అమెరికాలో భారతీయం
* అక్కడ 2 లక్షలు దాటిన భారత విద్యార్థులు
* మన దేశం నుంచే అత్యధిక పెరుగుదల
* 14.1 శాతం వృద్ధితో మొదటి స్థానం... 2,06,582 మందితో 2వ స్థానం
* కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థుల్లో 56 శాతం భారతీయులు
* అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తాజా నివేదిక వెల్లడి

ఈనాడు - హైదరాబాద్‌: అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య మొదటిసారిగా 2 లక్షల మార్కును దాటింది. ఏడాదిలో 14.1 శాతం వృద్ధితో ఆ సంఖ్య 2,06,582కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో పోల్చితే అత్యధిక వృద్ధి రేటు భారత్‌ నుంచే నమోదైందని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) పేర్కొంది. అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులపై ఆ శాఖ ఇటీవల తాజా నివేదికను విడుదల చేసింది. ప్రస్తుతం అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలు.. జాత్యాంహకార దాడుల ప్రభావం వల్ల ఇక నుంచి అమెరికా చదువుకు వెళ్లే మన విద్యార్థుల సంఖ్య తగ్గవచ్చని ఒక వైపు అంచనా వేస్తున్నారు. మరికొద్ది నెలలు గడిస్తేనే తాజా పరిణామాల ప్రభావం కనిపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించి 2016 నవంబరు వరకు సేకరించిన సమాచారంతో అమెరికా ఐసీఈ ఈ నివేదికను ఇటీవల విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2015 నవంబరుకు, 2016 నవంబరుకు మధ్య భారతీయ విద్యార్థుల సంఖ్య 14.1 శాతం పెరిగిందని... ఇతర దేశాలతో పోల్చుకుంటే అత్యధిక వృద్ధి రేటు ఇదేనని అమెరికా సృష్టం చేసింది. 2016 జులైలో విద్యార్థుల కంటే నవంబరులో... అంటే నాలుగు నెలల వ్యవధిలోనే 13,859 మంది భారత విద్యార్థులు పెరిగినట్లు స్పష్టమవుతోంది.

2015 నవంబరు...2016 నవంబరుకు ఇదీ తేడా...
* 2015లో అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు 11,19,000 మంది ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 12,03,000 మందికి పెరిగింది. 2.9 శాతం పెరుగుదల నమోదైంది.
* సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం(స్టెమ్‌) కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 4,66,927 నుంచి 5,13,902కు పెరిగింది. 10.1 శాతం పెరుగుదల నమోదైంది.
* కంప్యూటర్‌ సైన్స్‌ చదివేవారిలో 56 శాతం భారతీయులే కావడం విశేషం. అంటే 79,834 మంది మన విద్యార్థులున్నారు.

 

Posted on 08.03.2017


Ask the Expert
Click Here..