ఏమో.. ఏమగునో కానీ
* హెచ్‌1బీ వీసాల వ్యవహారం
* మారిన పరిస్థితులపై కొత్త ఆశలు

ఈనాడు వాణిజ్య విభాగం: అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికవడంతోనే ఐటీ రంగం భవితపై ఆందోళనలు పెరిగాయి. అమెరికన్లకు లభించాల్సిన ఉద్యోగాలను విదేశీయులు హెచ్‌1బీ వీసాలతో తన్నుకుపోతున్నారనే రీతిలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. హెచ్‌1బీ సంస్కరణల బిల్లు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ప్రవాస భారతీయులనే కాదు, ఉన్నతోద్యోగం లభిస్తుందనే ఆకాంక్షలతో ఎంఎస్‌ చేయడానికి వెళ్లిన/వెళ్తున్న విద్యార్థులను, వారి కుటుంబాలను కూడా కలవర పెడుతోందన్నది వాస్తవం. హెచ్‌1బీ వీసాపై వచ్చే ఉద్యోగి కనీస వేతనాన్ని 1.30 లక్షల డాలర్లు చేయాలని, మాస్టర్స్‌ డిగ్రీ ఉంటేనే అనుమతించాలన్నది ఈ బిల్లులో ప్రధానాంశం.
ఎందుకింత ఆందోళన
150 బి.డాలర్ల (దాదాపు రూ.10 లక్షల కోట్ల) స్థాయికి చేరిన భారత ఐటీ రంగానికి అమెరికా, ఐరోపాల నుంచే అధిక ఆదాయం వస్తోందన్నది వాస్తవం. అయితే క్రమక్రమంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మొత్తమూ పెరుగుతోంది. ఆరేడేళ్ల క్రితం దేశీయ ఐటీ రంగ ఆదాయంలో అమెరికా వాటా 60% ఉంటే, ఇప్పుడు 45-50 శాతానికి పరిమితమైంది. దేశీయ ఐటీ ఎగుమతుల్లో అమెరికా తరవాత స్థానం జపాన్‌దే. కానీ అక్కడ నుంచి వచ్చే ఆదాయం 10% లోపే ఉంటోంది. దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా వంటి దేశాల నుంచీ 5-6 శాతం చొప్పున ఆదాయం వస్తోంది. అందువల్లే అమెరికా పరిణామాలపై మనకు అంత ఆసక్తి. ఈ ఏడాది అక్కడి ప్రభుత్వం, సంస్థలు కలిపి ఐటీపై చేయదలచిన రూ.2.14 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందనే అంచనాలు ఐటీలో ఉపాధి ఆశిస్తున్న వారికి వూరట కలిగించే విషయం.
ప్రాజెక్టులు ఇక్కడకు వస్తాయా?: వీసా ఆంక్షలు తప్పనిసరని, అమెరికా బయటకు సేవలు, తయారీని తరలించడాన్ని (ఆఫ్‌షోర్‌) నిరోధిస్తారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏ దేశమైనా తమ అభివృద్ధి మెరుగ్గా ఉండాలని, ఉద్యోగాల కల్పన అధికంగా జరగాలని ఆశించడం తప్పుకాదు. ప్రధాని మోదీ కూడా ‘నైపుణ్య భారత్‌, డిజిటల్‌ బారత్‌, తయారీ కేంద్రంగా భారత్‌’ వంటి పిలుపునిచ్చి, అమలు చేస్తున్నారు కదా. అయితే అమెరికా అధ్యక్షుడు చెబుతున్నట్లు, స్థానికుల అవకాశాలను విదేశీయులు దోచుకోవడం లేదు. స్థానికులకు చెల్లిస్తున్న వేతనాలకే, అంతకంటే నాణ్యమైన పనితీరు చూపగల అభ్యర్థులనే హెచ్‌1బీ వీసాలపై అమెరికాకు తెచ్చుకుని పనిచేయించుకుంటున్నారు. పైగా వీసా ఛార్జీల భారం కూడా మోస్తున్నారు. ఇక భారతీయుల విషయానికి వస్తే.. భారత ఐటీ సంస్థల సేవలు పొందుతున్న అమెరికా ఖాతాదారులు బిలియన్ల కొద్దీ డాలర్ల మేర లాభపడుతున్నందునే, భారతీయులకు అవకాశాలిస్తున్నారు కానీ, ప్రత్యేక ప్రేమతో కాదు. ఐటీ రంగంలో తమకు కావాల్సిన నిపుణులను, ఆయా ప్రాజెక్టులు కేటాయించే కంపెనీలే ఎంచుకుంటాయి. అందువల్లే అమెరికాలోని దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ హెచ్‌1బీ వీసా బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నందున, అది ఎంతవరకు ఆమోదం పొందుతుందో చూడాలి. ప్రభావం మాత్రం ఉంటుంది. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు లాంటిదే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందూ సెనేట్‌లో ప్రవేశపెట్టినా, ఆమోదం పొందకపోవడం గమనార్హం.
భవిష్యత్తు కోసం ఈ కోర్సులు చూడండి
ఐటీ రంగంలో భవిష్యత్తు లేదా అని యువత ఆందోళన చెందనవసరం లేదు. మొబిలిటీ, సామాజిక మాధ్యమాలు, క్లౌడ్‌, బిగ్‌డేటా, కృత్రిమ మేధ రంగాల్లో యువతకు భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. సమీప భవిష్యత్తులో క్లౌడ్‌ ఆర్కిటెక్చర్‌, సెక్యూరిటీ స్పెషలిస్ట్‌, యూజర్‌ ఇంటర్‌ఫేజ్‌ డిజైనర్‌, ఆంగ్లస్‌ జెయస్‌, పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ వంటి నైపుణ్యాలకు అమిత గిరాకీ ఉంటుంది. ఆంగ్లంలో మాట్లాడటం, భావవ్యక్తీకరణ సజావుగా చేయడంపై శ్రద్ధ పెట్టాలి. ఇవన్నీ చేస్తే మెరుగైన ఉపాధి పొందొచ్చు.
నూరుశాతం ఇక్కడే చేయగలగాలి: టీసీఎస్‌ ప్రాంతీయ అధ్యక్షుడు వి.రాజన్న
హెచ్‌1బీ వీసాల సవరణ బిల్లు ప్రభావాన్ని తట్టుకునేందుకూ మార్గాలున్నాయి. హెచ్‌1బీ వీసాల కింద అమెరికాలో నియమించే ఉద్యోగుల వేతనం 1.30 లక్షల డాలర్లు ఉండాలని నిర్ణయించారనుకుందాం. అంటే ఉన్నత స్థాయి నిపుణులను మాత్రమే పంపగలం. దేశీయ ఐటీ సంస్థల తరఫున విదేశాల్లో పనిచేస్తున్న (ఆన్‌షోర్‌) నిపుణులకు కూడా ఆయా దేశాల పౌరుల స్థాయిలోనే వేతనాలు లభిస్తున్నాయి. పైగా వీసా ఖర్చు అదనం. ఆయా ప్రాజెక్టులు, పనికి అవసరమైన నిపుణులు అక్కడ లభించకే మన దేశం నుంచి అక్కడకు పంపుతున్నాం కానీ అవసరమైన నిపుణులు లభిస్తే ఆయా దేశస్థులను నియమించేందుకే భారతీయ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఐరోపాలోనే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థగా టీసీఎస్‌ నిలిచింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 70-80 శాతం పని దేశీయంగా జరుగుతోంది. ఇది పెరగొచ్చు. ఖాతాదారును బట్టే ఉంటుంది.

 

Posted on 19.02.2017


Ask the Expert
Click Here..