దేశాల‌వారీ టాప్ కోర్సులివే...

నేటి యువ‌త‌రం విదేశీవిద్యకు ఎంతో ప్రాధాన్యమిస్తోంది. ఎక్కువ శాతం యువ‌త పీజీ స్థాయి కోర్సుల‌కు ప‌ర‌దేశీ బాట‌ ప‌డుతోంది. అయితే విదేశీ విద్యలో ఒక్కో దేశం ఒక్కో త‌ర‌హా కోర్సుల‌కు ఖ్యాతి గ‌డించింది. అందువ‌ల్ల ఏయే దేశాల్లో ఏ కోర్సులు బాగుంటాయో తెలుసుకుని అడుగులేయ‌డం ముఖ్యం. విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆయా దేశాల్లో కొన్ని కోర్సుల‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆ వివ‌రాలు చూద్దాం.

మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌...యూఎస్ఎ
బిజినెస్ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్ ఒక్కో కోర్సులోనూ ఏటా రెండేసి ల‌క్షల మంది చొప్పున విదేశీ విద్యార్థుల‌ను అమెరికా ఆక‌ర్షిస్తోంది. ఫీజులు అధిక మొత్తంలో ఉన్నప్పటికీ విద్యార్థులు అమెరికాలో చ‌ద‌వ‌డానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఉన్నత‌ విద్యా ప్రమాణాల‌తోపాటు ఢోకాలేని కెరీర్ సొంతం కావ‌డ‌మే దీనికి కార‌ణం. అమెరికాలో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులు చ‌దువుతున్న మొత్తం విద్యార్థుల్లో 20 శాతం మంది విదేశీయులే. అంటే ప్రతి అయిదుగురిలో ఒక‌రు అమెరికా కాకుండా ఏదో ఒక దేశానికి చెందిన వ్యక్తి కావ‌డం గ‌మ‌నార్హం. ఎఫ్‌టీ స‌ర్వేలో ప్రపంచంలో టాప్ టెన్ బిజినెస్ స్కూళ్లలో ఏడు అమెరికా విశ్వవిద్యాల‌యాలే ఉన్నాయి. అధిక సంఖ్యలో ఉన్నత విద్యాసంస్థలెన్నో ఉండ‌డం, అతిపెద్ద ఆర్థిక వ్యవ‌స్థ దీనికి తోడ‌వ్వడంతో మేనేజ్‌మెంట్ విద్యలో సాటిలేని దేశంగా యూఎస్ ఆవిర్భవించింది. అలాగే ఇంజినీరింగ్‌లోనూ యూఎస్ త‌న స‌త్తా చాటుతోంది. దీంతో మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ విద్యార్థుల తొలిచూపుల‌న్నీ అమెరికాపైనే ఉంటున్నాయి. సోష‌ల్ సైన్సెస్ కోర్సులు చ‌ద‌వాల‌నుకునే విద్యార్థులు సైతం యూఎస్‌కే తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కోర్సుల్లో ప‌రిశోధ‌న‌కు అవ‌కాశాలు ఇక్కడ ల‌భించ‌డం, సులువుగా ఉద్యోగాలు దొర‌క‌డం దీనికి కార‌ణాలు. ఎక‌నామిక్స్ కోర్సునే తీసుకుంటే హార్వార్డ్‌, మ‌సాచ్యుసెట్స్, ప్రిన్స్‌ట‌న్‌, స్టాన్‌ఫోర్డ్‌, చికాగో యూనివ‌ర్సిటీలు విలువైన బోధ‌న‌ను అందిస్తున్నాయి. మ్యాథ్స్ అండ్ కంప్యూట‌ర్ సైన్సెస్‌, ఫిజిక‌ల్ అండ్ లైఫ్ సైన్సెస్‌ కోర్సుల్లో సైతం యూఎస్ అగ్రగామిగా వెలుగొందుతోంది.

