అమెరికాలో ఉన్నత విద్యపై ‘ఈనాడు’ వెబినార్‌లో నిపుణుల సూచనలు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో ఉన్నత విద్య చదవాలనేది తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో విద్యార్థుల కల. అప్పులు చేసి, ఆపసోపాలు పడి, వీసా అడ్డంకిని అధిగమించి.. సప్తసముద్రాలు దాటి.. కోటి కలలతో అమెరికా గడ్డపై అడుగుపెడితే తిరిగి వెనక్కి పంపిస్తుండటం.. అందునా వీరిలో తెలుగు విద్యార్థులు అధికంగా ఉండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికీ రోజు కొంతమంది విద్యార్థులు అవమానభారంతో తిరిగి వస్తున్నారు. వెనక్కు వచ్చిన వారి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వెళ్లబోయేవారు పూర్తి సన్నద్ధతతో విమానమెక్కితే యు.ఎస్‌.లో విద్యాభ్యాసానికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలో ఉన్నత విద్య... ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల సందేహాల నివృత్తికి ‘ఈనాడు’ హైదరాబాద్‌లో వెబినార్‌ నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ సెక్యూరిటీ స్డడీస్‌ వ్యవస్థాపక, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కన్నెగంటి రమేశ్‌బాబు, గ్లోబల్‌ ట్రీ డైరెక్టర్‌ ఆలపాటి శుభకర్‌ సమాధానాలిచ్చారు.
* అమెరికాలో గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాల గురించి తెలుసుకోవటం ఎలా?
* పత్రాలు సక్రమంగా ఉన్నా, అన్ని సమాధానాలు చెబుతున్నా ఎందుకు వెనక్కి పంపుతున్నారు?
* ప్రస్తుత పరిస్థితుల్లో ప్రవేశం వాయిదా వేసుకుంటే మళ్లీ వీసా తీసుకోవాలా?
* సెలవుల్లో వచ్చాను. వెళ్లేటప్పుడు ఏమైనా సమస్యలొస్తాయా? ఏయే పత్రాలు వెంట తీసుకెళ్లాలి?
* విశ్వవిద్యాలయానికి గుర్తింపు ఉంటే చాలా? కోర్సుకూ ఉండాలా?
* డిసెంబరులో ఉన్నత విద్యకు యు.ఎస్‌. వెళ్లాలనేది ఆలోచన. సమస్యలేం ఉండవు కదా?
...ఇలాంటి ఎన్నో సందేహాల నివృత్తికి ఈనాడు నిర్వహించిన వెబినార్‌ అద్దం పట్టింది.
పూర్తి అవగాహనతో బయలుదేరండి.. - ఆలపాటి శుభకర్‌, గ్లోబల్‌ ట్రీ డైరెక్టర్‌
మన విద్యార్థులు మిగతా దేశాలతో పోలిస్తే యు.ఎస్‌. వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. అక్కడ నాణ్యమైన చదువు, అధునాతన సాంకేతికత, చదువు పూర్తయ్యాక ఎక్స్‌పోజర్‌ ఉండటం, పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఉండటంతో పాటు కుదిరితే ఉద్యోగం చేయాలనే మనవాళ్ల ఆలోచనలకు అవకాశాలు ఉండటంతో ఏటా అమెరికా వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. చైనా తర్వాత అత్యధికంగా మనవారే ఉంటున్నారు.
* 40 ఏళ్ల నుంచి మన విద్యార్థుల మొదటి ప్రాధాన్యం యు.ఎస్‌.నే.
* విద్యావ్యవస్థ అనుకూలంగా ఉండటం. రెండేళ్ల కోర్సును ఏడాదిన్నరలోనే పూర్తి చేయొచ్చు.. కుదరకపోతే రెండున్నరేళ్లు చదవొచ్చు.
* వారం మొత్తం తరగతులకు వెళ్లాల్సిన అవసరం లేదు. రెండు మూడు రోజులు వెళితే చాలు.
* థియరీ పాఠాల కంటే ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యం ఉండటం
* పరిశోధనలకు ఎక్కువ అవకాశం ఉంది. 70 శాతం పేటెంట్స్‌ ఇక్కడి విశ్వవిద్యాలయాలు కల్గి ఉంటున్నాయి.
