ఎంపిక ఏ పద్ధతిలో?

     అమెరికాలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు ముందుగా ఎంపిక చేసుకోవాల్సింది విశ్వవిద్యాలయాన్ని. కోరుకున్న కోర్సు ఆధారంగా మంచి విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడమూ ఒక సవాలే! ఈ సందర్భంగా పరిశీలించాల్సిన అంశాలేమిటో తెలుసుకుందామా?
కోర్సు (మేజర్‌).. ఆప్షనల్‌ సబ్జెక్టు/ కళాశాల, విశ్వవిద్యాలయం- వీటిని ఎంచుకోవల్సిన సందర్భాలు విద్యార్థులను ఎప్పుడూ గందరగోళానికి గురిచేస్తుంటాయి. ఏది ఎంచుకోవాలి? ఏది మంచిది? ఎక్కడ మంచి అవకాశాలున్నాయి? ఈ ప్రశ్నలు బుర్రను తొలుస్తుంటాయి. ఈ కంగారులో ఎక్కువమంది ఏది చెబితే దాన్నే ఎంచుకుంటుంటారు. ఇంకొందరు ఏదో ఒకటిలే అని నిర్ణయం తీసేసుకుంటారు. కొద్దిమంది మాత్రమే ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకుంటారు.
కళాశాల/ విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకోవడం క్లిష్టమైనదే. ఎందుకంటే నాలుగేళ్ల చదువు తరువాత ముఖ్యమైన ప్రక్రియ ఇది. విశ్వవిద్యాలయాన్ని ఎంచుకునే విషయంలో ప్రతి విద్యార్థీ జాగ్రత్తగా, వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏది మంచి విశ్వవిద్యాలయం? ఏది కాదు? అనేది తెలుసుకోవడానికి కొన్ని ప్రక్రియలున్నాయి. వాటిని పాటిస్తే చాలు.
జాబితా, పట్టిక..
ఏ విశ్వవిద్యాలయం తమకు సరిగా సరిపోతుందనుకుంటున్నారో.. అటువంటి వాటన్నింటినీ ఒక జాబితాగా రూపొందించుకోవాలి. ఆయా వర్సిటీల్లో ఉన్న కోర్సులు, ఫీజులు, సౌకర్యాలు తదితర వివరాలను పట్టికలా తయారు చేసుకోవాలి. ఆయా విశ్వవిద్యాలయాలు ఆమోదించే స్కోర్లు, పరిశోధనావకాశాలు, క్యాంపస్‌ జీవితం, కంప్యూటర్‌ సౌకర్యాలు, ట్యూషన్‌ ఫీజు వంటివి పోల్చుకోవాలి.
విశ్వవిద్యాలయం తమకు నచ్చాలి కానీ స్నేహితులకో, మరెవరికో కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంచుకున్న సబ్జెక్టుల్లో ఎటువంటి కెరియర్‌ అవకాశాలు లభిస్తాయో, వాటితో భవిష్యత్తులో తామెలా ఉండాలనుకుంటున్నారో ముందే వూహించుకోవాలి.
పరీక్ష పూర్తయి, స్కోరు కార్డు వచ్చాక వడపోత చేసిన విశ్వవిద్యాలయాలకు తమ స్కోరు తెలపాలి. ఫలితంగా... వ్యయం తగ్గుతుంది. చివరగా, తాము ఎంపికైన విశ్వవిద్యాలయానికి సరైన సమయంలో రిపోర్ట్‌ చేయాలి.
ప్రస్తుతం ప్రపంచంలోని ఏ విశ్వవిద్యాలయ చరిత్ర కావాలన్నా ఇంటర్నెట్‌లో క్షణాల్లో వెతికి పట్టుకోవచ్చు. అయితే, ఏ కోర్సు చేయదలచుకున్నారో ఆ కోర్సుకు తగిన విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడం సవాలులాంటిది.
ఇవి గమనించాలి..
* వర్సిటీల అకడమిక్‌ రికార్డు
* వర్సిటీ ప్రొఫైల్‌
వాతావరణం అనుకూలమేనా?
విశ్వవిద్యాలయాలను ఎంచుకునేటప్పుడే దృష్టి పెట్టాల్సిన మరో ముఖ్య విషయం- వాతావరణం. స్థానిక వాతావరణ పరిస్థితులు, విశ్వవిద్యాలయ పరిసరాల్లోని శీతోష్ణస్థితి నమూనాలను పరిశీలించాలి. వాతావరణం సరిపడకపోతే అది జీవనశైలిపై ప్రభావం చూపుతుంది. విదేశాల్లో విద్యాభ్యాసం కొన్నేళ్లపాటు సాగుతుంది కాబట్టి అంతకాలం అక్కడి వాతావరణ పరిస్థితులను సుదీర్ఘకాలంపాటు ఎదుర్కొనే సన్నద్ధత ముందే అవసరం.
