విదేశీ విద్యకు ఆర్దిక ఆసరా!

చిన్నప్పటినుంచీ చదువుల్లో మంచి మార్కులు సంపాదిస్తూ.. బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్నారా? డబ్బు లేదన్న ఏకైక కారణంతో ఉన్నత విద్యకు దూరం అవుతామేమోనని విచారిస్తున్నారా? మీకా దిగులు అక్కర్లేదు. విద్యారుణంతో మీ కలలు నిజం చేయడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. తెలుసుకోవాల్సిందల్లా.. ఆ రుణం పొందడానికి ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలనే విషయాలను.
తెలివితేటలు, కష్టపడే మనస్తత్వం, ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే పట్టుదల ఉంటే సరిపోదు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి తగిన మొత్తంలో డబ్బు కూడా అవసరమే. ఆ డబ్బు మీ దగ్గర లేకపోయినా ఫర్వాలేదు. రుణం పొందే సులవైన మార్గం తెలియాలి. స్వదేశంలోనైనా.. విదేశాల్లోనైనా ఉన్నత విద్యను అభ్యసించడానికి బ్యాంకులు రుణం ఇస్తాయి. అయితే, దాన్ని మంజూరు చేయడానికి ఏయే అంశాలు పరిశీలిస్తాయి, ఏయే పత్రాలు అడుగుతాయో అర్థం చేసుకోవాలి. అందుకు తగ్గట్టు మీరు సిద్ధం కావాలి.

సిద్ధం కావాలి వెంటనే

విదేశాల్లో ఉన్నత విద్యే మీ లక్ష్యమా? అయితే, ఆ ఆలోచన వచ్చిన వెంటనే దానికి తగ్గట్టుగా సిద్ధం కావాలి. వీసా వచ్చాక చూద్దాం! ఇంకా సమయం ఉంది కదా! అనుకుంటూ కాలయాపన చేయకండి. ముందుగా మీ తల్లిదండ్రులలో ఒకరికి దీర్ఘకాలంగా ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లండి. దరఖాస్తు పత్రం తీసుకోండి. బ్యాంకు అడిగిన అన్ని విషయాలూ, వివరాలూ తప్పుల్లేకుండా అందించండి. మీ చిరునామా, ఫోన్‌ నెంబర్లను స్పష్టంగా పేర్కొనండి.
* మీరు చేయదల్చుకున్న కోర్సు ఎక్కడ చదవాలనుకుంటున్నారు? దానికి అయ్యే ఖర్చు ఎంత? సంబంధిత వివరాలను తెలుసుకోవాలి. దీనికోసం ఆయా విద్యాసంస్థల వెబ్‌సైట్లను పరిశీలించవచ్చు.
* బ్యాంకు వెబ్‌సైట్లలో కూడా విద్యారుణానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఏయే విశ్వవిద్యాలయాలు, ఏయే కోర్సులకు రుణాలు ఇస్తున్నారో అందులో తెలుసుకోవచ్చు. మీరు చదవబోయే విశ్వవిద్యాలయం బ్యాంకులు పేర్కొన్న జాబితాలో ఉంటే.. మీకు రుణం రావడం సులువవుతుందని గుర్తుంచుకోండి.
* మీరు రూపొందించిన అంచనా పత్రాన్ని, దరఖాస్తుతోపాటు కలిపి బ్యాంకుకు అందించండి. ఎక్కువ రుణంపై ఆశతో అంచనాలు ఎక్కువగా వేసి చూపించొద్దు. బ్యాంకులు ఈ విషయాన్ని పట్టిపట్టి చూస్తాయి. వాటి దగ్గర ఆయా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఫీజుల వివరాలు ఉండే అవకాశం ఉంది.

తప్పదు తనఖా?

