శ్రేష్ఠమైన కోర్సులకు ఛలో అమెరికా!

     అమెరికా గురించి ఒక్కమాటలో చెప్పమంటే 'అవకాశాల స్వర్గధామం!' అంటారు విద్యార్థులు. అందుకే యు.ఎస్‌.ఎ.లో చదువుకోవాలన్నది ఎందరికో అభిలాష! ఇలాంటివారు అక్కడి విద్యావిధానంలోని ప్రాథమిక అంశాల నుంచి విభిన్న విశేషాల వరకూ గ్రహించడం అవసరం. వీటిపై వరుసగా కథనాలు అందిస్తున్నాం. అమెరికా కోర్సుల ప్రత్యేకత; అక్కడి పరిస్థితులూ, తీరుతెన్నుల గురించి ఈ సంచికలో...!
మారుతున్న పరిస్థితుల్లో విదేశీ విద్య సాధారణ విషయంగా మారింది. శ్రేష్ఠమైన- ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యాకోర్సుల కోసం దూరాభారం లెక్కచేయటం లేదు మన విద్యార్థులు. ఖండాలు దాటటానికైనా సిద్ధపడుతున్నారు!
విద్యావకాశాలు, పరిశోధన సదుపాయాలపరంగా పరిశీలిస్తే అన్నింటికంటే ముందు ఎంచుకోవాల్సిన దేశంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు పేరుపొందాయి. నిధుల కొరత లేకపోవడం, కోర్సుల కరిక్యులం, ఎన్‌రోల్‌మెంట్‌ రేటు, ప్లేస్‌మెంట్‌, ఇంటర్న్‌షిప్‌, కో ఆపరేటివ్‌ ప్రోగ్రామ్స్‌, గ్రంథాలయ, పరిశోధన సదుపాయాలు, బోధనా సిబ్బంది తదితర అంశాలన్నింటిలో ఇక్కడి విశ్వవిద్యాలయాలు అగ్రశ్రేణిలో నిలుస్తాయి. విద్యాభ్యాసంతో పాటు విద్యార్థుల జీవన విధానం కూడా ఉన్నతంగా ఉండటం ఓ ప్రత్యేకత.
అమెరికాలో అత్యున్నత స్థాయి విద్యాప్రమాణాలున్న విద్యాసంస్థను ఎంపిక చేసుకోవడం సులభమే. ఎందుకంటే- విద్యాసంబంధ విషయాల్లో అక్కడ గోప్యత పాటించరు. ప్రచార ఆర్భాటాలూ ఉండవు. అంతర్జాల ఆధారంగా ఆయా విద్యాసంస్థల సమాచారాన్ని సాధ్యమైనంతవరకు తెలుసుకోవచ్చు. దాదాపు అందులో పొందుపరచిన వివరాలు, సమాచారమంతా విశ్వసనీయమైనదే. గత అకడమిక్‌ రికార్డు, విద్యార్థుల చేరిక, యాక్సెప్టెన్సీ రేటు తదితర వివరాల ఆధారంగా ఆ విద్యాసంస్థ ప్రామాణికతను గుర్తించవచ్చు.
ప్రతిభావంతులకు గుర్తింపు
అమెరికాలో ఒక్కసారి అడుగుపెట్టి ప్రతిభ ప్రదర్శిస్తే... ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. ఒక హిందీ ఉపాధ్యాయురాలిగా అమెరికా వెళ్లిన ఓ తెలుగు మహిళ ఇంజినీరింగ్‌ చేసి అందులోనే డాక్టరేట్‌ సంపాదించి 'సీమన్స్‌' జర్మనీకి అమెరికాలో అధ్యక్షురాలు అయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒక ఫార్మసీ విద్యార్థి ఈరోజున విదేశాల్లో ప్రతిభావంతుడైన మానసిక శాస్త్రవేత్త. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న గొప్ప అవకాశమిది. ప్రతిభావంతులకు సముచిత స్థానం కల్పిస్తారనేందుకు ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకున్న తెలుగు ప్రముఖులు మరెందరో ఉన్నారు. మీరు కూడా అంతర్జాతీయ పట్టాను చేపట్టి ఒక అంతర్జాతీయ పౌరుడిగా మెలగడానికి సంసిద్ధులు అవుతున్నారా? అయితే, మీకు తగిన విద్యాసంస్థను అమెరికాలో ఎంచుకోవటం ముఖ్యం.
