దరఖాస్తు దశలో దేని తర్వాత ఏది?

విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాన్ని పొందటం కోసం దరఖాస్తులు పంపుకునే తరుణమిది. వీసా వరకూ కొనసాగే ఈ మొత్తం ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది. ఒక్కోసారి కొన్ని నెలల సమయమూ పట్టొచ్చు. కాబట్టి విశ్వవిద్యాలయాలకు ఎల్లప్పుడూ ముందస్తుగా దరఖాస్తు చేేసుకోవడం ఉత్తమం.

ఏ విదేశీ విశ్వవిద్యాలయంలో చదవాలన్న విషయంలో పూర్తి వివరాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం కీలకం. కింది అంశాలు సరైన నిర్ణయం తీసుకోవడంలో వేటిని దృష్టిలో ఉంచుకోవాలో తెలియజేస్తాయి.

ర్యాంకింగులు: విద్యార్థికి తన అకడమిక్స్‌లో మంచి మార్కులు, మంచి టెస్ట్‌ స్కోర్లను కలిగి ఉంటే ర్యాంకింగ్‌ విశ్వవిద్యాలయాలను ఎంచుకోవచ్చు. ఇవి నాణ్యమైన బోధన, పరిశోధన, ప్రపంచ స్థాయి వైఖరులను అందిస్తాయనే విశ్వసనీయ సూచనను చేస్తున్నాయి. కానీ వీటిలో సీటు సాధించడానికి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ర్యాంకింగ్‌ లేకపోయినా గొప్ప పేరున్న విశ్వవిద్యాలయాలు చాలా ఉన్నాయి. ఐఐటీలు మినహా మిగతా అన్ని భారతీయ విశ్వవిద్యాలయాలకంటే ఇవి చాలా మెరుగు. మీ ప్రత్యేక అవసరాలకు తగ్గ విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడానికి దగ్గరి దారంటూ ఏం లేదు. కాబట్టి ర్యాకింగులు, పేరు మీదే ఆధారపడి నిర్ణయం తీసుకోకూడదు. ఇంకా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలున్నాయి. వాటినీ పరిశీలించాలి.

వ్యయం: విద్యార్థి తన కుటుంబ ఆర్థిక సామర్థ్యం ఆధారంగా విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవచ్చు. విదేశాల్లో చదవడానికి తమకు ఎంతవరకూ ఆర్థిక సామర్థ్యముందో స్పష్టతతో ఉండటం అవసరం. ఎక్కువ ట్యూషన్‌ ఫీజును వసూలు చేసే విశ్వవిద్యాలయాలూ ఉన్నాయి. అలాగే అసలు ఫీజు తీసుకోనివీ ఉన్నాయి. మెరిట్‌, ఆర్థిక అవసరాల ఆధారంగా అంతర్జాతీయ విద్యార్థులకు చాలా రకాల స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం జీవన వ్యయం. ఇది దేశం, ఉండే ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది.

వాతావరణ పరిస్థితులు: చదవాలనుకునే ప్రదేశాన్ని ఎంచుకోవడంలో ఇది కూడా ఒక ముఖ్యమైన కారకమే. విద్యార్థులు తమ చదువును అనుకూల వాతావరణంలోనే నిశ్చింతగా పూర్తిచేయగలుగుతారు. ఇది దేశాన్ని బట్టే కాదు.. విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశాన్ని బట్టి కూడా ఉంటుంది. యూఎస్‌ఏలో కాలిఫోర్నియా, ఓరెగన్‌ వంటి వెస్ట్‌కోస్ట్‌ రాష్ట్రాల వాతావరణం మన దేశంలోలానే ఉంటుంది. అదే ఈస్ట్‌ కోస్ట్‌ విషయంలో విపరీతమైన చలితో ఉష్ణోగ్రత మైనస్‌ 18 డిగ్రీల సెంటీËగ్రేడ్‌ వరకూ ఉంటుంది. కెనడాలో చలి వాతావరణం మంచుతో కూడి ఉంటుంది. ఆస్ట్రేలియా వాతావరణం మనతో పోలి ఉంటుంది. కాబట్టి, మన విద్యార్థులకు ఇది అనుకూలమే. న్యూజీలాండ్‌లో చల్లగా ఉంటుంది. యూరోపియన్‌ దేశాల్లో వాతావరణం భారత్‌ తరహాలోనే ఉంటుంది కాబట్టి, విద్యార్థులు సులువుగానే అలవాటుపడగలరు.