* నిధులు సమస్య లేదు.. స్కాలర్‌షిప్‌, అసిస్టెంట్‌షిప్‌ ద్వారా విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు లభిస్తోంది.
* మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ ఫీజులు తక్కువగా ఉన్నాయి.
పక్కాగా అడుగేస్తేసరి.. -డా.కన్నెగంటి రమేష్‌ బాబు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ సెక్యూరిటీ స్టడీస్‌
ఆస్తులు అమ్మి.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న తెలుగు విద్యార్థుల్లో కొంతమందిని వెనక్కి పంపిస్తుండడం నిజంగా బాధాకరం. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఉచితంగా సేవలందించే ‘రీజినల్‌ ఫారిన్‌ ఎడ్యుకేషనల్‌ కౌన్సెలింగ్‌ సెంటర్స్‌ (ఆర్‌ఎఫ్‌ఈసీసీ)’ను ఏర్పాటు చేయటం అవసరం. ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీటి ద్వారా సంబంధిత అంశాల గురించి అవగాహన కల్పించాలి. ఆర్‌ఎఫ్‌ఈసీసీలను భారత విదేశాంగ, మానవ వనరుల మంత్రిత్వ శాఖలకు అనుసంధానం చేయాలి. ఉన్నత విద్య నిమిత్తం విదేశాలకు వెళ్లే వారి వివరాల్ని నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను నెలకొల్పాల్సి ఉంది. ఇలా చేస్తే దురదృష్టవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే స్పందించేందుకు వీలుంటుంది. దిల్లీలోని విదేశీ రాయబార కార్యాలయంతోనూ ఈ కౌన్సెలింగ్‌ కేంద్రాల్ని అనుసంధానిస్తే నకిలీ విశ్వవిద్యాలయాల వలలో విద్యార్థులు పడకుండా నిరోధించేందుకు అవకాశం ఉంటుంది.
* ఒక దేశం మీకు వీసా జారీ చేసిందంటే.. అక్కడ అడుగు పెట్టేందుకు నూటికి నూరు శాతం అనుమతి ఇచ్చినట్లు కాదనే విషయాన్ని గుర్తించాలి. అమెరికాలో విద్యను అభ్యసించాలనుకునే వారు ఆంగ్లంపై పట్టు సాధించాలి. తనిఖీల సమయంలో నిజాయితీగా.. తడుముకోకుండా సమాధానాలు ఇవ్వాలి. అవసరమైన పత్రాలన్నింటిని దగ్గర ఉంచుకోవాలి. ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితి బాగుందనే నమ్మకాన్ని వారికి కలిగించాలి. మీరు చేయబోయే కోర్సు గురించి పూర్తిగా తెలుసుకోండి. కోర్సుకు సంబంధించిన ప్రశ్నల్నీ అడిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడికి చదువు కోసమే వచ్చానని...సంపాదించేందుకు కాదని వారికి అర్థమయ్యేలా వివరించాలి.
* అమెరికాలో సుమారు 4వేలకు పైగా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మంచి వర్సిటీని ఎంపిక చేసుకోండి. వాటిలో సీటు రాలేదని ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నాచితకా యూనివర్సిటీల్లో ప్రవేశాలు తీసుకోవద్దు. కొన్ని రోజులు వేచి చూస్తే పోయేదేమీ ఉండదు. అర్హత పరీక్షల్లో మంచి మార్కులను సాధించేందుకు కృషి చేయండి.
* భారత్‌తో పోలిస్తే అమెరికాలో విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు తక్కువే. కానీ.. ఇతర దేశాలతో పోల్చుకుంటే మాత్రం అది ఖరీదైన వ్యవహారమే. అందుకే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం కేంద్రం ఇస్తున్న ఉపకార వేతనాల్ని సద్వినియోగం చేసుకోవాలి.
* అక్కడి విశ్వ విద్యాలయంలో ప్రవేశం రాగానే ఎగిరి గంతేయకుండా.. ఆ విద్యా సంస్థ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ విషయంలో కేవలం కన్సల్టెన్సీలపైనే ఆధారపడకుండా.. హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో సంప్రదించి ఆరా తీయండి. అక్కడ చదువుకుంటున్న వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోండి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ప్రోగ్రామ్స్‌, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ‘అమెరికా కార్నర్‌’ని సంప్రదించండి.
29 నెలల ఆకర్షణ..
