విదేశీ వైద్యవిద్య.. తప్పదు జాగ్రత్త

విదేశాల్లో పీజీ వైద్యవిద్యపై ఆంక్షలు
* ఐదు దేశాల్లోనే విద్యాభ్యాసానికి ఎంసీఐ అనుమతి
* అక్కడ ఉత్తీర్ణులైతే భారత్‌లో మళ్లీ అర్హత పరీక్ష అక్కరలేదు
* అవి మినహా ఇతర దేశాల్లో చదివితే గుర్తింపు నిరాకరణ
* అవగాహన లేకుండా ముందుకెళితే అంతే సంగతులు
వివిధ దేశాల్లో ఎంబీబీఎస్‌ వైద్యవిద్య చదివేందుకు అనుమతులిచ్చిన భారతీయ వైద్య మండలి (ఎంసీఐ).. పీజీకి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు దేశాల్లోనే విద్యాభ్యాసానికి సమ్మతించింది. అమెరికా, కెనడా, యూకే(బ్రిటన్‌), ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో పీజీ వైద్యవిద్యకు మాత్రమే ఎంసీఐ గుర్తింపునిచ్చింది. ఈ దేశాల్లో పీజీ పూర్తిచేసుకొచ్చిన వారు.. విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన విద్యార్థుల్లా భారత్‌లో మళ్లీ అర్హత పరీక్ష రాయాల్సిన పనిలేదు. అవికాక, వేరే దేశాల్లో పీజీ వైద్యవిద్య పూర్తిచేసుకొచ్చినా.. ఆ డిగ్రీ భారత్‌లో చెల్లుబాటు కాదు. ఈ అవగాహన లేకుండా విదేశాల్లో పీజీ వైద్యవిద్యకు వెళ్తే విలువైన సమయం, డబ్బు, కెరీర్‌.. అన్నీ కోల్పోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈనాడు - హైదరాబాద్‌
ఎంబీబీఎస్‌ సీట్లతో పోల్చితే భారత్‌లో లభించే పీజీ వైద్యవిద్య సీట్లు చాలా స్వల్పం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలుపుకొని కన్వీనర్‌ కోటాలో 1,899 పీజీ సీట్లుండగా, ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటాలో మరో 795 సీట్లున్నాయి. అదే ఎంబీబీఎస్‌కు వచ్చేసరికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అన్ని విభాగాలు కలుపుకొని సుమారు 5,550 సీట్లున్నాయి. ఫలితంగా దాదాపు సగం మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాల్లో పీజీ సీటును సాధించలేకపోతున్నారు. దీంతో విదేశాల్లో పీజీ వైద్యవిద్య పైనా ఎంబీబీఎస్‌ విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంటోంది. ఏటా మన దేశం నుంచి చైనా, ఉక్రెయిన్‌, నేపాల్‌, ఫిలిప్పీన్స్‌, రష్యా, హంగేరీ, బల్గేరియా, కరేబియన్‌ దీవులు, కిర్గిస్థాన్‌ తదితర దేశాలకు ఎంబీబీఎస్‌ వైద్యవిద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య 10వేలకు పైనే ఉంటోంది. కేవలం రూ20-25 లక్షలతోనే ఎంబీబీఎస్‌ను పూర్తిచేసుకునే అవకాశం ఉంటోంది. దీంతో ఆయా దేశాలకు వెళ్తున్న విద్యార్థుల్లో కొందరు.. ఎంబీబీఎస్‌ పూర్తిచేసుకున్నాక అక్కడే పీజీ వైద్యవిద్యనూ అభ్యసిస్తున్నారు. విదేశీ వాతావరణానికి, అక్కడి బోధన విధానానికి అప్పటికే ఐదారేళ్లుగా అలవాటు పడి ఉండడం.. భారత్‌లోనూ పీజీ వైద్యవిద్య సీటు లభించే అవకాశాలు తక్కువగా ఉండడంతో.. ఆయా దేశాల్లోనే పీజీ వైద్యవిద్యను పూర్తిచేయడానికి మొగ్గుచూపుతున్నారు. అదయ్యాక తిరిగి భారత్‌లో అర్హత పరీక్ష రాస్తే సరిపోతుందనే భావనలో ఉండడం కూడా కొనసాగింపునకు మరో కారణమని తెలుస్తోంది. అయితే ఇది అవగాహన రాహిత్యమేనని నిపుణులు చెబుతున్నారు.
గుర్తింపు పత్రం తప్పనిసరి
అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో పీజీ వైద్యవిద్య పూర్తిచేసినవారు.. అందులో ఉత్తీర్ణులైనట్లుగా ఆ దేశ వైద్యమండలి జారీచేసిన ధ్రువపత్రాన్ని పొందాల్సి ఉంటుంది. దాన్ని మన దేశంలోని రాష్ట్ర వైద్యమండలిలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరమే మన దేశంలో నేరుగా వైద్యసేవలందించవచ్చు. ‘‘ఈ ఐదు దేశాలు కాకుండా ప్రపంచంలోని మరే దేశంలో పీజీ వైద్యవిద్య చదివినా ఆ పట్టా భారత్‌లో చెల్లుబాటు కానేకాదు. అవగాహన లేకుండా చదివితే వృథాయే’’ అని తెలంగాణ రాష్ట్ర వైద్యమండలి ఛైర్మన్‌ డా॥రవీందర్‌రెడ్డి చెప్పారు.
