జాగ్రత్తలు తీసుకుంటే అమెరికాయానం సులభం

* అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలి
* అక్కడి చదవులు, వర్సిటీలపై అధ్యయనం అవసరం
* పశ్చిమయానం ఫలించాలంటే ప్రణాళిక ముఖ్యం
* ప్రవాస భారతీయుడు తోటకూర ప్రసాద్‌ సూచనలు

ఈనాడు - హైదరాబాద్‌: అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెళ్తున్న తెలుగు విద్యార్థులను విమానాశ్రయం నుంచే వెనక్కి పంపేస్తున్న తీరు ఇప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులను, విద్యార్థులను కలవరం కలిగిస్తోంది. అమెరికాలో ఉంటున్న ప్రవాస తెలుగువారు కూడా ఇలాంటి సంఘటనల పట్ల ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండాలంటే ఏం చేయాలో, విశ్వవిద్యాలయాలను ఎంచుకోవటంలో.. ఇంటర్వ్యూకు హాజరవటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు ప్రవాస భారతీయ ప్రముఖులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర. ముఖ్యంగా బయలుదేరే ముందే అన్నిరకాలుగా అధ్యయనం చేయాలని, జతపర్చిన అన్ని డాక్యుమెంట్ల వివరాలకు సరిపోయేలా తడబాటు లేకుండా సరైన సమాధానాలివ్వాలని ఆయన చెబుతున్నారు. ప్రామాణికమైన వివిధ వర్గాల నుంచి ఆయన సేకరించి అందిస్తున్న సమాచారం ‘ఈనాడు’ పాఠకులకు ప్రత్యేకం...
వర్సిటీల ఎంపికలో...
* ఎంచుకున్న విశ్వవిద్యాలయం, కోర్సు గుర్తింపు పొందినవో లేదో సరిచూసుకోవాలి. విశ్వవిద్యాలయానికి గుర్తింపు ఉన్నా, కొన్ని కోర్సులకు గుర్తింపు ఉండకపోవచ్చు.
* అమెరికాలోని విశ్వవిద్యాలయాలు ‘యుఎస్‌ ఫెడరల్‌ గవర్నమెంట్‌’తో కానీ ‘కౌన్సిల్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అక్రిడిటేషన్‌’తో కానీ గుర్తింపుపొంది ఉండాలి.
* ప్రతి విశ్వవిద్యాలయానికి ప్రవేశ విధానాలు వేర్వేరుగా ఉంటాయి.
* భారత్‌లో ఉన్న డిగ్రీ యూఎస్‌లో ఏ డిగ్రీతో సమానమో తెలుసుకోవాలి. ఏదైనా ఓ ఎడ్యుకేషనల్‌ క్రెడెన్షియల్‌ ఎవాల్యుయేషన్‌ ఏజెన్సీకి పంపి తెలుసుకోవచ్చు.
* విద్యాభాసానికి అవసరమైన ఖర్చులను ముందే అంచనా వేసి ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి. అక్కడి కొన్ని ప్రైవేటు సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు అర్హతగల విద్యార్థులకు కొంత ఆర్థిక సాయం చేస్తుంటాయి.
* కొన్ని విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు సాయం చేస్తుంటాయి. మీరు ఎంచుకున్న వర్సిటీలో ఆ సదుపాయం ఉందో లేదో అడిగి తెలుసుకోవాలి.
వీసాలు... రకాలు
* స్టూడెంట్‌ వీసాలు మూడు రకాలు: 1) ఎఫ్‌-1 వీసా- ఇది అమెరికాలో విద్యాభ్యాసం కోసం. 2) జే-1 వీసా: యూఎస్‌లో ఎక్సే్చంజి విజిటల్‌ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు; 3) ఎం-1 వీసా: వృత్తివిద్యా కోర్సుల కోసం.
* మీరు పంపిన దరఖాస్తు చూసి, ఆ విశ్వవిద్యాలయంలో చదవటానికి అర్హులైతే ఆ వర్సిటీ మీకు 1-20 ఫారం పంపిస్తుంది. 1-901 ద్వారా వీసా దరఖాస్తుకు రుసుం చెల్లించాలి. ఆ తర్వాత ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసా కోసం యూఎస్‌ కాన్సులేట్‌ లేదా యూఎస్‌ అంబసీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
* గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు తాము విదేశీ విద్యార్థులను చేర్చుకుంటున్నామని 1-17 ఫారం ద్వారా ముందుగానే యూఎస్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీకి సమాచారం అందజేస్తాయి.
విమానాశ్రయంలో దిగగానే..
* ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మీ విద్యాప్రణాళిక (అకడమిక్‌ ప్లాన్‌), ఆర్థిక వనరుల గురించి ఇంటర్వ్యూ తీసుకుంటారు.
* మీరు జతపర్చిన అన్నిడాక్యుమెంట్ల వివరాలకు సరిపోయేలా.. తడబాటులేకుండా సరైనసమాధానాలివ్వాలి.
* విద్యాభ్యాస కాలంలో ఆర్థిక అవసరాల కోసం వర్సిటీ పరిధి దాటి ఎటువంటి ఉద్యోగం చేయబోమని ఖచ్చితంగా చెప్పాలి. చదువయ్యాక వెళ్లిపోతామనే చెప్పాలి
* వీసా ఇంటర్వ్యూకు వెళ్లేప్పుడు మీ పాస్‌పోర్టు గడువు అమెరికాలో నివసించాలనుకుంటున్న కాలంకన్నా అదనంగా ఆరునెలల కాలపరిమితి ఉండాలి.
* ఇంటర్వ్యూకు హాజరయ్యే తేదీకన్నా ముందే మీరు కట్టిన అన్ని రుసుంల రసీదులు ఉంచుకోవాలి.
* యూనివర్సిటీ మీకు పంపిన 1-20 ఫారం దగ్గరుంచుకోవాలి. వివిధ విద్యాసంస్థల ద్వారా పొందిన డిగ్రీలు, మార్కుల జాబితాలు, టోఫెల్‌, జీఆర్‌ఈ జీమ్యాట్‌ స్కోరు కార్డుల వివరాలను కూడా!
* అమెరికాలో మీ ఉన్నత విద్యాభ్యాసం ముగిసిన తర్వాత మీరు తప్పనిసరిగా స్వదేశం వెళ్లాల్సిన అవసరం ఉందని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.
* మీ విద్యాభ్యాసం, వసతి, ప్రయాణపు ఖర్చులకు సరిపడా ఆర్థిక వనరులు మీ దగ్గరున్నాయని ధ్రువపరచాలి.
* మీరు పొందుపర్చిన అన్ని ధ్రువపత్రాలు పరిశీలించి, మీరు అర్హులని భావిస్తేనే కాన్సులేట్‌ అధికారి మీకు ఎఫ్‌-1 వీసా అందజేస్తారు.
సీల్డ్‌కవర్‌ తెరవొద్దు...
* ప్రయాణానికి ముందు మీరు పొందిన వీసాపై మీరు చేరబోయే విశ్వవిద్యాలయం పేరు, వీసా క్లాసిఫికేషన్‌ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోండి.
* ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాపై తొలిసారి వచ్చేవారిని తమ కోర్సు మొదలయ్యే తేదీకన్నా 30 రోజుల ముందుగా మాత్రమే ఆ దేశంలోకి అనుమతిస్తారు.
* ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసా పొందే సమయంలో కాన్సులేట్‌ అధికారి మీకు అందించిన సీల్డ్‌కవర్‌ను అలాగే తెరవకుండా అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో సంబంధిత ఇమ్మిగ్రేషన్‌ అధికారికి అందించాలి.
* అమెరికాలో అడుగుపెట్టేప్పుడు ఎఫ్‌-1 వీసా కలిగిన పాస్‌పోర్టు (సీల్డ్‌కవర్‌ సహా); ఫారం ఐ-20 లేదా డీఎస్‌- 2019; ఫారం ఐ-797 ఫీజు చెల్లించిన రసీదు; విద్యాభ్యాసం, వసతి, భోజన సదుపాయాల ఖర్చులకు అవసరమయ్యే ఆర్థిక వనరులు ఉన్నాయని నిరూపించే అన్ని రకాల ధ్రువపత్రాలు; ట్యూషన్‌ ఫీజు రసీదులు, అవసరమైన విద్యా సంబంధిత పత్రాలు, చేరబోయే విశ్వవిద్యాలయంతో మీరు ఉత్తరప్రత్యుత్తరాలు జరిపిన డిజిగ్నేటెడ్‌ స్కూల్‌ అఫీషియల్‌ (డీఎస్‌ఓ), రెస్పాన్సిబుల్‌ ఆఫీసర్‌ (ఆర్‌ఓ) పేరు, వివరాలు వెంట ఉంచుకోవాలి.
ఎఫ్‌-1పై వర్సిటీ పరిధి దాటి ఉద్యోగం కుదరదు...
* ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసా కల్గిన విద్యార్థులెవరూ విశ్వవిద్యాలయం పరిధి దాటి ఉద్యోగం చేయటానికి వీల్లేదు.
* వర్సిటీ ప్రాంగణంలో కూడా వారానికి 20 గంటలకు మించి ఉద్యోగం చేయరాదు.
* ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసా విద్యార్థులు తమ కోర్సు పూర్తికాలం; తర్వాత 60 రోజులు అదనంగా ఉండానికి మాత్రమే అర్హులు.
* సైన్స్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ కోసం తొలుత 12 నెలలు, తర్వాత అదనంగా 17 నెలలు ఉండటానికి అర్హులు.
* ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసా విద్యార్థులు తమకు జారీ చేసిన 1-20 ఫారంలోని గడువు ముగిసేలోగా చదువు పూర్తి చేయాలి.
వీసా మార్గ‌ద‌ర్శ‌కాలు

Posted on 24.1.2016


Ask the Expert
Click Here..