వైద్య విద్యకు విదేశీ భరోసా!

వైద్యవిద్యలో ప్రవేశం కోసం మన రాష్ట్రంలో ఏటా దాదాపు లక్షమంది ఎంసెట్ రాస్తున్నారు. కానీ సీట్లు చూస్తే... చాలా పరిమితం. అందుకే ఎంబీబీఎస్ చదవాలనీ ఆసక్తి ఉండీ, అవకాశం లభించనివారు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇలా నిరాశపడే విద్యార్థులు ప్రత్యామ్నాయంగా విదేశీ వైద్యవిద్యవైపు చూస్తున్నారు!
విదేశీ వైద్యవిద్యలో డొనేషన్లు కానీ, ప్రవేశ పరీక్షలు కానీ లేకపోవడం మన విద్యార్థులకు బాగా కలిసొస్తున్న అంశం. లక్షలు వెచ్చించాల్సిన పనిలేదు. ఇక్కడ రెసిడెన్షియల్ కాలేజీల్లో, ఏసీ క్యాంపస్‌లలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకయ్యే ఏడాది ఖర్చు కంటే కాస్త ఎక్కువ వ్యయం చేయటానికి సిద్ధపడితే- విదేశాల్లో ఎంబీబీఎస్ చేయవచ్చు.

అత్యల్ప జనాభా కలిగి, ప్రాథమిక ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ చూపే కిర్గిజిస్థాన్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, మధ్య అమెరికాలూ; అత్యధిక జనాభా ఉన్నా మౌలిక వసతులు కల్పించడంలో ముందున్న చైనా, ఇంకా రష్యా వంటి దేశాలు వైద్యవిద్యను పరిమిత ఫీజుతోనే బోధిస్తున్నాయి. విదేశీ విద్యార్థులను సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. ఇవన్నీ మన దేశ విద్యార్థులను సహజంగానే ఆకర్షిస్తోన్నాయి. అధికారిక, మాతృభాష కాకపోయినా ఆ దేశాల్లో ఆంగ్లంలోనే వైద్య విద్యాబోధన లభిస్తోంది. దీంతో మన విద్యార్థులు అక్కడి వైద్య కళాశాలలు ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతున్నారు. తమ కలలను నిజం చేసుకో గలుగుతున్నారు.
స్క్రీనింగ్ టెస్టు ఉత్తీర్ణులతో పెరిగిన నమ్మకం
విదేశాల్లో వైద్యవిద్యను పూర్తి చేసుకొని మనదేశానికి తిరిగొచ్చిన విద్యార్థులు ఓ వడపోత పరీక్ష రాయాల్సివుంటుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ద్వారా భారతీయ వైద్యమండలి (ఎంసిఐ) నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్ టెస్టు ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ అవగాహనతోనే మన విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. ఆంగ్ల భాష బోధన మెరుగ్గా ఉన్న కాలేజీలనే ఎంపిక చేసుకుంటున్నారు. స్క్రీనింగ్ టెస్టు ఉత్తీర్ణులైన పూర్వ విద్యార్థులను సంప్రదించి విశ్వవిద్యాలయాల్లో బోధన, వసతుల పట్ల పూర్తిస్థాయిలో సమాచారాన్ని తెలుసుకునే వీలు కూడా ఉంటోంది. ఇన్ని అనుకూలతల మధ్య విదేశాలకు వెళ్లి ఎంబీబీఎస్ చదవటానికి మొగ్గు చూపుతున్నారు.
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని మొదటి ప్రయత్నంలోనే స్క్రీనింగ్ టెస్టు ఉత్తీర్ణులవుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది ఇంటర్మీడియట్ (బైపీసీ) ఉత్తీర్ణులై డాక్టర్లుగా రూపొందాలనే బలీయమైన కాంక్ష ఉన్న విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది.
గుర్తించడం తేలిక
భారతీయ వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎం.సి.ఐ.) నిబంధనలూ, సూచనల పట్ల పూర్తి సమాచారం తెలుసుకొని విదేశాల్లో కళాశాలలను ఎంపిక చేసుకోవాలి.
¤
మొదటి నిబంధన: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వైద్య నిఘంటువులో ఆయా దేశాల వారీగా నమోదయిన మెడికల్ కాలేజీల పట్టికలో అనుకూలమైన కాలేజీని/ యూనివర్సిటీని ఎంపిక చేసుకోవాలి. http://avicenna.ku.dk/database/medicine/
¤
లేదా, రెండో నిబంధన: ఎంపిక చేసుకున్న కాలేజీకి ఆ దేశ ప్రభుత్వం గుర్తింపు తప్పనిసరి.