ఉదాహరణకు కొన్ని వర్సిటీల పరిసరాల్లో వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటాయి..
* మసాచుసెట్స్‌, కనెక్టికట్‌, వెర్మాంట్‌, మైయినే, న్యూహాంప్‌ షైర్‌, రోడ్‌ ఐలాండ్‌, న్యూయార్క్‌, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, డెలవేర్‌, ఓహియో, మిచిగన్‌, విస్కాన్సిన్‌, మిన్నెసోటా, ఇల్లినోయిస్‌, ఇండియానా, అయోవా, మిస్సోరి, కాన్సాస్‌, నార్త్‌డకోటా, సౌత్‌ డకోటా, కొలరాడో, మాంటానా, వాషింగ్టన్‌, ఆరెగాన్‌ రాష్ట్రాలు అమెరికా ఉత్తరదశలో, కెనడా సరిహద్దులో ఉంటాయి. ప్రతి ఏడాదీ కనీసం 4- 5 నెలలపాటు మంచు విపరీతంగా కురుస్తుంది. చలిగాలులు తీవ్రంగా ఉంటాయి. ఈ కాలమంతా ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఉంటాయి.
* మేరీలాండ్‌, వర్జీనియా, డిసి, వెస్ట్‌ వర్జీనియా, టెన్సెస్సీ, అలబామా, నార్త్‌కెరోలినా, కెంటుకీ, అర్కాన్సాస్‌, ఒక్లహామా, యూటా రాష్ట్రాలది ఉష్ణమండల వాతావారణం. అంటే, దాదాపుగా భారతదేశపు స్థితిగతులే. మన విద్యార్థులకు ఇది అనుకూలం. సుడిగాలులు, తుపానులు వచ్చినా ఇక్కడి విశ్వవిద్యాలయాలు ఏమాత్రం అలజడికి లోనుకావు.
* సౌత్‌ కరొలినా, జార్జియా, ఫ్లారిడా, లూసియానా, టెక్సాస్‌, న్యూమెక్సికో, ఆరిజోనా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో వాతావరణం వేసవిలో అత్యంత వేడిగా, చలికాలంలో అత్యంత శీతలంగా ఉంటుంది. హరికేన్లు, హఠాత్‌ వరదలు, వాయుగుండాలు, నేల కుంగిపోవడం వంటి ప్రతికూల పరిస్థితులుంటాయి.
* అమెరికాలో విద్యాభ్యాసానికి వెళ్లే విద్యార్థులు వివిధ కాలమండలాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అవి- ఈస్టర్న్‌, సెంట్రల్‌, మౌంటెన్‌, పసిఫిక్‌ టైమ్‌ జోన్లు. వీటి మధ్య సమయం ఒక గంట తేడా ఉంటుంది.
యూనివర్సిటీ ఎంపిక సులభం కావాలంటే చేయాల్సిన ముఖ్యమైన పని.. విశ్వవిద్యాలయాలను 4 విభాగాలుగా విభజించుకోవడం.
యూఎస్‌లో పీజీ / ఎంఎస్‌ అంటే నాలుగేళ్ల చదువు తరువాత ముఖ్యమైన ప్రక్రియ. కాబట్టి విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకునే విషయంలో ప్రతి విద్యార్థీ జాగ్రత్తగా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
1. టాప్‌ లెవల్‌ విశ్వవిద్యాలయాలు
ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్‌, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ప్రిన్స్‌టన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా.. ఇవన్నీ అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలుగా పేరుపొందాయి.
ఇవి అందించే నాణ్యమైన విద్య, అత్యున్నత స్థాయి కోర్సులు, వాటిలోని విభిన్నత, ఆయా కోర్సుల ద్వారా లభించే ఉద్యోగావకాశాలు, వ్యవస్థాపకతకు సంబంధించిన కెరియర్లు ఉత్తమంగా ఉంటాయి. అందుకే వీటిలో చేరడానికి చాలామంది ఆసక్తి, ఉత్సాహం చూపుతారు. సహజంగానే పోటీ ఎక్కువ; సీటు లభించడం కష్టమే.
వీటిలో కోర్సుల ఫీజులు ఎక్కువే గానీ ఆ విషయంలో దిగులుపడాల్సిన అవసరం లేదు. ఫండింగ్‌, స్కాలర్‌షిప్‌ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థి చూపే ప్రతిభ, అకడమిక్‌ రికార్డు బాగుంటే ఫీజు రద్దు చేసే అవకాశాలూ ఉన్నాయి. ఈ వర్సిటీల్లో ఒకసారి చేరితే, విద్యార్థి తాను కట్టిన ఫీజుకు తగినవిధంగా పూర్తి విలువను పొంద గలుగుతాడు.
