విదేశీ విద్యకు... ఆర్థిక చేయూత!

విదేశాల్లో చదువుకోవాలనుకోవడం ప్రతి విద్యార్థి కల. అయితే, ఇప్పుడది ఏ మాత్రం అసాధ్యం కాదు. విదేశీ విద్య ఖరీదైనప్పటికీ వారి కలను నెరవేర్చడానికి బ్యాంకులు మేమున్నాం అంటూ తోడ్పాటు అందిస్తున్నాయి. దీంతో మధ్యతరగతి వారు కూడా ఏ ఇబ్బందీ లేకుండా సులభంగా విద్యా రుణాలు పొందేందుకు వీలవుతోంది. పలు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అందిస్తున్న రుణాలతో ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. మరి, ఈ రుణాలు పొందాలంటే ఎలా సిద్ధం కావాలి? బ్యాంకుల నిబంధనలు ఏమిటి? ఇవన్నీ తెలుసుకొని ఉండాలి.
విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికోసం ప్రభుత్వ బ్యాంకులు పలు పథకాలను ప్రవేశపెట్టాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ బరోడాలాంటివి ఇందులో ముందున్నాయి. తక్కువ వడ్డీ రేట్లతో, ప్రత్యేక ప్రయోజనాలతో అందిస్తోన్న ఈ రుణాలను తీసుకోవడం కూడా సులువే.
ఇతర దేశాల్లో చదువుకునేందుకు వెళ్లేవారు రుణం తీసుకునేముందు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలేమిటంటే..
* చాలా సందర్భాల్లో విద్యా రుణం ఇచ్చేందుకు సహ దరఖాస్తుదారుడిని అడుగుతాయి బ్యాంకులు. అంటే, విద్యారుణం పొందే విద్యార్థితోపాటు కచ్చితంగా సహ దరఖాస్తుదారుడు కావాల్సిందే. సాధారణంగా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టువులు సహదరఖాస్తుదారులుగా ఉండేందుకు అనుమతిస్తాయి. ఒకవేళ విద్యార్థి తీసుకున్న రుణాన్ని అతను తిరిగి చెల్లించని పక్షంలో సహదరఖాస్తుదారుడిగా ఉన్నవారు ఆ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
* విద్యారుణం రూ.7.5లక్షలకు మించి ఉన్నప్పుడు తనఖా కోసం బ్యాంకులు అడుగుతాయి. దీనికోసం మీ పేరుమీద ఉన్న ఆస్తుల పత్రాలు లేదా, ఎల్‌ఐసీ పాలసీగానీ బ్యాంకులకు తాకట్టు పెట్టాల్సి వస్తుంది.
* విద్యా రుణం మంజూరుకు సంబంధించి ప్రతి బ్యాంకూ కొన్ని ప్రత్యేక ప్రమాణాలను పాటిస్తుంటాయి. కొన్ని బ్యాంకులు టెక్నికల్‌ కోర్సులకు మాత్రమే రుణాలనిస్తాయి. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే వారికి, దీర్ఘకాలిక కోర్సులను చదివే వారికి ప్రాధాన్యం ఇస్తాయి. వొకేషనల్‌ కోర్సులు చదవాలనుకునే వారికి విద్యారుణాలు అందడం కష్టమే.
* రూ.4లక్షలకు మించి విద్యారుణం తీసుకోవాలనుకున్నప్పుడు కొంత మొత్తాన్ని మార్జిన్‌ మనీగా చూపించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇది 15శాతం వరకూ ఉంటుంది. రుణాన్ని నేరుగా విద్యాసంస్థల పేరుమీదే చెల్లిస్తారు.
ఎవరికి ఇస్తారు?ఏం కావాలి?
భారత పౌరులందరికీ విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అర్హత ఉంది. దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణీత పత్రాలతో సిద్ధం అయితే చాలు. అవేమిటంటే..