ఫిట్‌నెస్‌... కోర్సులో భాగం
చదువుకుంటూ క్యాంపస్‌లో పార్ట్‌టైం/ ఫుల్‌టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులు పన్నులు చెల్లించాలి. విద్యార్థులకు లభించే అన్ని రకాల పన్ను రాయితీలను గురించి తెలుసుకోవాలి.
* టెన్నిస్‌, బేస్‌బాల్‌, ట్రాక్స్‌, స్విమ్మింగ్‌, బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, సాకర్‌ వంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఇవన్నీ కోర్సులో భాగంగానే ఉంటాయి. చదువునీ, ఆరోగ్యాన్నీ సమన్వయం చేసుకునే వీలుంటుంది.
* ఫుల్‌టైం విద్యార్థులకు ప్రతి విశ్వవిద్యాలయం ఉచిత రవాణా సౌకర్యాలను కల్పిస్తుంది. సమీపంలోని పెద్ద నగరాలకూ, ఏర్‌పోర్ట్‌లకూ వెళ్లే విద్యార్థులకు చార్జీల్లో రాయితీ అందిస్తాయి.
* విద్యార్థులందరూ వీలైనంత త్వరగా బ్యాంకు ఖాతా తెరవాలి. తమ నగదు, ట్రావెలర్స్‌ చెక్స్‌, ఇతర నిధులను బ్యాంకులో జమ చేయాలి. కొత్త విద్యార్థులు ఎకౌంట్లు తెరచినపుడు అన్ని బ్యాంకులూ నగదు రాయితీలు, కూపన్లు అందిస్తాయి.
* విద్యార్థులకు సోషల్‌ సెక్యూరిటీ కార్డ్‌నెంబర్‌ రాగానే, సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా క్రెడిట్‌ హిస్టరీని ఏర్పరచుకోవచ్చు.
* ఇంటర్‌నెట్‌ను దుర్వినియోగం చేసేలా అమర్యాదపూర్వకమైన రాతపూర్వక సందేశాలు, అసభ్యకరమైన సందేశాలు పంపకూడదు. భయపెట్టడం, వేధించడం నేరం.
* విశ్వవిద్యాలయ వనరులైన సాఫ్ట్‌వేర్‌ లైసెన్సులను దుర్వినియోగం చేయకూడదు. పేటెంట్‌ హక్కులున్న పరిశోధన పత్రాల వివరాలను బహిర్గతం చేయకూడదు. ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీల వివరాలను వెల్లడి చేస్తే విద్యార్థులను బహిష్కరించే ప్రమాదముంది. వీసా రద్దు చేసి, అరెస్ట్‌ కూడా చేయవచ్చు.
* వాతావరణం గురించి ముందుగానే జాగ్రత్తపడాలి. హిమపాతం, వడగళ్లు, సుడిగాలులు, తుపానుల నుంచి కాపాడుకునే దుస్తులు, రక్షణ వస్తువులు కొనుక్కుని ఉంచుకోవాలి.
పోస్టుగ్రాడ్యుయేషన్‌లో...
* గ్రాడ్యుయేషన్‌కు 90 రోజుల ముందే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ (ఓపీటీ) కార్డుకి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. భారీ సంఖ్యలో ఉన్న దరఖాస్తుల కారణంగా ఓపీటీ కార్డు ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది.
* కరిక్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ (సీపీటీ) కోసం దరఖాస్తు చేసుకోవడం ద్వారా చదువుకుంటున్న కాలంలోనే విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు.
