వైద్యపట్టా కోసం.. విదేశీ బాట!

ఇంటర్‌ బైపీసీ విద్యార్థుల్లో చాలామందికి వైద్యవిద్య చదవాలనేది ఒక స్వప్నం. కానీ విపరీతమైన పోటీ, పరిమితంగా ఉన్న మెడికల్‌ సీట్లు వారి ఆకాంక్షల మీద నీళ్లు జల్లుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో విదేశీ వైద్యవిద్య ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా స్థిరపడింది!
విదేశీ వైద్యవిద్యలో చేరటానికి ప్రవేశపరీక్షలు రాయనక్కర్లేదు; డొనేషన్లు కట్టాల్సిన అవసరం లేదు. ఫీజు, ఇతర ఖర్చులతో రూ. 20- 30 లక్షల్లోపు వెచ్చించి విద్యాభ్యాసం పూర్తిచేసుకుని ఎంబీబీఎస్‌ పట్టా పొందవచ్చు. తిరిగి వచ్చి స్వదేశంలో వైద్యసేవలను అందించవచ్చు!
ఈ వెసులుబాటు కారణంగా ఇంతవరకూ మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే దీనిపై ఆసక్తి చూపేవారు. ఈ ఏడాది నుంచి మేనేజ్‌మెంట్‌ సీట్లు నీట్‌ ద్వారా మాత్రమే భర్తీ అయ్యే అవకాశం ఉండడంతో ఆర్థికంగా మెరుగ్గా ఉన్నవారు సైతం విదేశీ వైద్యవిద్యపై దృష్టిపెడుతున్నారు.
ఎంబీబీఎస్‌ చదవాలనుకునే భారతీయ విద్యార్థులను అనేక దేశాల కళాశాలలు సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల్లో జార్జియా, ఫిలిప్పీన్స్‌, చైనా, కిర్గిస్థాన్‌, ఉక్రెయిన్‌, రష్యా, సెంట్రల్‌ అమెరికా ఖండాల్లోని కొన్ని దేశాలు, కరీబియన్‌ దీవులు ప్రధానమైనవి.
విద్యార్థులు తాము ఎంచుకునే దేశాల, విద్యాసంస్థల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అక్కడి సామాజిక, రాజకీయ పరిస్థితుల పట్ల అవగాహన అవసరం. వాతావరణ పరిస్థితులూ తెలుసుకోవాలి. కళాశాలల అధికారిక వెబ్‌సైట్లను శోధించి, ఇప్పటికే అక్కడ చదువుతున్న విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకోవాలి.
ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ వైద్య నిఘంటువులో ఉన్న కళాశాలను ఎంపిక చేసుకోవాలి. అయితే, కొన్ని దేశాల్లో ఆ నిఘంటువులో ఉన్న అన్ని కళాశాలలూ గుర్తింపు ఉన్నట్టుగా భావించకూడదు. అది నిర్ధారించుకోవడానికి ఎంసీఐ తన వెబ్‌సైట్‌లో ఆ దేశం గురించి కానీ, ఆ కళాశాల గురించి కానీ ఏదైనా సమాచారం ఉంచిందేమో తెలుసుకోవాలి.
ముఖ్యంగా చైనాలో ఏయే కళాశాలలను అనుమతిస్తున్నదీ భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎంపిక చేసుకున్న దేశంలో మన దేశ ప్రభుత్వ ఎంబసీ కార్యాలయం ఉంటే, ఆ వెబ్‌సైట్‌లో దీని గురించిన సమాచారం ఏమైనా ఉందేమో చూసుకోవాలి. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల కారణంగా సదరు కళాశాల పట్ల వ్యతిరేక సమాచారం ఉంటే తెలుసుకుని నిర్ణయించుకోవాలి. విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించడం కోసం చాలా సంవత్సరాల నుంచి మన విద్యార్థులు వెళ్తున్నారు. అక్కడ వైద్యవిద్య పూర్తిచేసుకుని వచ్చిన వైద్యులను కానీ, చదువుతున్న విద్యార్థులను కానీ వ్యక్తిగతంగా సంప్రదించి నిర్ణయం తీసుకోవటం సముచితం. అప్పుడు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా కళాశాల ఎంపికలో గుర్తింపు, ప్రమాణాలే ప్రాతిపదిక కావాలి. స్థానిక భాషలో బోధన నామమాత్రంగా ఉందా లేదా ఆంగ్లభాషా బోధనే నామమాత్రంగా ఉందా అన్న సందేహాలను వారినడిగి తెలుసుకోవాలి.

