శ్రేష్ఠమైన విద్యకు చిరునామా అయిన అమెరికా విద్యాసంస్థల్లో చదువుకోవాలని కలలు కనేవారు ఇప్పుడు తాజాపరిణామాల నేపథ్యంలో కలవరపడనక్కర్లేదు. కనీసం విద్యాభ్యాసం వరకూ ఎలాంటి సమస్యలూ లేవు. ప్రవేశాల సన్నాహాల దగ్గర నుంచి కోర్సు పూర్తయ్యేవరకూ తగిన శ్రద్ధ, పట్టుదల చూపించి నైపుణ్యాలు పెంచుకుంటే విద్యకూ, ఆపై ఉపాధికీ ఢోకా ఉండదు!
‘అమెరికాలో పీజీ చేయాలనేది నా ఆకాంక్ష. అయితే కొత్త పరిస్థితుల నేపథ్యంలో కెనడా, ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాల్లోని యూనివర్సిటీల గురించి కూడా ఆలోచించటం మంచిదని శ్రేయోభిలాషులు సలహాలు ఇస్తున్నారు’- ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న విజయ్‌ మాటలివి. ఉన్నతవిద్య కోసం విద్యార్థి వీసా (ఎఫ్‌ 1)పై అమెరికా వెళ్ళదలిచిన విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆలోచనలో పడుతున్నారు. సెనేటర్లు ప్రతిపాదించే బిల్లులు అక్కడ చదివే, చదవబోయే భారతీయ విద్యార్థుల ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపిస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే పరిస్థితులు ఎలాంటివి ఎదురైనా వాటికి దీటుగా తమను మల్చుకోవటం అవసరం. అందుకు కోర్సు, విద్యాసంస్థల ఎంపిక దగ్గర్నుంచీ అన్ని దశల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
మన విద్యార్థులు అమెరికాలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్‌ చేశాక 12 నెలల ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ (ఓపీటీ) కు అర్హులవుతారు. అక్కడ ఉద్యోగం పొందాక ఈ ఓపీటీని 24 నెలలు పొడిగిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు భారీ వేతనాల ఉద్యోగులుగా తమను నిరూపించుకోవటానికి మూడేళ్ళ కాలవ్యవధి ఉంటోంది.
అయితే ఈ ఓపీటీ పొడిగింపును రద్దు చేస్తారనేది ప్రధానంగా కలవరపెడుతున్న అంశం. ఇలాంటి పరిస్థితి వచ్చినా అవకాశాలు కోల్పోకూడదంటే... విద్యార్థులు విద్యాభ్యాస కాలంలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలపై కంటే తమ చదువుపై దృష్టిపెట్టటం తప్పనిసరి. ఎందుకంటే తిరుగులేని పరిజ్ఞానం, నైపుణ్యాలుంటే ప్రపంచంలో ఎక్కడైనా అవకాశాలు స్వాగతిస్తాయి. యు.ఎస్‌.లో మాస్టర్స్‌ డిగ్రీ పొందటం అనేది పెద్ద అనుకూలాంశం.
పైగా 12 నెలల ఓపీటీ అవకాశం ఉండనే ఉంది. యు.ఎస్‌. విశ్వవిద్యాలయాల్లో చదివినవారికి ప్రాధాన్యం లభిస్తుందనే సూచన ఉంది కాబట్టి సమస్య ఉండదు.
ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా విద్యను అభిలషించే విద్యార్థులు మూడు అంశాలపై దృష్టిపెడితే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమస్య ఉండదు. 1) మాస్టర్స్‌ చేయడానికి సంసిద్ధత 2) విశ్వవిద్యాలయాల ఎంపిక 3) దరఖాస్తు గడువు
మాస్టర్స్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానా?
తమకు ఆసక్తి ఉన్న అంశంలో తామెందుకు పీజీ చేయాలనుకుంటున్నారో విద్యార్థులకు స్పష్టత ఉండాలి. అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ అయిన మాస్టర్స్‌ చేయటం ఎంచుక్ను రంగంలో అంకితభావాన్ని తెలియజెపుతుంది. అది రెజ్యూమే స్థాయిని మెరుగుపరుచుకోవటమే. గుర్తింపు, నైపుణ్యస్థాయిలను పెంచుకోవటమే!