* మీరు చదువుకునేందుకు దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయం నుంచి ప్రవేశ పత్రం (ఇందులో ఎలాంటి షరతులూ ఉండకూడదు). మొత్తం ఎంత ఖర్చు అవుతుందనే అంచనా పత్రం (విశ్వవిద్యాలయం నుంచి)
* దరఖాస్తుదారుడు, సహ దరఖాస్తుదారుడివి రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు నకలు, వ్యక్తిగత, చిరునామా ధ్రువీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సులాంటివి) విద్యార్థి, సహ దరఖాస్తుదారులకు సంబంధించిన ఆరు నెలల బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలు.
* సహ దరఖాస్తుదారుడి ఆదాయ ధ్రువీకరణ కోసం అతని వేతనం స్లిప్పు, గత రెండేళ్ల ఫారం-16, ఆదాయపు పన్ను రిటర్నులు
* సహ దరఖాస్తుదారుడి ఆస్తులు-అప్పులకు సంబంధించిన వివరాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు (అసలు), ఆస్తి పన్ను చెల్లింపు రశీదు
* విద్యార్థి విద్యార్హతలకు సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలు
ఏయే ఖర్చులకు..
విదేశాల్లో విద్యాభ్యాసం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అయితే, విద్యారుణం తీసుకున్నప్పుడు ఇందులో వేటిని పరిగణనలోనికి తీసుకొని రుణాన్ని అందిస్తారన్నదీ తెలుసుకొని ఉండాలి.
* ట్యూషన్‌ ఫీజు * లేబరేటరీ ఫీజు, * పరీక్షల ఫీజు * లైబ్రరీ ఫీజు *విద్యాభ్యాసానికి అవసరమైన పరికరాలు, పుస్తకాల కొనుగోలు కోసం *ల్యాప్‌టాప్‌ కొనుగోలుకు * ప్రయాణ ఖర్చులు * విదేశాల్లో నివసించేందుకు అయ్యే ఖర్చులు * ప్రాజెక్టు, స్టడీ టూర్లకు అయ్యే ఖర్చులు
తనఖా తప్పనిసరా?
విద్యారుణాల విషయంలో రూ.4లక్షల వరకూ ఎలాంటి హామీలు, తనఖాలు అక్కర్లేదనే నిబంధనలు ఉన్నాయి. అయితే, అంతకన్నా ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నప్పుడు మాత్రం బ్యాంకులు కొన్ని హామీలు, తనఖాలు అడిగే ఆస్కారం ఉంది.
* రుణానికి దరఖాస్తు చేసే విద్యార్థి తల్లిదండ్రులు/సంరక్షుకులు తప్పనిసరిగా రుణ సహ దరఖాస్తుదారుడిగా ఉండాలని చాలా బ్యాంకులు నిబంధన విధిస్తున్నాయి. వివాహం అయిన వ్యక్తికి జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా అత్తామామలు కూడా సహదరఖాస్తుదారులుగా ఉండే అవకాశం ఉంది.
* కొన్నిసార్లు మూడో వ్యక్తి హామీ కూడా అడుగుతున్నాయి. లేదా ఆస్తులను చూపించాల్సి రావచ్చు.
* తల్లిదండ్రులు/సంరక్షకుల ఆదాయం రుణ మొత్తానికి కనీసం మూడు రెట్ల వరకూ ఉంటే.. వారే పూర్తి స్థాయి హామీని ఇచ్చేందుకు అవకాశం ఉంది. అంటే, రూ.25లక్షల కోసం రుణం కావాలనుకున్నప్పుడు సహ దరఖాస్తుదారుడి ఆదాయం ఏడాదికి కనీసం రూ.75లక్షలు ఉండాలి.
* రూ.4లక్షల నుంచి రూ.7.5లక్షల వరకూ రుణం కావాలనుకున్నప్పుడు మూడో వ్యక్తి హామీ ఉంటే సరిపోతుంది. దీంతోపాటు భవిష్యత్తు ఆదాయాన్ని బ్యాంకుకు అసైన్‌ చేయాల్సి ఉంటుంది.
* ఒకవేళ రుణం రూ.7.5లక్షలకు మించి కావాలనుకున్నప్పుడు రుణ మొత్తానికి సరిపడా విలువైన ఆస్తులను తనఖాగా చూపించాలి. దీంతోపాటు భవిష్యత్తు ఆదాయాన్ని బ్యాంకులకు అసైన్‌ చేయాలి.