ఈ స్థాయి విశ్వవిద్యాలయాల్లో చేరి.. చదవాలంటే విద్యార్థి తనలోని పరిపూర్ణత్వం కోసం తీవ్రంగా శ్రమించాలి. వీటిలో చేరగలగడం పూర్తిగా విద్యార్థుల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. చివరగా- ఈ వర్సిటీల్లో చేరాలంటే ఆయా కోర్సుల్లో ఫుల్‌ స్కోరు సాధించగలగాలి. స్కాలర్‌షిప్‌, ఆర్థికసాయం (ఫైనాన్షియల్‌ ఎయిడ్‌) పొందడానికి తగిన రుజువులు చూపగలగాలి. చదువులో శ్రేష్ఠత ప్రదర్శించాలి. ఎంచుకున్న కోర్సులో విజయం సాధించాలనే ప్రగాఢమైన అభిలాష ఉండాలి.
2. హై లెవల్‌ విశ్వవిద్యాలయాలు
యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఆస్టిన్‌, కార్నెగీ మెల్లన్‌, యేల్‌, పెన్‌స్టేట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినోయిస్‌ అర్బానా ఛాంపైన్‌, టెక్సాస్‌ ఎ అండ్‌ ఎం కాలేజ్‌ స్టేషన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌, మాడిసన్‌, కొలంబియా.. ఇవన్నీ ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయాల కిందకి వస్తాయి.
వీటిలో విభిన్న కోర్సులు, పరిశోధన అవకాశాలు ఉత్తమంగా ఉంటాయి. కోర్సు ఫీజులు మధ్యస్థం. చేరాలంటే పోటీ ఎక్కువే. ఎందుకంటే, కొన్ని మేజర్లు, డిపార్ట్‌మెంట్ల విషయంలో ఇవి టాప్‌ లెవల్‌ విశ్వవిద్యాలయాల కంటే మెరుగైనవి. వీటిలో ప్రవేశం పొందడమనేది పూర్తిగా విద్యార్థుల ప్రతిభ, చదువులో రాణింపుపైనే ఆధారపడి ఉంటుంది.
ఈ విశ్వవిద్యాలయాలు తమకు అందిన మొత్తం దరఖాస్తుల్లో 45- 55% వాటిని మాత్రమే ఆమోదిస్తాయి. దీనిని బట్టి పోటీ ఏ స్థాయిలో ఉంటుందో వూహించుకోవచ్చు. ఈ వర్సిటీల్లో కొన్ని ప్రైవేటు సంస్థలు పరిశోధనలను స్పాన్సర్‌ చేస్తుంటాయి. కాబట్టి వాటితో పనిచేయగల అద్భుత అవకాశం లభిస్తుంది. ప్రాంగణ నియామకాల ద్వారా ఎందరో విద్యార్థులకు మంచి సంస్థల్లో ఉద్యోగాలు లభించిన, లభిస్తున్న రికార్డు ఉంది. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో మాస్టర్స్‌ చేశాక, పీహెచ్‌డీ కూడా ఇవే విశ్వవిద్యాలయాల్లో చేయవచ్చు.
3. గుడ్‌ లెవల్‌ పబ్లిక్‌, ప్రైవేటు, స్టేట్‌ విశ్వవిద్యాలయాలు
క్లెమ్సన్‌ యూనివర్సిటీ, ఆబర్న్‌, సైరాకస్‌, పర్‌డ్యూ, ఇండియానా, వర్జీనియా టెక్‌, మార్షల్‌, యూనివర్సిటీస్‌ ఆఫ్‌ హ్యూస్టన్‌, టెక్సాస్‌ (శాన్‌ ఆంటోనియో, డల్లాస్‌), యూనివర్సిటీస్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా (లాస్‌ ఏంజలీస్‌, శాన్‌డియోగో, శాంటా బార్బరా, ఇర్విన్‌, డేవిస్‌)...
ఇంకా యూనివర్సిటీ ఆఫ్‌... వాషింగ్టన్‌, కెంటుకీ, అలబామా, మిసిసిపీ, ఫ్లోరిడా, మిచిగాన్‌, పిట్స్‌బర్గ్‌, కొలరాడో (బౌల్డర్‌, డెన్వర్‌), ఆరిజోనా, టెన్నిస్సీ, జార్జియా, వర్జీనియా, ఇల్లినోయిస్‌, మిస్సోరీ, నార్త్‌ కరొలినా- చాపెల్‌ హిల్‌, మేరీలాండ్‌, మిన్నెసోటా...