సివిల్‌, ఆర్కిటెక్చర్‌... దుబాయ్
దుబాయ్ పేరెత్తగానే గుర్తొచ్చేది ఆకాశ‌హ‌ర్మ్యాలు, ఆక‌ర్షణీయ డిజైన్‌లే. ఆర్కిటెక్చర్‌, సివిల్ ఇంజినీరింగ్ చ‌ద‌వాల‌నుకునే విద్యార్థులు తొలి ప్రాధాన్యం దుబాయ్‌కి ఇవ్వడం స‌ముచితం. ఇక్కడి బుర్జ్ ఖ‌లీఫా, మ‌రీనా 101, ది పామ్..లాంటి నిర్మాణాలు ప్రపంచంలోనే విశిష్టమైన‌విగా పేరొందాయి. విశ్వవిఖ్యాత‌ నిర్మాణ సంస్థల కార్యాల‌యాల‌న్నీ దుబాయ్‌లో నెల‌కొన్నాయి. ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్‌లో దుబాయ్‌ని మించిన దేశం మ‌రొక‌టి లేదు. అలాగే ఇక్కడి ఆర్కిటెక్చర్లు క‌ళ్లుచెదిరే వేత‌నాలు సొంతం చేసుకోవ‌చ్చు. కెరీర్ ప్రారంభంలోనే స‌గ‌టున ఏటా ల‌క్షా 17 వేల ఏఈడీలు పొంద‌వ‌చ్చు. మ‌న క‌రెన్సీలో చెప్పుకుంటే ఇది రూ. 21 లక్షల కంటే ఎక్కువే. అయిదారేళ్ల ప‌ని అనుభవం ఉన్న సీనియ‌ర్ ఆర్కిటెక్చర్లు ఏటా స‌గ‌టున 4 ల‌క్షల యాభై వేల ఏఈడీలు(రూ.82 ల‌క్షలు) పొందుతున్నారు. కోర్సు ప్రాధాన్యం దృష్ట్యా మ‌న దేశానికే చెందిన మ‌ణిపాల్ యూనివ‌ర్సిటీ దుబాయ్ క్యాంప‌స్‌లో ఆర్కిటెక్చర్‌లో బీటెక్ డిగ్రీని అందిస్తోంది. కోర్సు ఫీజు ఏడాదికి దాదాపు రూ.8 లక్షలు. ఈ కోర్సు కెన‌డియ‌న్ యూనివ‌ర్సిటీ, అమెరిక‌న్ యూనివ‌ర్సిటీలు దుబాయ్‌లో అందిస్తున్నాయి.

దుబాయ్‌లో మ‌రో ప్రాధాన్యమున్న కోర్సు సివిల్ ఇంజినీరింగ్‌. ప్రతి క‌ట్టడానికీ ఆర్కిటెక్చర్లతోపాటు సివిల్ ఇంజినీర్ల సేవ‌లు కీల‌కం. అందువ‌ల్లే సివిల్‌కు దుబాయ్‌లో డిమాండ్ ఉంది. ఇక్కడి సివిల్ ఇంజినీర్లు కెరీర్ ఆరంభంలో ఏడాదికి రూ.18 లక్షలు ఆర్జిస్తున్నారు. ప్రపంచంలో సివిల్ ఇంజినీరింగ్ విద్యలో దుబాయ్ త‌ర్వాతే ఏ దేశ‌మైనా అనే స్థాయికి చేరుకుంది. భార‌త్‌కు చెందిన అమిటీ, మ‌ణిపాల్ యూనివ‌ర్సిటీలు ఇక్కడ సివిల్ ఇంజినీరింగ్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఈ రెండూ దుబాయ్‌లో టాప్ క‌ళాశాల‌ల‌గా పేరొందాయి. వీటితోపాటు అమెరిక‌న్ యూనివ‌ర్సిటీ, హెరోట్ వాట్ యూనివ‌ర్సిటీ సివిల్‌కు ప్రాధాన్యమున్న విద్యా సంస్థలు. ఏడాదికి రూ.8 లక్షలు ఆపైన కోర్సు ఫీజు వ‌సూలు చేస్తున్నాయి.

మాస్ క‌మ్యూనికేష‌న్‌...యూఎస్‌
ఇంట‌ర్నెట్‌, డిజిట‌ల్ ప్రభావంతో మాస్ క‌మ్యూనికేష‌న్ కొత్త రూపాంత‌రాన్ని సృష్టించుకుంటోంది. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లో త‌గ్గిన ప్రాభ‌వాన్ని డిజిట‌ల్ మీడియా అందుకొంటోంది. దీంతో మాస్ క‌మ్యూనికేష‌న్‌కు డిమాండ్ పెరుగుతోంది. జ‌ర్నలిజంలోనూ అగ్రరాజ్యం అమెరికాదే పైచేయి. ప్రపంచంలో మాస్ క‌మ్యూనికేష‌న్ కోర్సుల‌కు న్యూయార్క్‌లోని కొలంబియా యూనివ‌ర్సిటీ ప్రసిద్ధి చెందింది. దీనిత‌ర్వాత కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ-బెర్క్‌లీ, టెక్సాస్ యూనివ‌ర్సిటీ, స్టాన్‌ఫోర్డ్ పేరున్న సంస్థలు. అధిక సంఖ్యలో పులిట్జర్ అవార్డులు అందుకున్నది కూడా అమెరికావాళ్లే కావ‌డం విశేషం. యూఎస్ త‌ర్వాత యూకే, ఆస్ట్రేలియా, కెన‌డాలు మాస్ క‌మ్యూనికేష‌న్ కోర్సుల‌కు ప్రసిద్ధి చెందాయి.

ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్...అమెరికా, యూకే
ఆంగ్లం, సాహిత్యం, చ‌రిత్ర, త‌త్త్వశాస్త్రం...త‌దిత‌ర కోర్సుల‌కు అమెరికా, యూకేలు ప్రసిద్ధి గాంచాయి. క్యూఎస్ వ‌ర‌ల్డ్ టాప్ యూనివ‌ర్సిటీల జాబితాలో స్థానం పొందిన విశ్వవిద్యాల‌యాల్లో అధిక శాతం ఈ రెండు దేశాల‌కు చెందిన‌వే. విశిష్ఠ వంద విశ్వవిద్యాల‌యాల జాబితాలో అమెరికా నుంచే 40 సంస్థలు చోటు పొందాయి. ఈ జాబితాలో ఆక్స్‌ఫ‌ర్డ్ మొద‌టి స్థానంలోనూ, హార్వార్డ్ రెండు, కేంబ్రిడ్జ్ మూడో స్థానంలో నిలిచాయి. యూకే నుంచి టాప్ వంద‌లో 18 సంస్థల‌కు చోటు ద‌క్కింది. మొత్తానికి ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సుల‌కు యూఎస్, యూకేలు తిరుగులేని దేశాల‌గా నిలిచాయి. లైప్ సైన్సెస్‌లోనూ యూఎస్‌, యూకేలే అగ్రగాములుగా ఉన్నాయి.

మ‌రికొన్ని...
- లా, ఆర్ట్, డిజైన్ కోర్సులు యూకేలో చ‌దివితే తిరుగులేదు.
-ఫుడ్, హాస్పిటాలిటీ, ప‌ర్సన‌ల్ స‌ర్వీసెస్‌, కామ‌ర్స్‌, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్ కోర్సులు చ‌ద‌వ‌డానికి ఆస్ట్రేలియాకు ప్రాధాన్యమివ్వవ‌చ్చు.
-ఫ్యాష‌న్ డిజైనింగ్‌, యానిమేష‌న్‌, గేమింగ్‌, లిబ‌ర‌ల్ ఆర్ట్స్ కోర్సుల కోసం కెన‌డావైపు అడుగులేయ‌వ‌చ్చు. జ‌ర్నలిజం, హోట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సులు కూడా ఈ దేశంలో ప్రాధాన్యమున్నవే.
-ఆటోమొబైల్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సులు చ‌ద‌వాల‌నుకున్నవాళ్లు జ‌ర్మనీని ఎంచుకోవ‌చ్చు. అలాగే ఇక్కడ మ్యాథ్స్‌, నేచుర‌ల్ సైన్స్‌, లా, ఎక‌నామిక్స్ కోర్సులు సైతం ఆక‌ర్షణీయ‌మైన‌వే.
-మెడిసిన్‌, డెంటిస్ట్రీ కోర్సుల కోసం ర‌ష్యావైపు చూడ‌వ‌చ్చు. ఈ దేశంలో హ్యుమానిటీస్‌, బిజినెస్ ఎక‌నామిక్స్ కోర్సులు కూడా ఉన్నత‌మైన‌వే.
-పొలిటిక‌ల్ సైన్స్ కోర్సుల్లో ఫ్రాన్స్ అగ్రగామి.
-ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌, అగ్రిక‌ల్చర్‌, మెడిసిన్ అండ్ హెల్త్ కోర్సులకు నెద‌ర్లాండ్ ప్రసిద్ధి.
-అప్లయిడ్ సైన్సెస్‌, ట్రెడిషిన‌ల్ ఆర్ట్స్‌, మ్యూజిక్ కోర్సుల కోసం జ‌పాన్‌ను ఎంచుకోవ‌చ్చు.
-ఆర్ట్స్ అండ్ డిజైన్‌, హాస్పిటాలిటీ, బిజినెస్ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్ సింగ‌పూర్‌లో చ‌దువుకోవ‌చ్చు. అలాగే మాస్ క‌మ్యూనికేష‌న్‌, లాజిస్టిక్స్‌, ఏవియేష‌న్‌లు సైతం ఈ దేశంలో ప్రసిద్ధి చెందిన కోర్సులే.
-హోట‌ల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ కోర్సుల‌కు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, యూకే, సింగ‌పూర్, మ‌లేసియా చెప్పుకోద‌గ్గవి.Posted on 20.08.2016


Ask the Expert
Click Here..