విద్యాభ్యాసం.. విదేశాల్లో..!

విదేశాల్లో చదువుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితులు కొంతమందికే సహకరిస్తాయి. మరి మిగతా వారి సంగతేమిటి? వారి కల నెరవేరే మార్గమే లేదా? ఆందోళన అక్కర్లేదు.. మేమున్నాం అంటూ భరోసానిస్తున్నాయి బ్యాంకులు.
విద్యార్థినులకు 0.5% తక్కువ వడ్డీకే విద్యారుణాలను ఇస్తున్నాయి బ్యాంకులు.
విద్యారుణానికి చెల్లించే వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80ఈ ప్రకారం ఎలాంటి పరిమితి లేకుండా పూర్తి మినహాయింపు లభిస్తుంది.
గత ఏడాదిలో దాదాపు 35,000 మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారని సమాచారం. వీరిలో సైన్సు, టెక్నాలజీ విద్యార్థులు అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలకు వెళ్లారు. సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌, పారిస్‌, స్పెయిన్‌, ఆస్ట్రేలియా దేశాలను మేనేజ్‌మెంటు విద్యార్థులు ఎంచుకుంటున్నారు. ఇక మెకానిక్‌ విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేందుకు జర్మనీలాంటి దేశాలకు పయనం అవుతున్నారు. సాధారణంగా ఉన్నత విద్యాభ్యాసం అంటేనే కాస్త ఖరీదు. అందులోనూ విదేశీ విద్య అంటే మరీనూ. అయితే, ఇటు స్వదేశీ, ఇటు విదేశాల్లోనూ చదువుకోవాలనే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వారికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు భారత ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. విద్యారుణాల మంజూరు సులభతరం చేసేందుకు వీలుగా పలు జాతీయ బ్యాంకులను కలిపి www.vidyalakshmi.co.in ద్వారా ఒక వేదిక మీదికి తీసుకొచ్చాయి. విద్యారుణాల కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు ఈ వెబ్‌సైటులో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారా బ్యాంకుల నుంచి సులభంగా రుణం పొందే అవకాశాన్ని కల్పించాయి.
తేడా ఏమిటి?
విద్యా రుణాలను జాతీయ బ్యాంకులతో పాటు, కొన్ని బ్యాంకింగేతర రుణ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) కూడా అందిస్తున్నాయి. ఎక్కడ రుణం తీసుకోవాలో నిర్ణయించుకునే ముందు వాటి మధ్య ఉన్న తేడాలను తెలుసుకోవడం మంచిది. బ్యాంకులు, బ్యాంకింగేతర రుణ సంస్థలు రూ.7.5లక్షల వరకూ ఎలాంటి హామీ లేకుండానే రుణాలను అందిస్తున్నాయి. తల్లిదండ్రుల, స్పాన్సర్ల ఆదాయం, చదువులో విద్యార్థి ప్రతిభ ఆధారంగా కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు రూ.25లక్షల వరకూ ఎలాంటి హామీ అడగకుండానే అప్పు ఇస్తున్నాయి.
ఆర్థిక పరిస్థితే కీలకం...
విదేశీ విద్యాభ్యాసానికి వెళ్లాలనుకునే వారికి కీలకం ఆర్థికంగా ఎంత మద్ధతు ఉందనేదే కీలకం. దీని ఆధారంగానే వారికి వీసా లభిస్తుంది. దీనికోసం ఎలా సిద్ధం అవ్వాలి? బ్యాంకును ఎలా సంప్రదించాలో చూద్దాం!
ప్రశాంత్‌ అమెరికాలో ఎంఎస్‌ చేయాలనుకుంటున్నాడు. జీఆర్‌ఈ, టోఫెల్‌, మార్కుల వివరాలతో అక్కడి ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నాడు.
* ప్రశాంత్‌ దరఖాస్తును ఒక విశ్వవిద్యాలయం ఆమోదించింది. ఐ-20జారీ కోసం కింది పత్రాలను పంపించాల్సిందిగా సూచించింది. కోర్సు ఫీజు, అక్కడ ఉండేందుకు దాదాపు 36,000 అమెరికన్‌ డాలర్లు ఖర్చు అవుతుందని పేర్కొంది.
* ఆర్థిక పరిస్థితి గురించి తెలిపేందుకు బ్యాంకు ఖాతా వివరాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ప్రావిడెంట్‌ ఫండ్‌ నిల్వ, మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు, సంప్రదాయ జీవిత బీమా పాలసీల వివరాలు, ఆస్తులకు సంబంధించిన విలువ లెక్కింపు పత్రం, చార్టెడ్‌ అకౌంటెంట్‌ ద్వారా నికర విలువ ధ్రువీకరణ పత్రాలు వీటన్నింటిలో ఏముంటే అవి చూపించుకోవచ్చు.