ఎంసీఐ సరికొత్త నిబంధన
విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఎంసీఐ ఇటీవల ‘అర్హత పత్రం’ (ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌) ప్రవేశపెట్టింది. అంటే వారు ఎంపిక చేసుకున్న కళాశాలకు గుర్తింపును నిర్థారిస్తూ ఎంసీఐ అనుమతినిస్తుంది. ఆ అనుమతే అర్హత పత్రం. ఆవిధంగా ఎంపిక చేసుకున్న దేశాన్నీ, దానిలోని కళాశాల/ విశ్వవిద్యాలయం గుర్తింపునూ విద్యార్థికి వదిలేయకుండా ఎంసీఐ తన బాధ్యతగా తీసుకుందన్నమాట!
విద్యార్థి చేయాల్సిందల్లా తను వెళుతున్న కళాశాల/ విశ్వవిద్యాలయానికి సంబంధించి కొన్ని పత్రాలను (అడ్మిషన్‌ లెటర్‌తోపాటు ఇతర గుర్తింపు పత్రాలు) జతచేసి, ఎంసీఐ అనుమతి కోరుతూ దరఖాస్తును సమర్పించటమే. ప్రాథమిక సమాచారం సరిగా ఉంటే దరఖాస్తు తీసుకుని రశీదును ఇస్తారు.
2012 వరకు ఉన్న ఈ నిబంధనను 7.10.2013న విడుదల చేసిన నోటీసులో నిలిపివేసి ఈ ఏడాది నుంచి తిరిగి ప్రవేశపెట్టారు. దరఖాస్తును www.mciindia.org వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని తగిన ఫీజు చెల్లించి ఎంసీఐ కార్యాలయంలో అందజేయాలి.

వయసు, మార్కుల శాతం
విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించగోరే విద్యార్థి ఎంసీఐ పేర్కొన్న వయసు, మార్కుల నిబంధనలను తప్పక పాటించాలి. 1) ఈ ఏడాది విదేశీ వైద్యవిద్యలో చేరాలనుకునే విద్యార్థికి ఈ డిసెంబర్‌ 31 నాటికి 17 సంవత్సరాలు పూర్తికావాలి. 2) జీవశాస్త్రంలో ఇంటర్మీడియట్‌/ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైనవారు మాత్రమే అర్హులు. అందులో 50%కు తక్కువ కాకుండా మార్కులను సాధించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ/ వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు 40% తెచ్చుకుంటే సరిపోతుంది. జీవశాస్త్ర, రసాయన, భౌతికశాస్త్రాల్లో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణిస్తారు. ఆంగ్ల బోధనాంశం తప్పనిసరి.
విదేశాల్లో పీజీ వైద్యవిద్య పట్ల ఎంసీఐ కచ్చితమైన నిబంధనలను సూచించింది. అమెరికా, బ్రిటన్‌, కెనడా, న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా.. ఈ 5 దేశాలకు మాత్రమే వైద్యవిద్యను అభ్యసించడానికి అనుమతినిచ్చింది. ఈ దేశాలకు కాకుండా ఇతర దేశాలకు వైద్యవిద్యలో పీజీ కోసం వెళుతున్నవారు మనదేశంలో వైద్యవృత్తిని కొనసాగించడానికి అనర్హులు. అంతేకాకుండా ఈ దేశాల్లో పీజీ కోర్సుల కోసం చేరడం అంత తేలిక కాదు. అమెరికా వంటి దేశాల్లో పీజీ కోర్సు కోసం యూఎస్‌ఎంఎల్‌ఈ వంటి ప్రవేశపరీక్షను దశలవారీగా అధిగమించాల్సి ఉంటుంది.
విశ్వవిద్యాలయంలో ఆయా కోర్సులకు ఫీజు ఎంతన్నది ముందుగా తెలుసుకోవాలి. సదరు విశ్వవిద్యాలయం వారి వెబ్‌సైట్‌లో అందుకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తారు. కొన్ని దేశాల్లో మన ఎంబసీ వారు కూడా ఫీజుల సమాచారాన్ని విశ్వవిద్యాలయం నుంచి తీసుకుని వారి వెబ్‌సైట్‌లో ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నారు. వాటిని పరిశీలించాలి.
విద్యార్థి విదేశాలకు వెళుతున్నపుడు తన పాస్‌పోర్టు మీద ఏ రకమైన వీసా ఉందన్నది ముందుగా తెలుసుకోవాలి. చదువుకోవడానికి వెళుతున్నందువల్ల విద్యార్థి వీసా అని ఉండాలి.

