ఆస్ట్రేలియా వీసా సరళతరం

విదేశాల్లో విద్యాభ్యాసం చేయదల్చిన భారతీయ విద్యార్థులు యు.ఎస్‌. తర్వాత ఇటీవలికాలంలో మొగ్గు చూపుతున్న దేశం- ఆస్ట్రేలియా. అమెరికాలో మాదిరిగా వీసా ఇంటర్వ్యూ పేరిట విద్యార్థి నేరుగా హాజరు కానవసరం లేదిక్కడ (కొన్ని సందర్భాల్లో తప్ప). దీనికి తోడు తాజాగా వీసా మంజూరు ప్రక్రియలో ఆస్ట్రేలియా SSVF (సింప్లిఫైడ్‌ స్టూడెంట్‌ వీసా ఫ్రేమ్‌వర్క్‌) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి అమలుచేస్తోంది!

వీసా మంజూరులో జాప్యం నివారించి, దరఖాస్తుదారులైన విద్యార్థులకు సులువుగా ఉండేందుకు ఉద్దేశించినదే ఈ నూతన విధానం. దీని ప్రకారం-
* చదవదల్చిన కోర్సుతో నిమిత్తం లేకుండా విదేశీ విద్యార్థులు సింగిల్‌ స్టూడెంట్‌ వీసా (సబ్‌ క్లాస్‌ 500)కూ, స్టూడెంట్‌ గార్డియన్లు న్యూ స్టూడెంట్‌ గార్డియన్‌ వీసా (సబ్‌క్లాస్‌ 590)కూ దరఖాస్తు చేసుకోవాలి.
స్ట్రీమ్‌లైన్‌ వీసా ప్రాసెసింగ్‌ స్థానంలో అమల్లోకి వచ్చిన ఈ ఎస్‌ఎస్‌వీఎఫ్‌ సబ్‌క్లాసులను 8 నుంచి 2కు తగ్గించి వీసా ప్రక్రియను సరళతరం చేసింది.
* విద్యార్థులూ, గార్డియన్లూ ImmiAccountలో అకౌంట్‌ను ఏర్పాటుచేసుకుని ఆన్‌లైన్లో వీసా దరఖాస్తును పంపుకోవాల్సివుంటుంది.
పేపర్‌ ఆధారిత దరఖాస్తు అమల్లో ఉన్నపుడు అన్ని డాక్యుమెంట్లనూ ఆస్ట్రేలియన్‌ హైకమిషన్‌/ వీఎఫ్‌ఎస్‌ కేంద్రంలో సమర్పించాల్సివచ్చేది. అదేమీ లేకుండా విద్యార్థులు దరఖాస్తులను ఆన్‌లైన్లో ఇప్పుడు సమర్పించవచ్చు. దీనివల్ల పేపర్‌ వర్క్‌ అవసరం తొలగిపోయింది. ప్రయాణభారం, జాప్యం తగ్గి వేగంగా, సులువుగా దరఖాస్తును సమర్పించటానికి వీలయింది.
ప్రతి విద్యార్థికి చెందిన ఇమిగ్రేషన్‌ రిస్క్‌ లెవెల్స్‌నూ వారు ఏ దేశం నుంచి దరఖాస్తు చేస్తున్నారో, ఏ విద్యాసంస్థలో చేరబోతున్నారో అనేదాన్ని బట్టి అంచనా వేస్తారు. భారతదేశం ఇమిగ్రేషన్‌ రిస్క్‌ లెవెల్‌ 3వ స్థానంలో ఉంది. కాబట్టి లెవెల్‌ 1లో ఉన్న విద్యాసంస్థను మన విద్యార్థులు ఎంపిక చేసుకుంటే తక్కువ డాక్యుమెంట్ల అవసరం ఉంటుంది. లెవెల్‌ 2, 3 విద్యాసంస్థల్లో కంటే వేగంగా వీసా మంజూరవుతుంది.

ఆర్థిక పరంగా...
వీసా దరఖాస్తుదారులు ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం చేసే కాలానికి సరిపడా తగిన ఆర్థిక స్థితిని కలిగివుండటం ముఖ్యం. జీవన వ్యయం ఒక్కో విద్యార్థికి ఏడాదికి 19,830 ఆస్ట్రేలియా డాలర్లు అవుతుంది. నివసించే ప్రాంతాన్ని బట్టి ఆ దేశంలో దైనందిన ఖర్చులు వాస్తవంగా ఎంతవుతాయో సమాచారం ముందుగానే తెలుసుకోవాలి. ఆ ఖర్చుల గురించి వీసా దరఖాస్తులో ప్రస్తావించాల్సివుంటుంది. విద్యార్థులు అక్కడ పనిచేసి సంపాదించగల ఆదాయం మీద ఆధారపడకూడదు.
ఆర్థిక సామర్థ్యాన్ని నిరూపించే డాక్యుమెంటరీ సాక్ష్యాలను విద్యార్థులు సమర్పించాల్సివుంటుంది.
కోర్సు బదిలీకి నిబంధన
ఈ ఏడాది జులై 1 నుంచి విద్యార్థులు కోర్సు మార్చుకోవటంపై ఒక నిబంధనను విధించారు. ఆస్ట్రేలియన్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ (AQF) లెవెల్‌ కోర్సు నుంచి నాన్‌ ఏక్యూఎఫ్‌ అవార్డ్‌ కోర్సుకు మారటం విద్యార్థి వీసా నిబంధనను ఉల్లంఘించడమే అవుతుంది. ఇది వీసా రద్దుకు కూడా దారితీయవచ్చు.
గతంలో కొందరు విద్యార్థులు వీసా విధానాన్ని దుర్వినియోగం చేసేవారు. ఒక కోర్సు చదవటానికి వెళ్ళి తక్కువ ఫీజు, ఇతర అవసరాల కోసం మరో కోర్సుకు మారేవారు. ఈ కొత్త నిబంధన ప్రకారం మాస్టర్స్‌ చదవటానికి వెళ్ళి, అదే వీసాతో డిప్లొమాకు మారటానికి అవకాశం లేదు. అలా చేయాలంటే తిరిగి వీసాకు దరఖాస్తు చేసుకుని, మంజూరైతేనే ఆస్ట్రేలియాలో కొనసాగటం సాధ్యమవుతుంది.
దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్లూ సక్రమంగా ఉంటే వీసా మంజూరు వ్యవధి ఎస్‌ఎస్‌వీఎఫ్‌ మూలంగా గణనీయంగా తగ్గుతోంది.Posted on 20.09.2016


Ask the Expert
Click Here..