* అమెరికాలో విద్య ఆకర్షణకు మరికొన్ని కారణాలూ ఉన్నాయి.
* ఎక్కువ మంది విద్యార్థులు స్టెమ్‌ కోర్సులు అంటే సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదివేందుకు వెళుతున్నారు. వీటిలో ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌సైన్స్‌ విద్యార్థులే 80 శాతంపైగా ఉంటున్నారు.
* ఓపీటీ (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌)కు అదనంగా 12 నెలల సమయం ఉంటుంది. స్టెమ్‌ కోర్సుల్లో అదనంగా మరో 17 నెలల పొడిగింపు ఇస్తారు. తెలుగు విద్యార్థులు 90 శాతం ఈ కోర్సుల్లో చేరుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
వెళ్లే ముందు ఒక్కసారి...
* చదవబోయే కళాశాల, విశ్వవిద్యాలయానికి సంబంధించి వివరాలతో పాటు అక్కడికి వెళ్లాక నివాసం ఉండే విషయంలో అవగాహన అవసరం. ఖర్చు.. దాన్ని ఎలా భరిస్తారనే పూర్తి సమాచారం విద్యార్థుల వద్ద ఉండాలి.
* చదివే కళాశాల, కోర్సులోని సబ్జెక్టులపైనా పరిజ్ఞానం అవసరం.
* విద్యార్హత, ఆర్థిక అంశాలకు సంబంధించిన ధ్రువపత్రాలు పక్కాగా ఉండాలి.
* ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు ప్రతి అంశంలోనూ నిజాయతీగా సమాధానం చెప్పాలి.
* ఉద్యోగం చేసేందుకు యూ ఎస్‌ వెళుతున్నామనే ఆలో చన అసలు ఉండకూడదు.
* పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల గురించి సామాజిక మాధ్యమాల్లో అక్కడ ఉన్న మిత్రులతో చాట్‌ చేయటం తగదు. మీ సామాజిక మాధ్యమాల ఖాతాలపై నిఘా ఉంటుంది.
* విమానంలో వెళ్లేటప్పుడు డాలర్లను పరిమితంగా తీసుకెళ్లేందుకే అనుమతిస్తారు. మొత్తం ఫీజు తీసుకెళ్లడం ఎలా? - సాయిరాం
ట్యూషన్‌ ఫీజును విశ్వవిద్యాలయ బ్యాంకు ఖాతాలోకి మీరు అక్కడికి వెళ్లడానికి ముందే బదిలీ చేయడం మంచిది. లేదంటే వెళ్లే సమయంలో డీడీ తీసుకెళ్లవచ్చు. ప్రయాణ, నివాస ఖర్చులకు సరిపడ కరెన్సీని యూ.ఎస్‌.డాలర్లలో తీసుకెళ్లాలి. ప్రస్తుతం చాలా సంస్థలు ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ కార్డులు ఇస్తున్నాయి.
* బీఎంఎస్‌ మూడేళ్ల కోర్సు. యు.ఎస్‌.లో మాస్టర్స్‌ డిగ్రీకి అర్హత సాధించాలంటే అదనంగా కోర్సు చేయాలా? - వై.సాహిత్య
యు.ఎస్‌.లో ఉన్నత విద్య చదవడానికి కొన్ని విశ్వవిద్యాలయాలు 15 ఏళ్లు చదివిన వారినీ తీసుకుంటున్నాయి. 12+3ని ఏ విశ్వవిద్యాలయాలు అనుమతిస్తున్నాయో చూడాలి. ఇదికాక కొన్ని వర్సిటీల్లో ఇంకో కోర్సు చేయాల్సి ఉంటుంది. అక్కడే ప్రీ మాస్టర్స్‌కు అవకాశం కల్పిస్తున్నాయి.
* చాలాకాలంగా ప్రయత్నిస్తుంటే జనవరి (స్ప్రింగ్‌)2016లో పీహెచ్‌డీ ప్రవేశం లభించింది. కానీ వీసా స్లాట్‌ లేకపోవడంతో ఆగస్టు(ఫాల్‌)లో వాయిదా పడింది. ప్రస్తుత సమస్యలతో ఇబ్బంది అవుతుందా? - పావని
మీరు ఏ విశ్వవిద్యాలయమో రాయలేదు. సాధారణంగా పీహెచ్‌డీకి పెద్ద విశ్వవిద్యాలయాల్లోనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సమస్యలూ ఉండవు. ఆందోళన చెందనక్కర్లేదు. గైడ్‌తో మాట్లాడుతూ ఉండండి.