వీసా అవకాశాలు
వీసా దరఖాస్తుల విషయంలో వివిధ దేశాలు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. వాటిలో వయసు, విద్యా నేపథ్యం, నిధుల లభ్యత, భాషా నైపుణ్యాలు, చదవదల్చిన కోర్సు వంటి అంశాలున్నాయి. యూఎస్‌ఏ, యూకే, జర్మనీ వంటి కొన్ని దేశాలు వీసా ప్రక్రియకు వ్యక్తిగత ఇంటర్వ్యూను తీసుకుంటాయి. కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, న్యూజీలాండ్‌ మొదలైన చాలా దేశాలు వీసా ఫైల్‌ను మాత్రమే పరిశీలన నిమిత్తం తీసుకుంటాయి.

విద్యానంతర అవకాశాలు
విదేశీ విద్య ఖర్చుతో కూడుకున్నది. చాలామంది భారతీయ విద్యార్థులు తాము ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఎలా రాబట్టుకోవాలో అంచనా వేసుకుని దాని ప్రకారం ప్రణాళికలు వేసుకుంటున్నారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికీ, కెరియర్‌లో దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికీ, అంతర్జాతీయ వాతావరణంలో పనిచేయడానికీ విద్యానంతర అవకాశాల కోసం చూస్తున్నారు.

అంతర్జాతీయ విద్యార్థులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న కొన్ని దేశాలు..
యు.ఎస్‌.ఎ.: దేశంలో ఎక్కడైనా ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ రూపంలో ఉద్యోగం చేసుకోవచ్చు. అధికారికంగా ఇలా ఏడాది పనిచేయవచ్చు. దీన్ని స్టెమ్‌ కోర్సుల (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) విద్యార్థులకు 24 నెలలవరకూ పొడిగించవచ్చు.
కెనడా: ఇక్కడ పోస్ట్‌ స్టడీ వర్క్‌ పర్మిట్‌ అంతర్జాతీయ విద్యార్థులు ఈ దేశంలో పనిచేయటానికి వీలు కల్పిస్తుంది. విద్యాభ్యాస వ్యవధిని బట్టి ఇది ఏడాది నుంచి మూడేళ్ళ వరకూ ఉంటుంది.
ఆస్ట్రేలియా: ఈ దేశంలో పోస్ట్‌ స్టడీ వర్క్‌ పర్మిట్‌ ఉంది. విద్యాభ్యాస కాలం కనీసం రెండు సంవత్సరాలుంటే ఈ పర్మిట్‌ కాలం కూడా అంతే వ్యవధి ఉంటుంది.
న్యూజీలాండ్‌: ఈ దేశంలో పోస్ట్‌ స్టడీ వర్క్‌ పర్మిట్‌ అధికారికంగా సంవత్సర కాలం ఉంటుంది.
ఐర్లాండ్‌: ఇక్కడ వర్క్‌ పర్మిట్‌ ద్వారా అధికారికంగా రెండేళ్ళ పాటు ఉద్యోగం చేసుకునే వీలు ఉంది.
జర్మనీ: ఈ దేశంలో జాబ్‌ సీకర్స్‌ వీసా 18 నెలలపాటు ఉంటుంది. దీనిద్వారా ఆ వ్యవధిలో అంతర్జాతీయ విద్యార్థులు అధికారికంగా ఉద్యోగం చేయవచ్చు.
యు.కె.: ఇక్కడ అంతర్జాతీయ విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తిచేశాక పనిచేయటానికి వీలు లేదు. కానీ కొద్ది విశ్వవిద్యాలయాలు యు.కె.లో ఇంటర్న్‌షిప్‌ల ద్వారా పనిచేయడానికి వీలు కల్పిస్తాయి.

