ఎల్లలు దాటుతున్న... ఎంబీబీఎస్‌ ఆకాంక్షలు

     తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ కోర్సులో చేరుతున్నవారికి సమాన సంఖ్యలో విద్యార్థులు ఏటా వైద్యవిద్య కోసం విదేశీ బాట పడుతున్నారు. వైద్యవృత్తిలో ప్రవేశించి, పట్టా పొందాలనే తమ ఆకాంక్షలను నెరవేర్చుకుంటున్నారు. ప్రస్తుత ప్రవేశాల తరుణాన... ఆసక్తి ఉన్న విద్యార్థులు తగిన అధ్యయనం, జాగ్రత్తలూ తీసుకుని ముందడుగు వేయాల్సివుంటుంది!
మెరుగైన ఎంసెట్‌ ర్యాంకు రాని మధ్యతరగతి వారికి విదేశీ వైద్యవిద్య ప్రత్యామ్నాయంగా కనపడుతోంది. ప్రవేశ పరీక్షలూ, డొనేషన్లూ లాంటివి లేకుండా కేవలం ఇంటర్మీడియట్‌ మార్కులతోనే వైద్యవిద్యలో చేరొచ్చంటూ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు ఆహ్వానిస్తున్నాయి. వీటిలో రూ.15 లక్షల నుంచి రూ. 30 లక్షల మొత్తం ఖర్చుతోనే ఎంబీబీఎస్‌ పూర్తిచేసే అవకాశం ఉండటం విశేషం.
తెలుగు విద్యార్థులు వైద్యవిద్యాభ్యాసం కోసం వెళ్తున్న దేశాల్లో చైనా, ఫిలిప్పీన్స్‌, కిర్గిజిస్థాన్‌, ఉక్రెయిన్‌, జార్జియా, రష్యా, తజకిస్థాన్‌, బెలారస్‌, కజక్‌, నేపాల్‌, సెంట్రల్‌ అమెరికాలో కొన్నిదేశాలు ముఖ్యమైనవి.
మనదేశంలో వైద్యకళాశాలను ఎంపిక చేసుకోవడానికి విద్యార్థికి అవకాశాలు తక్కువ. కానీ ఈ ప్రత్యామ్నాయ మార్గంలో నచ్చిన దేశాన్నీ, నచ్చిన కళాశాలనూ ఎంచుకునే వీలుంది.
కనీస అర్హతలు
* ఇంటర్‌/ దీనికి సమానమైన కోర్సును (+ 12) పూర్తిచేయాలి. జీవశాస్త్రంలో కోర్సు పూర్తిచేసినవారు మాత్రమే అర్హులు.
* ఉత్తీర్ణత ఎంత శాతం అవసరమన్నది ఆయా కళాశాలలు నిర్ణయిస్తాయి. భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) నిర్దేశం ప్రకారం- జీవశాస్త్రంలో ఇంటర్‌/ తత్సమాన పరీక్షలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆంగ్ల సబ్జెక్టు కూడా తప్పనిసరి. ఎస్‌టీ, ఎస్‌సీ, బీసీ విద్యార్థులైతే కనీస మార్కులు 40% ఉండవచ్చు.
* విద్యార్థి వయసు 17 సంవత్సరాలు దాటి ఉండాలి. కోర్సు చదివే ఏడాది డిసెంబర్‌ 31 నాటికి వయసును లెక్కపెట్టుకోవాల్సి ఉంటుంది.
ఎంసీఐ వెబ్‌సైట్‌ www.mciindia.org లో స్క్రీనింగ్‌ టెస్ట్‌ రెగ్యులేషన్స్‌ - 2002, ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ రెగ్యులేషన్స్‌- 2002, గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్స్‌- 1997 జీఓలను పరిశీలిస్తే పూర్తి సమాచారం లభ్యమవుతుంది.
మారిన నిబంధనలు
కళాశాలలను ఎంపిక చేసుకునేముందు ఆ కళాశాలను ఏవిధంగా గుర్తించాలన్నదానిపై ఎంసీఐ కొన్ని మార్గదర్శకాలను సూచించింది. ముఖ్యంగా- ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తన వైద్య నిఘంటువులో పొందుపరచిన కళాశాలను ఎంచుకుని వైద్యవిద్యను అక్కడ అభ్యసించవచ్చని తెలిపింది.
