ఉన్నత విద్యకు కొత్త గమ్యస్థానాలు

శేఖర్ రెండేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఆశించినట్లుగా ఇక్కడ సాఫ్ట్‌వేర్ అవకాశం లభించలేదు. అమెరికా వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలూ బెడిసికొట్టాయి. ''సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసమే ఎందుకు ప్రయత్నించాలి? అమెరికా కాదంటే ఇంకా వేరే దేశాలేమీ లేవా?'' అన్న ఓ సీనియర్ సలహా నచ్చింది. మలేషియాలోని ఓ విశ్వవిద్యాలయంలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రెండేళ్ల కోర్సుకు రూ.4 లక్షల రుణాన్ని బ్యాంకు మంజూరు చేసింది. ఆరు నెలల కిందటే మలేషియా విమానమెక్కాడు. కోర్సులో చేరిన రెండో నెల నుంచి అక్కడి హోటల్‌లో క్షేత్రస్థాయి అనుభవాన్ని కల్పించారు. చదువు, అనుభవం, ఆర్జన.. అన్నీ ఏక కాలంలోనే! ''కోర్సు పూర్తయ్యాక ఇక్కడే సెటిలైన మా సీనియర్లను చూస్తుంటే.. నాకూ మంచి ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకముంది''అని అంటున్నాడు శేఖర్.

