విదేశీ ప్రవేశానికి... అవగాహన

     అమెరికా లాంటి దేశాల్లో చదువుకోవాలనే అభిలాష ఉంటేనే సరిపోదు. చేరబోయే కోర్సు, విశ్వవిద్యాలయాలపై కనీస పరిజ్ఞానం, అవగాహన పెంచుకోవాలి. ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే వీసా దశలోనూ, అది మంజూరై విమానం దిగాక కూడా ఇమిగ్రేషన్‌ అధికారులు వేసే ప్రశ్నల దగ్గరా తడబడాల్సివస్తుంది. అన్నీ సిద్ధం చేసుకుని స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సిరావటం లాంటి చేదు అనుభవాలకు తావివ్వకుండా విద్యార్థులు ముందే జాగ్రత్తపడాలి!
ఎం.ఎస్‌. విద్యాభ్యాసం కోసం అడ్మిషన్‌ లభించింది; వీసా మంజూరైంది. ఇక ‘యు.ఎస్‌.లో చేరిపోవటమే’ అనే భరోసాతో నిర్లక్ష్యం వహించకూడదు. యు.ఎస్‌.లో విమానం దిగాక ఇమిగ్రేషన్‌ అధికారులు చేసే ఇంటర్వ్యూ (పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ)లో కూడా సరైన సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది.
ఇంతదూరం ప్రయాణమై వచ్చిన విద్యార్థులకు తాము ప్రవేశించబోయే ప్రోగ్రాం/కోర్సుపై తగిన అవగాహన, శ్రద్ధ ఉన్నాయో లేదో ఇమిగ్రేషన్‌ అధికారులు గమనిస్తున్నారు. విద్యాభ్యాసమే వారి ప్రధాన ఉద్దేశం గానీ, ‘సంపాదన’ కాదని రూఢి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని అధికారులు విద్యార్థులను సాధారణంగా అడిగే ప్రశ్నలూ, వాటికి ఇవ్వదగ్గ సమాధానాలనూ గమనిద్దాం.
1) మీరు ఏ విశ్వవిద్యాలయానికి వెళ్తున్నారు? మీరే కోర్సు చదవబోతున్నారు?
* దాదాపు ప్రతి ఒక్కరూ దీనికి సరైన జవాబునే చెప్పగలుగుతున్నారు. కానీ ఇంకొంచెం లోతుగా అడిగినపుడు సమస్య వస్తోంది.
2) మీరు చదవబోయే ప్రోగ్రాం నిర్మాణం ఎలా ఉంటుంది? వాటిలో ఏమేం కోర్సులు/ సబ్జెక్టులుంటాయి?
* ఈ ప్రశ్న అడిగినపుడు 50-60 శాతం మంది విద్యార్థులు సరిగా చెప్పలేకపోతున్నారు. చదవబోయే కోర్సులు/ సబ్జెక్టులు 12 ఉంటే వాటిలో మెజారిటీ... కనీసం ఐదారయినా చెప్పగలిగివుండాలి. ఒక్కోసారి ‘కోర్సులో ఎన్ని మాడ్యూళ్ళుంటాయి?’ అని కూడా అడగొచ్చు. దానికీ సమాధానం చెప్పేలా అవగాహన పెంచుకోవాలి.
ఐటీ (ఎం.ఎస్‌.)కి సంబంధించిన ఉదాహరణ చూద్దాం. ఈ ప్రోగ్రాంలో విశ్వవిద్యాలయాల్లో 10-12 కోర్సులు/ సబ్జెక్టులుంటాయి.
సిస్టమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్పెషాలిటీలో ఉండే కోర్సులు...
* నెట్‌వర్కింగ్‌ అండ్‌ సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌
* ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ ఆర్గనైజేషన్‌
* మేనేజింగ్‌ వర్చువల్‌ సిస్టమ్స్‌
* సిస్టమ్‌ సెక్యూరిటీ అండ్‌ ఆడిటింగ్‌ మొదలైనవి
నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్పెషాలిటీలో...
* కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీ
* క్లౌడ్‌ కంప్యూటింగ్‌
* సెక్యూర్‌ మొబైల్‌ నెట్‌వర్క్స్‌
* డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ మొదలైనవి...
సాఫ్ట్‌వేర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషాలిటీలో...
* ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌
* లార్జ్‌స్కేల్‌ అప్లికేషన్‌ డెప్లాయ్‌మెంట్‌
* బిగ్‌డేటా మొదలైనవి.
విశ్వవిద్యాలయాన్ని బట్టి వీటిలో కొన్ని తేడాలుంటాయి. అందుకని చేరబోయే విద్యాసంస్థలో చదవబోయే కోర్సుల వివరాలను ముందస్తుగానే తెలుసుకుని, సరిగా గుర్తుంచుకోవాలి. ఇమిగ్రేషన్‌ అధికారుల అడిగినపుడు తడబడకుండా చెప్పెయ్యాలి.
3) మీ చదువుకు అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తారు? మీకు ఏయే రకమైన నిధులు అందుబాటులో ఉన్నాయి?
* సరిపోను ఆర్థిక వనరులు తమ తండ్రి/తాతయ్య/ మామయ్యలవి అని చెప్పి వూరుకోకుండా ... వాటి వివరాలూ, వాటిని ధ్రువపరిచే పత్రాలూ చూపవలసివుంటుంది. వీసా వచ్చేసింది కాబట్టి... అందుబాటులో ఉన్న నిధులను పక్కాగా తప్పనిసరిగా చూపించగలగాలి. బ్యాంకు బ్యాలెన్స్‌ను రూపాయిల్లో కాకుండా డాలర్లకు మార్పించుకునివుండటం, ట్రావెల్‌ కార్డు రుజువులు చూపటం వంటివి విద్యార్థి పకడ్బందీ సన్నద్ధతను తెలియపరుస్తాయి.
4) యు.ఎస్‌.లో ఏ ఉద్యోగాలు చేయబోతున్నావు?
* విద్యార్థుల మనసులో మాటను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా అడగవచ్చు. దీనికి యథాలాపంగా పెట్రోల్‌ బంకులోనో, రెస్టారెంట్‌లోనో పనిచేయబోతున్నానని చెపితే ఇక అంతే సంగతులు! అందుకే- ‘నాకు ఉద్యోగం మీద ఆసక్తి లేదు. అనుకోకుండా కుదిరితే ఒకవేళ చేస్తానేమో’ అని గానీ, ‘ మా నాన్న దగ్గర తగిన ఆర్థిక వనరులున్నాయి. పని చేయాల్సిన అవసరం లేదు’ అని గానీ చెప్పవచ్చు.
విద్యార్థులు సంబంధిత విద్యా విభాగానికి చెందిన పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయటంలో ఆక్షేపణ ఉండదు. చదువుకు సంబంధం లేని బయటి ఉద్యోగాలు చేయటమే చట్టవిరుద్ధమవుతుందని గుర్తించాలి.
5) మీకు ఈ విశ్వవిద్యాలయం గురించి ఎలా తెలిసింది? దేనికి దీన్ని ఎంచుకున్నారు?
* స్నేహితులు చెప్పాడని దీన్ని ఎంచుకున్నానని జవాబు చెపితే అది తగిన సమాధానం అవ్వదు. ఎంచుకోవటానికి తగిన స్వీయ కారణం చెప్పటం అవసరం.
ప్రధానంగా అడిగే ప్రశ్నలివి.