ఎంచుకున్న కళాశాల గుర్తింపు విషయంలో గతంలో ఎంసీఐ నేరుగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ను విద్యార్థికి అందించేది. 7.10.2013న విడుదల చేసిన పబ్లిక్‌ నోటీసులో ఈ నిబంధనను సడలించింది. కళాశాల/ విశ్వవిద్యాలయ గుర్తింపు విషయంలో నిబంధనలను మాత్రమే చెప్పి జాగ్రత్తలను విద్యార్థి బాధ్యతకు అప్పగించింది!
కళాశాలను ఎంచుకునేముందు కొంత అధ్యయనం చేయడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలకూ తావుండదు. చైనా, ఫిలిప్పీన్స్‌, ఉక్రెయిన్‌, కిర్గిజిస్థాన్‌ దేశాల్లో ఉన్న భారతీయ ఎంబసీ వెబ్‌సైట్లలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి.
నిర్ధారించుకునే అంశాలు
ఏ దేశం, ఆ దేశంలో ఏ కళాశాలలో చేరాలి? అనేది తేల్చుకోవటానికి ముందు... అక్కడి సామాజిక, రాజకీయ పరిస్థితుల పట్ల దృష్టిపెట్టాలి. వెళ్లాలనుకునే దేశంలో మనదేశ ఎంబసీ ఉంటే ఆ ఎంబసీ వెబ్‌సైట్లో ఆ దేశ విద్యావిధానంపై ఎటువంటి సమాచారమున్నదీ చూడాలి.
* ఎంసీఐ విదేశీ వైద్యవిద్యార్థులకోసం ఏటా రెండుసార్లు స్క్రీనింగ్‌ టెస్టును నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ఉత్తీర్ణులైన తరువాతే ఇక్కడి డాక్టరుతో సమానమైన గుర్తింపు వస్తుంది. ఈ టెస్టులో ఉత్తీర్ణతశాతం ఎంతనే అంశానికి కళాశాల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలి.
* స్క్రీనింగ్‌ టెస్టుకు సంబంధించి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శిక్షణ ఇస్తున్నట్లయితే ఏ స్థాయిలో జరుగుతున్నదీ- అక్కడి నుంచి వచ్చిన విద్యార్థుల నుంచి తెలుసుకోవడం శ్రేయస్కరం.
* కోర్సు పూర్తవటానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుందన్నది తల్లిదండ్రులు నిర్దిష్టమైన అంచనాకు రావాలి.
* విదేశీ వాతావరణానికీ, అక్కడి జీవనానికీ అలవాటు పడటం, శ్రద్ధగా చదువుపై దృష్టిపెట్టడం ప్రధానం. వీటికి విద్యార్థి మానసికంగా సిద్ధపడాలి. ఇక్కడ సాధించలేని ఎంబీబీఎస్‌ కోసం విదేశాలకు వెళుతున్న విషయాన్ని విస్మరించకూడదు. ఆమేరకు మెరుగైన కృషి చేయాలి.
కళాశాల ఎంపిక
ప్రపంచ ఆరోగ్యసంస్థ వైద్య నిఘంటువు జాబితాలో గుర్తించిన వివిధ దేశాల వైద్య కళాశాలల జాబితా చూసి నిర్ణయం తీసుకోవచ్చు. ఆ జాబితాలోలేని కళాశాలను ఎంచుకోవాలంటే మన ఎంబసీవారు ఆ కళాశాలలో చదువు పూర్తిచేసుకున్న విద్యార్థుల పట్టాపై రాజముద్రను వేయడానికి అంగీకరిస్తున్నారో, లేదో కూడా తెలుసుకోవడం మేలు.
చైనాలో వైద్యవిద్యను అభ్యసించే విద్యార్థుల కోసం కళాశాల ఎంపిక విషయంలో ఎంసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఆ దేశంలో కళాశాలల జాబితాను తన వెబ్‌సైట్లో www.mciindia.org/MediaRoom/ListofChinaColleges.aspx పొందుపరచింది. ఇతర దేశాల కోసం ఈ http://avicenna.ku.dk/database/medicine; www.wdmos.orgను చూడవచ్చు.