ఇక్కడ ఇంజినీరింగ్.. అమెరికాలో ఎంఎస్: ..గత కొన్నేళ్లుగా మనం చూస్తున్నదిదే! మన విద్యార్థులు వెళ్తున్నదీ ఇక్కడికే! అయితే అమెరికా.. కాకపోతే ఆస్ట్రేలియానో, బ్రిటనో.. అంతేనా! విదేశీ విద్య అనగానే ఈ మూడు దేశాలేనా? ఇప్పుడిప్పుడే ఈ ధోరణి మారుతోంది. ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటే చాలు.. అది యూఎస్సా, యూకేనా.. హాలెండా.. పోలెండా.. అన్నది పట్టించుకోవడం లేదు. మలేషియా, సింగపూర్, ఇటలీ, జర్మనీ, న్యూజిలాండ్, కెనడా.. ఇలా ప్రపంచంలోని ఏ దేశంలోనైనా చదువుకోవడానికి ఈతరం విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు.
అవకాశాలు ముంగిట్లోకే: ''మా దగ్గర మీకు ఉపయుక్తమైన కోర్సులున్నాయి. రండి.. చేరండి.. ఉపాధి అవకాశాలు పెంపొందించుకోండి'' అని విదేశీ విద్యా సంస్థలే మన ముంగిట్లో నిలబడి ప్రచారం చేసుకుంటున్నాయి. ''హైదరాబాద్‌లో ఏడాదికోసారి మేం అంతర్జాతీయ విద్యా సదస్సును నిర్వహిస్తున్నాం. అనేక దేశాల ప్రతినిధులతో విద్యార్థులు ముఖాముఖి మాట్లాడతారు. తమ ఆసక్తి, అభిరుచికి తగ్గ విద్యావకాశాలను ఎంచుకోవచ్చు. అంతర్జాతీయ గుర్తింపు (గ్లోబల్ అక్రిడియేషన్) పొందిన విద్యా సంస్థల్లో చదివితే.. నాణ్యత విషయంలో నమ్మకం పెట్టుకోవచ్చు. త్వరగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి'' అని చెబుతున్నారు ది ఇండస్ ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్ కల్లామ్.
చదువు+అనుభవం+ఆర్జన: మన దగ్గరైతే చదువుతూ ఆ కోర్సుకు సంబంధించిన క్షేత్ర స్థాయి అనుభవాన్ని పొందడమన్నది చాలా తక్కువ. అదే సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో కోర్సు చదువుకుంటూ ఉండగానే.. ఆ కోర్సుకు సంబంధించిన క్షేత్రస్థాయి అనుభవాన్ని కల్పిస్తున్నారు. అలా పని చేస్తున్నందుకు కొంత భృతి చెల్లిస్తున్నారు. దీంతో సంబంధిత ఉద్యోగంలో చేరే అవకాశాలు ఎక్కువ. నేర్చుకునే క్రమంలో కొత్త కొత్త ఆలోచనలొస్తాయి. వాటిని అమలు పర్చడానికి అక్కడ అవకాశముంటుంది. ఎందుకంటే పరిశోధనల కోసం ఆయా దేశాలు భారీగా బడ్జెట్‌ను కేటాయిస్తుంటాయి. ''విదేశాల్లో విద్యా సంస్థలకు పారిశ్రామిక సంస్థలతో ఒప్పందం ఉంటుంది. దీంతో చదువుతూ అనుభవాన్ని పొందుతారు. ఉదాహరణకు మలేషియాను తీసుకుంటే.. అక్కడ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరితే.. మన దగ్గరితో పోల్చితే ఫీజు ఎక్కువగానే ఉంటుంది. అక్కడ కోర్సులో చేరిన మొదటి ఏడాదిలోనే స్టార్ హోటల్‌లో కోర్సుకు సంబంధించిన ఉద్యోగాన్ని కల్పిస్తారు. కోర్సు పూర్తయ్యేసరికి కట్టిన ఫీజు కంటే ఎక్కువ మొత్తం తిరిగి మనకు దక్కుతుంది. రెండేళ్లు అంతర్జాతీయ వేదికపై వృత్తి అనుభవం లభిస్తుంది. ఉద్యోగం వస్తుందా? రాదా? అన్న ఒత్తిడి, ఆందోళన విద్యార్థిపై ఉండదు'' అని చెబుతున్నారు జేఎన్‌టీయూ ప్రాంగణ నియామకాధికారి రామకృష్ణ ప్రసాద్.
ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడికే: గతంలో ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్ కోర్సుల కోసమే విదేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు ఎక్కువగా నైపుణ్య ప్రాధాన్యం ఉండే కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. హెయిర్ డ్రెస్సింగ్, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, యానిమేషన్ డిజైనింగ్.. మొదలైన కోర్సులకు గిరాకీ ఎక్కువగా ఉంది. బ్యాంక్‌లు కూడా విదేశీ విద్యకు రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. ''న్యూజిలాండ్‌లో అన్ని కోర్సులూ లభ్యమవుతాయి. ప్రశాంతమైన, ఉపయోగకరమైన దేశం. ఇక్కడి కోర్సు పూర్తయ్యాక.. సంబంధించిన ఉద్యోగంలో చేరితే.. శాశ్వత నివాసానికి అనుమతిస్తారు. అక్కడే ఉండిపోవచ్చు. కెనడా ఇప్పుడు చక్కని విద్యాభ్యాస అనుకూల దేశంగా ఎదుగుతోంది. అక్కడ రెండేళ్లు చదివితే చాలు మూడేళ్లకు వర్క్ పర్మిట్‌కి అనుమతిస్తున్నారు. పారిశ్రామిక అనుబంధ కోర్సులెక్కువ. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా కాకుండా.. గతంలో ఇతర దేశాలకు ఏటా 2-3వేల మంది విద్యార్థులే వెళ్లేవారు.. ఇప్పుడు 15-16వేల మంది దాకా వెళ్తున్నారు'' అని విశ్లేషిస్తున్నారు వాల్మీకి కన్సల్టెన్సీ సీఎండీ సూర్య గణేష్ వాల్మీకి.
ఏ దేశమేగితే ఆ భాష: విశ్వవిద్యాలయ ప్రతినిధులు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా.. చేసే కోర్సుకు, ఆ వర్సిటీకి గుర్తింపు, విలువ ఉందా? అన్నది చూసుకోవాలి. ఎంత ఖర్చు అవుతుందన్న అవగాహన ముందే ఏర్పర్చుకోవాలి. కోర్సు నిర్దేశిత కాలంలో పూర్తి చేయడం ముఖ్యం. కోర్సు అయిపోయాక ఆర్నెల్లు, ఏడాది కాలం పాటూ వీసా పొడిగించే అవకాశాలుంటాయి. అయితే అది కూడా అనుమతి పొంది ఉండాలి. ''విశ్వవిద్యాలయం, కళాశాల గురించి ఇంటర్నెట్ ద్వారా లేదా పూర్వ విద్యార్థుల ద్వారా తెలుసుకోవాలి. ఆంగ్ల భాష మాట్లాడే దేశమైతే ఫరవాలేదు గానీ.. జర్మనీ, పోలెండ్, చైనా, దుబాయి లాంటి దేశాల్లో స్థానిక భాష ఎక్కువగా మాట్లాడతారు. అక్కడ పని చేయాలంటే స్థానిక భాష తెలిసుంటే అదనపు ప్రయోజనంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకూ ఆ దేశ భాష నేర్చుకుని వెళితే మంచిది'' అని చెబుతున్నారు జర్మనీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తున్న రవికిరణ్.

Ask the Expert
Click Here..