¤
లేదా, మూడో నిబంధన: ఎంచుకున్న కాలేజీని ఆ దేశంలో మన దేశానికి చెందిన ఎంబసీ ఉన్నట్లయితే- మీరు చదివిన కాలేజీ సర్టిఫికెట్లపై భారతీయ అంబాసిడర్ సంతకం ఉన్నా సరిపోతుంది. పై నిబంధనల్లో ఏ ఒక్కటి ఉన్నా మన భారతీయ వైద్య మండలి అక్కడ చదివేందుకు అనుమతిస్తోంది.
ఇక చైనా విషయానికొస్తే- ప్రపంచ ఆరోగ్య సంస్థలో నమోదయిన కాలేజీలన్నింటినీ మన భారతీయ వైద్యమండలి గుర్తించడం లేదు. ఈ ఏడాదికి అనుమతించిన కాలేజీల వివరాలను భారతీయ వైద్య మండలి వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వాటి సంఖ్య 50.
www.mciindia.org/Mediaroom/ListofchinaColleges.aspx
వీరు అర్హులు
మన రాష్ట్రంలో ఇంటర్ తరవాత ఎంసెట్‌కు వర్తించే అర్హతలే విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు కూడా వర్తిస్తాయి.
ఇంటర్‌మీడియట్ లేదా తత్సమానమైన విద్యార్హతలు కలిగి ఉండాలి. ప్లస్‌టూ ఉత్తీర్ణులై ఉండాలి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠ్యాంశాలతో పాటు ఇంగ్లిషు ఒక బోధనాంశమై ఉండాలి. ఈ పరీక్షలో లాంగ్వేజి సబ్జెక్టులకు వచ్చే మార్కులు మినహా గ్రూప్‌లో కనీసం 50 శాతం ఉత్తీర్ణత తప్పనిసరి. షెడ్యూల్డ్ జాతులు (ఎస్‌సి), షెడ్యూల్డ్ తెగలు (ఎస్‌సి), వెనుకబడిన తరగతి (బిసి), విద్యార్థులకు 40 శాతం మార్కులు ఉన్నా కూడా అర్హులే! కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైనవారూ అర్హులే! విద్యార్థి వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. (ఈ వయసును విదేశాల్లో అడ్మిషను తీసుకున్న ఏడాది డిసెంబరు 31 నాటికి)
భారతీయ వైద్య మండలి వెబ్‌సైట్
www.mciindia.org
ఎంబీబీఎస్‌తో సమానం
మెడిసిన్ చదవాలని విదేశాలకు వెళుతున్న విద్యార్థులు తగిన అర్హతలతో, గుర్తింపు ఉన్న కళాశాలలో ప్రవేశం పొందాలి. స్టడీ సర్టిఫికెట్లూ, పాస్‌పోర్టు కలిగి స్టూడెంట్ వీసాను పొందిన తరవాత ఢిల్లీలో ఉన్న ఎంసిఐని సంప్రదించి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తుతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు బోర్డు ఆఫ్ ఇంటర్‌మీడియట్ పేరుతో వంద రూపాయల డి.డి.ని. పొందుపరిచి దరఖాస్తుతో జతచేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పరిశీలించిన తరవాత ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ నేరుగా విద్యార్థి ఇంటి చిరునామాకు స్పీడు పోస్టులో చేరుతుంది.
కోర్సు పూర్తి చేసిన తరవాత ఇదే సర్టిఫికెట్ ఆధారంగా స్క్రీనింగ్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఉత్తీర్ణులు కాని విద్యార్థులు నేరుగా ప్రాక్టీసు చేసుకోవడానికి వీలులేదు.
ఇదే విషయాన్ని ఈ ఏడాది మార్చి నెలలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీలతో వచ్చిన భారతీయ వైద్యులు నేరుగా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదనీ, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వడపోత పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉందనీ తెలిపారు.
స్క్రీనింగ్ టెస్టు కఠినంగా ఉంటుందనే అభిప్రాయం వ్యాప్తిలో ఉంది. అయితే ఈమధ్య విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసుకుని అదే సంవత్సరం ఆ పరీక్షకు మొదట దఫా హాజరై ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులు దీన్ని కొట్టివేస్తున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ఈ పరీక్ష రెండు విడతలుగా, ఉదయం మధ్యాహ్నం జరుగుతుంది. మొత్తం మార్కులు 300కు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉండవు.
