సాధారణ విద్యార్థికీ సదవకాశాలు!

     మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంఈ/ ఎంటెక్‌ చదవాలంటే.. సుమారు 70 కళాశాలల్లో మాత్రమే అవకాశముంది. జాతీయస్థాయిలో నిర్వహించే ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలు రాసినా కఠిన పోటీని తట్టుకోవాల్సివుంటుంది. ప్రతిభావంతులు మాత్రమే ఈ ప్రవేశపరీక్షల ద్వారా సీట్లు సాధించగలరు. అదే అమెరికాలో ఈ పరిస్థితి ఉండదు. సగటు విద్యార్థి కూడా పీజీ చేయగలిగే అవకాశాలు లభిస్తాయి.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని దాదాపు నాలుగువేలకు పైగా విద్యాసంస్థలు అత్యున్నత స్థాయి విద్యాప్రమాణాలతో ఉన్నతవిద్యాకోర్సులను అందిస్తున్నాయి. ఇక్కడి విద్యావిధానం కూడా మన భారత్‌తో పోలిస్తే విభిన్నం. ప్రతి విశ్వవిద్యాలయమూ ప్రాక్టికల్‌ విద్యకు పెద్దపీట వేస్తుంది.
అమెరికాలోని ప్రతి విద్యాసంస్థా పారిశ్రామిక సంస్థలతో, కార్పొరేట్‌ సంస్థలతో, బహుళజాతి సంస్థలతో అనుసంధానమై ఉంటుంది. ఈ కారణంగా విద్యార్థుల ప్రతిభను పరిశ్రమలకు ఆమోదయోగ్యంగా మలచగల శక్తి ఇక్కడి విద్యాసంస్థలకు ఉంది. కోర్సు పూర్తికాగానే ఉన్నతస్థాయి కొలువు సంపాదించే అవకాశాలు అధికం.
ఒక అంచనా ప్రకారం- గత ఏడాది భారతదేశ సరిహద్దులు దాటి విదేశీ విద్యకు వెళ్లిన దాదాపు లక్షన్నర మంది విద్యార్థుల్లో అత్యధిక శాతం మధ్యతరగతి కుటుంబాల నుంచే ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఉన్నతవిద్యలో చివరి దశలో ఉండగా, కొందరు తమ ప్రతిభా సామర్థ్యాలతో మంచి ఉద్యోగావకాశాలను ఇప్పటికే పొందగలిగారు.
యు.ఎస్‌.లో సంవత్సరంలో సుమారు మూడుసార్లు విద్యా సంవత్సరం ఆరంభమవుతుందని తెలిసిందే. ఇక్కడ ఒక విద్యార్థికి ఒక ముఖ్యమైన సబ్జెక్టులో మార్కులు తక్కువగా వస్తే, దానికోసం ఇంకో పేపర్‌ (కోర్సు) అదనంగా చేయాల్సివుంటుంది. కాబట్టి సాధారణ విద్యార్థి కూడా తనకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించవచ్చు. తన విద్యార్హతలు, ఆర్థిక వనరులకు తగిన విశ్వవిద్యాలయాలను ఎంచుకోవడంలో, ప్రసిద్ధ కన్సల్టెన్సీల సలహాలు పొందడంలో తప్పేమీ లేదు. తాను ఆ దేశానికి ఎందుకు వెళుతున్నాడో, తన జీవిత ధ్యేయానికి ఆ కోర్సు ఎలా ఆవశ్యకమో స్పష్టత మాత్రం అవసరం. అప్పుడే సరైన విద్యాసంస్థను ఎంపిక చేసుకోగలుగుతారు.
భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నతవిద్య కోసం అమెరికా బాట పడుతున్నారు. అద్భుతమైన విద్యావిధానం, అమెరికా విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠాత్మక ఇమేజ్‌ వంటి అంశాలు మన విద్యార్థుల్ని ఆకట్టుకుంటున్నాయి. మరోపక్క అమెరికాలోని విశ్వవిద్యాలయాలు కూడా విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి విద్యావిధానంలో, వసతులూ, ఉపకార వేతనాల కల్పనలో ఎన్నో వెసులుబాట్లు కలిగిస్తున్నాయి.
గణాంకాలను పరిశీలిస్తే..
