సంసిద్ధతకు సోపానాలు

     అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలని అభిలషించేవారు ఆ దేశ పరిస్థితులపై స్థూలంగానైనా అవగాహన పెంచుకోవాలి. సంస్కృతి, పాలన వ్యవస్థ తదితర అంశాల పరిజ్ఞానానికి పుస్తకాలు, వీడియోలు మొదలైనవి ఉపకరిస్తాయి.
అమెరికా ప్రస్థానానికి ముందు విద్యార్థులు ప్రధానంగా పది అంశాలపై దృష్టిపెట్టాలి. సంపూర్ణ సంసిద్ధతకు సోపానాలుగా వీటిని చెప్పుకోవచ్చు. వీటి గురించి తెలుసుకుందాం...
1. భారత్‌లో డిగ్రీ పూర్తవుతూనే యూఎస్‌ విశ్వవిద్యాలయంలో చేరాలనుకునేవారు కళాశాలలో చేరిన మొదటి సంవత్సరం నుంచే సమీపంలోని యూఎస్‌ఐఈఎఫ్‌కి లేదా వారి శాటిలైట్‌ సెంటర్‌కు తరచూ వెళ్లి రావడం ఒక అలవాటుగా చేసుకోవాలి. దానివల్ల అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి పాటించాల్సిన నిబంధనలు, ప్రక్రియ విధానాలు, దరఖాస్తులు నింపడం, వాటిని పంపడమెలా అనే విషయాలు తెలుసుకోవచ్చు.
2. విశ్వవిద్యాలయాలను వెతికి పెట్టడానికి, ప్రవేశం (ఐ-20) కల్పించడానికి, వీసా దరఖాస్తులను నింపడానికి/ వీసా దరఖాస్తుకు అవసరమైన పత్రాలను సమకూర్చడానికి మధ్యవర్తులను నమ్మకూడదు. ఈ ప్రక్రియనంతటినీ ఎవరికి వారు నిర్వహించుకునే సంకల్పాన్ని ప్రోది చేసుకోవాలి.
3. దగ్గర్లో ఉన్న కాన్సులేట్‌లోని యూఎస్‌ ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ (యూఎస్‌ఐఈఎఫ్‌) కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ తీసుకుని వారి సలహా కోసం వెళ్లాలి. అక్కడ నామమాత్రపు ఫీజు చెల్లించి సభ్యత్వం తీసుకుంటే అమెరికాలో ఉన్నత విద్యావకాశాలు, వనరులు, సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
4. యూఎస్‌ఐఈఎఫ్‌ ఆధ్వర్యంలో అనేక ఓరియంటేషన్‌ సెషన్స్‌ జరుగుతుంటాయి. వీటిలో పాల్గొనడానికి వీలుగా సంబంధిత వెబ్‌సైట్లను సెర్చ్‌ చేయడం ద్వారా పేరును రిజిస్టర్‌ చేసుకోవచ్చు. తద్వారా ఆయా సెషన్స్‌లో పాల్గొనవచ్చు. ఇక్కడ అపరిమిత సమాచారం లభ్యమవుతుంది.
5. దగ్గర్లో అమెరికన్‌ లైబ్రరీ (యూఎస్‌ కాన్సులేట్‌లో భాగంగా ఉంటుంది) కానీ, దానికి అనుబంధంగా ఉండే అమెరికన్‌ కార్నర్‌ కానీ ఉంటే అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి అమెరికన్‌ చరిత్ర, సంస్కృతి, పాలన వ్యవస్థ, సాహిత్యం తదితర అంశాలపై పుస్తకాలు, వీడియోలు, ఇంకా ఫిలింషోలు చూడడం అలవాటు చేసుకోవాలి.
6. అమెరికన్‌ కాన్సులేట్లకు చెందిన పబ్లిక్‌ అఫైర్స్‌ విభాగాలు తరచూ కొన్ని ముఖ్య పట్టణాల్లో అమెరికన్‌ సంస్కృతి, సమాజానికి చెందిన అనేక అంశాలపైన యూఎస్‌ నుంచి వచ్చే ప్రముఖులతో, యూఎస్‌ దౌత్యవేత్తలతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో పాల్గొనడం కూడా యూఎస్‌ వెళ్లాలనుకునే విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది.
