వీసా మంజూరు... కొన్ని వాస్తవాలు

     వీసా ఇంటర్వ్యూలంటే విద్యార్థులు హడలిపోతుంటారు. ఏ చిన్న లోపాలు దొర్లినా, చోటుచేసుకున్నా అధికారులు తమను తిరస్కరిస్తారనీ, కఠినంగా వ్యవహరిస్తారనీ భావిస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. విదేశీ విద్యకు సంబంధించి ముఖ్యమైన ఈ అంశంలో అపోహలను తొలగించుకోవడం ప్రధానం!
చాలామంది భయపడేటట్టుగా వీసా అధికారులు దరఖాస్తులోని లోపాలను బయటపెట్టడమే మొదటి ప్రాధాన్యంగా పనిచేయరు. అభ్యర్థికి సానుకూలంగా ఉన్న అంశాలపైనే వారు మొదట దృష్టిపెడతారు. ఆ తర్వాత మాత్రమే ఇతర అంశాల్లోకి వెళ్తారు.
యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ చట్టం ప్రకారం విదేశీ విద్యార్థులు స్టూడెంట్‌ వీసా దరఖాస్తుకు కొన్ని అంశాలను పాటించాల్సి ఉంటుంది. అవి-
1. దరఖాస్తుదారుడికి స్వదేశంలో నివాసం ఉండడం, దానిని ఇంతలో వదిలివేసే ఉద్దేశం లేకపోవడం.
2. చదివే కోర్సు పూర్తికాగానే అమెరికాను విడిచి వెళ్లే ఉద్దేశం ఉండడం.
3. అనుకున్న కోర్సు చేయడానికి తగినన్ని నిధులు అందుబాటులో ఉంచుకోవడం.
వీసా అధికారులు ఈ మూడు అంశాలను నిశితంగా పరిశీలించడంలోని అంతరార్థం- అభ్యర్థి ఇమిగ్రెంట్‌ ఇంటెంట్‌ను అంచనా వేయడం మాత్రమే. అంటే- అమెరికాలో చదువు పూర్తయ్యాక భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్నారా లేక అక్కడే స్థిరపడిపోయే (ఇమిగ్రెంట్‌గా) ఉద్దేశం కలిగివున్నారా? అనే విషయాన్ని సమీక్షించడం.
సానుకూలంగా... ఉదారంగా
అయితే, ఇంటర్వ్యూ సమయంలో ఈ సమీక్ష జరిపేటపుడు వీసా అధికారులు అభ్యర్థి పట్ల సాధ్యమైనంతవరకు సానుకూలంగానే ఉంటారు. విద్యార్థుల స్థితిగతులనూ, యూఎస్‌లో స్థిరపడే ఉద్దేశాన్ని అంచనా వేయడానికీ వీసా అధికారులు వినియోగించే కొలబద్దలు సున్నితంగానే ఉంటాయి. అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులు ఎడాపెడా వీసా దరఖాస్తులను తిరస్కరిస్తారనేది అపోహ మాత్రమే. దీన్ని విద్యార్థులు మనసులో పెట్టుకోకూడదు.
వీసా ఇంటర్వ్యూలో ప్రాధాన్యం వహించే మరో ముఖ్యాంశం- 'రెసిడెన్స్‌ అబ్రాడ్‌'. ఎఫ్‌-1 వీసాకి దరఖాస్తు చేసుకున్న విద్యార్థికి స్వదేశంలో నివాసం ఉందా అనేదాన్ని పరిశీలిస్తారు. భారత్‌లో బంధాలు, అనుబంధాలు, నివాసం, తనవాళ్లు ఉంటే విద్యార్థి చదువు పూర్తయ్యాక అమెరికాలో స్థిరపడే అవకాశం తగ్గుతుందని వీసా అధికారులు భావిస్తారు.
అయితే, ఇక్కడ కూడా వీసా అధికారుల అవగాహన విద్యార్థుల పట్ల వీలైనంత ఉదారంగానే ఉంటుంది. విద్యార్థి అంటే చిన్నవాడు, ఏ సంపాదన లేనివాడు, తన సొంత ఆస్తిపాస్తులు లేనివాడు, తన మీద ఆధారపడిన వాళ్లు లేనివాడు, తన భవిష్యత్తు పట్ల సాధారణమైన ఆలోచన తప్ప స్పష్టమైన ప్రణాళికలు లేనివాడు అనే ఉదారభావంతోనే వీసా అధికారులు వీరి కుటుంబ సంబంధాల్ని, స్వదేశంలో నివాసం అనేవి పరిశీలిస్తారు.
