అమెరికాపై పెరిగిన మోజు
* బ్రిటన్‌పై తగ్గుతున్న ఆసక్తి
* భారతీయ విద్యార్థుల గమనమిదీ..
* తాజా పరిణామాలతో సందిగ్ధం
* ఇతర దేశాల వైపూ చూపు

ఈనాడు, హైదరాబాద్‌: ఏటా అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండగా బ్రిటన్‌ వెళ్లే వారి సంఖ్య తగ్గుతోంది. అమెరికా వెళ్లే విద్యార్థి వీసాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం విశేషం. ఇప్పటివరకు ఇదే జోరు కొనసాగినా అమెరికాలో నెలకొన్న తాజా పరిణామాలతో భవిష్యత్తు ఏమిటనే సందిగ్ధత నెలకొంది. అమెరికా విధానాల్లో నెలకొంటున్న మార్పులు భారతీయ విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అమెరికాకు వెళ్లేవారు ఇక నాసిరకం విద్యాసంస్థలను కాకుండా, మెరుగైన కళాశాలలనే ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది గడిస్తేగానీ తాజా పరిణామాల ప్రభావం ఎంత వరకు ఉంటుందని కచ్చితమైన అంచనాకు రాలేమని చెబుతున్నారు. కొందరు విద్యార్థులు అమెరికా బదులు ఆస్ట్రేలియా వైపు చూస్తున్నారు.
ఆ ‘వెసులుబాటు’ ఎన్నాళ్లొ..: అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత కూడా మూడేళ్లపాటు ఓపీటీ కింద ఉద్యోగం చేసుకునే వెసులుబాటు భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇది ఎన్నాళ్లుంటుందోననే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్‌లో గతంలో ఉన్న పోస్టు స్టడీ వీసా సదుపాయం రద్దు కావడంతో ఆ దేశం వెళ్లే వారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. అమెరికాలో విదేశీ విద్యార్థుల్లో భారతీయులది రెండో స్థానం. ఆ దేశంలో 1,92,723 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు 2016 జులైలో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 25 శాతం ఉంటుందని అంచనా. విద్యార్థిగా వెళ్లి హెచ్‌1బీ ద్వారా ఉద్యోగిగా స్థిరపడిపోవచ్చు. బ్రిటన్‌కు 2010లో 39,090 మంది భారతీయ విద్యార్థులు వెళితే 2015-16కు ఆ సంఖ్య 16,745కు తగ్గిందని యూకే హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ స్టాటిస్టిక్స్‌ ఏజెన్సీ గణాంకాలు తెలుపుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌ తదితర దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యా భారీగా పెరుగుతోంది. బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఏడాదిన్నర క్రితం విడుదల చేసిన ‘ఇండియన్‌ స్టూడెంట్స్‌ మొబిలిటీ రిపోర్ట్‌’లో బ్రిటన్‌కు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని, అమెరికాయేతర దేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుందనీ వెల్లడించింది.
* న్యూజిల్యాండ్‌లోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులది రెండో స్థానం.
* కెనడా ప్రభుత్వం 2014లో 25 వేల మందికి స్టడీ పర్మిట్లు ఇచ్చింది. 2005తో పోల్చుకుంటే అది 6 రెట్లు ఎక్కువ.

 

Posted on 12.02.2017


Ask the Expert
Click Here..