విదేశాల్లో ఏ కాలేజీలో కానీ, ఏ దేశంలో కానీ మెడిసిన్ చదివినా ఈ పరీక్ష రాయటం తప్పనిసరి. ఏ దేశానికీ/ ఏ విదేశీ కాలేజీకీ ఎటువంటి మినహాయింపూ లేదు. ఈ పరీక్షను ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష (ఎఫ్.ఎం.జి.ఇ.)గా వ్యవహరిస్తున్నారు.
మన రాష్ట్రంలో సికిందరాబాద్‌లో, విశాఖపట్నంలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలున్నాయి. వీటికి అనుబంధంగా మరికొన్ని సేవాకేంద్రాల కార్యాలయాలు ఈ మధ్యనే ప్రారంభమయ్యాయి. దీంతో పాస్‌పోర్టు వెతలు కొంతమేరకు తగ్గే అవకాశముంది. హైదరాబాదులో మూడు సేవాకేంద్రాల కార్యాలయాలు బేగంపేట, అమీర్‌పేట, టోలీచౌక్‌లలో ఏర్పడ్డాయి. నిజమాబాద్, తిరుపతి, విజయవాడలో కూడా కొత్తగా ఏర్పాటు చేశారు.
పాస్‌పోర్టు పొందగోరే విద్యార్థులు కావలసిన పత్రాలు
1. జనన ధ్రువీకరణ సర్టిఫికెట్ (మ్యునిసిపాలిటీ/గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి) పొందాలి.
2. ఇంటి చిరునామా తెలిపే పత్రాలు.
పూర్తివివరాల కోసం పాస్‌పోర్టు కార్యాలయం వెబ్‌సైట్‌ను పరిశీలించండి.
www.ap.nic.in/passport/
ముఖ్యమైన జాగ్రత్తలు
¤ విదేశాల్లో వైద్య విద్యను చదువుకోవడానికి వెళుతున్న విద్యార్థి ఆ దేశ పరిస్థితులు, బోధన, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. కన్సల్టెన్సీలు చెప్పిన సమాచారంతో పాటు పూర్వ విద్యార్థులతో నేరుగా కలిసి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.
¤ విద్యార్థులు తాము విదేశాల్లో ఉంటున్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఆయా దేశాల చట్టాలను, కాలేజీలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలి.
¤ ఫీజు, ఇతరత్రా ఖర్చుల విషయంలో ఏడాదికి ఎంత అవుతుందన్నది తల్లిదండ్రులు వారి బడ్జెట్ పరిధిని బేరీజు వేసుకోవాలి. విద్యారుణం ఆధారంగా విదేశాల్లో వైద్యవిద్యను చదవగోరే తల్లిదండ్రులు ముందుగానే బ్యాంకర్‌ను సంప్రదించి విద్యార్థి విదేశాలకు వెళ్లే సమయానికల్లా అందే విధంగా హామీ తీసుకోవాలి.
¤ తెలుగు మీడియం విద్యార్థులు తాము చదవగోరే కాలేజీలో ఆంగ్ల బోధన తమకు అర్థమయ్యే స్థాయిలో ఉంటుందా లేదా అనేది పూర్వ విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి.
¤ కొన్ని దేశాల్లో విద్యార్థి స్టూడెంట్ వీసా కోసం మనదేశంలో ఉన్న వారి ఎంబసీ అధికారుల ముందు హాజరు కావలసి ఉంటుంది. అటువంటి దేశాలు ఫిలిప్పీన్స్, రష్యా, ఉక్రెయిన్. చైనా, కిర్గిజిస్థాన్‌లలో విద్యార్థి స్వయంగా హాజరు కావల్సిన అవసరం లేదు.
¤ విదేశాలకు వెళ్లే ముందు జీవిత బీమా, ప్రయాణ బీమా చేయించుకోవాలి. ప్రయాణాల్లో లగేజీ పోయినా, విదేశాల్లో అనారోగ్యానికి గురయినా బీమా ఉపయోగపడుతుంది.
¤ సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు జలుబు, తలనొప్పి, జ్వరం వంటి సూక్ష్మ రుగ్మతలకు డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులను కొని తీసుకెళ్లాలి. విదేశాల్లో మీరు ఎంపిక చేసుకున్న దేశం లేదా ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో వైద్యుని సలహాలు తీసుకోండి.
¤ ఇంటివద్ద తినే ఆహారం ఆ దేశంలో లభించే అవకాశం లేకుంటే అందుకు మానసికంగా సిద్ధపడి ప్రత్యామ్నాయం ఆలోచించండి.

Ask the Expert
Click Here..