7. యూఎస్‌ రాదలిచిన విద్యార్థులు తాము భారత్‌లో కళాశాలల్లో చేరినప్పటి నుంచే భారత్‌లోని అమెరికన్‌ ఎంబసీ, అమెరికన్‌ కాన్సులేట్ల వెబ్‌సైట్లను తరచూ చూడడం మంచిది. వాటిలోని ప్రెస్‌ రిలీజ్‌లు, వీసా అప్‌డేట్లు అవగాహనను పరిపుష్టం చేసుకోవడానికి తోడ్పడతాయి.
8. యూఎస్‌ విశ్వవిద్యాలయ ప్రవేశాలకు అవసరమైన టోఫెల్‌, జీఆర్‌ఈ వంటి పరీక్షలకు ఉపయోగపడే అనేక వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ వనరులు ఉన్నాయి. భారత్‌లో కళాశాలలో చేరిన తొలి సంవత్సరం నుంచే వాటితో పరిచయం పెంచుకోవాలి.
9. ఆసక్తి గల విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి తమ సెలవు రోజుల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్నచోట సమావేశమై టోఫెల్‌, జీఆర్‌ఈలపై చర్చలు పెట్టుకోవాలి. తమకు తామే మాక్‌ టెస్ట్‌లు నిర్వహించుకోవాలి.
10. కళాశాలలో ఆటలు, డిబేట్లు, టూర్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక సమయం కేటాయించినట్టే నెలకు ఒకరోజు కొన్ని గంటలపాటైనా టోఫెల్‌, జీఆర్‌ఈలపై, యూఎస్‌ విశ్వవిద్యాలయ ప్రవేశాలపై నిపుణులను పిలిపించి అభిప్రాయ మార్పిడి చేసుకునే ఇంటరాక్టివ్‌ సెషన్స్‌ నిర్వహించాలని కళాశాలల యాజమాన్యాన్ని కోరవచ్చు.
సగౌరవంగా స్టేటస్‌
'చట్టానికి కట్టుబడి ఉండే నైజం' అనేది అమెరికాలో ప్రతి పౌరుడికీ సహజసిద్ధమైన అలవాటు. అటువంటి దేశం వస్తున్నారంటే.. విద్యార్థులు ఇక్కడి స్థితిగతులు, చట్టాలు, ఇతరత్రా విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే సగౌరవంగా 'స్టేటస్‌' నిలుపుకోవటం సాధ్యమవుతుంది.
దేశం నుంచీ, రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ అనేక రకాల వీసాలపై అమెరికా వచ్చేవారు ఆ దేశంలో మారిన సెక్యూరిటీ వాతావరణాన్నీ, తదనుగుణంగా మార్పు చెందిన వీసా నియమ నిబంధనల్నీ అర్థం చేసుకోవాలి. అమెరికాలో ఉండగా తమ వీసా స్టేటస్‌ (అక్కడ నివాసార్హత)ని కాపాడుకోవడం (స్టేటస్‌ మెయింటెనెన్స్‌) ఎంతో అవసరం. అమెరికా వీసా సంపాదించడానికి ఎంత శ్రద్ధ చూపుతారో, ఇక్కడికి వచ్చాక వీసా స్టేటస్‌ని ఎటువంటి తేడాలు రాకుండా కొనసాగించడంపై కూడా అంతే శ్రద్ధ చూపాలి. ఏదైనా కారణంగా చిన్న అపశ్రుతి దొర్లినా పడిన శ్రమ అంతా వృథా అయిపోతుంది.
అమెరికాలో దిగినపుడు అరైవల్‌, డిపార్చర్‌ రికార్డు ఫామ్‌ (ఐ-94) మీద ఏ తుది గడువు రాసి ఉందో ఆ చివరి రోజులోగా అమెరికా నుంచి వెళ్లిపోవాలి. తుది గడువు దాటి అక్కడ ఉంటే అమెరికా ఇమిగ్రేషన్‌ చట్టాలను అతిక్రమించినట్టే.
ప్రతి ఒక్కరికీ వీసా ఒక నిర్ణీత పని లేదా కార్యక్రమం ప్రాతిపదికగా జారీ అవుతుంది. ప్రతి వీసా శ్రేణి కింద ఆ వీసా పొందిన వ్యక్తి పాటించాల్సిన నియమ నిబంధనలుంటాయి. వాటిని సక్రమంగా పాటించేవారు తమ వీసా స్టేటస్‌ను చక్కగా కొనసాగించగలుగుతారు. అయితే అనివార్య కారణాల వల్ల స్టేటస్‌ కోల్పోయిన నాన్‌ ఇమిగ్రెంట్‌ విద్యార్థులు, ఎక్స్చేంజి విజిటర్లు మాత్రం తమ స్టేటస్‌ పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది.