వీటితో పాటు- లూసియానా స్టేట్‌ యూనివర్సిటీ, ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ, స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌, బఫెలో, బింగ్‌హామ్‌టన్‌, స్టోనీ బ్రూక్‌ యూనివర్సిటీ, ఒక్లహామా స్టేట్‌ యూనివర్సిటీ, ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ, మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, ఆరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ, నార్త్‌ కరొలినా యూనివర్సిటీ, వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, బోయ్‌సే స్టేట్‌ యూనివర్సిటీ.. ఇవన్నీ గుడ్‌ లెవల్‌ పబ్లిక్‌, ప్రైవేటు, స్టేట్‌ విశ్వవిద్యాలయాల కిందకి వస్తాయి.
మొదటి రెండు స్థాయుల (1, 2) విశ్వవిద్యాలయాలతో పోలిస్తే వీటిలో ఫీజులు తక్కువే. ఇవి కూడా నాణ్యమైన కోర్సులను అందిస్తాయి. అడ్వాన్స్‌డ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్లలో పరిశోధన, ఫండింగ్‌ అవకాశాలు బాగా ఉంటాయి.
4. మీడియం లెవల్‌ విశ్వవిద్యాలయాలు
లూసియానా టెక్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ ఆర్లిన్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌ క్లియర్‌ లేక్‌, యూనివర్సిటీస్‌ ఆఫ్‌ టెక్సాస్‌ (ఆర్లింగ్టన్‌, ఎల్‌పాసో, బ్రౌన్స్‌విల్లే), టెక్సాస్‌ ఎ అండ్‌ ఎం యూనివర్సిటీ (కార్పస్‌ క్రిస్టి, కింగ్స్‌విల్లే, శాన్‌ ఆంటోనియో), టెక్సాస్‌ టెక్‌, టెక్సాస్‌ క్రిస్టియన్‌, బేలర్‌, టెక్సాస్‌ స్టేట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లారిడా, ఫ్లారిడా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ, ఫ్లారిడా ఎ అండ్‌ ఎం యూనివర్సిటీ...
ఇంకా- యూనివర్సిటీ ఆఫ్‌ మియామీ, డ్యూక్‌ యూనివర్సిటీ, మిడిల్‌ టెన్నిస్సీ స్టేట్‌ యూనివర్సిటీ, వాండర్‌బిల్ట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ అలబామా, కెంటుకీ స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లూయిస్‌ విల్లే, మిస్సోరి స్టేట్‌ యూనివర్సిటీ, విచిటా స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ డేటన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ టాలెడో, బ్రాడ్‌లీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిడ్జిపోర్ట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కనెక్టికట్‌, బోస్టన్‌ యూనివర్సిటీ...
వీటితో పాటు- సదరన్‌ న్యూ హ్యాంప్‌షైర్‌ యూనివర్సిటీ, జార్జిటౌన్‌ యూనివర్సిటీ, జార్జిమేసన్‌ యూనివర్సిటీ, విలనోవా యూనివర్సిటీ, న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, రట్జర్స్‌ యూనివర్సిటీ, రోచెస్టార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీ (చికో, ఈస్ట్‌బే, పుల్లర్‌టన్‌, ఫ్రెస్నో, లాంగ్‌బీచ్‌, లాస్‌ఏంజలిస్‌), పోర్ట్‌లాండ్‌ స్టేట్‌ యూనివర్సిటీ, సియాటెల్‌, ఒరెగాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నార్త్‌ ఆరిజోనా యూనివర్సిటీ... ఇవన్నీ మధ్యస్థాయి విశ్వవిద్యాలయాలు.
నిర్దిష్టమైన డిపార్ట్‌మెంట్లు, కోర్సుల విషయంలో ఇవి గుడ్‌ లెవల్‌ యూనివర్సిటీల్లో చాలా వాటికి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. పలు సబ్జెక్టుల్లో స్పెషలైజేషన్‌కు అవకాశం కల్పిస్తాయి. ఫీజులు చాలా తక్కువ. విద్యార్థులకు అసలు భారం కాని విధంగా ఉంటాయి. అయితే ఉపకారవేతనం వంటి సౌకర్యాలు అంతగా ఉండవు. ఫీజు రద్దు విషయంలోనూ ఆశపెట్టుకునే అవకాశం లేదు.
- రచయిత 'విద్య ఎస్‌.వి ఎడ్యుకేషనల్‌ గ్రూప్‌' డైరెక్టర్‌

Posted on 14.09.2015


Ask the Expert
Click Here..