సంక్షేమం వర్తింపు ప్రభావం నామమాత్రం

* హెచ్‌1బీ వీసాలపై వెళ్లేవారిపై ఉండదు
* కుటుంబసభ్యుల గ్రీన్‌కార్డుపై వెళ్లే ఉన్నత విద్య, నైపుణ్యంలేని వారిపైనే...
* చర్చనీయాంశమైన ట్రంప్‌ ప్రకటన

ఈనాడు - అమరావతి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వరుసగా చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగువారిపై పెద్దగా ప్రభావం చూపవన్న అభిప్రాయాన్ని పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెరికాకు వలస వచ్చే వారికి అయిదేళ్ల పాటు ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తించబోవని ఆయన ప్రకటించారు. దీని వల్ల తెలుగువారికి ఎలాంటి నష్టం లేదని, హెచ్‌1బీ వీసాపై అమెరికా వెళ్లే వారి ఆదాయం ఎక్కువగానే ఉంటుందని, వీరికి సంక్షేమ పథకాలు వర్తించవని నిపుణులు పేర్కొంటున్నారు.

అక్కడ సంక్షేమం ఇలా.. : అమెరికా పౌరుల కోసం ఆ దేశం దాదాపు 80వరకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. వీటిల్లో ప్రధానంగా 13 పథకాలు ఉన్నాయి. పేద, తక్కువ ఆదాయం ఉన్న వారికి వీటిని అందిస్తారు. యూఎస్‌ సెన్‌సెస్‌ బ్యూరో-2015 ప్రకారం అమెరికాలో 13.5శాతం పేద వారు ఉన్నారు. ఇటీవల లెక్కల ప్రకారం 14.3శాతం ఉండొచ్చని అంచనా. 47,248 డాలర్లలోపు ఆదాయం వచ్చే వారిని తక్కువ (లోలెవల్‌) ఆదాయ వర్గాలుగా పరిగణిస్తారు. పేద వారితో పాటు వీరికి సంక్షేమ పథకాలను అందిస్తారు. నగదు, ఆహారం, వైద్యం, గృహ, విద్యుత్తు, ఇతరత్రా బిల్లుల్లో రాయితీలు, విద్య, పిల్లల సంరక్షణ, పోషకాహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మధ్యాహ్నభోజనం, ఆల్పాహారం, ఉచితంగా లేదా తక్కువ ధరకు భోజనంలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తారు.

చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారిపై పడొచ్చు..
ప్రస్తుతం అమెరికాలో ఉన్న గ్రీన్‌కార్డుదారులు స్పాన్సర్డ్‌ కింద తమ కుటుంబసభ్యులను అక్కడికి తీసుకువెళ్తున్నారు. వారిని తీసుకువెళ్లేందుకు గ్రీన్‌కార్డు కలిగినవారు తమ ఆదాయం, ఆర్థిక పరిస్థితిని చూపించాల్సి ఉంటుంది. కుటుంబసభ్యుల గ్రీన్‌కార్డు ద్వారా అమెరికా వెళ్తున్న వారిలో కొందరికి ఉన్నత విద్య, తగిన నైపుణ్యం లేకపోవడం జరుగుతోంది. ఇలాంటి వారు చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. వారి ఆదాయం తక్కువగా ఉంటుంది. వీరు తమకు ఆదాయం తక్కువగా ఉందని పేర్కొంటూ సంక్షేమ కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకుంటుంటారు. ట్రంప్‌ తాజా నిర్ణయం వల్ల ఇలాంటి వారిపై ప్రభావం పడనుంది. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులు అక్కడ ఎలాంటి సంక్షేమ పథకాలు వినియోగించుకోరని, కళాశాలలు ఇచ్చే ఉపకారవేతనాలు మాత్రమే అందుతాయని, చదువు కోసం విద్యార్థులను పంపించే అబ్రాడ్‌ కన్సల్టెన్సీ ప్రతినిధి పార్థసారథి తెలిపారు. ప్రముఖ కళాశాలల్లో చదివే వారికి అక్కడ బ్యాంకులు వడ్డీతో కూడిన రుణాలు ఇస్తాయని, ఇది సంక్షేమం కిందకు రాదని ఆయన పేర్కొన్నారు.

వీరిపై ప్రభావం పడదు
తెలుగువారు ఎక్కువగా ఐటీ ఉద్యోగాల వైపు వెళ్తారు. వీరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాల పరిధిలోకి రారు. ట్రంప్‌ ప్రకటన వీరిపై ఎలాంటి ప్రభావం చూపదు. కుటుంబసభ్యుల గ్రీన్‌కార్డు ద్వారా నైపుణ్యం లేని, ఉన్నత విద్య చదవని వారు అమెరికా వెళ్లడం కష్టమవుతుంది. అమెరికాలోనూ సంక్షేమ పథకాల అర్హుల ఎంపికలో కొన్ని లొసుగులు ఉండడంతో కుటుంబసభ్యుల గ్రీన్‌కార్డుపై వెళ్లి.. తక్కువ ఆదాయంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారిలో కొందరికి అవి అందుతున్నాయి. వారిపై ప్రభావం ఉంటుంది.

Posted on 10.08.2017


Ask the Expert
Click Here..