కలల సాఫల్యానికి అవగాహనే దిక్సూచి

అమెరికాలో ఉన్నత విద్యకు ప్రణాళికలు వేసుకున్న విద్యార్థుల, వారి తల్లిదండ్రుల మనసులు ప్రస్తుతం వివిధ సందేహాలతో తికమకపడుతున్నాయి. ఇప్పటికే దరఖాస్తు చేసినవారికీ, వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందినవారికీ తమ అమెరికా కలల పట్ల అనిశ్చితి ఏర్పడివుంది. అపోహలను తొలగించుకుని, వాస్తవిక సమాచారంపై ఆధారపడితే ఇప్పటికీ యు.ఎస్‌.ఎ. మెరుగైన గమ్యమే!

అమెరికా ప్రభుత్వ తాజా ప్రతిపాదనలూ, చర్యలూ ప్రధానంగా అక్రమ పద్ధతుల్లో వలస వచ్చినవారిని నిరోధించటానికి ఉద్దేశించినవి. మన విద్యార్థులందరూ చట్టబద్ధంగా వెళ్తున్నవారే కాబట్టి ఈ కోణంలో ఇబ్బందులేమీ ఉండవు. భారతీయ విద్యార్థులు అమెరికా విద్యాభ్యాస విషయంలో తర్జనభర్జనలు పడాల్సివస్తోందటే ప్రధానంగా మూడు అంశాలు కారణం.

1) ఓపీటీ పొడిగింపు/ రద్దు
2) హెచ్‌1బీ నిబంధనల్లో మార్పులు
3) జాతివివక్ష, భద్రత.

ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌
విదేశీ విద్యార్థులు బ్యాచిలర్‌, పీజీ కోర్సులు పూర్తిచేశాక అమెరికాలో ఏడాది పాటు పనిచేసుకోవటానికి అనుమతిస్తారు. ఇదే ఓపీటీ. అమెరికాలో చదివే ప్రతి విద్యార్థికీ ఈ అవకాశాన్ని ఎంతోకాలంగా ఇస్తున్నారు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ అండ్‌ మ్యాథ్స్‌ (STEM)మేజర్స్‌ చదివినవారికి ఈ ఓపీటీని 12 నెలల తర్వాత 24 నెలల పాటు పొడిగిస్తున్నారు. మొదట్లో ఈ పొడిగింపు 17 నెలలపాటు ఉండేది. తర్వాత దాన్ని 24 నెలలకు 2016 మే 10 నుంచి పెంచారు. అమెరికాలో చదివిన విద్యార్థులు ఉద్యోగాలు వెతుక్కుని హెచ్‌1బీ కోసం ముందుకు సాగటానికే వ్యవధిని పొడిగించారు. ఇది జరిగి ఏడాది కూడా కాలేదు. అందుకే ఈ నిబంధనను మార్చాలన్నా కొంత సమయం పడుతుందనీ, విదేశీ విద్యార్థులపై దీని తక్షణ ప్రభావమేదీ ఉండదనీ గుర్తుంచుకోవాలి. గుర్తింపు (అక్రిడిటేషన్‌) ఉన్న విద్యాసంస్థల్లో చదివినవారికే ఓపీటీ పొడిగింపు వర్తిస్తుంది. ఇది ముఖ్యం కాబట్టి విశ్వవిద్యాలయాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఈ లింకు చూస్తే... అక్రిడిటేషన్‌ స్టేటస్‌ గురించి తెలుస్తుంది. https://ope.ed.gov/accreditation/ తక్కువ ఫీజు ఉందనే కారణంతో గుర్తింపు లేని విద్యాసంస్థల్లో చేరటం పెద్ద పొరపాటు అవుతుంది. ACICS అక్రిడిటేషన్‌ రద్దు మూలంగా ఇతర విద్యాసంస్థలకు మారటం చాలామంది విద్యార్థులకు కష్టంగా ఉంటోంది.

హెచ్‌1బీ నిబంధనల్లో మార్పులు
హెచ్‌1బీకి సంబంధించి కొన్ని బిల్లులను అమెరికా చట్టసభలో సమర్పించారు కానీ, అవి ఇంకా పాస్‌ కాలేదు. అది జరిగితే అమలు కాబోయేవాటిలో- ఉద్యోగులకు మూల వేతనం పెరగటం, యు.ఎస్‌.ఎ.లో చదివినవారికి ఉద్యోగాల్లో ప్రాముఖ్యం, లాటరీ సిస్టమ్‌ రద్దు మొదలైనవి ముఖ్యమైనవి. ఇవన్నీ నిజానికి అమెరికాలో మాస్టర్స్‌ చేయదల్చినవారికి అనుకూల అంశాలే. వేతన విధానంలో సమీక్ష జరిగితే ఇప్పుడు ఇస్తున్నదానికంటే చాలా ఎక్కువ వేతనమే లభించనుంది. కొత్త బిల్లు అమల్లోకి వస్తే... ఓపీటీలో అర్హత పొందిన విద్యార్థులు అమెరికా సంస్థల్లో ఆకర్షణీయ జీతాలతో ఉద్యోగాలు పొందటానికి అధిక అవకాశాలుంటాయి.