యు.ఎస్‌.ఎ.
తమకు అనుకూలమైన విశ్వవిద్యాలయాలను ఎంచుకోవడం పూర్తయ్యాక విద్యార్థులు దరఖాస్తును పంపటానికి అవసరమైన అంశాలు, తుదిగడువులను చూసుకోవాలి.
తొలి అడుగు: అడిగిన సమాచారంతో దరఖాస్తును (ఆన్‌లైన్‌/ పేపర్‌) సమర్పించాలి.
రెండు: దరఖాస్తు ఫీజును చెల్లించాలి (చాలావరకూ యూఎస్‌ విశ్వవిద్యాలయాలు దరఖాస్తులను పరిశీలించి, వాటిని పరిష్కరించడానికి ఫీజు వసూలు చేస్తాయి). కొన్ని విశ్వవిద్యాలయాలు దరఖాస్తు ఫీజును తీసుకోవు. విశ్వవిద్యాలయాన్ని బట్టి ప్రతీ దరఖాస్తుకు 25 నుంచి 200 యూఎస్‌ డాలర్ల వరకూ వసూలు చేస్తారు. దీన్ని దరఖాస్తు ప్రక్రియ నిమిత్తం తీసుకుంటారు. దరఖాస్తు తిరస్కరణకు గురైనా డబ్బును తిరిగి చెల్లించరు.
మూడు: అఫిషియల్‌ ట్రాన్‌స్క్రిప్ట్స్‌, లెటర్‌ ఆఫ్‌ రెకమండేషన్స్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌.. మొదలైన పత్రాలన్నింటినీ విశ్వవిద్యాలయానికి మెయిల్‌ చేయాలి.

జనరల్‌ యు.ఎస్‌.ఎ. డాక్యుమెంట్ల వివరాలు
అంతర్జాతీయ ప్రవేశాలకు కావాల్సిన కనీస పత్రాలతోపాటు కొన్ని డిపార్ట్‌మెంట్లు అదనంగా జీఆర్‌ఈ, జీమ్యాట్‌ లేదా ప్రత్యేకమైన దరఖాస్తును కోరే అవకాశముంది. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, రెకమెండేషన్‌ లెటర్స్‌ వంటి అదనపు మెటీరియళ్లను నేరుగా డిపార్ట్‌మెంట్‌కే సమర్పించమని కోరవచ్చు.
నాలుగు: టెస్టింగ్‌ ఏజెన్సీ నుంచి విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా అధికారికంగా టెస్టింగ్‌ స్కోర్లను పంపించేలా చూడటం.
ఐదు: విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థికి సంబంధించిన గ్రాడ్యుయేట్‌ దరఖాస్తు పత్రాలు సంబంధిత డిపార్ట్‌మెంటుకు వెళతాయి. సంబంధిత డిపార్ట్‌మెంట్‌ అధ్యాపకులు దరఖాస్తును సమీక్షించి, ప్రవేశానికి సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ దరఖాస్తు ప్రక్రియ కేంద్రీకృత ప్రక్రియ. సంబంధిత నిర్ణయాన్ని అంతర్జాతీయ ప్రవేశాల బృందం తీసుకుంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పరిశీలన, తగిన విద్యార్థుల ఎంపిక ఖరారుకు కనీసం రెండు వారాల నుంచి 6 నెలల సమయం పడుతుంది.
ఆరు: చివరగా వారు ఐ-20 ఫారాన్ని రూపొందించి, విద్యార్థి మెయిల్‌కు పంపుతారు (ఐ-20 పత్రం విద్యార్థిని వీసా ఇంటర్వ్యూకు హాజరవడానికి అనుమతిస్తుంది). ఐ-20 ఫారాన్ని రూపొందించటానికి రెండు రోజుల నుంచి రెండు వారాల సమయం పడుతుంది.