* పాస్‌పోర్టు: ఐ-20లో పేరును పాస్‌పోర్టులో ఉన్నట్లుగానే పేర్కొనేందుకు పాస్‌పోర్టు నకలును పంపించాలి.
* అవసరమైన డబ్బు అందుబాటులో ఉందని తెలుపుతూ తల్లిదండ్రులు/స్పాన్సర్ల ద్వారా అఫిడఫిట్‌, బ్యాంకు రుణం ఇస్తానని అంగీకరిస్తే దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం.
అడ్మిషన్‌ ఇస్తామని తెలిపిన తర్వాత 60 రోజుల్లోగా ఈ పత్రాలన్నీ పంపించాల్సి ఉంటుంది. ప్రశాంత్‌ నాన్నగారు మొదటి ఏడాది ఖర్చులు+ రెండో ఏడాదిలో 50శాతానికి సరిపడా మొత్తం బ్యాంకులో చూపించాలి. తక్కువ పడితే ఆమొత్తానికి రుణం తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తి ఖర్చు భరించగలిగినా బ్యాంకు రుణం తీసుకోవడం మంచిది.
వీసా కోసం వెళ్లేముందు..
విశ్వవిద్యాలయం అడిగిన అన్ని పత్రాలూ పంపించిన తర్వాత అక్కడి నుంచి ఐ-20 వస్తుంది. ఆ తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళ్లాలి. వీసా కోసం వెళ్లేప్పుడు కొన్ని విషయాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
* ఐ-20లో పేర్కొన్న అన్ని ఖర్చుల గురించి పూర్తిగా తెలుసుకోండి. వారు అడిగిన మొత్తం డబ్బు మీరు సమకూర్చుకోగలను అని నమ్మకంగా చెప్పగలగాలి.
* వీసా జారీలో బ్యాంకు రుణం ప్రధాన పాత్ర పోషిస్తుంది. విద్యార్థి, విద్యార్థి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని బ్యాంకు అంచనా వేస్తుంది. అందువల్ల డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదనేది ఇక్కడ గమనిస్తారు.
* అడ్మిషన్‌ కోసం పంపించిన అన్ని పత్రాలనూ వీసా ఇంటర్వ్యూ సమయంలో కూడా వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు.
ప్రయాణానికి సిద్ధమా!
వీసా వచ్చిన తర్వాత ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి. దీనికన్నా ముందుగా మీరు రుణం తీసుకున్న బ్యాంకు/ఎన్‌బీఎఫ్‌సీతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొంత మొత్తాన్ని బ్యాంకు మంజూరు చేస్తుంది.
ఫీజు చెల్లింపు: ఒప్పందం ప్రకారం బ్యాంకు మీ విశ్వవిద్యాలయానికి నేరుగా ఫీజును చెల్లిస్తుంది. రుణాన్ని మన కరెన్సీలో మంజూరు చేస్తారు. మన రూపాయి నుంచి డాలర్లలోకి మార్చేప్పుడు కొంత వ్యయం అవుతుంది. దీన్ని గమనించాలి. ఐ-20లో పేర్కొన్నట్లుగా ట్యూషన్‌ ఫీజు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, హాస్టల్‌ ఫీజులను కలిపి ఒకే మొత్తంగా పరిగణించి, చెల్లింపు జరుపుతుంది.
* సాధ్యమైనంత వరకూ డీడీలను తీసుకెళ్లకపోవడమే మేలు. ఒకవేళ అవి పోతే, తిరిగి వాటిని పొందడం కాస్త ఖర్చుతో కూడుకున్న పని. సమయం కూడా పడుతుంది.
* అక్కడ నివసించేందుకు కావాల్సిన ఖర్చులను బ్యాంకు మీ అభీష్టాన్ని బట్టి ఫారెక్స్‌ కార్డు, నగదు, డీడీల రూపంలో ఇస్తుంది.
* కాలేజీలో ఇచ్చే ఓరియెంటేషన్‌ తరగతులకు హాజరవ్వండి. దీని ద్వారా తదుపరి ఫీజు చెల్లింపు, అక్కడ అయ్యే ఖర్చులు తదితర వాటి గురించి ఒక అవగాహన వస్తుంది.
* మీ ఆర్థిక వివరాలకు సంబంధించిన అన్ని పత్రాలూ, రుణ మంజూరీ పత్రం, మీ తల్లిదండ్రుల బ్యాంకు ఖాతా వివరాలు తదితరాలన్నీ వెంట తీసుకెళ్లండి. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా విదేశాల్లో ప్రవేశానికి అనుమతి దొరుకుతుంది.

Posted on 29.04.2016


Ask the Expert
Click Here..