అంచనాల ఆధారంగా మీకు ఎంత అప్పు కావాలన్న విషయం తెలిసిపోతుంది. నాలుగు లక్షల లోపు రుణానికి ఎలాంటి వ్యక్తిగత పూచీకత్తు, హామీ, స్థిరాస్తి తనఖా, మార్జిన్‌ సొమ్మును వసూలు చేయకూడదని నిబంధన. కానీ, ఇచ్చే ఏ అప్పుకైనా తిరిగి చెల్లించే సామర్థ్యాన్నే బ్యాంకులు ప్రధాన ప్రాతిపదికగా చూస్తాయి. కాబట్టి, ఈ నిబంధనను ఏవో కొన్ని బ్యాంకులు మాత్రమే పాటిస్తున్నాయి. ఇప్పటికే విద్యారుణాల విషయంలో రానిబాకీలు ఉన్న శాఖలు తప్పనిసరిగా తనఖా, హామీల కోసం పట్టుపట్టవచ్చు. కాబట్టి, దీనికి సిద్ధపడే బ్యాంకును సంప్రదిస్తే.. పని తొందరగా అవుతుంది.
* రూ. 4లక్షల నుంచి రూ.7.50 లక్షల్లోపు విద్యారుణాలపై కూడా స్థిరాస్తి తనఖా అవసరం లేదు. దీనికి మూడో వ్యక్తి హామీ ఇస్తే సరిపోతుంది. హామీ ఇచ్చే వ్యక్తికి కూడా మంచి ఆర్థిక స్థోమత, రుణ చరిత్ర ఉండటం అవసరం.
* రూ.7.50లక్షలు దాటిన విద్యారుణాలకు పూచీకత్తుతోపాటు, ఏదైనా స్థిరాస్తి తనఖా పెట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా తనఖా పెట్టే స్థిరాస్తి విద్యార్థి లేదా అతని తల్లిదండ్రుల పేరుమీద ఉండాలి.
* స్థిరాస్తులు అని చెప్పి గ్రామాల్లోని ఇళ్లు, పంట పొలాలు చూపిస్తామని అంటే బ్యాంకులు అన్ని సందర్భాల్లోనూ అంగీకరించకపోవచ్చు. సాధారణంగా బ్యాంకులు నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో ఉండే ఆస్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి.
* రుణం ఇచ్చేది మీ పేరుమీదే అయినా బ్యాంకులు మీ తల్లిదండ్రుల ఆదాయాన్నే ప్రధానంగా పరిగణనలోనికి తీసుకుంటాయి. ఉద్యోగులైతే వేతనం వివరాలు, రెండేళ్లకు సంబంధించిన ఫారం-16, ఆరు నెలల బ్యాంకు స్టేట్‌మెంట్‌, గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వృత్తి/వ్యాపారం నిర్వహించే వారు ఆదాయపు పన్ను రిటర్నులు తప్పనిసరి.
* ముందే అనుకున్నట్లు బ్యాంకులు తిరిగి చెల్లింపు సామర్థ్యం ఉన్నవారికే పెద్దపీట వేస్తాయి. కాబట్టి, రుణం తీసుకునే వ్యక్తి, అతని తల్లిదండ్రుల రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరు బాగుండాలి. గతంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న బాకీని సకాలంలో తీర్చకపోయినా.. బాకీదారుల జాబితాలో పేరున్నా.. విద్యారుణం రావడం కష్టమే.

తిరస్కరిస్తే..

బ్యాంకు శాఖకు వెళ్లి మీరు విద్యారుణం కోసం దరఖాస్తు చేశాక, మీవైపు నుంచి అన్నీ సక్రమంగా ఉంటే.. దాన్ని సహేతుకమైన కారణం లేకుండా.. తిరస్కరించే అధికారం కొన్ని సందర్భాల్లో బ్యాంకు మేనేజర్‌కు ఉండదు. ఇందుకు తనకంటే పై అధికారి అనుమతి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కొన్ని శాఖల మేనేజర్లు మిమ్మల్ని కనీసం విద్యారుణం కోసం దరఖాస్తు కూడా చేసుకోనివ్వరు. రుణం ఇవ్వట్లేదనో.. లక్ష్యం ఇప్పటికే పూర్తయ్యిందనీ.. రానిబాకీల జాబితా ఎక్కువగా ఉందన్న కారణంగా రుణం ఇవ్వడం లేదనీ, లేదా మీరు ఎంచుకున్న కోర్సు/కళాశాలలకు అనుమతి లేదనో పేర్కొంటుంటారు. ఇవేమీ సూటిగానూ చెప్పరు. లిఖితపూర్వకంగా రాసిమ్మన్నా ఇవ్వరు. మీకు ఇలాంటి అనుభవం ఎదురైతే.. విద్యారుణం ఇవ్వడానికి ఎందుకు వీలుకాదో లిఖిత పూర్వకంగా ఇవ్వాల్సిందిగా కోరండి. అవసరమైతే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోండి. విషయాన్ని బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లండి. అవసరమైతే బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.