ఇలా సన్నద్ధమవాలి
ఆంధ్రప్రదేశ్‌ వారు ఈ ఏడాది కూడా సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయ సేవలు ఉపయోగించుకునే వీలు ఏర్పడింది. సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయ పరిధిలో ఉపకార్యాలయాలూ ఉన్నాయి. హైదరాబాద్‌లో అమీర్‌పేట, బేగంపేట, టోలీచౌకీల్లో; తెలంగాణలో నిజామాబాద్‌లో; ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, తిరుపతిలో ఉపకార్యాలయాలున్నాయి. విశాఖపట్నం పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలున్నాయి. ఈ ప్రాంత ప్రజలు విశాఖపట్నం పాస్‌పోర్టు కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.
ఎ) కావాల్సిన ధ్రువపత్రాలు: 1. స్టడీ సర్టిఫికెట్లలో పదో తరగతి పాస్‌/ మార్కుల జాబితా 2. నివాస ధ్రువపత్రం- ఆధార్‌ కార్డు వంటివి 3. జనన ధ్రువపత్రం (ఫారం 5)తో ముందుగా ఆన్‌లైన్‌లో తేదీని ఖరారు చేసుకుని, ఆన్‌లైన్‌లోనే పాస్‌పోర్టు రుసుము కూడా చెల్లించాలి. ఖరారైన తేదీనాటికి పాస్‌పోర్టు కార్యాలయానికి ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సివుంటుంది.
బి) అడ్మిషన్‌ పొందాలి: ఎంపిక చేసుకున్న కళాశాల/ విశ్వవిద్యాలయం నుంచి నేరుగాకానీ అధీకృత సంస్థ/ కన్సల్టెన్సీ నుంచి గానీ ప్రవేశం పొందవచ్చు.
సి) స్టూడెంట్‌ వీసా: ఎంపిక చేసుకున్న కళాశాల నుంచి ఆహ్వానపత్రం/ అడ్మిషన్‌ లెటర్‌/ ఐ20/ జేడబ్ల్యూ సంపాదించి, మన దేశంలో ఉన్న ఆ దేశ ఎంబసీలో వీసా కార్యాలయాన్ని సంప్రదించాలి. తగిన పత్రాలతోపాటు ఒరిజినల్‌ పాస్‌పోర్టు, సర్టిఫికెట్లను జతచేయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌ లాంటి దేశాల్లో విద్యార్థి వీసా కోసం సదరు విద్యార్థి నేరుగా ఎంబసీకి హాజరు కావాల్సి ఉంటుంది. విద్యార్థి హాజరును మినహాయించే దేశాలు- చైనా, కిర్గిజిస్థాన్‌.
అన్నివిధాలా ...
కళాశాలను ఎంచుకుని, ప్రవేశం పొంది- చేరాల్సిన సమయం దగ్గర పడుతున్నపుడు అందుకు అన్నివిధాలా సిద్ధమవాలి.
* విశ్వవిద్యాలయ ఫీజును డాలర్ల రూపంలోకానీ డీడీ రూపంలోకానీ చెల్లించాల్సివుంటుంది.
* సొంత ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని డాలర్ల రూపంలో, విదేశాల్లో ఉపయోగపడే విధంగా బ్యాంకు డెబిట్‌/ క్రెడిట్‌ కార్డులను వెంట తీసుకుని వెళితే మంచిది.
* ఆరోగ్యబీమా పాలసీని తీసుకోవటం మేలు. ఇది కొన్ని దేశాలకు తప్పనిసరి కాకపోయినా దీనిపై అశ్రద్ధ సముచితం కాదు. ప్రమాద బీమాతోపాటు కొన్ని పాలసీల్లో పాస్‌పోర్టు, లగేజీ పోయినా క్లెయిం చేయవచ్చు.
* విదేశీ వాతావరణ పరిస్థితులు డాక్టరుకు తెలియజేసి ముందు జాగ్రత్తలు తెలుసుకోవాలి. కొన్ని అత్యవసర ఔషధాలు వెంట తీసుకువెళ్ళేలా సిద్ధం చేసుకోవాలి.
