ప్రామాణిక పరీక్షలకు సిద్ధం కావడం ఎలా?

     జీఆర్‌ఈ, టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌.. వీటిని అమెరికాలో ప్రామాణిక పోటీపరీక్షలుగా (స్టాండర్డ్‌ కాంపిటిటివ్‌ టెస్ట్స్‌) పరిగణిస్తారు. వీటిలో తెచ్చుకునే స్కోరింగే ఉత్తమ విద్యాసంస్థల్లో ప్రవేశానికి బాట వేస్తుంది!
ప్రామాణిక పరీక్షల్లో మంచి స్కోరింగ్‌ కోసం మూడు నెలల ముందు నుంచి వారానికి ఇరవై గంటలపాటు సాధన చేయడం మంచిది. సాధారణంగా ఎక్కువమంది విద్యార్థులు సెమిస్టర్ల భారం వల్ల ఈ అంశంపై దృష్టి సారించరు. ఫలితంగా ప్రామాణిక పోటీ పరీక్షలకు వంద శాతం సన్నద్ధమవలేరు.
క్వాంటిటేటివ్‌ సెక్షన్‌ కంటే, వెర్బల్‌ సెక్షనే ఈ పరీక్షల్లో కీలకం. చాలామంది విద్యార్థులు క్వాంటిటేటివ్‌ సెక్షన్‌లో 90- 100 శాతం స్కోరు సాధించగలరు. ఎందుకంటే ఇందులో మౌలికమైన గణిత సమస్యలు, కీలకమైన అంశాలుంటాయి. చాలామందికి ఇవి సులువైనవి. కానీ వెర్బల్‌ సెక్షన్‌లో మంచి స్కోరు సాధించడం వల్ల అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి మార్గం సుగమమవుతుంది. అంతేకాదు, తర్వాతి కాలంలో ఫండింగ్‌/ ఉపకారవేతనాలు పొందడమూ సులువవుతుంది.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి కీలక అంశం దృక్పథం. ఆంగ్లభాష మీద ఉన్న పట్టును మదింపు చేయడానికి ఏకాగ్రత, పట్టుదల కావాలి. ఆ భాషలో నైపుణ్యం పెంచుకోవడానికీ, పదజాలాన్ని పెంచుకోవడానికీ చేపట్టవలసిన చర్యల గురించి ఆలోచించాలి. జీఆర్‌ఈ, టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ వంటి ప్రామాణిక పరీక్షలకు తర్ఫీదు/ శిక్షణ తీసుకోకముందు నుంచే, క్రమపద్ధతిలో ఆంగ్లభాషలో ప్రావీణ్యం సాధించడానికి ఈ కింది పద్ధతులు పాటించాలి.
అలవాటు, విధానం
ఆంగ్లభాషపై పట్టు సాధించడానికీ, కరెంట్‌ అఫైర్స్‌పై అవగాహన పెంచుకోవడానికీ ఏదైనా ప్రముఖ ఆంగ్ల దినపత్రికను చదవడం అలవాటు చేసుకోవాలి. కరెంట్‌ అఫైర్స్‌లోని అంశాలు ఎస్సే రైటింగ్‌లోనూ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లోనూ ఉపయోగపడతాయి.
వ్యాసాలు, సంపాదకీయాలు
దినపత్రికలోని సంపాదకీయాన్ని జాగ్రత్తగా చదవాలి. అందులోని కరెంట్‌ అఫైర్స్‌ అంశాలను జాగ్రత్తగా చదివి, అవసరమైన నకలు తీసి భద్రపరచుకోవాలి. సంపాదకీయంలోని కొత్త పదాలను, వాక్య నిర్మాణాలను గమనించి వాటిని ఉపయోగించుకునే పద్ధతి గ్రహించాలి. నాలుగు/ ఐదు కొత్తపదాలను తీసుకుని వాటి అర్థాలను, వాక్యంలో వాటిని ఉపయోగించిన తీరు, సందర్భం వంటి అంశాలను గ్రహించాలి. ఇందుకోసం ఆక్స్‌ఫర్డ్‌, వెబ్‌స్టర్‌ వంటి నిఘంటువులను ఉపయోగించవచ్చు. వర్డ్‌ డాటాబ్యాంకు రూపొందించడం, పదకోశం తయారుచేసుకోవడం- రీడింగ్‌, రైటింగ్‌, వెర్బల్‌ ఎక్స్‌ప్రెషన్‌, విశ్లేషణాత్మక, విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యానికి అత్యంత కీలకం. ఇలా చేయడం వల్ల రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ మెరుగవుతుంది. రీడింగ్‌ పేస్‌ (ఒక నిమిషంలో చదివి అర్థం చేసుకునే పదాల సంఖ్య) పెరుగుతుంది.