కింది ప్రశ్నలు వేసుకుని సమాధానాలు అన్వేషించాలి.
* అత్యంత నైపుణ్యాలను అందించే మాస్టర్స్‌ డిగ్రీని అమెరికాలో చదవటానికి అవసరమైన నిబద్ధతా స్థాయి నాలో ఉందా?
* అండర్‌ గ్రాడ్యుయేట్‌లో కంటే మించి ఎక్కువ అధ్యయనం చేయటానికీ, పార్టీల్లాంటి సరదాలు తగ్గించుకోవటానికీ సిద్ధంగా ఉన్నానా?
* అవసరమైతే మరో సుదీర్ఘమైన డిసర్షన్‌ లేదా పరిశోధనా ప్రాజెక్టు రూపొందించవలసివస్తే దానిపై నాకు ఉత్సుకత ఉంటుందా?
* ట్యూషన్‌ ఫీజు, దైనందిన ఖర్చులన్నీ భరించి యు.ఎస్‌.లో మాస్టర్స్‌ విద్యను చదవగలిగే స్థోమత నాకుందా?
* చదవబోయే సబ్జెక్టు, సాధించబోయే అర్హతపై నాకు వాస్తవికంగా కుతూహలం, ఆసక్తీ ఉన్నాయా?
* చదవబోయే కోర్సులు నాకు అన్నివిధాలా సరిపోతాయా?
* ఒక ఆదర్శవంతమైన కెరియర్‌కు అవసరమైన నిర్దిష్ట నైపుణ్యాలను నేను సాధించబోయే అర్హత సిద్ధం చేస్తుందా?
విశ్వవిద్యాలయాల ఎంపిక ఎలా?
అత్యుత్తమ 50- 100 కళాశాలల్లో ప్రవేశం పొందగలిగితే ప్రాంగణ నియామకాలు సాధించి సులువుగా స్థిరపడవచ్చునని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. వరల్డ్‌ ర్యాంకింగ్‌ విశ్వవిద్యాలయాలే కాకుండా యు.ఎస్‌.ఎ.లోనే పరిశోధన ఆధారిత, స్టేట్‌ ఫండెడ్‌ వర్సిటీలు ఎన్నో ఉన్నాయి. అలాంటిచోట మీ పరిజ్ఞానాన్ని వికసింపజేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలంటే మీ టెస్ట్‌ స్కోర్లు బాగా మెరుగ్గా ఉండాలి. జీఆర్‌ఈ/జీమ్యాట్‌/టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌ మొదలైన పరీక్షల్లో మంచి స్కోర్ల సాధనకు అధిక కృషి అవసరం. అందుకే ఏడాది ముందు నుంచే యూనివర్సిటీల అవసరాలకు తగినట్టుగా మీ ప్రొఫైల్‌ను రూపొందించుకోండి.
విశ్వవిద్యాలయాన్ని ఎంచుకునేముందు ఉపయోగపడే కొన్ని సూచనలు:
* అంతర్జాతీయ విద్యార్థులకు కో-ఆప్‌ ప్రోగ్రాములను కొన్ని యూనివర్సిటీలు అందిస్తున్నాయి. కరిక్యులమ్‌ అవసరాలకు అనుగుణంగా అక్కడ విద్యార్థులు ఏదో ఒక పరిశ్రమలో తప్పనిసరిగా పనిచేయాల్సివుంటుంది.
* ఫండింగ్‌ అవకాశాలున్న విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవటం మంచిది.
* ప్రొఫెసర్‌ ఆధ్వర్యంలో పనిచేసే గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్‌షిప్స్‌ అవకాశం ఇచ్చే యూనివర్సిటీని ఎంచుకోవచ్చు.
* ఏడాదికి ఒకసారో, రెండుసార్లో కెరియర్‌ ఫేర్‌లను తమ క్యాంపస్‌లో నిర్వహించే విశ్వవిద్యాలయాలు కొన్ని ఉన్నాయి.
* మీ అవసరాలకు సరిపోయే కరిక్యులమ్‌ ఉండే యూనివర్సిటీని ఎంచుకోవాలి.
* ఎంచుకోబోయే విశ్వవిద్యాలయం అక్రిడిటేషన్‌ (గుర్తింపు) ఉన్నదేనా? లేదా అనేది గమనించాలి.