* ఆన్‌ క్యాంపస్‌, ఆఫ్‌ క్యాంపస్‌ ఉద్యోగ అవకాశాలు ఎలా? - కుర్ర
ఆన్‌క్యాంపస్‌లో .. వారానికి 20 గంటలు పార్ట్‌టైమ్‌గా ఉద్యోగం చేసేందుకు చట్టబద్ధంగా అనుమతి ఉంటుంది. ఆఫ్‌ క్యాంపస్‌ అనేది అక్రమం. ఆచార్యుల అనుమతితో అదేరంగంలో కొంతవరకు అవకాశం ఉంది. అక్కడికి వెళ్లి ఉద్యోగం గురించి ఆలోచించకుండా చదువుపై దృష్టిపెట్టడం మంచిది.
* పత్రాలన్నీ సక్రమంగా ఉన్నా ఎందుకు వెనక్కి పంపుతున్నారు? - నరేష్‌
పత్రాలు ఒక్కటే సరిపోవు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పాలి. చదవడానికే వెళుతున్నామనే విశ్వాసం వారికికల్గించాలి.
* అన్ని సమాధానాలు సరిగ్గా చెబుతున్నా... ఎందుకు వెనక్కి పంపుతున్నట్లు? -నరేష్‌కుమార్‌
వెనక్కి వస్తున్న వారు చాలా కొందిమంది మాత్రమే. 50 వేల మందిలో రెండు వందల మంది వెనక్కి వస్తున్నారు. ఎక్కడ లోపం ఉందో అధికారుల నుంచి మీకు మెయిల్‌ వస్తుంది. అందులో మిమ్మల్ని విచారించిన అంశాలు, మీ సమాధానాలు ఉంటాయి. వీసా రద్దు అయిన వారు మళ్లీ ప్రయత్నించవచ్చు. రివోక్‌ అయిన వారికి అందులో ఎన్ని సంవత్సరాలు అనేది ఉంటుంది. అప్పటి వరకు అవకాశం ఉండదు. ఇతర దేశాల్లో ప్రయత్నించడం మంచిది.
* బ్యాంకు రుణం ద్వారా యు.ఎస్‌. వెళ్లవచ్చా? - ప్రసీద
నిరభ్యంతరంగా వెళ్లొచ్చు. కాకపోతే ఎక్కువ మంది బ్యాంకు పత్రం ఒక పేజీని తీసుకెళుతుంటారు. అందులో పూర్తి వివరాలు ఉండవు. బ్యాంకు ఇచ్చే పది,పదిహేను పేజీల పత్రాలను మొత్తం వెంట తీసుకెళ్లడం ముఖ్యం. వాటిలో ఏ సెమిస్టర్‌ ఎంత ఫీజు వంటి పూర్తి వివరాలు ఉంటాయి. ఇవి ఉంటే వీసా తిరస్కరణకు అవకాశాలు ఉండవు.
* ఇంటర్వ్యూలో అక్కడ బంధువులు ఉన్నారని చెప్పాలా? -కీర్తి
యు.ఎస్‌. వెళుతున్నప్పుడు మీ బంధువులు ఉన్నచోట విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకోకండి. చదివే చోట బంధువులు ఉంటే ఫర్వాలేదు. ఇంటర్వ్యూ సమయంలో బంధువులు ఉంటే ఉన్నారని చెప్పవచ్చు. వారు పంపిన ఆహ్వానపత్రాన్ని చూపిస్తే మంచిది.
* ప్రాయోజితం చేసే వారి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ చూపిస్తే సరిపోతుందా? ఎంత మొత్తం చూపించాలి? గ్రీన్‌కార్డు ఉన్న పౌరుడి రుణంతో చదువుకోవచ్చా? - ప్రణవి, రాజా
ప్రాయోజితం చేసే వ్యక్తి ఆదాయం రూ.6 లక్షల నుంచి 7 లక్షలు, ఇద్దరైతే రూ.8 లక్షల నుంచి 10 లక్షలు ఉండాల్సి ఉంటుంది. గ్రీన్‌కార్డు ఉన్న వ్యక్తి ప్రాయోజితం చేస్తే అక్కడి నిబంధనల ప్రకారం రుణం పొందవచ్చు.