* స్టూడెంట్‌ స్టేటస్‌కు సంబంధించి తగిన పత్రాలనూ, సమాచారాన్నీ అంటే చిరునామా మార్పు, ఓపీటీ; ఐ20, ఓపీటీ- ఎక్స్‌టెన్షన్‌ ఐ20, హెచ్‌1బి దరఖాస్తు వంటి వాటిని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఈ- వెరిఫైడ్‌ ఎంప్లాయర్‌ కోసం పనిచేయడం చాలా కీలకం. ఈ సమాచారమంతా విశ్వవిద్యాలయం వారి వద్ద అప్‌ టూ డేట్‌గా ఉండాలి.
* ఓపీటీ పీరియడ్‌ ముగిసిన తర్వాత హెచ్‌1బి పిటిషన్‌ వచ్చేలోపు కాప్‌- గాప్‌ పీరియడ్‌ని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. ఓపీటీ ముగిసి, హెచ్‌1బి మొదలయ్యాక, స్టూడెంట్‌ స్టేటస్‌ అమల్లో ఉండాలంటే కొత్త ఐ20 పొందడం అవసరం.
* కొన్ని బ్రాంచీలు, మేజర్లకు STEM extensionకి అర్హత ఉండదు. ఓపీటీ పీరియడ్‌ మొదటి సంవత్సరంలోనే హెచ్‌1బికి దరఖాస్తు చేసుకోవడం అవసరం. స్టూడెంట్‌ వీసాని సరిగా నిర్వహించుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు.
ఉద్యోగం- హెచ్‌1బి
* అన్నివేళలా వీసా స్టేటస్‌ మెయిన్‌టెయిన్‌ చేయాలి. హెచ్‌1బి కాలపరిమితి తప్పనిసరి.
* విద్యార్థుల స్టేటస్‌ ఎఫ్‌1, జే1 నుంచి హెచ్‌1బికి మారినట్లు విశ్వవిద్యాలయానికి తెలియజేయడం తప్పనిసరి. ఫలితంగా మీ స్టేటస్‌ మారుతుంది.
* ఐ-94, పే స్లిప్స్‌, 797 పిటీషన్లు, LCAs, అమెండ్‌మెంట్లు తదితర రికార్డులను భద్రంగా ఉంచుకోవాలి.్క
* చిరునామా మార్పు గురించి యూఎస్‌సీఐఎస్‌కు ఏఆర్‌-11 ఫారం ద్వారా తెలియజేయడం తప్పనిసరి.
* అమెరికా నుంచి బయటకు వెళ్లాలంటే మీ పాస్‌పోర్టులో హెచ్‌1బి వీసాపై స్టాంపింగ్‌ తప్పనిసరి. వీసా స్టాంపింగ్‌ మారాకనే స్వదేశానికి వెళ్లడం సరైన పద్ధతి
* అమెరికాకు సమీపంలో ఉన్న కెనడా, మెక్సికో, వెస్ట్‌ ఇండీస్‌ వంటి దేశాలకు ప్రయాణించి వీసా రెన్యువల్‌ చేయించుకోవచ్చు. స్టాంపింగ్‌ కోసం వేరే దేశాలకు వెళ్లేటపుడు అన్ని పత్రాలూ, పాస్‌పోర్టుని సిద్ధంగా ఉంచుకోవడం చాలా అవసరం.
* హెచ్‌1బి వీసాపై అమెరికాలో పనిచేస్తున్నపుడు బెంచ్‌మీద ఉన్నా సరే లీవ్‌ వితవుట్‌ పే తీసుకోకూడదు.
* హెచ్‌1బి వీసా బదలాయింపుతో కొత్త సంస్థలో చేరేటపుడు అన్ని జాగ్రత్తలూ తీసుకోవడం అవసరం.
* హెచ్‌1బి వీసాపై వచ్చినవారు 60 రోజులకన్నా ఎక్కువగా జీతం లేకుండా బెంచ్‌పై ఉండడం మంచిది కాదు. ఇది హెచ్‌1బి పిటిషన్‌ నిబంధనలను వ్యతిరేకించినట్లవుతుంది.

Posted on 10.08.2015


Ask the Expert
Click Here..