ఐటీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం
* ప్రీమియం ప్రాసెసింగ్‌ విధానం రద్దుపై నిపుణులు
ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో హెచ్‌-1బీ ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఐటీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం నష్టంలేదని భావిస్తున్నా.. తల్లిదండ్రులు మాత్రం కలవరానికి గురవుతున్నారు. అమెరికాతో సంబంధం ఉన్న భారతీయులు.. డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు.
అమెరికాలో కంపెనీలు ఇతర దేశాలకు చెందిన నైపుణ్యం ఉన్న ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాయి. అందుకు ముందుగా హెచ్‌-1బీ వీసా కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తాయి. ఏటా మొత్తం 85 వేల హెచ్‌1బీ వీసాలను అమెరికా ప్రభుత్వం జారీ చేస్తుంది. అందులో విదేశీ విద్యార్థులకు (ఏ దేశానికి చెందిన వారైనా) 20 వేలు కేటాయిస్తారు. మిగిలిన 65 వేలల్లో సింగపూర్‌, చిలీ దేశాలకు ప్రత్యేకంగా 7,500 వీసాలు ఇస్తారు. మిగిలిన వాటిని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేటాయిస్తారు. వాటిల్లో 72 శాతం భారతీయులకు దక్కుతున్నాయి. మొత్తం 65 వేల హెచ్‌1బీ వీసాలకు మూడు రెట్లు అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో లాటరీ విధానాన్ని అవలంబిస్తున్నారు. గత ఏడాది 1.72 లక్షల దరఖాస్తులు అందాయి. కంపెనీలు అమెరికాకు పంపిన దరఖాస్తుల స్థితి (స్టేటస్‌)ను త్వరగా వెల్లడించాలంటే 1,225 యూఎస్‌ డాలర్లు అదనంగా చెల్లించాలి. దాన్నే వీసా ప్రీమియం ప్రాసెసింగ్‌గా పిలుస్తారు. అంటే ఒక రకంగా ఇది తత్కాల్‌ లాంటిది. ఈ విధానాన్ని ఏప్రిల్‌ 3 నుంచి ఆరు నెలలపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ప్రకటించింది. దీనివల్ల పెండింగ్‌లో ఉన్న సాధారణ హెచ్‌1బీ వీసాలను త్వరగా ప్రాసెసింగ్‌ చేసే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి ఈ తాజా నిర్ణయంతో భారతీయ ఐటీ కంపెనీలపై అధిక ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. హామీ మేరకు ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేకుంటే కొన్నిమార్లు అత్యవసరంగా ఉద్యోగులను అమెరికా పంపిస్తారు. అందుకు ప్రీమియం ప్రాసెసింగ్‌ విధానం ఉపయోగపడుతుంది. దానికి వచ్చే ఆర్థిక సంవత్సరం(2017-18)లో బ్రేక్‌ పడుతుందని చెబుతున్నారు.
50 శాతం దరఖాస్తులు ఈ విధానంలోనే..
తాజా నిర్ణయంతో ఐటీ కంపెనీలపై ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఎంత అన్నది ఇప్పుడే చెప్పలేం. సాధారణంగా భారతీయ ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు దక్కినప్పుడు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పటికి పూర్తి చేస్తారో ముందుగానే హామీ (కమిట్‌మెంట్‌) ఇస్తాం. అందుకు ఉద్యోగులకు హెచ్‌1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలి. ఆ ప్రక్రియ త్వరగా తేల్చడం అవసరం. అందుకే దాదాపు 50 శాతం దరఖాస్తులను ప్రీమియం ప్రాసెసింగ్‌ విధానంలోనే పంపిస్తాం. ఇప్పుడు అది లేకుంటే ఇబ్బంది అవుతుంది.
              - సుమన్‌రెడ్డి, ఎండీ, పెగా సిస్టమ్స్‌
విద్యార్థులకు ఇబ్బంది లేదు
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒక రకంగా వారి హెచ్‌1బీ వీసాల ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది. ఏప్రిల్‌లో హెచ్‌1బీ లాటరీ ఉంటుంది. ఈసారి ఎన్ని జారీ చేస్తారన్నది ఇప్పటివరకు ప్రకటించలేదు.
              - శ్రీనివాస్‌, డైరెక్టర్‌, ఐటీ కంపెనీ, అమెరికా

 

Posted on 05.03.2017


Ask the Expert
Click Here..