వినడం, వ్యాసరచన
ఇంగ్లిష్‌ డాక్యుమెంటరీలను వినడం వల్ల అందులో చర్చించిన అంశాలను అవగాహన చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వాటిలో చర్చించిన కీలక అంశాలతో నోట్స్‌ తయారు చేసుకుంటే స్వీకరించిన సమాచారాన్ని ఎక్కువగా గుర్తుంచుకోవచ్చు. ఈ ప్రక్రియ పరీక్షలో ప్రశ్నలకు జవాబులు రాయడంలో బాగా ఉపయోగపడుతుంది. దినపత్రికలోని సంపాదకీయం నుంచి ఓ చిన్న ఆర్టికల్‌/ నమూనా వ్యాసమో టైప్‌ చేయాలి. దీనివల్ల సరైన అంశాన్ని ఎంచుకునే సామర్థ్యం, టైపింగ్‌ స్పీడ్‌ పెరుగుతాయి.
నిజానికి చాలామంది విద్యార్థులు ప్రామాణిక పోటీ పరీక్షల్లోని ఈ అంశంపై దృష్టి నిలపరు. ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలంటే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలి. కళాశాలలోని ఇంగ్లిష్‌ టీచర్లు, సీనియర్ల నుంచి సూచనలు చిట్కాలు పొందాలి. కళాశాల చదువులోని మొదటి రెండు సంవత్సరాలు వీలైనన్ని ఎసైన్‌మెంట్స్‌ చేయాలి, వాటిని సమీక్షించాలి. ఉచ్చారణ, పదకోశం, వ్యాసరచన నైపుణ్యం వంటి అంశాల్లో తప్పొప్పులు సరిచూసుకోవాలి. ఇలా చేయడం వల్ల భావప్రసార నైపుణ్యం మెరుగవుతుంది.
ముఖ్యమైన ప్రామాణికపరీక్షల్లో మంచి స్కోరు సాధించడం చాలా ముఖ్యం. విశ్వవిద్యాలయాల నుంచి ఫారం ఐ-20 సాధించడంలో మీ ప్రొఫైల్‌తోపాటు ఈ స్కోరింగ్‌ కూడా కీలకం. ఈ ప్రక్రియలోని రెండు కీలక అంశాలపైన విద్యార్థులు దృష్టిసారించాలి.
వెర్బల్‌
ఆంగ్లంలో రాసిన జవాబులను, రీజనింగ్‌లను అర్థం చేసుకోవాలి/ తర్కించాలి/ విశ్లేషించగలగాలి. దీనికి రెండు పద్ధతులున్నాయి.
ఎ. ది ఎనలిటికల్‌ రైటింగ్‌ సెక్షన్‌: ఈ అంశంలో విద్యార్థి విశ్లేషణ సామర్థ్యాన్నీ, క్లిష్ట భావాలనూ అర్థం చేసుకుని స్పష్టంగా వ్యక్తీకరించే శక్తినీ, దృఢ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా వాదనల నిర్మాణం, మదింపుల్లోని దక్షతనూ పరీక్షిస్తారు.
బి. వెర్బల్‌ రీజనింగ్‌ సెక్షన్‌: లిఖిత ప్రతులను విశ్లేషించి, మదింపు చేయడంలో విద్యార్థి సమర్ధతను ఈ విభాగంలో పరీక్షిస్తారు. ఆ ప్రతుల్లోని సమాచారాన్ని సంకలనం చేసి, అందులోని విడి భాగాల, వాక్యాల మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అలాగే పదాలకూ, భావాలకూ మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించే శక్తిని కూడా పరీక్షిస్తారు.