ప్రత్యేక పథకాలుగా...
ఉన్నత విద్యాభ్యాసానికి రుణంకోసం దరఖాస్తు చేసుకునే ముందు కొన్ని విషయాల్లో అవగాహన ఉండాలి. ఏయే బ్యాంకులు ఏయే కోర్సులకు, ఎంత మేరకు రుణాలను ఇస్తున్నాయి? నియమ నిబంధనలేమిటి? రుణ వడ్డీ రేట్లను ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత చలన వడ్డీ రేట్లను అందిస్తున్నాయా? చూసుకోవాలి. కొన్ని బ్యాంకులు విదేశీ రుణాలను ప్రత్యేక పేర్లతో అందిస్తున్నాయి. వాటిలో ఉండే ప్రయోజనాలు తెలుసుకోవాలి.
ఎస్‌బీఐ.. గ్లోబల్‌ ఎడ్‌-అడ్వాంటేజ్‌
అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌, సింగపూర్‌, జపాన్‌, హాంగ్‌కాంగ్‌లలో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లాలనుకునే వారికి ఈ పథకం కింద రుణం మంజూరు చేస్తోంది ఎస్‌బీఐ. దీనికింద కనీసం రూ.20లక్షల నుంచి గరిష్ఠంగా రూ.1.5కోట్ల వరకూ రుణం పొందే వీలుంది. రుణ మొత్తానికి సమానమైన ఆస్తిని బ్యాంకుకు తనఖాగా పెట్టాల్సి ఉంటుంది.
* విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చులో 20శాతం మార్జిన్‌ మొత్తంగా విద్యార్థి భరించాలి. మిగతా 80శాతాన్ని రుణంగా ఇస్తుంది. స్కాలర్‌షిప్పులను మార్జిన్‌లో చూపించుకునే వీలుంది.
* కోర్సు కాలం, మారటోరియం సమయంలో సాధారణ వడ్డీని విధిస్తారు. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నుంచి బీమా పాలసీ (ఎస్‌బీఐ లైఫ్‌ రిన్‌ రక్షా) తీసుకున్న వారికి వడ్డీ రేటులో 0.50శాతం రాయితీ లభిస్తుంది. ఇప్పటికే ఈ పాలసీ ఉంటే.. దీనిని బ్యాంకు పేరుమీద అసైన్‌ చేయాల్సి ఉంటుంది. విద్యార్థినులకు 0.50శాతం వడ్డీలో రాయితీ లభిస్తుంది.
* కోర్సు పూర్తయిన 6 నెలల తర్వాత నుంచీ రుణాన్ని తిరిగి నెలసరి వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కోర్సు పూర్తయిన తర్వాత కూడా అనివార్య కారణాలతో సరైన ఆదాయం పొందలేక రుణం చెల్లింపు చేయలేకపోతే 15ఏళ్లదాకా మారటోరియం వ్యవధిని పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో సాధారణ వడ్డీని విధిస్తారు.
* ఎస్‌బీఐ అన్ని శాఖల్లోనూ ఈ పథకం కింద దరఖాస్తు చేయడం కుదరదు. కాబట్టి, https://goo.gl/OfZahoలో దరఖాస్తు చేస్తే, మీకు సమీపంలో ఉండి, ఈ పథకం ద్వారా రుణాన్ని అందిస్తున్న బ్యాంకుకు మీ దరఖాస్తును పంపిస్తారు.
* దరఖాస్తు పరిశీలనా రుసుము రూ.10వేలు.
బరోడా స్కాలర్‌ స్కీం
ఈ పథకంలో కనీస రుణ మొత్తం రూ.20లక్షలు. విద్యార్థి కోర్సు ఫీజు మొత్తంలో 15శాతం భరించాలి. రుణ మొత్తంలో 1శాతం (గరిష్ఠంగా రూ.10వేలు) పరిశీలనా రుసుముగా వసూలు చేస్తారు. మొదటి విడత రుణం మంజూరు సమయంలో దీనిని తిరిగి ఇచ్చేస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత ఏడాది లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత 6నెలల పాటు (ఏది ముందయితే అది) మారటోరియం వ్యవధిగా వ్యవహరిస్తారు.
