయాలు విద్యార్థులు వెర్బల్‌, క్వాంటిటేటివ్‌ రెండు విభాగాల్లోనూ కనీసం 300పైగా మార్కులు సాధించాలని ఆశిస్తాయి.
జీమ్యాట్‌లో నాలుగు రకాల వేర్వేరు స్కోర్లుంటాయి. క్వాంటిటేటివ్‌, వెర్బల్‌ అంశాలు 0- 60 స్కేలుపై, రైటింగ్‌ను 200- 800 స్కేలుపై గణిస్తారు. మొత్తం స్కోరును 0- 6 స్కేలుపై కేటాయిస్తారు. మొత్తం 800 మార్కులకుగానూ 650 స్కోరు సాధిస్తే మెరుగైన పర్సంటైల్‌ను సాధించినట్లవుతుంది. జీమ్యాట్‌, జీఆర్‌ఈ స్కోర్లు ఐదేళ్లు చెల్లుబాటవుతాయి. జీఆర్‌ఈకు www.takethegre.com/registerలో నమోదు చేసుకోవడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జీమ్యాట్‌ రాయాలనుకునే వారు www.mba.comలో రిజిష్టర్‌ యూజర్‌గా సైన్‌అప్‌ అయి, క్రెడిట్‌ కార్డు ద్వారా నిర్దేశిత రుసుము చెల్లించి, ఆన్‌లైన్‌ పరీక్షను షెడ్యూల్‌ చేసుకోవాలి.


మూడు దశల్లో...
జీఆర్‌ఈ, జీమ్యాట్‌ల సన్నద్ధత 3 దశల్లో ఉండాలి.
* మొదటి దశ: భావనలు (కాన్సెప్టులు) తెలుసుకుని వాటిని ప్రాక్టీసు ప్రశ్నలకు అన్వయించుకోవాలి. ఇక్కడ మంచి జీఆర్‌ఈ శిక్షకుడి సహాయం ఎంతో ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా దినపత్రికలు, మ్యాగజీన్లు, పుస్తకాలు చదవడం ద్వారా రీడింగ్‌, వకాబులరీ నైపుణ్యాలను పదును పెట్టుకోవచ్చు. జీఆర్‌ఈ కోసం సన్నద్ధమయ్యేవారికి క్రిటికల్‌ రీడింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కేవలం విషయాన్ని అర్థం చేసుకోవడానికే పరిమితం కాకుండా సమస్యలను పరిష్కరించే కోణంలో విశ్లేషణాత్మకంగా, అంచనా వేస్తూ చదవాలి.
* రెండో దశ: నిర్ణీత సమయం పెట్టుకుని ప్రశ్నలకు జవాబులు రాసే ప్రయత్నం చేయాలి. పునశ్చరణ, ప్రతి తప్పు నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. పట్టుదల ఉన్న విద్యార్థులకు జీమ్యాట్‌ అనుకూలం. సెంటెన్స్‌ కరెక్షన్‌, కఠినమైన గణిత విభాగాలకు ఎక్కువ సన్నద్ధత, సాధన అవసరం
* మూడో దశ: పేపర్‌, కంప్యూటర్‌ రెండింటి మీద సాధ్యమైనన్ని ఎక్కువ మాదిరి పరీక్షలు రాయాలి. దాని ద్వారా విజయవంతంగా విద్యార్థి పరీక్షలను ఎదుర్కోగలుగుతాడు.


Ask the Expert
Click Here..