క్వాంటిటేటివ్‌ అనాలిసిస్‌
మౌలికమైన గణిత సమస్యలను సాధించడంలో విద్యార్థికి ఉండే ప్రజ్ఞను పరీక్షించే విభాగమిది. దీనినే క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ అని కూడా అంటారు. ఈ విభాగంలో మౌలికమైన గణిత భావనలు, గణాంకాలను తార్కికంగా రూపొందించడం, గణాంక పద్ధతిలో లెక్కలను రూపొందించి, చేయగలగడం వంటి నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ విభాగంలో విద్యార్థులు దృష్టిసారించాల్సిన అంశాలు:
1. అంకగణితం (భాజనీయత, కారణాంక విభజన, ఉజ్జాయింపు/ నిష్పత్తి, దశాంక నిరూపణ, సంఖ్యాక్రమం)
2. బీజగణితం (బీజగణితోక్తి సరళీకరణం, సమానతలు/ అసమానతలు, ఏకగణ/ వర్గ సమీకరణాలు, గ్రాఫ్స్‌/ ఫంక్షన్స్‌, వాలు/ అంతర్వర్తిని మొదలైనవి)
3. రేఖాగణితం (సమాంతర/ లంబరేఖలు, వృత్తాలు/ త్రిభుజాలు/ బహుభుజాలు, త్రిమితీయ ఆకారాలు, వైశాల్యం/ ఘనపరిమాణం/ చుట్టుకొలత, పైథాగరస్‌ సిద్ధాంతం మొదలైనవి)
4. దత్తాంశ విశ్లేషణ (సగటు/ మధ్యగతం/ బహుళకం/ ప్రమాణ విచలనం/ పర్సంటైల్‌/ గ్రాఫ్స్‌/ ఖండాలు/ పంపకం, ఘటన/ సంభావ్యత, ప్రస్తారాలు/ సంయోగాలు/ వెన్‌ చిత్రాలు మొదలైనవి)

సన్నద్ధత ఇలా..
ప్రామాణిక పరీక్షల అవసరాలను స్థూల దృష్టితో పరిశీలించి, అనుసరించవలసిన విధానాన్ని అర్థం చేసుకున్నాక, తరువాతి అంశం అసలైన పరీక్షకి సన్నద్ధమవడం. ప్రతి విద్యార్థీ శిక్షణ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షాంశాల్లో విద్యార్థులు ఎటువంటి పూర్వశిక్షణ పొందకపోయినా పర్వాలేదు. శిక్షణ సమయంలో సాధన ఎంతో కీలకం. పరీక్షలోని అన్ని అంశాల పట్టీ తయారు చేసుకుని, తమ పురోగతిని అంచనా వేసుకోవాలి.
* దినపత్రికలోని సంపాదకీయం చదువుతున్నా/ కాంప్రహెన్షన్‌ చదువుతున్నా- ఆ అంశం, తేదీ, సందర్భం, ఆర్టికల్‌ చదవడానికి, ప్రశ్నావళి నింపడానికి పట్టిన సమయాలను నోట్‌ చేసుకోవాలి.
* ఏదైనా డాక్యుమెంటరీ వింటున్నపుడు ఆ సబ్జెక్టులోని అంశాన్నీ, దానిలోని ప్రధానమైన పాయింట్లనూ గమనించాలి.
* శిక్షణ కాలంలో తెలుసుకున్న అన్ని కొత్త పదాల్లో ఓ జాబితా రూపొందించుకోవాలి. వాటి అర్థాలను తెలుసుకోవాలి, పదకోశం తయారు చేసుకోవాలి. వాటిని వివిధ సందర్భాల్లో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి.
* మొత్తం శిక్షణ ప్రక్రియకు ఎంత సమయం పడుతుందో గుర్తించడం చాలా ముఖ్యం. రియల్‌టైం అనుభవం కోసం విద్యార్థులు వీలైనన్ని మాక్‌ టెస్ట్‌ల్లో పాల్గొనాలి.
ఇవన్నీ పాటించడం వల్ల పరీక్షలోని వివిధ అంశాలపై పట్టు లభిస్తుంది. తద్వారా విద్యార్థులు తమ పరిధి గ్రహించి, శిక్షణను సంపూర్ణంగా ఉపయోగించుకుంటారు. సబ్జెక్టు మెటీరియల్‌ను సమీక్షించుకోవడం, శిక్షణ తరగతుల్లో ఏరోజు చెప్పిన అంశాలను ఆ రోజే పునశ్చరణ చేయడం ముఖ్యం. దీని వల్ల తుది పరీక్షలకు సిద్ధమయ్యేటప్పటికీ చదవకుండా వదిలేసిన అంశాలేవీ మిగలవు. మిగతా అన్ని పోటీ పరీక్షలలాగానే విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే- చివరి నిమిషంలో నేర్చుకునేది ఏదీ ఉండదు!
- రచయిత 'విద్య ఎస్‌.వి ఎడ్యుకేషనల్‌ గ్రూప్‌' డైరెక్టర్‌

Posted on 11.09.2015


Ask the Expert
Click Here..