* నాకు పదేళ్ల పర్యాటక వీసా ఉంది. విద్యార్థి వీసాగా మార్చుకోవచ్చా?- లక్ష్మణ్‌
అలా కుదరదు. చదుకోవడానికి వెళ్లాలంటే ఎఫ్‌1 వీసా తప్పనిసరి.
* స్టెమ్‌ ఓపీటీ గడువు తగ్గించారని చెబుతున్నారు? - సంతోష్‌
ప్రస్తుతం స్టెమ్‌ ఓపీటీ 12 +17 మొత్తం 29 నెలలు ఉంది. గడువు ఇప్పటివరకు తగ్గించలేదు. అలాంటి మాటలు నమ్మవద్దు. మార్పులు జరిగితే సమాచారం వస్తుంది.
* ప్రస్తుత పరిస్థితుల్లో ప్రవేశం వాయిదా వేసుకుంటే మళ్లీ వీసా తీసుకోవాలా? - వేదవ్యాస్‌
చిన్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన వారు... వేసవిలో.. ఆగస్టులో వెళ్లడం మంచిది. విదేశాంగ మంత్రిత్వశాఖ కూడా ఇదే సూచిస్తోంది. వీరు మళ్లీ వీసా తీసుకోనక్కర్లేదు. విద్యార్థి ప్రవేశపత్రం ఐ-20 మాత్రం కొత్తగా పొందాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యాలయం కూడా మారుతున్నట్లయితే వీసా మళ్లీ తీసుకోవాలి.
* సెలవుల్లో వచ్చాను. వెళ్లేటప్పుడు ఏమైనా సమస్యలొస్తాయా? - వంశీ
సెమిస్టర్‌ ప్రారంభమయ్యే సమయానికి వెళుతున్నట్లయితే ఏ సమస్యా ఉండదు. మీరు వెళ్లడానికి ముందే సెమిస్టర్‌ ఫీజు చెల్లించేయడం ముఖ్యం.
* విశ్వవిద్యాలయానికి గుర్తింపు ఉంటే చాలా? కోర్సుకు కూడా ఉండాలా? - కిరణ్‌
చదివే విశ్వవిద్యాలయానికి ప్రాంతీయ గుర్తింపుతో పాటుగా కోర్సుకూ గుర్తింపు ఉందా లేదా చూడటం మంచిది.
* ఐదేళ్ల నిషేధం ఉంది? హోంల్యాండ్‌ విభాగానికి దరఖాస్తు చేసుకుంటే ఉపయోగం ఉంటుందా? - అనిల్‌
ఉపయోగం లేదు. వారు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరు. నిషేధం తొలగే వరకు ఎదురుచూడటం లేదంటే ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించడం మేలు.
* సాంకేతికేతర కోర్సులు చదివేందుకు యు.ఎస్‌. వెళ్లవచ్చా? - దాసరి శరత్‌
నిరభ్యంతరంగా వెళ్లవచ్చు... మంచి విశ్వవిద్యాలయం ఎంపిక చేసుకుని వెళ్లడం ఉత్తమం.
* నేను ఎలక్ట్రానిక్స్‌ చదివాను. కంప్యూటర్‌ సైన్స్‌ చదివేందుకు యు.ఎస్‌. వెళ్లవచ్చా? కెరీర్‌ పరంగా ఇబ్బందులేమైనా ఉంటాయా?- ప్రణీత్‌
ఎలక్ట్రానిక్స్‌ నుంచి వచ్చినా కంప్యూటర్‌ సైన్స్‌లో చేరవచ్చు. అంతకంటే ముందు ఒకటి రెండు ప్రోగ్రామ్స్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. కెరీర్‌పరంగా ఇబ్బందులేమి ఉండవు. ఆసక్తితో మారితే సరి. ఉద్యోగ అవకాశాల కోసమైతే ఎలక్ట్రానిక్స్‌లోనూ మంచి అవకాశాలున్నాయి.
* వచ్చే డిసెంబరులో యు.ఎస్‌.లో ఉన్నత విద్యకు వెళ్లాలనే ఆలోచన. సమస్యలేం ఉండవు కదా? - తోట సురేష్‌
పత్రాలన్నీ పక్కాగా ఉండే ఏ సమస్యలు ఉండవు. వెనక్కి రావడం అనేది ప్రతిసారి కొంత ఉంటుంది. ఈసారి అది వెలుగులోకి వచ్చింది.