ప్రయాణపు తేదీని కచ్చితంగా నిర్ణయించుకుని కాస్త ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి. విమాన ప్రయాణానికి సంబంధించి ముందుగానే టికెట్‌ రిజర్వు చేసుకోవాలి. కొన్ని దేశాలకు వీసా నిబంధనల్లో భాగంగా రెండువైపులా ముందుగానే టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని దేశాలకు వెళ్లేముందు తీసుకుంటే సరిపోతుంది.
* ఎంచుకున్న కళాశాలలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులను అక్కడి నిబంధనలు, కళాశాల తీరుతెన్నులు, భోజన వసతి, ఆంగ్లమాధ్యమం వంటి విషయాలు అడిగి తెలుసుకోవడం చాలా అవసరం. నిజానికి వీరి పరిచయం ద్వారా అనేక సందేహాలకు చక్కని పరిష్కారం దొరుకుతుంది.
కన్సల్టెన్సీల పాత్ర
విదేశీ వైద్యవిద్య విషయంలో కన్సల్టెన్సీల పాత్ర బాగా ఉంది. వారు చెప్పే ప్రతి విషయం అబద్ధం కానట్లే, చెప్పే ప్రతిదీ నిజమూ కాకపోవచ్చు! అందుకని ఏ అంశాన్నయినా విద్యార్థులూ, తల్లిదండ్రులూ స్వయంగా నిర్ధారించుకుంటే సమస్య ఉండదు. ఇందుకు విశ్వవిద్యాలయ గుర్తింపు వారికి ఉందన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. అందుకు ప్రాతిపదిక విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్లలో వారి వివరాలుండాలి. పూర్వవిద్యార్థులను అడిగి తెలుసుకోవడం మరో మార్గం.
క్యాంపస్‌లో సర్వీసులు నిర్వహించే కన్సల్టెంట్లు ఒకరకంగా సంరక్షకుని (గార్డియన్‌) పాత్ర పోషిస్తుంటారు. ఈ పాత్రలో వారు ఎంతవరకూ విజయం సాధిస్తున్నదీ తెలుసుకోవాల్సి ఉంటుంది.
కొన్ని ముఖ్యాంశాలు
1. ఎంసీఐ నిబంధనల ప్రకారం- ఏ కళాశాలకైనా ఒకవేళ స్థానిక ప్రభుత్వ గుర్తింపు లేకపోతే చేరకూడదు. ప్రపంచ ఆరోగ్యసంస్థ వైద్య నిఘంటువులో నమోదు కాని కళాశాలను ఎంచుకోకూడదు. లేదా, అన్ని గుర్తింపులున్నా కూడా ఆ కళాశాలపై ఆ దేశంలో ఉన్న మనదేశ ఎంబసీ నిషేధం విధించినా దానిలో చేరకూడదు.
2. అక్కడి కళాశాలలు ఇచ్చిన డిగ్రీకి ఇక్కడ సమానమైన గుర్తింపు ఉంటుందా అనే సందేహం కొందరిలో ఉంది. విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వైద్యులకు భారత్‌లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వైద్యులతో సమాన గుర్తింపు ఉంటుంది. ఎప్పుడంటే... వారు ఎఫ్‌ఎంజీఈ (ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌)- స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉత్తీర్ణులయినపుడు! ఈ పరీక్ష ఉత్తీర్ణులైనవారు హౌస్‌ సర్జెన్సీని ఏడాది పూర్తిచేసి ఎంసీఐ నుంచి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తీసుకోవచ్చు.
3. ఎంబీబీఎస్‌తోపాటు పీజీ ఉంటేనే అక్కడ ఎంబీబీఎస్‌ చదవాలన్నది అపోహ మాత్రమే! విదేశాల్లో పీజీ గుర్తింపు పట్ల ఎంసీఐ నిబంధనలు వేరుగా ఉన్నాయి. అమెరికా, బ్రిటన్‌, కెనడా, న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్న పీజీ డిగ్రీకి మాత్రమే ఎంసీఐ గుర్తింపు ఉంటుంది.

Posted on 20.07.2015


Ask the Expert
Click Here..