వీసా ఇంటర్వ్యూల్లో ఫలానా కోర్సు ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నలు వస్తుంటాయి. అయితే, ఆ కోర్సుని బట్టి తమకు వీసా రావడం, రాకపోవడం ఉండవచ్చని కొందరు విద్యార్థులు భావిస్తారు. అది వాస్తవం కాదు. ఇంటర్వ్యూలో అటువంటి ప్రశ్నలు అడిగేది విద్యార్థి ఉద్దేశాలను సమీక్షించే ప్రయత్నంలో భాగంగా మాత్రమే. వీసా నిరాకరణలో అటువంటి ప్రశ్నల పాత్ర ఏమీ ఉండదు.
విద్యార్థులకు ఎదురయ్యే మరో ప్రశ్న- ఈ కోర్సును భారత్‌లోనే అత్యున్నత ప్రమాణాలతో అందిస్తున్నారు కదా! అటువంటప్పుడు ఆ కోర్సు చేయడానికి అమెరికా ఎందుకు రావాలనుకుంటున్నారు? అని. ఇది కూడా యూఎస్‌లో విద్యార్థి విద్యాభ్యాసం వెనకున్న ఆలోచనలను, ఉద్దేశాలను సమీక్షించే ప్రక్రియలో భాగంగా అడిగే ప్రశ్న మాత్రమే. ఈ ప్రశ్నకు అతను ఇచ్చే జవాబు ఆధారంగా తన వీసాను తిరస్కరించే అధికారం వీసా అధికారికి ఏమాత్రం ఉండదు. అలాగే ఒక విద్యార్థికి యూఎస్‌లోని ఒక విద్యాసంస్థ ఐ-20 ఇచ్చిన తరువాత సదరు విద్యార్థి ఆ విద్యాసంస్థలో ప్రవేశానికి అర్హుడా? కాదా? అనేది పరిశీలించే అవకాశం కూడా వీసా అధికారులకు ఉండదు.
ఏమైనా విద్యార్థి వీసాలకు దరఖాస్తు చేసుకునేవారు వీసాల మంజూరుపై ప్రచారంలో ఉన్న కథనాలను నమ్మకూడదు. తన పట్ల అధికారులు సానుకూల ధోరణితో, తన స్థితిగతులపట్ల విశాలమైన అవగాహనతో, దీర్ఘదృష్టితో వ్యవహరిస్తారనే భావనతో ఇంటర్వ్యూకి వెళ్లడం వల్ల ఆత్మస్త్థెర్యం పెరుగుతుంది.
స్టూడెంట్‌ వీసా 'ఎఫ్‌-1'
విశ్వవిద్యాలయం, కళాశాల, ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, సెమినరీ, కన్సర్వేటరీ/ ఇతర విద్యాసంస్థల్లో (లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌తో సహా) చదువుకోవడానికి వెళ్లేవారు 'ఎఫ్‌-1' వీసా కేటగిరీ కిందకి వస్తారు. ఎస్‌ఈవీపీ (స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌) సర్టిఫై చేసిన ఒక అమెరికన్‌ స్కూలులో ప్రవేశానికి ఆమోదం లభించడంతో విద్యార్థుల ఎఫ్‌-1 యాత్ర మొదలవుతుంది.
ఎఫ్‌-1 వీసా కోసం ఎంత ముందుగా దరఖాస్తు చేసినా, యూఎస్‌లో ప్రవేశం లభించిన స్కూలులో చదవడానికి అక్కడ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన నిర్ణీత తేదీకి 120 రోజుల ముందు మాత్రమే యూఎస్‌ కాన్సులేట్లు స్టూడెంట్‌ వీసాను మంజూరు చేయగలుగుతాయి. అలాగే ఎఫ్‌-1 వీసా ముందుగా వచ్చినా, తొలిసారిగా యూఎస్‌లో విద్యాభ్యాసానికి వెళుతున్నవారు తమ కోర్సు ప్రారంభమయ్యే తేదీకి 30 రోజులకంటే ముందుగా అమెరికాలో ప్రవేశించడం కుదరదు.
ఐ-20కి 30 రోజుల కంటే ముందుగా యూఎస్‌లోని పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీలో ఎవరైనా మొదటిసారే విద్యార్థులు ఎఫ్‌-1 మీద దిగితే వారిని అమెరికాలోకి అనుమతించే అధికారం ఇమిగ్రేషన్‌ అధికారులకు కూడా సాధారణంగా ఉండదు. కాబట్టి మొదటిసారి వచ్చే విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌ తేదీకి 30 రోజులకంటే ముందుగా అమెరికా వెళ్లకూడదని స్థిరంగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ వెళ్లాలనుకుంటే టూరిస్టు వీసాపై వెళ్లవచ్చు. ఆ వీసాలో తాను ప్రాస్పెక్టివ్‌ స్టూడెంట్‌గా నమోదు చేయించుకోవాలి.
