ఇంజినీరింగ్ విద్యకు అత్యుత్తమ దేశాలివీ...

భార‌త్‌లోనే కాకుండా ప్రపంచ‌వ్యాప్తంగా ఎక్కువ మంది యువ‌త ప్రాధాన్యమిచ్చే కోర్సు ఇంజినీరింగ్‌. ఉద్యోగాలు విస్తృతంగా ఉండ‌డం, విదేశాల్లో ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం, పెద్దమొత్తంలో వేత‌నాలు లభించ‌డం...ఇవ‌న్నీ ఇంజినీరింగ్ విద్య జ‌గ‌ద్విఖ్యాతానికి కార‌ణాల‌గా చెప్పుకోవ‌చ్చు. నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ కాలేజెస్ అండ్ ఎంప్లాయీస్ (ఎన్ఏసీఈ) యూఎస్ఎ ప్రకారం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఏడాదికి 63 వేల అమెరిక‌న్ డాల‌ర్లు ఆర్జిస్తున్నారు. అనుభ‌వం, బ్రాంచీని బ‌ట్టి ఇంత‌కంటే పెద్దమొత్తంలో సంపాదిస్తున్నవాళ్లూ ఉన్నారు. పెట్రోలియం ఇంజినీరింగ్ చ‌దివిన‌వారు ల‌క్ష డాల‌ర్లు, న్యూక్లియ‌ర్ ఇంజినీరింగ్ లో కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 68 వేల డాల‌ర్లు అర్జిస్తున్నారు. ప్రతి ప‌రిశ్రమ ఇంజినీరింగ్‌తో ముడిప‌డి ఉండ‌డంతో అవ‌కాశాలు విస్తృత‌మ‌వుతున్నాయి. మొన్నటిదాకా ఎంఎస్‌ కోర్సులు చ‌ద‌వ‌డానికి ఎక్కువ మంది భార‌తీయ విద్యార్థులు విదేశాల‌కు వెళ్లేవారు. కానీ ఇప్పుడు అండ‌ర్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుల‌నూ విదేశాల్లో చ‌ద‌వ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. త‌ల్లిదండ్రులు కూడా పిల్లల‌ను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈ ఇంజినీరింగ్ కోర్సుల‌ను ప్రముఖ సంస్థల్లో చ‌దివిన‌ప్పుడే ఉన్నత ఉద్యోగ అవ‌కాశాలు సొంత‌మ‌వుతాయి. ఇంజినీరింగ్‌లో విదేశీవిద్య అభ్యసించాల‌నుకునే విద్యార్థులు ప్రపంచ‌వ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యకు పేరొందిన దేశాలు, ఆయా దేశాల్లో ప్రముఖ యూనివ‌ర్సిటీల స‌మాచారం తెలుసుకోవ‌డం ఎంతో ముఖ్యం.

యూఎస్ఏ
ప్రపంచ‌ యువ‌త ఇంజినీరింగ్ చూపులంతా అమెరికా సంయుక్త రాష్ట్రాల‌పైనే ఉంటోంది. చ‌దువుల నిమిత్తం ఏటా 9 లక్షల మంది విదేశీ విద్యార్థులు అమెరికా విమానం ఎక్కుతున్నారు. వీరిలో 20 శాతం మంది ఇంజినీరింగ్ కోర్సుల్లోనే చేరుతున్నారు. ఆ దేశంలోని టాప్ కోర్సుల్లో ఒక‌టిగా ఇంజినీరింగ్ గుర్తింపు పొందింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో సైతం ఇక్కడి యూనివ‌ర్సిటీలే ప్రథ‌మ స్థానంలో నిల‌వ‌డంతో విద్యార్థులు అమెరికా చ‌దువుల‌కు ప్రాధాన్యమిస్తున్నారు. నాణ్యమైన విద్యతోపాటు పెద్ద మొత్తంలో వేత‌నాలు కూడా ఇక్కడ ల‌భిస్తున్నాయి. మ‌సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ, హార్వార్డ్ యూనివ‌ర్సిటీలు ఇంజినీరింగ్ విద్యలో అత్యున్నత బోధ‌న‌తోపాటు ప‌రిశోధ‌నల‌ను ప్రోత్సహిస్తున్నాయి. మిగిలిన దేశాల‌తో పోల్చిన‌ప్పుడు అమెరికాలో ఫీజులు మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. ప్రపంచంలో ఖ‌రీదైన ఇంజినీరింగ్ చ‌దువుల‌కు కేంద్రంగా యూఎస్ఏ నిలిచింది. ఒక్క ట్యూష‌న్ ఫీజుకోస‌మే ఏటా స‌గ‌టున 40 వేల డాల‌ర్లు చెల్లించాలి. అయితే ప్రతిభ చూపిన విద్యార్థులు స్కాల‌ర్‌షిప్ రూపంలో కొంత వ‌ర‌కు ఆర్థిక వెసులుబాటు పొంద‌వ‌చ్చు. మ‌సాచ్యుసెట్స్‌, స్టాన్‌ఫోర్డ్‌, యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా- బెర్క్‌లీ, హార్వార్డ్ యూనివ‌ర్సిటీ, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా -లాస్ఏంజిల్స్‌, ప్రిన్స్‌ట‌న్ యూనివ‌ర్సిటీ, కార్నెజీ మెలాన్ యూనివ‌ర్సిటీ, ఇల్లినాయిస్ యూనివ‌ర్సిటీలు ఇంజినీరింగ్ కోర్సుల‌కు ఖ్యాతి గ‌డించాయి.