వేటికి ఇస్తారు

* ట్యూషన్‌, హాస్టల్‌, పరీక్ష ఫీజులు
* పరిశోధన శాల, స్టడీటూర్‌, ఇతర నిర్వహణ ఖర్చులు
* బిల్డింగ్‌ ఫండ్‌, విదేశాలకు రానుపోను ఖర్చులు
* కంప్యూటర్‌ కొనేందుకు.

అవకాశాలను బట్టే..

స్వదేశంలోనైనా.. విదేశాల్లోనైనా మీరు ఎంచుకున్న కోర్సు పూర్తి చేస్తే ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి అనేది కూడా బ్యాంకులు పరిగణనలోనికి తీసుకుంటాయి. ముఖ్యంగా విదేశాల్లో కోర్సులు చేసేప్పుడు అక్కడి ప్రభుత్వం ఆ కోర్సును గుర్తించిందా? ఏయే ఇతర దేశాల్లో దానికి గుర్తింపు ఉంది? ప్రఖ్యాత కార్పొరేట్‌ సంస్థలు ఆ కోర్సు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయా? అనేది చూస్తాయి.

కొంత భరించాల్సిందే

విదేశాలలో వివిధ కోర్సులు చేసేందుకు బ్యాంకులు గరిష్ఠంగా 20 లక్షల దాకా రుణాలను ఇస్తున్నాయి. ఈ రుణాలపై 15శాతం దాకా మార్జిన్‌ మనీతోపాటు, స్థిరాస్తి తనఖా, వ్యక్తిగత పూచీకత్తు నిబంధనలు వర్తిస్తాయి. కాబట్టి, విదేశాల్లో విద్యను అభ్యసించాలన్నది మీ లక్ష్యం అయితే.. చివరి నిమిషంలో దరఖాస్తు చేసి హడావిడి పడకూడదు. ముందే మార్జిన్‌ మనీని సిద్ధం చేసుకొని ఉండాలి. విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి ప్రవేశ పత్రం, ఫీజుకు సంబంధించిన వివరాలు అందగానే బ్యాంకును ఆ వివరాలు తెలియజేసి, రుణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. కొన్ని దేశాల్లోని యూనివర్సిటీలకు ఫీజు మొత్తాన్ని చెల్లించాకే.. వీసాకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థులకు వీసా రాకముందే రుణాన్ని మంజూరు చేస్తున్నట్లుగా బ్యాంకులు ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేస్తాయి.

వడ్డీ మాటేమిటి?

విద్యారుణాలు వడ్డీ రేట్లు ఆయా బ్యాంకుల బేస్‌రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ రేటు మారినప్పుడల్లా ఈ వడ్డీ రేట్లు కూడా మారుతుంటాయి.
* కొన్ని బ్యాంకులు, విద్యార్థినులకు, వికలాంగ విద్యార్థులకు అర శాతం నుంచి 1శాతం దాకా వడ్డీ రాయితీని ఇస్తున్నాయి.
* కోర్సు పూర్తయిన ఏడాదిలోపు కానీ, ఉద్యోగం వచ్చిన ఆరు నెలలయ్యాకగానీ నెలవారీ వాయిదాల చెల్లింపు ప్రారంభం అవుతుంది.
* విద్యారుణాలపై చెల్లించిన వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80ఈ ప్రకారం పూర్తి మినహాయింపు వర్తిస్తుంది.


Ask the Expert
Click Here..