* రూ.7.50లక్షల్లోపు రుణం తీసుకున్న వారు గరిష్ఠంగా 120వాయిదాల్లో రుణాన్ని తీర్చాల్సి ఉంటుంది. రూ.7.50లక్షలకన్నా అధికంగా తీసుకున్న వారు 180 నెలల్లో రుణాన్ని తీర్చాలి.
* ఈ పథకం కింద తీసుకున్న రుణానికి వడ్డీ రేటు శాతం ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమై ఉంటుంది. - ఏడాది ఎంసీఎల్‌ఆర్‌+స్ట్రాటజిక్‌ ప్రీమియం+1శాతం. మారటోరియం వ్యవధిలో సాధారణ వడ్డీ విధిస్తారు. విద్యార్థినులకు 0.5శాతం వడ్డీ రాయితీ. రుణ వాయిదాలు బాకీ పడితే.. 2శాతం వార్షిక వడ్డీని అపరాధ రుసుముగా విధిస్తారు. (రూ.4లక్షల రుణం మించినప్పుడు)
మీ సమీపంలో ఉన్న ఏ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖలోనైనా రుణం కోసం సంప్రదించవచ్చు.
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌- ఉడాన్‌
దేశ, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ పలు పథకాలను అందిస్తోంది. ఇందులో విదేశీ విద్యాభ్యాసానికి ప్రత్యేకంగా ఉడాన్‌ను అందిస్తోంది.
* అవసరం, విద్యార్థి, తల్లిదండ్రుల తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి రుణ మొత్తాన్ని నిర్ణయిస్తుంది. గరిష్ఠంగా రూ.20లక్షల వరకూ రుణం ఇస్తుంది.
* రూ.4లక్షల వరకూ ఎలాంటి మార్జిన్‌ మొత్తమూ అక్కర్లేదు. రూ.4లక్షలకు మించి రుణం కావాలనుకున్నప్పుడు 15% మార్జిన్‌ మనీ అవసరం.
* రుణాన్ని 15 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ముందస్తు చెల్లింపు రుసుములు లేవు.
* వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. పీఎన్‌బీ ఉడాన్‌ పథకం కింద రూ.7.50లక్షల లోపు రుణం తీసుకున్న వారికి ఎంసీఎల్‌ఆర్‌+0.60శాతం
మీ సమీపంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు శాఖలో ఈ పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా https://www.vidyalakshmi.co.in/Students/ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రైవేటు బ్యాంకులూ.. ఆర్థిక సంస్థలూ..
గతంలో ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే విద్యారుణాలను అందించేవి. కానీ, ఇప్పుడు ప్రైవేటు బ్యాంకులతో పాటు, కొన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కూడా విద్యారుణాలను అందిస్తున్నాయి. వీటికీ దరఖాస్తు ప్రక్రియ ఒకే రీతిగా ఉంటుంది. ఉన్న తేడా అంతా వడ్డీ రేటులోనే.
* యాక్సిస్‌ బ్యాంకు రూ.20లక్షల వరకూ రుణాన్ని అందిస్తోంది. వార్షిక వడ్డీ రేటు 13%-15% వరకూ విధిస్తోంది.
* ఐసీఐసీఐ బ్యాంకు 11శాతం వడ్డీని వసూలు చేస్తోంది. గరిష్ఠంగా 20లక్షల వరకూ రుణం ఇస్తోంది.
* క్రెడిలా (హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు) ద్వారా రూ.2కోట్ల వరకూ రుణం తీసుకునే వీలుంది. వార్షిక వడ్డీ రేటు శాతం 12.5.
రుణం ఎక్కడనుంచి తీసుకోవాలని నిర్ణయించుకునేప్పుడు, వడ్డీ రేట్లతోపాటు, తిరిగి చెల్లించే విషయంలో ఉన్న వెసులుబాట్లనూ పరిగణనలోనికి తీసుకోవాలి.

Posted on 14.04.2017


Ask the Expert
Click Here..