జాతి వివక్ష, భద్రత
ఈమధ్య కాలంలో భారతీయులపై జరిగిన కొన్ని దాడులు ఆ దేశం మనవారికి అంత సురక్షితం కాదని తల్లిదండ్రులు భావించటానికి అవకాశం ఏర్పరిచాయి. అయితే యు.ఎస్‌. ప్రమాదకర దేశమేమీ కాదు. నిజానికది సురక్షితం. అమెరికా అయినా, మరే దేశమైనా ప్రయాణమై వెళ్ళినపుడు భద్రతాపరంగా కొన్ని ప్రమాదాలకు ఆస్కారముంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోగలిగితే వాటిని నివారించుకోవచ్చు. ఆ దేశంలోని అత్యధిక విశ్వవిద్యాలయాలు విద్యార్థుల క్షేమం కోసం భద్రతా ప్రణాళికలను సమన్వయపరచుకున్నాయి. ఆ రకంగా ఇది మంచి పరిణామమే. క్యాంపస్‌లోకి విద్యార్థి అడుగుపెట్టగానే ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ కార్యాలయానికి వెళ్ళాలి. ఆ కార్యాలయం నిర్దిష్ట సమాచారంతో ఓరియెంటేషన్‌ సెషన్లు నిర్వహిస్తుంది. యు.ఎస్‌.లో చదువుకునేవారికి విద్య, సాంస్కృతిక, సామాజిక, భద్రతాపరమైన అనుభవం మెరుగ్గా ఉండేలా ఇవి ఉపకరిస్తాయి.

కొన్ని మెలకువలు
* విద్యార్థులు తమ పరిసరాలనూ, తమ ముందూ వెనకా ఎవరున్నారనేదీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా గమనిస్తుండాలి. ప్రజలు కేవలం జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా నేరాల ప్రభావం నుంచి బయటపడొచ్చని నేరపరిశోధక విభాగం సూచిస్తుంటుంది.
* రాత్రివేళల్లో ఒంటరిగా నడుస్తూవెళ్ళటం సరి కాదు. నేరాలకు ఆస్కారమిచ్చే ఇలాంటి సందర్భాలు లేకుండా జాగ్రత్తవహించాలి. అత్యధిక క్యాంపస్‌లలో పోలీసులు ఉంటారు కాబట్టి సురక్షితమే. అయినప్పటికీ విద్యార్థులు రాత్రివేళల్లో బయటికి వెళ్ళాల్సివస్తే... బృందాలుగానో, కనీసం ఇద్దరైనా ఉండేలాగానో చూసుకోవాలి. చాలా క్యాంపసులు క్యాంపస్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఎస్కార్ట్‌ సేవలు అందిస్తుంటాయి.
* క్యాంపస్‌ బయటా, లోపలా వస్తువుల చోరీల బెడద ఉంటుంది. పర్సు, పర్సనల్‌ కంప్యూటర్‌, పుస్తకాలు, సెల్‌ఫోన్‌ మొదలైన వ్యక్తిగత వస్తువులను ఎవరికీ అప్పగించకుండా వదిలేసి వెళ్ళిపోకూడదు. ఒక్కోసారి రెస్ట్‌రూముకో, వెండింగ్‌ మెషిన్‌ దగ్గరకో వెళ్ళొచ్చేలోపే సెకన్ల వ్యవధిలో వస్తువులు మాయం కావొచ్చు.
* చాలా క్యాంపసుల్లో నివాస సదుపాయాలు రకరకాలుగా ఉంటాయి. విద్యార్థులు క్యాంపస్‌ డార్మిటరీల్లో ఉన్నా, ఆఫ్‌ క్యాంపస్‌లో ఉన్నా బయటికి వెళ్ళే ప్రతిసారీ తలుపులూ, కిటికీలూ మూసివెయ్యటం అలవాటు చేసుకోవాలి. కొత్త వ్యక్తులు వస్తే తలుపు తెరవకూడదు. అపరిచితులను తలుపులోంచి చూసి వారితో మాట్లాడి సమస్యేమీ ఉండదని నిర్ధారించుకున్నాక గానీ తలుపు తెరవకపోవటం అమెరికన్‌ సంస్కృతిలో అలవాటు. చట్టం అమలుచేసే అధికారులు వచ్చినా సరే, వారి అధికారిక గుర్తింపును చూపమని అడగవచ్చు.
* చాలామంది విద్యార్థులు తమకు సమస్యలు ఉన్నా దాన్ని ప్రస్తావించటానికి సంకోచిస్తుంటారు. కానీ ఏ సమస్య ఉన్నా స్టూడెంట్‌ అడ్వైజర్‌ దృష్టికి తీసుకువెళ్ళి వారి సాయం పొందాలి.
అమెరికా చాలా పెద్ద దేశం. ప్రాంతాలవారీగా చాలా వైవిధ్యం కనపడుతుంటుంది. మధ్య ప్రాంతాలతో పోలిస్తే తూర్పు, పశ్చిమ ప్రాంతాలవారు వైవిధ్యంగా, హుందాగా, విశాలదృక్పథంతో వ్యవహరిస్తారని ప్రతీతి. దాదాపు అన్ని ప్రాంతాల్లో భారతీయులు పెద్దసంఖ్యలోనే ఉంటారు. భారతీయ జనాభా ఎక్కువుండే న్యూయార్క్‌, న్యూజెర్సీ, లాస్‌ ఏంజిల్స్‌, బోస్టన్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో, టెక్సాస్‌, ఓహియో, వాషింగ్టన్‌ డీసీ, బాల్టిమోర్‌, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలా అని ఇతర రాష్ట్రాలు సురక్షితం కావని కాదు. కానీ ప్రస్తావించిన ప్రాంతాలవైపే ఎక్కువమంది విద్యార్థులు మొగ్గుచూపుతుంటారు.