* స్కాలర్‌షిప్‌, అసిస్టెంట్‌షిప్‌ అవకాశాలు ఎలా ఉన్నాయి?- శిరీష
మూడు రకాల అసిస్టెంట్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. స్కాలర్‌షిప్‌ ఇది అందరికి తెలిసిందే. ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే సమయంలో స్కాలర్‌షిప్‌నకూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ట్యూషన్‌ ఫీజు భారం నుంచి బయటపడవచ్చు. రీసెర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌ రెండోది. ఆచార్యులు రికమెండ్‌ చేస్తారు. మూడోది టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌. పీహెచ్‌డీ, మాస్టర్స్‌ విద్యార్థులకు ఇస్తారు. చివరి రెండు కూడా కళాశాలలో చేరాక, తరగతి గదిలో ప్రతిభ, ఇతరత్రా అంశాలను బట్టి ఆచార్యులు ప్రతిపాదిస్తారు.
* నేను, నా భర్త వేసవిలో యు.ఎస్‌. వెళుతున్నాం. ఒకే విశ్వవిద్యాలయం, బ్యాంకు, అకడమిక్‌ అన్ని ఒకటే ఉంటే ఇమ్మిగ్రేషన్‌ ఇబ్బందులుంటాయా? - సింధు
ఇద్దరు ఒకే కళాశాల, ఒకే కోర్సుకు వెళుతున్నారా? ఒకరు చదివేందుకు వెళుతుంటే మరొకరు డిపెండెంటా? అనేది స్పష్టం చేయలేదు. ఒకరే చదవడానికి వెళుతున్నా.. ఇద్దరు ఒకే కళాశాలకు చదివేందుకు వెళుతున్నా ఇద్దరినీ స్పాన్సర్‌ చేస్తున్న వారి ఆర్థిక పరిస్తితి తెలియజేసే ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఇద్దరు వేర్వేరుగా వీసాకు దరఖాస్తు చేస్తే పెద్దగా సమస్య ఉండదు.
* అమెరికాలోని ప్రైవేట్‌ విశ్వవిద్యాలయంలో ప్రవేశం వస్తే.. ఇమ్మిగ్రేషన్‌పరంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా? - ప్రసాద్‌
ఇది అపోహ మాత్రమే. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కాకపోతే గుర్తింపు లేని వాటిలో సీటు లభిస్తే మాత్రం సమస్యలు తప్పవు. అందుకే చిన్నాచితకా యూనివర్సిటీల్లో కాకుండా మంచి విద్యా సంస్థల్లోనే సీటు ఎంపిక చేసుకోండి.
* ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల్లో నేను హాస్టల్‌లో లేదా మిత్రుల దగ్గర ఉంటానని చెప్పొచ్చా? - శ్రావణ్‌ కుమార్‌ నెక్కంటి
ఎక్కడ ఉండబోతున్నారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తే మంచిది. మా దగ్గరే ఉంటాడు.. అందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలుపుతూ మీ బంధువులు, స్నేహితుల నుంచి ‘ఇన్విటేషన్‌ లెటర్‌’ తీసుకోండి. దాన్ని తనిఖీల సమయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు చూపించడం మేలు.
* ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల సమయంలో ఎలా వ్యవహరించాలి? - శ్రీ దత్తాత్రేయ
అధికారులు అడిగే ప్రశ్నలకు నిజాయితీగా.. ఆత్మ విశ్వాసంతో సమాధానాలు ఇవ్వాలి. అవసరమైన పత్రాలను చూపించాలి.
* అమెరికాకు వెళ్లాలంటే ఏది సరైన సమయం?- సురేష్‌
ఇది సరైన సమయం.. అది కాదంటూ ఏమీ లేదు. కాకపోతే.. ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని రోజుల పాటు ప్రయాణాన్ని మానుకోవడమే ఉత్తమం.
* విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే వారు ఉపకార వేతనాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? - శిరీష
ఇలాంటి వారికి అనేక ఉపకారవేతనాలు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే.. వాటిపై చాలామందికి అంతగా అవగాహన లేదు. భారత మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో చూస్తే వివరాలు తెలుస్తాయి.
* గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాలను తెలుసుకోవటం ఎలా? - గోపి
www.chea.org, www.ed.gov/accreditation వెబ్‌సైట్లలో పరిశీలిస్తే ఆయా విశ్వవిద్యాలయాలు, కళాశాలల అక్రిడేషన్‌ వివరాలు తెలుస్తాయి. ఇందులో జాతీయ, ప్రాంతీయ గుర్తింపును పరిశీలించాలి. ధ్రువీకరించుకునేందుకు యునైటెడ్‌ స్టేట్స్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌, దేశంలోని యు.ఎస్‌. రాయబార కార్యాలయాలకు మెయిల్‌ పంపి వివరాలు తెలుసుకోవచ్చు.
* యు.ఎస్‌.లో చదివేందుకు జీఆర్‌ఈ, జీమ్యాట్‌, ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌ ఎంత స్కోరు రావాలి?- వెంకటేశ్
అక్కడ టయర్‌-1, 2, 3గా విశ్వవిద్యాలయాలకు రేటింగ్‌ ఇస్తారు. వాటికి ఉన్న నిధులు, పరిశోధన అవకాశాలు, వసతులు, కోర్సులను బట్టి ఈ రేటింగ్‌ఇస్తారు. మంచి స్కోరు వస్తే టయర్‌-1... మొదటి వంద విశ్వవిద్యాలయాల్లో సీటు పొందవచ్చు. జీఆర్‌ఈ, టోఫెల్‌ స్కోరు ముఖ్యం. జీఆర్‌ఈలో 340కిగాను 295 నుంచి 300 వరకు రావాల్సి ఉంటుంది. టోఫెల్‌లో 120కి 80పైన రావాలి. ఐఈఎల్‌టీఎస్‌లో 9 బాండ్స్‌కు ఆరు రావాలి.
* వెళ్లేటప్పుడు ఏయే పత్రాలు వెంట తీసుకెళ్లాలి? -హిమ
మీరు చదివిన విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు, విశ్వవిద్యాలయ, కళాశాల ప్రవేశపత్రం ఐ-20, అకడమిక్‌ ధ్రువీకరణ, వెళ్లడానికంటే ముందు ఫీజు చెల్లించిన పత్రాలు, స్పాన్సర్‌ చేసేవారి ఆర్థిక పరిస్థితి తెలిపే ఆధారాలు, వచ్చే సెమిస్టర్‌ ఫీజులు ఎలా చెల్లించబోతున్నారనే స్పష్టతనిచ్చే పత్రాలు, బ్యాంకు రుణం పూర్తి పత్రాలతో పాటూ చదవబోయే కోర్సు గురించి పూర్తి వివరాలు, అక్కడి విద్యావిధానంపై అవగాహన తప్పనిసరి.
* నిషిద్ధ జాబితాలో ఉన్న విశ్వవిద్యాలయాల గురించి ఎలా తెలుసుకోవాలి?- గరికపాటి వెంకటేష్‌
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయంలో సంప్రదించి.. ఆ విశ్వ విద్యాలయం గురించి వివరాల్ని ఆరా తీయండి. అమెరికాలో చదువుకుంటున్న మిత్రులు, స్నేహితులను అడిగి తెలుసుకోండి.
హైదరాబాద్‌ నుంచే అధికం..
* 2015-16లో 50 వేల మంది వరకు తెలుగు విద్యార్థులు యు.ఎస్‌. వెళ్లుంటారని అంచనా.
* దేశవ్యాప్తంగా ఉన్న ఐదు యు.ఎస్‌.ఎంబసీల్లో హైదరాబాద్‌ కాన్సులేట్‌ నుంచే ఎక్కువ మంది వెళుతున్నారు.
* చెన్నై, ముంబయి రెండుచోట్ల వెళ్లిన వారితో సమానంగా హైదరాబాద్‌ నుంచి వెళుతున్నారు.ఈ రెండు ప్రాంతాల నుంచి వెళుతున్న వారిలోనూ తెలుగువారు ఉన్నారు.
* ప్రపంచవ్యాప్తంగా యు.ఎస్‌.కు వెళ్లే విద్యార్థులను పరిశీలిస్తే కొరియా, చైనాలోని రెండు కాన్సులేట్‌ల తర్వాత నాలుగో స్థానంలో హైదరాబాద్‌ ఉంది.

Posted on 14.1.2016


Ask the Expert
Click Here..