వీటికి సరైన జవాబులు ఇవ్వలేకపోతే అధికారుల నుంచి అనుబంధ ప్రశ్నల వర్షం కురుస్తుంది. కంగారులో భావవ్యక్తీకరణ సరిగా లేకపోయినా, జవాబులు చెప్పటంలో ఆత్మవిశ్వాసం లేదనిపించినా వారిలో అపనమ్మకం ఏర్పడే అవకాశముంది. పరిస్థితి ప్రతికూలమవుతుంది. సరైన డాక్యుమెంట్లను చూపలేనపుడూ, నిజాయతీగా జవాబులు చెప్పటం లేదనే భావం ఏర్పడేలా సమాధానాలు ఇచ్చినపుడూ అనుమతిని నిరాకరించే అవకాశముంది.
విశ్వవిద్యాలయ ఎంపిక
విద్యార్థులు అంతకుమునుపు ఎన్నడూ యూఎస్‌ఏకు వెళ్లకపోయుండొచ్చు, తమకు నచ్చిన విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను చూసుండకపోవచ్చు. కానీ, విద్యాలయం ఉన్న చోటు, ర్యాంకింగ్‌, వాతావరణ పరిస్థితులు, జీవన వ్యయం, సంస్థకున్న గుర్తింపు తెలుసుకోవాలి.
భౌగోళిక స్వరూపం, విశ్వవిద్యాలయం ఉన్న స్థలం విద్యాభ్యాసంపై చాలా ప్రభావం చూపిస్తాయి. విద్యార్థులు యునైటెడ్‌ స్టేట్స్‌లో చాలా సంవత్సరాలు ఉండాల్సి రావచ్చు. చదవడానికి ఎంపిక చేసుకున్న ప్రదేశం వృత్తిసంబంధ అవకాశాలను ప్రభావితం చేయొచ్చు. చాలామంది అంతర్జాతీయ విద్యార్థులు యూఎస్‌లోని సౌత్‌, ఈస్ట్‌, వెస్ట్‌ కోస్టుల్లో నివసిస్తారు. భౌగోళిక ప్రదేశంతోపాటు విద్యేతర కార్యకలాపాల (ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ ఆక్టివిటీస్‌) గురించీ ఆలోచించాలి.
ఎక్కువ విశ్వవిద్యాలయాలు న్యూయార్క్‌, శాన్‌ప్రాన్సిస్కో లేదా షికాగో లాంటి పెద్ద నగరాల్లో లేవు. ఏటా అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే పెద్ద విశ్వవిద్యాలయాలన్నీ చాలావరకు చిన్న పట్టణాలు, బస్తీల్లోనే ఉన్నాయి. జీవన వ్యయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒక రకంగా విద్యార్థులకు లాభదాయకమే. సబ్‌అర్బన్‌లో ఉండే కళాశాలల్లో అంతర్జాతీయ సౌకర్యాలకు అవసరమైన విశాలమైన స్థలం ఉంటుంది; ప్రశాంతతా లభిస్తుంది. పెద్ద నగరాల్లో లభించే ప్రత్యేకమైన ఆకర్షణీయ అంశాలు మాత్రం ఉండవు.
విద్యకు అయ్యే ఖర్చు
జీవించడానికి అవసరమయ్యే ఖర్చులతోసహా మొత్తం చదువుకు అయ్యే ఖర్చును లెక్కించుకోవాలి. ఈ వివరాలను విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్ల ఆధారంగా తెలుసుకోవచ్చు. చాలా విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్‌ ఫీజు తక్కువే కానీ, మెట్రోపాలిటన్‌ సిటీలు, పెద్ద సిటీల్లోలా నివాస ఖర్చులు ఎక్కువ. విశ్వవిద్యాలయాన్ని ఎంచుకునే ముందు ఖర్చుల వివరాలన్నీ కలిపి చూసుకోవాలి. రాష్ట్రప్రభుత్వాలు నిధులను సమకూర్చే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మాత్రం ట్యూషన్‌ ఫీజు తక్కువ. చాలావరకు విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌లు, గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్‌షిప్స్‌, ట్యూషన్‌ ఫీజు రాయితీలను అందిస్తుంటాయి.

Posted on 28.12.2015


Ask the Expert
Click Here..