* మీ ఆర్థిక స్థాయికి ఆ విశ్వవిద్యాలయం తగినదేనా అనేది పరిశీలించుకోవాలి.
ఎప్పుడు దరఖాస్తు చేయాలి?
యు.ఎస్‌.ఎ.లోని విశ్వవిద్యాలయాల్లో భారీగా ప్రవేశాలు జరిగేది ఫాల్‌ (తరగతులు ఆరంభమయ్యేది ఆగస్టు/సెప్టెంబరు), స్ప్రింగ్‌ (జనవరి) సీజన్లలో.
దరఖాస్తు చేసే కోర్సు/ప్రోగ్రాంని బట్టి ఆ దేశ విశ్వవిద్యాలయాలు నిర్దిష్ట అర్హతలను అడుగుతాయి. యూనివర్సిటీకీ యూనివర్సిటీకీ దరఖాస్తు చేయాల్సిన గడువులు మారుతుంటాయి. ప్రవేశాలకు తప్పనిసరి అయిన టెస్టులను ఏడాది ముందుగానే రాయటం ఎల్లప్పుడూ మంచిది. ఎందుకంటే ఈ పరీక్షల స్కోరు రెండేళ్ళ నుంచి ఐదేళ్ళ వ్యవధి వరకూ చెల్లుబాటవుతుంది. చదివే కోర్సుకు ఎలాంటి నష్టం కలగకుండానే ఈ టెస్టులకు హాజరై మంచి స్కోర్లు సాధించవచ్చు.
* వచ్చిన స్కోర్లను బట్టి మీ ప్రొఫైల్‌కు తగిన విశ్వవిద్యాలయాలేమిటో అన్వేషించటం మొదలుపెట్టాలి.
* అవసరమైన డాక్యుమెంట్లు, తుది గడువులను పరిశీలించుకోవాలి.
* గడువుకంటే ముందుగానే డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి.
* విద్యార్థుల దరఖాస్తులపై ఒక నిర్ణయం తీసుకోవటానికి ప్రవేశాల ప్రక్రియ సాధారణంగా రెండు వారాల నుంచి ఆరు నెలల వరకూ కొనసాగుతుంది.
* ఐ-20 ప్రక్రియకు మళ్ళీ 2 వారాల నుంచి నెల రోజులు పడుతుంది.
* వీసా ప్రక్రియ కనీసం 10 రోజుల వ్యవధి తీసుకుంటుంది.
విద్యాభ్యాసానికి ప్రణాళిక వేసుకోవడమనేది తొలి అడుగు. మీ ఉన్నత విద్యాభ్యాసంపై మీరెంత పట్టుదలగా ఉన్నారనేదానిపై ఈ ప్రణాళిక ప్రభావం చూపిస్తుంది.
ప్రవేశాలకు తప్పనిసరి అయిన టెస్టులను ఏడాది ముందుగానే రాయటం మంచిది. చదివే కోర్సుకు ఎలాంటి నష్టం కలగకుండానే ఈ టెస్టులకు హాజరై మంచి స్కోర్లు సాధించవచ్చు.
సారాంశం ఏమిటి?
యు.ఎస్‌.లో చదవాలనుకునే విద్యార్థులు పై అంశాలన్నిటినీ అనుసరిస్తే వారు ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. ప్రతిపాదిత బిల్లు పాసైనప్పటికీ అది విద్యార్థులకు మూడు కోణాల్లో ప్రయోజనకరంగా మారబోతోంది.
1. ఉద్యోగాలు చేయబోయే విద్యార్థుల వేతనాలు గతంలో ఇచ్చేవాటితో పోలిస్తే పెరుగుతాయి.
2. హెచ్‌ 1 బీ వీసాలకు దరఖాస్తు చేసే వృత్తినిపుణుల కంటే య.ఎస్‌.ఎ.లో చదివిన విద్యార్థులకే ప్రాధాన్యం లభించ బోతోంది.
3. నైపుణ్యం ఉన్నవారు అక్కడే ఉద్యోగాలు పొందేలా అవకాశాలు పెంచి, హెచ్‌ 1 బీ వీసాల కోటా పరిమితిని తొలగిస్తారు.Posted on 06.02.2017


Ask the Expert
Click Here..