లక్షమందికి పైగా భారతీయ విద్యార్థులు ప్రస్తుతం అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. మరింతమంది మున్ముందుకు వెళ్లనున్నారు. స్టూడెంట్‌ వీసాపై అమెరికా వచ్చేవారు అమెరికన్‌ ఎంబసీ, కాన్సులేట్లు, ఇతర యూఎస్‌ ప్రభుత్వ సంస్థలు అందుబాటులో ఉంచే సమాచార వనరుల్ని లోతుగా పరిశీలించాలి.
'సెవిస్‌' అంటే?
అమెరికా వెళ్లిన విద్యార్థి తన వీసా స్టేటస్‌ నిలుపుకోవడంలో భాగంగా తోడ్పడే అంశం- అధికారులతో సంబంధాలు కలిగి ఉండడం. అక్కడి 'సెవిస్‌' (స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌)లో కచ్చితంగా తన వివరాలను నమోదు చేయించుకోవాలి. నాన్‌ ఇమిగ్రెంట్‌ విద్యార్థులు, ఎక్స్చేంజ్‌ విజిటర్లు, వారి డిపెండెంట్లు అమెరికాలో ఉండగా, వారి కరెంట్‌ స్టేటస్‌ వివరాలను సేకరించి నిర్వహించే ఒక కంప్యూటర్‌ వ్యవస్థే 'సెవిస్‌'. ఇందులో విద్యార్థి తన వివరాలు ఎప్పటికపుడు తాజాగా ఉండేలా చూసుకోవడానికి సంబంధిత స్కూలు అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ ఉండాలి.
మార్చుకోవడం సాధ్యమే
టూరిస్టు వీసాపై అమెరికా రావడానికి దరఖాస్తు నింపితే.. వీసా ఇంటర్వ్యూలో కూడా అమెరికాలోని వివిధ ప్రదేశాలు చూడడానికే వెళ్తున్నట్టు చెబుతారు. తీరా ఇక్కడికి వచ్చాక అక్కడ కాలక్రమంలో మారిన పరిస్థితుల దృష్ట్యా తమ వీసా స్టేటస్‌ను ఒక కేటగిరీ నుంచి మరో కేటగిరీకి మార్చుకోవాలనుకుంటున్నారు. అంటే టూరిస్టుగా వచ్చి విద్యార్థిగా మారాలనుకుంటారు. లేదా స్టూడెంట్‌గా వచ్చి తాత్కాలిక ఉద్యోగిగా (హెచ్‌) మారాలని అనుకుంటారు. అమెరికా వ్యవస్థ కొన్ని నిబంధనలు, పరిమితులకు లోబడి కొన్ని కేటగిరీల వారిని ఈ నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా స్టేటస్‌లో మార్పులకు అనుమతిస్తోంది.
అమెరికాకు చేరుకున్న కారణాన్ని మార్చుకోవడానికి వీలున్న కేటగిరీలవారు మొదటగా ఒక నిర్ణీత ఫామ్‌ మీద యూఎస్‌సీఐఎస్‌కి తమ అభ్యర్థనల్ని ఐ-94 మీద వీసా తుది గడువు ముగియక ముందే అందజేయాలి. అయితే, ఎం-1, జే-1, క్రూ మెంబర్‌-డి, ట్రాన్సిట్‌-సి వీసా.. ఈ కేటగిరీ వీసాలను మాత్రం మరో కేటగిరీకి అనుమతించరు. మిగతా వీసా హోల్డర్లు కొన్ని నిబంధనలకు లోబడి తమ స్టేటస్‌ మార్చుకోవచ్చు.
భారత్‌లో కళాశాలల్లో చేరినప్పటి నుంచే భారత్‌లోని అమెరికన్‌ ఎంబసీ, అమెరికన్‌ కాన్సులేట్ల వెబ్‌సైట్లను తరచూ చూడడం మంచిది. వాటిలోని ప్రెస్‌ రిలీజ్‌లు, వీసా అప్‌డేట్లు అవగాహనను పరిపుష్టం చేసుకోవడానికి తోడ్పడతాయి.
టోఫెల్‌, జీఆర్‌ఈ వంటి పరీక్షలకు ఉపయోగపడే అనేక వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ వనరులతో పరిచయం పెంచుకోవాలి.
- రచయిత 'విద్య ఎస్‌.వి ఎడ్యుకేషనల్‌ గ్రూప్‌' డైరెక్టర్‌

Posted on 03.11.2015


Ask the Expert
Click Here..