ఇలా సన్నద్ధం కావాలి
* అడ్మిషన్‌ పొందాలి: ఈ ఏడాది ఎంసెట్‌, నీట్‌ ఫలితాలు ఆలస్యం కావడంతో చివరి నిమిషంలో ‘సీటు వచ్చే ర్యాంకు’ రాకపోయే పరిస్థితి కొందరికి ఉండవచ్చు. ఇలాంటివారిలో ఆసక్తి ఉన్నవారు విదేశాల్లో సీటును ముందుగానే ఖాయం చేసుకుంటే మంచిది. కళాశాల నుంచి నేరుగా కానీ, అధీకృత సంస్థల (ఏజెంట్లు) నుంచి కానీ ప్రవేశపత్రాన్ని పొందాలి.
* పాస్‌పోర్టు: విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు ఉండాల్సిందే! పాస్‌పోర్టుకు కావాల్సిన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలి. స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి మార్కుల జాబితాతో కూడిన పాస్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు వంటి నివాస ధ్రువపత్రం, జనన ధ్రువపత్రం (ఫారం 5)తో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఆన్‌లైన్‌లోనే చేసుకుని, సూచించిన తేదీ, సమయానికి ఒరిజనల్‌ ధ్రువపత్రాలతో వ్యక్తిగతంగా హాజరు కావాలి.
* న్ని విధాలా: కళాశాలను ఎంపిక చేసుకుని, ప్రవేశం పొంది, పాస్‌పోర్టు మీద స్టూడెంట్‌ వీసా స్టాంపింగ్‌ను కూడా పూర్తిచేసుకుని ప్రయాణానికి సిద్ధం కావాలి.
కళాశాలలో ఫీజును డాలర్ల రూపంలో చెల్లించాలి. లేదా కళాశాల పేరుతో డీడీ రూపంలోనైనా చెల్లించవచ్చు. జార్జియా వంటి కొన్ని దేశాల విషయంలో ట్యూషన్‌ ఫీజును నేరుగా విద్యార్థి బ్యాంకు నుంచి విశ్వవిద్యాలయ అకౌంటుకు పంపాల్సి ఉంటుంది. ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొన్ని దేశాల్లో తప్పనిసరి కాకపోయినా తీసుకోవడం మంచిది. చివరగా అక్కడ వాతావరణానికి వీలుగా వైద్యులను సంప్రదించి ముందు జాగ్రత్తలు తీసుకోవడం మేలు.
* పూర్వవిద్యార్థుల పరిచయం: ఎంపిక చేసుకున్న కళాశాలలో ఇప్పటికే చదువుతున్న మెడికోలను కానీ, కోర్సు పూర్తిచేసుకున్న డాక్టర్లను కానీ సంప్రదిస్తే తగిన వివరాలు లభిస్తాయి. అక్కడి చదువు, ఆంగ్లమాధ్యమం, వాతావరణ పరిస్థితుల పట్ల విశ్వసనీయమైన అవగాహనకు ఇది తోడ్పడుతుంది.
ఉపయోగపడే వెబ్‌సైట్లు
* www.mciindia.org/Media Room/ListofChinaColleges.aspx
* http://avicenna.ku.dk/database/medicine
* www.wdmos.org


అపోహలు- నిజాలు
* విదేశాల్లో వైద్య విశ్వవిద్యాలయాల గుర్తింపును ఎలా నిర్ధారించుకోవాలి?
ఎంసీఐ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన నిబంధనలను పరిశీలించాలి. చైనా మినహా ఇతర దేశాల్లోని కళాశాలల గుర్తింపునకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వైద్య నిఘంటువులో పొందుపరిచిన కళాశాల జాబితాను పరిగణనలోకి తీసుకోమంటుంది. మనదేశ ఎంబసీ కూడా అందుకు ఉపయోగపడుతుంది.
* ఎంసీఐ అనుమతి అవసరమా?
ఇతర దేశాల్లో వైద్యవిద్యాభ్యాసానికి వెళ్లేముందు ఎంసీఐ అనుమతి తప్పనిసరి. చేరాలనుకుంటున్న కళాశాల గుర్తింపు పత్రంతోపాటు కళాశాలలో అడ్మిషన్‌ ధ్రువీకరణ పత్రాన్ని జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. అన్నీ సరిగా ఉంటే ఎంసీఐ విద్యార్థికి అర్హత పత్రాన్ని జారీచేస్తుంది.
* విదేశాల్లో మెడికల్‌ కళాశాలలో, మనదేశంలో చదివే ఎంబీబీఎస్‌ల మధ్య తేడా వుందా?
ఇక్కడ మెడిసిన్‌ చేసిన విద్యార్థి హౌస్‌సర్జన్సీ పూర్తిచేయాలి. కానీ, విదేశాల్లో మెడిసిన్‌ పూర్తిచేసిన విద్యార్థి మనదేశంలో హౌస్‌సర్జన్సీ చేయాలంటే ఎంసీఐ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ ఎగ్జామ్‌)లో ఉత్తీర్ణులైన తరువాత మాత్రమే చేయాల్సివుంది. ఇదొక్కటే తేడా!
* ‘ఇన్ని సంవత్సరాలు కోర్సుకే గుర్తింపు’ అన్న నియమం ఉందా?
కళాశాల గుర్తింపునకు కోర్సు కాలంతో పనిలేదు. మన దేశంలో నాలుగున్నర ఏళ్లు, మరికొన్ని దేశాల్లో 5 ఏళ్లు, 6 ఏళ్ల కోర్సుతో కళశాలలు నడుస్తున్నాయి. ఈ కళాశాలలన్నింటికీ గుర్తింపు ఉన్నట్టే.

Posted on 08.08.2016


Ask the Expert
Click Here..