దేశాలవారీగా...
ప్రతి విశ్వవిద్యాలయానికీ ప్రత్యేకమైన దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. అది పేపర్‌ ఆధారితం అయినా, ఆన్‌లైన్‌ దరఖాస్తు అయినా కావొచ్చు.
విశ్వవిద్యాలయాలను ఎంచుకోవడం పూర్తయ్యాక విద్యార్థులు దరఖాస్తును ప్రారంభించేముందు వాటి దరఖాస్తు అవసరాలు, తుదిగడువులను సరిచూసుకోవాలి.
1. అవసరమైన సమాచారంతో దరఖాస్తును నింపి, ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
2. దరఖాస్తు ఫీజును చెల్లించాలి. విశ్వవిద్యాలయాన్ని బట్టి ప్రతి దరఖాస్తుకూ 50 నుంచి 200 కెనడియన్‌ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశాన్ని తిరస్కరించినా దరఖాస్తు ప్రక్రియకు కట్టే ఫీజును విశ్వవిద్యాలయం తిరిగి చెల్లించదు.
3. అఫిషియల్‌ ట్రాన్‌స్క్రిప్ట్స్‌, లెటర్‌ ఆఫ్‌ రెకమెండేషన్స్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సస్‌, రెజ్యూమే వంటి పత్రాలన్నింటినీ విశ్వవిద్యాలయానికి మెయిల్‌ చేయాలి. గమనిక: చాలా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ రెకమెండేషన్లనే అనుమతిస్తాయి. అంతర్జాతీయ ప్రవేశాలకు కావాల్సిన కనీస పత్రాలతోపాటు కొన్ని డిపార్ట్‌మెంట్లు తమకంటూ జీఆర్‌ఈ, జీమ్యాట్‌ లేదా ప్రత్యేకమైన దరఖాస్తులను కోరే అవకాశముంది. ఎస్‌ఓపీ, రెకమెండేషన్‌ లెటర్స్‌ వంటి మెటీరియళ్లను నేరుగా డిపార్ట్‌మెంట్‌కే సమర్పించమని కోరవచ్చు.
4. టెస్టింగ్‌ ఏజెన్సీ నుంచి విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా అధికారికంగా టెస్టింగ్‌ స్కోర్లను పంపించేలా చూడటం.
5. విశ్వవిద్యాలయం విద్యార్థి నుంచి అన్ని అవసరమైన పత్రాలను అందుకున్నాక గ్రాడ్యుయేట్‌ దరఖాస్తు పత్రాలు సంబంధిత డిపార్ట్‌మెంట్‌కు వెళతాయి. సంబంధిత డిపార్ట్‌మెంట్‌ అధ్యాపకులు దరఖాస్తును సమీక్షించి, ప్రవేశానికి సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ దరఖాస్తు ప్రక్రియ కేంద్రీకృత ప్రక్రియ. సంబంధిత నిర్ణయాన్ని అంతర్జాతీయ ప్రవేశాల బృందం తీసుకుంటుంది. దరఖాస్తు లపై నిర్ణయాన్ని తీసుకోవడానికి కనీసం 2 వారాల నుంచి 6 నెలల సమయం పడుతుంది.
6. ఒకవేళ విద్యార్థి ప్రవేశం పొందితే ట్యూషన్‌ ఫీజు, షరతులేమైనా ఉంటే వాటి వివరాలతో కూడిన కండిషన్‌ ఆఫ్‌ ఆక్సెప్టెన్స్‌ లెటర్‌ను విశ్వవిద్యాలయం పంపుతుంది. విద్యార్థి దానికి సమ్మతి తెలిపి, తిరిగి పంపించాల్సివుంటుంది.
7. కండిషన్‌ ఆఫ్‌ ఆక్సెప్టెన్స్‌ లెటర్‌లో పేర్కొన్నట్లుగా ఒక సెమిస్టర్‌ ఫీజును విద్యార్థి చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు తర్వాత విశ్వవిద్యాలయం స్టడీ పర్మిట్‌ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా లెటర్‌ ఆఫ్‌ ఆక్సెప్టెన్స్‌ను పంపుతుంది.
డిప్లొమా, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ చాలా సులువు.

ఆస్ట్రేలియా
1. ఎంపిక చేసుకున్న ఆస్ట్రేలియన్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి విద్యార్థి పూర్తిచేసిన దరఖాస్తు ఫారం, సపోర్టింగ్‌ ఫారాలతోపాటు తన అకడమిక్‌ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, ఐఈఎల్‌టీఎస్‌/ పీటీఈ మార్క్‌ షీటు, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ లెటర్ల స్కాన్‌ కాపీలను పంపాల్సి ఉంటుంది.
2. దరఖాస్తు, ఇతర పత్రాలను సమీక్షించిన తరువాత నిర్ణయాన్ని రెండు రోజుల నుంచి ఒక నెలరోజుల్లోపు వెల్లడిస్తారు.
3. ఆఫర్‌ లెటర్‌ అందుకున్నాక విశ్వవిద్యాలయానికి ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్లను పంపాల్సి ఉంటుంది. తద్వారానే పాక్షిక ఫీజు చెల్లింపునకు ఆమోదం లభిస్తుంది.
4. అప్రూవల్‌ ఆఫ్‌ పేమెంట్‌ను అందుకున్నాక ఎలక్ట్రానిక్‌ కన్ఫర్మేషన్‌ ఆఫ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నిమిత్తం విద్యార్థి పాక్షిక ఫీజును చెల్లించాల్సి ఉంటుంది (ఆఫర్‌ లెటర్‌లో చెప్పినట్లుగా).
5. ఎలక్ట్రానిక్‌ కన్ఫర్మేషన్‌ ఆఫ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ అందుకున్నాక విద్యార్థులకు స్టూడెంట్‌ వీసాకు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది.

Posted on 14.11.2017Ask the Expert
Click Here..