పీజీలో గుర్తింపు స్థాయిలోనే..
భారతీయులు గుర్తింపు స్థాయిలోనే అమెరికా, యూకే, కెనాడాల్లో పీజీ వైద్యవిద్యకు ఎంపికవుతున్నారు. అమెరికాలో సాధారణంగా పీజీ వైద్యవిద్య సీట్ల ఎంపికలో ‘ళివీతిదీ’ అంటే ఆర్‌.. రేడియాలజీ, ఓ.. ఆప్తల్మాలజీ, ఏ..అనస్థీషియా, డి.. డెర్మటాలజీ.. ఈ క్రమంలో పీజీ వైద్యవిద్య సీట్లను పొందడానికి వైద్యవిద్యార్థులు అధిక ప్రాధాన్యమిస్తారనీ, ఎంసీఐ గుర్తింపులేని దేశాల్లో పీజీ వైద్యవిద్యకు వెళ్లకపోవడమే మంచిదనీ డాక్టర్స్‌ అబ్రాడ్‌ సంస్థ ఎండీ సతీష్‌ తెలిపారు.
అన్ని దేశాలకూ అనుమతించాలి
ఆ ఐదు దేశాలకే కాకుండా ఇతర దేశాలకూ పీజీ వైద్యవిద్య అభ్యాసనకు గుర్తింపునివ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ‘‘మా అమ్మాయి చైనాలో ఎంబీబీఎస్‌ చేసింది. అక్కడే ప్రతిభ ఆధారంగా గైనకాలజీలో పీజీ వైద్యవిద్యలోనూ సీటు సంపాదించింది. చైనా ప్రభుత్వం నుంచి ఉపకార వేతనం పొందుతుంది. ఎక్కడ చదివినా మన దేశంలో ప్రజలకే సేవలందించాలనేది మా అమ్మాయి లక్ష్యం. అయితే ప్రభుత్వం అందుకు అవకాశమివ్వడం లేదు. ఈ విషయంలో విశాల దృక్పథంతో ఆలోచించి, ఇతర దేశాల పీజీ వైద్యవిద్యకూ గుర్తింపునివ్వాలి’’ అని విశ్రాంత ప్రభుత్వ అధికారిణి ప్రణోతి సుహాసిని తెలిపారు.
ఆ ఐదింటిలో ప్రవేశాలెలా?
* ఐదు దేశాల్లోనూ పీజీ వైద్యవిద్యకు ఆన్‌లైన్‌ ద్వారానే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
* పీజీ వైద్యవిద్యకు ఎంపికైతే ఉపకార వేతనంతోనే ముందుకెళ్లవచ్చు.
* అమెరికాలో పీజీ వైద్యవిద్య ప్రవేశానికి యునైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామినేషన్‌(యూఎస్‌ఎంఎల్‌ఈ) అనే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
* మూడంచెల్లో నిర్వహించే పరీక్షలో మొదటి రెండు దశలు ఆన్‌లైన్‌లోనే మన దేశం నుంచే రాసుకోవచ్చు.
* మూడో దశ ప్రాక్టికల్స్‌కు అమెరికాకు వెళ్లాల్సి ఉంటుంది.
* కెనడాలో పీజీ వైద్యవిద్యకూ మూడంచెల విధానమే అమలవుతోంది.
* యూకేలోనూ యూకేఎంఎల్‌ఏ అనే ప్రవేశపరీక్షను రెండంచెల విధానం ద్వారా నిర్వహించి పీజీ వైద్యవిద్యకు ఎంపికచేస్తారు.
* ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ల్లోనూ మొదటి దశ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. రెండో దశ ప్రాక్టికల్‌ పరీక్షకు స్వయంగా వెళ్లాల్సి ఉంటుంది.
అక్కడ ప్రమాణాలు ఏ మేరకో తెలుస్తుంది
విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన విద్యార్థులు మన దగ్గర అర్హత పరీక్షలో విఫలమవుతున్నారంటే.. ప్రమాణాలు ఏమేరకున్నాయో అర్థమవుతాయి. వాటిని కాపడుకోవడంలో భాగంగానే పీజీ వైద్యవిద్యకు ఎక్కువ దేశాలకు అనుమతివ్వడం లేదు. - డా॥ పుట్టా శ్రీనివాస్‌, మాజీ సభ్యులు, ఎంసీఐ
అనుభవపూర్వక శిక్షణకే ప్రాధాన్యం
అమెరికా, యూకే తదితర దేశాల్లో పీజీ వైద్యవిద్యలో అనుభవపూర్వక శిక్షణకు, దృశ్యసహిత బోధనకు ప్రాధాన్యమిస్తారు. మా అమ్మాయి యూకేలో పీజీ వైద్యవిద్య చదువుతోంది. అక్కడ బ్లాక్‌బోర్డుపై పాఠాలుండవు. ఏ వైద్యకళాశాలలో చేరినా.. క్షేత్రస్థాయి శిక్షణకు ఆసుపత్రులను మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. యూకేలో ఎంబీబీఎస్‌ మొదటి ఏడాదిలోనే వైద్యవిద్యార్థులను ఐసీయూలు, అత్యవసర చికిత్స విభాగాల్లో సేవలకు పంపిస్తారు. దీంతో వైద్యవిద్యార్థులకు లాభం జరుగుతుంది. - డా॥నరేంద్రనాథ్‌, నిమ్స్‌ మాజీ సంచాలకులు.


Posted on 17.06.2016


Ask the Expert
Click Here..