2012-13 విద్యాసంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనంతగా విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వచ్చారు. ఎనిమిది లక్షలకుపైగా (8,19,644) విదేశీ విద్యార్థులు అమెరికా విద్యా సంస్థల్లో చేరారు. అంతకుముందు సంవత్సరంలో (2011-12) పోలిస్తే, ఈ సంఖ్య సుమారు 7% (55,000) ఎక్కువ. పది సంవత్సరాల క్రితం సంఖ్యతో పోలిస్తే, ఈ సంఖ్య సుమారు 40% అధికం (ఆధారం: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌, యూఎస్‌ఏ). అండర్‌ గ్రాడ్యుయేట్లుగా ఉన్న అమెరికా విద్యార్థుల్లో 10% మంది మాత్రమే విదేశాల్లో చదువుతున్నారు.
అమెరికాలోని మొత్తం (25 మిలియన్లకు పైగా) విద్యార్థుల్లో- విదేశీ విద్యార్థుల సంఖ్య 4% మాత్రమే. కానీ, దేశంలోని 50 రాష్ట్రాల్లోని విదేశీ విద్యార్థులందరూ కలసి అమెరికా ఆర్థికరంగానికి 250 బిలియన్‌ డాలర్లు అందిస్తున్నారు.
2012-13 విద్యా సంవత్సరానికి అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థుల్లో సగం మంది (49%) చైనా, ఇండియా, దక్షిణకొరియాల నుంచి వచ్చినవారే. చివరి రెండు దేశాల నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 2011-12 విద్యా సంవత్సరంతో పోలిస్తే వరుసగా 4%, 2% తగ్గింది. అయితే 2012-13 విద్యా సంవత్సరంలో క్రితం ఏడాదితో పోలిస్తే 16 దేశాల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
మొత్తానికి ఉన్నత విద్య విషయంలో భారతీయ విద్యార్థుల తొలి ప్రాధాన్యం అమెరికాయే అనడంలో ఎటువంటి సందేహం లేదు.
భారత్‌లో దాదాపుగా ఏకీకృత విద్యా విధానం ఉంటుంది. అమెరికాలో ఒక విశ్వవిద్యాలయంలో అమల్లో ఉన్న విద్య, ప్రవేశ విధానాలు మరో విశ్వవిద్యాలయంలో ఉండవు. ఆయా విధానాలను గురించి విద్యార్థులు మొదట తెలుసుకోవాలి. ప్రవేశప్రక్రియ విధానాలను ఆకళింపు చేసుకోవాలి. ఆయా పరీక్షల్లో ఎంతెంత స్కోరు సాధించడం అవసరమో గ్రహించాలి.
అవగాహనతో వెళ్తే..
అమెరికాలో విద్యాసంవత్సరం ఒక్కో సంస్థలో ఒక్కో విధం. ఒకే విశ్వవిద్యాలయంలో కూడా ఒక్కో విభాగంలో ఒక్కోరకంగా ప్రవేశ తేదీలుంటాయి. అయితే దరఖాస్తుకు ప్రామాణికంగా పాటించే చివరి తేదీలు ఫాల్‌ సెమిస్టర్‌లో ప్రవేశానికి ఆగస్టు/ సెప్టెంబర్‌. స్ప్రింగ్‌ సెమిస్టర్‌ కోసం ప్రవేశానికి ఆప్షనల్‌ ఎంట్రీ తేదీలు జనవరి/ ఫిబ్రవరి నెలలు. మరికొన్ని వింటర్‌ సెమిస్టర్‌ పేరిట నవంబర్‌/ డిసెంబర్‌లో, సమ్మర్‌ సెషన్‌ పేరిట మే/ జూన్‌ నెల్లో కూడా విద్యార్థులను చేర్చుకుంటాయి.
అక్కడ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి కొంత ప్రాథమిక సమాచారం తెలుసుకుందాం (ఈ సమాచారంలో మార్పు చేర్పులకు అవకాశముంది. ఇది అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే).
అప్లికేషన్‌ డాకెట్‌
అమెరికాలోని విద్యాసంస్థలకు దరఖాస్తు చేసుకోవడానికి అవి అందించే అప్లికేషన్‌ ప్యాకేజీలోనే పొందుపరచాల్సిన అన్ని డాక్యుమెంట్లను (చెక్‌లిస్ట్‌) సూచిస్తుంది. ప్యాకేజీలోని నిబంధనలను జాగ్రత్తగా గమనించాలి. డాక్యుమెంట్‌తోపాటు ఒక కవర్‌ నోట్‌ను కూడా జత చేయాలి. ఇందులో అప్లికేషన్‌ డాకెట్‌కు జతచేసిన సర్టిఫికెట్‌ పత్రాల వివరాలను రాయాలి. ఏదైనా సర్టిఫికెట్‌ను జతచేయనప్పుడు అందుకు కారణాన్ని తెలపాలి. మళ్లీ ఏ తేదీలోగా ఆ ప్రతిని అందజేయగలరనే విషయాన్ని కూడా తెలియజేయాలి.