యూకే
ఇంజినీరింగ్ విద్యలో అమెరికా త‌ర్వాత స్థానం యునైటెడ్ కింగ్డమ్‌కే ద‌క్కుతుంది. క్యూఎస్ స‌ర్వే ప్రకారం ప్రపంచంలో టాప్ 50 ఇంజినీరింగ్ యూనివ‌ర్సిటీల్లో 5 యూకేలోనే ఉన్నాయి. ఇక్కడి ఆక్స్‌ఫ‌ర్డ్‌, కేంబ్రిడ్జ్‌లు ప్రపంచంలో అత్యుత్తమ యూనివ‌ర్సిటీలగా గుర్తింపు పొందాయి. ఏటా 5 ల‌క్షల మంది విదేశీ విద్యార్థులు చ‌దువుల కోసం యూకే వెళ్తున్నారు. వీరిలో 59 వేల‌మంది ఇంజినీరింగ్ కోర్సుల్లోనే చేరుతున్నారు. ఇక్కడ నాణ్యమైన విద్య అంద‌డంతోపాటు స్కాల‌ర్‌షిప్పులు కూడా ఎక్కువ‌గా ల‌బిస్తున్నాయి. కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ, ఇంపీరియ‌ల్ కాలేజ్‌, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, మాంచెస్టర్ యూనివ‌ర్సిటీ, ఈసీఎల్ జ‌గ‌ద్విఖ్యాత‌మ‌య్యాయి.


ఆస్ట్రేలియా
విదేశీ ఇంజినీరింగ్ విద్యలో ఆస్ట్రేలియా మూడోస్థానంలో నిలిచింది. క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచంలో ప్రముఖ‌ వంద యూనివ‌ర్సిటీల్లో 7 ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఇక్కడి మెల్‌బోర్న్‌, మోనాస్ యూనివ‌ర్సిటీలు ప‌రిశోధ‌నాత్మక విద్యకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఏటా 2 లక్షల 70 వేల‌మంది విదేశీ విద్యార్థులు చ‌దువుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్తున్నారు. వీరిలో 26 వేల‌మంది ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. ఇంజినీరింగ్‌లో కెమిక‌ల్‌, సివిల్, ఏరోస్పేస్ బ్రాంచ్‌లు ఈ దేశంలో టాప్ స్పెష‌లైజేష‌న్లగా గుర్తింపు పొందాయి. భార‌త్ నుంచి ఏటా 26 వేల‌మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసించ‌డానికి ఆస్ట్రేలియా వెళ్తున్నారు. మెల్‌బోర్న్‌, న్యూ సౌత్‌వేల్స్‌, సిడ్నీ, మోనాన్‌, క్వీన్స్‌ల్యాండ్ యూనివ‌ర్సిటీలు ఆస్ట్రేలియాలో ఇంజినీరింగ్ విద్యకు పేరొందాయి.

జ‌ర్మనీ
త‌క్కువ ఖ‌ర్చుతో ఇంజినీరింగ్‌లో విదేశీ ప‌ట్టా పొందాల‌నుకునేవాళ్లకు జ‌ర్మనీ మంచి అవ‌కాశం. ఏటా 3 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఈ దేశానికి వెళ్తున్నారు. వీరిలో 71 వేల‌మంది ఇంజినీరింగ్ కోర్సుల్లోనే చేరుతున్నారు. ఈ దేశంలోని ప‌బ్లిక్ ఫండెడ్ యూనివ‌ర్సిటీలు అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుల‌కు ట్యూష‌న్ ఫీజులు తీసుకోక‌పోవ‌డం విశేషం. గ్రాడ్యుయేట్ కోర్సుల‌కు మాత్రం త‌క్కువ మొత్తంలోనే ఫీజులు ఉంటాయి. స్కాల‌ర్‌షిప్పులు కూడా ఎక్కువ‌గా ల‌భిస్తున్నాయి. చ‌దువులు పూర్తయిన‌వెంట‌నే ఉద్యోగావ‌కాశాల‌ను సైతం జ‌ర్మనీ క‌ల్పిస్తోంది. కోర్సు పూర్తయిన త‌ర్వాత 18 నెల‌ల పాటు ఆ దేశంలో అధికారికంగా ఉండొచ్చు. ఆటోమేటివ్ ఇంజినీరింగ్‌లో చేరాల‌నుకునే విద్యార్థులు జ‌ర్మనీకి తొలి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఈ రంగం ఇక్కడ ఎంత‌గానో వృద్ధి చెంద‌డ‌మే దీనికి కార‌ణం. ముంచెన్‌, బెర్లిన్‌, ఆర్‌డ‌బ్ల్యూటీహెచ్ ఆచ‌న్‌, కిర్లోస్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, స్టట్‌గ్రాట్‌లు ఈ దేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాల‌యాలు.

చైనా
జ‌ర్మనీ త‌ర్వాత స్థానంలో చైనా నిలుస్తుంది. ఇప్పుడు చైనాలో ఆంగ్ల మాధ్యమంలో బోధ‌న కొన‌సాగ‌డంతో విదేశీ విద్యార్థుల తాకిడి పెరుగుతోంది. ప్రతి సంవ‌త్సరం 3 ల‌క్షల 77 వేల‌మంది విదేశీయులు చైనా యూనివ‌ర్సిటీల్లో చేరుతున్నారు. వీరిలో 34 వేల‌మంది ఇంజినీరింగ్ కోర్సుల‌కు ప్రాధాన్యమిస్తున్నారు. క్యూఎస్ వ‌ర‌ల్డ్ టాప్ యూనివ‌ర్సిటీ ర్యాంకింగ్‌లో ప‌లు చైనా విశ్వవిద్యాల‌యాల‌కు చోటు ద‌క్కింది. అయితే ఇంజినీరింగ్ నిమిత్తం భార‌త్ నుంచి ఈ దేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య మాత్రం చాలా త‌క్కువే.

Posted on 03.08.2016


Ask the Expert
Click Here..