ఏ ప్రాంతాలు? ఎందుకని?
యు.ఎస్‌.ఎ. తూర్పు, పశ్చిమ, మధ్య తూర్పు ప్రాంతాలపై మన విద్యార్థులు అధికంగా దృష్టిపెడుతుంటారు. దీనికి అక్కడి వాతావరణ పరిస్థితులూ, స్థానిక అనుకూలతలూ, భారీ ఉద్యోగావకాశాలూ ప్రాథమిక కారణంగా చెప్పుకోవచ్చు! ఉష్ణప్రాంతమైన మనదేశానికి పూర్తి భిన్నం అమెరికా. అక్కడ ఎక్కువ ప్రాంతాల్లో చాలా చలి ఉంటుంది. ఈ కారణం వల్ల చాలామంది భారతీయ విద్యార్థులు పశ్చిమ యు.ఎస్‌. రాష్ట్రాలపై ఆసక్తి చూపుతుంటారు. ఆ రాష్ట్రాల్లోనూ కాలిఫోర్నియా అంటే ఎక్కువ మోజు కనపడుతుంటుంది. స్థానిక అనుకూల వాతావరణంతో పాటు అక్కడున్న సిలికాన్‌ వ్యాలీ మరో కారణం. ఇది ప్రపంచంలోనే సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులకు భారీ కేంద్రమని తెలిసిందే. పైగా కాలిఫోర్నియాలో పెద్దసంఖ్యలో విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. ఇలాంటి రాష్ట్రమే టెక్సాస్‌. అనుకూల వాతావరణం ఉండే ఈ ప్రాంతం యు.ఎస్‌. మధ్య తూర్పుప్రాంతంలో ఉంది. ఎంతోకాలంగా భారతీయ ప్రజలు ఇక్కడ పెద్దసంఖ్యలో నివసిస్తున్నారు. నచ్చే వాతావరణ పరిస్థితులతో పాటు ఇక్కడ జీవన వ్యయం కూడా తక్కువే. మనదేశస్థులు దీనిపై మొగ్గు చూపటానికి ఇదో బలమైన కారణం. తూర్పు, పశ్చిమ ప్రాంతాలతో పోలిస్తే ఖర్చులు కనీసం 30 శాతం తక్కువ.
శుభ‌క‌ర్ ఆల‌పాటి
ఇక్కడ విశ్వవిద్యాలయాల సంఖ్య పరిమితమే అయినప్పటికీ వీటిలో ఉన్న తక్కువ ఫీజు విధానం, మిత జీవన వ్యయం ఎక్కువమంది విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. అలాగే తూర్పు యు.ఎస్‌.ఎ. కూడా పెద్దసంఖ్యలో భారతీయులున్న ప్రాంతం. న్యూయార్క్‌, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్‌ డీసీ, బోస్టన్‌ మొదలైన రాష్ట్రాలు ఇక్కడివే. వాతావరణం చాలా చల్లగా ఉంటూ ఏడాదికి నాలుగు నెలలు మంచు కురిసే ప్రాంతం అయినప్పటికీ మన భారతీయులు బాగానే ఇష్టపడతారు. ఈ ప్రాంత చుట్టుపక్కల ఆర్థికాభివృద్ధి మొదటి హేతువు. అపారమైన ఉద్యోగావకాశాలూ, అత్యున్నత స్థాయి జీవన ప్రమాణాలూ ఇక్కడి ప్రత్యేకత. విద్యార్థులు చదువుకోవడానికి విస్తృత అవకాశాలనిస్తూ పెద్దసంఖ్యలో విశ్వవిద్యాలయాలూ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలూ ఇక్కడ ఉన్నాయి.

Posted on 20.03.2017


Ask the Expert
Click Here..