స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, కాలేజ్‌ ఎస్సే
అభ్యర్థులు అడ్మిషన్‌ కమిటీకి తమ పూర్తి వివరాలను స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌/ కాలేజ్‌ ఎస్సేలో తెలియజేయాలి. తాము ఎవరో, అక్కడే కోర్సును ఎందుకు చేయాలనుకుంటున్నారో భవిష్యత్తు లక్ష్యాలు, అంచనాలు తదితర అన్ని వివరాలను ఇందులో పేర్కొనాలి.
ప్రామాణిక పరీక్షల స్కోరు
అమెరికాలో విద్యాభ్యాసానికి 'టోఫెల్‌' తప్పనిసరి. ఇంగ్లిష్‌లో తగినంత పరిజ్ఞానం ఉందో లేదో తెలుసుకోవడానికి అక్కడి విద్యాలయాలు 'టోఫెల్‌' స్కోరునే ఆధారంగా పరిగణిస్తాయి. మిగిలిన ప్రామాణిక పరీక్షల విషయంలో తప్పనిసరి నిబంధనలంటూ ఏమీలేవు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) కోర్సులో ప్రవేశం పొందాలనుకునేవారు స్కాలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (శాట్‌-12) రాయాల్సి ఉంటుంది. కొన్ని విద్యాలయాలు శాట్‌-2 సబ్జెక్టు పరీక్షను కూడా తప్పనిసరి అర్హతగా సూచిస్తాయి. విద్యాలయాల్లో చేరిన తరువాత ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ శాట్‌ స్కోరింగ్‌ అవసరమవుతుంది. నాన్‌ ప్రొఫెషనల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి జీఆర్‌ఈ, ఏ-జీఆర్‌ఈ (సబ్జెక్టు) పరీక్ష రాయాలి. టీఎస్‌ఈ (టెస్ట్‌ ఆఫ్‌ స్పోకెన్‌ ఇంగ్లిష్‌) పరీక్షలు, బిజినెస్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం జీమ్యాట్‌ రాయడం తప్పనిసరి అర్హత.
విద్యాభ్యాసం సమయంలో విద్యార్థులు వారానికి 20 గంటలు పనిచేయడానికి అనుమతిస్తారు. క్యాంపస్‌లోనే పనిచేయడానికి మొదటి 9 నెలల కాలానికి ఈ నియమం వర్తిస్తుంది. కోర్సులో మొదటి 9 నెలల ఫుల్‌టైం అధ్యయనం తరువాత క్యాంపస్‌ బయట కూడా పనిచేయడానికి అనుమతి లభిస్తుంది. సెలవుల్లో వారానికి 40 గంటలపాటు పనిచేయడానికి అనుమతి ఉంటుంది.
విద్యార్థి వీసా: ఫుల్‌టైం కోర్సులు చదువుతున్నంత కాలం విద్యార్థి వీసా కొనసాగుతుంది. ఈ విద్యార్థి వీసాల కోసం ఇక్కడ నిర్వహించే ఇంటర్వ్యూలు ఎంతో కఠినంగా ఉంటాయనడం వాస్తవం కాదు.
ఉద్యోగావకాశాలు: విద్యాభ్యాసం ముగిసిన తరువాత విదేశీ విద్యార్థులు ఏడాది అక్కడే ఉండి పనిచేయడానికి అనుమతిస్తారు. దీనినే 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌' (ఓపీటీ)గా పేర్కొంటారు.
అమెరికాలో సగటున ఒక కోర్సు చదవడానికి, నివసించడానికి కలిపి అయ్యే ఖర్చు సుమారుగా 20,000 డాలర్లు. కళాశాల ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ మొత్తంలో కొంత భేదం ఉండవచ్చు. ఇక్కడి విద్యాలయాలు ఆన్‌ క్యాంపస్‌, ఆఫ్‌ క్యాంపస్‌ విధానంలో కోర్సులు నిర్వహిస్తుంటాయి. కొన్ని కళాశాలలు ఫ్రెషర్లకు తప్పనిసరిగా రెసిడెన్షియల్‌ విధానంలో కోర్సులు నిర్వహిస్తాయి.
- రచయిత 'విద్య ఎస్‌.వి ఎడ్యుకేషనల్‌ గ్రూప్‌' డైరెక్టర్‌

Posted on 28.09.2015


Ask the Expert
Click Here..