ఎఫ్‌-1 వర్సెస్‌ ఎం-1
ఫ్లయింగ్‌ స్కూలు, కుకింగ్‌ క్లాసులు, మెకానికల్‌, టెక్నికల్‌ స్టడీస్‌, కాస్మెటాలజీ వంటి స్వల్పకాలిక వృత్తివిద్యా (ఒకేషనల్‌ నాన్‌ అకడమిక్‌) కోర్సులు చేయడానికి అమెరికా వెళ్లదల్చినవారు ఎం-1 స్టూడెంట్‌ వీసాకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ కోర్సులు చేసిన వారికి ఎఫ్‌-1 విద్యార్థుల మాదిరిగా యూనివర్సిటీ (అకడమిక్‌) డిగ్రీలు రావు. వీరికి ప్రొఫెషనల్‌, ఒకేషనల్‌ సర్టిఫికేషన్లు మాత్రమే లభిస్తాయి. అమెరికాలో కమ్యూనిటీ కళాశాలలు, జూనియర్‌ కళాశాలలు, ఒకేషనల్‌ హైస్కూళ్లు, నాన్‌ అకడమిక్‌ శిక్షణనిచ్చే ఇతర స్కూళ్లు ఎం-1 విద్యార్థులను చేర్చుకుంటాయి. ఇవన్నీ కూడా యూఎస్‌సీఐఎస్‌ ఆమోదం పొందినవే అయి ఉంటాయి.
ఎఫ్‌-1 మీద ఒక కమ్యూనిటీ కళాశాలలో చదివే విద్యార్థి అక్కడ విద్యాభ్యాసం పూర్తిచేశాక అమెరికాలో ఒక విశ్వవిద్యాలయానికి మారే వీలుంది. ఎం-1 విద్యార్థులకు మాత్రం అటువంటి అవకాశముండదు. తమ వృత్తివిద్యా కోర్సు పూర్తికాగానే వారు స్వదేశానికి తిరిగి వచ్చేయాలి. ఎం-1 విద్యార్థులు తాము చదివే కోర్సును మార్చుకోవడానికి అంతగా వీలులేదు. చేరిన ఆరు నెలల తరువాత కోర్సును మార్చుకోవడం అసలు కుదరదు. అయితే, ఒక స్కూలు నుంచి మరో స్కూలుకు మాత్రం కొన్ని నిబంధనలకు లోబడి మారవచ్చు.
ఎం-1 వీసా హోల్డర్‌ తన జీవిత భాగస్వామిని, 21 ఏళ్లలోపు గల తన అవివాహిత సంతానాన్ని ఎం-2 వీసాపై అమెరికా తీసుకువెళ్లవచ్చు. ఈ డిపెండెంట్లు అమెరికాలో ఎటువంటి ఉద్యోగం చేయడానికీ వీలులేదు. అలాగే ఎం-2 వీసాపై వెళ్లే జీవిత భాగస్వామి అక్కడ ఫుల్‌టైం విద్యాభ్యాసం చేయడం కుదరదు. ఎం-2పై వెళ్లిన పిల్లలు కిండర్‌గార్డెన్‌ నుంచి 12వ గ్రేడు వరకు మాత్రమే ఎలిమెంటరీ/ సెకండరీ స్కూలులో ఫుల్‌టైం స్టడీకి వెళ్లవచ్చు.
ఎం-1పై అమెరికా వెళ్లే విద్యార్థులు బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే- వీరు ఒక నిర్ణీత కాలానికి మాత్రమే అమెరికాలో ఉండగలరు. మొత్తానికి వివిధ పొడిగింపుల రీత్యా వీరు ఏడాదికాలం మాత్రమే అక్కడ ఉండడం సాధ్యమవుతుంది. నిర్ణీత గడువు ముగిశాక ఉంటే సదరు విద్యార్థికి అమెరికాలో ఉండడానికి గ్రేస్‌ పీరియడ్‌ అర్హత పోతుంది.
- రచయిత 'విద్య ఎస్‌.వి ఎడ్యుకేషనల్‌ గ్రూప్‌' డైరెక్టర్‌

Posted on 24.11.2015


Ask the Expert
Click Here..